అందమైన అసంబద్ధమైన కథ

కొన్ని కొన్ని రచనలుంటై. రచనలో వెలువరించిన భావజాలం చూస్తే .. మనకి నచ్చని ఏదో ఒక కారణం వల్ల చీదర కలుగుతుంది. ఆ రచననీ రచయితనీ కాసేపు తిట్టుకుంటాం, తప్పులు రాశారనో, అబద్ధాలు రాశారనో. బహుశా కాసేపైనాక దాన్ని గురించి మర్చి పోతాం.

ఇంకొన్ని రచనలుంటై .. చదవంగానే ఏదో సన్నగా నులి పెట్టే బాధ గుండెల్లో. హబ్బ ఎలాంటి జీవిత సత్యం చెప్పారూ, ఎంత సున్నితంగా చెప్పారూ అనిపిస్తుంది. ఈ విషయాన్ని గురించి మనం కొంచెం ఆలోచించాల్సిందే ననిపిస్తుంది. తీరా కాస్త బుర్ర పెట్టి ఆలోచించడం మొదలెట్టేప్పట్టికి, ఆ రచనలో వెలువరించిన భావాల పొరలు ఒక్కొక్కటే ఊడిపోయి లోపల మిగిలేది ఒక పేద్ద డొల్ల. అహ, డొల్ల కూడా కాదు. డొల్ల ఐతే పర్లేదు. మనసుల్నీ మనుషుల్నీ వంచించే ఒక కుహనా విలువల పుట్ట. ఇలాంటి రచనల్తో చాలా జాగ్రత్తగా ఉండాలి.

ఆదివారం ఆంధ్రజ్యోతిలో బ్లాక్ ఇంక్ అనే పేరిట వినోదిని గారు రాసిన కథ సరిగ్గా ఇలాంటిదే.

విజ్ఞులైన పాఠకులకి ఇదంతా నేను విడమరిచి చెప్పక్కర్లేదు. శనివారం రాత్రి (ఆగస్టు 2) దాకా పై లంకె పని చేస్తుంటుంది కాబట్టి రెణ్ణిమిషాలు ఓపిక పట్టి మీరే ఆ కథ చదివేసి, మరో రెణ్ణిమిషాలు దాన్ని గురించి ఆలోచించెయ్యండి. ఆ తరవాతే, మీకు ఓపిక మిగిలుంటేనే ఈ కింద రాసినది చదవండి.

ఒకేళ లంకె గడువు దాటిపోతే టూకీగా కథ ఇది.
"నేను" అనబడే గృహిణి ఒక సాయంత్రం పూట తన ఫ్లాట్ లో ఒంటరిగా టీవీ చూస్తూ టీ తాగుతుండగా ముద్దులు మూటగట్టే ఒక ఎనిమిదేళ్ళ ఆడపిల్ల తలుపు కొట్టి ఇంట్లోకి వచ్చింది. "నేను" గారి భాష ఒక సమకాలీన భావకవిత్వపు తేనెజాడీలోంచి జాలువారుతూ, గాలిలోంచి సుగంధాల్నీ, పువ్వుల్లోంచి పుప్పొడినీ, చంద్రుళ్ళోంచి వెన్నెల్నీ, సీతాకోక చిలుక రెక్కల్నీ .. ఇలాంటి వాటినన్నిటినీ తస్కరించి తన ప్రవాహంలో కలిపేసుకుని పేజీ మీద ఆవిష్కరిస్తూ ఉంటుంది ముగ్ధమోహనంగా. సెల్లార్ లో మిగతా పిల్లల్తో ఆడుకుంటూ ఉన్న పిల్ల ఒక్కత్తి మాత్రం అలా ఏమాత్రం పరిచయం లేని ఇంటి వాళ్ళ తలుపు కొట్టి మరీ అలా లోపలికొచ్చేసి, ముందు మంచి నీళ్ళు, ఆ తరవాత హార్లిక్సూ తాగేసి, బోలెడు కబుర్లు చెప్పేసి, "నేను" గారితో కల్సి పన్లు కూడా చేసేసి, మధ్య మధ్య ముద్దులు పెట్టించుకుంటూ సాయంత్రమంతా గడిపేసింది. భోజనాల వేళైంది. "నేను" ఈ పిల్లని తనతో కలిసి తినమని ఆహ్వానించింది. కేరట్ కూర, చారు ఇలాంటి వేవో చేసింది. ఫ్రిజ్ లోంచి చికెన్ కూర తీసి "నేను" తనకి మాత్రం వడ్డించుకుంది. అది చూసిన ఈ ఆరిందా పిల్లమ్మగారు మీరు బ్రామిన్స్ కాదా, చౌదరీసా, పీచా, నాచా .. అని కులాల లిస్టంతా ఏకరువు పెట్టి, "నేను" నోట మాట రాక నిశ్చేష్టురాలై ఉండగా .. మీరు హరిజన్సా అని బోలెడు ఆశ్చెర్యం వొలకబోసి వాళ్ళకి (అంటే తనకీ మమ్మీకీ డాడీకీ) ఎవ్వరూ హరిజన్ ఫ్రెండ్స్ లేరూ, వాళ్ళతో ఫ్రెండ్షిప్ తమకి ఇష్టం లేదూ అని నిష్కర్షగా చెప్పేసింది.

ముగింపు ఇలా:
"నేనంటే నీ కిష్టమే కదరా ...'' నా చేతిలో అన్నం మెతుకులు నలిగిపోతున్నాయి.
"ఇష్టమే ...'' పాప మొహం వాంతి తన్నుకొస్తోంటే అతి కష్టం మీద ఆపుకున్నట్లుంది.
"మరి కూర్చో, అన్నం తిందాం''
కూర్చోలేదు పాప. అలాగే నిలబడి నా వైపు రెప్పవాల్చకుండా చూస్తోంది. లుకలుకమని తిరుగుతున్న తెల్లటి పురుగుల్ని చూస్తున్నంత అసహ్యం ఆ పిల్ల కళ్లల్లో.
"నానమ్మ పిలుస్తున్నట్లుంది'' గబగబా నడుచుకుంటూ బైట విప్పిన చెప్పుల్ని వేసుకొని పడిపోతుందేమో అన్నంత వేగంగా పరిగెత్తుకొని వెళ్లిపోయింది.
ఇందాకటి వెలుగుసున్నా భూతద్దంలోంచి నా గుండె మీద నిలబడిపోయింది.
గదినిండా పేరుకుపోయిన రంగు రంగుల సీతాకోకచిలకలు బొచ్చు పురుగులై నా మీదకు పాక్కుంటూ వస్తున్నాయ్‌!
***

ఈ కథ చదివాక నాకు పేజీ నిండా ఇందాక జాలు వారిన వెన్నెల చారికలూ, తేనె డాగులూ, నక్షత్ర పుప్పొడులూ పోయి, వికృతమైన క్రేటర్లూ, విషసర్పాలూ కనిపిస్తున్నై. మధ్యాన్నం తిన్నదేదో కడుపులో అసహనంగా తలెత్తుతోంది.

ఏవి సంస్కారం .. ఏవి సందేశం .. ఏమా ఆలోచనల తీరు .. ఏమా ఆక్రందనల హోరు.
బాబోయ్ బాబోయ్ దిమ్మతిరిగి పోయిందంటే నమ్మండి.

