2009 తానా సావనీరు - తరువాయి భాగం

మొదటి భాగం ఇక్కడ.

మారుతున్న ఆంధ్రావని అనే శీర్షిక కింద పలువురు పాత్రికేయులు, ఇతర తెలుగు ప్రముఖులు రాసిన వ్యాసాలు పదమూడున్నాయి. ఎన్. వేణుగోపాల్ రాసిన తెలుగుసీమ రాజకీయార్ధిక జీవనం అన్న వ్యాసం ఏదో పీహెచ్‌డీ సిద్ధాంత వ్యాసం లెవెల్లో మొదలై, అనుకోళ్ల గురించీ, చదవాల్సిన చరిత్ర మూలాల గురించీ సుదీర్ఘమైన ఉపోద్ఘాతం తరవాత (ఏమాటకామాట .. ఆ ఉపోద్ఘాతం బహు గొప్పగా ఉంది, చారిత్రక రాజకీయార్ధిక పరిణామాల్ని పరిశోధించాలంటే ఎలాంటి విషయాల్ని పట్టించుకోవాలి, ఎలాంటివి పట్టించుకోకూడదు అని చక్కటి సమీక్ష) ఏవో ఒకటి రెండు గణాంకాల్ని పట్టుకుని గత దశాబ్దిలో ఆంధ్రరాష్ట్ర రాజకీయార్ధిక పరిణామాల్ని విశ్లేషించడానికి ప్రయత్నించి, కాస్త నిరుత్సాహాన్ని మిగిల్చింది. ప్రముఖ విద్యావేత్త చుక్కారామయ్యగారి కలంనించి వెలువడిన విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు అనే వ్యాసంకూడా నిరుత్సాహాన్నే మిగ్లిచింది. పాత్రికేయులు రెంటాల జయదేవ గారు రాసిన తెలుగు సినిమా సాంకేతిక పరిణామం అనే వ్యాసం ఈ శీర్షిక అంతటికీ మకుటాయమానం. ఈ రచయితకి సినిమాలు, సినిమాల టెక్నాలజీ మీద ఉన్న ఆసక్తి, పట్టు నిజంగా అబ్బురం గొల్పినాయి. సాధారణ ప్రేక్షకుడికి సినిమాల గురించి ఊహకికూడ తోచని ఎన్నో సమకాలీన సాంకేతికాంశాల్ని, ఇటీవలి చిత్రాల్ని సోదాహరణంగా పేర్కొంటూ, విపులంగా విశదీకరించారు. దీనితరవాత మెచ్చుకోదగ్గ రచనలు - రైతు సమస్యలు, పరిష్కారాల గురించి ఆచార్య కె. ఆర్ చౌదరి గారి వ్యాసం, 108 ఆంబులెన్సు సర్వీసు గురించి నరసింహారావు గారి వ్యాసమూనూ.

ప్రముఖ పాత్రికేయులు, పేరెన్నికగన్న సంపాదకులు, కె. రామచంద్రమూర్తి, టంకశాల అశోక్ గార్ల వ్యాసాలు పసలేకుండ ఉన్నాయి. హైఅదరాబాదు తెలుగు పబ్లిక్ స్కూల్లో సంస్కృత తెలుగు భాషా సాహిత్యాల ఉపాధ్యాయులైన డా. ఎ.కె. ప్రభాకర్ గారు సమకాలీన తెలుగు సాహిత్యాన్ని సమీక్షుంచుకుంటూ రాసిన వ్యాసం కొంతవరకూ ఈనాటి సాహిత్యంలోని ఉద్యమధోరణుల్ని ఒక చోట సమకూర్చుకునే ప్రయత్నం. తెలుగు సాహిత్యంతో సన్నిహిత పరిచయం ఉన్నవారికి ఈ వ్యాసం కొత్తగా చెప్పేదేమి లేదుకానీ, ఇప్పుడిప్పుడే తెలుగు సాహిత్యాన్ని రుచి చూస్తున్న, లేక చూద్దామనుకుంటున్న పాఠకులకి .. మనం ఏం చదవాలి .. అని మంచి సూచికలాగా పని చేస్తుంది.

