నా మెట్టిన దేశానికి ...

నా మెట్టిన దేశానికి జన్మదిన శుభాకాంక్షలు

"అందరు మనుషులూ సమానులుగా సృష్టించబడినారనీ, సృష్టికర్త వారికి కొన్ని వేరు చేయలేని హక్కులని ఇచ్చినాడనీ, ఆ హక్కులలో జీవనం, స్వేఛ్ఛ, ఆనందాన్వేషణ అనేవి అంతర్గతంగా ఉన్నాయనే ఈ సత్యాల్ని మౌలిక సత్యాలుగా మేము నమ్ముతున్నాము"
మహోన్నతమైన ఈ ఆలోచనతో అమెరికా సంయుక్తరాష్ట్రాలు బ్రిటీషు సామ్రాజ్యాన్నించి వేర్పడి తన స్వతంత్ర అస్తిత్వానికి పునాది వేసుకుంది 1776 లో.

అటుపైన ఈ దేశపు సుదీర్ఘ గణతంత్ర ప్రజాప్రభుత్వంలో ఎన్నో పురిటి నెప్పులు, మరెన్నో ప్రసవవేదనలు. దేశంగా ఏర్పడుతున్న రోజుల్లోనూ, ఆ తరవాతనూ స్థానిక అమెరికను జాతుల పట్ల జరిగిన హింస మొదటి మెట్టు. చాలా కాలంపాటు సార్వత్రిక వోటు హక్కు లేదు. స్త్రీలకి వోటుహక్కు బాగా ఇటీవలే వచ్చింది. బానిస వ్యాపారపు చీకటి రోజులు అందరికీ తెలిసినవే. దాన్ని తుడిచి పెట్టాలనే రాజకీయ ప్రయత్నం నాలుగేళ్ళ పాటు సాగిన భయంకరమైన అంతర్యుద్ధానికే దారి తీసింది. ఇంత కష్టపడి నిర్మించుకున్న ఈ దేశం ఛిద్రమైపోతుందా అన్నంత వరకూ వెళ్ళింది వ్యవహారం. రెండవ ప్రపంచ యుద్ధం నించీ ఈ నాటి వరకూ అంతర్జాతీయ వేదిక మీద అమెరికా పోషిస్తున్న భూమిక అందరికీ తెలిసినదే.

ఐనా నా మెట్టినల్లంటే నాకేదో ప్రేమ. నా మెట్టినింటి సోదరులంటే ఒక అభిమానం. జూలై 4 తారీకున దేశ స్వాతంత్ర్యోత్సవదినం నాడు అందరు అమెరికన్లలాగే నేనూ ఒక మడత కుర్చీ చంకనెట్టుకుని దగ్గర్లో జరిగే బాణసంచా ప్రదర్శన చూడ్డానికి పోయినప్పుడల్లా ఎందుకబ్బా ఈ ప్రేమ అని ఒకసారి మళ్ళీ నా అనుభవాల్నీ భావాల్నీ నెమరు వేసుకుంటాను.

ప్రకృతి అందాలు ఒక వైపు, అభివృద్ధి వల్ల వచ్చిన రోడ్లు, వసతులు, ఇలాంటివి ఇంకోవేపు, పరిపాలనా వ్యవస్థ పటిష్ఠంగా ఉండటం వల్ల పొరులకి అందుబాటులోకి వచ్చిన సదుపాయాలు ఇంకోవేపు - ఇవన్నీ కూడా మంచి కారణాలే. ఐతే ఇవన్నీ కలివిడిగానో విడివిడిగానో ఇతర దేశాల్లో ఈ స్థాయిలోనో, ఇంకా ఇనుమడించిన స్థాయిలోనో ఉండి ఉండొచ్చు. వీటికి అతీతంగా నాకు దేశంలో జీవనం నచ్చిన మొదటి కారణం ఇది వలస ప్రజలచేత నిర్మించ బడిన దేశం కావటం. అంచేత అనేక దేశాల ఆహార పద్ధతులు, కొన్ని చోట్ల ఆయా వేషభాషలు, కొన్ని చోట్ల ఆయా సాంస్కృతిక కార్యక్రమాలూ మనకి అందుబాటులోకీ, అనుభవంలోకీ వస్తాయి. దీనికి చేదోడు వాదోడుగా ఉన్నది ఇక్కడి విశ్వవిద్యాలయాల, గ్రంధాలయాల వ్యవస్థ. ఆసక్తి గల మనిషికి ఇవి జ్ఞాన సముద్రాలే అంటే అతిశయోక్తి కాదు.