కథ మొదణ్ణించీ, కేవలం ఈ క్లైమాక్సు సిద్ధించడం కోసమే అక్కడ ఉంచ బడిన అనేక అసంబద్ధాల సంగతి అలా ఉంచండి. పాతికేళ్ళ నించీ ఎంతైనా హెచ్చు వయసుండదగిన ఒక స్త్రీకి లేని పరిణతి ఎనిమిదేళ్ళ పిల్లకి ఎలా వస్తుంది? అన్ని రకాల అభ్యంతరాల్లోకీ భోజన సంబంధమైన అభ్యంతరాలు అతి బలమైనవని ఈ మహాతల్లికి తెలియదా. శాకాహారులైన వారు, ఎంత లిబరల్ ప్రోగ్రెస్సివ్ ఆలోచనాపరులూ, కార్య శీలురూ అయినా, మాంసాహారం కంట బడితేనే వాంతి చేసుకునే వారుంటారు. అలాంటిది, ఎదురుగా ఉన్నది చిన్న పిల్ల కదా, ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేకుండా ఈవిడ ఆ పసిపిల్ల ముందు చికెన్ కూర ఎలా పెట్టింది? ఆ పాప అయినా .. చౌదరీస్, మిగతా హిందూస్ అంతా తమ ఫ్రెండ్స్ అయినప్పుడు చికెన్ కూర చూడంగానే ఏదో మనిషి శవాన్ని చూసినట్టు ఆశ్చర్యం అనుమానం పడనేల? మన సమాజంలో కులం గురించి అడగడం ఏమంత తెలియని విషయమూ, నాలిక పీక్కోవలసిన సంఘటనా కాదే. నా కులం ఇదని ధైర్యంగా చెప్పు. లేదూ, ఆ ప్రసక్తిని తుంచేసెయ్యి. "కుంజరః" అన్నట్టు పెదవులు దాటని నంగిరి మాటలెందుకు? వెలుగు సున్నాని గుండె మీద పరుచుకుని ఈ మొసలి కన్నీళ్ళెందుకు?

ఇంతకన్నా, లండీకానా, నీకు నా కులం కావల్సొచ్చిందే అని పాపని ఆ చెంపా ఈ చెంపా వాయించినట్టు ముగించి ఉంటే సంతోషించేవాణ్ణి!
ఈ వెన్నెల జలతారు దారాల్లో చుట్టిన దూది బొమ్మకి బదులు ఒక ఉక్కుతునకని ఆవిష్కరించి ఉంటే "బ్రహ్మా"నంద పడేవాణ్ణి!!

Comments

Purnima said…
ఇంతకాలం నాకు రెండు వర్గాలు తెలుసు: ఒకటి కులం, మతం అనేవాటికి ప్రాధాన్యతనిచ్చి జీవనాన్ని సాగించేవారు. మరొకటి వాటిని అంతగా పట్టించుకోక తమకిష్టమైన పంధాలో నడిచే వారు. కానీ ఈ కథ చదువాకా నాకు వీటి రెంటి మధ్యగా ఉన్నవారూ లేకపోలేరు అనిపిస్తుంది. కులాలు మతాలు అంటూ విభజనలు అలానే ఉండనిచ్చి.. వాటి వల్ల మనకిబ్బంది కలిగినప్పుడు ఆక్రందన.. కలగనప్పుడు అవున్నా ఫర్వాలేదు. ఈ కథలో "నేను" బ్రాహ్మినో, రెడ్డో, చౌదరో అయితే.. అసలు కథే ఉండదు మాట!! That's the saddest part, I felt!!
విహారి said…
ఈ కథ చదివాను. ముగింపేంటో గానీ. ఇలా జరిగే సందర్భాలున్నాయని నేను ఘంటా పథంగా చెప్పగలను. మా ఊళ్ళో ఇలాంటివి చిన్న పిల్లల్లో చాలా చూశాను.

-- విహారి
ఇక్కడ అప్రస్తుతం ఏమోగానీ,గిరీశం మాటొకటి గుర్తొస్తుంది..పల్లెటూరు ఊసుపోదనుకున్నానుగాని,పెద్దకాంపెయినుకి అవకాశం ఇక్కడకూడా దొరకటం నాఅదృష్టం అన్నదా మాట.మొదట ఆంధ్రజ్యొతి లొ ఈ కధను చూసి పెద్దగా పట్టించుకోలేదు.తర్వాత జాన్ హైడ్ కనుమూరి గారడిగారు కధ ఎలా ఉందని.గురువుగారు ఇక్కడొక చర్చను ప్రారంభించాక ఇకతప్పక చదివాను.ఒకట్రెండు సార్లు చదివాక ఇదేదో టాళాటోళీ వ్యవహారం కాదు,పెద్దక్యాంపెయిను ఉందని తెలిసింది.
డిగ్రీలో సామాజికరుగ్మతలశాస్త్రమొకటి చదివాం దాన్ని ఆంగ్లంలో social pathologyఅంటారు.సమాజాన్ని పట్టిపీడిస్తున్న చాలా రుగ్మతలను అందులో (అకడమిక్ గా చర్చించి)చివరలో కొన్ని సూచనలూ ఇచ్చేవారు.అవి జవహర్ లాల్ నెహ్రూ ప్రధానిగా ఉన్నప్పుడే ఆచరణయోగ్యం కావూ అని ఖాయంగా తేలిపోయినా పుస్తకాల్లో మాత్రం అలాగె ఉండిపోయెవి.అలాగే కులప్రభావం తగ్గింది,కులతత్వం పెరుగుతుంది అనికూడా చదువుకున్నాం.కొత్తపాళీ,విహారి గారన్నట్లు ఇలాంటివి(ఈకధ లాంటి సంఘటనలు) తరచూ కాకపోయినా విడ్డూరం మాత్రం కాదు.కాకపోతే కులాన్ని కుంచంతో కొలుస్తున్నారా?లేక కుంచాన్ని తిరగేసి కొలుస్తున్నారా అన్నది నా ప్రశ్న.
అయిదవ తరగతి చదువుతున్న నాకూతురు మొన్నీమధ్యే అడిగింది,క్యాస్ట్ అంటే ఏమిటీ అని!నేనూ మళ్ళీ చదవటమ్ మొదలుపెట్టాలి,కొత్తపాళీ గారడిగిన ప్రశ్నల్లో ఎన్నో ధర్మసూక్ష్మాలూ,నైతికతకు సంబంధించిన ప్రశ్నలూ,అసలు సామాజికకట్టుబాట్లకు చెందిన ప్రశ్నలూ నాకు కనిపిస్తున్నాయి.విజ్ఞులిచ్చే సమాధానాల కోసం ఎదురుచూస్తున్నా.....
మీ టపాకన్నా ముందే ఈ కథను చదివాను. చిన్నపిల్లలను చూస్తే కలిగే ముచ్చటను కొంత కవితాత్మకంగా బాగానే రాశారు మొదట్లో. వాళ్లింట్లోకి మంచినీళ్ల కోసం ఆ పాప రావడం వరకూ బానే వుంది. ఆతరువాత ఆమెతోనే వుంటాననడం, చొరవగా పనులు కల్పించుకొని చెయ్యడం దగ్గర నాకు ఆసక్తి చచ్చింది. సరే చివరి దాకా వచ్చాం కదా అని చదివాను. ముగింపు చదివి 'ఏమోలే, ఇలాంటి అనుభవం ఎదురై వుండొచ్చు' అనిపించినా అందులో చాలా అసహజత వుందనిపించింది. మొత్తానికి కథ నాకు నచ్చలేదు. ఆ తరువాత ఆలోచించలేదు. వదిలేశాను.

