Wednesday, July 30, 2008

అందమైన అసంబద్ధమైన కథ

కొన్ని కొన్ని రచనలుంటై. రచనలో వెలువరించిన భావజాలం చూస్తే .. మనకి నచ్చని ఏదో ఒక కారణం వల్ల చీదర కలుగుతుంది. ఆ రచననీ రచయితనీ కాసేపు తిట్టుకుంటాం, తప్పులు రాశారనో, అబద్ధాలు రాశారనో. బహుశా కాసేపైనాక దాన్ని గురించి మర్చి పోతాం.

ఇంకొన్ని రచనలుంటై .. చదవంగానే ఏదో సన్నగా నులి పెట్టే బాధ గుండెల్లో. హబ్బ ఎలాంటి జీవిత సత్యం చెప్పారూ, ఎంత సున్నితంగా చెప్పారూ అనిపిస్తుంది. ఈ విషయాన్ని గురించి మనం కొంచెం ఆలోచించాల్సిందే ననిపిస్తుంది. తీరా కాస్త బుర్ర పెట్టి ఆలోచించడం మొదలెట్టేప్పట్టికి, ఆ రచనలో వెలువరించిన భావాల పొరలు ఒక్కొక్కటే ఊడిపోయి లోపల మిగిలేది ఒక పేద్ద డొల్ల. అహ, డొల్ల కూడా కాదు. డొల్ల ఐతే పర్లేదు. మనసుల్నీ మనుషుల్నీ వంచించే ఒక కుహనా విలువల పుట్ట. ఇలాంటి రచనల్తో చాలా జాగ్రత్తగా ఉండాలి.

ఆదివారం ఆంధ్రజ్యోతిలో బ్లాక్ ఇంక్ అనే పేరిట వినోదిని గారు రాసిన కథ సరిగ్గా ఇలాంటిదే.

విజ్ఞులైన పాఠకులకి ఇదంతా నేను విడమరిచి చెప్పక్కర్లేదు. శనివారం రాత్రి (ఆగస్టు 2) దాకా పై లంకె పని చేస్తుంటుంది కాబట్టి రెణ్ణిమిషాలు ఓపిక పట్టి మీరే ఆ కథ చదివేసి, మరో రెణ్ణిమిషాలు దాన్ని గురించి ఆలోచించెయ్యండి. ఆ తరవాతే, మీకు ఓపిక మిగిలుంటేనే ఈ కింద రాసినది చదవండి.

ఒకేళ లంకె గడువు దాటిపోతే టూకీగా కథ ఇది.
"నేను" అనబడే గృహిణి ఒక సాయంత్రం పూట తన ఫ్లాట్ లో ఒంటరిగా టీవీ చూస్తూ టీ తాగుతుండగా ముద్దులు మూటగట్టే ఒక ఎనిమిదేళ్ళ ఆడపిల్ల తలుపు కొట్టి ఇంట్లోకి వచ్చింది. "నేను" గారి భాష ఒక సమకాలీన భావకవిత్వపు తేనెజాడీలోంచి జాలువారుతూ, గాలిలోంచి సుగంధాల్నీ, పువ్వుల్లోంచి పుప్పొడినీ, చంద్రుళ్ళోంచి వెన్నెల్నీ, సీతాకోక చిలుక రెక్కల్నీ .. ఇలాంటి వాటినన్నిటినీ తస్కరించి తన ప్రవాహంలో కలిపేసుకుని పేజీ మీద ఆవిష్కరిస్తూ ఉంటుంది ముగ్ధమోహనంగా. సెల్లార్ లో మిగతా పిల్లల్తో ఆడుకుంటూ ఉన్న పిల్ల ఒక్కత్తి మాత్రం అలా ఏమాత్రం పరిచయం లేని ఇంటి వాళ్ళ తలుపు కొట్టి మరీ అలా లోపలికొచ్చేసి, ముందు మంచి నీళ్ళు, ఆ తరవాత హార్లిక్సూ తాగేసి, బోలెడు కబుర్లు చెప్పేసి, "నేను" గారితో కల్సి పన్లు కూడా చేసేసి, మధ్య మధ్య ముద్దులు పెట్టించుకుంటూ సాయంత్రమంతా గడిపేసింది. భోజనాల వేళైంది. "నేను" ఈ పిల్లని తనతో కలిసి తినమని ఆహ్వానించింది. కేరట్ కూర, చారు ఇలాంటి వేవో చేసింది. ఫ్రిజ్ లోంచి చికెన్ కూర తీసి "నేను" తనకి మాత్రం వడ్డించుకుంది. అది చూసిన ఈ ఆరిందా పిల్లమ్మగారు మీరు బ్రామిన్స్ కాదా, చౌదరీసా, పీచా, నాచా .. అని కులాల లిస్టంతా ఏకరువు పెట్టి, "నేను" నోట మాట రాక నిశ్చేష్టురాలై ఉండగా .. మీరు హరిజన్సా అని బోలెడు ఆశ్చెర్యం వొలకబోసి వాళ్ళకి (అంటే తనకీ మమ్మీకీ డాడీకీ) ఎవ్వరూ హరిజన్ ఫ్రెండ్స్ లేరూ, వాళ్ళతో ఫ్రెండ్షిప్ తమకి ఇష్టం లేదూ అని నిష్కర్షగా చెప్పేసింది.

ముగింపు ఇలా:
"నేనంటే నీ కిష్టమే కదరా ...'' నా చేతిలో అన్నం మెతుకులు నలిగిపోతున్నాయి.
"ఇష్టమే ...'' పాప మొహం వాంతి తన్నుకొస్తోంటే అతి కష్టం మీద ఆపుకున్నట్లుంది.
"మరి కూర్చో, అన్నం తిందాం''
కూర్చోలేదు పాప. అలాగే నిలబడి నా వైపు రెప్పవాల్చకుండా చూస్తోంది. లుకలుకమని తిరుగుతున్న తెల్లటి పురుగుల్ని చూస్తున్నంత అసహ్యం ఆ పిల్ల కళ్లల్లో.
"నానమ్మ పిలుస్తున్నట్లుంది'' గబగబా నడుచుకుంటూ బైట విప్పిన చెప్పుల్ని వేసుకొని పడిపోతుందేమో అన్నంత వేగంగా పరిగెత్తుకొని వెళ్లిపోయింది.
ఇందాకటి వెలుగుసున్నా భూతద్దంలోంచి నా గుండె మీద నిలబడిపోయింది.
గదినిండా పేరుకుపోయిన రంగు రంగుల సీతాకోకచిలకలు బొచ్చు పురుగులై నా మీదకు పాక్కుంటూ వస్తున్నాయ్‌!
***

ఈ కథ చదివాక నాకు పేజీ నిండా ఇందాక జాలు వారిన వెన్నెల చారికలూ, తేనె డాగులూ, నక్షత్ర పుప్పొడులూ పోయి, వికృతమైన క్రేటర్లూ, విషసర్పాలూ కనిపిస్తున్నై. మధ్యాన్నం తిన్నదేదో కడుపులో అసహనంగా తలెత్తుతోంది.

ఏవి సంస్కారం .. ఏవి సందేశం .. ఏమా ఆలోచనల తీరు .. ఏమా ఆక్రందనల హోరు.
బాబోయ్ బాబోయ్ దిమ్మతిరిగి పోయిందంటే నమ్మండి.

కథ మొదణ్ణించీ, కేవలం ఈ క్లైమాక్సు సిద్ధించడం కోసమే అక్కడ ఉంచ బడిన అనేక అసంబద్ధాల సంగతి అలా ఉంచండి. పాతికేళ్ళ నించీ ఎంతైనా హెచ్చు వయసుండదగిన ఒక స్త్రీకి లేని పరిణతి ఎనిమిదేళ్ళ పిల్లకి ఎలా వస్తుంది? అన్ని రకాల అభ్యంతరాల్లోకీ భోజన సంబంధమైన అభ్యంతరాలు అతి బలమైనవని ఈ మహాతల్లికి తెలియదా. శాకాహారులైన వారు, ఎంత లిబరల్ ప్రోగ్రెస్సివ్ ఆలోచనాపరులూ, కార్య శీలురూ అయినా, మాంసాహారం కంట బడితేనే వాంతి చేసుకునే వారుంటారు. అలాంటిది, ఎదురుగా ఉన్నది చిన్న పిల్ల కదా, ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేకుండా ఈవిడ ఆ పసిపిల్ల ముందు చికెన్ కూర ఎలా పెట్టింది? ఆ పాప అయినా .. చౌదరీస్, మిగతా హిందూస్ అంతా తమ ఫ్రెండ్స్ అయినప్పుడు చికెన్ కూర చూడంగానే ఏదో మనిషి శవాన్ని చూసినట్టు ఆశ్చర్యం అనుమానం పడనేల? మన సమాజంలో కులం గురించి అడగడం ఏమంత తెలియని విషయమూ, నాలిక పీక్కోవలసిన సంఘటనా కాదే. నా కులం ఇదని ధైర్యంగా చెప్పు. లేదూ, ఆ ప్రసక్తిని తుంచేసెయ్యి. "కుంజరః" అన్నట్టు పెదవులు దాటని నంగిరి మాటలెందుకు? వెలుగు సున్నాని గుండె మీద పరుచుకుని ఈ మొసలి కన్నీళ్ళెందుకు?