ఇహ చివరి విభాగం "మన మాటల్లో.." అనే పేరుతో అమెరికా తెలుగు రచయితలు రాసిన కథలూ కవితలూ. No need for profusion అనే ఆంగ్ల కవిత ప్రచురించిన చిన్నారి రోహన్ పావులూరికి అభినందనలు. రెండోతరం తెలుగు అమెరికన్లు ఆంగ్లంలో అయినా ఇలా తెలుగు సావనీరులో పాలు పంచుకోవడం ముదావహం. ఇహ .. ఒక పాఠకుడిగా, కథలన్నీ విభిన్న స్థాయిల్లో నన్ను నిరాశ పరిచాయి, నా కథతో సహా. ఉన్నంతలో నిర్మలాదిత్య గార్రాసిన ట్వీట్ ట్వీట్ (ఇప్పుడు జనాల్ని ఉర్రూతలూపేస్తున్న ట్వీటర్ వినియోగం నేపథ్యంగా) నాకు నచ్చింది. మాచిరాజు సావిత్రి గారి రచన పెట్టె బయట (అవుటాఫ్ది బాక్సన్నమాట) కూడా, కొంచెం ఆలోచన రేకెత్తిస్తూ, బానే ఉందనిపించింది. ఒక్కగానొక్క కొడుకు, తలిదండ్రుల ఖర్మకాలి గే (అదే, స్వలింగ సంపర్కి) అయితే ఏంటి అనే కథా వస్తువుతో రాసిన వేపపువ్వు అనే కథ నాకు పిచ్చినిరాశనీ కోపాన్నీ మిగిల్చింది. ఆ సమస్య గురించి కనీసమైన అవగాహన లేకుండా .. కభీఖుషీ కభీఘం టైపులో అర్జంటుగా కథ రాసెయ్యడమెందుకో నాకు బొత్తిగా అర్ధం కాలేదు. అన్నట్టు మర్చి పోయానండోయ్ .. ఇజ్జాడ రాఘవేంద్ర, మాజేటి సూర్యకళ జమిలిగా రాసిన "కొత్త కంపెనీ పెట్టు గురూ" అన్న కథబ కాని కథ ఈ విభాగానికంతటికీ మకుటాయమానం. ఇద్దరు ఔత్సాహికులు, కేవలం ఒక బ్రిల్యంటైడియా బలమ్మీద నమ్మకంతో ఒక కంపెనీ పెట్టి నెగ్గుకొచ్చిన వైనాన్ని కొంచెం హాస్యంగా, కొంచెం చురుగ్గా క్లుప్తంగా భలే చెప్పారు - ఈ కథనం వారి నిజానుభవాన్నించి పుట్టిందట .. అందుకే అంత పదునూ, రుచీనూ.

కవితలు ఒక మోస్తరుగా బానే ఉన్నాయనిపించాయి. వైదేహి గారి కచేరీ ఇంకొంచెం శ్రుతి పెంచి ఉండొచ్చు. కవిత్వ రహస్యం తెలిసిన కవులు చంద్ర కన్నెగంటి, విన్నకోట రవిశంకర్, నారాయణస్వాముల పద్యాలు హృద్యంగా ఉన్నాయి. మావూరి కవయిత్రి కొత్త ఝాన్సిలక్ష్మిగారి "బాల్యం" కవిత చదివితే ఆవిడెవరో (మహాదేవి వర్మ అనుకుంటా) హిందీలో రాసిన ప్రముఖ పద్యం మేరా నయా బచపన్ గుర్తొచ్చింది నాకు. మొత్తానికి ఈ సృజనాత్మక రచనల విభాగంలో పద్యాలే ఎక్కువ మార్కులు కొట్టేశాయి, నా ఇవేల్యువేషన్లో.

చివరి మాట:
మొత్తంగా చూసుకుంటే, సాధారణంగా సావనీర్లలో ఉండే గందరగోళం (అటు విషయంలోనూ, ఇటు అమరికలోనూ) లేకుండా, ఈ సావనీర్ని రూపొందించడంలో సంపాదక వర్గం ముందస్తుగా చాలా ఆలోచన పెట్టారనీ, తరవాత చాలా కృషి చేశారనీ సులభంగా అర్ధమవుతుంది. అందుకని ఈ బృందాన్ని ఎంతైనా అభినందించొచ్చు. మనం తల పెట్టిన పని గొప్ప స్థాయిలో ఉండాలని ఆశించడమే కాదు, దానికి అవసర్మైన హోంవర్కు చేసి, బాధ్యతలని పంచి, నిర్వహించి సమర్ధవంతంగా పూర్తి చెయ్యడం సామాన్యమైన విషయం కాదు.

