మహర్షి జటాజూటంలో నెమలి కన్ను

దృశ్యం ఒకటి - పచ్చనాకు


ఆకుల రామక్కంటే మా వూళ్ళో అందరికీ హడల్. నోరు గల ఆడది. మాట్లాడిందంటే అరిచినట్టే. అరిస్తే రాములోరి గుడి మైకు కూడా జడవాల్సిందే. నుదుటి మీద ఎర్రబొట్టు, మెడలో పూసల దండ్, చెవులకి మాటీలు, కాళ్ళకు వెండి కడియాలతో నెత్తిమీద ఆకుల గంపతో రామక్క నడుస్తుంటే ఆ ఠీవి చూడాల్సిందే.

ఒకరోజు తాడిపత్రికి వెళ్ళిన రామక్క ఉత్తచేతులతో రాలేదు. ఆకుల గంపలో ఒక పసికందుతో వచ్చింది. వసుదేవుడు శ్రీకృష్ణుణ్ణి తెచ్చినట్టు ఆ పసిగుడ్డుని వూళ్ళోకి తెచ్చింది. వూరంతా విరగబడి చూసింది.

తాడిపత్రి ఆస్పత్రి దగ్గర పారేశారయ్యా. వాడిపోయిన తమలపాకునే పారెయ్యాలంటే మనసురాదు, బిడ్డని ఎట్టాపారేశారో - అంటూ రామక్క కళ్ళు తుడుచుకుంది.

రామక్క లోకం మారి పోయింది. బిడ్డే లోకం. పాలచుక్కల కోసం ఇల్లిల్లూ తిరిగింది. పసిపిల్లని అరిచేతుల మీద నడిపించింది. అవ్వా అవ్వా అని పిలిపించుకుని మురిసిపోయింది. అక్షరాలు నేర్పించింది. రామక్క ఆకుల గంపతో నడుస్తుంటే "తమలపాకులూ" అని దీర్ఘం తీసేదా పిల్ల. ఆ పిల్ల పెళ్ళి జరిగినప్పుడు వూరంతా తలో చెయ్యి వేసింది. ఎనభయ్యేళ్ళ వయసులో పండుటాకులా రాలిపోయింది రామక్క. శవణ్ నుంచి ఆ పిల్లని విడదియ్యడం ఎవరి వల్లా కాలేదు. శవాంతోపాటు తమలపాకుల్ని కూడా వేసి మట్టి కప్పారు. బతికినంత కాలమూ పచ్చనాకు లాగే బతికింది రామక్క.

దృశ్యం 2 - ప్రేమ పిపాసి


టెంత్ ఎగ్జాంస్ ఎడాపెడా రాసి పారేసి ఆ సాయంత్రమే మూకుమ్మడిగా ఒక డొక్కు సినిమా చూసి వూపిరి పీల్చుకున్నాం. ఈ లోగా మొదలైంది లవ్వర్ బాబు గొడవ.

మేమింకా ఆడపిల్లల్తో కోతికొమ్మచ్చి ఆడుకునే అపరిపక్వ దశలో ఉండగానే వాడికి ప్రేమదంతం మొలిచింది. ఎయిత్ క్లాసులోనే ఒకమంఆయికి రంగురంగుల ఇంకులతో పూలు చిలక బొమ్మలేసి లవ్‌లెటర్ రాసి పడేశాడు. వీడి రాత అర్ధం కాక ఆ అమ్మాయి జుట్టు పీక్కుని ఆ లెటర్‌ని హీరాలాల్ సార్‌కి ఇచ్చింది. హీరాలాల్ అయ్యవారు ఎప్పుడూ అగ్నిగుండంలా మండేవాడు. కారణం లేకుండానే వుతికి పడేసేవాడు. లవ్‌లెటర్‌ని చూసేసరికి ఇన్నాళ్ళకి ఓ కారణం దొరికింది అనుకుంటూ లవ్వర్ బాబు తాట వలిచాడు. పాపం వాడిని కొడుతూ వుంటే ఆ అమ్మాయి కూడా బాధ పడింది. ఆ అమ్మాయిని అందరూ కోప్పడ్డారు. "ఇన్ని సినిమాలు చూస్తావు గదా, ఆ మాత్రం జెనరల్ నాలెడ్జి లేదా!" అంటూ నిలదీసారు.

దెబ్బలు తిన్నందుకు బాబు ఏ మాత్రం బాధపడలేదు. ప్రేమలో ఈ మాత్రం ఎదురు దెబ్బలు మామూలే అని లైట్ గా తీసుకున్నాడు. ఈ సారి ఆ అమ్మాయి మనవాణ్ణి ప్రేమించడానికే ప్రయత్నించింది గానీ వీడే ఆ ఛాన్స్ ఇవ్వకుండా ఇంకో అమ్మాయిని ప్రేమించ సాగాడు.