ఇహ రెండో కారణం (బహుశా అసలు ఇదే ముఖ్య కారణమేనేమో) ఇక్కడి ప్రజలు. దాన్ని క్లుప్తంగా ఎలా చెప్పాలో నాకు చేత కాదు. ఒక ముక్కు సూటి తనం, ఒక నిర్భయత్వం, ఒక జాలి గుండె, ఒక నిజాయితీ, ఒక నిర్మొహమాటం, ఒక స్వేఛ్ఛా ప్రియత్వం, ఒక నిరంతర ఆశాభావం, ఒక ఆలోచనా రీతి, ఒక నిత్యాన్వేషణ, ఒక ప్రశ్నించే గుణం .. ఇవన్నీ కొద్దో గొప్పో ఇక్కడికొచ్చి నేర్చుకున్నాను నేను. ఈ పాఠాలు నాకు నేర్పిన వ్యక్తులకీ సంఘటనలకీ నేను సర్వదా కృతజ్ఞుణ్ణి.

ఇవన్నీ ఏం లేక పోయినా కేవలం జాజ్ సంగీతాన్ని ప్రపంచానికందించినందుగ్గానూ అమెరికా నాకు ఇష్టమైపోయింది.

నా మెట్టిన దేశానికి (కొంచెం ఆలస్యంగా) జన్మదిన శుభాకాంక్షలు.

Comments

GOD bless America!! GO America GO..longtime ago Alexis de Tocqueville figured being american is an ideal all the citizens of united states strive to be.
Anonymous said…
గురువు గారూ, నేను అమెరికా చూడలేదు, కానీ, నాకూ అభిమాన దేశం. మీరు చెప్పిన కారణాలు. ఇంకో ముఖ్య కారణం, చిన్నపిల్లల భావ స్వాతంత్ర్యానికి కూడా విలువిచ్చిన దేశం కాబట్టి. (పిల్లలను కొట్టటం నేరం అని విన్నాను అమెరికా లో).

ఇంకో కారణం ఇక్కడ వ్యక్తులు ముఖ్యం, సిద్ధాంతాలు కాదు. నేను (దక్షిణ) కొరియా చూసాను. అదీ అభివృద్ధి చెందిన దేశమే. అక్కడ ప్రజలకూ, నాయకులకూ, సిద్ధాంతాల మీద ఉన్న అభిమానం తోటి మానవుల మీద కనబడదు (నా అబ్సర్వేషన్ లో).
Purnima said…
Interesting post about America!! Especially abt the ppl over there.

Belated wishes from my end too...
rākeśvara said…
@ రవి గారు,
"నేను అమెరికా చూడలేదు, కానీ, నాకూ అభిమాన దేశం" అనేదానికంటే,
"నేను అమెరికా చూడలేదు, కాబట్టి , నాకూ అభిమాన దేశం"
అంటే నిజానికి దగ్గరలో వుంటుంది.

తోటి మానవుల మీద అభిమానం - మీ క్రెడిట్ కార్డు మీద అభిమానం మాత్రం చాలా ఎక్కువ ఉంటుంది అక్కడ. :)
Unknown said…
మా అబ్బాయికి మెట్టినిల్లు (9 సంII) కాబట్టి మాకూ అమెరికా అంటే ఇష్టం.ఆ దేశం గురించి ఇంతవరకూ విన్నదాన్నిబట్టి మా ఇష్టం రోజు రోజుకీ పెరుగుతూనే వుంది.
శ్రీ said…
భిన్నత్వంలో ఏకత్వానికి అమెరికా దేశం ఒక మంచి ఉదాహరణ.సొంత దేశాలు కొట్టుకున్నా ఇక్కడ చెట్టపట్టాలు వేసుకోవడం నాకు చాలా అందంగా కనిపిస్తుంది.
నా తరపున అమెరికా కి జన్మదిన శుభాకాంక్షలు!
@వైజాసత్య - ఏలెక్సిస్ గారి ఆలోచనకి ఏమెన్!

