కబుర్లు సెప్టెంబరు 28

ఒబామా మంచి ఫారంలో ఉన్నట్టున్నాడు, స్పీచిలివ్వడంలో. ఐక్యరాజ్య సమితి జెనరల్ ఎసెంబ్లీనుద్దేశించి మరో మంచి ఉపన్యాసం ఇచ్చాడు ఈ వారం. ఒక పక్కని ఇరాన్ అధ్యక్షుడు అహ్మదినెజాద్ పేల్చే సీమటపాకాయలొక వింతకాగా ఇంకో పక్కని లిబ్యను నియంత గద్దాఫీ సపరివార సమేతంగా వేంచేసి, న్యూయార్కు శివార్లలో గుడారం వేసుకుని ఉంటానంటే, మొత్తానికి పోలీసులు, సెక్యూరిటీ అధికారులూ ఆయన్ని బుజ్జగించి ఆ ప్రయత్నాన్నించి విరమింప జేశారుట.

ఇక్కడ రేడియోలో నాకు అమితంగా నచ్చే కార్యక్రమాల్లో దిస్ అమెరికన్ లైఫ్ అనేది కూడా ఒకటి. పోయినేడు వాలువీధి బేంకులు కూలుతున్న విధ్వంస దృశ్యాల నేపథ్యంలో ఈ కార్యక్రమం రూపొందించిన ప్రసారానికి, ఇప్పుడు, ఏడాది గడిచిన పిమ్మట, ఆ ప్రసారంలో పాల్గొన్న వారందర్నీ మళ్ళీ వెతికి పట్టుకుని, ఈ ఏడాదిలోనూ వాళ్ళ జీవితాలు ఎలా మారినయ్యో మాట్లాడారు. ఈ ఆర్ధిక సంక్షోభాన్ని గురించి నేను చదివిన, విన్న, చూసిన రిపోర్టింగ్ అంతటిలోనూ ఈప్రసారం నాకు అమితంగా నచ్చింది. ఇక్కడ వినొచ్చు.

తెలుగు సాహిత్యకారుల శతజయంతి సభలు డిట్రాయిట్ తెలుగు సాహితీ సమితి వారు జరిపించారు ఈ వారంలో. నేను పనివత్తిడీ వలన శనివారం డుమ్మాకొట్టాను కానీ ఆదివారం వెళ్ళొచ్చాను. బయటి ఊళ్ళనించి వచ్చిన అతిథులు చాలామంది ఈ సంవత్సరం కూడా రావడం చాలా సంతోషం కలిగించింది. మా స్థానిక తెలుగు బ్లాగర్లుతప్ప బయటిఊళ్ళ బ్లాగర్లెవరూ హాజరవలేదు. తప్పు తప్పు .. నేను సినిమా బ్లాగరి శ్రీ వచ్చారు. అలాగ .. అక్కడ ఇద్దరు శ్రీలు, ఇద్దరు నారాయణస్వాములు ఉన్నాము! నేను సభలో కూర్చుని ఆ ఉపన్యాసాలు, చర్చలు విన్నదానికంటే, బయట భోజనాల హాలులో కూర్చుని కాఫీ చప్పరిస్తూ మిత్రులతో ముచ్చటించుకున్నదే ఎక్కువ. ఈమాట, నవతరంగంలో తరచు కనిపించే మిత్రులు విష్ణుభొట్ల లక్ష్మన్న గారితో తీరిగ్గా మాట్లాడాను. చిరకాల మిత్రులు, కవి, విన్నకోట రవిశంకర్, మన బ్లాగర్లు చాలా మందికి పరిచయమున్న పరుచూరి శ్రీనివాస్, రచ్చబండలో చురుకైన సభ్యులు కొడవళ్ళ హనుమగారు, .. ఇలా పలువురు మిత్రుల్ని కలుసుకున్నాను. పోయినేడాది సభల్లో పరిచయమైన పలువురు "మీబ్లాగు చదువుతుంటామండీ" అని చెప్పినప్పుడు చాలా సంతోషమైంది. సమితి వాళ్ళు ఎలాగూ అధికారిక నివేదిక ప్రచురిస్తారు. సభల్లో, చర్చల్లో ఏమి మాట్లాడారు అని .. అందులో చూసుకోవాల్సిందే.

అన్నట్టొక మంచి వార్త. 2009 తానా సావనీరు కావాలనుకున్న వాళ్ళు (ఇది అమెరికాలో ఉన్నవారికి మాత్రమే) 15 డాలర్లకి డా. జంపాల చౌదరి గారికి చెక్కు పంపితే, సావనీరు పంపిస్తారుట. వారిని ఈమెయిల్లో సంప్రదించొచ్చు. cjampala at gmail dot com. ఈ సదవకాశాన్ని ఉపయోగించుకోమని నా ఉచిత సలహా.

