Friday, February 26, 2010

సరికొత్త సర్వే .. మీ అమూల్యాభిప్రాయం కావాలి

ఒక్ఖ క్షణం మీ అమూల్యమైన సమయాన్ని వెచ్చించి, ఇటు దయచేసి, వీవెనుడు నిర్వహిస్తున్న ఈ సర్వేలో పాల్గొని తమ అమూల్యాభిప్రాయాన్ని తెలియజేయమని కోరుతున్నాను.

వీవెన్ అభిప్రాయ సేకరణ

ఇందులో ఒక్కే ఒక్క ప్రశ్న .. అంతే.
దయచేసి పాల్గొనండి.

Wednesday, February 24, 2010

రెండు ఇటీవలి టపాల మీద వ్యాఖ్యానం

ధర్మవడ్డీ కథ గురించి
అబ్రకదబ్ర, కామేశ్వర్రావు ఇద్దరూ రచయిత ఈ కథని అంత సమర్ధవంతంగా నిర్వహించలేదు అనే నిర్ణయానికి వచ్చినట్టుగా కనబడింది నాకు.
కానీ నా ఉద్దేశంలో రచయిత అంత మరీ అంత అమాయకుడో తెలివిలేని వాడో కాదు. ఈ కథ శీర్షికనీ, శ్త్రక్చర్‌ని తెలివిగానే ఎన్నుకున్నాడు. ఆయన డబ్బు గురించీ, మొరాలిటీని గురించీ, మారుతున్న సమాజాన్ని గురించీ ఒక ప్రకటన (పోనీ అబ్సర్వేషన్ చెయ్యదల్చుకున్నాడు). కానీ ఆ ప్రకటన ఇదీ అని చెప్పేస్తే అది మనసుకెక్కదు సరికదా, కథకూడా నిలవదు. అందుకే నిజంగా కథ చెబుతున్నది ఎవరు అనేది పాఠకుడికి తిన్నగా అర్ధంకాకుండా మూడు పొరల మాటున ఉంచడం, కొంత అయోమయ పరిస్థితి కలిగించడం.
మీరు జాగ్రత్తగా చూస్తే ఆ కథలో మీరు చదువుతున్న ప్రతి అక్షరమూ ఏదో ఒక పాత్ర మనోభావాలే, లేదా ఒక పాత్రకి కలుగుతున్న ఇంప్రెషన్లే. వాటిల్లో ఈ ఫలానా వాక్యం రచయిత అభిప్రాయమే అని మనం ఇతమిత్థంగా చెప్పేందుకు కుదరదు. ఇదీ రచయిత సాధించిన అదనపు ప్రయోజనం నా దృష్టిలో.
ఊదం గారి విశ్లేషణ ఇంకోంచెం కాంప్లెక్సుగా ఉంది. రచయితా కథకుడూ ఒకరేనా అన్న ప్రశ్న గురించి - అంటే అర్ధం రచయిత వ్యక్తిగత జీవిత విషయాలు మనకి తెలిసి ఉండాలని కాదు. రచయితగా గోపీచందు బాగానే ప్రఖ్యాతుడు కాబట్టి సమాజం పట్ల ఆయన నమ్మకాలు, ఆయన ఆలోచనా ధోరణులు పాఠకులకి తెలిసే అవకాశం బాగానే ఉంది. ఆ దృష్టితో బేరీజు వెయ్యడమే తప్ప అతనికి ఎందరు పిల్లలు, ఆయన వడ్డీ వ్యాపారం చేశాడా లేదా అని కాదు. మిగతా పాయింట్ల మీద మీ విశ్లేషణ నాకు నచ్చింది. మరో చిన్న విషయం. పఠయిత అనే వాడుక చూడ్డం ఇదే మొదలు. చదివేవాళ్ళని పాఠకులని, కొన్ని చోట్ల పఠిత అనీ అనడం చూశాను.
ఈ కథ గురించి నా ఉద్దేశం - గొప్ప కథ కాకపోవచ్చును గానీ ఆసక్తి కరమైన కథ. దీన్ని లోతుగా చూడాలంటే కథారచన కాల నేపథ్యం గుర్తు చేసుకుంటే ఉపయోగిస్తుంది. సమాజంలో పాతుకుని ఉన్న ధర్మవడ్డి అనే వ్యవస్థకి మారుతున్న సమాజంలో కాలం చెల్లుతోంది అనే ఆశతో ప్రతీకాత్మకంగా ఈ కథ గోపీచంద్ రాశారని నేననుకుంటున్నా. సూరయ్య పాత వ్యవస్థకి ప్రతీక. చంద్రయ్య దాన్ని ఎదిరించే కొత్త మార్పుకి ప్రతీక. ప్రజలందరూ చిన్నా పెద్దా సూరయ్యని ఏడిపించడం - సమాజం మార్పువేపుకే మొగ్గుతుంది అనే సూచన. ఇక నేను, నేను గారి మిత్రుడు .. మనమే.
సత్ గారికి .. అయ్యా, మరి బ్లాగంటూ పెట్టుకున్నాక, ఆధునిక సాహిత్యమంటే ఇష్టమైనాక ఇలాంటి టపాలు కూడా వస్తూంటై. ఇది నచ్చకపోతే వొదిలెయ్యండి, త్వరలోనే మీకు నచ్చే టపా ఇంకోటొస్తుందేమో? మనిషి ఆశాజీవి కదా :)

