నా డీసీ ప్రయాణం - 2

విమానాశ్రయం నించి రైలెక్కి మా బాబాయి వాళ్ళుండే చిన్న వూరెళ్ళాను. అక్కడ స్తేషనులో బాబాయి నాకోసం కాచుకుని ఉన్నాడు. ఆయన నా సొంత బాబాయి కాదు, మా అమ్మకి మామ కొడుకు. కానీ నా చిన్నప్పుడు రాకపోకల సంబంధాల వల్ల మాకు బాగా చనువు. అదీ కాక తను సుమారు మా అక్క వయసు వాడు. ఇద్దరమూ చాలా ఏళ్ళుగా అమెరికాలో ఉన్నా, వాళ్ళని ఆఖరిసారి కలిసి ఎనిమిదేళ్ళయింది. ఇల్లు చేరగానే పిన్ని చాలా ఆప్యాయంగా ఆహ్వానించి, చిక్కటి ఫిల్టర్ కాఫీ ఇచ్చి బోలెడు కబుర్లు చెప్పింది. ఒక పక్కన పెళ్ళికి బయల్దేరాలి అన్న హడావుడి మనసులో ఉన్నా పిన్ని చెప్పే కబుర్లు వింటూ కదల్లేక పోయాను. కబుర్లు చెబుతూనే పెసరట్లు టిఫిన్ పెట్టింది. తింటూ నేనూ నా కబుర్లు చెప్పాను. బాబాయి మితభాషి. నా పక్కనే మౌనంగా కూర్చున్నాడు. అలా అనుభవాలు కలబోసుకోవడం ఎంతో బాగా అనిపించింది. బహుశా మనసు చెమర్చడం అంటే ఇదేనేమో.

టిఫినయ్యాక బాబాయి నన్ను పెళ్ళి జరిగే హోటలు దగ్గర దింపాడు. అదొక జనారణ్యం. అందులో పెళ్ళి జరిగే హాలు వెదుక్కుంటూ వెళ్ళాను. బయట అంతా మామూలు అమెరికన్ హోటలు వాతావరణం. ఆ హాల్లో అడుగు పెట్టగానే ఏదో హైదరాబాదులో ఫంక్షను హాల్లో ప్రవేశించానా అని అనుమానం వచ్చింది. కొందరు మగవారు సూట్లలో ఉన్నారు గానీ, చాలా మంది, వయసుతో నిమిత్తం లేకుండా రంగు రంగుల చక్కటి దిజైన్ల శల్వార్ సెట్లు ధరించి ఉన్నారు. అక్కడక్కడా కొందరు పంచధారులు కూడా కనబడ్డారు. సరే, ఇక నారీమణుల అలంకారాలు చెప్పనక్కర్లేదు. చందనా బ్రదర్స్ స్టాకంతా అక్కడే ఉంది. చిన్నారులు కూడా చక్కటి పట్టు పరికిణీలు వేసుకుని జడల్లోనూ, తలమీదా, ఇతరంగానూ చక్కటి ఆభరణాలు ధరించి బాల లక్ష్ముల్లా ఉన్నారు.

ఇంతకీ పెళ్ళెవరిదో చెప్పలేదు గదూ. నేను ఫిలడెల్ఫియా నగరంలో ఒక విశ్వవిద్యాలయంలో చదువు వెలగ బెడుతున్నప్పుడు అక్కడి స్థానిక తెలుగు సాంస్కృతిక సమితిలో చాలా ఉత్సాహంగా పని చేశాను. ప్రసాదు గారు ఆ కాలంలో నాలుగేళ్ళపాటు ఆ సమితి అధ్యక్షులుగా చేశారు. ఆయన్ని మా బృదం అంతా ప్రేమగా గేంగ్ లీడర్ అని పిల్చుకుంటాం. ఆ కార్యక్రమాల్లో ప్రసాదు గారూ, వారి శ్రీమతి సుజాతగారూ నన్నెంతో ఆప్యాయంగా చూసేవారు. వారి ఏకైక పుత్రుడు కిరణ్ పెళ్ళి. పెళ్ళి కూతురు డీసీ వాస్తవ్యులైన ఇంకో తెలుగు దంపతుల పుత్రిక. కళ్యాణ మంటపం చాలా అందంగా అలంకరించారు. ప్రసాదు గారు మాంచి సాంప్రదాయంగా పట్టుపంచా కండువాతో హుందాగా ఉన్నారు. పెళ్ళి కుమారుడూ కుమార్తే ఆకర్షణీయమైన జరీ బట్టల్లో ఈడూ జోడూ తగినట్టు ఉన్నారు. సుజాతగారు పెళ్ళి హడావుడిలో ఉన్నారు. ఇరువైపుల పురోహితులూ పోటాపోటీగా మంత్రాలు చదివేస్తున్నారు. నేను మెల్లగా ప్రసాదు గార్ని పలకరించా. ఒక్కసారి తేరిపార చూసి, బేర్ హగ్ లో బంధించి, ఇప్పుడా వచ్చేది అని నిష్ఠూరమాడి, అసలొచ్చావు, అదే సంతోషం. అన్నారు. ఏం మాట్లాడలేక తల మాత్రం ఊపి అలా ఉండిపోయాను.

