Saturday, August 29, 2009

అమెరికా అంటే నాకిష్టం - జాజ్

జాజ్ సంగీతానికి పుట్టినిల్లైనందుకు అమెరికా అంటే నాకిష్టం.
మొదట విద్యార్ధిగా ఈ దేశం వచ్చాక, నా జీవితం ఈ దేశంలో వేళ్ళూనుకోవడానికి జాజ్ సంగీతం కూడా ఒక ముఖ్య కారణం అంటే అందులో అతిశయోక్తి యేమీ లేదు.

అసలు మామూలుగానే సంగీతాన్ని గురించి మాటల్లో చెప్పడం చాలా కష్టం.
ప్లేయింగ్ బై హార్ట్ అనే సినిమాలో ఏంజలీనా జోలీ వేసిన పాత్ర అంటుంది - "Talking about love is like dancing about architecture."
సంగీతం గురించి మాట్లాడబూనడం కూడా అటువంటిదే, నా దృష్టిలో . మాటలకందని భావాన్ని వ్యక్తీకరించాల్సిన ఒక మౌలిక అవసరంలోంచి సంగీతం పుడుతుందని నా అనుమానం, ప్రేమలాగే. మన సాంప్రదాయ సంగీతాలు కొద్దిగా మెరుగు ఈ విషయంలో, ఏదో రాగమనీ శ్రుతి అని మాట్లాడొచ్చు. జాజ్ విషయంలో అదీ కుదరదు. ఇహ చెప్పేదేముంది? అందుకని జాజ్ వినడంలో నా అనుభవాల్ని మాత్రం పంచుకోడానికి ప్రయత్నిస్తా.

ఫిలడెల్ఫియా నగరంలో విద్యార్ధిగా ఉండగా నేను పనిచేస్తున్న పరిశోధనశాలకి అనుబంధంగా ఒక మెషీన్ షాపుండేది. అందులో ముగ్గురు మెకానిక్కులు పని చేసేవాళ్ళు. జేకబ్ అనే పెద్దాయన ఎక్కువగా నా పని చేస్తుండేవారు. మిగతా ఇద్దరూ సాయంత్రం నాలిగింటికల్లా పని ముగించుకుని వెళ్ళిపోయేవారు. జేకబ్ ఆరుదాకా పని చేసేవారు. సాయంత్రం పూట, మిగతా వాళ్ళు వెళ్ళిపోయాక మెషీన్ షాపుకెళ్ళి, నా పని ఎంతవరకూ అయిందో చూసుకోవడమే కాక, జేక్ తో పిచ్చా పాటీ మాట్లాదుతుండడం అలవాటైంది నాకు. ఆయన రెండో ప్రపంచ యుద్ధంలో డ్రైవరుగా మెకానిక్కుగా పని చేశారు. జేక్ తో సంభాషణల్లో అమెరికను సమాజాన్ని గురించీ, జీవన విధానాన్ని గురించీ చాలా విషయాలు తెలుసుకున్నాను. ఆయన తన రేడియో మీద ఎప్పుడూ WRTI రేడియో స్టేషన్ని మోగించేవారు. అలా తొలి పరిచయమైంది జాజ్ సంగీతంతో.

నాకంటూ ఒక బుల్లి పరిశోధనగది కేటాయింపు అయినాక నేనూ ఒక బుల్లి రేడియో కొనుక్కుని రోజంతా అదే స్టేషను మోగిస్తుండేవాణ్ణి. అలా కొందరు గాయకుల, వాద్యగాళ్ల పేర్లు పరిచయమయ్యాయి. డ్యూక్ ఎల్లింగ్టన్, కౌంట్ బేసీ, బెన్నీ గుడ్మేన్, లూయీ ఆరంస్ట్రాంగ్ .. ఇలా. ఒకసారి మిత్రులతో కలిసి పుస్తకాల షాపు కెళ్ళినప్పుడు అక్కడ వీళ్ళ నలుగురివీ నాలుగు సీడీలు కొనేశాను నలభై డాలర్లు పెట్టి (ఎప్పుడూ డబ్బు కటకటే ఆ రోజుల్లో). తమాషా ఏంటంటే అప్పటికి నా దగ్గర సీడీప్లేయరన్నా లేదు!

మెల్లగా సంపాదన పెరిగి ఒక మంచి స్టీరియో కొనుక్కుని నాకిష్టమైన వాద్యగాళ్ళ సీడీలు కొనుక్కోవడం మొదలెట్టాను. ఈ క్రమంలో మరికొన్ని పేర్లు పరిచయమయ్యాయి .. మైల్స్ డేవిస్, థెలోనియస్ మంక్, డిజ్జీ గిలెస్పీ, జాన్ కోల్ట్రేన్ .. రేడియో విటూండడం, ఎవరి వాద్యమన్నా నచ్చితే ఆ పేరు గుర్తు పెట్తుకోవడం, అవకాశం దొరికితే వాళ్ళదో సీడీ కొనుక్కోవడం. ఇలా నా సేకరణ పరిధిలో పరిమాణంలో పెరుగుతోంది.

ఉద్యోగస్తుడిగా డిట్రాయిట్ పరిసరప్రాంతాలకి నివాసం మార్చాక, జాజ్ విషయంలో నాకు కొత్తలోకపు ద్వారాలు తెరుచుకున్నట్టు అయింది. ఆ తలుపులు తెరిచినవారు ఇద్దరు.

మొదటివారు WDET రేడియో స్టేషన్లో రాత్రిపూట నాలుగ్గంటల పాటు జాజ్ సంగీతం వినిపించే ఎడ్ లవ్. ఈయన్ని రేడియో జాకీ, కార్యక్రమ సమర్పకుడు ఇలాంటి మాటలు అనడం శ్రీకృష్ణుణ్ణి పట్టుకుని వేణువూదేవాడు, రథం తోలేవాడు అన్నట్టుగా ఉంటుంది. సుమారు 1960 నించీ జాజ్ పరిణామాన్ని అతి దగ్గరగానూ, అతి లోతుగానూ అధ్యయనం చేసిన ఆచార్యుడీయన. అందుకే జాజ్ ప్రపంచంలో ఈయన్ని ప్రొఫెసర్ అని పిలుచుకుంటారు ముద్దుగా. ఈయన కార్యక్రమం మొదలు పెడుతూ "హలో దేర్! లవ్ హియర్!!" అనే పలకరింపు నాకు గొప్ప ఇష్టం. ఈయన రోజూ చెప్పే కబుర్లూ వినిపించే సంగీతమూ వింటూ పాతతరంలో మరుగున పడిన వాళ్ళనీ, కొత్త తరంలో పైకొస్తున్న వాళ్ళనీ ఎందరో గొప్ప సంగీత కారుల్ని పరిచయం చేసుకున్నాను. జో హెండర్సన్, డేవ్ బ్రూబెక్, ఆర్ట్ బ్లేకీ, చార్లెస్ మింగస్, జో లొవానో, జోష్ రెడ్మేన్, దెనీలో పెరెజ్ .. అనంతం ఈ లిస్టు. ఈయన కార్యక్రమానికి ఎంత పంకానయ్యానంటే, ఏ రోజునన్నా వినలేకపోతే ఆ నాటి కార్యక్రమం టేప్ చేసే ఏర్పాటు చేసుకునేవాణ్ణి.

రెండో మనిషి, కలుసుకున్న కొద్ది నిమిషాల్లోనే నాకు అత్యంత ఆప్తమిత్రుడైపోయిన తోటి జాజ్ శ్రోత, ఓమొవాలే. ఓమొవాలే ట్రినిడాడ్ వాస్తవ్యుడు. మిషిగన్ వివిలో ఆంత్రొపాలజీలో పరిశోధన చేస్తుండేవాడు. ఇప్పుడు ఇండియానా వివిలో ఆచార్యుడు. గొప్ప జాజ్ వినాలంటే రేడియో మీదనే ఆధారపడనవసరం లేదు. అలాగని, వందలకి వందలు సీడీలు కొనక్కర్లేదు అని నాకు హితబోధ చేసి, వివిలో ఉన్న జాజ్ లైబ్రరీ, ఇంకా స్థానిక పబ్లిక్ లైబ్రరీల్లో ఉన్న జాజ్ సంగీతపు నిధుల ద్వారాలు తెరిచాడు. అంతేకాక కనీసం నెలకోసారైనా ఇద్దరం ఒక సాయంత్రమంతా కలిసి కూర్చుని, మాకిష్టమైన సంగీతం వింటూ చర్చించుకుంటూ గడిపేవాళ్ళం. జాజ్ మీద బ్రెజిల్ బోస్సనోవా, ఆఫ్రో క్యూబన్ బీట్స్ వంటి అంతర్జాతీయ సంగీత రీతుల ప్రభావం ఎలా పరిణమించిందో సోదాహరణంగా నాకు పరిచయం చేశాడు. ఈతని సాహచర్యంలో జాజ్ ని కేవలం మనసుతోనే కాకుండా కొంచెం బుర్ర పెట్టి కూడా వినడం నేర్చుకున్నా.

ఇదివరలో గొప్ప గొప్ప సంగీత తారలు కూడా న్యూయార్కు, ఫిలడెల్ఫియా, డిట్రాయిట్, షికాగో వంటి నగరాల్లో నైట్‌క్లబ్బుల్లోతమతమ బృందాలతో ప్రదర్శనలిస్తూండేవారు. కానీ ఖర్చులు పెరిగిపోయి, ఆ రోజులు పోయాయి. అందుకని ప్రత్యక్షంగా వినాలి అంటే కచేరీలకో, లేక వేసవిలో జరిగే పేద్దపేద్ద బహిరంగ సంగీతోత్సవాలకో వెళ్ళాల్సిందే. ఇలా చాలా మంది గొప్ప వాద్యకారుల్నే వినగలిగాను. సెప్టెంబరులో మొదటి సోమవారం అమెరికాలో లేబర్ డే. ఆ సందర్భంగా ఆ వారాంతపు మూడు రోజులపాటు డిట్రాయిట్ నదీతీరంలో గొప్ప జాజ్ సంగీతోత్సవం జరుగుతూంటుంది ప్రతీ యేడూ. ఈ సారి ఉత్సవం .. ఇంకొక్క వారంలోనే .. చాలామంది మహామహులొస్తున్నట్టు వినికిడి.
చెవుల్నీ, బుర్రనీ, మనసునీ ఆయుత్త పరుస్తున్నా, జాజ్ ప్రవాహంలో మునిగి తేలేందుకు.

ఈ వరుసలో ఇదివరకటి టపా .. రేడియో.

Thursday, August 27, 2009

మహారాజకీయ దురంధరునికి అశ్రుతర్పణంఅమెరికను రాజకీయ చరిత్రలో ఒక మహా యుగం ముగిసింది.
సెనేటర్ ఎడ్వర్డ్ కెనడీ కన్ను మూశారు.
ప్రసిద్ధి గాంచిన కెనడీ సోదరులలో ఆఖరివాడు, జాన్, రాబర్ట్ కెనడీల తమ్ముడు.
సుమారు 42 సంవత్సరాలపాటు డెమొక్రాటిక్ పార్టీ తరపున మాసచుసెట్స్ రాష్ట్రం నించి సెనేటరుగా అవిఛ్ఛిన్నంగా ఎన్నికయ్యి, గత శతాబ్దిలో అమెరికా జనజీవన గమనాన్ని నిర్దేశించిన అనేక ముఖ్యమైన పాలసీ విధానాలపై తనదైన ముద్ర వేశారు.
ఒకే ఒకసారి అధ్యక్ష పదవికి పోటీ చేశారు, ఆ తరవాత మళ్ళి దాని జోలికి పోలేదు.
తాను అత్యంత ధనిక కుటుంబ వారసుడైనా, తన రాజకీయ జీవితంలో ఎల్లప్పుడూ సమాజంలోని అట్టడుగు వారిని గురించి ఆలోచించి వారికి సహాయపడేట్లుగా ప్రభుత్వ విధానాలని తీర్చి దిద్దారు.
అవసరమైనప్పుడు అవతలి పార్టీ వారితో చేతులు కలిపి సహకారానికి నిర్వచనంగా నిలిచారు. మరికొన్ని సందర్భాల్లో, తాను నమ్మిన మౌలిక విలువలకి భంగం వాటిల్లినప్పుడు, తన నిర్ణయం ప్రజామోదానికి వ్యతిరేకమైనదైనా సరే, బెదురు చెందక స్థిరంగా నిలబడి పోరాడారు.
ఒక పక్కన బ్రెయిన్ కేన్సరు వ్యాధి నిర్ధారణ జరిగి, బాధ పడుతూ కూడా, ఒబామాకి అధ్యక్షపదవి కట్టబెట్టడంలో ఆలోచనలోనూ, కార్యాచరణలోనూ చురుగ్గా పాలుపంచుకున్నారు.
ఏదైతేనేం, మళ్ళీ ఇలాంటి మేరు నగాన్ని అమెరికను రాజకీయ రంగంపై ఇప్పట్లో చూడబోము.

Monday, August 24, 2009

కబుర్లు - ఆగస్టు 24

అబ్బో, గతవారం చాలా బిజీ ఐపోయింది. బాహ్య ప్రపంచం అంటే ఏవిటో మరిచిపోయేంత బిజీ, చాలా రోజుల .. కాదు, చాలా ఏళ్ళ తరవాత పోయినవారం అనుభవానికి వచ్చింది. అక్కడీకీ, సందు దొరికినప్పుడల్లా మూణ్ణాలుగు బ్లాగులు చదివి ఒకట్రెండు వ్యాఖ్యలు రాస్తూ వచ్చా. కానీ నా టపాలు రాసుకునేందుకు మాత్రం తీరిక చిక్కలేదు.

వేసవి ముగియవస్తున్నదేమో, నాపని మూడు వారాంతాలూ, ఆరు అరంగేట్రాలుగా ఉన్నది. సోమయాజులుగారని పెద్దవారు, చాలా కాలంగా ఇక్కడ కాపురముంటున్నవారు, నాకు మా దేవాలయంలో పరిచయం. విజయవాడ వాణ్ణనో, ఎందుకనో ఆయనకి నేనంటే మంచి అభిమానం. వారి మనుమరాలు చిరంజీవి శిరీష కూచిపూడి రంగప్రవేశం జరుగుతుంటే పిలిచారు పోయిన వారం. గురువు సంధ్యశ్రీ ఆత్మకూరి గారు నా స్నేహితులు కాబట్టి ఆవిడ కూడా పిలిచారనుకోండి. బాగా జరిగింది. ముఖద్వారం దగ్గర అలంకరణ దగ్గరినించీ, ఆడిటోరియంలో రంగాలంకరణ వరకూ ప్రత్యేక శ్రద్ధతో చేసినట్టు స్పష్టంగా తెలిసింది.

