నా డీసీ ప్రయాణం - 3 (ఆఖరు)

పెళ్ళి రిసెప్షను భోజనం చేసి, వేడుకలు చూసి రైలు పట్టుకుని మా బాబాయి వాళ్ళ ఊరు చేరేప్పటికి పదకొండయింది. పాపం బాబాయి మేలుకునుండి మళ్ళి నన్ను రైలు స్టేషనులో ఎక్కించుకుని ఇంటికి తీసుకెళ్ళాడు. ఇద్దరం కూర్చుని ఎక్కడెక్కడి బంధువుల విషయాలూ మాట్లాడుకున్నాం.

తెల్లారి మెల్లగా లేచాం. పిన్ని ఏదో హడావుడి పడిపోతోంది. వాళ్ళ స్థానిక ఆలయంలో ఏదో సంగీత ఆరాధనా కార్యక్రమం ఉంది. తనుకూడా అందులో పాల్గొంటోంది. అందుకని కాసేపట్లో బయల్దేరి వెళ్ళాలని ఈ హడావుడి. నాకూ బాబాయికీ ఉప్మా టిఫిను (క్రాంతి, వింటున్నారా?) చేసి పెట్టి తన బయల్దేరింది. మళ్ళీ బాబాయి నేనూ ఏవో పాత పల్లెటూరి చుట్టాల కబుర్లు చెప్పుకుంటూ ఉప్మా ఆరగించేటంతలో నేనుకూడా బయల్దేరాల్సిన సమయం అయింది. అదేవిట్రా, ఇంత తొందర ఫ్లైటు పెట్టుకున్నావు, కాస్త సాయంత్రానికి పెట్టుకునుండాల్సింది అన్నాడు బాబాయి. ఏంటొ బాబాయి, ఆ సమయానికి తోచలేదు అన్నా. నన్ను విమానాశ్రయంలో దింపి తను కూడా ఆలయానికి వెళ్ళిపోయాడు.

ఎందుకనో విమానాశ్రయం క్రిక్కిరిసి ఉంది. నేనెక్కాల్సిన విమానం గేటు దగ్గిర మరీనూ. ఏదో దాని పుణ్యమాని సమయానికే ఎక్కించారు, విమానం బయల్దేరింది. మూడు కుర్చీల వరుసలో నాది మధ్యలో. నాకు కుడివైపు, కిటికీ పక్కన ఒక చైనీయుడు, సుమారు నా వయసే ఉంటుంది. ఎడమ వైపు ఒక తెల్లాయన కొంచెం పెద్ద వయసు వాడు. విమానం గాల్లోకి ఎగరంగానే నిద్ర ముంచుకొచ్చింది. బహుశా ఒక అరగంట మంచి నిద్ర పోయి ఉంటాను. గంట పైనే ఫ్లైటు. మెలకువ వొచ్చి అటూ ఇటూ చూశాను. కూడా తెచ్చుకున్న పుస్తకం చదవబుద్ధి కాలేదు. దూరాన్నించే కిటికీలోంచి మబ్బుల్ని చూస్తూ కూర్చున్నా. కాసేపటికి దృష్టి చైనీయ ప్రయాణికుడి వొడిలో ఉన్న Scientific American పత్రిక మీద పడింది.

అతను చెవుల్లో ఐపాడ్ హెడ్ ఫోన్సుతో ఏదో సంగీత లోకంలో విహరిస్తున్నాడు. డిస్టర్బ్ చెయ్యడమా వొద్దా అని ఒక్క క్షణం ఊగిసలాడాను. ఈ బోరు భరించడం కంటే అతన్ని పలకరించడమే మంచిది .. అంతగా మాట్లాడ్డం ఇష్టం లేకపోతే మళ్ళీ తన సంగీతానికి వెళ్తాడు అంతేగా అనుకుని, అతని వొళ్ళో ఉన్న పత్రికని చూపిస్తూ, "మీరు సైంటిస్టా" అని అడిగాను. అతను పలకరింపుగా నవ్వి, హెడ్ ఫోన్సు తొలిగించి "పత్రిక చూస్తారా" అని నాకివ్వబోయాడు. పత్రిక పుచ్చుకుని పేజీలు తిరగేస్తూ నా ప్రశ్న మళ్ళీ అడిగాను.

