కబుర్లు - సెప్టెంబరు 14

అనుకున్నట్టుగానే ఒబామా హెల్త్ కేర్ స్పీచి దుమ్ము రేగ్గొట్టాడు .. మళ్ళీ అలనాటి ఎన్నికల ప్రచారపు ఒబామాలోని స్పార్కు కనబడింది, వినబడింది. కానీ రాజకీయ వ్యూహాల మోహరింపులో పట్లు అప్పుడే బిగుసుకున్నట్టు ఉన్నాయి. బిగువులు సడలకనో, లేదా ఏదో ఒక బిల్లుని ఆమోదించాలనో హడావుడిలోనో, ఎవరికీ పనికిరాని చెత్త బిల్లుని పాస్ చేసేసి చేతులు దులుపుకుంటారేమోనని కించిత్ భయం లేకపోలేదు. ఏతన్మధ్య జో విల్సన్ గారి కేకలు రామాయణంలో పిడకలవేట.

బాస్కెట్‌బాల్ ఆటగాడు మైకెల్ జోర్డన్ని నిన్న హాలాఫ్ఫేంలోకి ఆహ్వానిస్తున్న సందర్భంగా ఏర్పాటు చేసిన మహాసభలో, కార్యక్రమ నిర్వాహకులు అతను చిన్నప్పటినించీ సాధిస్తూ వచ్చిన క్రీడా విజయాల్ని సముచితంగా శ్లాఘిస్తూ చక్కని కార్యక్రమం ఏర్పాటు చెయ్యగా, వచ్చిన మిగతా అతిథులు, పూర్వం అతని సహ ఆటగాళ్ళు, ప్రత్యర్ధులూ, అందరూ సమయోచితంగా అతన్ని ప్రశంసించగా, అసలు పెద్ద మనిషి మాత్రం తానెంత అల్పుడో నిరూపించుకున్నాడు తన స్పీచిలో. ఎప్పుడీ హైస్కూలు దగ్గర్నించీ ఎవరెవరు తనని ఎలా వెనక్కి నెట్టే, తొక్కిపెట్టే ప్రయత్నం చేశారో, వాళ్ళందర్నీ పేరుపేరునా గుర్తు చేసుకుని వెక్కిరించి యెద్దేవా చేశాడు. మైకెల్ .. బాస్కెట్‌బాల్ కోర్టు మీద నువ్వు తిరుగులేని ఆటగాడివి అయుండొచ్చు, కానీ మిత్రమా, వెళ్ళి ఏదన్నా మంచీ మర్యాదా నేర్పించే ట్రయినింగులో చేరమని మా సలహా .. కాస్త హుందాతనం నేర్చుకో!

వొంటి బరువు గురించి మితిమీరిన ఆసక్తి ఉన్న వాళ్ళు ఇక దాన్ని గురించి తప్ప వేరే ఆలోచించరు. రోజుకి పది సార్లు బరువు చూసుకుంటూ ఉంటారు. ఇంతా చేసి నిజంగా బరువు తగ్ఘేందుకు పనికొచ్చే దీర్ఘకాలిక ప్రణాళికలేవన్నా అమలు చేస్తున్నారా అంటే అది మాత్రం ఊండదు. ఎకానమీని గురించి అమెరికను మీడియా హడావుడి సరిగ్గా అలాగే ఉంది. ప్రతీ వార్తా ప్రసారంలోనూ ఏదో ఒక కొత్త ఇండెక్సు పట్టుకొస్తారు. ఒక పాయింటు పెరిగిందనో, పావు పాయింటు తగ్గిందనో చెప్పి, ఇంక ఒక నలుగురు "నిపుణుల్ని" తెచ్చి ఎడతెగని కుస్తీ పడుతూ ఉంటారు. ఎట్లాగైనా ఆ నిపుణుల నోటినించి .. ఇంకేముంది, ఎకానమీ పైకి వచ్చేస్తోండి, ఇహ గాల్లో ఎగరడమే తరువాయి అన్నట్టు ఉంటుంది వీళ్ళ హడవుడి. ఆ నిపుణులు ఎవరన్నా కాస్త బుద్ధి జ్ఞానం ఉన్నవాళ్ళైతే, నాయనా, ఇట్లాంటి రిసెషన్ నించి కోలుకోవడానికి చాలా సమయం పడుతుంది అని చెబుతారు, ఈ వార్తాలంగర్లు వాళ్ళ మాట వినపడనిస్తేగా. ఈ హంగామా అంతా కాదు గానీ, మొత్తానికి ఎకానమీ ఇంకా దారుణమైన లోతుల్లో పడికొట్టుకుంటున్న సూచనలే కనిపిస్తున్నాయి. ఇన్నేసి వందల బిలియన్ల డాలర్లు స్టిములసించారు .. అదేమి స్టిములుతున్నదో మాట్లాడే నాధుడు మాత్రం కనబడ్డు.