ఈ టపా చివరి రెండు పారాల్లో మీరన్నమాటలతో అందులోని కుట్ర తెలిసింది. ఒకవేళ ఇది కుట్ర కాకపోయినా, ఒక చిన్నపిల్ల 'మీ కులమేమి' అని అడిగి, తెలుసుకొన్న తరువాత అక్కడ వుండడానికి ఇబ్బంది పడిన సంఘటన వల్ల కలిగిన బాధను కథగా చెప్పాలనుకుని వుంటే మాత్రం -- ఇది దారుణంగా విఫలమయిన ప్రయత్నం.

ఈ కథలో అల్లిన సన్నివేశాల గురించి ఆలోచించే కొద్దీ ఈ రచయిత నిజాయితీ లేకుండా సానుభూతిని ఆశించినట్టు కనిపిస్తూవుంది. లేదా ఇందులో నేను చూడలేని నా పరిధికి అందని పార్శ్వాలేమైనా వున్నాయో!!?
aswin budaraju said…
ఇలాంటిది సంఘటాన ఈ మధ్యనే నాకు అనుభవం, కానీ అది చూసిన దాని కాన్నా కధగా చదివితే చాలా చికాగ్గా ఉంది
Nagaraju Pappu said…
Paradise Lost! అసలుంటేగా పోవడానికి.
మనకున్నవి ఓ అరడజను క్లిషేలే కదా - అసలీ పత్రికలూ, పుస్తకాలు గట్రా ఈ గొడవలన్నీ ఎందుకు? వాటినే ఓ post-it మీద రాసి, ఫ్రిజ్ డోరు మీద అంటించుకుంటే పోలా?

కథల్లో నీతూలూ గోతులూ వెతకడం నాకు చాతకాదెలాగు. అంత ఇమాజినేషనున్న ఆ "నేను"గారు పోనీ కథాప్రారంభానికి ముందే "వర్గ రహిత సమాజాన్ని" ఊహించేసుకొని, అందులోకి ఓ ముద్దుల పాపాయిని తెచ్చుకొని చివర్లో ఎంచక్కగా ఆ పాపకి గోరుముద్దలు తినిపించినట్టుగా ఈ కథని తిరిగిరాసినా, అలా నేనే ఊహించుకొన్నా - అసలు కథ చదవడానికే చిరాగ్గా ఉంది.

అద్సరేగానీ - మీరేవిటీ, ఒక బ్లాగులో కథలు రాయమని, ఇంకో బ్లాగులో కథలు చదవమనీ అడకత్తెరగా మారి మమ్మలని పోకచెక్కలని చేస్తున్నారు? ఇహ ముందు, మీరు ప్రకటించే కథాంశాలన్నిటికీ, గడువుతేదీ నాటికి మీరు కూడా ఓ కథ రాయాల్సిందే.
Sorry for writing this comment in English. I am in Delhi attending 'eIndia 2008' and don't have access to Baraha.

Easting meat is a food habit and there are no values attached, if looked at it objectively. However,in India it is often used as a leading point to gaze someone's caste.That's a usual practice when u are on a house hunt etc.

But, interesting part of this story is showing this through a child. How young minds are 'injected' these prejudices and their world view is constructed through these perceptions. Its a reality and story seem to capture that 'reality'.
సుజాత said…
ఈ కథ చదివిన తర్వాత కలిగిన అసహ్యం ఇంకా మనసుని వదలక ముందే , ఈ టపా చదవడం తటస్థించింది. వేరే కులాన్ని చప్పున వేలెత్తి చూపగలిగే స్వభావం బ్రాహ్మణ కులంలో తరతరాలనుంచీ వేళ్ళూనుకుంది. పైగా ఇంట్లో ఉండే వాతావరణానికి పిల్లలు బలిపశువులు. ఇందులో పిల్ల బ్రాహ్మల దైనా చిన్నప్పటినుంచీ 'హరిజన్స్ ' ఇంట్లో పెరిగితే ఏమై ఉండేదో? ఇలాంటి ముదురు పిల్లల్ని నేనూ చూశాను, చుట్టాల్లో కూడా! కొడవటిగంటి కుటుంబరావు గారు తన 'కులం లేని పిల్ల ' నవల్లో "డబ్బు లేకుండా జీవించడం సులభమే గానే కులం లేకుండా మాత్రం బతకడం కష్టం ఈ 1939 లో కూడా!" అంటారొకచోట. ఆ తర్వాత డెబ్భై ఏళ్ల తర్వాత కూడా కులం లేకుండా మనిషి బతకలేకపోతాడన్నది ఆయన ఊహించలేదేమో!

హరిజనుల మనోభావాల కోణాన్ని ఆవిష్కరించాలన్నది కథ ఉద్దేశ్యమైతే అది నెరవేరలేదన్నది స్పష్టం.
ఏదో పెద్దలని మీ మాటకు గౌరవమిచ్చి, ఆ కథ చదివాను. ఈ సారి మీరు ఇచ్చే లంకెలను ఆచి తూచి క్లిక్కాలని నిశ్చయించుకున్నాను. ఈ సంఘటన నా డయరీలో .. యఱ్‌ఱ్‌.. బ్లాగులో.. నల్ల ఇంకుతో .. యఱ్‌ఱ్‌.. నల్ల ఫాంటుతో వ్రాసుకుంటాను.

అన్నట్టు నల్ల ఇంకు అంటే గుఱుతుకువచ్చింది. ఆవిడిగారు పేల్చిన ఉపమాలకే నాకు వాంతి వచ్చేడట్టయ్యింది. ఆ ఉపమాలన్నిటికిఁ తాత ఈ నల్ల ఇంకు రూపకం.
Padma I. said…
ఈ స్టోరీలో మిమ్మల్ని ఇరిటేట్ చేసే టాపిక్స్ ఇంకేమీ లేవా అని నేను వండరవుతున్నాను.

నా యాక్రోశమును వేరొకచోట వెడలగ్రక్కెదనుగాక! :-)
హమ్మయ్య! ఇప్పుడు తెలుగులో రాసే సౌలభ్యం కలిగింది. అలాగే ఆంద్రజ్యోతిలో ఆ కథ కూడా చదివాను. ఇది నాకు తెలిసిన కథే!నిజంగా చాలాచోట్ల జరిగే సొదే!!

కులాన్నిబట్టి విలువలూ,లక్షణాలూ ఆపాదించేసి ఆ ప్రెజుడిస్ లో చాలా సౌకర్యంగా బ్రతికిన జీవితాలు మనవి. అందుకే ఈ కథ నాకు ఆశ్చర్యాన్ని కలిగించకపోయినా, "కనీసం తరువాతి తరమన్నా మారుతుందేమో!" అన్న ఆశను కాస్తా చిదిమేసిందనిపించింది.

కథాశైలి నాకు పెద్దగా నచ్చకపోయినా, విషయం ఆలోచింపదగింది. ఆర్.నారాయణమూర్తి సినిమాను ఎగతాళిచేసినా అతను సినిమాలో చెప్పేవిషయాలను అవహేళన చెయ్యగలమా? ఈ కథా అంతే!