ఇంతకన్నా, లండీకానా, నీకు నా కులం కావల్సొచ్చిందే అని పాపని ఆ చెంపా ఈ చెంపా వాయించినట్టు ముగించి ఉంటే సంతోషించేవాణ్ణి!
ఈ వెన్నెల జలతారు దారాల్లో చుట్టిన దూది బొమ్మకి బదులు ఒక ఉక్కుతునకని ఆవిష్కరించి ఉంటే "బ్రహ్మా"నంద పడేవాణ్ణి!!

Monday, July 21, 2008

డిట్రాయిట్ తెలుగు సాహితీ సమితి పదవ వార్షికోత్సవ వేడుకలు

అమెరికాలో ఉంటున్న తెలుగు సాహిత్యాభిమానులందరికీ ఆహ్వానం

డిట్రాయిట్ తెలుగు సాహితీ సమితి
పదవ వార్షికోత్సవ వేడుకలు
సెప్టెంబరు 20, 21 (శనాది వారాలు)

ఆచార్య వెల్చేరు నారాయణరావు, ఆచార్య వేమూరి వేంకటేశ్వరరావు, ఈమాట ప్రధాన సంపాదకులు వేలూరి వేంకటేశ్వర రావు, తెలుగు నాడి ప్రధాన సంపాదకులు జంపాల చౌదరి, కథకులు ఆచార్య ఆరి సీతారామయ్య, కవులు విన్నకోట రవిశంకర్, కన్నెగంటి చంద్ర, వెంకటయోగి నారాయణస్వామి మొదలగు వారితో వివిధ తెలుగు సాహిత్యాంశాలపై ఉత్తేజ కరమైన చర్చలు.

వీరేకాక అమెరికా నలుమూలల నుండీ (బహుశా కెనడా నుండి కూడా) రచయితలు, కథకులు, కవులు పాల్గొంటారు.

తొలిసారిగా ఒక తెలుగు సాహిత్య వేదికపై తెలుగు బ్లాగులకి పెద్దపీట.
ఒక పూర్తి సెషను తెలుగు బ్లాగు సాహిత్య చర్చకోసం.
తెలుగు బ్లాగరులందరికీ ప్రత్యేక ఆహ్వానం.


మిమ్మల్ని ఈ సందర్భంగా కలిసే అవకాశం వస్తుందని ఎంతో ఆశతో ఎదురు చూస్తుంటాను.

నా డీసీ ప్రయాణం - 3 (ఆఖరు)

పెళ్ళి రిసెప్షను భోజనం చేసి, వేడుకలు చూసి రైలు పట్టుకుని మా బాబాయి వాళ్ళ ఊరు చేరేప్పటికి పదకొండయింది. పాపం బాబాయి మేలుకునుండి మళ్ళి నన్ను రైలు స్టేషనులో ఎక్కించుకుని ఇంటికి తీసుకెళ్ళాడు. ఇద్దరం కూర్చుని ఎక్కడెక్కడి బంధువుల విషయాలూ మాట్లాడుకున్నాం.

తెల్లారి మెల్లగా లేచాం. పిన్ని ఏదో హడావుడి పడిపోతోంది. వాళ్ళ స్థానిక ఆలయంలో ఏదో సంగీత ఆరాధనా కార్యక్రమం ఉంది. తనుకూడా అందులో పాల్గొంటోంది. అందుకని కాసేపట్లో బయల్దేరి వెళ్ళాలని ఈ హడావుడి. నాకూ బాబాయికీ ఉప్మా టిఫిను (క్రాంతి, వింటున్నారా?) చేసి పెట్టి తన బయల్దేరింది. మళ్ళీ బాబాయి నేనూ ఏవో పాత పల్లెటూరి చుట్టాల కబుర్లు చెప్పుకుంటూ ఉప్మా ఆరగించేటంతలో నేనుకూడా బయల్దేరాల్సిన సమయం అయింది. అదేవిట్రా, ఇంత తొందర ఫ్లైటు పెట్టుకున్నావు, కాస్త సాయంత్రానికి పెట్టుకునుండాల్సింది అన్నాడు బాబాయి. ఏంటొ బాబాయి, ఆ సమయానికి తోచలేదు అన్నా. నన్ను విమానాశ్రయంలో దింపి తను కూడా ఆలయానికి వెళ్ళిపోయాడు.

ఎందుకనో విమానాశ్రయం క్రిక్కిరిసి ఉంది. నేనెక్కాల్సిన విమానం గేటు దగ్గిర మరీనూ. ఏదో దాని పుణ్యమాని సమయానికే ఎక్కించారు, విమానం బయల్దేరింది. మూడు కుర్చీల వరుసలో నాది మధ్యలో. నాకు కుడివైపు, కిటికీ పక్కన ఒక చైనీయుడు, సుమారు నా వయసే ఉంటుంది. ఎడమ వైపు ఒక తెల్లాయన కొంచెం పెద్ద వయసు వాడు. విమానం గాల్లోకి ఎగరంగానే నిద్ర ముంచుకొచ్చింది. బహుశా ఒక అరగంట మంచి నిద్ర పోయి ఉంటాను. గంట పైనే ఫ్లైటు. మెలకువ వొచ్చి అటూ ఇటూ చూశాను. కూడా తెచ్చుకున్న పుస్తకం చదవబుద్ధి కాలేదు. దూరాన్నించే కిటికీలోంచి మబ్బుల్ని చూస్తూ కూర్చున్నా. కాసేపటికి దృష్టి చైనీయ ప్రయాణికుడి వొడిలో ఉన్న Scientific American పత్రిక మీద పడింది.

అతను చెవుల్లో ఐపాడ్ హెడ్ ఫోన్సుతో ఏదో సంగీత లోకంలో విహరిస్తున్నాడు. డిస్టర్బ్ చెయ్యడమా వొద్దా అని ఒక్క క్షణం ఊగిసలాడాను. ఈ బోరు భరించడం కంటే అతన్ని పలకరించడమే మంచిది .. అంతగా మాట్లాడ్డం ఇష్టం లేకపోతే మళ్ళీ తన సంగీతానికి వెళ్తాడు అంతేగా అనుకుని, అతని వొళ్ళో ఉన్న పత్రికని చూపిస్తూ, "మీరు సైంటిస్టా" అని అడిగాను. అతను పలకరింపుగా నవ్వి, హెడ్ ఫోన్సు తొలిగించి "పత్రిక చూస్తారా" అని నాకివ్వబోయాడు. పత్రిక పుచ్చుకుని పేజీలు తిరగేస్తూ నా ప్రశ్న మళ్ళీ అడిగాను.

అలా మొదలైంది మా సంభాషణ. అతడు మేరీలండ్ విశ్వవిద్యాలయం (వివి)లో కెమికల్ ఇంజనీరింగ్ మరియూ అప్లైడ్ కెమిస్ట్రీలో పీహెచ్.డీ పొంది, కొంతకాలం ఏదో కంపెనీలో ఇక్కడ ఉద్యోగం చేసి, ఆ తరవాత తన స్వదేశం తాయ్‌వాన్ వెళ్ళిపోయాడుట. (తాయ్‌వాన్ చైనాకి తూర్పున ఉన్న చిన్న ద్వీపం. చైనాలో కమ్యూనిస్టు ప్రభుత్వం నెలకొన్నప్పుడు చాలామంది ధనిక కుటుంబాలు తాయ్‌వాన్ ద్వీపానికి పారిపోయి అక్కడే సెటిలయారు. గత అరవై ఏళ్ళలో తాయ్‌వాన్ జపాన్ కొరియాలకి దీటుగా అభివృద్ధి చెందింది. తాయ్‌వాన్ మా దేశంలో భాగమే అని చైనీయ కమ్యూనిస్టు ప్రభుత్వం అప్పూడప్పుడూ గుడ్లురుముతూ ఉంటుంది గానీ, అంతర్జాతీయ మద్దతుతో తాయ్‌వాన్ అనేక విషయాల్లో స్వయం ప్రతిపత్తి కలిగిఉంది.) గత ఆరు సంవత్సరాలుగా అక్కడ ఒక విశ్వవిద్యాలయంలో ఆచార్యుడిగా పని చేస్తున్నాడు. అతను చేసే రీసెర్చి సబ్జెక్టుకి సంబంధించిన సమావేశం కోసం డీసీ వచ్చాడు. అది ముగిసి, తిరిగి స్వస్థలానికి చేరుతున్నాడు. అతని తిరుగు ప్రయాణం డెట్రాయిట్ మీదుగా ఉండటం, మేమిద్దరం పక్కపక్క సీట్లలో కూర్చోవడం భలే యాదృఛ్ఛిక మనిపిస్తుంది.

