అలరించిన తానా సావనీరు

2009 షికాగో తానా మహసభల జ్ఞాపిక తెలుగుపలుకు సర్వాంగ సుందరంగా అలరిస్తోంది. సావనీర్ కమిటీ సభ్యులూ, ఎడిటర్లూ, ఇతరత్రా సహాయం చేసిన యావద్బృందానికీ అనేకానేక అభినందనలు. చదువరులకి సులభంగానే తెలుస్తుంది దీన్ని రూపొందించడంలో చాలా ఆలోచన జరిగిందనీ, తీర్చి దిద్దడానికి అకుంఠిత కృషి జరిగిందనీ.

సాధారణంగా ఈ సభలకి ముద్రించే సావనీర్లు పూర్వకాలం కాలేజీ ఏన్యువల్ మేగజీన్లకి కొంచెం పైస్థాయిలో ఉంటూ వచ్చినా, రచనల్లో అదే సమన్వయ లోపం, పుస్తకం కూర్పులో అదే గందరగోళం. ఈ జ్ఞాపికలో అలా కాక, స్పష్టంగా ఒక ప్రణాళికతో కార్యవర్గం నడుం బిగించినట్టు అర్ధమవుతోంది.

చిత్రకళకి పెద్దపీట


పుస్తకంలో మొదటే కొట్టొచ్చినట్టు కనబడేది చిత్రకళ విభాగం. పై అట్టతొ మొదలు పెట్టి, సుమారు 30 వర్ణ చిత్రాల్ని పూర్తిరంగుల్లో పునర్ముద్రించారు. పాపులర్ ఆర్టిస్టులయిన బాపు, వడ్డాది పాపయ్య, అలనాటి మహామహులు దామెర్ల, మా. గోఖలే, అంతర్జాతీయంగా పేర్గాంచిన కృష్ణారెడ్డి, ఎస్వీ రామారావు, నేటివిటీని అందల మెక్కించిన వైకుంఠం, ఏలే లక్ష్మణ్, ఇప్పుడిప్పుడే ఎదిగి వస్తున్న అక్బర్, గిరిధర గౌడ్ ప్రభృతులు మనకి దర్శనమిస్తారు. ఈ విభాగంలో కృష్ణారెడ్డిగారి అద్భుతమైన ప్రింట్ మేకింగ్ కళని గురించి డా. జంపాల చౌదరి పరిచయ వ్యాసం, సాంప్రదాయ చిత్రకళ ఆధునికతని సంతరించుకుంటున్న తీరుని గురించి కాండ్రేగులా నాగేశ్వర్రావు విశ్లేషణ, మద్దాలి సీతారాం ఫొటోగ్రఫీ పరిచయం చాలా బాగున్నాయి. చిత్రకారుల క్లుప్తపరిచయాలివ్వడం కూడా బాగుంది. సావనీరు వెనక అట్ట మీద తెలుగు సాహితీ మూర్తుల శిరస్సుల్ని మౌంట్ రష్మోరుకెక్కించిన ఉదంతం ఇదివరకే ప్రస్తావించాను.

ఈ చిత్రకళా విభాగాన్ని గురించి అభినందనలు తెలుపుతూ ముఖ్య సంపాదకులు జంపాల చౌదరి గారితో ముచ్చటించినప్పుడు మరి కొన్ని వివరాలు తెలిపుతూ ఈ చిత్ర విభాగానికి తానే పూర్తి బాధ్యత వహించానని చెప్పారు. ఐతే దీన్నింత సర్వాంగ సుందరంగా మలచడంలో చప్పట్లన్నీ సహసంపాదకుడు వాసిరెడ్డి నవీన్ (హైదరాబాదు) కు చెందుతాయని చెప్పారు. ప్రింటుకి ముందు జరగాల్సిన కార్యక్రమం అంతా "అక్షర" సీత (హైదరాబాదు) నిర్వహించారు. ప్రింటు నాణ్యతని పలువురు మెచ్చుకున్నా, తనకి పూర్తిగా సంతృప్తి కలగలేదనీ, ఇంకొంచెం ప్రూఫులు పరీక్షించే సమయం ఉంటే క్వాలిటీ మెరుగు పరిచి ఉండొచ్చనీ అభిప్రాయ పడ్డారు. ఇది ఆయనలోని పర్ఫెక్షనిస్టు మాట్లాడ్డం. నేను చెబుతున్నా .. బొమ్మలు చాలా చక్కగా వచ్చాయి.