పోలీసు గూండాయిజం గురించి
ఈ టపాకి వచ్చిన స్పందనలు చూశాక .. మనం రాసిందాన్ని చదివేవాళ్ళు ఎంత విభిన్నమైన దృష్టితో చదువుతారు గదా అని మరోసారి స్ఫురణకి వచ్చింది. ఇంచుమించు కామెంటిన అందరూ నేను జర్నలిస్టుల్ని సమర్ధించాననో, పోలీసుల్ని తప్పుపట్టాననో భావించారు.
నేను ఈ రెండూ చెయ్యలేదు. నేను వాడిన రెటొరిక్‌లో అటువంటి భావన కలిగించే వత్తిడి ఉండొచ్చు, కాదనను. నేను చెప్పిందల్లా .. మన సమాజం ఒక పోలీసు పరిపాలనలో ఉన్నదనీ, ఆధునిక అభ్యుదయ సమాజం ఏదీ పోలీసు పాలనలో ఉండకూడదనీ - అంతే.

Tuesday, February 23, 2010

పుస్తకాలు పుస్తకాలు

మళ్ళీ కబుర్లు చెప్పడం మొదలు పెడదాము అనుకున్నాను గానీ తీరా రాయడానికి కూర్చుంటే ఇప్పటికిది అంతా పుస్తకాల గురించే అయింది.

నా కథల సంపుటి రంగుటద్దాల కిటికీ మళ్ళీ కొంచెం న్యూస్‌లోకొచ్చింది. మా వూళ్ళో ఉండే మీరు అక్కడెక్కడో పుస్తకం విడుదల చెయ్యడమేవిటి అని చెప్పి, మిత్రుడు కాలాస్త్రి, అతని మిత్రబృందం డిట్రాయిట్ పరిసర ప్రాంతమైన నోవై నగరంలో మొన్న శనివారం పుస్తకావిష్కరణ సభ ఏర్పాటు చేశారు. డిట్రాయిట్ తెలుగు సమితి కార్యవర్గ సభ్యులు కూడా ఉత్సాహంగా పాల్గొని సభని జయప్రదం చేశారు. నాపైని వాత్సల్యంతో శ్రీ యెడవల్లి సోమయాజులు గారు పుస్తకాన్ని ఆవిష్కరించారు. తానా పూర్వాధ్యక్షులు డా. బండ్ల హనుమయ్య గారు ముఖ్య అతిథిగా విచ్చేశారు. పుస్తకాన్ని సమీక్షిస్తూ మిత్రులు ప్రసాద్ సామంతపూడి, డా. వేములపల్లి రాఘవేంద్ర చౌదరి గార్లు నా కథల గురించి చెప్పిన నాలుగు మంచి మాటలు నాకెంతో సంతోషాన్ని కలిగించాయి. డీటీయే అధ్యక్షులు చలపతి కోడూరిగారు సభకి అధ్యక్షత వహించి జయప్రదంగా జరిపించారు. కాలాస్త్రి ఇంకేవన్నా విశేషాలు చెబుతారేమో చూద్దాం. సభ వివరాలు ఆంధ్రజ్యోతి ఎన్నారై సెక్షన్లో.