అతడు అలా స్వదేశానికి వెళ్ళానని చెప్పినప్పుడు కొంచెం ఆశ్చర్య పడ్డాను. నాకు మా వివిలో కొందరు తాయ్‌వానీయ విద్యార్ధులు తెలుసు. వాళ్ళెవరూ స్వదేశానికి తిరిగి వెళ్ళాలని తహతహలాడినట్టు నేను గమనించలేదు. అందరూ అమెరికాలో సెటిలయే ఆలోచనల్లోనే ఉన్నారు. అదీ కాక, అమెరికాకి చదువులకోసం వచ్చిన ఇతర దేశస్థుల ఆలోచనలు ఎలాఉంటాయో తెలుసుకోవాలనీ నాకో కుతూహలం. "మీ స్వదేశానికి తిరిగి వెళ్ళడానికి అతి ముఖ్యమైన కారణం ఏవిటి? మీకభ్యంతరం లేకపోతే చెప్పండి." అనడిగాను. వృద్ధులవుతున్న తలిదండ్రులో, లేక మిగతా కుటుంబ మంతా అక్కడే ఉన్నారనో, అదీ కాక, ఆస్తులు చూసుకోవాలనో .. ఇలాంటి దేదో ఊహించాను. అతడు చెప్పిన సమాధానం నన్ను అద్భుత సంభ్రమాశ్చర్యాలకి గురి చేసింది.

"నేను ఉద్యోగం చేస్తుండగా ఇక్కడ నా పని బాగానే ఉండేది. ఒకసారి ఇంటికి వెళ్ళాను. అక్కడ దేశం చాలా మారిపోయి నట్లనిపించింది. ముఖ్యంగా యువత .. ఒక లక్ష్యం లేకుండా, సరైన జీవిత ధ్యేయం లేకుండా, రికామీగా తమ జీవితాల్ని వృధా చేసుకుంటున్నా రనిపించింది. ఇంకో పక్కన బాగా చదువుతున్న వాళ్ళు కూడా వృత్తి అభివృద్ధి మోజులో పడి నిజమైన మానవీయ విలువల్ని కోల్పోతున్నా రనిపించింది. నాకసలు మొదణ్ణించీ ఉపాధ్యాయ వృత్తి మీద మోజే, కానీ పీహెచ్.డీ తరవాత అమెరికను వివిలలో ఉపాధ్యాయ పదవులకి ఉన్న తీవ్రమైన పోటీ మీకు తెలియనిది కాదు. అలా ఆ ఆశ వొదులుకుని కంపెనీ ఉద్యోగంలో స్థిరపడ్డాను. నా స్వదేశాన్ని చూసిన తరవాత నేనక్కడ సమర్ధవంతమైన పని నిర్వహించగలనని నాకు నమ్మకం కలిగింది. ఆ ట్రిప్పు నించి అమెరికాకి తిరిగి వచ్చాక ఒక రెండేళ్ళు గడువు పెట్టుకున్నాను. ఆ సమయంలో తాయ్‌వాన్లో నాకు కావలసిన వివిలో ఆచార్యుడిగా ఉద్యోగం సంపాదించాను. నా ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాను. ఆరేళ్ళయింది ఇప్పటికి. చాలా సంతృప్తిగా ఉంది."

"చిత్రంగా ఉందే! క్లాసులో పాఠం చెప్పటం కాకుండా, ఇంకేమి చేస్తారు యువత కోసం? కౌన్సెలింగు లాంటివేమన్నానా? లేక మీ చర్చి ద్వారా ..."

"నేను క్రిస్టియన్నే కానీ నేను చేసే పనులు చర్చి ద్వారా కాదు. నా మతానికీ నే చేపట్టిన పనులకీ ఏం సంబంధం లేదు. వివికి అనుబంధంగానూ, బయట విడిగానూ రెండు సంస్థలు నెలకొల్పాను. తమ తోటి వయసు వారిని చేర్పించి వారికి అవసరమైన శిక్షణ నిచ్చేందుకు ముందు ఒక పది మంది నా విద్యార్ధులకి అవసరమైన తర్ఫీదు ఇచ్చాను. ఈ కేంద్రాల్లో, వొట్టి చదువు చెప్పడం, ఉద్యోగాలకి యువతని సిద్ధం చెయ్యడమే కాదు .. ఆట పాటలు, తాయ్‌వానీయ జాతీయ కళలు, మెదడుకి పదును పెట్టే పోటీలు, మనసుకి ఆహ్లాదాన్నిచ్చి పరిపూర్ణమైన మనిషిగా తీర్చి దిద్దేటటలు అనేక కార్యక్రమాలు నిర్వహిస్తాం. కుటుంబం, సమాజం, మానవ సంబంధాల విలువ ఈ యువత గ్రహించాలనేది నా తాపత్రయం. ఈ బృందాలు ఆయా కాలనీలలో స్వఛ్ఛంద సేవ చేస్తుంటారు. సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహిస్తారు. బడులలోకి వెళ్ళి అక్కడి పిల్లలకీ ఇలాంటీ కర్యక్రమాలూ పోటీలు నిర్వహిస్తుంటారు. ఇప్పుడు సుమారు వంద మందికి పైగా వాలంటీర్లుగా పని చేస్తున్నారు."

నేను ఆశ్చర్యంతో నోట మాట రాక వింటుండి పోయాను. ఇంతలో మా విమానం డెట్రాయిట్ లో దిగింది. మిమ్మల్ని కలవడం ఒక అద్భుతమైన ప్రయాణానికి సరైన ముగింపు అని చెప్పి, ఆయనతో కరచాలనం చేసి (ఆయన పత్రిక అప్పుడే తిరిగి ఇచ్చేశానండోయి) నేను ఇంటి దారి పట్టాను.

నా బొమ్మల బ్లాగు

Saturday, July 12, 2008

నా డీసీ ప్రయాణం - 2

విమానాశ్రయం నించి రైలెక్కి మా బాబాయి వాళ్ళుండే చిన్న వూరెళ్ళాను. అక్కడ స్తేషనులో బాబాయి నాకోసం కాచుకుని ఉన్నాడు. ఆయన నా సొంత బాబాయి కాదు, మా అమ్మకి మామ కొడుకు. కానీ నా చిన్నప్పుడు రాకపోకల సంబంధాల వల్ల మాకు బాగా చనువు. అదీ కాక తను సుమారు మా అక్క వయసు వాడు. ఇద్దరమూ చాలా ఏళ్ళుగా అమెరికాలో ఉన్నా, వాళ్ళని ఆఖరిసారి కలిసి ఎనిమిదేళ్ళయింది. ఇల్లు చేరగానే పిన్ని చాలా ఆప్యాయంగా ఆహ్వానించి, చిక్కటి ఫిల్టర్ కాఫీ ఇచ్చి బోలెడు కబుర్లు చెప్పింది. ఒక పక్కన పెళ్ళికి బయల్దేరాలి అన్న హడావుడి మనసులో ఉన్నా పిన్ని చెప్పే కబుర్లు వింటూ కదల్లేక పోయాను. కబుర్లు చెబుతూనే పెసరట్లు టిఫిన్ పెట్టింది. తింటూ నేనూ నా కబుర్లు చెప్పాను. బాబాయి మితభాషి. నా పక్కనే మౌనంగా కూర్చున్నాడు. అలా అనుభవాలు కలబోసుకోవడం ఎంతో బాగా అనిపించింది. బహుశా మనసు చెమర్చడం అంటే ఇదేనేమో.

టిఫినయ్యాక బాబాయి నన్ను పెళ్ళి జరిగే హోటలు దగ్గర దింపాడు. అదొక జనారణ్యం. అందులో పెళ్ళి జరిగే హాలు వెదుక్కుంటూ వెళ్ళాను. బయట అంతా మామూలు అమెరికన్ హోటలు వాతావరణం. ఆ హాల్లో అడుగు పెట్టగానే ఏదో హైదరాబాదులో ఫంక్షను హాల్లో ప్రవేశించానా అని అనుమానం వచ్చింది. కొందరు మగవారు సూట్లలో ఉన్నారు గానీ, చాలా మంది, వయసుతో నిమిత్తం లేకుండా రంగు రంగుల చక్కటి దిజైన్ల శల్వార్ సెట్లు ధరించి ఉన్నారు. అక్కడక్కడా కొందరు పంచధారులు కూడా కనబడ్డారు. సరే, ఇక నారీమణుల అలంకారాలు చెప్పనక్కర్లేదు. చందనా బ్రదర్స్ స్టాకంతా అక్కడే ఉంది. చిన్నారులు కూడా చక్కటి పట్టు పరికిణీలు వేసుకుని జడల్లోనూ, తలమీదా, ఇతరంగానూ చక్కటి ఆభరణాలు ధరించి బాల లక్ష్ముల్లా ఉన్నారు.

