కబుర్లు - సెప్టెంబరు 7

నాకు చిన్నప్పుడు వింత వింత అనుమానాలు వస్తుండేవి. రాష్ట్రపతి గానీ ప్రధానమంత్రి గానీ మా అప్పలాగే సాయంత్రం సంచీ పుచ్చుకుని కూరల మార్కెట్టుకి వెళ్తారా? కూరల వాళ్ళే వాళ్ళకి తెచ్చి ఇస్తారేమో. ఫ్రీగా కూడా ఇస్తారేమో. ఎందుకంటే, రాష్ట్రపతీ ప్రధానమంత్రీ ఇంచుమించుగా దేశానికి రాజుల్లాంటి వాళ్ళు కదా, అందుకని దేశంలో ఉన్నవన్నీ వాళ్ళవే. కూరల వాళ్ళు ఫ్రీగ ఇస్తుంటే మరి మిగతా షాపుల వాళ్ళు మాత్రం డబ్బెలా పుచ్చుకుంటారు వాళ్ళ దగ్గర? అందుకని, బట్టలూ, చెప్పులూ ఇట్లాంటివన్నీ కూడా వాళ్ళకి ఫ్రీయే .. ఇలా సాగుతుండేవి నా ఆలోచనలు.

కాస్థ మిగలకుండా వెళ్ళిపోయిన వయ్యెస్ గురించి కూడా .. కస్సేపు తీరిగ్గా కూర్చోగానే .. వయ్యెస్ జీవిత బీమా చేయించుకుని ఉంటాడా? ఒకేళ చేయించి ఉంటే ఎన్ని కోట్లకి? ఆ బీమా కంపెనీ వాడు సాధారణ పౌరుల్ని అడిగినట్టే ఆ సర్టిఫికేటు, ఈ సంతకం, ఇంకో పిండాకూడు ఆథరైజేషను అన్నీ మూడేసి కాపీలు సబ్మిట్ చెయ్యాలి అంటాడా? ఏక్సిడెంటు కాబట్టి పోలీసు రిపోర్టు, సివిల్ సర్జను నించి పోస్టుమార్టం రిపోర్టులు కూడా కావాలంటాడేమో! ఎవరైనా పెద్దవారి మరణానంతరం ఈ అఫీషియల్ తతంగం చూసుకోవలసి వచ్చిన ఎవరికైనా అర్ధమవుతుంది నేనేం మాట్లాడుతున్నానో .. పోనీ వయ్యెస్ సంగతి సరే .. పాపం ఆ సెక్రటరీ, ఇతర ఆఫీసర్ల సంగతేవిటో? ఐనదానికీ కానిదానికీ ఎక్స్ గ్రేషియాలు ప్రకటిస్తుంటుంది ప్రభుత్వం - విధినిర్వహణలో అసువులు బాసిన ఈ ఆఫీసర్లకి అలాంటిదేమైనా ఇస్తారో లేదో? (ప్రకటించారుట, ఇందాకే ఆంధ్రజ్యోతిలో చూశా) ఇలా .. తలా తోకా లేకుండా .. అవునూ, వయ్యెస్ పోతే జనాలంతా గుండెపోట్లు తెచ్చుకోడం, ఆత్మహత్యలు చేసుకోడం ఏంటో? ఇది మానసిక జాడ్యం అవుతుందిగానీ అభిమానానికి కొలమాన మెలాగవుతుంది? పైగా ఈ పత్రికల వాళ్ళు అదేదో ఘనకార్యమన్నట్టు చిత్రించడం. పైలోకంలో ఈ నాయకులూ నాయకురాళ్ళూ అంతా కలుసుకుంటే .. నాతో పాటు ఎక్కువమంది చచ్చారంటే నాతో ఇంకా ఎక్కువమంది చచ్చారని గొప్ప చెప్పుకుంటారు కాబోలు .. దరిద్రం!

