నీవేనా నను తలచినది - ఆఖరు

June 13, 2008 Friday, 8:29 PM

బర్టన్ మేనర్ ఏదో ఫైవ్ స్టార్ హోటల్లో గ్రాండ్ బాల్రూం లాగా అలంకరించి ఉంది. గోడలకీ, స్తంభాలకీ డెమొక్రాటిక్ పార్టీ రంగులు, అమెరికన్ జాతీయ పతాకం రంగుల్లో రిబ్బన్లు వేలాడుతున్నాయి. అందంగా అమర్చిన అనేక భోజన బల్లల మధ్య జాగాలో సుమారు ఐదొందల మంది చిన్న చిన్న గుంపుల్లో కబుర్లు చెప్పుకుంటున్నారు. మగవారందరూ జాతి భేదం లేకుండా టక్సీడో, నల్ల బౌ టై లు ధరించారు. కొందరు భారతీయ స్త్రీలు చక్కటి చీరల్లో సింగారించుకుని ఉండగా, ఇతర స్త్రీలు ఆకర్షణీయమైన డ్రెస్సుల్లో ఉన్నారు.
మొత్తానికి ఓక్లాండ్ కౌంటీలో ధనికులుగా, తమతమ రంగాల్లో విజయం సాధించిన వారుగా పేరుమోసిన భారతీయ స్త్రీపురుషులు చాలా మంది అక్కడ ఉన్నారు.

అనేకులు తనకి పరిచయస్తులూ, కొందరు మంచి స్నేహితులూ కావడంతో మాధవి ఆ గుంపుల్లో పూర్తిగా మునిగి పోయింది. తేజా ఒక పక్కన నిలబడి పేంటు జేబుల్లో చేతులుంచుకుని ఆ సందోహాన్ని చూస్తున్నాడు. కొంత దూరంలో మిషిగన్ సెనేటర్ కార్ల్ లెవిన్‌ని గుర్తు పట్టాడు. ఒక టీవీ న్యూస్ సంధాతని కూడా గుర్తు పట్టాడు. కొంచెం బోరుగా ఉంది కానీ ఈ సందోహం అంతా చూస్తూంటే వినోదంగా కూడా ఉంది. అదీ కాక శత్రు శిబిరం వాళ్ళు ఏమనుకుంటున్నారో తెలుసుకోడానిక్కూడా ఇది మంచి అవకాశం అనుకున్నాడు. అనుకుని తనకు తానే నవ్వుకున్నాడు, అక్కడికి తనేదో రిపబ్లికన్ పార్టీకి గూఢచారి అయినట్టు.

ఇంతలో మాధవి సుడిగాలిలా వచ్చి తేజా జబ్బ పట్టుకుని డ్రింక్స్ ఉన్న టేబిల్ దగ్గరికి తీసుకెళ్ళింది. టేబుల్ దగ్గర అటు తిరిగి పొడుగ్గా ఉన్న ఒకమ్మాయి డ్రింక్స్ సెర్వ్ చేస్తున్న తెల్ల పిల్లతో ఏదో మాట్లాడుతోంది. వెనక నించి చూస్తే బుజాల కింది దాకా ఉన్న ఆమె నల్లటి జుట్టు ఫేషనబుల్ గా కట్ చేసి ఉంది. మనిషి సన్నగా, పొడుగ్గా ఉంది. రంగు రంగుల్లో చెంకీ పని చేసిన లేత నీలం రంగు షిఫాన్ చీర కట్టుకునుంది. ఆమె వేసుకున్న రవిక వీపు భాగం కూడా ఆమె శరీరాకృతికి తగినట్టు ఫేషన్‌గా కుట్టి ఉంది.

మాధవి చనువుగా వెనకనించే ఆ అమ్మాయి భుజమ్మీద చెయ్యేసి, "కామూ, ఐ వాంట్యూ టు మీట్ సంబడీ" అంది.