పుస్తకం సైట్లో వెలిగించిన వొత్తి అనేక బ్లాగుల్లో టపాకాయలు పేలుస్తోంది. మొత్తానికి హేలీగారు హేలీ తోకచుక్కంత సంచలనం సృష్టిస్తున్నారు ఈ బ్లాగ్లోకంలోని తెలుగు సాహిత్యాభిమానుల్లో. యువతరాన్ని ఆకట్టుకునే సాహిత్యమేదీ తెలుగులో రావట్లేదు - ఇంగ్లీషులో చూడండి, హేరీ పాటర్ ఎంత పఠనాసక్తిని పెంచిందో - అని అతనన్న మాటలకి కల్పన గారు, మాలతి గారు ఆసక్తి కరమైన విశ్లేషణ చేస్తూ విస్తృతమైన చర్చకి తెర తీశారు. ఈ చర్చల్లో బయటికొచ్చిన ముఖ్యాంశాల గురించి నా అభిప్రాయాలివి.
1. అన్ని చర్చనీయాంశాల్లాగానే ఇందులో రెండు భాగాలు - తెలుగు సాహిత్యం ఏ స్థితిలో ఉందీ అని చెయ్యాల్సిన పరిశోధన ఒక అంగం. క్రియాశీలంగా కొత్త సాహిత్య సృష్టి చేసుకోవలసిన కార్యాచరణ దీక్ష ఇంకో అంగం.
2. కథానిక, కవిత - ఈ రెండు ప్రక్రియలు తప్పించి తెలుగులో ఇటీవలి కాలంలో ఇతర ప్రక్రియల్లో చెప్పుకోదగిన రచనలేవీ రాలేదు. ఇది నిర్వివాదాంశం.
3. మాయమంత్రాలతో కూడిన జానపద సాహిత్యం మనకి తెలుగులో చాలానే ఉంది, కానీ నేటి పాఠకులకి ఆ కథల్లోని భాషకానీ, కథన పద్ధతులు కానీ ఆకర్షణీయంగా లేవు. అంతెందుకు, ఒక కాలంలో విపరీతమైన ఆసక్తితో వీటిని చదివిన నేనే సుమారు పదేళ్ళ క్రితం మళ్ళీ చదవడానికి ప్రయత్నించినప్పుడు, ఏంటీ చెత్త అని జుగుప్స కలిగింది. అంత దరిద్రంగా ఉన్నయ్యి.
4. వివిధ ప్రక్రియల్లో, ముఖ్యంగా యువతరాన్ని ఆకట్టుకునేట్టు సాహిత్యం తయారు కావాలి. దాని వ్యాప్తికి తగిన వాతావరణం కూడా ఒకటి ఏర్పడాలి. నాకు తెలిసి ప్రముఖ కవి శివారెడ్డిగారు రాష్ట్రమంతటా పర్యటిస్తూ, పాఠశాలలకి కళాశాలలకి వెళ్ళి కవితా గోష్ఠులు నిర్వహిస్తుంటారు. ఇటువంటి ప్రయత్నం ఎంతవరకూ జరుగుతోంది? ఆసక్తి కరమైన సాహిత్యం దొరకడం ఒకటే కాదు, ఆ సాహిత్యాన్ని చదవడం దాన్ని గురించి మాట్లాడ్డం ఫేషనబుల్ అనే వాతావరణం ఒకదాన్ని . వ్యాపింపచెయ్యాలి
5. నామిని తెలుగు సాహిత్యానికి ఏం చేసినా చెయ్యకపోయినా పుస్తక ప్రచురణ విక్రయాల్లో ఒక పని చేసి చూపించాడు. తానే ముద్రించి, పుస్తకాల సంచులు పల్లె పల్లెల్లో బడులకి మోసుకెళ్ళి అమ్మే ప్రయత్నం చేశాడు. ఇన్ని కబుర్లు చెప్పేవాళ్ళం, సాహిత్యాన్ని గురించి ఇంత బాధపడేవాళ్ళం, ఎంత మందిమి అతను చేసిన దానిలో పదోవంతు చెయ్యడానికి సిద్ధంగా ఉన్నాం?