చావు కబుర్లు చాల్లేండి, కాసేపేమయినా ఆహ్లాదమైన కబుర్లు చెప్పుకుందాము.
మా వూరి తెలుగు సాహిత్య సమితి వారు తలపెట్టిన సాహిత్య మూర్తుల వందేళ్ళ పుట్టినరోజు వేడుకలు రెండు వారాల్లోకి వచ్చేశాయ్. అమెరికాలో ఉంటున్న తెలుగు వారందరికీ ఇదే ఆహ్వానమూ, హెచ్చరికానూ. తరవాత సభల ఫొటోలు చూసీ, నివేదికలు చదివీ .. వొళ్ళు జల్లుమంది, కుళ్ళుగా ఉంది, మళ్ళీ సారి తప్పక .. ఇలాంటి సొల్లు కబుర్లు చెప్పి లాభం లేదు. సత్వరమే ప్రయాణ సన్నద్ధులు కండి. వివరాలిక్కడ.

కేలిఫోర్నియా రాష్ట్రంలో లాసేంజిలస్ నగరానికి దగ్గర్లో రగుల్తూన్న దావానలం ఇంకా (ఇప్పటికి వారానికి పైగా) ఆ ప్రాంతంలో బీభత్సం సృష్టిస్తూనే ఉంది. ఇటు తూర్పు తీరాన్న హరికేను సీజను మొదలై, తుపానులు ఒకదాని వెనకాల ఒకటి బొంగరాల్లా సుడుల్తిరుగుతూ బయల్దేరుతున్నై. అమెరికను కాంగ్రెసు సభ్యులు వేసవి సెలవులు ముగించుకుని తిరిగి రాజధానికి చేరుకోవడంతో వైద్య వ్యవస్థపై చర్చ మాధ్యామాలన్నిటిలోనూ తారస్థాయి నందుకుంటోన్నది. ఒబామా ఈ మంగళారం కాంగ్రెసునుద్దేశించి ఉపన్యసిస్తాడుట. కొత్తగా ఏమి చెబుతాడో చూడాలి. వేసవి సెలవులంటే గుర్తొచ్చింది. పెద్దా చిన్నా పిల్లకాయలందరూ కూడా వేసవి సెలవలకి టాటాచెప్పి బడికి హలో చెబుతారీ మంగళవారం... కొత్త సంవత్సరం, కొత్త పుస్తకాలు, బహుశా కొత్త స్కూలూ కొత్త స్నేహితులు కూడానేమో! ఈ సందర్భంగా చిన్నారులందరికీ అనేకానేక శుభాకాంక్షలు .. సర్వదా దిగ్విజయోస్తు. అమ్మలూ నాన్నలూ హమ్మయ్య అని కాస్త ఊపిరి పీల్చుకోవచ్చు! :) ఊరంతదీ ఓ దారైతే అమెరికనులిపికట్టెది ఇంకోదారని మనందరికీ తెల్సిన విషయమే. మిగతా ప్రపంచమంతా లేబర్ డేని మే ఒకటిన జరుపుకుంటుంది. అమెరికాలో మాత్రం ఇది సెప్టెంబరు మొదటి సోమవారం. ఈ దేశపు పారిశ్రామిక చరిత్రలో కార్మికుల యోగక్షేమాలకై ప్రాణాలకి తెగించి మరీ పోరాడిన లేబర్ ఉద్యమాన్ని ఈ సందర్భంగా స్మరించుకోవడం సమంజసం.

ప్రముఖ సమకాలీన కవి, పసునూరు శ్రీధరబాబుగారు బ్లాగు ప్రారంభించి తన కవిత్వం మనతో పంచుకుంటున్నారు .. మీరూ ఓ లుక్కెయ్యండి.

Comments

Anonymous said…
" అవునూ, వయ్యెస్ పోతే జనాలంతా గుండెపోట్లు తెచ్చుకోడం, ఆత్మహత్యలు చేసుకోడం ఏంటో? ఇది మానసిక జాడ్యం అవుతుందిగానీ అభిమానానికి కొలమాన మెలాగవుతుంది? పైగా ఈ పత్రికల వాళ్ళు అదేదో ఘనకార్యమన్నట్టు చిత్రించడం. పైలోకంలో ఈ నాయకులూ నాయకురాళ్ళూ అంతా కలుసుకుంటే .. నాతో పాటు ఎక్కువమంది చచ్చారంటే నాతో ఇంకా ఎక్కువమంది చచ్చారని గొప్ప చెప్పుకుంటారు కాబోలు .. దరిద్రం!"

