నీవేనా నను తలచినది - 03

May 22, 2008 Thursday 3.20 PM

ట్రాయ్, మిషిగన్‌లో, బిగ్ బీవర్రోడ్డు మీదున్న స్టార్బక్స్ (1) లో కూర్చుని లాప్టాప్లో బ్రౌజ్ చేస్తున్నాడు తేజా. లాప్టాప్ మీద ఇంకో విండోలోంచి మిషిగన్ రేడియో ప్రసారం చేస్తున్న టాక్ ఆఫ్ది నేషన్ (2) కార్యక్రమం హెడ్ ఫోన్‌ల ద్వారా అతని చెవులకి చేరుతోంది. కార్యక్రమ సంధానకర్త నీల్ కోనన్ (2) డెమొక్రాటిక్ ప్రైమరీల్లో ఒబామా సాధిస్తున్న అద్భుతమైన విజయ పరంపర గురించీ, ప్రత్యర్ధి హిలరీ క్లింటన్ (3) ఇంకా ఓటమి నంగీకరించక పోవడంలోని అంతరార్ధం గురించీ ఇద్దరు రాజకీయ విశ్లేషకులతో ముచ్చటిస్తున్నాడు.

తేజా మిషిగన్‌కి వచ్చి వారమైంది. రొటీన్ బాగానే ఉంది. పొద్దుటి పూట ఒక రెండు గంటలు దగ్గర ఉన్న అడవుల్లో రన్నింగో బైకింగో చేస్తూ గడుపుతున్నాడు. వసంత ఋతువులో మిషిగన్ నిజంగానే చాలా అందంగా, ఆహ్లాద కరంగా ఉంటుంది. మధ్యాన్నాలు ఇలా కాఫీ షాప్, లేకపోతే పబ్లిక్ లైబ్రరీ. ఎటొచ్చీ సాయంత్రమంటేనే భయం. ఏం చెయ్యాలో తోచదు.

ఇక్కడ నా స్నేహితులెవరూ లేరు. ఎప్పుడో ఏళ్ళ క్రితం హైస్కూల్లో కలిసి చదువుకున్న వాళ్ళందరూ ఎక్కడెక్కడో.
ఉన్నట్టుండి కొత్త స్నేహితు లెలా దొరుకుతారు?
అక్కడికీ అమ్మ మంచిదే, ఇది చెయ్యి అది చెయ్యి, ఉద్యోగం లేకపోతే ఎలా అని ఊదర గొట్టటం లేదు. నామానానికి నన్ను ఉండనిస్తుంది.
కానీ ఎంత సేపు పుస్తకాలు చదవడం? ఎంత సేపు సినిమాలు చూడ్డం? ఏమేమి చేస్తే రోజులో మేలుకునుండే పద్ధెంది గంటలు గడుస్తాయి? ఏదో ఈ వారం వరకూ ఓకే, బహుశా ఇంకో వారం కూడా ఓకే. ఆ పైన ఇలా కాలక్షేపం .. నాకు తగింది కాదు.
ఏదో ఒక పని చెయ్యాలి. ఏదన్నా పనికొచ్చే పని చెయ్యాలి.
పోనీ మొన్న అమ్మ చెప్పినట్టు ఎక్కడన్నా వాలంటీర్ చేస్తే ..
డెమోక్రాట్ల లాగానే రిపబ్లికన్ ప్రైమరీ కూడా ఇంకా నడుస్తుంటే బాగుండు. నా రాజకీయ హీరో మిట్ రామ్నీ ఎప్పుడోనే అస్త్ర సన్యాసం చేసేశాడు.
పోనీ రాబర్టయినా ఇక్కడికి దగ్గర్లో ఉండుంటే బాగుణ్ణు. వాడు భలే ఆశ్చర్యంగా .. ఇంటికెళ్ళిన వారంలోనే వాళ్ళ నాన్నతో పొలం పనుల్లో మునిగి పోయాడు. చాట్లో కూడ దొరకట్లేదు.
నేను కూడా ఏదన్నా ఇక్కడ పొలంలో పనికి కుదిరితే పోతుంది. డబ్బు కోసం కాకపోయినా, రోజంతా ఇలా పిచ్చి ఆలోచనల్లేకుండా .. రాత్రయ్యేప్పటికి అలసటతో నిద్రకి వాలిపోయేలా .. నిద్ర .. రాదు ఎంతకీ .. కాస్త కునుకు పట్టిందంటే ఆ వంకర బొట్టు అమ్మాయి. ఉన్నవన్నీ చాలనట్టు ఇదో పిచ్చి గోల. అసలు నా ఉద్యోగం పోవడానికీ ఈ కలలో అమ్మాయికీ ఏదో సంబంధం
ఉన్నట్టుంది. నా ఉద్యోగం పోయే ముందు రాత్రే మొదటి సారి కల్లోకొచ్చింది.
ఛ, నాకు నిజంగానే పిచ్చెక్కుతోంది ఈ పనిలేని ఖాళీతో. ఇప్పుడింక ఇలాంటి మూఢనమ్మకాల్ని కూడా నమ్మేస్తున్నా ..
చెయ్యాలి, ఏదో ఒకటి చెయ్యాలి.
***
June 13, 2008 Friday, 7:00 PM

