నేనెరిగిన వయ్యెస్

2003 సంవత్సరమంతా తెలంగాణాలోని అనేక మారుమూల గ్రామాల్లో పర్యటిస్తూ, రెండు మూడు స్వఛ్ఛంద సంస్థల తరపున ప్రజోపయోగ కార్యక్రమాల అమలుని పర్యవేక్షిస్తూ వచ్చాను. ఆయా ప్రాంతాల్లో తరాలుగా కరుడుగట్టిన పేదరికం, అటుపైన నాలుగేళ్ళుగా వానలు సరిగ్గా పడక ఏర్పడిన కరువు పరిస్థితులు, దాని మీద అప్పటికి ఎనిమిదేళ్ళుగా గ్రామీణ వ్యవస్థకి ప్రతికూలంగా సాగిన తెలుగుదేశం రాష్ట్రప్రభుత్వ పరిపాలన - ఇవన్నీ కలిసి ఆ గ్రామీణ ప్రాంత ప్రజల్లో తీవ్రమైన దైన్యం నెలకొని ఉండేది.

నేను టీవీ చూసేవాణ్ణి కాదు గానీ, ఇతర మాధ్యమాల ద్వారా అప్పటికే శాసనసభలో ప్రతిపక్ష నాయకునిగా ప్రభుత్వాన్ని నిలదీస్తూ "అధ్యక్షా" అని గర్జించే ఆ బొంగురు గొంతు నాకు సుపరిచితమైంది. ఇక త్వరలో సార్వత్రిక ఎన్నికలు రాబోతున్నాయి అన్న వార్త ఇంకా సూచనప్రాయంగా ఉండగానే రెండు కాళ్ళపై ఆ మహారథం కదిలింది. పల్లెల్లోకీ, పల్లె ప్రజల మనసుల్లోకీ ప్రయాణించింది. వయ్యెస్ పాదయాత్రల పుణ్యమాని కొన్నిసార్లు రహదారులు స్తంభించి పోయి నా ప్రయాణాలకి, పనులకి అంతరాయం కలిగినందుకు తిట్టుకున్నాను గానీ, అప్పటికైనా ఆ స్థాయి రాజకీయనాయకుడు ఒక్కరైనా తమ ఏసీ గదులనీ, కార్లనీ, మెత్తటి సోఫాలనీ వదలి ప్రజల మధ్యకి వచ్చి వారి గోడు పట్టించుకున్నందుకు సంతోషీంచాను. ఆ పాదయాత్ర పల్లెప్రజల కళ్ళల్లో వెలిగించిన ఆశా జ్యోతుల్ని కళ్ళారా చూశాను.

ఆ పర్యటనల అనంతరం వయ్యెస్ కురిపించిన వాగ్దానాల వృష్టి చాలామందిని కలవర పరిచింది, నాతోసహా. ఎంతవరకూ సాధ్యం ఈ వాగ్దానాల్ని నిలబెట్టుకోవడం? పైగా .. నలభయ్యేళ్ళ రాష్ట్ర రాజకీయాల చరిత్ర, అందులో కాంగ్రెస్ పార్టీ ధరించిన ముఖ్య భూమిక, అధిష్ఠానానికి వంగి వంగి సలాములు చేస్తూ తమలో తాము కీచులాడుకుంటూ అందినంత దోచుకు తింటూ .. పాలక పార్టీ మారినా ప్రజలకి ఒనగూరే ప్రయోజనమేమన్నా ఉంటుందా .. అనే ప్రశ్న కళ్ళముందు మెదుల్తూనే ఉంది. 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ విజయంకన్నా, తెలుగుదేశం ఓటమి తీరు నన్ను సంభ్రమాశ్చర్యాలకి గురి చేసింది. వయ్యెస్ ప్రభుత్వ ప్రమాణస్వీకారానికి జరిగిన ఆర్భాటం, అటుపిమ్మట త్వరలోనే వయ్యెస్ కీ పీసీసీ అధ్యక్షుడు డియెస్ కీ మధ్య విభేదాలు, మధ్యలో సత్యనారాయణ విదూషకత్వం .. హబ్బే ఇదేమీ కొనసాగే సంసారం కాదు అనీ అనిపించింది.