బాగా చెప్పారు.
నందకం said…
వైఎస్ భీమా సంగతేమోగాని. ప్రధాని PVనరసింహరావు తన చివరి రోజుల్లొ కోర్టు కేసుల కొరకై న్యాయవాదులకు ఇవ్వడానికి డబ్బులేక తన ఇల్లు అమ్మకానికి పెట్టాడట!
Tb-Author said…
ఏదో చెప్పాలని అనుకున్నా కానీ ఎం చెప్పాలో తెలియడం లేదు .. కానీ దేశం నుండి దూరంగా వున్నా సరే బాష ని దగ్గర వుంచుకున్న మిమ్మల్ని అభినందిన్చలనుకున్న .
మురళి said…
చిన్నప్పుడు మా సత్యం చేత క్షురకర్మ చేయించుకున్నాక తర్వాతి రెండు మూడు రోజులూ నా ఆలోచనలూ ఇలాగే ఉండేవి.. ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి, ఇంకా రేడియోలో వినిపించే పెద్దాళ్ళు అందరూ కూడా ఇలాగే క్షురకుడి ముందు తల వంచుకుని కూర్చోవల్సిందేనా? అలా..అలా.. మీ టపా ప్రారంభ వాక్యాలు చూడగానే ఆ విషయం గుర్తొచ్చింది..
ఇక చావుల విషయానికి వస్తే, ఇప్పటికే పెద్ద హీరోల అభిమానులు "మా హీరో సినిమాకి టిక్కట్లు దొరక్క ఇంతమంది పోయారు" అంటే "అబ్బో..మా హీరోకైతే ఇంతమంది.." అని గర్వంగా చెప్పుకుంటున్నారు.
స్వర్గం/నరకం లో నాయకుల సంగతేమో కానీ, ఇక్కడ వాళ్ళ అనుచరులు మాత్రం కచ్చితంగా లెక్క పెట్టుకుంటారు. గత ఐదారు రోజులుగా సహజంగా మరణించిన వారు కూడా ఈ 'అభిమానంతో గుండెపోటు తెచ్చుకున్న' వాళ్ళ జాబితాలో చేరిపోతున్నారని కర్ణ పిశాచాలు ఘోషిస్తున్నాయి...
మహేష్ బాబు గారు, దయచేసి వ్యాఖ్యల్ని పూర్తిగా తెలుగులో కానీ, పూర్తిగా ఆంగ్లంలో కానీ రాయండి. ఆంగ్ల లిపిలో రాసే తెలుగు వ్యాఖ్యలు వద్దు.

నందకం .. అది పుకారు అనుకుంటానండీ. పీవీ చివరి రోజుల దాకా తన ఆంతరంగిక సభని వైభవంగానే నిర్వహించుకున్నాడని నాకు తెలుసు.

రాజేష్ .. సంతోషం.