ఇంతకీ పెళ్ళెవరిదో చెప్పలేదు గదూ. నేను ఫిలడెల్ఫియా నగరంలో ఒక విశ్వవిద్యాలయంలో చదువు వెలగ బెడుతున్నప్పుడు అక్కడి స్థానిక తెలుగు సాంస్కృతిక సమితిలో చాలా ఉత్సాహంగా పని చేశాను. ప్రసాదు గారు ఆ కాలంలో నాలుగేళ్ళపాటు ఆ సమితి అధ్యక్షులుగా చేశారు. ఆయన్ని మా బృదం అంతా ప్రేమగా గేంగ్ లీడర్ అని పిల్చుకుంటాం. ఆ కార్యక్రమాల్లో ప్రసాదు గారూ, వారి శ్రీమతి సుజాతగారూ నన్నెంతో ఆప్యాయంగా చూసేవారు. వారి ఏకైక పుత్రుడు కిరణ్ పెళ్ళి. పెళ్ళి కూతురు డీసీ వాస్తవ్యులైన ఇంకో తెలుగు దంపతుల పుత్రిక. కళ్యాణ మంటపం చాలా అందంగా అలంకరించారు. ప్రసాదు గారు మాంచి సాంప్రదాయంగా పట్టుపంచా కండువాతో హుందాగా ఉన్నారు. పెళ్ళి కుమారుడూ కుమార్తే ఆకర్షణీయమైన జరీ బట్టల్లో ఈడూ జోడూ తగినట్టు ఉన్నారు. సుజాతగారు పెళ్ళి హడావుడిలో ఉన్నారు. ఇరువైపుల పురోహితులూ పోటాపోటీగా మంత్రాలు చదివేస్తున్నారు. నేను మెల్లగా ప్రసాదు గార్ని పలకరించా. ఒక్కసారి తేరిపార చూసి, బేర్ హగ్ లో బంధించి, ఇప్పుడా వచ్చేది అని నిష్ఠూరమాడి, అసలొచ్చావు, అదే సంతోషం. అన్నారు. ఏం మాట్లాడలేక తల మాత్రం ఊపి అలా ఉండిపోయాను.

ఇక పాత స్నేహితుల్ని కలవడం. వాళ్ళల్లో 90 శాతం ఫిలడెల్ఫియాలో సెటిలయినవాళ్ళే. నాలాగా వేరే ఊళ్ళకి మారిన వాళ్ళు కూడా కొందరు సకుటుంబంగా వచ్చారు. గేంగ్ లీడర్ కొడుకు పెళ్ళా, మజాకానా? ఒక్కొక్కరూ వాళ్ళ సొంత తమ్ముణ్ణి చూసినట్టు సంతోషం ప్రకటిస్తూ, చేతులు కలపటాలు, మరీ చనువైతే బేర్ హగ్గులు, భార్యామణుల పలకరింపులు, మధ్యమధ్య నిష్ఠూరాలు, ఏంటసలు మమ్మల్ని మర్చిపోయారా, అసలు మళ్ళీ ఫిలడెల్ఫియా రాలేదు అని. ఇక పిల్లలు - పసి పిల్లలుగా నాకు గుర్తున్న వాళ్ళు టీనేజర్లయ్యీ, టీనేజర్లుగా సమితి కార్యక్రమాల్లో మాతో పని చేసిన వాళ్ళు ఇప్పుడు యువకులూ యువతులుగానూ .. అన్నట్టు నెట్ లో తొలి పద్యాల గురువు రామకృష్ణగార్ని కలిశాను చాలా ఏళ్ళ తరవాత. ఎప్పుడో పోయినేడాది ఇదే బ్లాగులో సీసపద్యాల గురించి రెండు టపాలు రాశాను - అక్కడ ఈయన్ని గురించి చెప్పాను. తెలుగు బ్లాగుల గురించి చెప్పాను ఆయనకి. చాలా సంతోషించారు. తరవాత పొద్దు ని చూసి కొన్ని వ్యాఖ్యలు కూడా రాశారు. ఇంతలో మధ్యాహ్న భోజనం.

భోజనాలయ్యాక తమ రూములకి వెళ్ళిన వారు వెళ్ళగా, అక్కడే హోటలు లాబీలో ఉన్న కాఫీ షాపులో కూర్చుని మిగతా వారితో పిచ్చాపాటీ కొనసాగింది. సాయంత్రం రిసెప్షన్, డిన్నర్. తయారయ్యే వాళ్ళు తయారవుతున్నారు. ఇంతలో రెండు తెల్లజంటలు మా పక్కన వచ్చి కాఫీషాపులో కూర్చున్నారు. అమ్మాయిలిద్దరూ జరీ బుటాచేసిన ఫేన్సీ చీరలు కట్టుకుని ఉన్నారు. మెల్లగా ఆ రెండు జంటలతో కబుర్లు మొదలు పెట్టాను. ఆ అమ్మాయిలిద్దరూ పెళ్ళికూతురితో కలిసి చదువుకున్నారుట. ఇక్కడ క్రిస్టియన్ పెళ్ళిళ్ళలో పెళ్ళికొడుక్కీ, కూతురికీ చెరి ముగ్గురు సహాయకుల్ని ఎంచుకుంటారు. పెళ్ళి కొడుకు ముఖ్య సహాయకుణ్ణి బెస్ట్ మేన్ అంటారు. పెళ్ళికూతురి ముఖ్య సహాయకురాల్ని మెయిడాఫ్ ఆనర్ అంటారు. సరే ఇది హిందూ పెళ్ళి కాబట్టి ఇలా ఇద్దరు తన స్నేహితురాళ్ళని తనకి చెలికత్తెలుగా ఉండమని అడిగిందిట ఈ పెళ్ళికూతురు. అందుకని, వాళ్ళూ చేతుల్నిండా గోరింటాకు పెట్టించుకుని, చీరలు కట్టుకుని బొమ్మల్లా తయారయ్యారు. పెళ్ళి తతంగాన్ని చాలా ఎంజాయ్ చేస్తున్నామని చెప్పారు.

రిసెప్షన్ కూడా చాలా బాగా జరిగింది. ప్రసాదు గారు నన్ను చెయ్యి పట్టుకుని లాక్కెళ్ళి ఆయన తమ్ముళ్ళందరికీ, "నా ఆఖరి తమ్ముడు" అని పరిచయం చేశారు. ఇలా రోజంతా అందరి ఆప్యాయతలో తడిసి ముద్దయ్యాను. ఏదో మా అన్నయ్య కొడుకు పెళ్ళికి మా ఆత్మీయ ఆప్త బంధువులందరూ వచ్చిన పెళ్ళికి వెళ్ళొచ్చినట్టుగా ఉంది. ఆ రాజుకున్న ఆత్మీయత రెణ్ణెల్లుదాటినా నాలో ఇంకా వెచ్చగా వెలుగుతోంది.

Friday, July 11, 2008

నా డీసీ ప్రయాణం - 1

నేనీ మధ్య అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీ కి వెళ్ళొచ్చాను ఒక పెళ్ళి చూడ్డానికి.

ఈ ప్రయాణం ఆద్యంతమూ ఆసక్తి కరంగా సాగింది, కొన్ని గొప్ప అనుభవాలతో. అవి మీతో పంచుకోవాలని ఇలా.

శనివారం పొద్దున 11 గంటలకి ముహూర్తం. ముందు రోజు రాత్రే అక్కడీకి పోయి ఏమి చేస్తాములే అని శనివారం తెల్లారి ఫ్లైటుకి టిక్కెట్టు కొనుక్కున్నా. 7 గంటల ఫ్లైటుకి ఐదున్నరకల్లా విమానాశ్రయం చేరుకుని, అవసరమైన తతంగమంతా పూర్తి చేసి విమానం ఎక్కే గేటు దగ్గర కుర్చీలో కూర్చున్నా. ఇంకా గంటన్నర టైముంది. అంకోపరి తీసి యధావిధి ప్రాతఃకాల ఉచిత కార్యకలాపాలు చేసుకుంటున్నా నా దారిని నేను.

ఇంతలో నేను గమనించకుండానే నా చుట్టు పక్కల కుర్చీలన్నీ నిండి పోయాయి. జనసందోహం హెచ్చింది. గట్టి గట్టిగా మాట్లాడుకుంటున్నారు, నవ్వు కుంటున్నారు, ఒకర్నొకరు హెచ్చరించు కుంటున్నారు. ఏవిటబ్బా ఇంత సందడి అని అయిష్టంగానే అంకోపరినుండి తల పైకెత్తి అటూ ఇటూ చూశా. స్త్రీలూ పురుషులూ, అందరూ బాగా వృద్ధులు, అందరూ కనీసం 80 దాటినట్లున్నారు. కొంతమంది చక్రాల కుర్చీల్లో ఉన్నారు. మధ్యలో ఒక నలుగురు నడివయసు స్త్రీలనీ, ఇద్దరు యువకుల్నీ కూడా గమనించా. అందరూ లోపల ఏం బట్టలు వేసుకున్నా, పైన ఒకే లాంటి నారింజ రంగు టీషర్టులు వేసుకుని, నెత్తిన ఒకే లాంటి మిషిగన్ టోపీ పెట్టుకునున్నారు. అందరి మెడలలోనూ పల్చటి ప్లాస్టిక్ సంచీలు వేళ్ళాడుతున్నాయి, లోపల కొన్ని కాయితాలతో.