అలా మొదలైంది మా సంభాషణ. అతడు మేరీలండ్ విశ్వవిద్యాలయం (వివి)లో కెమికల్ ఇంజనీరింగ్ మరియూ అప్లైడ్ కెమిస్ట్రీలో పీహెచ్.డీ పొంది, కొంతకాలం ఏదో కంపెనీలో ఇక్కడ ఉద్యోగం చేసి, ఆ తరవాత తన స్వదేశం తాయ్‌వాన్ వెళ్ళిపోయాడుట. (తాయ్‌వాన్ చైనాకి తూర్పున ఉన్న చిన్న ద్వీపం. చైనాలో కమ్యూనిస్టు ప్రభుత్వం నెలకొన్నప్పుడు చాలామంది ధనిక కుటుంబాలు తాయ్‌వాన్ ద్వీపానికి పారిపోయి అక్కడే సెటిలయారు. గత అరవై ఏళ్ళలో తాయ్‌వాన్ జపాన్ కొరియాలకి దీటుగా అభివృద్ధి చెందింది. తాయ్‌వాన్ మా దేశంలో భాగమే అని చైనీయ కమ్యూనిస్టు ప్రభుత్వం అప్పూడప్పుడూ గుడ్లురుముతూ ఉంటుంది గానీ, అంతర్జాతీయ మద్దతుతో తాయ్‌వాన్ అనేక విషయాల్లో స్వయం ప్రతిపత్తి కలిగిఉంది.) గత ఆరు సంవత్సరాలుగా అక్కడ ఒక విశ్వవిద్యాలయంలో ఆచార్యుడిగా పని చేస్తున్నాడు. అతను చేసే రీసెర్చి సబ్జెక్టుకి సంబంధించిన సమావేశం కోసం డీసీ వచ్చాడు. అది ముగిసి, తిరిగి స్వస్థలానికి చేరుతున్నాడు. అతని తిరుగు ప్రయాణం డెట్రాయిట్ మీదుగా ఉండటం, మేమిద్దరం పక్కపక్క సీట్లలో కూర్చోవడం భలే యాదృఛ్ఛిక మనిపిస్తుంది.

అతడు అలా స్వదేశానికి వెళ్ళానని చెప్పినప్పుడు కొంచెం ఆశ్చర్య పడ్డాను. నాకు మా వివిలో కొందరు తాయ్‌వానీయ విద్యార్ధులు తెలుసు. వాళ్ళెవరూ స్వదేశానికి తిరిగి వెళ్ళాలని తహతహలాడినట్టు నేను గమనించలేదు. అందరూ అమెరికాలో సెటిలయే ఆలోచనల్లోనే ఉన్నారు. అదీ కాక, అమెరికాకి చదువులకోసం వచ్చిన ఇతర దేశస్థుల ఆలోచనలు ఎలాఉంటాయో తెలుసుకోవాలనీ నాకో కుతూహలం. "మీ స్వదేశానికి తిరిగి వెళ్ళడానికి అతి ముఖ్యమైన కారణం ఏవిటి? మీకభ్యంతరం లేకపోతే చెప్పండి." అనడిగాను. వృద్ధులవుతున్న తలిదండ్రులో, లేక మిగతా కుటుంబ మంతా అక్కడే ఉన్నారనో, అదీ కాక, ఆస్తులు చూసుకోవాలనో .. ఇలాంటి దేదో ఊహించాను. అతడు చెప్పిన సమాధానం నన్ను అద్భుత సంభ్రమాశ్చర్యాలకి గురి చేసింది.