మురళి .. నిజం కదా! క్లంటన్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఒక హెయిర్ కట్ కి $200 అయిందని అప్పట్లో పెద్ద గోల అయింది.
asha said…
నాకైతే ఇక్కడెవరు చనిపోయినా, మేం చచ్చిపోతే మా అంత్యక్రియలు ఎలా జరుగుతాయి? మా పేరెంట్స్‌కి మమ్మల్ని చూసే చాన్స్ దొరుకుతుందో, లేదో...లాంటి కంపల్సివ్ థాట్స్ వస్తుంటాయి. ఇక్కడికొచ్చిననుండి చావు గురించిన ఆలోచనలు ఎక్కువయిపోయాయి.
అభిమానపు చావుల విషయంలో మురళిగారి అనుమానమే నాదీనూ.
వయ్యెస్‌ది ఘోరమైన మరణం. నేను కూడా షాక్‌కు గురయ్యాను. కానీ మరీ ఇలా చనిపోవటం అంటేనే నమ్మలేకుండా ఉన్నాను.
Anil Dasari said…
క్రికెట్‌లో ఓ తమాషా ఉంది. బ్యాట్స్‌మన్ కష్టపడి బంతిని ఆపి ఒక పరుగు తీసి, ఫీల్డర్ల అత్యుత్సాహం వల్ల మరో నాలుగు పరుగులు ఓవర్ త్రో రూపంలో వస్తే, ఆ నాలుగూ కూడా బ్యాట్స్‌మన్ ఖాతాలోకే పోతాయి. అలాగే, గత వారం రోజుల్లో ఆంధ్రాలో ఎవరే కారణంతో పరమపదించినా అందరూ వయ్యెస్ ఖాతాలోకి 'పోవటం' సహజం, న్యాయం. ఆయన కుమారుడికే పట్టం కట్టటమూ సహజ న్యాయమే. దీని గురించి ఎవరో నా బ్లాగులో అతి విలువైన సూచనొకటి చేశారు. అది యధాతథంగా:

"ముఖ్యమంత్రి చనిపోతే, ఆయన కొడుకుకో /భార్యకో ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టినట్లు – అదే ప్రమాదంలో మరణించిన ఐ.పి.యెస్. కొడుక్కో కూతురుకో లేక భార్యకో ఐ.పి.యెస్. పొజిషన్, ఐ.ఏ.యెస్. కొడుక్కో కూతురుకో లేక భార్యకో ఐ.ఏ.యెస్ పొజిషన్ ఇస్తే బాగుంటుంది. అది ధర్మంగా కూడా కనిపిస్తోంది. ఆ సందర్భం లోనే చనిపోయిన పైలెట్ల సంతానాన్ని పైలెట్ల గా నియమిస్తే చాలా బాగుంటుంది. మంత్రులు, ముఖ్యమంత్రి పర్యటనలకు ఉపయోగించే హెలికాఫ్టర్లను తోలే బాధ్యతను ఈ పైలెట్లకే అప్పగిస్తే ఇంకా బాగుంటుంది.
ఇవన్నీ చేసేందుకు అవసరమైన(అవసరమైతేనే) రాజ్యాంగ సవరణలు, ప్రభుత్వ విధానాల్లో మార్పులు ఎంత త్వరగా చేస్తే అంత మంచిది"
భవాని .. మనం పోయాక బాధలేవీ మనల్ని అంటవ్! :)
అబ్రకదబ్ర .. అమ్మ, ఆశ. అలాంటి పోస్టుల్లో వాళ్ళే నిజంగా పని చెయ్యాలి, బాధ్యూత వహించాలి. అదే సీయెమ్ము, రాజకీయ నాయకుడు అయితే ఆ రెండూ అక్కర్లేదు. రెండూ ఒకటెలాగవుతుంది? ఒక విధంగా సినిమాహీరోలు కూడా అంతే .. వాళ్ళేం చెయ్యక్కర్లేదు, వాళ్ళ బాధ్యతా ఏమీ ఉండదు. అందుకనే ఈ రెండు రంగాల్లోనూ వారసత్వం రాజ్యమేలుతోంది.
మేధ said…
నాకూ చిన్నప్పుడు ఇలాంటివే ఉండేవి (అంటే ఇప్పటికీ ఉన్నాయి)- రాజకీయ నాయకుల అంత్యక్రియల విషయంలో!
నేను చూసిన మొట్టమొదటి చావు - రాజీవ్ గాంధీ.. టి.వి లో అది చూసి, అమ్మా ఇప్పుడు రాష్ట్రపతి చనిపోయినా ఇలానే చేస్తారా అని అడిగా! ఆ తరువాత ఆ రాష్ట్రపతి కి నిజంగానే ఏదో అయ్యింది!!
ఏ అంత్యక్రియలు చూసినా, ప్రస్తుతం పదవిలో ఉన్న నాయకుడు పోతే ఎలా చేస్తారా అని ఊహించుకునేదాన్ని ;)
నందకం said…
ఎక్కడో విన్న పుకార్లు వెదజల్లడం నేను చేయ. స్వాతి మాసపత్రికలో అయ్యేయ్యెస్ పి.వి.ఆర్.కె.ప్రసాద్ పాలిటికల్ – పవర్ – పంచ్ అని వస్తోంది మీరు దాన్ని చదువుతారో లేదో నాకు తెలియదు. ఒక అయ్యేఎస్ గుండెచప్పుడు అంటూ వచ్చే ఆ వ్యాసాలకొరకే నేను స్వాతి చదివేది.
1- 5- 2009 స్వాతిలో ’ అసలేం జరిగిందంటే’ అనే శీర్షికన వచ్చే ప్రసాద్ గారి ఆర్టికల్ ఇక్కడ యధాతధంగా రాస్తున్నా...