కూచిపూడి గురించి, అందులో సోలో ప్రదర్శన గురించి నాకు బొత్తిగా ఏమీ తెలియదు, గనుక నేను శిరీష నాట్యాన్ని విశ్లేషించే సాహసం చెయ్యను. అంశాల ఎంపిక పాతకొత్తల మేలుకలయికగా ఉంది. సంధ్యగారి గురువు వెంపటి చిన్నసత్యంగారి ఆధ్వర్యంలో సమకూరిన రుక్మిణీ కళ్యాణం నాటకం నించి రుక్మిణి ప్రవేశ దర్వుని అభినయింప చేశారు. భుజంగరాయ శర్మగారి కవిత్వం .. సంగీతం కూర్చింది బహుశా పట్రాయని సంగీతరావుగారై ఉండొచ్చు. ఈ అంశం నన్ను బాగా ఆకట్టుకుంది. "ముద్ద గట్టిన వెన్నెలమ్మా, ముద్దు బాలమ్మా, అచ్చపు ముద్దరాలమ్మా" అనే వరుసని పదిసార్లు విశదపరిచి అభినయించడం చాలా బాగా నప్పింది. చివర్లో కుటుంబసభ్యులందరూ విడివిడిగా ధన్యవాదాలు చెప్పబట్టి ఆహూతుల సహనానికి కొంచెం పరీక్ష పెట్టారు కానీ మిగతా అంతా చాలా బాగుంది.

కొన్నాళ్ళుగా నా జీవితంలో ఏర్పడిన సంగీతలేమిని గురించి కొంచెం తీవ్రంగా ఆలోచించి సవరణచర్యలు చేపట్టానని తెలియజెయ్యడానికి సంతోషిస్తున్నాను. ఎప్పటిదో పాత వాక్మేన్ కేసెట్ ప్లేయరు ఇంకా బానే పని చేస్తోంది. దాన్నీ, నా బోషాణంలోంచి ఒక పది రసవత్తరమైన కచేరీల కేసెట్లనీ సతతం అందుబాటులో ఉంచుకుంటూ, చెవులకి బిరడాలు తీసినట్టు మళ్ళీ సంగీతం వింటున్నా. ఇవ్వాళ్ళ పొద్దున ఆరు మైళ్ళ నడకలో వోలేటి వేంకటేశ్వర్లుగారి కచేరీ ఒకటి విన్నా. బేగడలో రాగం తానం పల్లవి. బేగడ మీగడ అంటారు .. అంటే అంత మధురం అన్న మాట. ఈ రాగాన్ని కొంచెం శోధించాలని బుద్ధి పుట్టింది. చేస్తా త్వరలో.

ఇంటొ ఉన్న బుల్లి బుల్లి వినాయకుళ్ళందర్నీ కొలువు తీర్చి, నా చేతుల్తో చేసిన వినాయకుణ్ణి మధ్యలో ప్రతిష్ఠించి, నమక చమకసహితంగా అభిషేకంతోపాటు వరసిద్ధి వినాయకుణ్ణి పూజచేసుకుని ఈ సాయంత్రం ధన్యుణ్ణయ్యాను. పసుపు ముద్దతో చేసిన మా వినాయకుడు ఎంత ముద్దుగా ఉన్నాడో. పోయినేడాది మా యింటి పెరట్లోని బంకమన్నుతో చేశా వినాయకుణ్ణి. ఇలా ఏడాదికో పదార్ధంతో చేసుకుంటు ఉంటే బానే ఉంటుంది, సరదాగా.

ఈ బ్లాగు చదివినవారందరూ సిద్ధివినాయక అనుగ్రహ పాత్రులై వినాయకవ్రతకల్ప ఫలం పొంది, నీలాపనిందలకు గురికాక, ఇష్టకామ్యార్ధసిద్ధులు కాగలరు!

Sunday, August 16, 2009

Haritha's Bharatanatyam Arangetram

Vish and Radhika have been my close friends pretty much throughout my life in the US. When Haritha was born, I think I was the second person to hold her, right after Vish in the corridor outside the delivery ward in that hospital. In my mind's eye, it appears as if all that happened only a few days ago. It seems a marvel to me that Haritha graduated High school this summer and is going to be a freshman at University of Michigan this fall.

Haritha successfully completed her Bharatanatyam Arangetram last evening at the Towsley Auditorium in Ann Arbor.

Haritha has been learning Bharatanatyam from the renowned teacher in Michigan, Smt. Sudha Chandrasekhar, for the past 7 years. As is common with Smt. Sudha's arangetrams, the program started with the very traditional kavutvam. The trideva kavutvam (Ganesha, Kartikeya, Natesa) is a signature piece of this teacher. This followed by alarippu in 5 beat cycle. Jathisvaram, yet another traditional item followed the alarippu. The shabdam chosen for this evening was a song in praise of Kartikeya (Murugan) in Ragamalika. Haritha breezed through them, as if warming up for the main fare of the evening.

The navaragamalika varnam, svamiyai azhaittodi vaa - a gem of an item to come out of the Rajarajesvari school in Mumbai, with choreography by the legendary Dandayudhasvami Pillai, was a treat. The musical and lyrical richness, embedded with deep bhava were very satisfying to the audience. Haritha truly blossomed during the varnam. Her jathi execution was crisp and precise and the sthayi bhava of deep devotion was very moving. I thoroughly enjoyed this item. The first half concluded with the varnam.

The second half contained several contemporary compositions with an experimental tilt as well as traditional items like kshetrayya padam. The gem of the second half was undoubtedly the tamil krithi, Srinivasa Tiruvenkatamudayay. Haritha took time to develop the lovely story of Srinivasa Kalyanam in the exposition of the charanam in this piece. Thillana was a contemporary composition by vocalist, Sri Gopal Venkataraman in Raga Desh and the very complicated misra jaathi ata talam. I think Haritha's training as a blackbelt holder in Taek Won Do helped her in the execution of this item. I can't imagine anyone with less athletic training attempting this piece, much less executing it with such grace as Haritha did. The brief question-answer episode between the drummer's fingers and the dancer's feet regaled the audience.

The program concluded with a very cute kurathi dance, the dance of the female fortune teller from the hills of central Tamil Nadu.

The lasting impression one had at the end of the program was one of devotion. This may be Haritha's devotion to the dance form and her teacher, and indeed to Nataraja himself. Or it may be the devotional sthayi bhava pervading the whole program from start to finish, with a few sancharis of khanditha nayika here, a little bit of humor there. To say Haritha looked very good in her dance costumes and make up is an understatement - she carried the burden very gracefully indeed. Special mentioned should be made of the very striking maroon silk number in which she performed that Srinivasa Krithi. The kurathi costume too was beautiful.

Sri Jayasingam was marvelous as ever on Mrudangam. The male vocalist, and composer of couple of songs performed this evening, Sri Gopal was good. Veena by Praba Thayalan and Flute by Sunita Grandhi provided melodious interludes in the transition spaces. It is a pleasure to watch local talented young vocalists being given a chance to prove their mettle - congratulations to the Rajkumar sisters (Kritika and Akshaya) for doing a very good job. However - this is my personal peeve - Smt. Vidhya, the lead female vocalist's antics on stage and the cutesy program announcements may be toned down a bit. Arangetram is certainly a challenge and test to the young dancer. Yet, it is also the exposition of an art form, one of the finest, a search for the ultimate aesthetic, and a beginning of discovery. Listening to Smt. Vidhya gave me an impression that perhaps Haritha was competing in 400 meter relay race or pole vault - not Bharatanatyam!

Kudos to Smt. Sudha one her 70th arangetram in her illustrious teaching career. Madam, you are a boon to the young people of Southeast Michigan, instilling both discipline and a search for beauty in them, and constantly inspiring them to reach greater heights.

I have had the pleasure of watching Haritha grow up from a toddler to child to an audacious adolescent to a tenacious teenager. Now she is a confident and accomplished young woman. It amazes me how such a young person is so focused and clear-headed, and yet so kind and humble. Eighteen years ago, I held the tiny little infant in my arms in the hospital corridor, and marveled at the power of creation. Yesterday, I beheld this accomplished young woman bubbling with life, and marveled at the power of creation.

Haritha, God bless you!

Saturday, August 15, 2009

అలరించిన తానా సావనీరు

2009 షికాగో తానా మహసభల జ్ఞాపిక తెలుగుపలుకు సర్వాంగ సుందరంగా అలరిస్తోంది. సావనీర్ కమిటీ సభ్యులూ, ఎడిటర్లూ, ఇతరత్రా సహాయం చేసిన యావద్బృందానికీ అనేకానేక అభినందనలు. చదువరులకి సులభంగానే తెలుస్తుంది దీన్ని రూపొందించడంలో చాలా ఆలోచన జరిగిందనీ, తీర్చి దిద్దడానికి అకుంఠిత కృషి జరిగిందనీ.

సాధారణంగా ఈ సభలకి ముద్రించే సావనీర్లు పూర్వకాలం కాలేజీ ఏన్యువల్ మేగజీన్లకి కొంచెం పైస్థాయిలో ఉంటూ వచ్చినా, రచనల్లో అదే సమన్వయ లోపం, పుస్తకం కూర్పులో అదే గందరగోళం. ఈ జ్ఞాపికలో అలా కాక, స్పష్టంగా ఒక ప్రణాళికతో కార్యవర్గం నడుం బిగించినట్టు అర్ధమవుతోంది.

చిత్రకళకి పెద్దపీట


పుస్తకంలో మొదటే కొట్టొచ్చినట్టు కనబడేది చిత్రకళ విభాగం. పై అట్టతొ మొదలు పెట్టి, సుమారు 30 వర్ణ చిత్రాల్ని పూర్తిరంగుల్లో పునర్ముద్రించారు. పాపులర్ ఆర్టిస్టులయిన బాపు, వడ్డాది పాపయ్య, అలనాటి మహామహులు దామెర్ల, మా. గోఖలే, అంతర్జాతీయంగా పేర్గాంచిన కృష్ణారెడ్డి, ఎస్వీ రామారావు, నేటివిటీని అందల మెక్కించిన వైకుంఠం, ఏలే లక్ష్మణ్, ఇప్పుడిప్పుడే ఎదిగి వస్తున్న అక్బర్, గిరిధర గౌడ్ ప్రభృతులు మనకి దర్శనమిస్తారు. ఈ విభాగంలో కృష్ణారెడ్డిగారి అద్భుతమైన ప్రింట్ మేకింగ్ కళని గురించి డా. జంపాల చౌదరి పరిచయ వ్యాసం, సాంప్రదాయ చిత్రకళ ఆధునికతని సంతరించుకుంటున్న తీరుని గురించి కాండ్రేగులా నాగేశ్వర్రావు విశ్లేషణ, మద్దాలి సీతారాం ఫొటోగ్రఫీ పరిచయం చాలా బాగున్నాయి. చిత్రకారుల క్లుప్తపరిచయాలివ్వడం కూడా బాగుంది. సావనీరు వెనక అట్ట మీద తెలుగు సాహితీ మూర్తుల శిరస్సుల్ని మౌంట్ రష్మోరుకెక్కించిన ఉదంతం ఇదివరకే ప్రస్తావించాను.

ఈ చిత్రకళా విభాగాన్ని గురించి అభినందనలు తెలుపుతూ ముఖ్య సంపాదకులు జంపాల చౌదరి గారితో ముచ్చటించినప్పుడు మరి కొన్ని వివరాలు తెలిపుతూ ఈ చిత్ర విభాగానికి తానే పూర్తి బాధ్యత వహించానని చెప్పారు. ఐతే దీన్నింత సర్వాంగ సుందరంగా మలచడంలో చప్పట్లన్నీ సహసంపాదకుడు వాసిరెడ్డి నవీన్ (హైదరాబాదు) కు చెందుతాయని చెప్పారు. ప్రింటుకి ముందు జరగాల్సిన కార్యక్రమం అంతా "అక్షర" సీత (హైదరాబాదు) నిర్వహించారు. ప్రింటు నాణ్యతని పలువురు మెచ్చుకున్నా, తనకి పూర్తిగా సంతృప్తి కలగలేదనీ, ఇంకొంచెం ప్రూఫులు పరీక్షించే సమయం ఉంటే క్వాలిటీ మెరుగు పరిచి ఉండొచ్చనీ అభిప్రాయ పడ్డారు. ఇది ఆయనలోని పర్ఫెక్షనిస్టు మాట్లాడ్డం. నేను చెబుతున్నా .. బొమ్మలు చాలా చక్కగా వచ్చాయి.

సాహిత్య దిగ్గజాలకి అక్షర నీరాజనం


ఆధునిక తెలుగు సాహిత్యానికి దిశానిర్దేశం చేసిన మహామహులు నలుగురికి ఈ ఏడాది శతజయంతి సంవత్సరం కొద్ది నెలల తేడాతో. వీరిని స్మరించుకుంటూ వారి ప్రతిభని జీవితాల్ని గుర్తు చేసుకుంటూ పట్టిన శతజయంతి నీరాజనం ఈ జ్ఞాపికలో మనల్ని ఆకట్టుకునే రెండో అంశం. అంతే కాదు, సాహితీ పిపాసులకి తృప్తినిచ్చేది కూడా. శ్రీశ్రీ, కొడవటిగంటి కుటుంబరావు, నార్ల వెంకటేశ్వర్రావు, త్రిపురనేని గోపీచంద్ .. ఒక్కొక్కరిని గురించీ, ముందుగా వారి రచనని సమగ్రంగా సమీక్షించే పరిచయ వ్యాసం, అటుపైన వారి రచనా వైవిధ్యాన్నో, జీవిత విశేషాలనో పంచుకునే ఆత్మీయ కథనాలొకటి రెండు, పిమ్మట వారి రచనలు ఒకటి రెండు .. ఇదీ వరస. శ్రీశ్రీ కవిత్వానికి ఇవ్వాళ్ళ ఉన్న విలువ ఏమిటి అని తూకం కట్టిన పాపినేని శివశంకర్ గారి వ్యాసం వీటన్నిటిలోకీ విలువైనది. కొకు రచనల్ని గురించి వోల్గా గారి వ్యాసంలో మార్క్సిస్టు సిద్ధాంత ప్రవచనం ఎక్కువై రచనా విశ్లేషణ వెనకబడిన దరిమిలా ఇది మార్క్సిస్టు ప్రాథమిక పాఠంలా అనిపించింది. నార్ల సంపాదకీయ పటిమని గురించి పొత్తూరి గారి వ్యాసం క్లుప్తంగా ముచ్చటగా ఉంది, నార్ల కలం పదును అసలు పరిచయం లేని ఈ తరానికి ఇది చక్కటి పరిచయం. చివరిగా గోపీచంద్ సాహిత్య జీవితాన్ని పరిచయం చేసిన మృణాళిని గారి వ్యాసం అతి పేలవంగానూ, గజిబిజిగానూ ఉంది. వ్యాసం మొత్తానికి ఒక లక్ష్యం లేకపోవడం అటుండగా, పదోతరగతి విద్యార్ధుల రాతని తలపించే వాక్యనిర్మాణం నన్ను విభ్రాంతికి గురిచేసింది. ఈ వ్యాసకర్త తెలుగు వివిలో ఆచార్యులు అంటే నమ్మడం కష్టం. మరి ఇంత అధ్వాన్నమైన వ్యాసాన్ని సంపాదకులు ఎలా స్వీకరించారో!