@రవి - పిల్లల పట్ల హింసకి వ్యతిరేకంగా చట్టాలు చాలా దేశాల్లో ఉన్నాయి. వ్యక్తి ముఖ్యం తో పాటు కొంత సిద్ధాంత పటిమ కూడా ఉండాలి అనుకుంటా. వ్యక్తే ముఖ్యం అనే ఆలోచన కూడా ఒక సిద్ధాంతమే కదా.

@పూర్ణిమ - ధన్యవాదాలు (మీరు తెలుగులో వ్యాఖ్యలు రాయాలి!)

@ రాకేశ్వర -
క్రెడిటు కార్డు లేక వేడుకే లేదయా
విస్సదాబి రామ యిసకేసి తోమ! :)

@నరసింహ గారు - తప్పకుండా రండి. ఆ వచ్చేది మా వైపుకైతే (డెట్రాయిటు) మరీ సంతోషం!

@శ్రీ - మీరన్నది నిజం
మంచి టపా!! జీవితంలో అసలైన దశని ఇక్కడి నించే ప్రారంభిస్తామేమో మెట్టినిల్లనడం బహు సమంజసం.. ఏదన్నా పని జరిగాలంటే ఎవరి చేతులు ఎంత తడపాలా అన్న తలనొప్పి లేని ఇక్కడి సిస్టం నాకు నచ్చిన అంశాల్లో మొదటిది.. తర్వాత ఇక్కడి ప్రజలు.. ఓ పూసేసుకోరు అలా అని ముభావంగానూ ఉండరు..

మేమూ లాస్ట్ ఇయర్ నించే పైర్ వర్క్స్ వీరోచితంగా మొదలుపెట్టాము :-)
Ramani Rao said…
"అమ్మ పుట్టిల్లు మేనమామకెరుక" అన్నట్లుగా మీ మెట్టినిల్లు గురించి బ్లాగర్లకు భలే (ఎరుకపరిచేసారు ) వివరినించేసారు.
మీరు మెట్టిన ఆ(మీ) దేశానికి జన్మదిన శుభాభినందనలు.
Anil Dasari said…
మొన్న జులై నాలుగున న్యూయార్క్ లో ఉన్నాను. పదేళ్లలో మొదటిసారి తూర్పు తీరానికెళ్లటం. గ్రౌండ్ జీరో దగ్గర కాసేపు గడిపాను. సహజంగానే ఏడేళ్ల క్రిందటి ఆ భయానక దినం గుర్తొచ్చింది. ఆ రోజు క్యాలిఫోర్నియన్లు నిద్రలేచేసరికి అన్ని ఛానెళ్లలోనూ ఇదే వార్త. అగ్నికీలలకాహుతవుతున్న ప్రపంచ వాణిజ్య కేంద్ర భవనాలు, మంటలు తప్పించుకోటానికి పైనుండి దూకేస్తున్న అభాగ్యులు, న్యూయార్క్ నగర వీధుల్లో నిశ్చేష్టులై నోటమాటరాక నిలబడున్న వేలాది జనులు - ఈ దృశ్యాలు ఇప్పటికీ నాకళ్ల ముందు మెదులుతూనే ఉంటాయి. ఎంత సెక్యులర్ దేశమని గొప్పలు చెప్పుకుంటున్నా, ఇంత ఘోరం ఇండియాలో జరిగుంటే దేశంలోని ముస్లిం సోదరులందరినీ నరికి పారేసుండేవారేమో. గోద్రా రైలు దహనం దానికో చిన్న ఉదాహరణ. మరి ఇక్కడో - చిన్నపాటి ఘర్షణ కూడా లేదు. అంతటి మహా విషాదాన్నీ మౌనంగా దిగమింగిన అమెరికన్ల గొప్పదనానికి చేతులెక్కి మొక్కాలనిపించింది. వీళ్ల ప్రభుత్వాల విధానాలెలాంటివైనా కావచ్చు - సగటు అమెరికన్ మాత్రం స్నేహశీలి, శాంత స్వభావుడు.
Bolloju Baba said…
ఏక కాలంలో భిన్న సంస్కృతులను అప్రిషిఏట్ చెయ్యగలగటం కొద్దిమందికే సాధ్యం.
ఎందుకంటే భారతీయ సంస్కృతి పట్ల, సాహిత్యం పట్ల బ్లాగులోకంలో మీరో అధారిటీ. అదే సమయంలో ఈ పోష్టు.
i really fascinate your personality.
with due respects.