తేజా లెదర్ సోఫాలో చేరగిలబడి మ్యూట్‌లో ఉన్న టీవీ వంక చూస్తున్నాడు.
మాధవి పట్టు చీరలో తయారై మెట్లు దిగి వస్తూ కొడుకుని చూసింది.
నాలుగు రోజుల ఎదుగుదలతో గడ్డం మాసి ఉంది. చేతులు కత్తిరించిన నలిగి పోయిన పాత టీషర్టూ, పాత బాస్కెట్‌బాల్ షార్ట్సూ. ఇదివరకెప్పుడూ లేనిది, టీ షర్ట్‌లోనించి బీర్ బెల్లీ ఉబ్బుతోంది. సోఫాలో వాలి ఉన్న భంగిమలో ఒక నిర్లక్ష్యం, ఎవరు చూస్తేనేం .. టీవీకి అప్పగించిన కళ్ళల్లో ఒక నిస్తేజం .. ఏమైతేనేం.
వీణ్ణిలా వొదిలేస్తే లాభం లేదు అని తోచింది మాధవికి. తేజాకీ టీవీకి మధ్యలో అడ్డంగా నించుంది. నిరాసక్తంగానే తేజ కళ్ళు ఆమె వేపు చూసినై. ఆవిడ ధరించిన పట్టు చీరనీ, ప్రత్యేక శ్రద్ధతో చేసుకున్న అలంకారాన్నీ గమనించి ఒక్క లిప్తపాటు తేజ కళ్ళు మెరిశాయి.
మాధవి ప్రకటనల్లో చీరల మోడల్సిచ్చే భంగిమ పెట్టి,
"ఎలా ఉన్నాను?" అంది.
"యూ లుక్ ఫెంటాస్టిక్, మాం!" అన్నాడు.
"నాట్ బేడ్ ఫరె ఫిఫ్టీ యియరోల్డ్, హా?" అంది చిన్నగా నవ్వుతూ.
"నాట్ బేడ్ ఫొర్ ఎనీ ఏజ్ మాం. అసలు నాట్ బేడ్ కానే కాదు, సూపర్ గుడ్!! యూ లుక్ రియల్లీ బ్యూటిఫుల్."
ఎందుకీ ప్రత్యేక అలంకారం అన్న ప్రశ్న అతని పెదాల వెనక అణిచేసినా కళ్ళల్లో మెరిసింది.
"డోంట్ వరీ, నేనేం డేటింగ్ కి వెళ్ళట్లే. ఇవ్వాళ్ళ ఒబామా కోసం ఫండ్ రైజర్ జరుగుతోంది. స్థానిక డెమొక్రాటిక్ పార్టీ పెద్దలు, ఇద్దరు సెనేటర్లూ వస్తున్నారు. మన భారతీయులు చేస్తున్నారు."
"వావ్ .. ఐతే పెద్ద విశేషమే! ఐనా మన ఇండియన్లకి ఇంత రాజకీయ జ్ఞానం ఎలా పుట్టుకొచ్చిందబ్బా?"
"మన వాణీ ఆంటీ లేదూ? వాళ్ళమ్మాయి కామ్య .. నీతోటిదే. నిజానికి చిన్నప్పుడు మీరిద్దరూ తెలుగు ఎసోసియేషన్ కార్యక్రమాల్లో కలిసి డాన్సులేశారు. తనిప్పుడు ఇక్కడే వెయిన్ స్టేట్లో లా చదువుతోంది. మొదణ్ణించీ ఒబామా కేంపేన్లో వాలంటీర్ గా చురుగ్గా పాల్గొంది. ఇప్పుడు తను మొత్తం మెట్రో డెట్రాయిట్ కంతటికీ కేంపేన్ మేనేజర్. తనే మనవాళ్ళందర్నీ ఊదరకొట్టి కదిలించి ఇది నడిపిస్తోంది."
"వాణీ? కామ్యా? ఏమో నాకు గుర్తు లేదు."
"పోన్లే. అది ముఖ్యం కాదు. సరే కానీ, ఇంత అందంగా తయారైన మీ అమ్మకి తోడుగా, రక్షణగా రావూ?"
"నీకా? ఇంకొకళ్ళు రక్షణా?" అని విరగబడి నవ్వాడు.
ఆ మాత్రానికే మాధవి సంతోషించింది, తేజని ఆ నిస్సత్తువలోంచి కొంచెమైనా కదప గలిగానని.
"ఒక్క చేత్తో కొమెరికా బేంకుని సూది మొనమీద నాట్యం చేయిస్తావు. నువ్వంటే మీ ప్రెసిడెంటు కూడా హడలి చస్తాడు .. నీకు నేను రక్షణా?" అని మళ్ళీ నవ్వాడు.
"పోన్లే, నాకు రక్షణ కాకపోతే, నా కొడుకెంత హేండ్సమ్మో చూపించుకుంటాను నలుగురికీ, అందుకోసమన్నా, రా!"
"హమ్మ్ .. ఇదేదో బానే ఉంది. కానీ నా వంటి కరుడు గట్టిన రిపబ్లికన్ను ఒబామా ఫండ్ రైజరుకి చనుటయా" హేంలెట్ నాటకంలో డయలాగులాగా చెప్పాడు తేజ.
మాధవి ఇంక ఆలస్యం భరించలేనట్టు, విసుగు పుట్టినట్టు, "అబ్బ, రారా. ఏంటో ఒక్క సాయంత్రం నాతో బయటికి రమ్మంటే మహా నీలుగుతున్నావు, పద పోయి తయారవ్వు." అని తేజా సోఫాలోంచి బలంగా పైకి లాగి, మెట్ల వేపుకి గెంటింది.
తేజా అయిష్టంగానే మొహం పెట్టి మెల్లగా మెట్లెక్కి పైన తన బాత్రూంలోకెళ్ళి గడ్డం చేసుకోడం మొదలెట్టాడు.
"ఏదో పిచ్చి బట్టల్తో తయారు కాకు, ఫార్మల్, టక్స్ అండ్ బ్లాక్ టై రోయ్" కిందనించే అరిచి చెప్పింది మాధవి.
***
పద సూచిక
(1) స్టార్బక్స్ - ప్రసిద్ధ కాఫీ షాపు.
(2) టాక్ ఆఫ్ది నేషన్ - నేషనల్ పబ్లిక్ రేడియో పనివారపు రోజుల్లో మధ్యాన్నం పూట ప్రసారం చేసే సమకాలీన విషయాల చర్చా కార్యక్రమం. నీల్ కోనన్ దీని సంధాన కర్త.
(3) హిలరీ క్లింటన్ - అమెరికను రాజకీయ వేత్త, మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ సతి, అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్ధిత్వానికి ఒబామా తో పోటీ పడి, దేశ చరిత్రలోనే సుదీర్ఘమైన ప్రైమరీ కేంపేన్ నడిపారు. ఒబామా విజయం తరవాత కేబినెట్ లో విదేశాంగ మంత్రిగా చేరారు.