కాబట్టి, ఉపమానాలమీదా వర్ణనలమీదా దృష్టి తగ్గించి, ఈ కథలో చర్చించిన పిల్లయొక్క తల్లిదండ్రుల మనస్తత్వాల్ని గురించి కాస్త ఆలోచిద్దాం. కనీసం మనం ఆ తప్పు చెయ్యకుండా జాగ్రతపడదాం.
Srinivas said…
చిన్న పిల్లలకి కూడా అంటరాని తనాన్ని (లేదా దాని మరో రూపాన్ని) నేర్పుతూ ఒక దురాచారాన్ని ఎట్లా కొనసాగిస్తున్నామో చెప్పదలుచుకున్నట్లుందీ కథ. మిగతా కామెంట్లు చూస్తే అది నిజమేనని తెలుస్తూంది.

మీ అభ్యంతరం, అసహనం దేనిపట్లో నాకు పూర్తిగా అర్థం కాలేదు. ఫ్రిజ్ లోంచి కూరలు తీస్తున్న పాపకే చికెన్ గిన్నె కళ్ళబడిందనుకోండి, అప్పుడు మీ అభిప్రాయం ఏమయినా మారుతుందా? ఆ పాప అయినా చికెన్‌ను చూచి కాదు ఆశ్చర్యపడిందీ, అనుమానించిందీ; ఆమె బ్రాహ్మిన్స్ కాదని అర్థమవుతూ. ఇక్కడ సమస్య కులం గురించి అడగడం కాదు, కొన్ని కులాల్ని దూరంగా ఉంచడం. అది పిల్లలు చిన్నతనంలోనే గమనించడం, గ్రహించడం, పాటించడం.

కథనం పరంగా చూస్తే ఆమె వద్ద పాప చేరిక క్రమంగా పెరిగినట్టు చూపడం, తెంగ్లీషు తగ్గించడం చేయవలసింది. ఇక పప్పు గారు చెప్పిన క్లిషే ఏదో అంత స్పష్టంగా ఈ కథలో కనపడలేదు నాకు.
నా మాట మీద, కష్టపడో ఇష్టపడో ఇది చదివి వ్యాఖ్యలు రాసిన మిత్రులందరికీ మనసారా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నా.

@పూర్ణిమ .. ఇది మధ్యగా ఉన్న కథ కాదని గుర్తించమని నా ప్రార్ధన. "తనదాకా వస్తేనే గానీ.." లాంటి ఆలోచనా, ప్రవర్తనా మనుషుల్లో సహజమే. దాన్ని నేను ప్రశ్నించడం లేదు. ఒక వ్యూహం ప్రకారం, ఒక ఎత్తుగడ ప్రకారం బురదజల్లే కథ ఆంతర్యాన్ని ప్రశ్నిస్తున్నాను.

@విహారి .. ఒక ఎనిమిదేళ్ళ పిల్ల కులం గురించి అలా మాట్లాడ్డం అసహజం అనో, జరగదనో నేను అనడం లేదు. ఆ పాత్ర చిత్రణ ద్వారా, అక్కడ కల్పించిన సంఘటన ద్వారా రచయిత ప్రకటిస్తున్న భావాన్ని ప్రశ్నిస్తున్నాను.

@రాజేంద్ర .. కేంపెయినులంటే చెవి కోసుకునే వారికవి "ఇందు గల వందు లేవని సందేహము వలదు." అందులో కులం పేరెత్తాక కేంపెయినుకేం కొదవ? :)
" కులాన్ని కుంచంతో కొలుస్తున్నారా?లేక కుంచాన్ని తిరగేసి కొలుస్తున్నారా అన్నది నా ప్రశ్న."
నా ప్రశ్నల్లో ఒకటి కూడానూ.
ఇక పిల్లలకి కులం గురించి చెప్పటం విషయం .. ఇదే సరైన పద్ధతి అని ఎవరు చెప్పగలరు? కుల మత పరంగా విపరీతమైన కట్టుబాట్లున్న ఇంటినించి వచ్చిన దాశరధి రుద్రవీణ రచించారు. తెలంగాణా సాయుధ పోరాటంలో పాల్గొని జైలుకి వెళ్ళారు. మూర్తీభవించిన గాంధేయవాదులై కుల మత వ్యత్యాసం లేకుండా రోగి నారాయణ సేవ చేసి, ఇంటా బయటా మనసా వాచా కర్మణా కులతత్వాన్ని విసర్జించినవారి సంతతి ఇప్పుడు సంపూరణంగా తమ కులపద్ధతుల్ని ఆచరిస్తున్నారు. అందులో తప్పుందని మాత్రం ఎవరనగలరు?

@రానారె .. ".. నిజాయితీ లేకుండా సానుభూతిని ఆశించినట్టు .."
నిజాయితీ లేకపోవడం నిజం. సానుభూతి నాశించడం అబద్ధం. ఈ కథలో రచయిత ఆశిస్తున్నది సానుభూతి కాదు.

@అశ్విన్ .. వోకే.

@ నాగరాజు .. మీ ఆజ్ఞ శిరసావహిస్తాను. :)

@సుజాత .. మీరు మొదటి పేరాలో వెలిబుచ్చిన కొన్ని అనుకోళ్ళు (assumptions) పట్ల నాకు చాలా తీవ్రమైన అభ్యంతరాలున్నాయి. ఇది వేదిక కాదు. మీ చివరి వాక్యం నన్ను కొంచెం ఆలోచింప చేసింది. ఆ నిర్ధారణకి మీరు ఏ ప్రాతిపదిక మీద వచ్చారో నాకు అర్ధం కాలేదు. హరిజనుల మనోభావాల కోణాన్ని ఆ కథ ఆవిష్కరించ లేదని మీకెందుకు అనిపించింది? వీలుంటే విశదీకరించగలరు.

@రాకేశ్వర .. mea culpa ఏదో పెద్దోళ్ళ చాదస్తం అని క్షమించేసెయ్ :)

@పద్మ .. మీ ఆక్రోశాన్ని చూద్దామని వెళ్తే అది తెలుగు వీర లేవరా అంది. అర్ధం కాలేదు.

@మహేష్ .. అసలు కథ దేన్ని గురించి అని ప్రశ్నించుకుంటే నాకొచ్చిన సమాధానాలు మీకొచ్చిన సమాధానాలకి భిన్నంగా ఉన్నాయి. నా దృష్టిలో ఈ కథ వచ్చే తరంలో రావాల్సిన మార్పుల్ని ఆకాంక్షించే కథ కాదు. చెప్ప దల్చుకున్న దాన్ని సూటిగా చెప్ప లేక ఒక తెచ్చి పెట్టుకున్న భావుకత ముసుగులోంచి బురద జల్లడం తప్ప ఈ కథకి వేరే ప్రయోజనం లేదు నా ఉద్దేశంలో. కథ గురించి మాట్లాడ్డం మొదలెట్టాక, అదొక సృజనాత్మక ప్రక్రియ కాబట్టి దానిలోని సృజనాత్మకతా లేమిని గురించి కూడా మాట్లాడతాం. అక్కడికీ నా విమర్శలో సాధ్యమైనంత వరకూ దాన్ని పక్కకి నెట్టి పాత్ర చిత్రణా, సన్నివేశాల కల్పనా, సందేశాల మీదనే దృష్టి పెట్టే ప్రయత్నం చేశాను. మీరు ఒక్క విషయం గుర్తించండి. నాకు దళిత చైతన్యంతో గొడవ లేదు. ఈ కథలో అది లేదన్నదే నా గొడవ.
Anonymous said…
My immediate reaction:

1. The writer should have focused less on comparisions and more on the theme. The message she wanted to convey was pre determined in her writing and that she only created a situation and wanted the audeince to know that casteism is prevalent among kids too.(may be a kid she knew well might have experienced the situation).