ఇక పాత స్నేహితుల్ని కలవడం. వాళ్ళల్లో 90 శాతం ఫిలడెల్ఫియాలో సెటిలయినవాళ్ళే. నాలాగా వేరే ఊళ్ళకి మారిన వాళ్ళు కూడా కొందరు సకుటుంబంగా వచ్చారు. గేంగ్ లీడర్ కొడుకు పెళ్ళా, మజాకానా? ఒక్కొక్కరూ వాళ్ళ సొంత తమ్ముణ్ణి చూసినట్టు సంతోషం ప్రకటిస్తూ, చేతులు కలపటాలు, మరీ చనువైతే బేర్ హగ్గులు, భార్యామణుల పలకరింపులు, మధ్యమధ్య నిష్ఠూరాలు, ఏంటసలు మమ్మల్ని మర్చిపోయారా, అసలు మళ్ళీ ఫిలడెల్ఫియా రాలేదు అని. ఇక పిల్లలు - పసి పిల్లలుగా నాకు గుర్తున్న వాళ్ళు టీనేజర్లయ్యీ, టీనేజర్లుగా సమితి కార్యక్రమాల్లో మాతో పని చేసిన వాళ్ళు ఇప్పుడు యువకులూ యువతులుగానూ .. అన్నట్టు నెట్ లో తొలి పద్యాల గురువు రామకృష్ణగార్ని కలిశాను చాలా ఏళ్ళ తరవాత. ఎప్పుడో పోయినేడాది ఇదే బ్లాగులో సీసపద్యాల గురించి రెండు టపాలు రాశాను - అక్కడ ఈయన్ని గురించి చెప్పాను. తెలుగు బ్లాగుల గురించి చెప్పాను ఆయనకి. చాలా సంతోషించారు. తరవాత పొద్దు ని చూసి కొన్ని వ్యాఖ్యలు కూడా రాశారు. ఇంతలో మధ్యాహ్న భోజనం.

భోజనాలయ్యాక తమ రూములకి వెళ్ళిన వారు వెళ్ళగా, అక్కడే హోటలు లాబీలో ఉన్న కాఫీ షాపులో కూర్చుని మిగతా వారితో పిచ్చాపాటీ కొనసాగింది. సాయంత్రం రిసెప్షన్, డిన్నర్. తయారయ్యే వాళ్ళు తయారవుతున్నారు. ఇంతలో రెండు తెల్లజంటలు మా పక్కన వచ్చి కాఫీషాపులో కూర్చున్నారు. అమ్మాయిలిద్దరూ జరీ బుటాచేసిన ఫేన్సీ చీరలు కట్టుకుని ఉన్నారు. మెల్లగా ఆ రెండు జంటలతో కబుర్లు మొదలు పెట్టాను. ఆ అమ్మాయిలిద్దరూ పెళ్ళికూతురితో కలిసి చదువుకున్నారుట. ఇక్కడ క్రిస్టియన్ పెళ్ళిళ్ళలో పెళ్ళికొడుక్కీ, కూతురికీ చెరి ముగ్గురు సహాయకుల్ని ఎంచుకుంటారు. పెళ్ళి కొడుకు ముఖ్య సహాయకుణ్ణి బెస్ట్ మేన్ అంటారు. పెళ్ళికూతురి ముఖ్య సహాయకురాల్ని మెయిడాఫ్ ఆనర్ అంటారు. సరే ఇది హిందూ పెళ్ళి కాబట్టి ఇలా ఇద్దరు తన స్నేహితురాళ్ళని తనకి చెలికత్తెలుగా ఉండమని అడిగిందిట ఈ పెళ్ళికూతురు. అందుకని, వాళ్ళూ చేతుల్నిండా గోరింటాకు పెట్టించుకుని, చీరలు కట్టుకుని బొమ్మల్లా తయారయ్యారు. పెళ్ళి తతంగాన్ని చాలా ఎంజాయ్ చేస్తున్నామని చెప్పారు.