ఏదో కన్వెన్షనో, లేక ఏదన్నా వృద్ధాశ్రమం వారి ఫీల్డు ట్రిప్పో అనుకున్నా. నడివయసు స్త్రీలలో ఒకామె లీడర్ల్లే ఉంది, ఒక క్లిప్ బోర్డు మీద పేర్ల లిస్టు చదివి అందరూ వచ్చారా లేదా అని చూసుకుంటోంది. మధ్య మధ్య ఆ వృద్ధులతో హాస్యంగా ఏదో అంటోంది. యువకుల్లో ఒకడు చకచకా ఫొటోలు తీస్తున్నాడు. ఇంతలోకి విమానం తలుపు తెరిచారు. ముందే ఎక్కి కూర్చుని ఆ ఇరుకు సీటులో బందీగా ఎందుకులే అని నేను మెదలకుండా కూర్చున్నా. పైగా ఈ వృద్ధులంతా ఎక్కేటప్పటికి బాగా టైం పట్టేట్టు ఉంది అనుకుంటూ, వాళ్ల హడావుడి చూస్తూ కూర్చున్నా. ఆ నడివయసు స్త్రీలూ, ఇద్దరు యువకులూ అందర్నీ బాగా సమర్ధవంతంగా విమానం ఎక్కించేసి ఎవరి సీట్లలో వారిని కూర్చో బెట్టారు, చక్రాల కుర్చీల్లో ఉన్నవాళ్ళతో సహా. సరే, నేనూ ఎక్కి నా సీట్లో కూలబడ్డా. నా పక్క సీట్లో లీడర్ గా వ్యవహరిస్తున్న నడివయసావిడ. అప్పటికి నా బుర్రలో ఏదో వెలిగింది. ఆవిణ్ణడిగా .. ఏంటి, వీళ్ళంతా వెటరన్సా అని. అవునంది. డీసీలో ఏదన్నా కన్వెన్షను జరుగుతోందా అనడిగా. ఆవిడ కొంచెం ఎనిగ్మాటిగ్గా నవ్వి ఇంకాసేపట్లో మీకే తెలుస్తుంది అంది.

ఇంతలో ఎప్పుడూ జరిగే తతంగంతో విమానం బయల్దేరి గాల్లోకి లేచింది. విమానం బాగానే ఎగుర్తోంది అని నిర్ధారించుకుని మైకులో కేప్టెన్ గారు గొంతు సవరించుకున్నారు. మామూలుగా ఇలా విమానం బయల్దేరిన కాసేపటికి కేప్టెనుగారిలా వచ్చి, మనం ఏ వూరెళ్తున్నాం (ఎవడన్నా పొరబాట్న తప్పు విమానం ఎక్కేసుంటే గుండెలు బాదుకోడానికి), ఆ వెళ్ళే వూర్లో వాతావరణం ఎలావుందీ, దార్లో గాలులూ గట్రా ఎలా ఉన్నై .. ఇలాంటి సమయోచిత సమాచారం అంద జేస్తాడు. ఇవ్వాళ్ళ ఆ కబుర్లన్నీ చెప్పేశాక ఇంకా ఇలా చెప్పాడు (నా తెలుగులో).

"ఇవ్వాళ్ళ మనతో బాటు కొందరు అపురూపమైన విశిష్ఠమైన అతిథులు ప్రయాణిస్తున్నారు. వారికి ప్రత్యేక స్వాగతం. రెండో ప్రపంచ యుద్ధంలో అమెరికా సైన్యంలో పోరాడిన మాజీ సైనికులు (WWII Vetarans) నలభై ఇద్దరు ఇవ్వాళ్ళ మనతో డీసీ వస్తున్నారు. వీరు అక్కడ తమ సేవలకి గుర్తుగా కృతజ్నతతో ఈ దేశం నిర్మించుకున్న రెండో ప్రపంచ యుద్ధపు మెమోరియల్ను దర్శిస్తారు. ఈ వీరుల ధైర్య సాహసాలకీ, దేశ రక్షణ కోసం వారు చేసిన త్యాగాలకీ నేను శిరసు వంచి నమస్కరిస్తున్నాను. ఈ వీరులు ఇవ్వాళ్ళ మా (కంపెనీ వారి) విమానంలో రావడం మాకెంతో గర్వంగా ఉంది."

విమానం అంతా చప్పట్లతో మారు మోగింది ఒక నిమిషం పాటు. నాకు ఏదో అద్భుతాన్ని చూస్తున్నట్టుగా ఉంది ఇదంతా. ఏవిటీ వింత అన్నట్టు నా పక్కన ప్రయాణికురాలి వైపు చూశాను. ఆమె (పేరు కేథీ) అప్పుడు వివరాలు చెప్పారు. రెండో ప్రపంచ యుద్ధంలో పనిచేసిన సైనికులు వృద్ధాప్యం వల్లనో, పేదరికం వల్లనో తమ గౌరవార్ధం నిర్మించిన మెమోరియల్ను ఒక్కసారి కూడా చూడలేకపోవడం, పైగా వయసు పైబడటం వల్ల చాలా మంది మరణిస్తూ ఉండం తెలుసుకుని, మిషిగన్ వెటరన్స్ తాము బతికుండగా కనీసం ఒక సారైనా డీసీ వెళ్ళి తమ మెమోరియల్ను చూసే ఏర్పాటు చెయ్యాలనే ఉద్దేశంతో ఈ స్వఛ్ఛంద సంస్థ ప్రారంభించారు. ఈ ట్రిప్పుకి మొత్తం ఖర్చు ఆ సంస్థే భరిస్తుంది - వెటరన్స్ కి పైసా ఖర్చు లేదు. వీళ్ళకి ఏ ప్రభుత్వం కానీ ఏమీ డబ్బులివ్వదు. వాళ్ళ వనరుల్ని వాళ్ళే సమకూర్చుకుంటారు, వ్యాపార సంస్థలు, వ్యక్తిగత దాతలు ఇచ్చే విరాళాల ద్వారా. అప్పుడప్పుడూ ఫండ్ రైజింగ్ కార్యక్రమాలు నడుపుతారు. సంస్థకి పనిచేసే వారందరూ స్వఛ్ఛందంగా పని చేస్తారు.

ఆ సంస్థ పేరు ఆనర్ ఫ్లైట్ మిషిగన్
అలా ఒక ట్రిప్లో వెళ్ళబోతున్న ఒక వెటరన్ కథ ఒక స్థానిక పేపర్లో

సుమారు ఒక గంటలో రీగన్ విమానాశ్రయంలో దిగాము. నేను ముందుగానే విమానం దిగి, గేటు దగ్గరే ఉన్న కాఫీ షాపులో ఒక కాఫీ కొనుక్కుని చప్పరిస్తూ అక్కడే నిల్చున్నాను. నాతో బాటు ఇతర సాధారణ ప్రాయాణికులు కూడా ఉండిపోయారు. గేటు దగ్గర అలాంటి నారింజ టీషర్టులు వేసుకున్న వాలంటీర్లు ఒక ఇరవై మంది దాకా ఉన్నారు. ఇంతలో ఒకరొకరే విమానం దిగిన వెటరన్లు బయటికి రావడం మొదలు పెట్టారు. అక్కడ ఉన్న వాలంటీర్లు బలంగా చప్పట్లు కొడుతూ అరుస్తూ జయజయ ధ్వానాలు చేస్తున్నారు. ఆ ముదుసలి ముఖాల్లో తళుక్కున మెరిసిన ఆనందం, గర్వం నేను మాటల్లో వర్ణించలేను. ఈ ధ్వనులు విని అక్కడా ఇక్కడా చెదురు మదురుగా ఉన్న ప్రయాణికులూ, అక్కడ పని చేస్తున్న ఉద్యోగులూ కూడా ఈ గేటు దగ్గరికి వచ్చి, జరుగుతున్న దేవిటో తెలుసుకుని, జయజయధ్వానాల్లో వాళ్ళూ చేరారు. అలా ఆ నలభై మంది వృద్ధులూ బయటికి వచ్చేదాకా ఆ జయజయధ్వానాలు సాగుతూనే ఉన్నాయి. నాతో పాటే ముగ్గురు పిల్లల్తో విమానం దిగిన ఒక తండ్రి తన చిన్న కూతురుకి బాగా కనబడేందుకు భుజం మీద ఎత్తుకుని, వాళ్ళెందుకు అలా చప్పట్లు కొడుతున్నారో వివరిస్తున్నాడు. నేను నా కాఫీ ముగించి, అక్కణ్ణించి కదిలాను. ఇద్దరు వృద్ధుల్ని దాటుకుని నడవాలోకి నడిచాను. వాళ్ళ పలచటి ముడుతలు పడిన చెంపల మీద నీటి చారికలు. మాటల్లో నిర్వచించలేని ఏదో ప్రకంపనం నా లోలోపల!

