కబుర్లు ఆగస్టు 3

ఇరాన్లో మళ్ళీ అసంతృప్తి రాజుకుంటోంది. ఐతే ఈ సారి అది ఎటు తిరుగుతుందో, ఏ గాలి ఎటు వీస్తోందో ఎవరికీ అంతు పట్టకుండా ఉంది. ఇది కేవలం నియంతృత్వాన్ని భరించలేని ప్రజాభిప్రాయపు బలమే అనుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే ఇప్పటికీ ప్రజాభిప్రాయాన్ని తమ గుప్పిట్లో పదిలంగా పెట్టుకున్న నియంత ప్రభుత్వాలు బలంగానే ఉన్నాయి ప్రపంచంలో. ఎక్కడన్నా తమకి వ్యతిరేకమైన ప్రజాభిప్రాయం కాస్త బలం పుంజుకుని గొంతెత్తినా, పిడికిలి బిగించినా దాన్ని కర్కశంగా అణిచివేస్తూనే ఉన్నాయి. కేవలం ప్రజాభిప్రాయం మాత్రమే అయితే ఇరాన్ అధినేత కూడా దీన్ని అంత కర్కశంగానూ అణిచివేసే వాడే. ఇది ప్రభుత్వాధికారం చేజిక్కించుకో చూసే వివిధ రాజకీయ శక్తుల ప్రభంజనం అనే అనిపిస్తోంది. బలయ్యేది మాత్రం ప్రజలే.

ఈ వారం మరి కొన్ని పండుటాకులు రాలిపోయినాయి. నా వయసు వాళ్ళకి కొరజాన్ అఖీనో (భారద్దేశంలో కొరజాన్ అక్వినో అనేవాళ్ళం) బానే గుర్తుండి ఉండాలి. ఎనిమిదో దశకం చివర్లో నియంత ఫెర్డినాండ్ మార్కోస్ ని ఎదిరించి తొలి ప్రజాస్వామిక ఎన్నికల్లో నెగ్గి ఫిలిపీన్స్ అధ్యక్షురాలైంది. అంతకు మునుపు ఎటువంటి రాజకీయ అనుభవం లేని ఈ గృహిణి, ఐదుగురు బిడ్డల తల్లి, తన ఆరేళ్ళ పాలనలో ఎన్నో మిలిటరీ తిరుగుబాట్లని ఎదుర్కుని వమ్ము చేసింది. ఫిలిపీన్స్ లో ప్రజాస్వామ్య పాలనకి పునాది వేసింది. అప్పటి వరకూ అమలులో ఉన్న నియంతృత్వ విధానాలను నిర్మూలించి పాలనలో అనేక సంస్కరణలను ప్రవేశ పెట్టింది. ప్రపంచ వ్యాప్తంగా ప్రజాస్వామ్యానికీ, శాంతియుత పాలనకీ, స్త్రీ హక్కులకీ ఒక ప్రతీకగా వెలిగింది. అన్నిటికంటే నాకు నచ్చిన విషయం, తన ఆరేళ్ళ పదవీ కాలం ముగియగానే రాజకీయాలనించి విరమించింది. ఒకసారి అధికారం రుచి చూసినాక అలా వొదిలెయ్యగలగడం అందరికీ సాధ్యం కాదు. డెబ్భయ్యారేళ్ల వయసులో కోలన్ కేన్సరు జబ్బుతో గతవారంలో మరణించింది.

ఇరవయ్యవ శతాబ్దంలో ఆధునిక నాట్య రంగానికి దిశానిర్దేశం చెయ్యడమే కాక దాని విధిని శాసించిన మహా కళాకారుడు మెర్స్ కన్నింగ్‌హేం తన తొంభయ్యవ ఏట మరణించాడు. నాట్యం అంటే కదలికే, లయ అంటే గుండె చప్పుడే అని నమ్మిన మెర్స్ కదలికని అన్ని రూపాల్లో ప్రేమించి ఆరాధించి ఆధునిక నాట్యాన్ని ఉత్కృష్ట స్థాయికి తీసుకెళ్ళాడు. తాను చక్రాల కుర్చీకి పరిమితమైనా, తొంభయ్యేళ్ళ వయసులోనూ తన డాన్సు కంపెనీ రిహార్సల్సు పర్యవేక్షిస్తూ, అడపాదడపా ఇతర విద్యార్ధులకి నాట్య శిక్షణనిస్తూ తన చివరి ఊపిరిదాకా ఆయన కదులుతూనే, నాట్యం చేస్తూనే ఉన్నాడు. కళకి అంకితమవడం అంటే ఇదేనేమో.