బొల్లోజు బాబా
@నిషిగంధ - బాణసంచా మీరే కాల్చేస్తున్నారా? ఆ విధంగా దీపావళి ముచ్చట తీర్చేసు కుంటున్నా రన్నమాట! :)
@రమణి - సామెత బావుంది గానీ ఎవరి పుట్టిల్లు, ఎవరు ఎవరికి మేనమామ అని కొంచెం కన్ఫ్యూషను :)
@అబ్రకదబ్ర - అవును. గొప్ప జాతీయ విషాదాలు జరిగినప్పుడే దేశా ప్రజల జాతీయ వ్యక్తిత్వం పెల్లుబుకుతుంది. ఈ విషయంలో ఆయా సందర్భాల్లో భారతదేశ ప్రజలు చూపిన సంయమనం సంఘీభావం కూడా ఏమీ తక్కువకాదు అని నా అభిప్రాయం. అల్లర్లు జరిగినప్పుడల్లా (ఇందిరాగాంధీ హత్య, వంగవీటి రంగా హత్య, బాబ్రీ మసీదు కూల్చివేత, గోథ్రా మారణహోమం) ఒక ప్రత్యేక వర్గం ఒక నిర్దిష్ట ప్రణాళికతో హింసాకాండ సాగించినట్టు తేట తెల్లమే. అవేవీ సాధారణ ప్రజలు చేసినవి కావు. 9-11 తరవాత అమెరికాలోనూ కొన్ని విషాదకరమైన దాడులు జరిగాయి. అన్నిటికన్నా దారుణమైన హింసాకాండని ప్రభుత్వమే ఆవిష్కరించింది, మీకు తెలియనిదేముంది?
@బాబా - భారతదేశం నా మాతృభూమి కాబట్టి భారతీయ సంబంధమైన విషయాలన్నిటి మీదా నాకు ప్రేమే. అది నిర్వివాదాంశం. ఏదో నాకు తెలిసిన నాలుగు ముక్కలు ఇక్కడ నలుగురితో పంచుకున్నందుకే అథారిటీ ఐపోతానా? టపాలో చెప్పినట్టు అమెరికాలో నివాసం వల్ల వివిధ దేశ ప్రజలతో కొంత పరిచయాలు ఏర్పడ్డం, వివిధ సంస్కృతి సాంప్రదాయాల్ని చూసే భాగ్యం కలగడం .. ఇలా పరిచయమైన వాటన్నిటిలోనూ ఏదైనా మంచి నేర్చుకోవచ్చా అని చూస్తూనే ఉంటాను.
Anonymous said…
కొత్తపాళీ గారూ,

"వ్యక్తి ముఖ్యం తో పాటు కొంత సిద్ధాంత పటిమ కూడా ఉండాలి అనుకుంటా. వ్యక్తే ముఖ్యం అనే ఆలోచన కూడా ఒక సిద్ధాంతమే కదా."