2. There is no hiding in saying that its absolutely true what she wrote. We oursleves (irrespective of what caste we belong to) know this fact. Part of the reason is culture and food habits are important ingredients of the culture. No community can give up their culture easily. Its easy to say that future generations have to change and forget all these differences and discriminations. Its easy to say than to put in practice. We can debate on this.

3. Its little sad to convey the writer's message thru a child as the little hope of possible change in future generation has been killed in the end.

4. It is absolutely a fact that parents have to be blamed a little (apart from peers at school, media etc) for creating images/imaginations about caste and related cultures. But it has been happening over generations, so parents' parents, grandparents's parents....so on...there is no use in going in that line at all.

5.I personally experience discrimation too on the lines mentioned in story, not about food but about entering a brahmin's home. But that was when I was young/youth. I mentioned this to convey the message, stories come out of experiences. I would have had a different opinion if I had not experienced.

Sincerely
Bhaskar
సుజాత said…
మొదటి పేరాలో నేను వెలిబుచ్చింది అనుకోలు కాదు. నేను స్వయంగా చూసిన సంఘటనల ఆధారంగానే అన్నాను. చివరి పేరాలో నా వ్యాఖ్య మీకు వేరేలా అర్థమైందనుకుంటాను.హరిజనుల పట్ల సానుభూతి కలిగించడానికి రచయిత్రి/లేదా రచయిత ప్రయత్నించి ఉంటే అది సఫలం కాలేదని నా ఉద్దేశం!
"ఇది వేదిక కాదు" అంటే అర్థం కాలేదు. వివరిస్తే తెలుసుకుంటాను.
ఇంగ్లీషులో వ్రాసిన అనానిమస్ గారి కామెంటు లోని భావాల తో నేను ఏకీభవిస్తున్నాను.

బొల్లోజు బాబా
కొపా గారు,
మీరు కోప్పడనంటే నాకు తోచింది చెప్తాను. నాకీ కథలో పెద్ద కుట్రేమీ కనిపించలేదండీ.
కొన్ని కొన్ని కథా వస్తువులు "చాలా హాట్ గురూ" అన్నట్టుగా ప్రజాకర్షకమైనవి ఉంటాయి. అలాటివాటి మీద కథ రాస్తే, అందులో కథనం ఎలాఉన్నా (ఉన్నా లేకపోయినా) మరేవున్నా లేకపోయినా ప్రజలందరూ (కులమత భేదరహితంగా) దాన్ని చదువుతారు, చెప్పిన విషయానికి తన్మయులై రచయితతో ఏకీభవిస్తారు. అలాటి కథలు రాసి పేరుతెచ్చుకోవాలనుకోవడం "కుట్ర" అంటారా, తప్పుకదూ!
విమర్శకులు మాత్రం తక్కువతిన్నారా! మీరేది వేలెత్తి చూపించినా దానికి విరుగుడు సిద్ధంగా ఉంటుంది. ఆ అమ్మాయి మాటల్లో పొంగిపొరలిన ఇంగ్లీషుకి పద్మగారి లాంటివారు ఆక్రోశించారనుకోండి, "అది సహజత్వానికి దగ్గరగా ఉండే పాత్రచిత్రణ, ఆమాత్రంకూడా మీకు తెలీదు పొ"మ్మంటారు. మరి ఎనిమిదేళ్ళపాప అంత పేరక్కలా మాట్లాడుతూ ప్రవర్తించడం సహజమేనా అని అడిగారనుకోండి, ఏం అలా ఎందుకుండ కూడదూ అని ప్రశ్న వేస్తారు. అక్కడ సహజత్వం, సాధారణత్వం మనం చూడకూడదు. విమర్శకుల కత్తికి రెండువైపులా పదునే!
ఇంతకీ ఈ కథలో రచయిత/రచయిత్రి చెప్పదలచుకొన్నది ఏవిటీ అని అడిగితే, "సమాజంలో ఉన్న చేదు నిజాన్ని అద్దంలా ఈ కథ ప్రతిఫలిస్తోంది" సమాధానం తయారుగానే ఉంటుంది. అప్పటికీ నోరుమూసుకోక, అది అద్దమా భూతద్దమా అని మళ్ళీ అడిగారనుకోండి, మీకళ్ళకి భూతద్దమేమో మా కళ్ళకి అద్దమే అని సమాధానం! ఎవరి కళ్ళు ఎవరిని మోసం చేస్తున్నాయి?
ఇంతకీ ఈ కథవల్ల నేనివాళ తెలుసుకున్న ఓ కొత్త విషయం, ఒక మనిషి మరో మనిషిని "పిగ్గు"కన్నా హీనంగా చూడగలడని. నేనలా చూడగలనో లేదో ప్రయత్నించి చూడాలి!
మన సమాజంలో అందరూ స్వకులాభిమానులే అయ్యుండీ పబ్లిక్ లోకి వచ్చేసరికి మాత్రం పెద్ద పోజులెందుకిస్తారో నాకెప్పుడూ అర్థం కాదు. అలా పోజు కొట్టకపోతే వెలివేసే పరిస్థితిని సృష్టించారనుకుంటా మన పూర్వతరంలో నాయకులూ, రాతగాళ్ళూ. ఈ ఫోజుల రాయళ్ళలో ఎక్కువమంది ఒక ప్రత్యేక అగ్రకులానికి చెందినవాళ్ళు.

ఇందులో ఇంకో మతలబు ఏమిటంటే ఈ కులాతీత, మతాతీత కబుర్లన్నీ తమకు నచ్చని కులాల్ని విలనైజ్ చెయ్యడానికీ, వాళ్ళకి నీతులు చెప్పడానికీ, వాళ్ళలో ఆత్మాభిమానమేదైనా ఉంటే దాన్ని కులాహంకారంగా ప్రచారం చేసి వాళ్ళని అణగదొక్కడానికీ. మఱే ప్రయోజనమూ లేదు.

అలాగని ఈ పోజులు కొట్టేవాళ్ళూ, రాతగాళ్ళూ కులాన్ని పిసరంతైనా నిర్మూలించగలిగారా ? (అసలు, వాళ్లే అంతర్గతంగా కులపిచ్చిగాళ్ళయితే, వాళ్ళేమీ నిర్మూలిస్తారు ? - మనకెందుకు, పోనివ్వండి ! ఉన్నమాటంటే వాళ్ళ అభిమానులు శోకిస్తారు)

మనసులో ఒకటి పెట్టుకుని పైకి ఇంకొకటి మాట్లాడ్డం రాజకీయ నాయకులు చెయ్యాల్సిన పని. మనకా అవసరం లేదు. నా మటుకు నాకు కులం పెద్ద సమస్యగా తోచదు. దాని గుఱించి ఊరికే అనవసరంగా మాట్లాడి మనవాళ్ళు దాన్నెందుకు సమస్యగా మారుస్తారో నాకు తెలియదు. బహుశా రిజర్వేషన్లు ఉన్నంతకాలం కులద్వేషాలు కూడా బతికే ఉంటాయనుకుంటా. కాని రిజర్వేషన్లని బతికించాంటే కులద్వేషాల్ని కూడా బతికించడం అత్యావశ్యకం.