కథ రాయండి - 3

ఈ కింది ఇతివృత్తంతో కథ రాయండి.

"ఈ మొగుళ్ళతో వేగలేకపోతున్నాం తల్లీ" అని భార్యలందరూ అమ్మవారికి మొరబెట్టుకున్నారు.

ఆమె అయ్యవారికి ఆర్డరు వేసింది.

అయ్యవారు విరించిని రావించి తక్షణం ఈ కస్టమర్ కంప్లైంట్ ని పరిష్కరించమని ఆజ్నాపించారు (ఈపాటికి స్వర్గం కూడా ISO QOS PMP DUMP ఇలాంటి సర్టిఫికేట్లన్నీ తెచ్చేసుకుంది.) అందులోనూ లేడీ కస్టమర్లకి తిక్క రేగితే మనకి పుట్టగతులుండవనీ, పరిస్థితులు విషమిస్తే తామే మళ్ళీ ఆన్సైట్ వెళ్ళాల్సి వస్తుందనీ, అటువంటి పరిస్థితి రాకుండా తగిన నివారింపు చర్యలు తీసుకోమనీ ఆదేశించారు.

విరించి బాఘా ఆలోచించి ఒక ప్రణాళిక తయారు చేశాడు.

అప్పటినించీ పుట్టిన మగ పిల్లలలో ఒక విచిత్రమైన సిస్టం ఇన్స్టాల్ చేశారు. దాని ఫలితంగా, అబ్బాయికి యుక్త వయసు వచ్చాక, ఎవరన్నా అమ్మాయిని చూసి పెళ్ళాడదాము అనే దృష్టి కలిగితే చాలు, ఆ ఆమ్మాయికి అబ్బాయి నుదుటిమీద మెరిసే LED display లో ఆ అబ్బాయి గుణగణాలు కనబడి పోతాయి. ఒకేళ ఎప్పుడైనా అమ్మాయి అబ్బాయిని ఆ దృష్టితో చూసినా కూడా అబ్బాయి గుణగణాలే అమ్మాయికి కనబడి పోతాయి.

ఈ customer complaint management program implement అయ్యాక, అమ్మాయిలకి అబ్బాయిల నుదుళ్ళ మీద ఎలాంటి మెసేజిలు కనిపించాయి? వాటి పర్యవసానమేవిటి? పెళ్ళిళ్ళు జరిగాయా అసలు? ఒకేళ జరిగితే, లేడీ కస్టమర్లు తృప్తి చెందారా? లేక విరించి ని fire చేసి అయ్యవారు తనే భూమి మీద onsite కి రావాల్సొచ్చిందా?

కళ్ళు మూసుకుని మీ ఊహా శక్తిని తట్టి లేపి ముందు మీ మనోఫలకం మీద తిలకించి, అటుపై కీబోర్డు మీద పలికించి, మా విహరిణి తెరపై కనిపింప చేయ ప్రార్ధన.

కథని జెనెరల్గా అందరు జనాభాకీ వర్తించేట్టు రాయొచ్చు. లేదా కొన్ని ఎంచుకున్న జంటల ఆధారంగా రాయొచ్చు. లేదా ఒక అబ్బాయో, అమ్మాయో ముఖ్య పాత్రగా అయినా రాయొచ్చు. ఇవన్నీ కాకుండా మీకింకో పద్ధతి తడితే అలాక్కూడా రాయొచ్చు - మీ ఇష్టం.

రచన సీరియస్ గా ఉండొచ్చు, హాస్యంగా ఉండొచ్చు, వ్యంగ్యంగా ఉండొచ్చు - మీ ఇష్టం.

గడువు: ఆగస్టు 29.
బహుమతి: నాకు నచ్చిన కథకి ఒక మంచి తెలుగు కథల పుస్తకం బహుమతి ఇస్తాను.
మీ బ్లాగులో పెట్టినా సరే, నాకు మెయిలు
చేసినా సరే. మీ బ్లాగులో పెడితే, ఆ సంగతి నాకో మెయిలు
కొట్టి చెప్పండి.

Thursday, July 10, 2008

నవతరంగంలో సెవెన్ సమురాయ్

జపనీసు దర్శకుడు అకిరా కురోసావా అద్భుత సృష్టి సెవెన్ సమురాయ్ గురించి నవతరంగంలో రాయడం ఎప్పుడో మొదలు పెట్టి చివరి భాగం ఈ మధ్యనే పూర్తి చేశాను.

మొదటి భాగం
రెండవ భాగం
మూడవ (చివరి) భాగం

పొద్దులో జూలై గడి

తెలుగు బ్లాగ్ప్రపంచంలో పద్యరసాస్వాదనకి పుట్టినిల్లు ఆయన బ్లాగు.
అలాంటి సరసులు రూపొందించిన గడి ఈ నెల అంతటి సౌకుమార్యంతోనూ భాసితోంది.
ఒక లుక్కెయ్యండి.
ఇంకా ప్రోత్సాహం కావాలంటే ఇదిగో మొదటి మెట్టు.


మీకింకా సహాయం కావాలంటే .. స్లిప్పులందించడానికి అందెవేసిన చేతులున్నాయి :-)
మరిక ఉపక్రమించండి.

Tuesday, July 8, 2008

నిషల్క్కూత్తు - షాడో కిల్

ఈ మధ్య భారతీయ కళాత్మక చలన చిత్రాల మీద కొంచెం దృష్టి పెట్టాను.

ముందుగా సత్యజిత్ రే గారి చారులత చూశాను. నా ఖర్మకాలి అదొక దిక్కుమాలిన డీవీడీ. సినిమానించి డీవీడీలోకి జరిగిన మార్పు పరమ దరిద్రంగా జరిగింది. నలుపు తెలుపు చిత్రమేమో, కాంట్రాస్టు సరిగ్గా లేకపోయేప్పటికి అస్సలు చూడలేక పోయాను. అతి ఘనత వహించిన రే గారి ప్రముఖ చిత్రం గతే ఇలా ఉంటే ఇక మిగతా పాత చిత్రాల పరిస్థితి ఎలా ఉంటుందని ఊహించవచ్చు?

నేను చూసిన రెండో సినిమా మళయాళ దర్శకుడు అడూర్ గోపాలకృష్ణన్ తీసిన నిషల్క్కూత్తు. దీని పేరుని ఆంగ్లంలో షాడో కిల్ అని తర్జుమా చేశారు. నాకర్ధమైన కొద్ది మళయాళంలో నిషల్ అంటే నీడ .. అంచేత షాడో కిల్ అనేది యథాతథపు అనువాదం అనుకుంటున్నా.

ఈ సినిమా 2002లో మొదట విడుదలైంది. బహుశా అందువల్లనేమో, నా అదృష్టం బావుండి, డీవీడీ నాణ్యత చాలా బావుంది.

క్లుప్తంగా కథ
1940 లో ట్రావంకూరు మహారాజ సంస్థానంలో ఒక తలారి కథ. ఈ తలారి పదవి వంశపారంపర్యంగా వస్తుంటుంది. తలారి కుటుంబం ఎక్కడో మారుమూల గ్రామంలో ఉంటుంది. అక్కడైనా మిగతా గ్రామస్తులతో కలవకుండా ఊరికి దూరంగా ఉంటుంది. ఈ వేర్పాటుని ఇంకా నొక్కి చెప్పాలి అన్నట్టు తలారి కుటుంబం అంతా తమలో తాము మాట్లాడుకునేటప్పుడు తమిళం మాట్లాడుకుంటారు. ఉరి తీసిన తాడుని తలారికే బహుకరిస్తారు. ఆ తాడు అతని ఇంటిలో కాళికాదేవి పూజాస్థలం ముందు వేళాడుతుంటుంది. ఆ తాడుముక్కతో అమ్మవారికి దీపారాధన వెలిగించి ఆ బూడిద విభూతి పెడితే అన్ని రోగాలూ పోతాయని గ్రామస్తుల నమ్మకం.

ఇప్పటి తలారి కాళియప్పన్ వృద్ధుడైపోయాడు. పైగా అంతకు ముందు ఉరితీసిన ముద్దాయి నిర్దోషి అని నమ్మి, అతని ప్రాణం తీసిన పాపం వొడిగట్టుకున్నాను అనే పాపచింతనతో పగలూ రాత్రి అదే పనిగా తాగి కాలం గడుపుతున్నాడు. కొడుకు ముత్తు పై ఊళ్ళకి చదువుకి వెళ్ళి గాంధీ గారి సత్యాగ్రహ సూత్రాల్ని వంటబట్టించుకుని తిరిగి వచ్చాడు. రాట్నం వడుకుతుంటాడు. పెళ్ళై కాపురం చేసుకుంటున్న పెద్ద కూతురు తనకింకా ఏవో పుట్టింటి కట్నాలు దక్కలేదని దెప్పుతూంటుంది. చిన్న కూతురు అప్పుడే పెద్దమనిషైంది. ఈ విచిత్ర కుటుంబాన్ని కట్టి ఉంచే సూత్రధారిణిగా కాళియప్పన్ అర్ధాంగి మరగతం అందర్నీ కను రెప్పలా కనిపెట్టుకుని ఉంటుంది.

