నిషల్క్కూత్తు - షాడో కిల్

ఈ మధ్య భారతీయ కళాత్మక చలన చిత్రాల మీద కొంచెం దృష్టి పెట్టాను.

ముందుగా సత్యజిత్ రే గారి చారులత చూశాను. నా ఖర్మకాలి అదొక దిక్కుమాలిన డీవీడీ. సినిమానించి డీవీడీలోకి జరిగిన మార్పు పరమ దరిద్రంగా జరిగింది. నలుపు తెలుపు చిత్రమేమో, కాంట్రాస్టు సరిగ్గా లేకపోయేప్పటికి అస్సలు చూడలేక పోయాను. అతి ఘనత వహించిన రే గారి ప్రముఖ చిత్రం గతే ఇలా ఉంటే ఇక మిగతా పాత చిత్రాల పరిస్థితి ఎలా ఉంటుందని ఊహించవచ్చు?

నేను చూసిన రెండో సినిమా మళయాళ దర్శకుడు అడూర్ గోపాలకృష్ణన్ తీసిన నిషల్క్కూత్తు. దీని పేరుని ఆంగ్లంలో షాడో కిల్ అని తర్జుమా చేశారు. నాకర్ధమైన కొద్ది మళయాళంలో నిషల్ అంటే నీడ .. అంచేత షాడో కిల్ అనేది యథాతథపు అనువాదం అనుకుంటున్నా.

ఈ సినిమా 2002లో మొదట విడుదలైంది. బహుశా అందువల్లనేమో, నా అదృష్టం బావుండి, డీవీడీ నాణ్యత చాలా బావుంది.

క్లుప్తంగా కథ
1940 లో ట్రావంకూరు మహారాజ సంస్థానంలో ఒక తలారి కథ. ఈ తలారి పదవి వంశపారంపర్యంగా వస్తుంటుంది. తలారి కుటుంబం ఎక్కడో మారుమూల గ్రామంలో ఉంటుంది. అక్కడైనా మిగతా గ్రామస్తులతో కలవకుండా ఊరికి దూరంగా ఉంటుంది. ఈ వేర్పాటుని ఇంకా నొక్కి చెప్పాలి అన్నట్టు తలారి కుటుంబం అంతా తమలో తాము మాట్లాడుకునేటప్పుడు తమిళం మాట్లాడుకుంటారు. ఉరి తీసిన తాడుని తలారికే బహుకరిస్తారు. ఆ తాడు అతని ఇంటిలో కాళికాదేవి పూజాస్థలం ముందు వేళాడుతుంటుంది. ఆ తాడుముక్కతో అమ్మవారికి దీపారాధన వెలిగించి ఆ బూడిద విభూతి పెడితే అన్ని రోగాలూ పోతాయని గ్రామస్తుల నమ్మకం.

ఇప్పటి తలారి కాళియప్పన్ వృద్ధుడైపోయాడు. పైగా అంతకు ముందు ఉరితీసిన ముద్దాయి నిర్దోషి అని నమ్మి, అతని ప్రాణం తీసిన పాపం వొడిగట్టుకున్నాను అనే పాపచింతనతో పగలూ రాత్రి అదే పనిగా తాగి కాలం గడుపుతున్నాడు. కొడుకు ముత్తు పై ఊళ్ళకి చదువుకి వెళ్ళి గాంధీ గారి సత్యాగ్రహ సూత్రాల్ని వంటబట్టించుకుని తిరిగి వచ్చాడు. రాట్నం వడుకుతుంటాడు. పెళ్ళై కాపురం చేసుకుంటున్న పెద్ద కూతురు తనకింకా ఏవో పుట్టింటి కట్నాలు దక్కలేదని దెప్పుతూంటుంది. చిన్న కూతురు అప్పుడే పెద్దమనిషైంది. ఈ విచిత్ర కుటుంబాన్ని కట్టి ఉంచే సూత్రధారిణిగా కాళియప్పన్ అర్ధాంగి మరగతం అందర్నీ కను రెప్పలా కనిపెట్టుకుని ఉంటుంది.