స్పానిష్ దర్శకుడు, పెద్రో ఆల్మొడవార్ తీసిన వోల్వెర్ సినిమా చూశాను వారాంతంలో. ఇదివరలో నే చూసిన ఇతని సినిమాలంత గొప్పగా లేదు, కానీ మంచి సినిమానే. మూడు తరాల స్త్రీల మధ్య ఉండే అనుబంధం .. అదీ స్త్రీలకి మాత్రమే సాధ్యమయ్యే అనుబంధం. స్త్రీ పాత్రల పట్ల తన పక్షపాతాన్ని ఆల్మొడవార్ ఈ సినిమాలో ఇంకో మెట్టు పైకి తీసుకెళ్ళాడు - కనిపించే ఒకే ఒక్క మగ పాత్ర రెండు దృశ్యాల్లో మాత్రమే కనిపిస్తాడు .. మిగతా సినిమా అంతా ఆడావాళ్ళ గురించే. ఇతని సినిమాల్లో సాధారణంగా కనిపించే సైకడెలిక్ దృశ్య పరంపర గానీ, కథలో సస్పెన్సు గానీ, ఒక ఆతృతూ హడావుడి గానీ ఇందులో లేవు. సినిమా మొదలవడమే చాలా నింపాదిగా మొదలవుతుంది. కథలో ఆవిష్కరించబడే మలుపులు కూడా, మనల్ని పెద్దగా ఆశ్చర్య పరచక పోగా, ఇలా జరుగుతుందని నాకనిపిస్తూనే ఉంది అన్నట్టుంటాయి. అంతర్జాతీయంగా ఖ్యాతి నార్జించిన స్పానిష్ తార పీనలొపె క్రుజ్ తన నటనలో గొప్ప పరిణతిని కనబరిచింది. పొర్లిపోతున్న పాలకుండలాంటి సెక్సపీల్ వొలకబోస్తూనే, తన మనసునావరించుకుని ఉన్న ఒంటరితనాన్ని, విహ్వలతనీ సూచించడంలో కృతకృత్యురాలయింది. మిగతా నటీమణులు కూడా తగినట్టుగా నటించారు. ఆల్మొడవార్ సినిమా కాబట్టి పనిగట్టుకు చూశాను కానీ కాకపోయుంటే నా దృష్టిని బహుశా ఆకర్షించి ఉండేది కాదు., పెద్దగా మిస్సయేవాణ్ణి కూడా కాదు.

కర్ణాటక సంగీతంలో నాకు బాగా ఇష్టమయిన పాటల్లో ఇదొకటి .. స్వాతితిరునాళ్ గా పేరుపొందిన కులశేఖర మహారాజు రచన. కురంజి రాగం. యూట్యూబులో విహరిస్తుంటే ఈ చక్కటి గానం నన్నాకట్టుకుంది. మీరూ చెవొగ్గండి.