ఇంతలో రాజాస్థానపు ఉద్యోగి తలారిని వెదుక్కుంటూ వస్తాడు. హత్య చేసిన నేరానికి ఒక ముద్దాయికి ఉరిశిక్ష విధించారనీ, శిక్ష ఫలానీ రోజున అమలు జరుగుతుందనీ, ఆ దండన అమలు జరిపేందుకు తలారి అవసరమైన పూజాదికాలు నిర్వహించి సిద్ధంగా ఉండవలసిందని రాజాజ్ఞగా వినిపిస్తాడు. తాను వృద్ధుణ్ణైపోయాననీ, వేరెవర్నైనా ఈ పనికి చూసుకోవలసిందనీ కాళియప్పన్ ప్రార్ధిస్తాడు. తలారి పదవిలో రాజుగారి దయచేసిన వసతూన్నీ ఇన్నాళ్ళూ హాయిగా అనుభవించి ఇప్పుడు రాజధిక్కారం చేస్తావా అని గద్దిస్తాడు ఉద్యోగి. విధిలేక వల్లెయన్నాడు కాళియప్పన్. ఆ రోజు నించీ నిత్యం స్నాన జపతపాల్లో గడుపుతున్నాడు. ఆరోగ్యం క్షీణిస్తోంది. చివరికి బయల్దేరే రోజు రానే వచ్చింది. కొడుకుని సాయంగా తీసుకుని రాజధానికి వెళ్ళాడు. అక్కడ ఉరి తాడునీ, యంత్రాన్నీ పరీక్షిస్తాడు.

ఆ రాత్రి అతనికి శివరాత్రే. ముద్దాయి ఎలాగూ ఆ రాత్రి నిద్ర పోలేడు కాబట్టి తలారి కూడా జాగారం చేయ్యాలని అదొక ఆచారం. జైలర్లు అతనికి తోడు కూర్చుని, సారాయి తాగిస్తూ, నిద్ర పోకుండా ఒక కథ చెప్పటం మొదలు పెడతారు. ఒక పెల్లలో ఒక అమాయకపు పడుచు పిల్ల తన మేకని మేపుకుంటుంది. ఒక అనాథ యువకుడు పిల్లంగ్రోవి ఊదుకుంటూ అక్కడ పచ్చిక బయళ్ళలో తిరుగుతుంటాడు. ఇద్దరూ తారసపడతారు. త్వరలో అది పరస్పరం ఇష్టంగా ప్రేమగా పరిణమిస్తుంది. ఇంతలో ఆమె అక్క మొగుడు వీళ్ళని చూస్తాడు. ఆ యువకుడు అవతలికి వెళ్ళిన సమయంలో ఆ పిల్లని సోంత బావే బలాత్కరించి చంపేస్తాడు. ఆ ప్రదేశంలో అనాథ యువకుడి పిల్లంగ్రోవి విరిగిపోయి కనిపిస్తుంది. అతను దోషిగా నిరూపించబడతాడు. చనిపోయిన పిల్ల కుటుంబానికి అసలు ముద్దాయి ఎవరో తెలుసు, కానీ వారతన్ని బయట పెట్టరు. కథ ఇంతవరకూ విన్న కాళీయప్పన్ తాగిన మైకంలో "మరి ఆ అబ్బాయి ఏమయ్యాడు" అని అరుస్తాడు. కథ చెప్పిన జైలరు నవ్వుతూ "ఏమవుతాడు? వాణ్ణే నువ్వు రేపు ఉరి తియ్య బోయేది!" అంటాడు. ఇంకో నిర్దోషిని ఉరితియ్యడమనే ఊహ భరించలేక గుండె పోటు వచ్చి కాళీయప్పన్ మరణిస్తాడు.

కానీ రాజాజ్ఞ అమలు జరగాలి. సత్యాహింసలు తన దైవాలుగా నమ్మిన ముత్తు తండ్రి కాళీయప్పన్ కి వారసుడిగా తలారి పాత్ర ధరించి మొదటి ఉరి తీస్తాడు.

ఈ సినిమా ఏం చెబుతోంది?
ఈ కథకి ఆలోచన ఒక వార్తాపత్రికలో ట్రావంకూరు సంస్థానపు చివరి తలారి మరణించిన వార్త చదివినప్పుడు తట్టిందని దర్శకుడు తన ముందుమాటలో చెప్పుకున్నాడు. నేరము శిక్ష కథలు ఎప్పుడూ ముద్దాయి దృష్టి నించో, లేదా అపరాధ పరిశోధకుడి దృష్టినించో నడుస్తుంటాయి. శిక్ష, అందులోనూ మరణ శిక్ష, అమలు జరిపే మనిషి మనస్థితి ఎలా వుంటుంది అనే ఆలోచనకి చిత్ర రూపం ఈ సినిమా అనుకోవచ్చు. సమయమా అదొక సంధి యుగం. క్షేత్రమా అదొక విచిత్ర సమంఏళనం. తలారి నివాసం అతి ప్రశాంతమైన పచ్చని పల్లె వాతావరణంలో. కానీ అతని వృత్తి అతి భయంకరమైన ఉరిశాలలో. బయటి పచ్చదనం అతని మనసులో రేగే పరితాప జ్వాలల్ని ఏమాత్రం ఉపశమింప చెయ్యదు. తనుచేసే వృత్తి నీడ తన కుటుంబం మీద పడకుండా జాగ్రత్త పడుతుంటాడు అప్పటిదాకా. పైగా, ఒక చేత్తో తీసిన ప్రాణమే (ఇంకా పచ్చిగా చెప్పాలంటే ఆ ఉరితాడే) ఇంకో పక్క బూడిదయై, విభూతియై ప్రాణదానం చేస్తుంది అతని చేతుల్లోనించే. వైవిధ్య భరితమైన కాంట్రాస్టుల (contrasts) అమరికగా ఈ సినిమా చూడొచ్చు.

ఇదంతా ఇలా ఉండగా, జైలరు ఆ అమాయకపు పడుచు పిల్ల కథ చెబుతున్నప్పుడు తలారి దృష్టిలో అది తన చిన్నకూతురిలాగా, ఆ హీనమైన అకృత్యం చేసేవాడు తన అల్లుడిగా కనిపిస్తారు. ఇది (సినిమా కథలో) నిజంగా జరిగింది కాదు. కానీ ఆ ఊహ అతన్ని ముదలంటా కుదిపేసి మరణానికి దారి తీస్తుంది. ఒక విధంగా పసితనపు అమాయకత్వానికీ, కర్కశమైన న్యాయవిధానానికీ, మధ్యలో నిమిత్తమాత్రమైన అసహాయత్వానికీ ఒక త్రికోణపు సంబంధంలా అనిపిస్తుంది.

ఈ సినిమా చూశాక ఏ ఒక్క ఆలోచన మీదా నిలబడలేం. ఏ ఒక్క వివరణా, ఏ ఒక్క విశ్లేషణా మనకి పూర్తి తృప్తినివ్వదు. ఒక ఆలోచన పట్టుకుని వెళ్తుంటే ఇంకేదో స్ఫురిస్తుంది. అరె, ఇదీ నిజమే కదా అనిపిస్తుంది. అసలు ఆ విషయం చెప్పాడా సినిమాలో అని అనుమానం వస్తుంది. మంచి సినిమాకి (ఆ మాటకొస్తే ఏ సృజనాత్మక కళకైనా) ఉండాల్సిన లక్షణాల్లో ఇదీ ఒకటని నా అభిప్రాయం. ఆ దృష్ట్యా ఇది కచ్చితంగా మంచి సినిమా.

ముఖ్యపాత్రలు పోషించిన ఒడువిల్ ఉన్నికృష్ణన్ (కాళీయప్పన్), సుకుమారి (మరగతం)ల నటన అద్భుతం. ప్రముఖ మళయాళ హాస్యనటుడు శ్రీకుమార్ రాజోద్యోగిగా, కేరెక్టర్ నటుడు నెడుముడి వేణు జైలరుగా మంచి నటన అందించారు. ఈ సినిమాలో ఇంకొక విశేషం ఇళయరాజా సంగీత దర్శకత్వం అందించడం .. నేపథ్య సంగీతం ఎక్కడా దృశ్యాన్ని డామినేట్ చెయ్యకుండా నేపత్యంలోనే ఉంటుంది. ఇక గోపాలకృష్ణన్ దర్శక ప్రతిభని చెప్పడానికి నా అవగాహన సరిపోదు.