“ప్రసాద్, నాకో చిన్న సాయం చేయాలయ్యా!” జార్ఖండ్ ముక్తి మోర్చా పార్ట్ ఎం పీలకు ముడుపులు’ కేసు వాదోపవాదాలు ముగిసి ఆకేసులోకూడా పీవీ నరసింహ రావుని నిర్దోషిగా ప్రకటిస్తూ సుప్రీంకోర్టు తీర్పు వెలువడింది. ఈ తీర్పు వచ్చిన కొద్ది రోజులకే పీవీ నరసింహరావు హైదరాబాద్ వచ్చారు. అప్పుడు ఆయన నాతో అన్న మాటలు ఇవి.

“ చిన్న సాహాయమేగా, మీరెలాగూ పెద్ద సహాయాలు నన్ను అడగరు, అదిగినా చేయలేను. చెప్పండి.” అన్నాను.

“ఇక్కడ జూబ్లీ హిల్స్ లో నాకో ఇల్లుంది, తెలుసుగదా! ఆ ఇల్లు అమ్మి పెట్టాలయ్యా.” అన్నారు.

“అంత అవసరం ఏమొచ్చింది సార్! మాజీ ప్రధాన మంత్రిగా మీకు నివాస గృహాన్ని, నౌకర్లనీ ప్రభుత్వమే ఇస్తుంది. వ్వైద్య సదుపాయం వుంటుంది, నెల నెలా పెన్షన్ వస్తుంది...” అంటూ నసిగాను నేను.

పీవీ నరసింహరావుకి పెళ్ళి కావలసిన కూతుల్లూ లేరు నాకు తెలిసి ఆయన ఎవరి దగ్గరా భారీగా అప్పుచేసిన ధాకలాలూ లేవు. ఏదన్నా ఇబ్బంది ఉండి వుంటే ముఖ్యమంత్రిగా వున్నప్పుడు పడ్డారు.

కొడుకును చదివించడానికి అల్లుడు భాద్యత తీసుకోవాల్సి వచ్చింది. కూతుర్ని మెడిసిన్ చదివించడంకోసం ఫీజు కట్ట డానికి ఇబ్బంది పడాల్సి వచ్చింది. కూతుళ్ళ పెళ్ళిళ్ళు చేయడానికి కూడా చాలా అవస్థలు పడాల్సి వచ్చింది. పోనీ ముఖ్య మంత్రిగా చేసిన నాటికి అంత రాజకీయ పరిణితి లేదు అనుకున్నా ఆ తరువాత కేంద్ర పదవుల్లో వున్నారు కదా!

అవికూడా పనికి మాలిన పదవులూ కాదు. సహాయమంత్రి ఉపమంత్రి కాదు. క్యాబినెట్ హోదా వున్న మంత్రి పదవులే.
దేశీయాంగ శాఖ విదేశాంగ శాఖ మానవుల వనరుల శాఖ, ఇంకా కాంగ్రెస్ పార్టీలో కార్యదర్శీ, ప్రధాన కార్య దర్శీ పదవులు కూడా చేసారు. 1991 నుండీ ఐదేళ్ళపాటు ప్రధాన మంత్రి పదవి కుడా చేశారు.