"నేను ఉద్యోగం చేస్తుండగా ఇక్కడ నా పని బాగానే ఉండేది. ఒకసారి ఇంటికి వెళ్ళాను. అక్కడ దేశం చాలా మారిపోయి నట్లనిపించింది. ముఖ్యంగా యువత .. ఒక లక్ష్యం లేకుండా, సరైన జీవిత ధ్యేయం లేకుండా, రికామీగా తమ జీవితాల్ని వృధా చేసుకుంటున్నా రనిపించింది. ఇంకో పక్కన బాగా చదువుతున్న వాళ్ళు కూడా వృత్తి అభివృద్ధి మోజులో పడి నిజమైన మానవీయ విలువల్ని కోల్పోతున్నా రనిపించింది. నాకసలు మొదణ్ణించీ ఉపాధ్యాయ వృత్తి మీద మోజే, కానీ పీహెచ్.డీ తరవాత అమెరికను వివిలలో ఉపాధ్యాయ పదవులకి ఉన్న తీవ్రమైన పోటీ మీకు తెలియనిది కాదు. అలా ఆ ఆశ వొదులుకుని కంపెనీ ఉద్యోగంలో స్థిరపడ్డాను. నా స్వదేశాన్ని చూసిన తరవాత నేనక్కడ సమర్ధవంతమైన పని నిర్వహించగలనని నాకు నమ్మకం కలిగింది. ఆ ట్రిప్పు నించి అమెరికాకి తిరిగి వచ్చాక ఒక రెండేళ్ళు గడువు పెట్టుకున్నాను. ఆ సమయంలో తాయ్‌వాన్లో నాకు కావలసిన వివిలో ఆచార్యుడిగా ఉద్యోగం సంపాదించాను. నా ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాను. ఆరేళ్ళయింది ఇప్పటికి. చాలా సంతృప్తిగా ఉంది."

"చిత్రంగా ఉందే! క్లాసులో పాఠం చెప్పటం కాకుండా, ఇంకేమి చేస్తారు యువత కోసం? కౌన్సెలింగు లాంటివేమన్నానా? లేక మీ చర్చి ద్వారా ..."

"నేను క్రిస్టియన్నే కానీ నేను చేసే పనులు చర్చి ద్వారా కాదు. నా మతానికీ నే చేపట్టిన పనులకీ ఏం సంబంధం లేదు. వివికి అనుబంధంగానూ, బయట విడిగానూ రెండు సంస్థలు నెలకొల్పాను. తమ తోటి వయసు వారిని చేర్పించి వారికి అవసరమైన శిక్షణ నిచ్చేందుకు ముందు ఒక పది మంది నా విద్యార్ధులకి అవసరమైన తర్ఫీదు ఇచ్చాను. ఈ కేంద్రాల్లో, వొట్టి చదువు చెప్పడం, ఉద్యోగాలకి యువతని సిద్ధం చెయ్యడమే కాదు .. ఆట పాటలు, తాయ్‌వానీయ జాతీయ కళలు, మెదడుకి పదును పెట్టే పోటీలు, మనసుకి ఆహ్లాదాన్నిచ్చి పరిపూర్ణమైన మనిషిగా తీర్చి దిద్దేటటలు అనేక కార్యక్రమాలు నిర్వహిస్తాం. కుటుంబం, సమాజం, మానవ సంబంధాల విలువ ఈ యువత గ్రహించాలనేది నా తాపత్రయం. ఈ బృందాలు ఆయా కాలనీలలో స్వఛ్ఛంద సేవ చేస్తుంటారు. సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహిస్తారు. బడులలోకి వెళ్ళి అక్కడి పిల్లలకీ ఇలాంటీ కర్యక్రమాలూ పోటీలు నిర్వహిస్తుంటారు. ఇప్పుడు సుమారు వంద మందికి పైగా వాలంటీర్లుగా పని చేస్తున్నారు."

నేను ఆశ్చర్యంతో నోట మాట రాక వింటుండి పోయాను. ఇంతలో మా విమానం డెట్రాయిట్ లో దిగింది. మిమ్మల్ని కలవడం ఒక అద్భుతమైన ప్రయాణానికి సరైన ముగింపు అని చెప్పి, ఆయనతో కరచాలనం చేసి (ఆయన పత్రిక అప్పుడే తిరిగి ఇచ్చేశానండోయి) నేను ఇంటి దారి పట్టాను.

Comments

మేధ said…
అంతకుముందు ఒకసారి ఎక్కడో చదివినట్లు గుర్తు... చైనా శాస్త్రజ్ఞులు, డాక్టర్లు.. అమెరికా(ఏ దేశమైనా) వచ్చి వాళ్ళ విజ్ఞానాన్ని పెంపొందించుకుని మళ్ళీ వాళ్ళ మాతృదేశానికి వెళ్ళి అక్కడ అభివృధ్ధికి ఉపయోగపడుతున్నారు అని...