ఈ విభాగంలో శ్రీశ్రీ కథ అశ్వమేధం, కొకు కథ ఫోర్త్ డైమెన్షన్, నార్లవారివి రెండు సంపాదకీయాలు (ఒకటి ఆంధ్ర రాష్ట్రావతరణ సందర్భంలో రాసినది), గోపీ చంద్ కథ జనానా మనల్ని పలకరించి అలరిస్తాయి. అమెరికా పర్యటనలో శ్రీశ్రీ పిట్స్‌బర్గ్ తెలుగువారినుద్దేశించి చేసిన ప్రసంగ పాఠం, శ్రీశ్రీని గురించి ఇజ్రయెలీ సాహిత్య విమర్శకుడు జాన్ మిర్డల్ ఆంగ్ల వ్యాసం ప్రత్యేక ఆకర్షణలు. ఇవన్నీ ఇలా ఉండగా, వీరితో తమ ఆత్మీయసంబంధాన్ని నెమరు వేసుకున్న జ్ఞాపకాల కథనాలు (శ్రీశ్రీ తనయుడు వేంకటరమణ, కొకు భార్య వరూధిని గారు, నార్ల గురించి ఎస్వీ రామారావుగారు, గోపీచంద్ తనయుడు సాయిచంద్) ఈ మహనీయుల్లోని సజీవమానవత్వాన్ని మన కళ్ళముందు నిలబెడతాయి.

(ఇంకా వుంది)

Thursday, August 13, 2009

సరికొత్తగా పలకరించే పాతమిత్రులు

మా అమ్మావాళ్ళింటో అందరమూ దక్షిణభారత హిందీ ప్రచారసభ పరీక్షల ఘనాపాఠీలము. అందరమూ అథమాధమం ప్రవేశిక దాకా పేసయ్యాం.

ఈ ఉద్యమానికంతా ఆద్యులు మా అప్ప (మా నాన్నగారు). ఆయన పుట్టుకతో తమిళుడైనా, భాషా జిజ్ఞాస మెండు. ఆంధ్రా లొయొలా కాలేజిలో బోటనీ హెడ్డుగా ఉద్యోగంలో చేరి, మా అమ్మని పెళ్ళాడి, విజయవాడలో కాపురం పెట్టాక ఆయనకి హిందీ నేర్చుకోవాలని కోరిక పుట్టింది. అప్పటికప్పుడు ఓనమాల దగ్గర్నించి మొదలెట్టి నాకు ఊహ తెలిసే సమయానికి (అంటే ఒక పదిహేనేళ్ళ కాలంలో) చిట్ట చివరి పరీక్ష ప్రవీణ కూడా పేసయ్యారు. ఆయన తన చదువు కోసం కొన్న పుస్తకాలు అలా ఇంట్లో ఉండడంతో మాకందరికీ ఒక వయసు రాగానే ప్రాథమిక తో మొదలెట్టి వరసగా లాగించి పడేసేవారు. ఈ సిలబసూ పుస్తకాలూ ఆట్టే మారేవి కావు. రాష్ట్రభాష పరిక్షకి అనుకుంటా మా అప్ప చదువుకున్న ఫులవారీ కవితా సంకలనమే నేణూ చదూకున్నా.

ఏదో చెప్పబోయి ఏవిటో చెప్పుకొచ్చా. అసలు సంగతేవిటంటే, ప్రవేశికలోనో విశారదలోనో మాతృభాషా సాహిత్యమ్మీద ఒక పేపరుండేది. మరి మా అప్పకి మాతృభాష తమిళం కాబట్టి ఆయనది తమిళంలో రాసుండాలి. మా అమ్మ కోసమో, మా పెద్దక్కయ్య కోసమో ఈ పరీక్షలకి సంబంధించిన తెలుగు కథల పుస్తకం ఒకటి మా యింట్లో ప్రవేశించింది. నాకప్పుడు ఎనిమిదో తొమ్మిదో ఉంటై. కథలంటే పిచ్చి. ఆ పుస్తకం నాకు చిక్కితే యధాలాపంగా తెరిచి వచ్చిన కథ చదవడం మొదలు పెట్టాను. ఒక పల్లెటూరబ్బాయి, తొలిసారి నగరానికొచ్చి, అక్కడ ఒక కేంటీన్లో టిఫిను తినడంతో కథ మొదల్వుతుంది. ఆ కథలో వాతావరణం అంతా ఏదో కొత్తగా అనిపించింది నాకు. ఆ తినుబండారలన్నిటికీ పావ్ ఉసల్ అనీ, భజ్యా అనీ తమాషా పేర్లు. ఇంతకీ ఆ కుర్రాడు అక్కడ ఒక ఫేక్టరీలో కార్మికుడుగా చేరి డబ్బు సంపాయించి పల్లెలో ఇంటికి పంపుతూ ఉంటాడు. అలా చాలా దూరం నడుస్తుంది కథ.

నేను చాలా పెద్దవాణ్ణయ్యాక, కొకు కథల సంపుటులు చదువుతుంటే దాని పుటల్లోంచి అకస్మాత్తుగా నా ముందుకెగిరి పలకరించాడు ఆ పల్లెటూరబ్బాయి, విఠల్. కథ పేరు కొత్తజీవితం. అదే కేంటీను, అవే పావ్ ఉసల్, భజ్యా. నిజంగా చిరకాలమిత్రుణ్ణి అకస్మాత్తుగా కలుసుకున్నంత ఆనందం కలిగింది నాకు. ఎంత ఆశ్చర్య పోయానో .. నేనప్పుడెప్పుడో చదివిన ఆ కథ కొకుదా? ఆ విఠల్ కొకు సృష్టా? అందుకే అంతబాగా గుర్తుండి పోయాడు కాబోలు.

అటువంటి మిత్ర పునర్దర్శనమే మళ్ళీ ఈ మధ్య తటస్థించింది. నేను డ్రెక్సెల్ వివిలో విద్యార్ధిగా ఉన్న రోజుల్లో, మా విద్యార్ధులందరం కూచోడానికి లాబ్ భవనం బేస్మెంటులో ఒక విశాలమైన జాగా ఉండేది. అక్కడ పూర్వ విద్యార్ధులు వదిలి పోయిన అనేక నవలలూ, పత్రికలూ ఉండేవి. నవలలు బహుశా అన్నీ చదివేశాను నేనక్కడ ఉన్న కాలంలో. చాలా వాటికి పై అట్టలుండేవి కావు. అలా చదివిన నవలల్లో ఒక సైన్సు ఫిక్షను నవల్లోని కొన్ని విశేషాలు భలే గుర్తుంది పోయాయి. ఒక అంతరిక్ష నౌక ఒక వింత గ్రహానికి వెళ్తుంది. మానవ నౌకకి నాయకత్వం వహించిన కేప్టెను తనని తాను రిలాక్స్ చేసుకోడానికి క్లిష్టమైన డిఫరెన్షియల్ ఈక్వేషన్లని మనసులోనే సాల్వ్ చేస్తుంటాడు. ఆ గ్రహవాసులు తమని తాము ఫ్యుంచ్ క్లిక్ అని పిల్చుకుంటారు. వాళ్ళకి ఒక వేపు రాతి గదలాంటి ఒక బలమైన చెయ్యీ, రెండో వేపు అతి నాజూకైన రెండు చేతులూ ఉంటై. వాళ్ళు ఎటువంటి ఇంజనీరింగ్ పరికరాన్నైనా అతి త్వరగా తమ అవసరానికి తగినట్టు మార్చేసుకోగలరు. ఇలాంటి చిన్న చిన్న విషయాలు ఎన్నో అలా గుర్తుండి పోయాయి.

ఈ మధ్యన మంచి సైన్సు ఫిక్షను చదవాలనే కోరిక మళ్ళీ తిరగబెట్టి లైబ్రరీనించి ఒకదాణి తరవాత ఒకటి ప్రసిద్ధి గాంచిన సైఫై నవలల్ని తెచ్చి చదువుతూ వచ్చా. ఆ క్రమంలో మళ్ళీ నన్ను పలకరించారు, కేప్టెన్ బ్లెయిన్, మరియూ ఫ్యుంచ్ క్లిక్ అనబడే మోటీలు. భలే ఆశ్చర్యం వేసింది .. ఎన్నాళ్ళ కెన్నాళ్ళకు? సుమారు పదిహేనేళ్ళ తరవాత!

చిరకాల మిత్ర పునర్దర్శనం బహు ఆనందదాయకం. అనుకోకుండా అకస్మాత్తుగా జరిగితే, ఇక చెప్పాలా? ఆ ఆనందం ఉక్కిరిబిక్కిరి చేసేస్తుంది.

Wednesday, August 12, 2009

సాహిత్యంలో మెజారిటీ జులుం

ఇటీవల ఒక తెలుగు కథ గురించి విపులంగా, నిశితంగా, ఆవేశంగా జరిగిన చర్చల్లో ఒక వింత పాయింటు నా దృష్టిని ఆకర్షించింది.
ఇదీ ఆ పాయింటు సారాంశం - ఈ కథలో పాత్రలాగా ఎవరూ ఉండరు, అలా ఎవరూ ప్రవర్తించరు, ఒకేళ ఉన్నా చాలా తక్కువ మంది ఉంటారు, ప్రపంచంలో 99 శాతం ఇలా ఉండరు.

మన సమకాలీన జీవితంలో మెజారిటీ అభిప్రాయానికి చాలా విలువుంది. ఎంతైనా ప్రజాస్వామ్యాన్ని తలకెత్తుకున్న వాళ్ళం కదా. సమాజంలోనూ రాజకీయాల్లోనూ సరే, మరి సాహిత్యంలోనూ ఈ మెజారిటీ వాదన చెల్లుతుందా అని నాకో అనుమానం వచ్చింది.

పురాణాల సంగతి అట్లా పెడితే, మనుచరిత్రలో ప్రవరుడి వంటి పురుషులు ఆనాడైనా, ఈనాడైనా ఎంతమంది ఉంటారంటారు? పోనీ ఆముక్తమాల్యదలో గోదాదేవి వంటి స్త్రీలు? అబ్బ, వాళ్ళంతా రాచరికపు యుగం వాళ్ళూ పోనివ్వండంటరా, అర్జంటుగా ఆధునిక యుగానికే వచ్చేద్దాం.

కన్యాశుల్కంలో గిరీశాన్నో మధురవాణినో మీరెన్నిసార్లు చూశారు? బారిష్టరు పార్వతీశం కనిపించాడా ఏ మొగల్తుర్రు రోడ్డుమీదైనా? దయానిధి మీ పక్కింట్లోనో, సీతారామారావు మీ ఎదురింట్లోనో కనబళ్ళేదుగా ఎప్పుడైనా? రావి శాస్త్రి గారి విమల (మూడుకథల బంగారం) గానీ, రంగనాయకమ్మగారి విమల (స్వీట్ హోం) గానీ తారసపడ్డారేవిటి విశాఖపట్నం పూర్ణామార్కెట్టు దగ్గర?

అసలు సంగతేంటంటే గొప్ప సాహిత్యం ఎప్పుడూ ఏదో ఒక కారణంగా అసాధారణమైన వ్యక్తుల్ని గురించే పట్టించుకుంటుంది. పోనీ సాధారణ వ్యక్తుల్లోని అసాధారణ లక్షణాల్ని గురించే పట్టించుకుంటుంది. అంచేత ప్రపంచంలో నూటికి తొంభైతొమ్మిది మంది సాహిత్యంలో పాత్రల్లా ఉండరు. దాన్నే తిప్పి చెబితే, సాహిత్యంలో పాత్రలు ప్రపంచంలోని నూటికి తొంభైతొమ్మిది మందిలాగా ఉండవు. ఇంకా గట్టిగా చెబితే ఎక్కడో లక్షల్లోనో కోట్లలోనో ఒక్కరైన అసాధారుణుల్ని గురించే సాహిత్యం పట్టించుకునేదీ, పాత్రలుగా నిలబెట్టేదీనూ. ఎందుకంటే బిర్రబిగుసుకున్న సమాజాన్ని తట్టిలేపేదీ, ముందడుగు వెయ్యమని ముల్లుగర్రతో పొడిచేదీ వాళ్ళే.

కోటిలో మిగతా తొంభైతొమ్మిది లక్షల తొంభైతొమ్మిది వేల తొమ్మిదివందల తొంభైతొమ్మిది మంది ఉన్నట్టే సాహిత్యంలో పాత్రా ఉంటే, ఇహ చెప్పేదేవుందీ?

Tuesday, August 11, 2009

పోటెత్తిన అలలమీద ఎగుర్తున్న సీతాకోక చిలుకలు

సీతాకోకచిలుకలు అనే టైటిలుతో .. నేను స్వప్నించటం మరిచిపోయినప్పుడల్లా నా కళ్ళపై దయగా వచ్చి వాలుతుందొక సీతాకోకచిలుక. ఒక కలని, కాసింత కవిత్వాన్ని కానుకగా ఇచ్చిపోతుంది .. అనే పంక్తులతో మొదలై ..

87 పేజీల తరవాత

భూమిహీన బ్రెజిల్ కార్మికుడి నాగలిపై నక్ష్త్రంలా
బొలీవియన్ నీటియుద్ధాన విరిసిన ఇంద్రధనుస్సులా
వెరపెరుగని వెనిజువెలా సవాలులా
మెక్సికో జపటిస్తా జనగర్జనలా
అర్జెంటీనా, చిలీ, పెరూ, కొలంబియా నికరాగువాల్ని చుట్టి ఏ అమెజాన్ అడవుల వెన్నెలై కాసావ్
నీ సుందర హృదయం నా కన్నుల నిండగ
నేనేమైనా, నేనేమైనా, అలసి ఆగినా
ఓ నా ప్యారీ జాన్
నువ్వొక అద్భుత మురిపెం నాకు .. అనే పంక్తులతో, ఓనా ప్యారీ జాన్ అనే టైటిల్తో ముగిసింది.

ముఖ చిత్రమ్మీద జపనీయుడు కట్సుషికా రంగులద్దిన అల మీద ఒక సీతాకోకచిలుక ఎగుర్తున్న దృశ్యం.

పేరు మృగన
రచన విమల
ఉపోద్ఘాతాలూ పరిచయాలూ విశ్లేషణలూ ఏం లేవ్. ఉన్నదల్లా కవిత్వమే.
ఎర్రటి కవిత్వం, చిక్కటి కవిత్వం.
ప్రతి పద్యానికీ ఒక చిన్న చిత్రీకరణ మోహన్ గీతల్లో మృదు గంభీరంగా.
ప్రతులు విశాలాంధ్రలో .. యాభై రూపాయలే!