ఇంతలో రాజాస్థానపు ఉద్యోగి తలారిని వెదుక్కుంటూ వస్తాడు. హత్య చేసిన నేరానికి ఒక ముద్దాయికి ఉరిశిక్ష విధించారనీ, శిక్ష ఫలానీ రోజున అమలు జరుగుతుందనీ, ఆ దండన అమలు జరిపేందుకు తలారి అవసరమైన పూజాదికాలు నిర్వహించి సిద్ధంగా ఉండవలసిందని రాజాజ్ఞగా వినిపిస్తాడు. తాను వృద్ధుణ్ణైపోయాననీ, వేరెవర్నైనా ఈ పనికి చూసుకోవలసిందనీ కాళియప్పన్ ప్రార్ధిస్తాడు. తలారి పదవిలో రాజుగారి దయచేసిన వసతూన్నీ ఇన్నాళ్ళూ హాయిగా అనుభవించి ఇప్పుడు రాజధిక్కారం చేస్తావా అని గద్దిస్తాడు ఉద్యోగి. విధిలేక వల్లెయన్నాడు కాళియప్పన్. ఆ రోజు నించీ నిత్యం స్నాన జపతపాల్లో గడుపుతున్నాడు. ఆరోగ్యం క్షీణిస్తోంది. చివరికి బయల్దేరే రోజు రానే వచ్చింది. కొడుకుని సాయంగా తీసుకుని రాజధానికి వెళ్ళాడు. అక్కడ ఉరి తాడునీ, యంత్రాన్నీ పరీక్షిస్తాడు.

ఆ రాత్రి అతనికి శివరాత్రే. ముద్దాయి ఎలాగూ ఆ రాత్రి నిద్ర పోలేడు కాబట్టి తలారి కూడా జాగారం చేయ్యాలని అదొక ఆచారం. జైలర్లు అతనికి తోడు కూర్చుని, సారాయి తాగిస్తూ, నిద్ర పోకుండా ఒక కథ చెప్పటం మొదలు పెడతారు. ఒక పెల్లలో ఒక అమాయకపు పడుచు పిల్ల తన మేకని మేపుకుంటుంది. ఒక అనాథ యువకుడు పిల్లంగ్రోవి ఊదుకుంటూ అక్కడ పచ్చిక బయళ్ళలో తిరుగుతుంటాడు. ఇద్దరూ తారసపడతారు. త్వరలో అది పరస్పరం ఇష్టంగా ప్రేమగా పరిణమిస్తుంది. ఇంతలో ఆమె అక్క మొగుడు వీళ్ళని చూస్తాడు. ఆ యువకుడు అవతలికి వెళ్ళిన సమయంలో ఆ పిల్లని సోంత బావే బలాత్కరించి చంపేస్తాడు. ఆ ప్రదేశంలో అనాథ యువకుడి పిల్లంగ్రోవి విరిగిపోయి కనిపిస్తుంది. అతను దోషిగా నిరూపించబడతాడు. చనిపోయిన పిల్ల కుటుంబానికి అసలు ముద్దాయి ఎవరో తెలుసు, కానీ వారతన్ని బయట పెట్టరు. కథ ఇంతవరకూ విన్న కాళీయప్పన్ తాగిన మైకంలో "మరి ఆ అబ్బాయి ఏమయ్యాడు" అని అరుస్తాడు. కథ చెప్పిన జైలరు నవ్వుతూ "ఏమవుతాడు? వాణ్ణే నువ్వు రేపు ఉరి తియ్య బోయేది!" అంటాడు. ఇంకో నిర్దోషిని ఉరితియ్యడమనే ఊహ భరించలేక గుండె పోటు వచ్చి కాళీయప్పన్ మరణిస్తాడు.

కానీ రాజాజ్ఞ అమలు జరగాలి. సత్యాహింసలు తన దైవాలుగా నమ్మిన ముత్తు తండ్రి కాళీయప్పన్ కి వారసుడిగా తలారి పాత్ర ధరించి మొదటి ఉరి తీస్తాడు.

ఈ సినిమా ఏం చెబుతోంది?
ఈ కథకి ఆలోచన ఒక వార్తాపత్రికలో ట్రావంకూరు సంస్థానపు చివరి తలారి మరణించిన వార్త చదివినప్పుడు తట్టిందని దర్శకుడు తన ముందుమాటలో చెప్పుకున్నాడు. నేరము శిక్ష కథలు ఎప్పుడూ ముద్దాయి దృష్టి నించో, లేదా అపరాధ పరిశోధకుడి దృష్టినించో నడుస్తుంటాయి. శిక్ష, అందులోనూ మరణ శిక్ష, అమలు జరిపే మనిషి మనస్థితి ఎలా వుంటుంది అనే ఆలోచనకి చిత్ర రూపం ఈ సినిమా అనుకోవచ్చు. సమయమా అదొక సంధి యుగం. క్షేత్రమా అదొక విచిత్ర సమంఏళనం. తలారి నివాసం అతి ప్రశాంతమైన పచ్చని పల్లె వాతావరణంలో. కానీ అతని వృత్తి అతి భయంకరమైన ఉరిశాలలో. బయటి పచ్చదనం అతని మనసులో రేగే పరితాప జ్వాలల్ని ఏమాత్రం ఉపశమింప చెయ్యదు. తనుచేసే వృత్తి నీడ తన కుటుంబం మీద పడకుండా జాగ్రత్త పడుతుంటాడు అప్పటిదాకా. పైగా, ఒక చేత్తో తీసిన ప్రాణమే (ఇంకా పచ్చిగా చెప్పాలంటే ఆ ఉరితాడే) ఇంకో పక్క బూడిదయై, విభూతియై ప్రాణదానం చేస్తుంది అతని చేతుల్లోనించే. వైవిధ్య భరితమైన కాంట్రాస్టుల (contrasts) అమరికగా ఈ సినిమా చూడొచ్చు.