తైవాన్ దేశం ఇప్పుడు బాగా అభివృధ్ధి చెందుతోంది.. చాలా కంపెనీస్ అంతకుముందు వాళ్ళ ప్లాంట్స్ అన్నీ చైనా లో పెట్టేవారు, కానీ ఇప్పుడు తైవాన్ వైపు చూస్తున్నారు..

మీ ఈ ప్రయాణం, మీకు మరచిపోలేని అనుభవాలని మూటగట్టినట్లుంది... ఇంత మంచి అనుభవాలని మా అందరితో పంచుకున్నందుకు నెనర్లు... :)
ఒక్క బిగిని చదివించేరు. "వి వి" అంటే ఏమిటో విడమర్చగలరా?
Bolloju Baba said…
సమాజమనే వజ్రం ఒక్కోసారి మనవైపుకు విసిరే తళుకులు ఇలానే ఉంటాయేమో.
మంచి పోష్టు
బొల్లోజు బాబా
వివి = విశ్వవిద్యాలయం
Anonymous said…
మీరు కలిసిన తాయివన్ శాస్త్రజ్ఞుడు పద్దతి ఒకటైతే, యండమూరి ది మరొక పద్దతి ; కాని ఇద్దరు దాదాపుగా ఒకే విలువల కోసం:
ఇక్కడ యండమూరి చేస్తున్న కృషిని చూడండి: http://yandamoori.com/vidyapeetham.html
చాలా బాగా వ్రాసారు మీ ప్రయాణ విశేషాలు, తైవానీయులు కూడా చాలా కష్టజీవులు...
వారితో కలిసి పని చేస్తే, వారు ఎంత చేస్తారో మననుండి కూడా అంత ఆశిస్తారు.
Ramani Rao said…
నాకెందుకో ఇది చదివిన తరువాత ఒక ఆలోచన వస్తోంది, ఒక తైవాన్ దేశస్థుడు తన మాతృ దేశం మీద మమకారం తో తిరిగి అక్కడి వెళ్ళిపోవడం అనేది విదేశాల్లో ఉన్న మన భారత ప్రజలకి ఒక సందేశం కాగలగాలి. ఎక్కడో విదేశాల్లో, తమ సేవలు అందిస్తూ, మెప్పు పొందుతూ ఉన్నవాళ్ళు కాస్త అనుభవం గడించాకా, ఈ తైవాన్ దేశస్థుడిని ఆదర్శంగా తీసుకొని, మాతృ దేశం మీద మమకారం పెంచుకొని మరల తిరిగి తమ మాతృ దేశం లో సేవలు కొనసాగిస్తే బాగుంటుందని నా అభిప్రాయం.