నాకు బాగా తెలిసిన అభివృద్ధి చెన్దిన దేశం కొరియా. కేవలం సిద్ధాంతాల కారణంగా విడిపోయింది. ఇప్పుడు ప్రపంచంలో ఒక ప్రమాదకరమైన దేశం (ఉత్తర కొరియా) అవతరించింది. (దీని మూల కారణం మీద ఓ బ్లాగు రెడీ చేయాలి నేను). సిద్ధాంతాలకన్నా వ్యక్తి ముఖ్యమనే చాదస్తం అందుకే నాకున్నది.

నిన్నే jean paul saartra, existentialism మీద నండూరి రామమోహన రావు గారి విశ్వదర్శనం చదివాను. వ్యక్తి ముఖ్యం అన్నది సిద్ధ్హాంతం కాదు, అదో ఆలోచన అని ఆయన అంటారు.
అమెరికా పుట్టినరోజుతో పాటూ మా ముకుందుడి (మా అబ్బాయి ముకుంద్ అవినాష్)జన్మదినంకూడా అదే రోజు. కాబట్టి, ఎలెబ్రేషన్లలో నేనూ ఉంటాను.
Anonymous said…
అబ్రకదబ్ర కరక్ట్ గా చెప్పారు. జనాలు ఎంత తిట్టినా/తిట్టుకున్నా కూడ ప్రపంచంలొ ప్రజాస్వామ్యాన్ని కాపాడింది అమెరికా, ఇంగ్లాండ్ లే కదా(this is an actual quote by 'Malati Chandoor').

రెండవ ప్రపంచ యుద్దంలో హిట్లర్ని, ఆ తరువాత కమ్యూనిజం ప్రపంచాన్నంత ఆక్రమించుకోకుండ అడ్డుపడింది వీళ్ళే కదా. ఒక్కసారి అలాంటి world ని ఊహించుకుంటె వొల్లు జలదరిస్తుంది (All..please don't fire guns on me right away.. I know Communism from close quarters).

ఇలా ఇంకొ పది విషయాలు right from top of head చెప్పొచ్చు కాని, ఇది నా మొట్ట మొదటి తెలుగు బ్లాగ్ వ్యాఖ్య. ఇప్పటికే నా పని అయిపొయింది. తెలుగులొ రెగ్యులర్ గా బ్లాగ్ చేసేవాళ్ళకి శతకోటి వందనాలు. (మహేశ్ గారు, మీకో నమస్కారం సార్!).

Actually ఈ July 4th కి Capital Hill, Washington Monument ముందు అద్భుతంగా, కళ్ళు మిరుమిట్లు గొలిపే fireworks లొ గడిపి చాలా భావావేశలకి లొనయ్యా. కాని Independece Day విషయానికి వొస్తె, నాకు India నే చాలా ఇష్టం. నా చిన్నప్పుడు స్కూల్ కి ప్రొద్దున్నే వెళ్ళడం, జెండావందనం జరుపుకొవడం, స్వీట్స్ కోసం ఎదురుచూట్టం, దారి పొడవునా, ఊరంతా మువ్వన్నెలజండాల రంగులు నిండడం అంతా పండగ లా ఉండేది. దారంతా దేశభక్తి గీతాలు మారు మ్రోగి పోతా వుండేవి. ఆవి వినుకుంటూ చాలా వుత్తేజం పొందెవాన్ని. ఇప్పటికీ ఆ పాటలు వింటూంటె రొమాలు నిక్కబొడచుకుంటాయి. As a matter of fact, నేను ఇప్పుడు 'నేను నా దేశం, పవిత్ర భారతదేశం...' వింటున్నా. అలాగే 'గాంధీ పుట్టిన దేశం, రఘు రాముడు యేలిన దేశం....', 'పాడవోయి భారతీయుడా.....', ఇవన్నీ వింటూ గడిపిన క్షణాల్లొ కలిగిన ఫీలింగ్స్ నాకు American Independence Day రోజు ఎప్పుడు రాలేదు.
సుజాత said…
కొత్తపాళీ గారు,
మడత కుర్చీ పట్టుకెళ్ళి బాణాసంచా పేల్చడం చూడ్డానికెళ్లడం మొదటి సంవత్సరం ఆశ్చర్యాని కలిగించినా, తర్వాతి రెండేళ్ళు మేము వెళ్ళి స్నేహితులతో కలిసి ఆనందించాము! నాకూ బాగా నచ్చింది మీ మెట్టినిల్లు!