సావనీరుకి సంపాదకత్వ బాధ్యత వహించడమంటే కాళ్ళూ చేతులూ కట్టేసి కొవ్వూరునించి రాజమండ్రికి గోదారి ఈదమన్నట్టే. నేనూ రెండు మూడు సార్లు చేశాను కాబట్టి నాకు తెల్సు ఆ యాతనేవిటో. ఆయా రచనల క్వాలిటీ బాగున్నా బాలేకపోయినా .. అది ఆయా రచయితల నిర్వాకమే. కానీ, మొత్తం ప్రాజెక్టుకి బాధ్యత వహిస్తున్నది సంపాదక వర్గం కనక, రచయితల ఎంపికలోనే కాక, గొప్ప పేరున్న రచయిత అయినా, రచనలో వాసి లేకపోతే నిర్భయంగా తిరస్కరించగల నిర్మొగమాటం కూడా సంపాదకవర్గం అలవరచుకోగలగాలి. ఆ లెక్కన, 2005 డిట్రాయిట్ తానా సావనీరు సంపాదకవర్గం పాటించిన పద్ధతి మంచిది. రచనల క్వాలిటీ కూడా ఆ మేరకు మెరుగైనది. మొహమాటాల వల్ల ప్రముఖుల రచనలు వన్నె లేకున్నా వేసుకున్ణారని నా అనుమానం.

ఈ ఆరోపణ అలా ఉండగా, ముందస్తు ఆలోచనకీ, విభాగాల విభజనకీ, రూప కల్పనకీ నూటికి నూరు మార్కులు ఈ సావనీరుకి.

ఇహ వర్ణ చిత్రాల సంగతి ఇప్పటికి ఒకటికి రెండు సార్లు చెప్పాను. ఐనా మళ్ళి చెబుతున్నాను. మీకు ఎక్కడ వీలున్నా ఈ సావనీరు కాపీ సంపాయించుకోండి .. కేవలం గొప్ప గొప్ప తెలుగు చిత్రకారులు సృష్టించిన కొన్ని అద్భుతమైన వర్ణచిత్రాల ప్రింట్ల కోసమైనా. మీ దగ్గర ఆల్రెడీ కాపీ ఉంటే, భద్రంగా దాచుకోండి, అప్పుడప్పుడూ తెరిచి ఆ చిత్రాల్ని మళ్ళీ మళ్ళీ చూసుకోండి, మీ పిల్లలకీ చూపించండి .. చూడు కన్నా మన తెలుగు వాళ్ళూ ఉన్నారు .. ఒక మైఖెలాంజిలో .. ఒక క్లాడ్ మొనే .. ఒక జాక్సన్ పోలాక్!

Comments

budugu said…
హహ్హ..ఈ ఎన్ వేణుగోపాల్ నిరాశపరచడం మొదటిసారి కాదు. ఈయనకు వ్యాసంలో బోలెడు సైద్ధంతికపదాలు, ఇంగ్లీషు అనువాదపదాలు, intellectual soundingపదాలు స్ప్రే చేసి, కుదురుగా ఒక విషయం చెప్పలేకపోవటం అలవాటు. సాంపుల్‌గా ఒక ఐదారు వ్యాసాలు తీసుకొని చదవండి మీకే అర్ధమవుతుంది నేననేది ఏమిటో. (కథా సిరీసుల్లో ఉందవచ్చేమో)

మొన్నీమధ్య ఒక సభకి వెళ్తే చీఫ్ గెస్టునంటూ ఆలస్యంగా వచ్చి చెత్త స్పీచొకటి ఇచ్చి మధ్యలోంచి వెళ్ళిపోయి రసాభాస చేశాడు. ఆం.జ్యో. సంపాదకులు కదా కొంతకాలం వరకూ ఆయన్నెవ్వరూ ఏమీ చేయలేరు. అది తెలుగు పాఠకుల ఖర్మ.

మీ సావనీరు సమీక్ష చక్కగా ఉంది. నివాసాంధ్రులకు ఎలాగూ కొనుక్కునే సౌకర్యం లేదు. ఆ వర్ణచిత్రాలేవో స్కాన్ చేసి సాంపుల్ పెట్టగలరా. రైట్స్ గొడవల్లేకపోతేనే..
జయ said…
ప్లీజ్, ఆ సావనీర్ లోని చిత్రాలని మాకు చూపించండి.
రాధిక said…
సావనీరు నాదగ్గరా వుంది.నిజానికి ఆ వర్ణ చిత్రాల వల్లే నేను దానిని అపురూపం గా దాచుకున్నాను.