ఇదంతా ఇలా ఉండగా, జైలరు ఆ అమాయకపు పడుచు పిల్ల కథ చెబుతున్నప్పుడు తలారి దృష్టిలో అది తన చిన్నకూతురిలాగా, ఆ హీనమైన అకృత్యం చేసేవాడు తన అల్లుడిగా కనిపిస్తారు. ఇది (సినిమా కథలో) నిజంగా జరిగింది కాదు. కానీ ఆ ఊహ అతన్ని ముదలంటా కుదిపేసి మరణానికి దారి తీస్తుంది. ఒక విధంగా పసితనపు అమాయకత్వానికీ, కర్కశమైన న్యాయవిధానానికీ, మధ్యలో నిమిత్తమాత్రమైన అసహాయత్వానికీ ఒక త్రికోణపు సంబంధంలా అనిపిస్తుంది.

ఈ సినిమా చూశాక ఏ ఒక్క ఆలోచన మీదా నిలబడలేం. ఏ ఒక్క వివరణా, ఏ ఒక్క విశ్లేషణా మనకి పూర్తి తృప్తినివ్వదు. ఒక ఆలోచన పట్టుకుని వెళ్తుంటే ఇంకేదో స్ఫురిస్తుంది. అరె, ఇదీ నిజమే కదా అనిపిస్తుంది. అసలు ఆ విషయం చెప్పాడా సినిమాలో అని అనుమానం వస్తుంది. మంచి సినిమాకి (ఆ మాటకొస్తే ఏ సృజనాత్మక కళకైనా) ఉండాల్సిన లక్షణాల్లో ఇదీ ఒకటని నా అభిప్రాయం. ఆ దృష్ట్యా ఇది కచ్చితంగా మంచి సినిమా.

ముఖ్యపాత్రలు పోషించిన ఒడువిల్ ఉన్నికృష్ణన్ (కాళీయప్పన్), సుకుమారి (మరగతం)ల నటన అద్భుతం. ప్రముఖ మళయాళ హాస్యనటుడు శ్రీకుమార్ రాజోద్యోగిగా, కేరెక్టర్ నటుడు నెడుముడి వేణు జైలరుగా మంచి నటన అందించారు. ఈ సినిమాలో ఇంకొక విశేషం ఇళయరాజా సంగీత దర్శకత్వం అందించడం .. నేపథ్య సంగీతం ఎక్కడా దృశ్యాన్ని డామినేట్ చెయ్యకుండా నేపత్యంలోనే ఉంటుంది. ఇక గోపాలకృష్ణన్ దర్శక ప్రతిభని చెప్పడానికి నా అవగాహన సరిపోదు.

ఈ సినిమా గురించి వికీ పేజీ

జెరూసలేము నించి ఒక బ్లాగు


ఇంకొక విశ్లేషణ

Comments

ప్చ్,గురూజి మాకు ఇలాంటి సినిమాలు దొరకవు
మేధ said…
మంచి విశ్లేషణ.. ఈ వారాంతం ఈ సినిమా చూడడానికి ప్రయత్నిస్తాను...
రవి said…
బావుంది., మీ సమీక్ష. ఎప్పుడో దూరదర్శన్లో మరుపక్కం అనే ఓ సినిమా చూసాను అదూర్ గోపాల కృష్ణన్ ది. అందులోనూ ఓ వ్యక్తి, తన ఙ్ఞాపకాలను తవ్వుకుంటూ గిల్టీ గా బాధపడతాడు. బహుశా ఇది ఈయన శైలి ఏమో..
Purnima said…
manchi cinema ni parichayam chesinanduku nenarlu :-)

Sometime back, a man was hanged for raping a teenager. Nothing caught my attention as much as the executor's narration of the whole incident. Some jobs are so damn demanding.. that was the first instance I learned that. This movie is now a must watch for me.
@రాజేంద్ర - అవును , గొప్ప భారతీయ సినిమాలు భారత దేశంలోనే దొరక్కపోవడం చాలా దారుణమైన పరిస్థితి.