Comments

పనిలేని ఖాళీ ?
(తేజ మాటలు కదా అలానే వుంటాయనుకుందాం.)

నాలుగు రోజుల ఎదుగుదలతో గడ్డం మాసి ఉంది.
(ఇది కూడా తేజ మాట లాగానే వుంది.)
మంచి పట్టే పట్టారు.
తేజ మాట అవడం వల్ల వచ్చింది కాదది, నా పొరబాటే. ఆంగ్లంలో ఆలోచించి తెలుగులో రాయడం వల్ల వచ్చిన తిప్పలు.
Unknown said…
కొత్తపాళిగారు,

ఈ కథని appreciate చెయ్యాలంటే అమెరికా రాజకీయాల గురించి, అందులో భారతీయుల పాత్ర గురించీ తెలియాల్సిన అవసరం ఉన్నట్టుంది. అంచేత నాకంతగా ఎక్కలేదు. ఇందులోని పాత్రలు వేటికో సంకేతంగా మలచినట్టుగా మాత్రం అనిపించింది.
శైలి విషయానికొస్తే, మీరే అన్నట్టు, ఇది ఇంగ్లీషు కథకి తెలుగు అనువాదం లాగానే ఉంది.

చిన్న సందేహం:
ఈ భాగంలో రెండో పేరా, "తేజా మిషిగన్‌కి వచ్చి వారమైంది." అని మొదలుపెట్టి, "ఇక్కడ నా స్నేహితులెవరూ లేరు." అంటూ first personలోకి మారిపోయిందేమిటి?
ధన్యవాదాలు కామేశ్వర్రావుగారు.
అందుకే నాకు అవసరమనిపించిన అమెరికా విషయాల్ని పదసూచికల్లో పెట్టాను.
ఇక మొదటిపేరాలో ప్రథమ నించి ఉత్తమ కి మారడం .. ఆ చివరి వాక్యం ఆ పేరానించి విడిగా ఉండాలి. ఆ పేరా మాత్రం కథకుడి గొంతు. ఆ చివరి వాక్యంతో మొదెలెట్టి తేజా మనోగతంలోకి వెళ్తోంది.