Saturday, August 8, 2009

శనివారం కబుర్లు

సీరియల్ కథ ముగిసింది.
చనువున్న మిత్రులు కోప్పడ్డారు, ఈ సీరియల్ ఏంటి, అంతా ఒకేసారి పెట్టొచ్చుగా అని. ఒకరైతే ఏకంగా నాలుగు భాగాల్నీ క్రోడీకరించి పీడీఎఫ్ చేసి scribDలోకెక్కించి ఆ కోడ్ కూడా పంపించారు. వారి అభిమానానికి నమస్తే!

ఏంటి కథచదివిన భక్తజనులెవరూ మాట్లాడ్డం లేదు? మరీ షాకిచ్చేంత ఘోరంగాలేదనే నేననుకున్నా. బాగుందనో, లేక ఫలాని పార్టు నప్పలేదనో ఒక ముక్క చెబితే చాలా సంతోషిస్తా. ఇది కామెంట్లు దండుకునే ట్రిక్కు కాదు, నిజంగా పాఠకుల అభిప్రాయం తెలుసుకునేందుకే.

తోచీ తోచనమ్మ తోటికోడలు పుట్టింటికెళ్ళిందని సామెత.

శ్రావణమాసంలో ఆడాళ్లందరూ ఇంచక్కా శుక్కురార పేరంటాలకీ, ఆడా మొగా కలిసి పెళ్ళిళ్ళకీ హాజరైపోతూ ఉంటే, ఇక్కడ ప్రవాసంలో ఏ సంబరాలూ లేకుండా కూచున్న నేను, శనారం పొద్దున్నే లేచి కూచుని, ఏమీ తోచక, నా బ్లాగుల్నే పాత టపాలన్నీ ఒకసారి తిరగేస్తూ ఉంటే ..

ఏంటో నా రివ్యూల బ్లాగుని చూస్కుని కడుపు తరుక్కు పోయింది. నాకిష్టమైన వ్యాపకాలు, సంగీత శ్రవణం, పుస్తక పఠనం, సినిమా వీక్షణం .. వీటిని గురించి రాసుకోడానికి పెట్టుకున్న బ్లాగది. సినిమాలు చూసేస్తున్నాను గానీ ఏవీ రాయట్లేదు. పుస్తకాలు చదివేస్తున్నాను గానీ ఏవీ రాయట్లేదు. సంగీతం .. హమ్మ్, నా జీవితంలో అకస్మాత్తుగా ఏర్పడిన సంగీత లేమిని గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ఇంతోటి రాయనిదానికి మళ్ళీ వీటికోసం వేరేగా ఇంకో బ్లాగెందుకు, ఈ ఖాళీ బ్లాగుని చూసినప్పుడల్లా కడుపు ఇంకాస్త తరుక్కు పోడానికి కాకపోతే నని .. విన్నవీకన్నవీ బ్లాగుని ఆపేస్తున్నా ఇవ్వాళ్టితో. ముందు జాగ్రత్తగా అందులోని టపాలన్నీ ఈ బ్లాగులోకి ఎక్కించేశా కామెంటుల్తో సహా.

మొన్ననే ఈ పుటల్లో నమ్మకం గురించి మాట్లాడుకున్నాం. ఒక్కోసారి అవతలి వాళ్ళకి మనమీదున్న నమ్మకం భలే పట్టి కుదిపేస్తుంది. ఒక స్నేహితుణ్ణి అతను బసచేసిన చోటినించి కారెక్కించుకుని ఇంకోచోటికి తీసుకు వెళ్ళల్సొచ్చింది. ఆయనకి పొద్దుటే కాల్చేసి ఫలాని సమయానికి అక్కడ ఉంటాను అన్నా. మళ్ళీ ఎందుకన్నా మంచిది అని ఇంటో బయల్దేరేముందు కాల్చేస్తానన్నా. మొదట చెప్పిన సమయానికి గంట ఆలస్యంగా చేరాను ఆయన ఉన్న చోటికి. ఆయన కనబడుతూనే, ఏమైందంటే .. అని మొదలెట్టాను. చెయ్యెత్తి నన్ను ఆగమన్నట్టు సైగచేసి, మీరేం చెప్పక్కర్లేదు, మీరు లేటయ్యారంటే ఏదో బలమైన కారణం ఉండే ఉంటుంది అన్నారాయన. డంగైపోయా. పోయిన శనారం ఇలాగే పొద్దున్నే లేచి డాన్సు క్లాసుకెళ్ళాలి. అస్సలు లేవబుద్ధి కాలా. మా గురువుగారికి కాల్చేసి, చేతికందినంత నిద్రని గొంతులో నింపుకుని, రాలేనండీ అన్నా. ఆవిడ ఎంతో హుందాగా, పోనీలే ఇంకోపూట కలుద్దాం అన్నారు. నాకే కొంచెం కూట్టి, ఏమైందంటే .. అని మొదలెట్టా. ఆవిడ వెంటనే, ఏం పర్లేదోయ్, ఇంకో పూట కలుస్తాముగా! అన్నారు. మళ్ళీ అవాక్కయ్యా.
మొన్ననే చెప్పుకున్నట్టు, నమ్మకం నిలబెట్టుకోడం అంత సులభం కాదు.

పొద్దుణ్ణించీ ముసురు, సన్నగా వాన. ఇవ్వాళ్టికి వొదిలేలా లేదు. ఏంటో అసలీ సంవత్సరం వేసవి వచ్చినట్టే లేదు. పట్టుమని ఒక్క రోజు కూడా తొంభై డిగ్రీలు దాటిన పాపాన పోలా. మళ్ళి చూస్తూ చూస్తుండగానే ఆకురాలు కాలం వచ్చేస్తుంది.

ఇవ్వాళ్ళ సొన్యా సొటొమయోర్ సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా ప్రమాణస్వీకారం చేస్తున్నారు. తొలి లటీనో మహిళ. వారికి అభినందనలు. ఆవిణ్ణి ఈ పదవికి ధృవపరిచే తతంగం వ్యక్తిగత కంకాళాల బీభత్స దృశ్యాలేవీ బయటపడకుండా జరిగినందుకు హమ్మయ్య అనుకున్నా.

ఈ మధ్యన కొత్తవీ పాతవీ అన్నీ కలిపి చాలా తెలుగు కథల పుస్తకాలు చదివా. కథకులుగా కొమ్ములు తిరిగిన వాళ్ళవీ, పేర్గాంచిన వాళ్ళవీ, అభ్యుదయులవీ, విప్లవులవీ, ఇంకా ఎదుగుతున్న వాళ్ళవీ .. కానీ చాలా వెల్తిగా అనిపించింది. ఏంటీ చెత్త కథలు అనికూడా అనిపించింది చాలా సార్లు. ఇంతలో మొన్న నవోదయ నించి వచ్చిన బంగీలో పాలగుమ్మి పద్మరాజు గారి కథల సంపుటం బయటపడింది. ఈయన్ని గురించి గాలివాన, పడవప్రయాణం కథలు తప్ప వేరేమీ తెలీదు ఇప్పటిదాకా. ఓ ఉదయంపూట టీ చప్పరిస్తూ, కొత్త బ్లాగులేం కనబడక యధాలాపంగా పుస్తకం మధ్యలోకి తెరిచి ఒక కథ చదివాను. ఆ పూట ఆఫీసుకెళ్ళడం ఆలస్యమయింది.

అదీ సంగతి ప్రస్తుతానికి. మళ్ళీ కలుద్దాం

Friday, August 7, 2009

నీవేనా నను తలచినది - ఆఖరు

June 13, 2008 Friday, 8:29 PM

బర్టన్ మేనర్ ఏదో ఫైవ్ స్టార్ హోటల్లో గ్రాండ్ బాల్రూం లాగా అలంకరించి ఉంది. గోడలకీ, స్తంభాలకీ డెమొక్రాటిక్ పార్టీ రంగులు, అమెరికన్ జాతీయ పతాకం రంగుల్లో రిబ్బన్లు వేలాడుతున్నాయి. అందంగా అమర్చిన అనేక భోజన బల్లల మధ్య జాగాలో సుమారు ఐదొందల మంది చిన్న చిన్న గుంపుల్లో కబుర్లు చెప్పుకుంటున్నారు. మగవారందరూ జాతి భేదం లేకుండా టక్సీడో, నల్ల బౌ టై లు ధరించారు. కొందరు భారతీయ స్త్రీలు చక్కటి చీరల్లో సింగారించుకుని ఉండగా, ఇతర స్త్రీలు ఆకర్షణీయమైన డ్రెస్సుల్లో ఉన్నారు.
మొత్తానికి ఓక్లాండ్ కౌంటీలో ధనికులుగా, తమతమ రంగాల్లో విజయం సాధించిన వారుగా పేరుమోసిన భారతీయ స్త్రీపురుషులు చాలా మంది అక్కడ ఉన్నారు.

అనేకులు తనకి పరిచయస్తులూ, కొందరు మంచి స్నేహితులూ కావడంతో మాధవి ఆ గుంపుల్లో పూర్తిగా మునిగి పోయింది. తేజా ఒక పక్కన నిలబడి పేంటు జేబుల్లో చేతులుంచుకుని ఆ సందోహాన్ని చూస్తున్నాడు. కొంత దూరంలో మిషిగన్ సెనేటర్ కార్ల్ లెవిన్‌ని గుర్తు పట్టాడు. ఒక టీవీ న్యూస్ సంధాతని కూడా గుర్తు పట్టాడు. కొంచెం బోరుగా ఉంది కానీ ఈ సందోహం అంతా చూస్తూంటే వినోదంగా కూడా ఉంది. అదీ కాక శత్రు శిబిరం వాళ్ళు ఏమనుకుంటున్నారో తెలుసుకోడానిక్కూడా ఇది మంచి అవకాశం అనుకున్నాడు. అనుకుని తనకు తానే నవ్వుకున్నాడు, అక్కడికి తనేదో రిపబ్లికన్ పార్టీకి గూఢచారి అయినట్టు.

ఇంతలో మాధవి సుడిగాలిలా వచ్చి తేజా జబ్బ పట్టుకుని డ్రింక్స్ ఉన్న టేబిల్ దగ్గరికి తీసుకెళ్ళింది. టేబుల్ దగ్గర అటు తిరిగి పొడుగ్గా ఉన్న ఒకమ్మాయి డ్రింక్స్ సెర్వ్ చేస్తున్న తెల్ల పిల్లతో ఏదో మాట్లాడుతోంది. వెనక నించి చూస్తే బుజాల కింది దాకా ఉన్న ఆమె నల్లటి జుట్టు ఫేషనబుల్ గా కట్ చేసి ఉంది. మనిషి సన్నగా, పొడుగ్గా ఉంది. రంగు రంగుల్లో చెంకీ పని చేసిన లేత నీలం రంగు షిఫాన్ చీర కట్టుకునుంది. ఆమె వేసుకున్న రవిక వీపు భాగం కూడా ఆమె శరీరాకృతికి తగినట్టు ఫేషన్‌గా కుట్టి ఉంది.

మాధవి చనువుగా వెనకనించే ఆ అమ్మాయి భుజమ్మీద చెయ్యేసి, "కామూ, ఐ వాంట్యూ టు మీట్ సంబడీ" అంది.

ఆ అమ్మాయి పక్కకి తిరిగి "హాయ్ ఆంటీ" అని మాధవి బుగ్గ మీద పల్చటి ముద్దు పెట్టి, పూర్తిగా వెనకి తిరిగి తేజని చూసింది.

"కామూ, దిసీజ్ మై సన్, తేజ. తేజా, దిసీజ్ కామ్య!"

ఆ అమ్మాయి కనుబొమల మధ్య చిన్న మెరుపు తీగలాంటి బొట్టు బిళ్ళ, సెంటర్ కి కొంచెం పక్కగా, వంకరగా ఉంది.
తేజా నోటి వెంట మాట రాలేదు, కానీ ఆ బొట్టు బిళ్ళని సరిదిద్దాలని అతని చేతులు మహా దురద పెట్టేస్తున్నాయి.
***
June 21, 2008 Saturday, 10:00 AM

బ్లూంఫీల్డ్ హిల్స్‌లో (1) సంపన్నుల ఇళ్ళుండే ఒక కాలనీలో ఒక టొయోటా ప్రియస్ (2) కారొచ్చి ఆగింది.
దాని వెనుక బంపర్ మీద ఒబామా 08 అనీ, మేం పని చేస్తున్నాం మార్పుకోసం అనీ స్టిక్కర్లు అంటించి ఉన్నాయి.
ఆ కార్లోంచి ఒక యువకుడు దిగాడు. చక్కటి పోలో షర్ట్, ఇస్త్రీ చేసిన షార్ట్స్ వేసుకునున్నాడు. అతని చొక్కా ఛాతీ మీద ఒబామా బటన్ పిన్ చేసి ఉంది. తలమీద టీం ఒబామా అని ఎంబ్రాయిడరీ చేసిన బేస్‌బాల్ కేప్ ఉంది.
అతను తన చేతిలో ఉన్న అట్టమీద పేర్ల లిస్టు ఒకసారి చూసుకుని, దగ్గర్లో ఉన్న ఇంటి గుమ్మంలోకి వెళ్ళి కాలింగ్ బెల్ నొక్కాడు.
సుమారు నలభయ్యేళ్ళ తెల్ల మనిషి తలుపు తీసి, ఎవరు అన్నట్టు ప్రశ్నార్ధకంగా చూశాడు.
ఈ యువకుడు స్నేహపూర్వకంగా నవ్వి, "హాయ్, మిమ్మల్ని డిస్టర్బ్ చేసినందుకు మన్నించండి. నా పేరు తేజా. నేను ఒబామా తరపున ఎన్నికల ప్రచారానికి ఇవ్వాళ్ళ మీ ఇంటి తలుపు తట్టాను. మీకు అభ్యంతరం లేకపోతే, ఒక రెణ్ణిమిషాలు మాట్లాడొచ్చా?" అన్నాడు.

***
పదసూచిక
(1) బ్లూంఫీల్డ్ హిల్స్ - డిట్రాయిట్ పరిసర ప్రాంతాల్లో ఒకటి, సంపన్నమైన ఊరు.
(2) టొయోటా ప్రియస్ - హైబ్రిడ్ టెక్నాలజీ కారు. గేలను పెట్రోలుకి సుమారు 50 మైళ్ళిస్తుంది. పర్యావరణ రక్షణ, బాధ్యతగా జీవించడం వంటి విలువల్ని నమ్మే వారికి ఒక ప్రతీక అయింది ఈ కారు.