దృశ్యం మూడు - మంత్రిగారి అ ఆ ఇ ఈ


"వర్ణమాలతో పని లేదు, సువర్ణమాలే నడిచొస్తుంది" అన్నాడు పీయే వీర్రాజు.
"సువరణమాలంటే ఎవర్రా?" ఉత్సాహంగా అడిగాడు మంత్రి.
"ఏదో సామెతకి అన్నానండి. అమ్మాయి పేరు వింటే చాలు శృంగారం చుట్టు ముడుతుంది" విసుక్కున్నాడు వీర్రాజు.
"తరవాత ఏమొస్తుందండి" వినయంగా అడిగాడు కాంట్రాక్టర్ గున్నారావు.
"తరవాతది మ. మ అంటే మద్యం. జనం మద్యం మానితే రాజకీయ నాయకులంతా సత్రాల్లో చేరి పద్యాలు పాడుకోవాల్సిందే. మన ప్రజాస్వామ్య నాడీవ్యవస్థ మొత్తం మద్యంలోనే వుంది. జనం నరాల్లోకి మత్తు ఎక్కితేనే మనం కుర్చీ ఎక్కేది" జ్ఞానబోధ చేసాడు వీర్రాజు.
"వాటే ఎనాలిసిస్" అన్నాడు గున్నారావు.
"మ తరవాత ఉ వస్తుంది. ఉ అంటే ఉపన్యాసం. జనం చెవుల్లో తుప్పు వదిలేలా ఉపన్యాసాలివ్వాలి. ఊ అంటే ఊకదంపుడు. ఎన్నిగంటలు మాట్లాడినా అక్షరం ముక్క అవతలివాడీకి అర్ధం కాకూడదు. ఇక ఎ అంటే ఎన్నికలు."
"గొప్పగా చెప్పారు సార్!" అన్నాడు గున్నారావు.
"ఇంకా విను. క అంటే కత్తి. ఎవణ్ణో ఒకణ్ణి పొడవకుండా తొందరగా పైకి రాము. గ అంటే గన్ను గన్ను షాటో వెన్ను పోటో లేకుండా పాలిటిక్స్ ఉండదు ...."
ఇలా రాజకీయ వర్ణమాల గీతోపదేశం సాగిపోయింది.
***************
ఈ దృశ్యాలన్నీ ప్రముఖ పాత్రికేయుడు జి.ఆర్. మహర్షి రాసిన పుస్తకం నెమలికన్నులో మీకు సాక్షాత్కరిస్తాయి. అట్టమీద 116 చిన్న కథలు అని ప్రకటించినా, అవి వొట్టి కథలు కావు. చిన్నప్పటి పల్లెటూరి మనుషుల జ్ఞాపకాలు కొంచెం .. బడి వయసు అనుభవాల నాస్టాల్జియా మరికొంచం .. సమకాలీన జీవితంలోని వెర్రిపోకడల మీద సెటైరు ఆ పైన కొసరు.

ఏ కథా రెండు పేజీలకి మించి లేదు. అరకప్పు టీ తాగేంతలో చదివెయ్యొచ్చు.

రెండొందల యాభై పేజీల పుస్తకం. ధర నూట యాభై రూపాయలు కొద్దిగా ఎక్కువే అనిపిస్తుంది కానీ, కొని పక్కన పెట్టుకుంటే, ఆరఆరగా చదివి చాలాకాలం ఆస్వాదించ దగ్గది. 2008 లో ప్రచురించారు. నవోదయ, విశాలాంధ్ర, ప్రజాశక్తి ఇత్యాది పుస్తకాల అంగళ్ళలో దొరుకుతుంది.

Comments

Lakshmi Naresh said…
thank u sir...meeku idea unna manchi pusthakala gurinchi chepthe inka baguntundi..avanni chaveppdu meeru rasaremo anukunna
లక్ష్మీనరేష్ గారు, దయచేసి ఇకమీదట తెలుగు లిపిలోనే తెలుగు వ్యాఖ్యలు రాయండి.
ఈ బ్లాగులో తరచూ పుస్తకాల పరిచయమూ, సమీక్షా, విమర్శా జరుగుతూనే ఉంటాయి.
కొత్తపాళి గారూ, పుస్తక పరిచయం అని చెప్పకుండా చివరిదాకా చదివించారు. ప్చ్ :)
మురళి said…
మొన్ననే నా కంట పడింది.. కొని తెచ్చి చదవడం మొదలు పెట్టా.. అప్పుడొకటీ.. ఇప్పుడొకటీ.. అలా.. మీరప్పుడే పూర్తి చేసేశారన్న మాట...
@భాస్కరరామిరెడ్డి .. ప్చ్!
@ మురళి .. నిజమా!
తృష్ణ said…
మొన్న విశాలాంధ్రలో చూసాను..అప్పటికే చాలా బిల్లయిందని ఊరుకున్నాను.అయితే కొనాల్సిందే..
asha said…
ఈ పుస్తకం వెంటనే చదివేయాలనిపిస్తుంది. ఇంత బాగా పరిచయం చేసినందుకు ధన్యవాదాలు.