హైదరాబాదులోనూ, విజయవాడలోనూ పుస్తకోత్సవాల సందర్భంగా జరిపిన బ్లాగర్ల సంరభంలాంటిది అమెరికాలో చెయ్యడం కష్టం.
పెద్దసంఖ్యలో తెలుగువారు ఒకచోట కలుసుకునేది తానా, ఆటా, నాట్స్ ఉత్సవాల్లో. ఈఉత్సవాలకి వెళ్ళే వారిలో సాహిత్యమంటే (ఎటువంటి సాహిత్యమైనా) ఆసక్తి ఉన్నవాళ్ళు కనీసం ఒకశాతం కూడా ఉండరు. బంధుమిత్రుల్ని కలుసుకుని కులాసాగా గడపడం, సినిమావాళ్ళని దగ్గర్నించి చూడ్డం, రాజకీయుల్తోనూ, వ్యాపారవేత్తల్తోనూ బుజాలు రుద్దుకోడం, స్వామీజీల పాదసేవలు చేసుకోవడం, పిల్లలకి సంబంధాలు చూడ్డం - ఇవీ ఈ సభలకి వచ్చే వాళ్ళ ముఖ్య లక్ష్యాలు. రిజిస్ట్రేషనుతోపాటు ఇచ్చే సావనీరునే చాలా మంది ఇంటీకి తీసుకెళ్ళకుండా అక్కడే వొదిలేస్తుంటారు. ఇక బ్లాగుల గురించి మనం కరపత్రాలు పంచిపెడితే వాటిగతి ఏమిటో ఊహించుకోవచ్చు.
అక్కడికీ 2007 వాషింగ్టన్లో జరిగిన తానా ఉత్సవంలో బ్లాగుల ప్రచారం చెయ్యాలని
విహారి నడుము కట్టారు. ఆయన ఒక్కరే అయిపోయి ఆప్రయత్నం విరమించుకోవలసి వచ్చింది. 2009 షికాగో ఉత్సవం సమయానికి అమెరికా తెలుగుబ్లాగర్లు చప్పబడ్డారు. నాకు తెలిసి ఒక్క
రాధికగారు తప్ప ఎవరూ హాజరవలేదనుకుంటా. ఇప్పుడిప్పుడే మళ్ళీ అమెరికా తెలుగుబ్లాగర్లు రాశిలోనూ వాసిలోనూ పుంజుకుంటున్నారు. తానా ఆటా స్థాయిలో కాకపోయినా, అనేక నగరాల్లో ఉగాది, దీపావళి సందర్భంగా జరిగే తెలుగువారి ఉత్సవాల్లో కూడా, వచ్చేవారి ఉద్దేశాలు ఇలాంటివే .. తమ పిల్లల పాటలు డేన్సులు చూసుకోవడం, మిత్రులతో సరదాగా గడపటం .. స్టాలు పెడితే కంప్యూటరు చూసేందుకూ, కరపత్రం చదివేందుకూ తగిన మూడ్ ఉండదక్కడ .. ఆసక్తికూడ ఉండదు.
ఏమాటకామాట చెప్పుకోవాలి. మా వూళ్ళో తరచుగా సాహిత్యసభలు జరిపే డిట్రాయిట్ తెలుగు సాహితీ సమాఖ్య వాళ్ళు గతఏడాది జరుపుకున్న పదవపుట్టినరోజు ఉత్సవాల్లో తెలుగుబ్లాగులకి ఏకంగా ఒక సెషను కేటాయించారు. నా నిర్వాకంవల్ల అది సుమారుగా మాత్రమే జరిగింది. కరపత్రాలు పంచాము. తద్వారా ఎంతమంది కొత్త పాఠకులేర్పడ్డారో, కొత్త బ్లాగులు మొదలయ్యాయో మాత్రం నాకు తెలియదు. ఇంచుమించు ఇదే సమయంలో ఈమాట జాలపత్రికలో తెలుగుబ్లాగుల గురించి వెలువడిన
సంపాదకీయం కూడా కొంచెం ఆసక్తి రగిలించిందనే అనుకుంటున్నాను.