Thursday, August 6, 2009

నీవేనా నను తలచినది - 03

May 22, 2008 Thursday 3.20 PM

ట్రాయ్, మిషిగన్‌లో, బిగ్ బీవర్రోడ్డు మీదున్న స్టార్బక్స్ (1) లో కూర్చుని లాప్టాప్లో బ్రౌజ్ చేస్తున్నాడు తేజా. లాప్టాప్ మీద ఇంకో విండోలోంచి మిషిగన్ రేడియో ప్రసారం చేస్తున్న టాక్ ఆఫ్ది నేషన్ (2) కార్యక్రమం హెడ్ ఫోన్‌ల ద్వారా అతని చెవులకి చేరుతోంది. కార్యక్రమ సంధానకర్త నీల్ కోనన్ (2) డెమొక్రాటిక్ ప్రైమరీల్లో ఒబామా సాధిస్తున్న అద్భుతమైన విజయ పరంపర గురించీ, ప్రత్యర్ధి హిలరీ క్లింటన్ (3) ఇంకా ఓటమి నంగీకరించక పోవడంలోని అంతరార్ధం గురించీ ఇద్దరు రాజకీయ విశ్లేషకులతో ముచ్చటిస్తున్నాడు.

తేజా మిషిగన్‌కి వచ్చి వారమైంది. రొటీన్ బాగానే ఉంది. పొద్దుటి పూట ఒక రెండు గంటలు దగ్గర ఉన్న అడవుల్లో రన్నింగో బైకింగో చేస్తూ గడుపుతున్నాడు. వసంత ఋతువులో మిషిగన్ నిజంగానే చాలా అందంగా, ఆహ్లాద కరంగా ఉంటుంది. మధ్యాన్నాలు ఇలా కాఫీ షాప్, లేకపోతే పబ్లిక్ లైబ్రరీ. ఎటొచ్చీ సాయంత్రమంటేనే భయం. ఏం చెయ్యాలో తోచదు.

ఇక్కడ నా స్నేహితులెవరూ లేరు. ఎప్పుడో ఏళ్ళ క్రితం హైస్కూల్లో కలిసి చదువుకున్న వాళ్ళందరూ ఎక్కడెక్కడో.
ఉన్నట్టుండి కొత్త స్నేహితు లెలా దొరుకుతారు?
అక్కడికీ అమ్మ మంచిదే, ఇది చెయ్యి అది చెయ్యి, ఉద్యోగం లేకపోతే ఎలా అని ఊదర గొట్టటం లేదు. నామానానికి నన్ను ఉండనిస్తుంది.
కానీ ఎంత సేపు పుస్తకాలు చదవడం? ఎంత సేపు సినిమాలు చూడ్డం? ఏమేమి చేస్తే రోజులో మేలుకునుండే పద్ధెంది గంటలు గడుస్తాయి? ఏదో ఈ వారం వరకూ ఓకే, బహుశా ఇంకో వారం కూడా ఓకే. ఆ పైన ఇలా కాలక్షేపం .. నాకు తగింది కాదు.
ఏదో ఒక పని చెయ్యాలి. ఏదన్నా పనికొచ్చే పని చెయ్యాలి.
పోనీ మొన్న అమ్మ చెప్పినట్టు ఎక్కడన్నా వాలంటీర్ చేస్తే ..
డెమోక్రాట్ల లాగానే రిపబ్లికన్ ప్రైమరీ కూడా ఇంకా నడుస్తుంటే బాగుండు. నా రాజకీయ హీరో మిట్ రామ్నీ ఎప్పుడోనే అస్త్ర సన్యాసం చేసేశాడు.
పోనీ రాబర్టయినా ఇక్కడికి దగ్గర్లో ఉండుంటే బాగుణ్ణు. వాడు భలే ఆశ్చర్యంగా .. ఇంటికెళ్ళిన వారంలోనే వాళ్ళ నాన్నతో పొలం పనుల్లో మునిగి పోయాడు. చాట్లో కూడ దొరకట్లేదు.
నేను కూడా ఏదన్నా ఇక్కడ పొలంలో పనికి కుదిరితే పోతుంది. డబ్బు కోసం కాకపోయినా, రోజంతా ఇలా పిచ్చి ఆలోచనల్లేకుండా .. రాత్రయ్యేప్పటికి అలసటతో నిద్రకి వాలిపోయేలా .. నిద్ర .. రాదు ఎంతకీ .. కాస్త కునుకు పట్టిందంటే ఆ వంకర బొట్టు అమ్మాయి. ఉన్నవన్నీ చాలనట్టు ఇదో పిచ్చి గోల. అసలు నా ఉద్యోగం పోవడానికీ ఈ కలలో అమ్మాయికీ ఏదో సంబంధం
ఉన్నట్టుంది. నా ఉద్యోగం పోయే ముందు రాత్రే మొదటి సారి కల్లోకొచ్చింది.
ఛ, నాకు నిజంగానే పిచ్చెక్కుతోంది ఈ పనిలేని ఖాళీతో. ఇప్పుడింక ఇలాంటి మూఢనమ్మకాల్ని కూడా నమ్మేస్తున్నా ..
చెయ్యాలి, ఏదో ఒకటి చెయ్యాలి.
***
June 13, 2008 Friday, 7:00 PM

తేజా లెదర్ సోఫాలో చేరగిలబడి మ్యూట్‌లో ఉన్న టీవీ వంక చూస్తున్నాడు.
మాధవి పట్టు చీరలో తయారై మెట్లు దిగి వస్తూ కొడుకుని చూసింది.
నాలుగు రోజుల ఎదుగుదలతో గడ్డం మాసి ఉంది. చేతులు కత్తిరించిన నలిగి పోయిన పాత టీషర్టూ, పాత బాస్కెట్‌బాల్ షార్ట్సూ. ఇదివరకెప్పుడూ లేనిది, టీ షర్ట్‌లోనించి బీర్ బెల్లీ ఉబ్బుతోంది. సోఫాలో వాలి ఉన్న భంగిమలో ఒక నిర్లక్ష్యం, ఎవరు చూస్తేనేం .. టీవీకి అప్పగించిన కళ్ళల్లో ఒక నిస్తేజం .. ఏమైతేనేం.
వీణ్ణిలా వొదిలేస్తే లాభం లేదు అని తోచింది మాధవికి. తేజాకీ టీవీకి మధ్యలో అడ్డంగా నించుంది. నిరాసక్తంగానే తేజ కళ్ళు ఆమె వేపు చూసినై. ఆవిడ ధరించిన పట్టు చీరనీ, ప్రత్యేక శ్రద్ధతో చేసుకున్న అలంకారాన్నీ గమనించి ఒక్క లిప్తపాటు తేజ కళ్ళు మెరిశాయి.
మాధవి ప్రకటనల్లో చీరల మోడల్సిచ్చే భంగిమ పెట్టి,
"ఎలా ఉన్నాను?" అంది.
"యూ లుక్ ఫెంటాస్టిక్, మాం!" అన్నాడు.
"నాట్ బేడ్ ఫరె ఫిఫ్టీ యియరోల్డ్, హా?" అంది చిన్నగా నవ్వుతూ.
"నాట్ బేడ్ ఫొర్ ఎనీ ఏజ్ మాం. అసలు నాట్ బేడ్ కానే కాదు, సూపర్ గుడ్!! యూ లుక్ రియల్లీ బ్యూటిఫుల్."
ఎందుకీ ప్రత్యేక అలంకారం అన్న ప్రశ్న అతని పెదాల వెనక అణిచేసినా కళ్ళల్లో మెరిసింది.
"డోంట్ వరీ, నేనేం డేటింగ్ కి వెళ్ళట్లే. ఇవ్వాళ్ళ ఒబామా కోసం ఫండ్ రైజర్ జరుగుతోంది. స్థానిక డెమొక్రాటిక్ పార్టీ పెద్దలు, ఇద్దరు సెనేటర్లూ వస్తున్నారు. మన భారతీయులు చేస్తున్నారు."
"వావ్ .. ఐతే పెద్ద విశేషమే! ఐనా మన ఇండియన్లకి ఇంత రాజకీయ జ్ఞానం ఎలా పుట్టుకొచ్చిందబ్బా?"
"మన వాణీ ఆంటీ లేదూ? వాళ్ళమ్మాయి కామ్య .. నీతోటిదే. నిజానికి చిన్నప్పుడు మీరిద్దరూ తెలుగు ఎసోసియేషన్ కార్యక్రమాల్లో కలిసి డాన్సులేశారు. తనిప్పుడు ఇక్కడే వెయిన్ స్టేట్లో లా చదువుతోంది. మొదణ్ణించీ ఒబామా కేంపేన్లో వాలంటీర్ గా చురుగ్గా పాల్గొంది. ఇప్పుడు తను మొత్తం మెట్రో డెట్రాయిట్ కంతటికీ కేంపేన్ మేనేజర్. తనే మనవాళ్ళందర్నీ ఊదరకొట్టి కదిలించి ఇది నడిపిస్తోంది."
"వాణీ? కామ్యా? ఏమో నాకు గుర్తు లేదు."
"పోన్లే. అది ముఖ్యం కాదు. సరే కానీ, ఇంత అందంగా తయారైన మీ అమ్మకి తోడుగా, రక్షణగా రావూ?"
"నీకా? ఇంకొకళ్ళు రక్షణా?" అని విరగబడి నవ్వాడు.
ఆ మాత్రానికే మాధవి సంతోషించింది, తేజని ఆ నిస్సత్తువలోంచి కొంచెమైనా కదప గలిగానని.
"ఒక్క చేత్తో కొమెరికా బేంకుని సూది మొనమీద నాట్యం చేయిస్తావు. నువ్వంటే మీ ప్రెసిడెంటు కూడా హడలి చస్తాడు .. నీకు నేను రక్షణా?" అని మళ్ళీ నవ్వాడు.
"పోన్లే, నాకు రక్షణ కాకపోతే, నా కొడుకెంత హేండ్సమ్మో చూపించుకుంటాను నలుగురికీ, అందుకోసమన్నా, రా!"
"హమ్మ్ .. ఇదేదో బానే ఉంది. కానీ నా వంటి కరుడు గట్టిన రిపబ్లికన్ను ఒబామా ఫండ్ రైజరుకి చనుటయా" హేంలెట్ నాటకంలో డయలాగులాగా చెప్పాడు తేజ.
మాధవి ఇంక ఆలస్యం భరించలేనట్టు, విసుగు పుట్టినట్టు, "అబ్బ, రారా. ఏంటో ఒక్క సాయంత్రం నాతో బయటికి రమ్మంటే మహా నీలుగుతున్నావు, పద పోయి తయారవ్వు." అని తేజా సోఫాలోంచి బలంగా పైకి లాగి, మెట్ల వేపుకి గెంటింది.
తేజా అయిష్టంగానే మొహం పెట్టి మెల్లగా మెట్లెక్కి పైన తన బాత్రూంలోకెళ్ళి గడ్డం చేసుకోడం మొదలెట్టాడు.
"ఏదో పిచ్చి బట్టల్తో తయారు కాకు, ఫార్మల్, టక్స్ అండ్ బ్లాక్ టై రోయ్" కిందనించే అరిచి చెప్పింది మాధవి.
***
పద సూచిక
(1) స్టార్బక్స్ - ప్రసిద్ధ కాఫీ షాపు.
(2) టాక్ ఆఫ్ది నేషన్ - నేషనల్ పబ్లిక్ రేడియో పనివారపు రోజుల్లో మధ్యాన్నం పూట ప్రసారం చేసే సమకాలీన విషయాల చర్చా కార్యక్రమం. నీల్ కోనన్ దీని సంధాన కర్త.
(3) హిలరీ క్లింటన్ - అమెరికను రాజకీయ వేత్త, మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ సతి, అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్ధిత్వానికి ఒబామా తో పోటీ పడి, దేశ చరిత్రలోనే సుదీర్ఘమైన ప్రైమరీ కేంపేన్ నడిపారు. ఒబామా విజయం తరవాత కేబినెట్ లో విదేశాంగ మంత్రిగా చేరారు.

Wednesday, August 5, 2009

నీవేనా నను తలచినది - 02

March 10, 2008 Monday 11:45 AM

మిడ్‌టౌన్ నించి ఐదో ఎవెన్యూ వెంబడి అప్‌టౌన్ వేపు నడక సాగించాడు.
ఎదురుగా వస్తున్న ట్రాఫిక్. ఎక్కడికో ఆ పరుగులు. తనొక్కడికేనా తీరిక?
నిమిషమంటే డాలర్లుగా, డబ్బే ఊపిరిగా, లాభాలు ఆర్జించడమే జీవిత ధ్యేయంగా, క్షణం తీరిక లేకుండా గడిపిన జీవితం. కొద్ది గంటల క్రితం వరకూ, తానూ ఆ బిజీ స్రవంతిలో ఒక పాయ. ఇప్పుడు .. అకస్మాత్తుగా .. ఉన్నదంతా తీరికే.
ఇక్కణ్ణించి కనుచూపు మేర బోలెడు తీరిక. భరించలేనంత తీరిక. ఏం చేసుకోవాలో తెలియనంత తీరిక.
ఇంకా చలికాలం పూర్తిగా పోలేదని గుర్తు చేస్తూ చిరు చలి. మబ్బు తెరల్ని చీల్చుకుని మీద పడుతున్న పల్చటి ఎండలో వడివడిగా నడుస్తుంటే బాగుంది.
ఎర్ర లైటు దగ్గర ఆగాడు. ఎనభై రెండో వీధి. అప్పుడే నలభై బ్లాకులు నడిచాడా? నలభై బ్లాకులంటే ఎన్ని మైళ్ళు?
ఎడమ పక్కగా మెట్రోపాలిటన్ మ్యూజియం. రెండేళ్ళుగా న్యూయార్కులో ఉన్నా, ఎప్పుడూ వెళ్ళలేదు. వేరే పనేముంది? కాసేపు మ్యూజియంలో గడుపుదామా?
ఆకలేస్తోంది. మ్యూజియం ముందు సైడ్ వాక్ మీదున్న ఒక బండి వాడి దగ్గర ఒక హాట్ డాగ్ కొనుక్కుని, అక్కడే నిలబడి తినేశాడు.
ఒక ఐస్ టీ సీసా కొనుక్కుని మ్యూజియం దాటి సెంట్రల్ పార్కులో అడుగు పెట్టాడు.
సోమవారమైనా, లంచి సమయం కావడం వల్ల కాబోలు పార్కు దారుల వెంబడి మనుషుల అలజడి బాగానే ఉంది. అలా కాలికి దొరికిన దారి వెంబడి నడిచి, ఒక బెంచి ఖాళీగా కనబడితే
దాని మీద కూర్చుని చుట్టు చూస్తున్నాడు.
చుట్టూతా పల్చగా మనుషుల అలజడి. తీరిగ్గా కబుర్లాడుకుంటూ బెంచీల మీద లంచిలారగిస్తున్న వాళ్ళు. లంచి ముగించుకుని తిరిగి తమ కార్యాలయాలకి వెళ్ళేవాళ్ళు. అటూ ఇటూ తిరిగే వాళ్ళు. వ్యాయామం కోసం నడకలూ పరుగులూ సాగించే వాళ్ళు. ఇంకా ఎక్కడో దూరంగా పిల్లల కేరింతలు. ఈ చప్పుళ్ళన్నిటికీ నేపథ్యంగా ఐదో అవెన్యూ మీద దూసుకు
పోతున్న ట్రాఫిక్ హోరు.
నా బేంకు కూలిపోయింది. ఐనా ఈ ప్రపంచం బాగానే ఉందే. వీళ్ళంతా ఇంత హాయిగా దిలాసాగా ఉన్నారే? వీళ్ళకేం పట్టదా?
బెంచి మీద తన పక్కన ఎవరో కూర్చున్నట్టు అనిపించి కొద్దిగా తల తిప్పి ఇటు చూశాడు. ఎవరితో మాట్లాడాలని లేదు. వాళ్ళు గనక పలకరిస్తే అక్కణ్ణించి లేచి వెళ్ళిపోదాం అనుకున్నాడు.
ఆ కూర్చున్నది ఎవరో అమ్మాయి.
భుజాల కింది వరకూ ఫేషన్ గా కత్తిరించుకున్న నల్లటి జుట్టు మాత్రం కనిపిస్తోంది. జీన్స్ మీద నల్లరంగు కాటన్ టాప్. దాని మీద ఏదో మెరిసే దారంతో కుట్టిన ఇండియన్ డిజైన్లు.
ఇదేంట్రా ఈ అమ్మాయి కనీసం జాకెట్టైనా స్వెట్టరైనా లేకుండా ఉత్తి చొక్కాలో ఇలా తిరుగుతోంది అనుకున్నాడు. ఇంతలో ఆ అమ్మాయి తల పైకెత్తి తేజాకేసి చూసి పలకరింపుగా నవ్వింది.
కచ్చితంగా ఇండియన్ మొహమే.
అదుగో, ఆ కనుబొమల మధ్య చిన్న మెరిసే బొట్టు బిళ్ళ. కానీ అది కొంచెం వంకరగా, ఒక పక్కకి ఉంది. అప్రయత్నంగా ఆ బొట్టుబిళ్ళని సరి చెయ్యడానికి కుడిచెయ్యి చాచాడు.
చేతి వేళ్ళకి పాత చెక్క బెంచీ గరుగ్గా తగిలి మెలకువొచ్చింది. చుట్టూ చూశాడు. అమ్మాయి లేదు.