నాలాంటివాడొకడు తన కులం తనకిచ్చిన ఉజ్జ్వల వారసత్వం గుఱించి సంతోషపడతాడు. తన కులంలో పుట్టిన మహనీయులు నెలకొల్పిన ఉన్నత ప్రమాణాలకు, ఆదర్శాలకూ అనుగుణంగా జీవించాలని ఆశపడతాడు. అయినా అతనికి చిన్నప్పటి నుంచి అన్ని కులాలవాళ్ళూ మిత్రులుగా ఉండొచ్చు.

కులం నుంచి కాకపోయినా, ఎవరైనా అలా తమ తండ్రితాతల నుంచి స్ఫూర్తి పొందవచ్చు. ఫలానా గొప్ప వంశంలో జన్మించాననే స్పృహ మనిషి వ్యక్తిత్వాన్ని బాగుచేసే పక్షంలో దానికి మనం ఎందుకు అభ్యంతరం చెప్పాలో దానికి సంకుచిత బిరుదులెందుకు తగిలించాలో నాకర్థం కాదు.

నేను చూసినంతవఱకు, నేను గ్రహించినంతవఱకు కులాలకు కులవృత్తులే కాక భౌతిక/ మానసిక వ్యక్తిత్వం ఉన్నమాట పూర్తిగా అబద్ధమేమీ కాదు. ఎవరైనా అది గ్రహించలేకపోతే అది మన తప్పు కాదు. ఎవరి వ్యక్తిగత అలవాట్లు వారివైనట్లే ఎవరి కులాచారాలు వారివి. దేశానికి రాజ్యాంగం ఎలాంటిదో కులానికి ఆచారం అలాంటిది. వాటిని విమర్శించడం పూర్తిగా అన్యాయం. అమానుషం. అవివేకం. ఆ మాటకొస్తే ప్రతి విషయంలోను ఇంటికో పద్ధతి ఉంది. దాన్నెలా మానిపిస్తారు ?
సుజాత గారు, ఇది వేదిక కాదు అంటే .. ఈ టపా ఈ కథ మీద చర్చ కోసం ఉద్దేశించినది, మీరు చేసిన ప్రతిపాదనలని విశ్లేషించడానికి కాదు అని నా వుద్దేశం.
మీరు మొదటి పేరాలో కొన్ని స్వీపింగ్ స్టేట్మెంట్లు చేశారు. ఆ స్టేట్మెంట్లు నే చూసిన సంఘటనల ఆధారంగానే అని ఇప్పుడు అన్నారు. మీరు చెప్పే ఉదాహరణలకి ప్రతిగా రెండేసి ఉదాహరణలు నేను చూపిస్తాను. అప్పుడు ఈ చర్చ ఎక్కడ వేసిన గొంగళీ చందమే.
"కులాలకు కులవృత్తులే కాక భౌతిక/ మానసిక వ్యక్తిత్వం" ఉంటాయని తెలియజెప్పి ‘తాలబా’గారు మన సమాజంలోని ఈ రుగ్మత ఎప్పటికీ కనుమరుగు కాదని కథలో చెప్పిన విషయాన్ని దృవీకరించారు. వారికి నా నెనర్లు.

అంతేకాక, "దేశానికి రాజ్యాంగం ఎంత అవసరమో కులాలకు అచారాలు అలాంటివి" అని చెప్పి అస్పృశ్యతకూ,అంటరానితనానికీ చాలా సహేతుకమైన కారణాన్ని అందించారు.వారికి నా అభినందనలు.
@శ్రీనివాస్.. ఈ కథకి ఇక్కడ వచ్చిన విశ్లేషణాల్లో మీరే నిజానికి దగ్గరగా వచ్చా రనిపిస్తోంది. అవును, కులాన్ని గురించి అడగడం కాదు సమస్య, కొన్ని కులాల్ని పనిగట్టుకుని దూరంగా ఉంచడం అసలు సమస్య. కానీ కథలో పాటించిన ఎత్తుగడ, వ్యూహము, చిత్రణ రచయిత ఉద్దేశాన్ని చెప్పకనే చెబుతున్నాయి. "నేను" పాత్రకీ, పాప పాత్రకీ మధ్య కాంట్రాస్టు గమనించండి, ముఖ్యంగా చివరి సంభాషణలో.
@Bhaskar .. I have no problem with what all you said, except perhaps point No.3. Evoking hope was not the purpose of this story.
@సుజాత .. మీ వ్యాఖ్యలు మళ్ళీ శ్రద్ధగా చదివాను. హరిజనుల మనోభావాల్ని ఆవిష్కరించడానికీ, వారి పట్ల సానుభూతి కలిగించడానికీ చాలా తేడా ఉంది - రెండూ ఒకటి కాదు.
@కామేశ్వర్రావు .. కోపమా, నేనా, అందులోనూ మీ పైనా? :) మీరు చెప్పినవన్నీ నిజమే!
@లలితాబాలసుబ్రహ్మణ్యం .. ప్రస్తుత కథకి తిన్నగా సంబంధం లేకపోయినా, ఇక్కడి చర్చలో అంతర్గతంగా ఉన్న సూత్రానికి తగిన వ్యాఖ్య చెప్పారు.
@మహేష్ .. నాకు తెలిసిన ఒక పెద్దాయనకి షేక్ హాండ్ చెయ్యడం ఇష్టం ఉండదు. As good as it gets సినిమాలో జాక్ నికొల్సొన్ పాత్రకి ఎవరూ తనని ముట్టుకోవడం ఇష్టం ఉండదు. అది వారి వ్యక్తిగత హక్కు అని గౌరవించడం లేదా? ఒక మనిషి తన కులాచారాల్ని గౌరవించి పాటించడం వేరు, ఒక సంఘం (ఒక్క కులం కాదు, చాలా కులాలు) అంతా కలిసి కొన్ని వర్గాల్ని (మళ్ళీ ఒక్క కులం కాదు, చాలా కులాలు) మాత్రం తొక్కి ఉంచడం వేరు. తేడా గమనించ గలరు. నా ఉద్దేశంలో "బిగట్రీ" ఏ రూపంలో ఉన్నా గర్హించాలి. రాజేంద్ర చెప్పినట్టు ఈ కథ కులాన్ని కుంచం తిరగేసి కొలుస్తోంది.
సుజాత said…
అవునా, అయితే రెండోదే ఖాయం చేసుకోండి!
రమణి said…
ఇది చదివిన తరువాత నాకు ఒకవిధమైన ఏవగింపు కలిగింది. పాప నవ్వులు, మాటల వర్ణనల వెనకాల ఇంత వంకర ముంగింపు ఉందా? అని అనిపించింది. అయితే కథా పరంగా ఇలా అనిపించినా, వాస్తవానికి వస్తే ఇలాంటి వారు లేరు అని మటుకు నేను చెప్పలేను. సిటీ లో అక్కడ అక్కడ ఒకటో అరా కనిపించినా గ్రామాల్లో మటుకు ఈ వర్గ వైషమ్యాలు ప్రతి చోటా కనిపిస్తాయి. పసిపిల్లలు, చదువుకొనే పిల్లలు ఆరిందాల్లా ఇలా మాట్లాడేవాళ్ళు కోకొల్లలు.అయితే ఈ విషయాన్ని ఓ కథా రూపంలో ఉంచి రచయిత చెప్పదల్చుకొన్నది ఏమిటో తెలియలేదు ఇక్కడ.