వ్యాప్తికి సంబంధించి కొన్ని ఆలోచనలు:
1. అమెరికాలో కరపత్రాల వల్ల ప్రయోజనం లేదు. ఆకరపత్రాన్ని తీసుకున్న వ్యక్తి తనఇంటోనో, ఆఫీసులోనో కంప్యూటరు ఎదురుగా కూర్చునే సమయానికి ఆకరపత్రం కచ్చితంగా అందుబాటులో ఉండదు. యాదృఛ్ఛికంగా కరపత్రంలో చదివిన యూఆరెళ్ళు (కూడలి, జల్లెడ లాంటి సులభమైనవి కూడా) వాళ్ళకి గుర్తుండే అవకాశం చాలా తక్కువ.
2. మెయిల్లోనో, జాలంలోనో ఒక లంకె నొక్కితే బ్లాగు దొరికేంత సులువుగా ఉండాలి చేసే ప్రచారం ఏదైనా. చాలా మంది బ్లాగర్లు తమ బ్లాగులంకెని సిగ్నేచరుగా వాడుతుంటారు ఈమెయిల్లో. ఇది మంచి పద్ధతి. ఇట్లాగే, జాలవిహరణ చేసే తెలుగు వారు, తెలుగు చదివే ఆసక్తి ఉన్నవారు ఎక్కువగా చూసే సైట్లలో బ్లాగులకి సంబంధించిన లంకెలు ఉంచే ప్రయత్నం చెయ్యాలి. ఈ పద్ధతి ప్రపంచ వ్యాప్తంగా ఉపయోగిస్తుంది. జనాలు ఎక్కువ చూసేది వార్తా పత్రికలు, సినిమా సైట్లు - అవన్నీ కమర్షియల్ సైట్లు. వాళ్ళ ప్రకటనల రేట్లు కళ్ళు తిరిగేలా ఉన్నాయి. ఇంకేవైనా సైట్లలో ఖర్చు లేకుండా ఇలా లంకెలు ఉంచడం సాధ్యపడుతుందేమో అన్వేషించాలి.
3. ఇప్పుడిప్పుడు స్థానిక తెలుగుసంఘాలు కూడా చక్కటి వెబ్సైట్లు చేసుకుంటున్నారు. ఉదాహరణకి
డిట్రాయిట్. అంతేకాక, వారి సంస్థ సమాచారాన్ని నెలకోసారో, మూణ్ణెల్లకోసారో ఈ-న్యూస్ లెటరుగా పంపుతున్నారు. ఈ స్థానికసంస్థల సైట్లలోనూ, ఈ-న్యూస్ లెటర్లలోనూ బ్లాగుల లంకెలు ఉండేట్టు ప్రయత్నం చెయ్యాలి. ఇది ఖర్చు లేకుండానో, కొద్ది పాటి ఖర్చుతోనో సాధించ గలిగిన పని. ఫలితం బాగుంటుందని నాకనిపిస్తోంది.
4. ఇప్పుడు అనేక నగరాల్లో తెలుగు సాహిత్య వేదికలు ఏర్పడుతున్నాయి. నాకు తెలిసి డిట్రాయిట్, షికాగో, టొరాంటో, అట్లాంటా, హ్యూస్టన్, డాల్లస్ నగరాల్లో ఇలాంటి వేదికలు తరచుగా జరుగుతున్నాయి. ఆయా నగరాల్లో ఉన్న బ్లాగర్లు ఈ సభలకి హాజరయి, ప్రతి సభలోనూ బ్లాగుల గురించి రెండు నిమిషాలు చెబుతూ ఉండాలి. ఈ సభలకి వచ్చే వాళ్ళ సంఖ్య తక్కువే అయినా, వీళ్ళు ఆల్రెడీ తెలుగు పఠనాసక్తి కలిగి ఉన్నవాళ్ళు, సొంతంగా రచన చేసే అలవాటున్నవాళ్ళు, అంచేత బ్లాగుల వేపు మొగ్గు చూపే అవకాశం ఎక్కువ.