@మేధ - సినిమాలు మీకు అంత వీజీగా దొరికేస్తాయా? ఎంత దక్షిణ కొరియా అయినా? హాశ్చర్యం!

@రవి - అదూర్ సినిమా నేను చూడ్డం ఇదే మొదలు. నేత్ ఫ్లిక్స్ లో దొరికినవన్నీ చూడాలని డిసైడయ్యాన్ను.

@ పూర్ణిమ - యెస్. (మీరు తెలుగులో వ్యాఖ్యలు రాయాలి!)
కొత్తపాళీ,

దర్శకుడి పేరు చూసి మరీ మోజు పడిపోమాకండి. కొన్నిసార్లు రేలు, ఆదూర్లు పైత్యమ్ముదిరి మన నెత్తిన బాంబులూ వేసున్నారు. ఆమధ్యెప్పుడో ఆదూర్ది ఓ మళయాళ చిత్రం చూసి దెబ్బతిన్నా. పేరు గుర్తులేదు - గుర్తు పెట్టుకునేంత గొప్ప సినిమా కాదు. నాకు గుర్తున్నదల్లా నిమిషాలపాటు ఒకే వస్తువు మీద ఫోకస్ చేసుండే కెమెరా, పది నిమిషాలకో పావు గంటకో వినబడే ఒకట్రెండు మాటలు, నీరసంగా కదుల్తుండే కధాగమనం. అసలు ఆయనేమి చెప్ప/చూపించదల్చుకున్నాడో అర్ధం కాలేదు. కాబట్టి జరభద్రం.
@abracadabra - yes, such disappointments are a distinct possibility in this exercise. I know it well :)
మేధ said…
కొత్తపాళీ గారు, దక్షిణ కొరియాలో ఇంగ్లీష్ సినిమా దొరకాలి అంటే కష్టం కానీ, అంతర్జాలానికి కొదవేముంది..! మంచి క్వాలిటీ ప్రింట్ విత్ ఇంగ్లీష్ సబ్-టైటిల్స్ తో దొరికింది..!
నిన్నే చూశా ఆ సినిమాని..
కాళీయప్పన్ కనిపించలేదు, ఆ పాత్రధారి కనిపించాడు.. అలాగే కధ చెప్పిన జైలర్ నటన కూడా బావుంది..
కాకపోతే నాకెందుకో ఆ సినిమా 1941ప్రాంతంలోది లాగా అనిపించలేదు.. ఎందుకో చాలా రీసెంట్ లాగా అనిపించింది.. కానీ మా రూమ్మేట్ కి మాత్రం 1941లానే అనిపించిందట!

@రాజేంద్ర గారు: కుదిరితే, Veoh TVని download చేసుకోండి.. దాంట్లో సెర్చ్ చేస్తే మంచి క్వాలిటివీ దొరుకుతాయి, నేను ఈ సినిమా అలానే చూశాను..
నా స్నేహితుడు నాగేష్ ద్వారా ఈ సినిమా నేను ఎమ్.ఎఫ్. హుస్సేన్ ‘సినిమా ఘర్’(హైదరాబాద్) లో దర్శకుడు అదూర్ గోపాల్ కృష్ణన్ గారితో కలిసి చూడ్డం జరిగింది.

సినిమా చూసి నేను కాస్త నిరాశ చెందినమాట వాస్తవం. ఇంతకు మునుపు ఆదూర్ తీసిన సినిమాలలో వేటికీ ఈ సినిమా కనీసం దగ్గరికి కూడారాదు.చాలా విషయాలు ఒకే సినిమాలో చెప్పడానికి ప్రయత్నించినట్టనిపించింది. అందుకే ఏదీ సరిగ్గా పూర్తిగా ఉన్నట్టనిపించదు. ఉదాహరణకు అభ్యుదయ భావాలున్న తలారి కొడుకు పాత్ర మొ"
కొత్తపాళీ గారూ,
"ఈ సినిమా (DVD) ఎక్కడ దొరుకుతుంది?" అనే అమాయకపు ప్రశ్న అడిగినందుకు మన్నించండి. అమజాన్‌లో ఆర్డర్ ఇచ్చాను.

--ప్రసాద్
http://blog.charasala.com
ప్రసాద్ గారు, నేను netflix నించి అద్దెకి తెచ్చానండీ.
pi said…
This film is also available for instant wtaching on netflix. Will check it out this weekend.
chAlA manchi vislEshaNa ichAru... mee post chadivaka naku kuda ee cinema chudalanipisthundi...