అదంతా అలా ఉండగా, కేంద్ర అధిష్థానానికి బానిస కాకుండానే సత్సంబంధాలు నిలబెట్టుకుంటూ, రాష్ట్రప్రభుత్వ విధానాలని తన రాజకీయ ఆశయాలకి తగినట్టుగా తీర్చిదిద్దుకుంటూ గత దశాబ్దంలో రాష్ట్ర రాజకీయ వాతావరణమ్మీదనే కాక, సామాన్య ప్రజల జీవితమ్మీద కూడా వయ్యెస్ తనదైన ముద్ర వేశారనేది ఎవరూ కాదనలేని నిజం. 2006 చివర్లో నేను మళ్ళి మాతృ దేశం పర్యటించినప్పుడు అనేక పాత్రికేయ మిత్రుల్ని అడిగాను, వయ్యెస్ పాలన ఎలాగున్నదని. నగరాల్లో పెద్ద తేడా లేదుగాని, పల్లెల్లో పరిస్థితి మెరుగుపడుతోందనీ, ఆశాభావం నెలకొని ఉన్నదనీ చెప్పారు దాదాపుగా అందరూ. ఒకవంక టీయారెస్ తైతక్కలు, మరొకపక్క ఎర్రపార్టీల ముల్లు పొడుపులు, పైనించి అధిష్థానపు వొత్తిళ్ళు, స్థానికంగా సొంత పార్టీలో కుట్రలు .. అన్నిటినీ సామర్ధ్యంతో మేనేజ్ చేసుకొచ్చి, మళ్ళీ ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన వయ్యెస్ సామాన్యుడు కాదు.

ఆ బొంగురు గొంతు మళ్ళి వినబడదు, ఎర్ర జరీ అంచు తెల్లపంచ కట్టిన ధ్వజస్తంభం లాటి ఆ నాయకుడు ఇక కనబడడు అంటే, విషాద వీచికే మెదుల్తోంది నా మనసులో .. సహజమే. ఉత్తరీయాన్ని తలపాగా చుట్టి, మండుటెండలో నుదుట అలముకున్న చెమటల ధారతో, కాళ్ళకి కేన్వాసు జోళ్ళతో చురుగ్గా అడుగువేస్తున్న ఆ పాదయాత్రికుడైన వయ్యెస్సే గుర్తొస్తున్నారు నాకిప్పటికీ. ఆయన హఠాన్నిష్క్రమణతో రాష్ట్ర కాంగ్రెస్లో ఎలుకలపందేలు మొదలవుతాయి. ఆయన అమలు చేసిన విధానాలు, ప్రణాళికలు అన్నీ మంచే చేశాయి అనలేము. కొత్తగా పైకొచ్చే నాయకత్వం ఏది మంచి ఏది చెడు అనే విచక్షణ కలిగి ఉంటుందనీ, మంచిని గ్రహించి అమలు చేస్తుందనీ, ముఖ్యంగా తెలుగువారి ఆత్మగౌరవన్ని నిలబెడుతుందనీ మనసారా కోరుకుంటున్నాను.

Comments

వాస్తవాన్ని మనసుకు హత్తుకొనేలా వ్రాసారు
మురళి said…
వైఎస్ కి నివాళి...
vsrsr said…
దైవ లీలలు అంటే ఇంతే, అత్యంత ప్రజా రంజక పాలకునిగా తీర్చి దిద్ది నీ అంత మంచి వాడికి భూలోకంలో వుంటే జనం నన్ను మరుస్తారు, కాబట్టి నివు నాదగ్గరే ఉంటె అందరు నిన్ను తలచుకుంటూ నన్ను కూడా ధ్యానిస్తారు, నిన్ను పుట్టించినదుకు నా ఋణం ఇలాగ తీర్చుకో అని.....నిన్ను తన దగ్గరకి తీసుకు పోయేడు రాతి హృదయం గలిగిన దేవుడు...
Bolloju Baba said…
నా మనసులో ఉన్న భావాల్ని మీరు వ్యక్తీకరించారనిపించింది.

i feel he is a good politician with human touch.
may his soul rest in peace

bollojubaba
sunita said…
అయ్యో! ఇది ఇలా ఎందుకు జరిగిందీ? ఇదంతా కలేమో? నిజం కాదు , కాకూడదు నిద్ర లేవగానే టీవీ పెడితే చేతులూపుతూ పంచె కట్టుతో నవ్వుతున్న ముఖం కనిపిస్తుంది అనే ఆశ.
శ్రీ said…
వైఎస్ ఆత్మకి శాంతి కలగాలని కోరుకుందాం.
బాబాగారిదే నా మాటకూడా
తృష్ణ said…
రాజకీయపార్టీల పట్ల ఎటువంటి ఆసక్తీ లేకపోయినా..ఎందుకో ఈ 'వై.యస్ ' దుర్మరణం చాలా దుఖానికి గురిచెస్తోందండి..ఆయనను తల్చుకుంటే..ఇంకా ఎక్కడో ఉపన్యసిస్తూ..నడుస్తు..చెయ్యెత్తి అభినందనలు తెలుపుతున్న దృశ్యాలే కనిపిస్తున్నాయి...
వైఎస్ ఆత్మకి శాంతి కలగాలని కోరుకుంటూ ...
Aswin Budaraju said…
కానీ వై యస్ ఆర్ గొంతు మాత్రం భలే