ఆ అమ్మాయి పక్కకి తిరిగి "హాయ్ ఆంటీ" అని మాధవి బుగ్గ మీద పల్చటి ముద్దు పెట్టి, పూర్తిగా వెనకి తిరిగి తేజని చూసింది.

"కామూ, దిసీజ్ మై సన్, తేజ. తేజా, దిసీజ్ కామ్య!"

ఆ అమ్మాయి కనుబొమల మధ్య చిన్న మెరుపు తీగలాంటి బొట్టు బిళ్ళ, సెంటర్ కి కొంచెం పక్కగా, వంకరగా ఉంది.
తేజా నోటి వెంట మాట రాలేదు, కానీ ఆ బొట్టు బిళ్ళని సరిదిద్దాలని అతని చేతులు మహా దురద పెట్టేస్తున్నాయి.
***
June 21, 2008 Saturday, 10:00 AM

బ్లూంఫీల్డ్ హిల్స్‌లో (1) సంపన్నుల ఇళ్ళుండే ఒక కాలనీలో ఒక టొయోటా ప్రియస్ (2) కారొచ్చి ఆగింది.
దాని వెనుక బంపర్ మీద ఒబామా 08 అనీ, మేం పని చేస్తున్నాం మార్పుకోసం అనీ స్టిక్కర్లు అంటించి ఉన్నాయి.
ఆ కార్లోంచి ఒక యువకుడు దిగాడు. చక్కటి పోలో షర్ట్, ఇస్త్రీ చేసిన షార్ట్స్ వేసుకునున్నాడు. అతని చొక్కా ఛాతీ మీద ఒబామా బటన్ పిన్ చేసి ఉంది. తలమీద టీం ఒబామా అని ఎంబ్రాయిడరీ చేసిన బేస్‌బాల్ కేప్ ఉంది.
అతను తన చేతిలో ఉన్న అట్టమీద పేర్ల లిస్టు ఒకసారి చూసుకుని, దగ్గర్లో ఉన్న ఇంటి గుమ్మంలోకి వెళ్ళి కాలింగ్ బెల్ నొక్కాడు.
సుమారు నలభయ్యేళ్ళ తెల్ల మనిషి తలుపు తీసి, ఎవరు అన్నట్టు ప్రశ్నార్ధకంగా చూశాడు.
ఈ యువకుడు స్నేహపూర్వకంగా నవ్వి, "హాయ్, మిమ్మల్ని డిస్టర్బ్ చేసినందుకు మన్నించండి. నా పేరు తేజా. నేను ఒబామా తరపున ఎన్నికల ప్రచారానికి ఇవ్వాళ్ళ మీ ఇంటి తలుపు తట్టాను. మీకు అభ్యంతరం లేకపోతే, ఒక రెణ్ణిమిషాలు మాట్లాడొచ్చా?" అన్నాడు.

***
పదసూచిక
(1) బ్లూంఫీల్డ్ హిల్స్ - డిట్రాయిట్ పరిసర ప్రాంతాల్లో ఒకటి, సంపన్నమైన ఊరు.
(2) టొయోటా ప్రియస్ - హైబ్రిడ్ టెక్నాలజీ కారు. గేలను పెట్రోలుకి సుమారు 50 మైళ్ళిస్తుంది. పర్యావరణ రక్షణ, బాధ్యతగా జీవించడం వంటి విలువల్ని నమ్మే వారికి ఒక ప్రతీక అయింది ఈ కారు.