ఇన్ని పదవులు చేసిన వ్యక్తికి తనకున్న ఒకే ఒక ఇల్లును అమ్ముకోవలసిన అగత్యం ఏమిటీ?
నందకం said…
పివి నరసింహ రావు నావంక అదో రకంగా చూసారు. “ఆ మాత్రం నీకు తెలియదా?” అన్న భావం ధ్వనించింది ఆ చూపులో. ఒకటి రెండు నిమిషాల మౌనం తరువాత చెప్పడం మొదలు పెట్టారు.

“..... అన్ని కేసుల్లోనూ నిర్దోషిగా బయట పడ్డానమ్తే నా తరఫున ఎవరో ఒకరు వాదిస్తేనే గదా! వాళ్ళెవరూ నా దగ్గర ఫీజు అడ్వాన్సు అడగలేదు నేను ఎప్పుడు ఏదిస్తే అదే పుచ్చుకున్నారు. అదైనా ఎలా ఇచ్చాను. “ పదవి పోయాక “ఇన్‍సైడర్” పుస్తకం రాస్తే , దాని మీద వచ్చిన రాయల్తీని వాళ్ళ్లకిచ్చేస్తూ వచ్చాను.
ఇంకా ఇవ్వాల్సింది- నా అంచనాల ప్రకారం లక్షల్లో వుంది. వాళ్లకి ఫీజు ఇవ్వకుండా, బాకీ తీర్చకుండా చనిపోతానేమోనని భయంగా వుందయ్యా...”

నేను నిర్ఘాంత పోయాను.

ఎలాంటి వ్యక్తి ఏం మాట్లాడుతున్నారు?

ఈ దేశం అర్ధికంగా దివాలాతీసి, టన్నుల కొద్ది బంగారాన్ని ఇంగ్లాండు లో కుదవబెడితేగాని బడ్జెట్ అవసరాలను తీర్చుకోలేని దుస్తితిలో వున్నప్పడు
సన్యాసం తీసుకుని కొర్తాళం పీఠాధిపతిగా వెళ్ళే ప్రయత్నంలో వున్న పివి ని అప్పటి రాజకీయ పర్స్థితులు వెనక్కి గుంజి ప్రధాన మంత్రిని చేస్తే, ఆయన ఐదేళ్ళలో ఆర్ధిక దుస్థితి నుంచి దెశాన్ని గట్టేక్కించి, సరళీ కరణ, ప్రపంచీ కరణ విధానాలతో ప్రపంచం అంతా అబ్బుర పదేలా వినూత్న ప్రగతి మార్గంలో నడిపించారు.

భారత దేశాన్ని ఈ అరవై కోట్ల జనాభా గర్వ పడే ఒక వైభవ దశలోకి మలుపుతిప్పారు. అలామ్టి మేథావి, రాజనీతి వేత్త నన్ను అభ్యర్థిస్తున్నారు - ప్లీడర్లకి ఫీజులు చెల్లించడానికి తన కున్న ఒకే ఒక ఇల్లు అమ్మి పెట్టాలని!!


బుద్ది ఊరుకోదుకదా, అందుకని సన్నగా అడిగీ అడగనట్టు అడిగాను, “ ఆ ఇమ్టిమీద అద్దె వస్తుండాలి కదా సర్!!” అంటూ.

“అదేంటయ్యా నీకు తెలియదా? 1991 ఎన్నికల ముందు డిల్లీలో నాకు పనేముంది అనుకొని నా సామాను, పుస్తకాలు మొత్తం హైదరాబాద్ లో ఇంటికి తరలించేశాను. నేను వచ్చేస్తున్నా కాబట్టి అద్దెకున్న వాళ్ళని ఖాళీ చేయించాను తీరా సామానంతా తరలించాక మన కాంగ్రెసు నాయకులంతా కలిసి నన్ను పార్టీ అధ్యక్షుడన్నారు. ఆనక ప్రధాన మంత్రి అన్నారు. అప్పటి నుండీ హైదరబాదులో ఇల్లు ఖాళీగానే ఉండిపోయింది....” అన్నారు.