కోటు జేబులో ఐఫోన్ చప్పుడు చేసింది. రాబర్ట్ నించి టెక్స్ట్ మెసేజ్.
రేపు సాయంత్రం ఆరింటికి మర్ఫీస్‌లో కలుద్దామని.
***

March 25, Tuesday, 7:15 PM

మర్ఫీస్ ఖాళీగా ఉంది. రాబర్ట్, తేజా ఒక మూలగా ఉన్న బల్ల దగ్గర కూర్చునున్నారు. ఇద్దరూ నిశ్శబ్దంగా తమ తమ గ్లాసుల్ని చప్పరిస్తున్నారు, రాబర్ట్‌కి రెండో మార్టినీ, తేజాకి ఒకటే ఐస్ టీ.
ఉన్నట్టుండి రాబర్ట్ బల్ల మీద చరిచాడు. తేజా ఉలిక్కిపడి తలెత్తి మిత్రుడికేసి చూశాడు.
"స్క్రూ బేర్ స్టెర్ణ్స్ .. స్క్రూ వాల్ స్ట్రీట్ .. స్క్రూ ద హోల్ డాం థింగ్. నేను అయోవా(1) తిరిగిపోయి పొలం దున్నుకుంటా."
తేజా తన మిత్రుడికి పిచ్చెక్కిందేమో నన్నట్టు చూశాడు.
"రాబ్, నీకు షాక్ తగిలి తాత్కాలికంగా మతి భ్రమించి నట్టుంది. కూల్ మేన్."
"లేదు తేజా, నేను నిశ్చయానికొచ్చేశాను."
"ఇంత మాత్రానికే? బేర్ స్టెర్ణ్స్ కాకపోతే ఇంకా చాలా బేంకులున్నై. మనకి ఆ మాత్రం ఇంకో ఉద్యోగం దొరక్క పోదు."
"దొరకొచ్చు, దొరక్క పోవచ్చు. అది కాదు విషయం. ఈ సబ్ ప్రైం, ఈ లొసుగులు, ఈ దొంగ లావాదేవీలు, ఈ అబద్ధాలు .. ఈ విషాన్నించి కొన్నాళ్ళు దూరంగా ఉండాలి."
"ఏంటీ? స్టార్ బ్రోకర్ రాబర్ట్ లుప్చోవ్స్కీయేనా ఈ మాటలు మాట్లాడేది?"
"అక్షరాలా .. అసలు మొత్తానికి బేంకింగ్ వొదిలేస్తా ననడంలేదు. కొన్నాళ్ళు బ్రేక్. జరిగిందేదో మన మంచికే జరిగింది. కొన్నాళ్ళు ఈ పిచ్చి గోల నించి దూరంగా ఉండి, అప్పుడు, మళ్ళీ తిరిగి రావాలనిపిస్తే వస్తా."
"కొన్నాళ్ళు? ఎన్నాళ్ళు?"
"ఏమో, ఒక ఏడు, రెండేళ్ళు."
"ఏం చేస్తావ్ అంత సమయం?"
"ఏదో ఒకటి, మనసుకి నచ్చింది. చూడూ, మనిద్దరికీ ప్రస్తుతానికి డబ్బుకి ఇబ్బంది లేదు. మరీ హై స్టేక్స్ పోకర్ గేములాడాకపోతే, ఒక ఏడాది రెండేళ్ళు హాయిగా కాలక్షేపం చెయ్యొచ్చు. దేశమంతా సైకిలు మీద తిరగొచ్చు. ఈజిప్టుకెళ్ళి పిరమిడ్లు చూడచ్చు. బుద్ధి పుడితే మా నాన్న పొలంలో ట్రాక్టర్ తోలచ్చు. అసలేమీ చెయ్యకుండా చెట్టు నీడన హేమక్ లో పడుకోవచ్చు."
"నీకు నిజంగా పిచ్చెక్కింది."
"..."
"యు నో? నిన్న మా అమ్మతో మాట్లాడితే, తను కూడా అదే అంది .. కొన్నాళ్ళు మిషిగన్ రమ్మని."
"మరింకేం? చూడు, నేను చెప్పిందే కరక్ట్. ఈ న్యూయార్క్ లో ఉండి, ఉద్యోగం దొరక్క పోతే అదొక నరకం. దొరికితే ఇంకో నరకం. నో! పద పోదాం. బైదవే, మీ అమ్మక్కూడా పొలముందా? మిషిగన్లో?"
"హ హ్హ హ్హ. అమెరికాలో ఇండియన్లు పొలాలు దున్నర్రా ఇడియట్. మా అమ్మ కొమెరికా బేంక్ లో వైస్ ప్రెసిడెంట్."
"చచ్చాం పో."
"ఐ నో. బట్ మై మాం ఇస్ కూల్. యు నో, మిట్ రామ్నీ ప్రైమరీ బరిలో దిగినప్పుడు నాకు చాలా ఉత్సాహం వేసింది. ఆయన కేంపేన్ కి వాలంటీర్ చేద్దామనుకున్నా. అఫ్కోర్సు, ఇన్నాళ్ళు మనకి టైము లేదనుకో. పోనీ ఇప్పుడు చేద్దామంటే గురుడు ఆల్రెడీ మెక్కెయిన్ కి సరెండరైపోయాడు. హమ్మ్."
"హే తేజా, తేజెష్టర్, తేజుమేన్ .. ఏలోకంలో ఉన్నావ్ మై డియర్? ఇది ఒబామా సంవత్సరం. ఇది ఒబామా ఎన్నిక సమయం. నీకు ఏ మాత్రం సివిక్ సెన్సున్నా ఒబామా కేంపేన్ కి పనిచెయ్."
"హ హ హ. ఇంతకు ముందు దాకా ఏవన్నా డౌటుంటే అది కాస్తా ఇప్పుడు పోయింది. నీకు సెర్టిఫైడ్ గా స్క్రూ లూజ్. పోయి పోయి ఆ సోషలిస్ట్ కా? ఈ జన్మలో జరగదు? మెక్కెయిన్(2) ఒట్టి తిక్కలాడు, పార్టీ సిద్ధాంతాలకి ఎల్లప్పుడూ కట్టుబడి ఉండడు, ముఖ్యంగా ఆర్ధిక విధానాలకి. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆ డెమోక్రాట్లతో కలిసి వోటేస్తూంటాడు. అతని కేంపేన్‌కి పని చెయ్యాలనే ఉత్సాహం ఐతే నాకు లేదు గానీ, పోయి పోయి ఒబామాకి సాయం చెయ్యడమా? నో వే!"
"యెస్ వే టూ! హే, అయోవా నించొచ్చిన నేనే ఒబామాని సపోర్ట్ చేస్తున్నా? మిషిగన్ వాడివి నీకేంటోయ్? ఈ దేశం ప్రస్తుతం కూరుకుంటున్న ఊబిలోంచి ఎవడన్నా బయటికి లాగ గలడంటే అది ఒబామా ఒక్కడే."
"హే రాబ్ .. ఏంటిది, ఆయనేదో కొత్త మెస్సయ్యా(3) లాగా .."
"హీ ఈజ్ దా మెసాయా. యు బెటర్ బిలీవిట్. ఇందాక అసలు విషయం మర్చిపోయా .. ఇన్నాళ్ళుగా కోమాలో పడున్న మన రొమాంటిక్ లైఫ్ ని నిద్ర లేపేందుక్కూడా ఇదో ఛాన్సనుకో! ఇప్పుడు అమ్మాయిలందరూ పిచ్చ పిచ్చగా ఒబామా అంటే పడి చస్తున్నారు. మనం కూడా ఒబామా కేంపేన్ ‌లో పని చేస్తే .. అమ్మాయిలే అమ్మాయిలు!"
"..."
"ఏంటో ఆ వంకర నవ్వు? ఓ, గాట్ ఇట్! మీ ఇండియన్స్‌లో మీ పేరెంట్సే ఎరేంజ్ చేస్తారంటగా? డోంటెల్మీ .. మీ అమ్మ నీకప్పుడే ఒకమ్మాయిని మిషిగన్లో సెటప్ చేసిందని!"
"నో నో .. అలాంటిదేం లేదు. గత రెండు వారాల్లో నాలుగు సార్లు నాకు ఈ విచిత్రమైన కలొచ్చింది. కలలో ఒకమ్మాయి .."
"ఫిగరు బావుందా?"
"ఏమో నేను గమనించలేదు. కానీ .. ఈ తమాషా చూడు .. ఇండియన్ అమ్మాయి."
"ఇంకేం? చూసుకో నేంచెప్పేస్తున్నా నీ ఫ్యూచర్ .. గుర్తు పెట్టుకో. నువ్వు మిషిగన్ వెళ్ళేప్పటికి మీ మమ్మీ నీకుమాంఛి డాక్టర్ పిల్లని సెటప్ చేసేసి ఉంటుంది. నువ్వు అక్కడ దిగిన రెండు వారాల్లో ఎంగేజ్మెంట్, మూణ్ణెలల్లో పెళ్ళి."
"అంతేనంటావ్. ఐతే నువ్వు అయోవాకీ, నేను మిషిగన్ కీ తప్పదంటావ్?"
"ఏమో ఎవరు చూడొచ్చారు? నీకు సెటప్పయ్యే స్వీట్‌హార్ట్‌కి మాంఛి బేబెలిషియస్ బెస్ట్ ఫ్రెండ్ ఉందనుకో, ఒక్క టెక్స్ట్ మెసేజ్ కొట్టేయ్, రెక్కలు కట్టుకుని నేను కూడా మిషిగన్‌లో వాల్తా."
***

పద సూచిక
(1) అయోవా - అమెరికా నడిబొడ్డున ఉన్న రాష్ట్రం. వ్యవసాయం ఇక్కడి ముఖ్య వృత్తి. రాజకీయంగా ఎప్పుడూ రిపబ్లికన్ పార్టీని సమర్ధించే రాష్ట్రాల్లో ఒకటి. అధ్యక్ష ఎన్నికలకి ముందు అభ్యర్ధుల ఎంపికలో మొట్టమొదటి కాకస్ ఈ రాష్ట్రంలో జరుగుతుంది.
(2) జాన్ మెక్కెయిన్ - అమెరికను రాజకీయ వేత్త, సెనేటు సీనియర్ సభ్యుడు, అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరపున పోటీ చేసి ఓడిపోయారు.
(3) మెస్సాయా - హిందూ మతంలో కల్కి అవతారం లాగా రాబోయే దివ్య రక్షకుడు. కొన్ని ఆచారాల్లో ఏసుక్రీస్తుని కూడా ఇలా అంటారు. హేండెల్ అనే జెర్మను సంగీత వాగ్గేయకారుడు ఏసుక్రీస్తు జననాన్నీ, జీవితాన్నీ కీర్తిస్తూ ఈ పేరిట రచించిన గొప్ప గాత్ర సంగీతం చాలా పేరు పొందినది.

Tuesday, August 4, 2009

నీవేనా నను తలచినది - 01

నేన్రాసిన ఈ కథ తానా సావనీరులో ప్రచురితమైంది. ఆ సావనీరు అందరికీ అందే అవకాశం ప్రస్తుతానికి కనబడక ఇలా మీతో దీన్ని పంచుకుంటున్నా. కథ పూర్తయ్యే వరకూ ప్రతి రోజూ సీరియల్ గా ప్రచురిస్తాను. నిర్మొహమాటంగా మీ అభిప్రాయాలు చెప్పొచ్చు.