రోడ్లు, ప్రకృతి సంగతి అలా ఉంచి..ముఖ్యంగా మనుషులు! ఎంతలో ఉండాలో అంతలో ఉంటారు! ఒకళ్ల జోలీ, జోక్యం(అనవసరంగా) ఉండదు, మన జీవితాల్లోకి తొంగి చూడ్డాలు ఉండవు( ఆ పని చేయడానికి మనవాళ్ళేలాగూ ఉంటారుగా అక్కడ)
రవి .. మీరన్నదాంట్లోనూ పాయింట్ లేక పోలేదు. ఈ విషయం మనం వేరే మాట్లాడుదాం.

మహేష్ .. చి. ముకుందునికి శతాధిక ఆనందమయ జన్మదినోత్సవాలు జరుపుకోవాలని శుభాకాంక్షలు.

సవ్తంత్ర వ్యక్తి గారు .. తొలి తెలుగు వ్యాఖ్య నా బ్లాగులో రాసినందుకు సంతోషం. అమెరికా గురించీ ఇండియా గురించీ చాలా అతిశయోక్తులు పలికారు. పాటలు వింటే, పాడుకుంటే రోమాలు నిక్కబొడుచుకుంటాఇ, నిజమే. కానీ అదే దేశభక్తి కాదని మీరూ అంగీకరిస్తారు అనుకుంటాను. దేశమంటే మట్టికాదోయ్ అనే మహాకవి పలుకుల్ని ఓ సారి స్మరించుకుందాం.

సుజాత .. నిజం :)
Anonymous said…
మీ రెస్పాన్స్ కి ధన్యవాధాలు. నా బ్లాగు మరొక్కసారి చదవండి దయచేసి. నేను ఎక్కడా నాలో కలిగిన దేశభక్తి గురించిన ఫీలింగ్స్ కాని, నాకు మిగతా వాళ్ళ కన్నా ఎక్కువ దేశభక్తి వుందని కాని చెప్పుకోలేదు. పాటలు విన్నప్పుడు కలిగే భావావేశాల్ని దేశభక్తి అని ఏ తెలివి తక్కువ మనిషి కూడా అనడు లెండి. మీరు అది ప్రస్తావించడమే ఆశ్చర్యం. నేను ఆ వ్యాఖ్య రాసేప్పుడు యాధ్రుశ్చికంగా 'చిమటమ్యూజిక్' 70s songs నుండి 'నేను నా దేశం' పాట రావడం జరిగింది. దాంతొ ఇంకొంచెం ఫీల్ అయినట్లున్నాను, అలాగే రాసేసా. దానికే 'అతిశయొక్తులు అనేయడమే. అయినా నా వ్యాఖ్య లొ ఇండియా గురించి ఏమి పొగడలెదే!. నేను తెలుగు కి రెస్పాండ్ అయినంత తొందరగా వెరే భాషలకి అవ్వను కాబట్టి(ఆంగ్లం లొ మనం బాగా ఈక్ లెండి), ఆ పాటలకి అలా ఫీల్ అవుతాను అంతె. వందేమాతరం, జనగణమన విన్నప్పుడు కలిగే భావప్రకంపనలు, Star-Spangled Banner కి రావు నాకు. అలా అని నా మెట్టిన దేశం మీద నాకు భక్తి, ప్రేమ తక్కువేమి లేవు. ఆ మాట కొస్తే చాలమంది ఇమ్మిగ్రంట్స్ కున్న గుడ్డి anti-american attitude కూడా లేదు నాకు.

:-)), వ్యాఖ్య చాలా పెద్దదయింది కదా:-) క్లుప్తంగా, సరళంగా, సూటిగా రాయడం నేర్పిస్తారా :-)