Comments

Vani said…
This comment has been removed by the author.
Vani said…
This comment has been removed by the author.
Vani said…
"వార్తా లంగరులు" భలే తెనుగించారే..
నేను సృష్టించింది కాదండీ. మన బ్లాగ్లోకంలో చాలా కాలంగానే వాడుకలో ఉన్న పదబంధం అది. మొదట ఎవరు ఉపయోగించారో గుర్తు లేదు.
వేమన said…
పీటర్ షిఫ్ అనే అతను 2001 నించి మొత్తుకున్నాడు, రిసెషన్ ఒస్తోంది ఒస్తోంది అని.. అప్పుడు పానల్ లో వాళ్ళందరూ నవ్వడమే అర్ధం లేదంటూ...ఇప్పుడు కూడా ఏమీ తేడా లేదు మీడియా వాలకంలో !
ఒబామా మన వైఎస్సార్ ఆరోగ్యశ్రీని కాపీ కొట్టాడా? ఇక్కడ ప్రభుత్వ దవాఖానాలను దివాలా తీయించి, కార్పొరేట్ ఆసుపత్రులకు జీవం పోస్తున్నారు. అక్కడెలాగు అంతా ప్రైవేటు సరుకే కదా?
@వర్మ .. ఇక్కడి ట్రెండు రివర్సులో నడుస్తోంది. ఇప్పుడయినా ఆస్పత్రులూ క్లినిక్కులూ ప్రైవేటే. ఆరోగ్య బీమాకి మాత్రమే ఇప్పుడు తలపెడుతున్న మార్పులు. ఆరోగ్య బీమాలో .. నిర్బంధ బీమా ఉండాలి, ఒక ప్రభుత్వ బీమా పథకం ఉండాలి అనేవి ఇక్కడ రెండు రేడికల్ పాయింట్లు. ప్రస్తుతం రగుల్తున్న రాజకీయ మంటలన్నీ ఈ రెండు పాయింట్ల గురించే.
భావన said…
ఒబామా బాగా స్పీచ్ ఇచ్చాడు.. (కొత్త ఏమి వుంది) -- ఏమొ నేనైతే యూనివర్సల్ హెల్థ్ కేర్ కు నా వోటు వేస్తున్నా.. దాని మూలం గా పని చెయ్యరు జనాలు సుబ్బరం గా సోషల్ సెక్యూరిటీ తీసుకుని ఈ బెనిఫిట్స్ తీసుకుంటారు అని ఒక ఆర్గ్యుమెంట్. అలా చేసే వాళ్ళు ఎలా ఐనా హాస్పిటల్ కు వెళ్ళి వాటిని మూయిస్తూవుంటారు so it doesn't make any difference అని నా ఆర్గ్యుమెంట్. ఏమొ మరి మా అబ్బాయి ఐతే ఏడిపిస్తున్నాడూ నీలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళ దగ్గర ఈ బిల్ పెట్టి నెలకో 500$ తీసుకుంటాడు ఒబామా అప్పుడూ తెలుస్తుంది బాధ అని. (మా వాడు రిపబ్లికన్ లెండి ), ఇంత డెవెలపడ్ దేశం లో పళ్ళ కేవిటీల మూలం గా ఇన్ ఫెక్షన్ వచ్చి వేలలో జనాలు చచ్చి పోతారు అంటే వుసూరు మంటుంది ప్రాణం...
@Bhavana .. yes, I too don't see what is the big hue and cry about universal health (the so called public option). OTOH, I also believe that govt (not just the US variety, but govts in general) possess "bhasmasura hastams" - they have the capacity to burn whatever they touch! Perhaps they should put such program in the hands of a non-profit org.
అళక్కి said…
ఓ చిన్న పిడకల వేట! చెవులకింపుగా వున్నా కూడా, క"ర్నా"టక సంగీతం అంటారేమోగదా!
అళక్కి గారూ, ఏమోనండీ, మీరే రైటయ్యుండచ్చు. చిన్నప్పుడు పుస్తకాల్లో మన పొరుగు రాష్ట్రం కర్ణాటక అనే చదువుకున్న గుర్తు. నేనటెండయిన తెలుగు సంగీత సభల ఆహ్వాన పత్రాల్లోనూ కర్ణాటక సంగీతమనే చదివిన గుర్తూనూ. అందుకని అలా అలవాటైంది. లేదు, కర్నాటకయే సరైనదని మీవంటి పెద్దలంటే .. అలాగే చేద్దాం మరి.
అళక్కి said…
అసలు విషయాన్నొదిలేసి, ఏవిటీ రంధ్రాన్వేషణ అనుకోకపోతే, నాదోచిన్నమాట.

కర్నాటక (ಕರ್ನಾಟಕ), కర్ణాటక (ಕರ್ಣಾಟಕ)- ఈ రెంటినీ స్వేచ్చానుసారం ఇటీవల తెలుగులో వాడడం, మీరెరగనిది కాదు. "కర్నాటక" - సరి; "కర్ణాటక" - అన్న మాట లేదు. "పదుగురాడుమాట పాడియై ధరజెల్లు..." చందాన, ఈ ఒప్పుకాని మాటని, మీబోటి పెద్దలు ఒప్పుకోకూడదని నా కోరిక.
చూ : http://www.karunadu.gov.in/Pages/default.aspx
నత్కీరుడన్నట్టు, శివుడు రాసినా, తలకి చుట్టువార కన్నులున్నా తప్పు తప్పే. అళక్కిగారూ, మీమాటే నా మాట. ఇకనించీ ఈ స్పెల్లింగు విషయంలో జాగ్రత్త వహిస్తాను. సంగీత సంబంధమైన పదమే .. ఇన్నాళ్ళూ శృతి అనుకుంటూ వచ్చాను, కానీ శ్రుతి అని రాయాలని ఇటీవలే, మన బ్లాగుల్లోనే తెలుసుకున్నాను. ధన్యవాదాలు.