నీవేనా నను తలచినది
అను ఆర్ధిక రాజకీయ ప్రేమ కథ
ఎస్. నారాయణస్వామి

March 9 2008 Sunday 2:00 AM

ద్రవరూపమైన బంగారంలో ఐసుముక్కలు మెల్లగా కరిగి అస్తిత్వాన్నికోల్పోతున్నై. అది అనుభవించిన గాజు గ్లాసుకి మేను చెమర్చింది. ఆ చిరుచెమట బిందువులు ఏకమై ధార కట్టి ..
తేజా తదేకంగా గ్లాసు వేపు చూస్తున్నాడు. కిందకి జారుతున్న ఆ ధార అతన్ని హిప్నటైజ్ చేస్తోంది.
"నాక్కూడా అదోటి తెప్పించు .. నువ్ తాగేది" చెవులో హస్కీగా .. గుసగుసగా.
ఉలిక్కిపడి పక్కకి తిరిగి చూశాడు.
ఎవరో దేశీ పిల్ల. ఆ మొహం తమాషాగా ఉంది. కళ్ళు ముక్కు చెవులూ మూతీ అన్నీ ఉన్నాయి, కానీ ఏ ఒక్క పోలికా ఇది నాది అన్నట్టు స్పష్టంగా లేదు.
ఛ, రెండు స్కాచిలకే నాకు ఇంత ఎక్కేసిందా అనుకుని తేజా కళ్ళు నులుముకుని మరీ చూశాడు.
అతని చూపుకేం కాలేదు. ఆ ఫీచర్స్ అలానే ఉన్నై.
ఇంతలోనే ఇంకో విషయం గమనించాడు. ఆ అమ్మాయి కనుబొమల మధ్య ఒక చిన్న బొట్టు బిళ్ళ. కానీ అది మధ్యలో లేకుండా కొంచెం ఒక పక్కకి ఉంది. అనాలోచితంగా తేజా చెయ్యెత్తి ఆ బొట్టుని సరిచెయ్యబోయాడు.
చటుక్కున మెలకువొచ్చింది. కింగ్ సైజ్ బెడ్లో ఎడమ పక్కకి తిరిగి పడుకొనున్నాడు. అవతల ఉన్నదాన్ని దేన్నో అందుకోడానికి చాచినట్టుగా కుడిచెయ్యి పక్కకి అడ్డంగా చాచి ఉంది. నేపథ్యంలో సెంట్రల్ హీట్ చప్పుడు మంద్రంగా వినిపిస్తోంది. నైట్ స్టాండ్ మీద ఎర్ర అంకెల ఫుట్బాల్ గడియారం రెండైనట్టు చూపిస్తోంది. తేజాకి కల గుర్తొచ్చింది.
వెల్లికిలా తిరిగి పడుకుని రెండు చేతులూ గుండెల మీద వేసుకున్నాడు. తనొక బార్లో వొంటరిగా కూర్చుని రెండు స్కాచిలు తాగేసి మూడోది సేవిస్తూ ఉండడం. తను .. టీటోటలరైన తను!
ఎంత అసంభవమైన సంఘటన!
అదికాదు అసలు సమస్య .. ఆ అమ్మాయి. ఆ వంకర బొట్టు అమ్మాయి. ఎవరా అమ్మాయి? అందులో దేశీ అమ్మాయి?
బొట్టు పెట్టుకుని బార్లోకెందుకొచ్చింది? ఆమె మొహాన్ని గుర్తు తెచ్చుకోడానికి ప్రయత్నం చేశాడు. కానీ ఏదీ స్పష్టంగా గుర్తుకి రాలేదు. నిద్ర పట్టక నైట్ స్టాండ్ మీదున్న దీపం వెలిగించాడు.
కంఫర్టర్ పక్కకి తోసి, పక్క దిగి, కిటికీ పక్కగా ఉన్న లేజీబాయ్ రెక్లైనర్లో కూలబడి లాప్‌టాప్ తెరిచాడు. మిట్ రామ్నీ (1) కేంపేన్ ఏమవుతోందో చూద్దాం. ఇవ్వాళ్ళ ఆదివారం, పర్లేదు రోజంతా నిద్ర పోవచ్చు!
***
March 10, 2008 Monday 11:00 AM

"హెలో?"
"అమ్మా!"
"తేజా, చెప్పు నాన్నా. ఎలా ఉన్నావు?"
"బానే ఉన్నా. పని టైములో చేస్తున్నా, బిజీగా ఉన్నావా?"
"పర్లేదు, చెప్పు. నీకంటే ముఖ్యం కాదులే."
"హమ్మ్ .. విషయం తెలిసే ఉంటుంది నీకు."
"ఏ విషయం? బేర్ స్టెర్ణ్స్ (2) సంగతేనా?"
"అదే. న్యూస్ చూస్తూనే ఉన్నావుగా. నువ్వూ ఒక బేంకు వైస్ ప్రెసిడెంటువి. నీకు తెలీనిదేవుంది? బేర్ స్టెర్ణ్స్ ఇంక చరిత్ర పుటల్లోకి .."
"ఊ. అనుకుంటూనే ఉన్నా. నీ పరిస్థితి ఏంటి? మీ విభాగాన్ని ఉంచుతున్నారా? జేపీ మోర్గన్ (3) వాళ్ళేమన్నా ఆఫరిచ్చారా?"
"లేదు. ఇవ్వాళ్టితో నా ఉద్యోగం ఆఖరు."
"ఆహా."
"..."
"నువ్వెలా ఉన్నావ్? ఎలా తీసుకుంటున్నావ్?"
"హమ్మ్. ఏమో .. తెలీదు. ఇంకా ఏం అనుకోలా."
"ఏం పర్లేదు. నీకిది మొదటి ఉద్యోగం కదా. కొంచెం బెంగగానే ఉంటుంది."
"ఊ. బెంగ కాదు. ఓడిపోయాను అనిపిస్తోంది. కానీ నాకు ఓడిపోవటం అలవాట్లేదు."
"అదే అనుకోకు. అమెరికన్ ఎకానమీ అనే మహా కర్మాగారంలో బేర్ స్టెర్ణ్స్ ఒక చిన్న యంత్రం. అందులో నువ్వొక చిన్న శీలవి."
"ఏదైనా .. చాలా చిరాగ్గా ఉంది."
"పోనీ కొన్నాళ్ళు ఇంటికి రాకూడదూ? ఈ సమయంలో మిషిగన్ (4) ఎంత ఆహ్లాదంగా ఉంటుందో నీకు తెల్సుగా. కొద్ది రోజులు రిలాక్స్డ్ గా గడిపితే, తరవాత సంగతి మెల్లగా ఆలోచించుకోవచ్చు."
"ఇప్పుడా? ఈ పరిస్థితుల్లోనా? మిషిగన్‌కా?"
"అవును."
"ఏమోనమ్మా. ఇప్పుడైతే ఎక్కడికీ రావాలని లేదు నాకు. ఉద్యోగం పోయిందని ఏ మొహం పెట్టుకుని నీ దగ్గరికి రాను?"
"అదేంట్రా నాన్నా? ఏ పరిస్థితుల్లోనైనా, ఎప్పుడైనా నువ్వు నా దగ్గరికి రావచ్చు. ఆ సంగతి నీకు తెల్సు."
"హమ్మ్ .. చూస్తాలే. ముందసలు ఈ గోలంతా ఏంటో కొంచెం సెటిలవనీ."
"అలాగే. నేనేం నిన్ను ఈ క్షణమే వచ్చెయ్యమని బలవంతం చెయ్యట్లేదు. నా ముప్పయ్యేళ్ళ బేంకింగ్ జీవితంలో, మరీ ఇంత ఘోరం కాకపోయినా, ఇలాంటి వొడిదుడుకులు చాలా చూశాను. ఉద్యోగం ముగిసింది అంటే, ముగిసింది, అంతే. అదొక మజిలీ .. ఐపోయింది. ముందుకెళ్ళడమే నువ్వు చెయ్యగలిగింది ఇంక."
"అవుననుకో."
"స్థిమితంగా ఉండు. నీకెప్పుడు కావాలన్నా నాతో మాట్లాడచ్చు. ముందు నీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకో. సరేనా?"
"ఓకే అమ్మా. మళ్ళీ మాట్లాడతా నేను."
"సరే నాన్నా. మాట్లాడదాం."
***
పద సూచిక
(1) మిట్ రామ్నీ - గొప్ప వ్యాపార వేత్త, అమెరికను రాజకీయ నేత. గత ఎన్నికల్లో రిపబ్లికను పార్టీ తరపున అధ్యక్ష ఎన్నికలో అభ్యర్ధిగా ఉండేందుకు పోటీ పడ్డారు. కానీ త్వరలోనే విరమించుకున్నారు.
(2) బేర్ స్టెర్ణ్స్ - వాలు వీధిలో మదుపు బేంకుల్లో ఒకటి. గత ఏడాది ఇళ్ళ ఋణాల సంక్షోభంలో మొదటగా కుప్పకూలిన సంస్థ.
(3) జేపీ మోర్గన్ - మరొక వాలువీధి మదుపు బేంకు. అమెరికను ప్రభుత్వం జోక్యంతో కూలిపోయిన బేర్ స్టెర్ణ్స్ ని కొన్నది.
(4) మిషిగన్ - అమెరికా ఉత్తర సరిహద్దులో ఉండే ఒక రాష్ట్రం. పంచ మహా సరోవరాలు దీని చుట్టూతా ఉన్నాయి. అతి పెద్ద నగరం డిట్రాయిట్ కార్ల తయారీకి ప్రపంచ ప్రఖ్యాతి గాంచింది.

Monday, August 3, 2009

Miss Sasha Kenkre's Bharatanatyam Rangapravesam - కుమారి శాష భరతనాట్య రంగ ప్రవేశం

(Note: Please scroll down to read this review in Telugu)

Miss Sasha Kenkre presented her graduation performance in Bharatanatyam (Rangapravesam or Arangetram) on August 1, 2009 at Varner Hall Auditorium on the campus of Oakland University in Auburn Hills, MI. I should say, Sasha came out with flying colors. The show was put together and perfectly conducted by Sasha's Guru (teacher), Mrs. Sandhyasree Athmakuri. Sixteen year old Sasha will be starting her junior year at International Academy high school.


I was a bit late in arriving at the venue and locating the correct auditorium. Sasha was in the middle of a Jathiswaram when I entered the hall. The Jathiswaram was composed in Raga Hamsanandi. Sasha executed the complicated jathis with ease and poise. Her knack for hitting the samam right on the spot was quite impressive. This was followed by an innovative Sabdam. Sabdam, traditionally, is any poetic piece that is full of meaning, set to music, and tests the mettle of the dancer in the expressive arena. Sasha, paying tribute to her Marathi origins, chose a popular Tulsidas Bhajan, Sri Ramachandra Krupalu. The music was set in Ragamalika, a garland of ragas. Here again, it is meaningful that the three chosen ragas, Yamunakalyani, Darbarikanada and Bageshri are primarily Hindustani ragas, but also widely sung in contemporary South Indian musical repertoire. Sasha performed this piece well, rising to the challenges of the expressive phrases, bringing out the majesty of Sri Rama, as the wielder of powerful bow, blue-hued like the rain laden cloud, the one who broke Siva's great bow and married Sita, the one who is always gracious and kind.


Next came the center piece of the show, the Varnam. The chosen piece was in Huseni Ragam and Rupaka talam. The lyrics, E maayaladi, depict the emotions of a heroine who is quarrelsome with her lord. The lord is none other than Sri Krishna. The heroine questions his dubious deeds, asking which scheming woman had bewitched him. Sasha's movement was vivacious and greaceful in the complex jathis that intersperse the stanzas. Endowed with round expressive eyes, Sasha also brought out the emotional appeal of the lyric very well, shifting quickly between the mighty lord to the querulous heroine, and the various other characters. She also incorporated a brief depiction of the Prahlada story while describing the great deeds of the Lord. It gladdened a die-hard fan of tradition like me that such a traditional piece, set in traditional music, was performed according to original choreography by none other than Sandhya's own Guru, the late great Sri Swamimalai Rajarathnam Pillai. It was a treat indeed.

After a brief intermission of refreshments and socializing, the audience soon settled down again for the remainder of the program. Sasha came on stage with a padham dedicated to Lord Siva, the originator of our dance itself. It is fitting that this piece was composed in raga Revathi (the tune of the vedas) by one of our foremost contemporary composers Sri Tanjavur Sankara Ayyar. The piece was energetic and Sasha ably brought out the many facets of Lord Siva who is at once meditative and dancing, at once the most terrible and the most benevolent. It is also fitting that the most popular poem on Lord Siva, Namaste astu bhagavan Visvesvaraya (an excerpt from the vedas) is incorporated at the end of the piece, to bring out the universal manifestation of Siva's divinity.

This was followed by a piece on Devi, depicting the joyous dance of the feminine divinity. This piece, set in Kambhoji Ragam, matched the energy of the previous piece, step to step. The thillana chosen for this auspicious performance was the one in Mohana Kalyani by another great contemporary composer and violinist extraordinaire, Sri Lalgudi Jayaraman. Even though this was the fag end of the program, Sasha executed the vigorous piece as if she's just warming up to the theme - which is no mean feature. The program concluded with a joyous salutation to Shirdi Sai Baba and a traditional Mangalam.

If I were to describe the whole show in just two words - joyful and vivacious. Even while describing emotionally charged and austere items, there is a certain mischievous humor lurking in Sasha's personality that comes through. This enlivened her portrayals of the hurt heroine, the austere Siva and the joyfully dancing Devi. The other impressive aspect is her energy. I sincerely hope Sasha would continue her journey in this incredible artistic path - she certainly has a very able guide in her Guru, Sandhya.


It is wonderful that the music troupe is made up entirely of very talented local artistes. Mrs. Pavani Mallajosyula on vocals, ably supported by Kumari Sahitya Chamarthi, Mr. Jaisingam on Mrudangam and Mr. Sashidhar on Veena - are all much admired and dearly loved members of our own family. The program was very ably conducted by Mrs. Sandhyasree Athmakuri. Sasha's parents, Mrs. Shama Kenkre and Mr. Mahendra Kenkre must be congratulated for the excellent arrangements and flawless hospitality, as well as for their unflinching support to Sasha's dance pursuit. Sasha had certainly done them proud today.

The program was organized by Shama and Mahendra under the auspices of Natyadharmi Foundation, a not-for-profit cultural organization founded and run by Mrs. Sandhyasree Athmakuri.

ఆగస్టు ఒకటో తేదీన కుమారి శాష కేంక్రే భరతనాట్య రంగప్రవేశం చేసింది స్థానిక ఓక్లాండ్ యూనివర్సిటీవారి ఆడిటోరియంలో. శాష గురువుగారైన శ్రీమతి సంధ్యశ్రీ ఆత్మకూరి ఈ కార్యక్రమాన్ని రూపొందించి సమర్ధంగా నిర్వహించారు. పదహారేళ్ళ శాష, శమ మహేంద్ర దంపతుల కూతురు, ఈ సంవత్సరం ఇంటర్నేషనల్ ఎకాడెమీ హైస్కూల్లో జూనియర్ సంవత్సరంలో ప్రవేశిస్తోంది

కొంచెం గజిబిజిగా ఉండే ఆ ఆవరణలో సరైన ఆడిటోరియాన్ని వెతుక్కుని నేను చేరుకునేప్పటికి కార్యక్రమం మొదలై పోయింది. నేను హల్లో ప్రవేశించేప్పటికి శాష జతిస్వరం చేస్తోంది. హంసానంది రాగం. జతిస్వరంలో మాటలుండవు, పూర్తిగా నృత్తమే. అతి జటిలమైన నృత్త జతుల రీతుల్ని శాష సునాయాసంగా చేసి తన పటువు చాటుకుంది. ఒక జతుల వరుస పూర్తయినప్పుడల్లా సరిగ్గా తాళానికి తగ్గట్టు సమం తాడించటం అద్భుతంగా ఉంది. అటు తర్వాత ప్రసిద్ధి చెందిన తులసీ దాసు రచించిన శ్రీరామచంద్ర కృపాలు భజ మన అనే భజన గీతాన్ని శబ్దంగా ప్రదర్శించింది శాష. శబ్దం అంటే భావం కలిగిన అంశం. ఇది ఒక పద్యం కావచ్చు, ఏదైనా పాట కావచ్చు. తన మరాఠీ వారసత్వానికి తగినట్టు ఈ పాటకి యమునాకళ్యాణి, దర్బారీకానడ, బాగేశ్రీ అనే మూడు హిందుస్తానీ రాగాల్ని ఎంచుకున్నారు. తమాషా ఏంటంటే, సాంప్రదాయకంగా ఈ రాగాల్ని కర్ణాటక పద్ధతిలో కూడా విరివిగా పాడుతుంటారు. శ్రీరాముని తేజస్సుని, ధీరత్వాన్ని, నీలమేఘశ్యామత్వాన్నీ శాష చక్కగా అభినయించింది.