మీ మరుపురాని అనుభవాలని మాతో పంచుకొన్నందుకు నెనర్లు.
Unknown said…
maybe he's one of the rare kind !
ఇంత మంచి జ్ఞాపకాలని మాతో పంచుకున్నందుకు చాలా థాంక్స్ కొత్తపాళీ గారు.
మీ ఈ అనుభవాన్ని మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు:)
Anil Dasari said…
కొత్తవారిని పలకరించి వాళ్లకి చిర్రెత్తకుండా వివరాలడగటం ఓ గొప్ప కళ. ఈ బ్లాగరిది అందులో అందె వేసిన పాళీలాగుంది :) మంచి విషయాలు సేకరించారు. మాతో పంచుకున్నందుకు thank you.
రాధిక said…
మీకే ఎ0దుకు ఇలా0టి మ0చి/గొప్ప వ్యక్తులు/స0ఘటనలు ఎదురవుతాయి?మాకూ ఎదురవుతాయి గానీ మేము పట్టి0చుకోవట్లేదా?
కామెంటిన మిత్రులందరికీ కృతజ్ఞుణ్ణి.
మేధ .. చైనా విద్యార్ధులు కూడా ఎంతమంది స్వదేశానికి తిరిగి వెళ్తున్నారనేది అనుమానమే.
బాబా గారు .. మీకు కామెంట్లలో కూడా కవిత్వం (మెటఫర్) రాకుండా ఉండదుగా :)
నెటిజన్ .. యండమూరి విద్యా విధానాన్ని గురించి విన్నాను. నమ్మిన దాన్ని ఆచరణలో పెట్టిన వారెవరైనా నా దృష్టిలో అభినందనీయులే.
ప్రఫుల్ల .. నిజం. ఇది తాయ్‌వానీయులకే కాదు, నిజాయితీతో పనిచేసే నాయకులందరికీ వర్తిస్తుంది.
రమణి .. ఆ ఆలోచన అంతరాంతరాల్లో నించి చాలా బలంగా రావాలి. అలాంటి మహానుభావులు మనకీ ఉన్నారు. అప్పుడెప్పుడో 1969 లో భాగవతుల పరమేశ్వరరావు, 90 లలో రవి కూచిమంచి, అరవింద పిల్లలమర్రి, బాలాజీ సంపత్, మా రచన ..
అబ్రకదబ్ర .. ఆ కళ నిజంగా నాకు లేదండీ .. కానీ ఒక్కోసారి వాళ్ళే అలా చెప్పేస్తూ ఉంటారు .. నా మొహంలో ఏముందో మరి :)
రాధిక .. మీరెందుకు ఈ మధ్యన అంకె సున్నాని ఉపయోగిస్తున్నారు? మనచుట్టూ రోజూ అద్భుతాలు జరుగుతున్నాయనేది నేను మనస్ఫూర్తిగా నమ్ముతాను. అందుకే అన్నాడూ మహాకవి, కళ్ళంటూ ఉంటే చూసీ అని .. ఆ దృష్టిని పెంపొందించుకోవడం కూడా ఒక కళేనేమో. కానీ ఒకటి నిజం. సుమారు ఒక సంవత్సరం పాటు నేను ఏ ప్రయాణం తల పెట్టినా, ఏవో ఆటంకాలూ, చికాకులూ, మధ్యలో ఆగిపోవటాలూ, అసలు ప్రయాణం అంటే భయం పట్టుకుండి. అట్లాంటి స్థితిలో ఈ ప్రయాణం ఆద్యంతమూ అద్భుతమైన అనుభవాల్ని ఇస్తూ అనిర్వచనీయమైన హాయిని మనసంతా నింపేసింది. ఎంత అంటే రెణ్ణెల్లు దాటాక కూడా నాకా అనుభూతులు స్పష్టంగా గుర్తున్నాయి.
Purnima said…
మీరు అనుకున్నదే తడువుగా హాయిగా ఊరూరూ తిరగగలిగి .. మాకిలాంటి అనుభవాలను పంచి ఇవ్వాలని కోరుకుంటున్నాను!!

నిజమే.. మన చుట్టూ ఎదో ఒక అద్భుతం జరుగుతూనే ఉంటుంది. మన చూడాలంతే!! అవునూ.. "అద్భుతాన్ని" కూడా నిశితంగా.. పరికిపరికి చూస్తే.. mundaneగా అనిపిస్తుందట. (i don't remember the quote as it is) మీరేమంటారు?
మనుషులు ఎప్పుడూ మనల్ని ఆశ్చర్యపరుస్తూనే ఉంటారని బాగా చెప్పారు (నా ఇంగ్లీషు ఆలోచన తెలుగులోకి సరిగా తర్జుమా కానట్టుంది)
ఆ మధ్య ఒక సంవత్సరంలో 35వేలకు పైగా భారతీయులు తిరిగి వెళ్ళారని విన్నాను? నిజమేనా?
పూర్ణిమ గారూ, ఆ వ్యాఖ్యను గుర్తు చేసినందుకు నెనర్లు
కల said…
నాకు మీ బ్లాగులో కామెంటెత్తాలంటేనే నే భయంగా ఉంది, ఎక్కడ అచ్చుతప్పులు, ఉపమానాలు అంటూ నా బ్లాగుని శల్యపరీక్ష చేసేస్తారేమోనని. అయినా మీ ప్రయాణపు అనుభవాలని చదివిన తర్వాత calm గా ఉండలేక comment post చేస్తున్నా.
తను నమ్మిందే వేదంగా భావించి, దాని ఆచరించి చూపగలిగే వారికి నిజంగా శతకోటి నమస్కారాలెట్టెయ్యాలి. నా తరపున మీరు పెట్టెయ్యండేం? :-D
మీరిలానే మంచి మంచి అందమైన ప్రదేశాలన్నీ తిరిగి, మంచి మంచి అనుభూతుల్ని పట్టుకొని అవి మాకందిస్తారని ఆశిస్తూ,
కల.