నాకు డెమోక్రాట్ల మీద నమ్మకం బొత్తిగా పోతోంది. క్లింటన్ పదవి నెరపిన్నన్నాళ్ళూ, కాంగ్రెస్లో మాది మైనారిటి అని బీదరుపులు అరిచేవాళ్ళు. సరే బుష్ రాజ్యంలో సోదిలోకి లేకుండ పోయారు. చివర్లో కాంగ్రెస్ మీద పట్టు సాధించినా వీళ్ళు ఆ రెండేళ్ళల్లో పీకిందేమీ లేదు. ఇప్పుడు శ్వేతసౌధంలో తమ అధ్యక్షుడే. ఉభయ చట్టసభల్లోనూ తమదే మెజారిటీ. ఇంతవరకూ ఎకనామిక్ స్టిమ్యులస్ బిల్ (అదీ వాలువీధి బలిసిన పిల్లులకి మేత) తప్ప వీళ్ళు సాధించినదేమీ కనబడ్డం లేదు. వోలుమొత్తం ఆరోగ్య వ్యవస్థని తిరగా మరగా చేసేస్తా, దున్నేస్తాం అని మొదలెట్టిన యజ్ఞం ఇప్పుడు చల్లబడి చల్లబడి పూర్తిగా నీరుకారిపోయే స్థితికొచ్చింది. ఇంతలో కాంగ్రెస్ రేసెస్ .. హాయిగా అందరూ ఇళ్ళకి పోయారు. ఇప్పుడైనా ప్రజలు ఇంటికొచ్చిన తమ తమ ప్రతినిధులకి ఖడ్గతిక్కన భార్య చేసిన మర్యాద చేసి, కాస్త బుద్ధి చెప్పి మళ్ళి వాషింగ్టన్ కి పంపిస్తారని ఆసిద్దాం.

సుమారు రెండేళ్ళ తరవాత థియెటర్లో తెలుగు సినిమా చూశా. మగధీర బానే ఉంది. ఒకసారి చూడచ్చు. చందమామ కాజోల్ అప్పటికంటే వన్నె తేలింది. రాం చరణ్ తేజ కూడా ఇంప్రెసివ్ అనిపించాడు. డేన్సులు బాగా చేశాడు. పాతకాలపు గెటప్ లో బాగున్నాడు (ఇది అందరికీ నప్పదు). విలను నిజంగానే డ్రామా కంపెనీ నాటకం మధ్యలోంచి వేషం తీసెయ్యకుండ వచ్చినట్టున్నాడు. కాస్ట్యూములు, గట్రా బావున్నై. రాజమౌళిగారి బొడ్డు ఫిక్సేషను తీరినట్టుంది. పాటలు పర్లేదు. ఏక్షను సీన్లు కూడా కొద్దిగా మాత్రమే అతి అనిపించాయి. నాకెందుకో ఈ సినిమాలో సింహాద్రి, యమదొంగ ఛాయలు చాలా కనిపించాయి. రాజమౌళిగారు కొంచెం జాగ్రత్త వహించాలి. చివర్లో టైటిల్స్ పడేప్పుడు యూనిట్ సభ్యులందరితో హీరో హీరోయిన్ల పాట మంచి ఐడియా, సరదాగా ఉంది. దీనికి ఇంతకంటే రివ్యూ అనవసరమని ఇక్కడే కబుర్ల లో లాగించేస్తున్నా.

ఇద్దరు మిత్రులు బ్లాగంగేట్రం చేశారని ఇటీవలే తెలిసింది. శ్రీ తన తెలుగు సినిమా సైటుద్వారా సినిమా అభిమానులకి చిరపరిచితుడే. ఇప్పుడు
తన వ్యక్తిగత మనోభావాల్నీ బ్లాగుతూ మధ్యమధ్య తన కేమెరా చిత్రాలు కూడా మనతో పంచుకుంటున్నారు. శివ మా డిట్రాయిట్ తెలుగు సాహితీ సమితి సభ్యులు, చిరకాల మిత్రులు. బ్లాగు టైటిలు కూడా ఆయన వ్యక్తిత్వానికి తగినట్టు నిరాడంబరంగా పెట్తుకున్నారు. మీరూ ఒక లుక్కెయ్యండి.