5. మనపనికి సంబంధించిన బిజినెస్ కార్డు లాగానే, మన బ్లాగు ఎడ్రసు, కూడలి, జల్లెడ ఎడ్రసులతో ఒక విజిటింగ్ కార్డు తయారు చేసుకుని, మనం కలిసిన తెలుగువారందరికీ ఇస్తూ ఉండాలి.
విస్టా ప్రింట్ వంటి సంస్థలు ఉచితంగా 200 కార్డులు ఇస్తాయి. ఒకవిధంగా ఇది కూడా కరపత్రం లాంటిదే, కానీ ఇది పుచ్చుకున్నవారి కంప్యూటరు డెస్కుని చేరే అవకాశం ఎక్కువ. ఈ పని నేను సంవత్సరం పైగా చేశాను. నాబ్లాగులో కొత్తటపాకి వచ్చే హిట్లలో కనీసం 25% డిట్రాయిట్ పరిసరప్రాంతాల నించి ఉండటం గమనించాను. వారిలో కొందరైనా ఇలా నాకార్డు చూసి నాబ్లాగుకి అలవాటైనవారని నా నమ్మకం.
6. గతటపా వ్యాఖ్యల్లో బోనగిరి గారన్నట్టు కూడలి జల్లెడలని ప్రచారం చెయ్యడంలో ఒక సుళువుంది. దానికి తోడుగా ఒక సమస్య కూడా ఉంది. అసలు బ్లాగులంటే తెలియని వ్యక్తి ఒక శుభముహూర్తాన ఏదో ఒకకారణంగా కూడలికి వస్తే, ఖర్మకాలి ఆ పూట అక్కడ కనిపించిన కొత్తటపాలన్నీ చెత్తగానో, లేక ఆమనిషికి ఏమీఆసక్తి లేని విషయంగానో ఉంటే .. ఇక అంతే .. ఆ మనిషి పనిగట్టుకుని మళ్ళీ కూడలికి వచ్చే అవకాశం తక్కువ. కూడలి జల్లెడ మొదటి పేజీలో పాథకులకి ఆసక్తికరమైన టపాలు కనిపించడమనేది యాదృఛ్ఛికమైన ఘటన.
అందుకని, కూడలి-జల్లెడలని ప్రచారం చెయ్యడం కంటే, మన దృష్టిలో consistentగా మంచి టపాలు వస్తాయి అనుకున్న ఒక అరడజను బ్లాగుల్ని ప్రచారం చెయ్యడం ఉత్తమం అని నా ఖచ్చితమైన అభిప్రాయం. అవి ఏవో ఎవరికి వారే నిర్ణయించుకుంటారు.
7. బ్లాగర్లు ఇతరత్రా జాలంలో వేరే పనులు చేస్తూ ఉండినా, ఫేస్ బుక్, ట్విటర్ వంటి ఇతర వేదికల మీద పాల్గొంటూ ఉండినా, అక్కడ తెలుగు బ్లాగుల ప్రస్తావన పెద్దగా తీసుకు రాము. బ్లాగరులందరూ తాము పాల్గొనే ఇతర సామాజిక జాల వేదికలన్నిటిలోనూ అతిగానో మితంగానో తమ శక్తి కొలదీ తెలుగు బ్లాగుల ప్రస్తావన చేస్తుండాలి. ఉదాహరణకి మీకు ఫేస్ బుక్ ఉంటే, అందులో మీబ్లాగు తాజా టపాలు కనబడేట్టు చెయ్యొచ్చు. చాలా కాలంగా జాలంలో తెలుగువారి కూడలిగా ఉన్న రచ్చబండ యాహూ గ్రూపులో వారానికోసారి నాకు నచ్చిన తెలుగు బ్లాగుల ప్రస్తావన చెయ్యడం మొదలు పెట్టాను.
మరి మీ ఆలోచనలూ పథకాలూ ఏంటో చెప్పండి. ఇక్కడ వ్యాఖ్య రాసినా సరే, మీ బ్లాగులో టపా రాసినా సరే. మీ బ్లాగులో రాస్తే, లంకె ఇస్తూ ఇక్కడ ఒక వ్యాఖ్య పడెయ్యడం మరిచిపోకండి.