సాహిత్య దిగ్గజాలకి అక్షర నీరాజనం


ఆధునిక తెలుగు సాహిత్యానికి దిశానిర్దేశం చేసిన మహామహులు నలుగురికి ఈ ఏడాది శతజయంతి సంవత్సరం కొద్ది నెలల తేడాతో. వీరిని స్మరించుకుంటూ వారి ప్రతిభని జీవితాల్ని గుర్తు చేసుకుంటూ పట్టిన శతజయంతి నీరాజనం ఈ జ్ఞాపికలో మనల్ని ఆకట్టుకునే రెండో అంశం. అంతే కాదు, సాహితీ పిపాసులకి తృప్తినిచ్చేది కూడా. శ్రీశ్రీ, కొడవటిగంటి కుటుంబరావు, నార్ల వెంకటేశ్వర్రావు, త్రిపురనేని గోపీచంద్ .. ఒక్కొక్కరిని గురించీ, ముందుగా వారి రచనని సమగ్రంగా సమీక్షించే పరిచయ వ్యాసం, అటుపైన వారి రచనా వైవిధ్యాన్నో, జీవిత విశేషాలనో పంచుకునే ఆత్మీయ కథనాలొకటి రెండు, పిమ్మట వారి రచనలు ఒకటి రెండు .. ఇదీ వరస. శ్రీశ్రీ కవిత్వానికి ఇవ్వాళ్ళ ఉన్న విలువ ఏమిటి అని తూకం కట్టిన పాపినేని శివశంకర్ గారి వ్యాసం వీటన్నిటిలోకీ విలువైనది. కొకు రచనల్ని గురించి వోల్గా గారి వ్యాసంలో మార్క్సిస్టు సిద్ధాంత ప్రవచనం ఎక్కువై రచనా విశ్లేషణ వెనకబడిన దరిమిలా ఇది మార్క్సిస్టు ప్రాథమిక పాఠంలా అనిపించింది. నార్ల సంపాదకీయ పటిమని గురించి పొత్తూరి గారి వ్యాసం క్లుప్తంగా ముచ్చటగా ఉంది, నార్ల కలం పదును అసలు పరిచయం లేని ఈ తరానికి ఇది చక్కటి పరిచయం. చివరిగా గోపీచంద్ సాహిత్య జీవితాన్ని పరిచయం చేసిన మృణాళిని గారి వ్యాసం అతి పేలవంగానూ, గజిబిజిగానూ ఉంది. వ్యాసం మొత్తానికి ఒక లక్ష్యం లేకపోవడం అటుండగా, పదోతరగతి విద్యార్ధుల రాతని తలపించే వాక్యనిర్మాణం నన్ను విభ్రాంతికి గురిచేసింది. ఈ వ్యాసకర్త తెలుగు వివిలో ఆచార్యులు అంటే నమ్మడం కష్టం. మరి ఇంత అధ్వాన్నమైన వ్యాసాన్ని సంపాదకులు ఎలా స్వీకరించారో!

ఈ విభాగంలో శ్రీశ్రీ కథ అశ్వమేధం, కొకు కథ ఫోర్త్ డైమెన్షన్, నార్లవారివి రెండు సంపాదకీయాలు (ఒకటి ఆంధ్ర రాష్ట్రావతరణ సందర్భంలో రాసినది), గోపీ చంద్ కథ జనానా మనల్ని పలకరించి అలరిస్తాయి. అమెరికా పర్యటనలో శ్రీశ్రీ పిట్స్‌బర్గ్ తెలుగువారినుద్దేశించి చేసిన ప్రసంగ పాఠం, శ్రీశ్రీని గురించి ఇజ్రయెలీ సాహిత్య విమర్శకుడు జాన్ మిర్డల్ ఆంగ్ల వ్యాసం ప్రత్యేక ఆకర్షణలు. ఇవన్నీ ఇలా ఉండగా, వీరితో తమ ఆత్మీయసంబంధాన్ని నెమరు వేసుకున్న జ్ఞాపకాల కథనాలు (శ్రీశ్రీ తనయుడు వేంకటరమణ, కొకు భార్య వరూధిని గారు, నార్ల గురించి ఎస్వీ రామారావుగారు, గోపీచంద్ తనయుడు సాయిచంద్) ఈ మహనీయుల్లోని సజీవమానవత్వాన్ని మన కళ్ళముందు నిలబెడతాయి.

(ఇంకా వుంది)

Comments

మురళి said…
చదవాలనిపిస్తోంది..
gaddeswarup said…
Jan Myrdal is Swedish:
http://en.wikipedia.org/wiki/Jan_Myrdal
@gaddeswarup .. yes sir. You're right.