భరతనాట్య ప్రదర్శనకి తలమానికమైన అంశం వర్ణం. అంతేకాదు, నాట్యం చేసేవారి పస తేల్చే అంశం కూడాను. పరంపరాగతమైన ఈ సాంప్రదాయ నాట్యానికి ప్రతీకగా చక్కటి సాంప్రదాయ వర్ణాన్ని ఎంపిక చేసినందుకు శాషనీ, గురువుల్నీ చాలా అభినందిస్తున్నాను. పైగా, సంధ్యగారి గురువు, స్వర్గీయ స్వామిమలై రాజరత్నం పిళ్ళై గారు దీనికి స్వయంగా నాట్య రచన చేశారు. అనేక సాంస్కృతిక విషయాల్లో సాంప్రదాయ పద్ధతులంటే పరవశించే నావంటి వారికి శాష ఈ వర్ణాన్ని ప్రదర్శించిన తీరు బహు ముచ్చటగా ఉంది. నాయిక కలహాంతరిత. ఏ మాయలాడిరా నిన్ను మందు పెట్టి వశపరుచుకున్నదీ అని నాయకుణ్ణి వాకిటనే నిలదీస్తోంది. నాయకుడా, జగన్నాటక సూత్రధారియైన శ్రీకృష్ణుడు. అటు ఆయన మూర్తిమత్వాన్ని, ఇటు నాయిక ఓర్వలేని తనాన్ని చిన్నారి శాష బహు చక్కగా అభినయీంచిందనే ఒప్పుకోవాలి. గుండ్రటి మొహమూ, వెడల్పాటి కళ్ళతో చక్కటి భావప్రకటనా సౌలభ్యం ఉన్న శాష ఈ వర్ణంలోనే మధ్యలో క్లుప్తంగా ప్రహ్లాద చరిత్ర ఘట్టం కూడా ప్రదర్శించింది.

కొద్దిపాటి విరామం తరువాత శివుని స్తుతించే పదంతో తిరిగి కార్యక్రమం మొదలైంది. ఈ పాటని సమకాలీన వాగ్గేయకారులు శ్రీ తంజావూరు శంకరయ్యరు గారు రేవతి రాగంలో రచించారు. సందర్భోచితంగా పాట చివరిలో శివస్తుతియైన వేదశకలం, నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ, అంటూ శివుని విశ్వమూర్తిమత్వాన్ని తెలియచెప్పడం సముచితంగా ఉంది. ఈ అంశాన్ని ప్రదర్శించడంలో శాష గొప్ప చమత్కృతిని కనబరిచింది. ఒకవంక భస్మధరుడు, ఆదిభిక్షువు, సదాజపుడు అయిన పుట్టు సన్యాసినీ, మరొకవంక తన ఆనంద తాండవ పారవశ్యంలో సకల సృష్టికీ నాందిపలికిన విశ్వేశ్వరునీ, గరళం మింగి సకల లోకాలను కాపాడిన కరుణామయుడు నీలకంఠుణ్ణీ సమపాళ్లలో ప్రేక్షకుల కళ్ళముందు ఆవిష్కరించింది. దీని వెనువెంటనే దేవి ఆందంద తాండవ నాట్యం కాంభోజిరాగంలో. అటుపిమ్మట లాల్గూడి రచన మోహన కళ్యాణి తిల్లానా. ఈ మూడింటిలోనూ శాష కనబరిచిన పొంగి పొరలిన ఉత్సాహం, ఎల్లలు లేకుండా ఉప్పొంగే శక్తి, ప్రేక్షకుల్ని అబ్బురపరిచాయంటే అతిశయోక్తి కాదు. తుదిగా తమ కులదైవం షిర్డీ సాయినాథునికి నాట్యాంజలి సమర్పించి సాంప్రదాయకమైన మంగళంతో విజయవంతంగా తన రంగప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణురాలైంది శాష.

మంచి భవిష్యత్తున్న ఈ చిరంజీవిన అడుగడుగునా ప్రోత్సహించడమే కాక, ఈనాటి కార్యక్రమానికి ఏర్పాట్లన్నీ బహు చక్కగా చేసిన శాష తలిదండ్రులు శమ, మహేంద్ర అభినందనీయులు. ఈ కార్యక్రమానికి సంగీత సహకారం అందించినవారందరూ స్థానికంగా పేరుపొందిన కళాకారులు కావడం ఒక విశేషం, మాకు గర్వకారణం. శ్రీమతి పావని మల్లాజోస్యుల గాత్రం, శ్రీ జయసింగం మృదంగం, శ్రీ శశిధర్ వీణ, కుమారి సాహిత్య చామర్తి గాత్ర సహకారంతో ప్రదర్శన రక్తి కట్టేందుకు శాషకి తోడ్పడ్డారు. కార్యక్రమాన్ని శాష గురువుగారైన శ్రీమతి సంధ్యశ్రీ ఆత్మకూరి గారు సమర్ధవంతంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమం సంధ్య గారి పర్యవేక్షణలో, నాట్యధర్మి ఫౌండేషన్ బేనర్ కింద జరిగింది.

Sunday, August 2, 2009

కబుర్లు ఆగస్టు 3

ఇరాన్లో మళ్ళీ అసంతృప్తి రాజుకుంటోంది. ఐతే ఈ సారి అది ఎటు తిరుగుతుందో, ఏ గాలి ఎటు వీస్తోందో ఎవరికీ అంతు పట్టకుండా ఉంది. ఇది కేవలం నియంతృత్వాన్ని భరించలేని ప్రజాభిప్రాయపు బలమే అనుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే ఇప్పటికీ ప్రజాభిప్రాయాన్ని తమ గుప్పిట్లో పదిలంగా పెట్టుకున్న నియంత ప్రభుత్వాలు బలంగానే ఉన్నాయి ప్రపంచంలో. ఎక్కడన్నా తమకి వ్యతిరేకమైన ప్రజాభిప్రాయం కాస్త బలం పుంజుకుని గొంతెత్తినా, పిడికిలి బిగించినా దాన్ని కర్కశంగా అణిచివేస్తూనే ఉన్నాయి. కేవలం ప్రజాభిప్రాయం మాత్రమే అయితే ఇరాన్ అధినేత కూడా దీన్ని అంత కర్కశంగానూ అణిచివేసే వాడే. ఇది ప్రభుత్వాధికారం చేజిక్కించుకో చూసే వివిధ రాజకీయ శక్తుల ప్రభంజనం అనే అనిపిస్తోంది. బలయ్యేది మాత్రం ప్రజలే.

ఈ వారం మరి కొన్ని పండుటాకులు రాలిపోయినాయి. నా వయసు వాళ్ళకి కొరజాన్ అఖీనో (భారద్దేశంలో కొరజాన్ అక్వినో అనేవాళ్ళం) బానే గుర్తుండి ఉండాలి. ఎనిమిదో దశకం చివర్లో నియంత ఫెర్డినాండ్ మార్కోస్ ని ఎదిరించి తొలి ప్రజాస్వామిక ఎన్నికల్లో నెగ్గి ఫిలిపీన్స్ అధ్యక్షురాలైంది. అంతకు మునుపు ఎటువంటి రాజకీయ అనుభవం లేని ఈ గృహిణి, ఐదుగురు బిడ్డల తల్లి, తన ఆరేళ్ళ పాలనలో ఎన్నో మిలిటరీ తిరుగుబాట్లని ఎదుర్కుని వమ్ము చేసింది. ఫిలిపీన్స్ లో ప్రజాస్వామ్య పాలనకి పునాది వేసింది. అప్పటి వరకూ అమలులో ఉన్న నియంతృత్వ విధానాలను నిర్మూలించి పాలనలో అనేక సంస్కరణలను ప్రవేశ పెట్టింది. ప్రపంచ వ్యాప్తంగా ప్రజాస్వామ్యానికీ, శాంతియుత పాలనకీ, స్త్రీ హక్కులకీ ఒక ప్రతీకగా వెలిగింది. అన్నిటికంటే నాకు నచ్చిన విషయం, తన ఆరేళ్ళ పదవీ కాలం ముగియగానే రాజకీయాలనించి విరమించింది. ఒకసారి అధికారం రుచి చూసినాక అలా వొదిలెయ్యగలగడం అందరికీ సాధ్యం కాదు. డెబ్భయ్యారేళ్ల వయసులో కోలన్ కేన్సరు జబ్బుతో గతవారంలో మరణించింది.

ఇరవయ్యవ శతాబ్దంలో ఆధునిక నాట్య రంగానికి దిశానిర్దేశం చెయ్యడమే కాక దాని విధిని శాసించిన మహా కళాకారుడు మెర్స్ కన్నింగ్‌హేం తన తొంభయ్యవ ఏట మరణించాడు. నాట్యం అంటే కదలికే, లయ అంటే గుండె చప్పుడే అని నమ్మిన మెర్స్ కదలికని అన్ని రూపాల్లో ప్రేమించి ఆరాధించి ఆధునిక నాట్యాన్ని ఉత్కృష్ట స్థాయికి తీసుకెళ్ళాడు. తాను చక్రాల కుర్చీకి పరిమితమైనా, తొంభయ్యేళ్ళ వయసులోనూ తన డాన్సు కంపెనీ రిహార్సల్సు పర్యవేక్షిస్తూ, అడపాదడపా ఇతర విద్యార్ధులకి నాట్య శిక్షణనిస్తూ తన చివరి ఊపిరిదాకా ఆయన కదులుతూనే, నాట్యం చేస్తూనే ఉన్నాడు. కళకి అంకితమవడం అంటే ఇదేనేమో.

నాకు డెమోక్రాట్ల మీద నమ్మకం బొత్తిగా పోతోంది. క్లింటన్ పదవి నెరపిన్నన్నాళ్ళూ, కాంగ్రెస్లో మాది మైనారిటి అని బీదరుపులు అరిచేవాళ్ళు. సరే బుష్ రాజ్యంలో సోదిలోకి లేకుండ పోయారు. చివర్లో కాంగ్రెస్ మీద పట్టు సాధించినా వీళ్ళు ఆ రెండేళ్ళల్లో పీకిందేమీ లేదు. ఇప్పుడు శ్వేతసౌధంలో తమ అధ్యక్షుడే. ఉభయ చట్టసభల్లోనూ తమదే మెజారిటీ. ఇంతవరకూ ఎకనామిక్ స్టిమ్యులస్ బిల్ (అదీ వాలువీధి బలిసిన పిల్లులకి మేత) తప్ప వీళ్ళు సాధించినదేమీ కనబడ్డం లేదు. వోలుమొత్తం ఆరోగ్య వ్యవస్థని తిరగా మరగా చేసేస్తా, దున్నేస్తాం అని మొదలెట్టిన యజ్ఞం ఇప్పుడు చల్లబడి చల్లబడి పూర్తిగా నీరుకారిపోయే స్థితికొచ్చింది. ఇంతలో కాంగ్రెస్ రేసెస్ .. హాయిగా అందరూ ఇళ్ళకి పోయారు. ఇప్పుడైనా ప్రజలు ఇంటికొచ్చిన తమ తమ ప్రతినిధులకి ఖడ్గతిక్కన భార్య చేసిన మర్యాద చేసి, కాస్త బుద్ధి చెప్పి మళ్ళి వాషింగ్టన్ కి పంపిస్తారని ఆసిద్దాం.

సుమారు రెండేళ్ళ తరవాత థియెటర్లో తెలుగు సినిమా చూశా. మగధీర బానే ఉంది. ఒకసారి చూడచ్చు. చందమామ కాజోల్ అప్పటికంటే వన్నె తేలింది. రాం చరణ్ తేజ కూడా ఇంప్రెసివ్ అనిపించాడు. డేన్సులు బాగా చేశాడు. పాతకాలపు గెటప్ లో బాగున్నాడు (ఇది అందరికీ నప్పదు). విలను నిజంగానే డ్రామా కంపెనీ నాటకం మధ్యలోంచి వేషం తీసెయ్యకుండ వచ్చినట్టున్నాడు. కాస్ట్యూములు, గట్రా బావున్నై. రాజమౌళిగారి బొడ్డు ఫిక్సేషను తీరినట్టుంది. పాటలు పర్లేదు. ఏక్షను సీన్లు కూడా కొద్దిగా మాత్రమే అతి అనిపించాయి. నాకెందుకో ఈ సినిమాలో సింహాద్రి, యమదొంగ ఛాయలు చాలా కనిపించాయి. రాజమౌళిగారు కొంచెం జాగ్రత్త వహించాలి. చివర్లో టైటిల్స్ పడేప్పుడు యూనిట్ సభ్యులందరితో హీరో హీరోయిన్ల పాట మంచి ఐడియా, సరదాగా ఉంది. దీనికి ఇంతకంటే రివ్యూ అనవసరమని ఇక్కడే కబుర్ల లో లాగించేస్తున్నా.

ఇద్దరు మిత్రులు బ్లాగంగేట్రం చేశారని ఇటీవలే తెలిసింది. శ్రీ తన తెలుగు సినిమా సైటుద్వారా సినిమా అభిమానులకి చిరపరిచితుడే. ఇప్పుడు
తన వ్యక్తిగత మనోభావాల్నీ బ్లాగుతూ మధ్యమధ్య తన కేమెరా చిత్రాలు కూడా మనతో పంచుకుంటున్నారు. శివ మా డిట్రాయిట్ తెలుగు సాహితీ సమితి సభ్యులు, చిరకాల మిత్రులు. బ్లాగు టైటిలు కూడా ఆయన వ్యక్తిత్వానికి తగినట్టు నిరాడంబరంగా పెట్తుకున్నారు. మీరూ ఒక లుక్కెయ్యండి.