రిసెప్షన్ కూడా చాలా బాగా జరిగింది. ప్రసాదు గారు నన్ను చెయ్యి పట్టుకుని లాక్కెళ్ళి ఆయన తమ్ముళ్ళందరికీ, "నా ఆఖరి తమ్ముడు" అని పరిచయం చేశారు. ఇలా రోజంతా అందరి ఆప్యాయతలో తడిసి ముద్దయ్యాను. ఏదో మా అన్నయ్య కొడుకు పెళ్ళికి మా ఆత్మీయ ఆప్త బంధువులందరూ వచ్చిన పెళ్ళికి వెళ్ళొచ్చినట్టుగా ఉంది. ఆ రాజుకున్న ఆత్మీయత రెణ్ణెల్లుదాటినా నాలో ఇంకా వెచ్చగా వెలుగుతోంది.

Comments

బావున్నాయండీ విశేషాలు..
విశేషాలు చలా బాగున్నాయ్. ఇక వాటితోపాటూ ఉన్న ఫోటోలు కొత్త హంగుల్ని కూర్చాయి.
Sujata said…
sir is there a part-3?
కొత్తపాళి గారు...
మీ డీసి ప్రయాణం చదువుతున్నంత సేపు..ఒక పెళ్ళి వాతావరణం కళ్ళ ముందు కదలాడింది...
అసలు పెళ్ళి వాతావరణం ఎంత బాగుంటుందో..కదా...
చిన్న పిల్లలు.పెద్ద వాళ్ళు,నవ్వులు,కేరింతలు,ఆటలు,పాటలు...
అంతా హడావుడిగా,సందడి,సందడిగా..భలేగా అనిపిస్తుంది...
cbrao said…
అమెరికాలో భారతీయుల పెళ్లిళ్ల గురించి చాలా విన్నా. మీ మాటల ద్వారా, ప్రత్యక్షంగా చూసిన అనుభూతి. బొమ్మలు ఉంచటం వలన వ్యాసానికి జీవమొచ్చింది. రెణ్ణెల్లు దాటినా మీ జ్ఞాపకాలు తాజాగా ఉన్నై.

పెళ్లికి వెళ్లిన ప్రతి సారీ వచ్చే ఆలొచన -పెళ్లి ఇద్దరు వ్యక్తుల ఆంతరంగిక వ్యవహారం. దానికోసం మనము ఇంతమందిని (అతిధులను) ఎందుకు disturb చెయ్యటం ? కాకపోతే పెళ్లి అనేది ఒక వేడుకగా సరదాగానే ఉంటుంది. కొన్ని ఊళ్లలో శోభనానికి 100 మందికి పైగా భోజనానికి పిలుస్తారు. ఇది అనవసరము అనిపిస్తుంది. ఒక పూర్తి ఆంతరంగిక విషయాన్ని, బట్టబయలు చేయటమేగా అది.
Unknown said…
మంచి అనుభవాలు మూటగట్టుకున్నట్టున్నారు.
చాన్నాళ్ళ తర్వాత ఆప్తులని కలిస్తే ఆ ఆనందం చెప్పలేనిది.
Purnima said…
ఈ టపా రాసి.. మాకూ ఓ పెళ్ళిని చూపించేశారు. :-)
Raj said…
పెళ్ళి కళ్ళకు కట్టినట్లు చూపించారు. మీకు వీలైనప్పుడు వధువరులకు మా అభినందనలు తెలియచేయగలరు.
బహుశా మనసు చెమర్చడం అంటే ఇదేనేమో.