Comments

కబుర్లు బాగున్నాయండి. మీరోసారి చూడచ్చు అన్నారంటే మగథీర సినిమా వంద రోజులే :-)
అన్నట్లు శ్రీ గారి బ్లాగ్ లంకె సరి చేయాలనుకుంటా చూడండి.
asha said…
వావ్. చాలా బాగున్నాయి కబుర్లు. చాలా విషయాలు తెలుసుకున్నాను.
"బంగారు కోడిపెట్ట" అనే కళాఖండాన్ని తెరకెక్కించిన సినిమా గురించి మీరు ఒక ప్రత్యేక రివ్యూ రాయకపోవటాన్ని నేను ఖండిస్తున్నాను.
మురళి said…
అప్పుడేమో 'యమదొంగ' గురించి అంత వివరంగా రాసి, ఇప్పుడు 'మగధీర' ని నాలుగు లైన్లలో ముగించేస్తారా? ఏమిటీ అన్యాయం? :-)
వేణూశ్రీకాంత .. హబ్బే, నా టేస్టుకీ పబ్లికు టేస్టుకి చుక్కెదురు లేండి. కానీ ఈ సినిమా బానే ఆడుతుందని నాకనిపిస్తోంది.

భవాని .. బంగారు కోడిపెట్ట యెలాగా వాళ్ళ నాయన పాటకి రీమేకే గదా? పాట మొత్తం లిరిక్ పాతపాటనే దిగుమతి చేసుకున్నారా? ముమైత్ ఖాన్ తప్పించి నాకు ఆ పాట బానే ఉంది. ఆ అమ్మాయిని పాపం అలా సూర్యకాంతిలో పిక్చరైజ్ చేసి ఉండకూడదు.

మురళి .. అది సహజమే మరి. నేను జూఎంటీయార్ అభిమానిని. అనేక ఫ్లాపుల తరవాత చాలా అంచనాల బరువు మోస్తూ వచ్చింది యమదొంగ. ఆ మాత్రం శ్రద్ధ దాణిమీద పెట్టడం అనివార్యం. ఇక రివ్యూల నిడివి అంటారా, ఎందుకొచ్చింది లేండి, ఇక్కడితో ఆపేను కాబట్టి మంచి మాటలే చెప్పాను. ఇంకాస్త ఎక్కువ చెప్పాల్సి వస్తే బూతులే వస్తాయి అనవసరంగా.
భావన said…
బాగున్నాయి కబుర్లు. ప్రజాస్వామ్యం లోనే ప్రజల అభిప్రాయానికి విలువ వుండదు, నియంతృత్వ పాలన లో ఇంక చెప్పేది ఏమి వుంది, ప్రజాభిప్రాయానికి విలువిచ్చిన ఒక్క సంఘటన అన్నా ఇరాన్ చరిత్ర లో వుందా?
ఖొరజాన్ అఖినో ఎవరో తెలియక పోయినా మీరు రాసినదానిని బట్టి గొప్ప వ్యక్తి అనిపిస్తోంది. 6 ఏళ్ళ తరువాత అధికారం వదిలేసింది అంటేనే తెలుస్తోంది ఆమె గురించి. ఆమె ఆత్మ కు శాంతి కలగాలని ప్రార్దిద్దాము.
కళకు అంకితమయిన మోర్స్ కన్నింగ్ హేం గురించి తెలుసుకోవటమే స్పూర్తి దాయకం. ఆయన ఆత్మ కు శాంతి కలగాలని ప్రార్దిద్దాము.
డెమోక్రాట్ ల మీద నాకు నమ్మకం పోతోంది. అసలు రాగానే హెల్త్ కేర్ ను తిరగ రాస్తాను అన్నాడు అసలు మాట కూడా ఎత్తటం లేదు చూసేరా? ఈ హెల్త్ కేర్ వాళ్ళు అందరు లాబీయింగ్ చేస్తున్నారని విన్నాను...!!!!!1
కొత్త బ్లాగ్ లు పరిచయం చేస్తున్నందుకు సంతోషమండి...
వేమన said…
ఇరాన్లో జరిగేదాన్ని కొద్దిగా ఎక్కువ చేసి చూపిస్తున్నారు, వీళ్ళు చూపిస్తే తప్ప ప్రపంచానికి ఏమి తెలియదనేమో. కొన్ని వారాలపాటూ ప్రతిరోజూ న్యూయార్క్ టైంస్లో ఈ విషయమ్మీద మొదటి పేజీ కధనాలు అనవసరం. ఇక మాటల్లో అంత తేడా చూపించే డెమోక్రాట్లూ, రిపబ్లికన్లూ చేతలకొచ్చేసరికి ఒకేలా ఉన్నారంటే ఎప్పట్నించో ప్రచారంలొ ఉన్న ఊహాగానాలకి మళ్ళీ తెర తీస్తున్నట్టుంది !
h vemana comment "ఇరాన్లో జరిగేదాన్ని కొద్దిగా ఎక్కువ చేసి చూపిస్తున్నారు"
one of my friend(Elham) is from Iran only.she said its not that much serious prob.