ఇంతమంది పెద్దవాళ్ళ వ్యాఖ్యలు చదువుతున్నప్పుడు నేను నా భావాలని కరెక్ట్ గా వ్యక్తపరచలేనేమో అనుకొన్నాను కాని,ఇక ఉండబట్టలేక రాస్తున్న. "మీరు హరిజన్సా" అని రచయిత్రి పాపచేత అడిగించి మరీ కథ ముగుంపుకి ఒక విధమైన వంకర ముగింపు నిచ్చారు. ఆమే పరంగా ఆలోచిస్తే, ఒక వర్గానికి ఆవిడ మద్దతు ఇస్తున్నారేమో అనిపించేలా. కాని ఇప్పుడు వాస్తవంగా జరుగుతున్నది ఆ కథలో పెట్టి చూడండి, పాప తనూ తింటానని ఇష్టపడి మాటల సంధ్ర్భంలో తను బ్రహ్మిన్ అని చెప్పింది అనుకొండి.. "అయ్యో! మీరు బాపనోళ్ళా? ఊ! మీరు తినబట్టే దేశం ఇలా కరువు కాటకాల్లో మునిగి తేలుతోంది, మేము తినాల్సినవి రేట్లు పెరిగిపోయాయి,మీరంతా దొంగ బాపనోళ్ళే మీరెందుకమ్మా మాతో పోటికొస్తారు" అని అంటే? వీటి అన్నిటికి కారణం ఎవరు అని ఆలోచిస్తే ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఈ రచయిత అని కాదు తల్లి తండ్రులది(అడ్డాల్నాడు బిడ్డలు కాని, గడ్డాలొచ్చాక బిడ్డలా అని అనుకొంటు మనము ఇలా , ఇలా ఉండాలి అని) , తల్లి తండ్రులు ఆ ప్రస్తావన తేకపోయినా, మీరు అదటగా, ఇదటగా అని పొడుచుకు తినే లోకానిది. ఒకానోక సంధర్భంలో వాళ్ళెవరో వాళ్ళ వర్గం గురించి అంత గొప్పగా చెప్పుకొంటున్నప్పుడు , మనమెందుకు ఇలా "బాపనోళ్ళా" అని అనిపించుకొని నలుగురి ముందు చులకన కాబడుతున్నాము అని ఆలోచనలేక వాళ్ళని వాళ్ళు కించపరుచుకొనే సదరు వర్గం వాళ్ళది. ఆ తరువాత చివరగా, ఇదిగో ఇలాంటి కథలు రాసి, పుండు మీద కారం చల్లి ఆనందించేవాళ్ళది.

ఇంత రాసినా ఎంటో ఇంకా నా భావన ఇంకా సరిగా చెప్పలేకపోయానేమో అనిపిస్తుంది. నేను రాసిన 'సప్తపది ' పోస్ట్ సంధర్భంగా ఒకా నొక మాజి సహ ఉద్యోగి తో చర్చ జరిగినప్పుడు తన నుండి నాకోచ్చిన సమాధానం "శరీరంలోని వయసు తెచ్చే మార్పులనే మనిషి తొందరగా అంగీకరించలేకపోయినప్పుడు ఈ వెళ్ళూనికి పాతుకుపోయిన ఈ కులాలని అంతరించిపోవాలనే మార్పును ఏవిధంగా అంగీకరించగలడు?" ఏమో ఇది అంతులేని ప్రశ్నే.

నిజానికి ఇదో అందమైన అసంబద్ధమైన వాస్తవం.
Anonymous said…
Kotta PaLee, by suggesting that, "even the most progressive vegetarians" abhor food prepared from buthered animals, birds & fish, seems to opine that such abhorrence is questionable, though realistic.

Butchering animals for food or for "needs" other than food, is not any different from any other form of violece & exploitation that only the human beings are capabale of. Most meat eaters would themselves not dare to eat their meat if they have to do their own butchering of animals.

The question of eating meat trascends that caste differentials and inequalities in the Indian context. We are at a point where the very exsitence of this earth as a living planet is becoming questionable. Destruction and devastation of species for food or other reasons is no less contributor to this self destructive gene of ours.

Mr. Kotta PaaLee & the rest of the meat eaters on this forum (& yes Ms. Vinodini, otherwise the "nEnu" of this fabulously eye-opener story, please make an effort to meet your meat at: http://www.meat.org/

Lot has been said about how inconsistent, inane & stupid the story is, ...these is what can be termed as "formaula-ized fiction" - like every formula ridden telugu or Hindi movie, these stories a fixed objective, formaula or direction to work with. As long as you have a suitably complex polynimial equation to work with, you can always pick suitable values of x,y & z to prove that your target point is either on the negative or positive side of the deemeded dependent function (social rightousness, in this case).

Truth is that a lot of normative relations in our lives are ruled and supported by caste identities. Only who enjoy their socio-economic status, truly beyond what is conferred by their caste identities have the moral authority to criticize caste relations. And those who criticize by naming identities of other castes are pots calling kettles black.
Anonymous said…
There is a respectable tradition in the stock investment columnits who write in the news papers in the USA. Whenever making specific recommendations to buy and sell of stock of specific companies, the advisors, _by honor_, disclose their present holdings and interest in the companies they are recommending.

It will be, likewise, honorable for those authors touting their anti-caste credentials, to disclose their "current holdings" in their respective caste groups. By this, I mean - what their caste identity is, who their friends, relatives, business associates, employers & employees are & where they spend their time when they are not working.
Anonymous said…
నరేంద్ర భాస్కర్
ఒక కథ మీద ఇంత విశ్లేషణ జరగటం, ఇన్ని ఆభిప్రాయాలు బయటకు రావడంతో సంచలనం సృష్టించాలని మత్రమే తన భావుకతను ఖర్చు చెసిన ఆ సదరు రచయిత కృషి సఫలికృతం అయ్యిందని చెప్పవచ్చు.
Sasik said…
చాలా చక్కగా విమర్శించారండీ! కానీ రచయిత్రి ఈ కోణంలో చూసి ఉండకపోవచ్చు. కథావస్తువులో Modernism తప్పకుండాఉంది కాని చివరి సందేశెం తప్పే. ఈ సందేశెం ఇవ్వాలని ఉద్దేశెం అయిఉండకపొవచ్చు కూడా! ఇలాంటి కథావస్తువుకి న్యాయం చెయ్యాలంటే రచనపై చాల పట్టుకూడ ఉండాలి కదా?
కొత్తపాళి గారు,
ఒకవేళ ఆ ఎనిమిదేళ్ళ ఆడపిల్ల, బాపన పిల్ల కాకుండా, ఏ రెడ్ల పిల్లనో, కమ్మోళ్ళ లేకపోతే మాంసాహారంతినే ఏ అగ్రకులపు పిల్లో అయుంటే, అహారపు అలవాట్ల వల్ల కులం గురించి అలోచించే అవకాశం వుండకపోనేవో కదా. అప్పుడు మీరీ కథ మీద అంత కోపాన్ని, అసహ్యాన్నీ వ్యక్థపరిచే అవకాశం వుండకపోనేవో కదా. నిజవే కథలో ఆ పిల్ల ని పరిచయం చేసిన తీరు కోంచెం ఎబ్బెట్టుగానే వుంది, వర్ణన లెక్కువగానే వున్నయ్ కాదనలేం, భావ కవిత్వపు తేనేజాడీలో చిక్కుకపోయిన తేనిటీగల అవశేషాల పంటిక్రింద స్పర్శ లాగానే వున్నాయ్ కాదనలేం. కానీ ఆ మాత్రం కీటకాల అవశేషాలు లేని ఖ్యాద పదార్థం, సాహిత్య పదార్థం అమెరికాలోనూ, “ఈమాట” లోనూ కూడా దొరకదు కదా.