నేను నాలిక కర్చుకున్నాను నా అజ్ఞానానికి. ఆయన సొంత విషయాలు ముఖ్యంగా కుటుంబ సభ్యుల విషయాలు, రాబడి, ఖర్చు వగైరా విషయాలన్నీ ఆయన దగ్గర ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీగా వున్న కేవిఆర్ కృష్ణమూర్తి చూసుకుంటుండేవాడు. నేనెప్పుడూ ఈ ఇంటి విషయం తెలుసుకొనే ప్రయత్నం చేయలేదు.

“ఉన్న ఒక్క ఇల్లూ అమ్మేస్తే శేష జీవితం గురించి కూడా ఆలోచించాలి గదా...” అన్నాను.

“ ఏముంది ఆలోచించ డానికి! పిల్ల లందరికీ వాళ్ల వాళ్ల వ్యాపకాలు వాళ్లకున్నాయి. వాళ్లెవరూ నాతో వుండనక్కర్లేదు, నేనొక్కన్నీ ఉండడానికి ఎన్ని గదులు కావాలి? తినాలన్నా ఎన్ని తినగలను? పప్పు అన్నం చాలు... మాజీ ప్రధాన మంత్రి హోదాలో అవి ఎలాగూ లభిస్తాయి.కదా! అయినా ఒంటరిగా వుమ్డడం అలవాటై పోయింది. నా అనుభవాలన్నీ పుస్తకాల రూపంలో రాయాలనుకుమ్టున్నానయ్యా. ఒక వేళ ఏదన్నా జబ్బు చేసినా మాజీ ప్రధాని అనే ముద్ర ఒకటి వుంది కాబట్టి నడిచి పోతుందిలే...”

ఎంత సులువుగా చెపుతున్నాడీయన, అయిదెళ్లపాటు ఈ దేశపాలనా వ్యవస్థని శాసించిన వ్యక్తి, ప్రధాన మంత్రిగా మూడు బంగళాల మధ్య జీవించిన వ్యక్తి రేపటి గురించి బెంగ పడక్కర్లేదనుకుమ్టున్నాడు...? నేనిలా ఆలోచిస్తూ వుంటే మళ్లీ ఆయనే అందుకున్నాడు.

“అమ్మేస్తే మంచి రేటు వస్తుందమ్టావా?.. రాకపోయినా ఫరవాలేదయ్యా, ఏదో ఒకరేటుకి అమ్మేసి ప్లిడర్లందరికీ బాకీలు తీర్చేస్తే నాకు మన శ్శాంతిగా వుంటుంది. ప్రస్తుతం మన కృష్ణ మూర్తి కొడుకు ప్రసాదే ఆ ఇంటి విషయం చూస్తున్నాడు. నువ్వు కూడా పూనుకుంటే త్వరగా అవుతుందని పిస్తుంది... ఇప్పుడు నేను రాసిన రెండు పుస్తకాలు రెడీగా వున్నాయి. అవి ఎప్పటికి అచ్చయి మార్లెట్లోకి వెళ్లి, మనకి రాయల్టీ వస్తుందో తెలియదు కదా! అప్ప్టిదాకా వాళ్ళ ఋణం తీర్చకుండా వుంటామా? ఈ లోపల నాకేమైనా అయితే...?
నందకం గారూ, All I can say is ..Very interesting!
బహుశా నేనెరిగిన ఆ కడసారి వైభవం ఇలా వచ్చినదేనేమో! పంచుకున్నందుకు మీకు ధన్యవాదాలు.
తృష్ణ said…
వింత వింత ఆలోచనలూ,ప్రశ్నలు నానే వెధిస్తూంటాయేమో అనుకుంటూ ఉంటాను..పర్వాలెదు..నాకు తొడు బోలెడుమంది ఉన్నారు..

వై.యస్.గారి మరణం కన్నా వారి అభిమానుల మృత్యు సంఖ్య దిగ్బ్రాంతిని కలిగిస్తోంది..మరి మహాత్ముడైన గాంధీగారు చనిపోయినప్పుడు....??.....అని అనేకానేక సందేహాలు బుర్రని దొలిచేసాయి..!!