చిరుతనయుడి చిరుత చూశాను మొన్నీమధ్యనే మొదటిసారి. సినిమాలో రాంచరణ్ ని ఇంకా బాగా హైలైట్ చేస్తారేమో అనుకున్నా, ఆ సినిమా పబ్లిసిటీ చూసినప్పుడు. అలాంటిదేం లేదు. చాలా మంది ఇప్పటికే ఆ సినిమా గురించి చెప్పినట్టు అతను డేన్సులూ, ఫైట్లూ బాగా చేశాడు. అదేదో మ్యూజియం లాంటి దాంట్లో జరిగే ఫైట్ సీన్ బాగా తీశాడనిపించింది. మళ్ళి చివర్లో జంగిల్లో జరిగే క్లైమాక్స్ సీన్ కూడా బాగా తీశాడనిపించింది. అవి కాక, ఇంక పూర్తిగా మరిచిపోదగిన సినిమా. నేట్‌ఫ్లిక్సులో ది స్ట్రైట్ స్టోరీ అనే సినిమా చూశాను. దర్శకుడు డేవిడ్ లించ్ .. అంటేనే అర్ధమవుతుంది విచిత్రమైన సినిమా అని. పెద్ద గొప్పగా అనిపించలేదు గానీ వృద్ధ పాత్రల్ని ముఖ్య భూమికలుగా పెట్టి తీసే సినిమాల మీద నాకెప్పుడూ ప్రత్యేకమైన ఆసక్తి, అదే ఆసక్తితో చూశానీ సినిమా కూడా. మిస్టర్ స్మిత్ గోస్ టూ వాషింగ్టన్ అని బాగా ప్రసిద్ధిపొందిన పాత సినిమా చూశాను. పదవిలో ఉన్న సెనేటర్ చనిపోతే, ఆదర్శాలని నమ్ముతూ, అస్సలు రాజకీయానుభవం లేని ఒక యువకుణ్ణి నియామకం ద్వారా సెనేటరుగా పంపితే, అక్కడ జరిగే తమాషా - అదీ కథ. రాజకీయ కుతంత్రాన్ని, ఎంత పాతరోజుల్లో అయినా, ఇంత పల్చన చేసి చూపించడం నాకు చాలా ఆశ్చర్య మనిపించింది. కథలో ఏమాత్రం లోతు లేదు. పాత్ర చిత్రణలో కూడా లోతు లేకపోగా, బోలెడు లొసుగులున్నాయి. ఈ సినిమానూ, ఆయా నటులూ చాలా మందికి ఆ యేడాది ఆస్కారు నామినేషన్లు వచ్చాయంటేనూ చాలా ఆశ్చర్యం వేసింది. కానీ ఆ సినిమాలో చెప్పిన ఒక ముఖ్యమైన పాయింటు గమనించ దగినది - రాజకీయమంటేనే రాజీ పడడం అని ఆత్మవంచన చేసుకుంటూ మెల్లమెల్లగా అనేక స్వార్ధ శక్తుల చేతుల్లోకి ప్రజాపర్భుత్వ నిర్వహణ అంతా దిగజారిపోతున్నప్పుడల్లా .. మన దేశం ఎందరి త్యాగం వల్ల ప్రానం పోసుకుంది, ఎందరి త్యాగాల వల్ల ప్రస్తుత రూపంలో మనగల్గుతోంది, ఎటువంటి ఉత్కృష్టమైన ఆదర్శాలతో మన రాజ్యాంగం ఏర్పడింది అని మనల్ని మనం (పాలకులే కాదు, ప్రజలమూనూ) పరిశీలన చేసుకోవాలి. ఇది భారత దేశానికీ వర్తిస్తుంది, అలా తరచి చూసుకునే నిజాయితీ ఉండాలే గాని.

వియ్ షల్ ఓవర్‌కం పాటని ఈ బ్లాగులో ఇదివరకు చాలా సార్లు ప్రస్తావించాను. సుమారు నలభయ్యేళ్ళ క్రితం న్యూయార్కు రాష్ట్రంలో వుడ్‌స్టాక్ అనే చోట జరిగిన రాకన్రోలు సంగీతోత్సవంలో ఒక గాయిని పాడిన దృశ్యం యూట్యూబులో దొరికింది.

దేనికోసమో జాలంలో వెదుకుతుంటే కంప్యూటరు సైన్సుకి సంబంధించిన ఈసభ వివరాల గూడు తగిలింది. కుతూహలంగా చూస్తూపోతే, వార్నాయనో, ఎంతమంది ఇండియన్లో! అనిపించింది. మీరు కొంచెం పరిశీలనగా చూస్తే ఆ పేర్లలో మగధీర సినిమాకి సంబంధించిన పేరొకటి తగుల్తుంది. చూద్దాం ఎవరన్నా కనిపెట్తగలరేమో.

మొన్న బ్లాగ్లోక విహరణలో ఈ వింత ఫేంటసీ ధారావాహిక నా కంట పడింది. మీరూ ఓ లుక్కెయ్యండి.

Comments

pi said…
I also love This American Life. My absolute favorite is "Wait, wait don't tell me".

I hope you write about Healthcare issues.
pi said…
Another thing, Cisco's CTO Padmasree Warrior is a Telugu. She is from your town, Vijayawada.
Hari said…
I think satdru roy is the answer for your puzzle
Anonymous said…
2009 తానా సావనీరు తెప్పించుకున్నానండి. ధన్యవాదాలు.