“అన్ని రకాల అభ్యంతరాల్లోకీ భోజన సంబంధమైన అభ్యంతరాలు అతి బలమైనవని ఈ మహాతల్లికి తెలియదా.” తెలుసు కాబట్టే, బహుశా “నేను” ఆ చికెన్ ఆ పిల్లకి వాడ్డించలేదేవో. లేకపోతే నిన్నటి వంటకం చిన్న పాపకి వడ్డించటవెందుకని “నేను” అనుకున్నదేవో. ఐనా వొక హరిజన గృహిణి ఇంట్లో ఎంతమంది అగ్ర కులస్తులు భోజనం చేసుంటారండీ? అందులోనూ, ఎంతమంది బ్రామ్హణ కులస్తులు భోజనం చేసుంటారు? ఒకరి సంగతెందుకు, నా చిన్నప్పుడు ఆఖరి అరవై దశకంలోనూ, 70 దశకం మొదల్లోనూ మా ఇల్లు కులాంతర వివాహాలు చేసుకున్న జంటలకి ఒక half way house లాగా వుండేది. ఏరోజూ మా ఇంట్లో కులం అన్నది వొక దాటలేని అడ్డంకిలా లేదు. ఐనా నా జీవితానుభవంలో ఏ ఒకటి, రెండు సార్లో తప్ప హరిజన గృహంలో భోంచేసిన అనుభవం లేదు. ఆ ఙ్ఞాపకాలు కూడా మధ్య తరగతి హరిజన గృహంలోనే.

నాకప్పుడు ఆరేడేళ్ళు వుంటాయేవో, మా ఇంట్లో కిరస్తానం పుచ్చుకున్న వొక హరిజనుడ్ని వివాహవాడిన ఒక బాపనోళ్ళ పిల్ల జంట వుండేది. ఒక రోజు సాయంత్రం ఆ అబ్బాయ్ ఇంట్లో లేడు, ఈ అమ్మాయ్ వొకటే ఆరుబయట మంచంమీద పడుకునుంది. బహుశా రాత బాగ లేక నేనూ ఆ అమ్మాయిని ఒక ప్రశ్న అడిగేను, “ఆ అబ్బాయ్ మాంసం తింటాడుకదా అక్క, నువ్వు కూడా తింటావా అని.” ఆ అమ్మాయ్ మా అమ్మకి పిర్యాదు చెయ్యటం మా అమ్మ నాకో పెద్ద క్లాసు పీకడం జరిగిందనుకోండి. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, అలాటి మా ఇంట్లోనే (మా అమ్మా, నాన్నలు కాదనుకోండి), మా ఇంటికొచ్చిన బంధువులు వాళ్ళు, ఏందిరా యాందోడిలాగా ఏందా అవతారం అనో, కోంచేం మట్టిలో ఆడి ఎడా పెడా సాయంత్రం ఇంటికోస్తే, అబ్బా వాడు చూడు పెద్ద మాదిగోడులాగా వాడి అవతారం వాడు అనడం నాకు చాలా సార్లు గుర్తుంది.

మాకు కులాలు మతాలూ ఏం లేవు, అవన్నీ దాటిన లోకంలో మా ఇల్లు అనుకునే మాయింటిలోనే యాందోడా, పెద్ద మాదిగోడా అనే తిట్లకి పెద్ద అభ్యంతరం లేదు. మా ఇంటికి ఏటికేడు, బియ్యం కోసం, పెశల కోసం, మిరప కాయల కోసం, రోజూ కాకపోయినా, వారంలో చాలా రోజులు, కూరగాయలకోసం, చెంబు పట్టుకోని పాల కోసవో, పెరుక్కోసవో (కొనుక్కోడానికోసం కాదు, మర్యాదగా అడుక్కోడాని కోసం) ఒచ్చే అయ్యోర్లకి ఎనలేని గౌరవం వుండటం నా కళ్ళతో నేను చూశాను. అందువలన తరాలుగా పేరుకపోయిన ఈ కుల కట్టుబాట్ల మురికి, తెలియకుండానే ఒక ఎనిమిదేళ్ళ పిల్లకి మనసుకెక్కితే దాంట్లో విచిత్రం ఏంలేదు. దాంట్లో అన్నేచురల్ ఏంలేదు.

నాకన్నా, నలభై, యాభై ఏళ్ళు పెద్దయిన హరిజనుల్ని, రే యంకా అనో, వోరే పోలిగా అనో పిలవటం నాకనుభవవే (ఇప్పుడశహ్యవనిపించినా). ఒరే రెడ్డి నాకోడకా, బాపనన్నాకొడకా, కమ్మా నాకొడకా అని పిలిపించుకున్న అనుభవం లేని మనం, కులం చెప్పుకోడానికి వెనుకాడనవసరం లేని మనం, ఎవరింటికిపోయినా గుమ్మందాటి ఇంట్లో అడుగుపెట్టడానికి సందేహించనవసరం లేని మనం, నాకొడకా అనే పిలుపు, పెట్టిన పేరుకన్నా వాడుకైన పిలుపైన మనిషి, కులంచెప్పుకోడానికి భయపడాల్సిన మనిషి, కడప దాటి మరోకరింట్లోకి అడుగు పెట్టడానికి ఆలోచించాల్సి మనిషి, ఇరవై ఒకటో శతాబ్ధంలో, అదృష్టం కలిసొచ్చి చదివిన చదువు తెచ్చిన మద్యతరగతి (కనీసం ఆర్దికంగా) జీవితం, దాంతో వచ్చే మధ్యతరగతి గౌరవం వొక ఎనిమిదేళ్ళ పిల్ల నోటి ముందు నిలవలేని మన సమాజాన్ని రచయిత చెప్పదలుచుకోవటం ఆ పాతికేళ్ళ స్త్రీ “నేను” కి లేని పరిణితని మీకనిపించడం నిజంగా దురదృష్టం.

రవికిరణ్ తిమ్మిరెడ్డి
Anonymous said…
chaala baaga chepparu Ravi Kiran garu, nenu cheppa leka poyina bhavalni

Padmaja
బాధించే పాఠాలు బోధించేదెట్లా? చదివారా? ఈ కథ రాసినవారే ఈ వ్యాస రచయిత అనుకుంటాను. దీన్ని కొట్టిపారేస్తూ వచ్చిన రెండు వ్యాసాలు - ఒకటి రెండు