Comments

Anonymous said…
మీరు కామ్యా అను అమాయి గురించి వర్ణించిన తీరు నాకు నచ్చింది. నాక్కూడా అటువంటి అమ్మాయి తారసపడాలని కోరుకుంటున్నాను.
Krishna said…
kadha baagumdanDi! chaala sunnitamgaa manasuni taakindi. maLLee nyuuyaark veedulloa tiriginanta aahlaadamgaa undi. kadha loa teajaa ki verea edainaa jaab vachhea varakuu poDiginchi unTea baagunDeademoa !!
Krishna .. కథ మీకు నచ్చినందుకు సంతోషం. తేజకి ఉద్యోగం రావడం ముఖ్యం కాదు అనేది కూడా కథలో ఒక పోయింట్. దయచేసి ఇకమీదట వ్యాఖ్యల్ని తెలుగులోనే రాయండి.
Saipraveen .. అభీష్ట సిద్ధిరస్తు
కథనం బాగుంది. కథ 'మ్?ఇంతేనా!' అనిపించింది. సీరియల్ అనేటప్పటికి ఇదొక బృహత్కథ, ఆర్థిక రాజకీయ కథ అనేటప్పటికి ఇందులో ప్రస్తుత పరిస్థితులపై మీ కథలోని పాత్రల ఆలోచనలు మరికొంత దీర్ఘంగా వుంటాయేమో అనుకోవడంవల్ల కాబోలు, చివరికొచ్చేసరికి 'ఓస్..ఇది ప్రేమ కథ కూడా కదా! ఐనా ఇందులో ప్రేమెక్కడుందీ?' అనిపించింది. కథ గుఱించిన బిల్డప్ ఎక్కువైపోయింది. చివరిభాగం చివరలో తప్ప మిగతా భాగాలన్నింటిలోనూ చదివించే గుణం వుంది. ఆ బొట్టు వంకరగా వుండటం, తేజ దాన్ని సరిదిద్దాలని అప్రయత్నంగా కదలడం..ఇవి మాటిమాటికీ కథలో రావడంతో ముందుముందు చెప్పబోయే దేనికో సింబాలిజమ్ అయివుంటుందనుకున్నాను. చదివినంతసేపూ చాలా బాగుంది. చివరిభాగం చదివాక, మొహం గోడకు గుద్దుకున్నవాడిలా కొంతసేపు ఏమీతోచకుండా పోయింది.
Hima bindu said…
రెండు రోజులనుండి చదవడానికి ప్రయత్నించి ..కోరుకుడుపడక ఈ రోజు ఏమైనాసరే చదివేయాలని నిర్ణయించుకుని పది నిమిషాల్లో పూర్తి చేసాను ..అప్పుడప్పుడు విపులలో చదివే అనువాద కథ లా వుంది .మీరుతెలుగు పట్ల చాల కచ్చితంగా వుండటం గమనించాను బ్లాగ్లో మీరు రాసినవాటి ద్వారా ,కాని కథలో కొంచెం తేడాగా వుండటం గమనించాను ...బహుశా అక్కడి నేపధ్యం అనుకోవాలో ...ఒక చోట 'రవిక'అని వాడుకలేని (అంటే వ్యావహారికం లో )లేని పద ప్రయోగం చేసి ఇంకో చోట ఆకర్షనీయమైన 'డ్రెస్'లు అన్నారు ...దుస్తులు అంటే బాగుంటుంది కదా ...ఇలా కొన్ని ....ఇంకో చోట ....

"తేజా నోటి వెంట మాట రాలేదు, కానీ ఆ బొట్టు బిళ్ళని సరిదిద్దాలని అతని చేతులు మహా దురద పెట్టేస్తున్నాయి."రాసే భాష కూడా ముఖ్యం కదా ....క్షమించండీ ఇలా చెప్పడం తప్పో ఒప్పో కాని చదివాకా రాయకుండా వుండలేకపోతున్నా ....ఈ కథని మీరు ఇంకా బాగా రాయోచ్చేమోనని అనుకుంటున్నాను. ఏమైనా నొప్పిస్తే మన్నించండీ.
రానారె, చిన్ని .. మంచి పాయింట్లు లేవనెత్తారు. దృష్టిలో పెట్టుకుంటాను. ధన్యవాదాలు.