---ఇదే ఇదే ఇదే
శ్రీ said…
పెళ్ళి సంగతులు బాగున్నాయండీ!
Anonymous said…
ఆ సందడి, హడావుడీ, పిల్లలూ, పలకరింపులూ, నిష్టూరాలు,.. అవే పెళ్ళికందం, శోభా! అమెరికాలో ఉన్నా ఆ సంప్రదాయంలోని సంతోషాన్ని అనుభవించే అవకాశం కలగడం మీ అదృష్టం! ఆ వెచ్చటి ఆత్మీయతానుభూతిని మాకు ఇలా పంచడం మా అదృష్టం!!
Unknown said…
పెళ్ళి విశేషాలు ఫొటోలతో కూడా చూపించడం చాలా బాగుంది!
బాగున్నాయి మీ పెళ్ళి కబుర్లు. ఈ రోజులలో పెళ్ళి అంటే ఇలా అందరిని కలవటానికే అన్నట్లు ఉంటుంది. పెళ్ళి దారి పెళ్ళిది కబుర్ల దారి కబుర్లది.
Naga said…
రంగు రంగుల టపా! బాగుంది వర్ణన. భవిష్యత్తులో ఇక్కడ తెలుగు పెళ్ళిళ్ళు ఎక్కువ అవుతాయనుకుంటా ...:)
Ramani Rao said…
శ్రీరస్తూ-శుభమస్తూ అంటూ ఓ పెళ్ళి పుస్తకానికి శ్రీకారం చుట్టడంలో కలిగే అనుభూతుల దొంతరలను చాలా చక్కగా వివరించారు కళ్ళకు కట్టినట్లుగా.

ఈ పెళ్ళిళ్ళ విషయంలో నేనూ సి.బి రావు గారి వ్యఖ్యతో ఏకీభవిస్తున్నాను.
మీ టపా చాలాబాగుంది అండీ? ముఖ్యంగా మీరు వివరించిన తీరు చాలా బాగుంది. విదేశాలలో వున్నా తెలుగు సంస్కృతి ని మరిచిపోకుండా అచ్చ తెలుగు వాతావరణాన్ని పెళ్లిల్లో కొనసాగిన్స్తున్న ప్రవాస భారతీయుల సమిష్టికి నా జోహార్లు. పైగా మీరు వర్ణించిన తీరు ఈ టపా మీద మరింత ఆసక్తి ని పెంచింది.
ఫోటోలతో సహా భలే చూపించారు దేశీ పెళ్ళిని.. నేను మొదటిసారి హ్యూస్టన్ లో మన తెలుగు వాళ్ళ పెళ్ళికి వెళ్ళాను.. ఇక్కడ అంతా నాజూగ్గా ఉంటారు కదా అని చాలా సింపుల్ గా తయారయ్యి వెళ్ళాను.. హాల్ దగ్గరికి వెళ్తుండగానే విజయవాడ ధనేకుల కళ్యాణమండపం గుర్తొచ్చింది.. అలంకరణలో ఎవరూ ఏమాత్రం తగ్గలేదు! ఖజానా, కీర్తిలాల్, బాంబే బ్రదర్స్ ఫ్యాషన్ షో పెట్టినట్లు అనిపించింది..

btw, మీ ఫోటోల్లోంచి ఒక డిజైన్ ని తస్కరించాను :))
Bolloju Baba said…
పలానా ఫోటోలో నేనున్నాను కనిపెట్టండి చూద్దాం అని ఒక పజిలొకటి విసిరి, మీ మోము చూసే భాగ్యం మాకు కలిగించకూడదా సారూ?

బొల్లోజు బాబా
@బాబాగారు - బొమ్మలు తీసింది ణేను కాబట్టి నేనుండే అవకాశం తక్కువ. నా విశ్వరూపాన్ని ఇక్కడ చూడచ్చు.
@నిషి - మీ ఇష్టం. :)
@సిసిము గారు - మిగతా పెళ్ళిళ్ళ సంగతి ఏమోగానీ ఈ పెళ్ళి విషయంలో ంఆత్రం అది పూర్తిగా కరక్టు మా ఫిలడెల్ఫియా మిత్ర బృందం విషయంలో.
@రావు గారు - ఆధునిక కాలంలోనే పెళ్ళి వ్యక్తిగత వ్యవహార మైంది. సాంప్రదాయంగా పెళ్ళ్ (ఆ మాట కొస్తే గర్భాదానం కూడా) సమాజానికి సంబంధించిన వేడుకలే. ఇక ఈ రోజుల్లో వందలేసి మందిని పిలవడం, వాళ్ళు చేరడం .. అందరూ ఒక చోట కలిసేందుకు ఇదొక వంక. ఇవి కూడా లేకపోతే బంధుత్వాలు, స్నేహాలు మిగిలే అవకాశాలు తక్కువ.
@sujata - మూడో (చివరి) భాగం త్వరలో ప్రచురిస్తా.
చదివి కామెంటిన మిగతా మిత్రులందరికీ ధన్యవాదాలు.