ఈ సినిమా గురించి వికీ పేజీ

జెరూసలేము నించి ఒక బ్లాగు


ఇంకొక విశ్లేషణ

ఈమాట గురించి ఓ మాట

ఈమాట జూలై సంచిక విడుదలైంది మీరు గమనించారో లేదో.

జూన్ నెలలో ఒక కొత్త ప్రయోగం మొదలు పెట్టాము ఈ మాటలో. మామూలుగా రెణ్ణెల్లకోసారి పత్రిక కొత్త సంచిక విడుదలవుతూ ఉంటుంది. ఇకనించీ సందర్భాన్ని బట్టి అప్పూడప్పుడూ ప్రత్యేక సంచికలు వెలువరించాలని సంపాదక బృందం నిర్ణయించింది. అలా మొదటి ప్రత్యేక సంచిక జూన్ నెలలో విడుదలైంది. సందర్భం, ప్రముఖ భాషాశాస్త్రవేత్త ఆచార్య భద్రిరాజు కృష్ణమూర్తిగారి 80వ పుట్టినరోజు. మీలో చాలా మందికి తెలిసి ఉండక పోవచ్చు, పందొమ్మిదో శతాబ్దం చివర, ఇరవయ్యో శతాబ్దం మొదట్లో తెలుగు భాష భవిష్యత్తు గురించి చాలా గొడవ జరిగింది. ఆ గొడవకి సంబంధించిన చాలా చారిత్రక వివరాలూ, గొడవలో ఇరువైపులా ప్రత్యక్షంగా పోరాడిన భాషా వీరుల వాదనలూ కొన్ని ఈ ప్రత్యేక సంచికలో అందించారు. తెలుగు భాషని ప్రేమించే వారికి ఈ చరిత్ర కొంచెమైనా తెలుసుకోవలసిన అవసరం ఉంది.

అన్నట్టు, ఇంకో మాట. నా బ్లాగులో కుడిపక్కన కనబడే పట్టీలో ఈమాట నించి యాదృఛ్ఛిక ఎంపికలు ఒక ఐదు శీర్షికలు కనిపిస్తూ ఉంటై. నా కథలు చాలానే ఈమాటలో ప్రచురితమైనా ఇంతవరకూ ఒక్కసారి కూడా ఈ పట్టికలో నాకు నా కథ కనబళ్ళా. అలాంటిది ఇవ్వాళ్ళ కనబడింది. అది యాదృఛ్ఛికం కాబట్టి, ఎక్కువ సేపు అక్కడే ఉండక పోవచ్చు. ఆ కథేవిటో చూడండి మరి. మనలో మాట, ఈ కథ నాకు కథా రచయితగా కొంచెం పేరు తెచ్చి పెట్టింది కూడానూ. ఆ కథ పేజీలో నా పేరు మీద నొక్కితే ఈమాటలో ప్రచురితమైన నా ఇతర రచనలు కూడా కనిపిస్తాయి. కథ నచ్చినా, నచ్చక పోయినా, అక్కడ ఈమాటలో కానీ, ఇక్కడ నా బ్లాగులో గానీ ఒక మాట మీరు చెబితే చాలా సంతోషిస్తాను.

నా మెట్టిన దేశానికి ...

నా మెట్టిన దేశానికి జన్మదిన శుభాకాంక్షలు

"అందరు మనుషులూ సమానులుగా సృష్టించబడినారనీ, సృష్టికర్త వారికి కొన్ని వేరు చేయలేని హక్కులని ఇచ్చినాడనీ, ఆ హక్కులలో జీవనం, స్వేఛ్ఛ, ఆనందాన్వేషణ అనేవి అంతర్గతంగా ఉన్నాయనే ఈ సత్యాల్ని మౌలిక సత్యాలుగా మేము నమ్ముతున్నాము"
మహోన్నతమైన ఈ ఆలోచనతో అమెరికా సంయుక్తరాష్ట్రాలు బ్రిటీషు సామ్రాజ్యాన్నించి వేర్పడి తన స్వతంత్ర అస్తిత్వానికి పునాది వేసుకుంది 1776 లో.

అటుపైన ఈ దేశపు సుదీర్ఘ గణతంత్ర ప్రజాప్రభుత్వంలో ఎన్నో పురిటి నెప్పులు, మరెన్నో ప్రసవవేదనలు. దేశంగా ఏర్పడుతున్న రోజుల్లోనూ, ఆ తరవాతనూ స్థానిక అమెరికను జాతుల పట్ల జరిగిన హింస మొదటి మెట్టు. చాలా కాలంపాటు సార్వత్రిక వోటు హక్కు లేదు. స్త్రీలకి వోటుహక్కు బాగా ఇటీవలే వచ్చింది. బానిస వ్యాపారపు చీకటి రోజులు అందరికీ తెలిసినవే. దాన్ని తుడిచి పెట్టాలనే రాజకీయ ప్రయత్నం నాలుగేళ్ళ పాటు సాగిన భయంకరమైన అంతర్యుద్ధానికే దారి తీసింది. ఇంత కష్టపడి నిర్మించుకున్న ఈ దేశం ఛిద్రమైపోతుందా అన్నంత వరకూ వెళ్ళింది వ్యవహారం. రెండవ ప్రపంచ యుద్ధం నించీ ఈ నాటి వరకూ అంతర్జాతీయ వేదిక మీద అమెరికా పోషిస్తున్న భూమిక అందరికీ తెలిసినదే.

ఐనా నా మెట్టినల్లంటే నాకేదో ప్రేమ. నా మెట్టినింటి సోదరులంటే ఒక అభిమానం. జూలై 4 తారీకున దేశ స్వాతంత్ర్యోత్సవదినం నాడు అందరు అమెరికన్లలాగే నేనూ ఒక మడత కుర్చీ చంకనెట్టుకుని దగ్గర్లో జరిగే బాణసంచా ప్రదర్శన చూడ్డానికి పోయినప్పుడల్లా ఎందుకబ్బా ఈ ప్రేమ అని ఒకసారి మళ్ళీ నా అనుభవాల్నీ భావాల్నీ నెమరు వేసుకుంటాను.

ప్రకృతి అందాలు ఒక వైపు, అభివృద్ధి వల్ల వచ్చిన రోడ్లు, వసతులు, ఇలాంటివి ఇంకోవేపు, పరిపాలనా వ్యవస్థ పటిష్ఠంగా ఉండటం వల్ల పొరులకి అందుబాటులోకి వచ్చిన సదుపాయాలు ఇంకోవేపు - ఇవన్నీ కూడా మంచి కారణాలే. ఐతే ఇవన్నీ కలివిడిగానో విడివిడిగానో ఇతర దేశాల్లో ఈ స్థాయిలోనో, ఇంకా ఇనుమడించిన స్థాయిలోనో ఉండి ఉండొచ్చు. వీటికి అతీతంగా నాకు దేశంలో జీవనం నచ్చిన మొదటి కారణం ఇది వలస ప్రజలచేత నిర్మించ బడిన దేశం కావటం. అంచేత అనేక దేశాల ఆహార పద్ధతులు, కొన్ని చోట్ల ఆయా వేషభాషలు, కొన్ని చోట్ల ఆయా సాంస్కృతిక కార్యక్రమాలూ మనకి అందుబాటులోకీ, అనుభవంలోకీ వస్తాయి. దీనికి చేదోడు వాదోడుగా ఉన్నది ఇక్కడి విశ్వవిద్యాలయాల, గ్రంధాలయాల వ్యవస్థ. ఆసక్తి గల మనిషికి ఇవి జ్ఞాన సముద్రాలే అంటే అతిశయోక్తి కాదు.

ఇహ రెండో కారణం (బహుశా అసలు ఇదే ముఖ్య కారణమేనేమో) ఇక్కడి ప్రజలు. దాన్ని క్లుప్తంగా ఎలా చెప్పాలో నాకు చేత కాదు. ఒక ముక్కు సూటి తనం, ఒక నిర్భయత్వం, ఒక జాలి గుండె, ఒక నిజాయితీ, ఒక నిర్మొహమాటం, ఒక స్వేఛ్ఛా ప్రియత్వం, ఒక నిరంతర ఆశాభావం, ఒక ఆలోచనా రీతి, ఒక నిత్యాన్వేషణ, ఒక ప్రశ్నించే గుణం .. ఇవన్నీ కొద్దో గొప్పో ఇక్కడికొచ్చి నేర్చుకున్నాను నేను. ఈ పాఠాలు నాకు నేర్పిన వ్యక్తులకీ సంఘటనలకీ నేను సర్వదా కృతజ్ఞుణ్ణి.

ఇవన్నీ ఏం లేక పోయినా కేవలం జాజ్ సంగీతాన్ని ప్రపంచానికందించినందుగ్గానూ అమెరికా నాకు ఇష్టమైపోయింది.

నా మెట్టిన దేశానికి (కొంచెం ఆలస్యంగా) జన్మదిన శుభాకాంక్షలు.