దీన్ని గురించి చెప్పాల్సింది ఇంకా చాలా ఉంది. ఇంకో పూట కొనసాగిస్తా. ఇంకొక్క మాట చెప్పేసి ఈ టపాని అచ్చేసెయ్యాలి. ఆఫీసు పని పిలుస్తోంది.

ఉరుమురిమి మంగలం మీద పడ్డట్టు హేలీగారు బుచ్చిబాబు చివరకు మిగిలేది మీద ధూమకేతువులాగా విరుచుకుపడ్డారు పుస్తకం సైట్లోనే. ఎన్నో దశాబ్దాలుగా ఆధునిక తెలుగు సాహిత్యంలో క్లాసిక్ గా వెలుగుతున్న ఈ నవల పట్ల హేలీ రాసింది అమర్యాదగానూ, అభ్యంతరకరంగానూ ఉన్నదని పలువురు పాఠకులు అభ్యంతర పెట్తడం ఆసక్తికరంగా ఉన్నది. హేలీ ఆ పుస్తకాన్ని పూర్తిగా కానీ సరైన దృష్టితోకానీ అర్ధం చేసుకుని ఉండకపోవచ్చు (ఆ మాటకొస్తే ఏది సరైన దృష్టి?) తన అభిప్రాయాన్ని కొంచెం కోంటెతనంగా కొంచెం వ్యంగ్యంగా చెప్పారు - సాహిత్యంలో కొంటెతనం ఎప్పణ్ణించీ నేరమయింది? ఏమో, నాకైతే హేలీ చెప్పినదాన్లో ఏదీ అభ్యంతరకరంగా, అంత బాధపడిపో వలసినట్టుగా లేదు. నేను ఎవర్నీ తప్పు పట్టడం లేదుగానీ తట్టిన ఒక ఆలోచనని మీముందు పెట్టకుండా ఉండలేకపోతున్నా. ఇటీవల యార్లగడ్డ ద్రౌపది నవల నేపథ్యంలో భారతీయ (హిందూ మత అని చదువుకోండి, పర్లేదు) ఎవర్ గ్రీన్ క్లాసిక్ అయిన మహాభారతాన్ని ఆధునికులు తమకి నచ్చినట్టు ఇంటర్ప్రెట్ చేసుకోడానికి అవకాశం ఉన్నదీ అని వాదించిన వారే .. చివరకు మిగిలేది అనే ఆధునిక క్లాసిక్ ని హేలీ అనే అత్యాధునికుడు తనదైన ఇంటర్ప్రెటేషన్‌తో చూస్తే అభ్యంతర మెందుకు? అతను చెప్పినది సరైన అవగాహన కాదని ఉలుకెందుకు? ఆధునికత అనేది తమతోనే ఆగిపోతుందా?

Interesting, don't you think?

Friday, February 19, 2010

హైదరాబాదు పుస్తకావిష్కరణ ఆహ్వానం

పేగుకాలిన వాసన
ఎ. ఎన్. జగన్నాథ శర్మ కథల సంపుటి
ఆవిష్కరణ సభ

ఫిబ్రవరి 22, 2010
సోమవారం సాయంత్రం 6 గంటలకు
పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం
నాంపల్లి
హైదరాబాదు

ఆహ్వాన పత్రిక

Thursday, February 18, 2010

కథనెలా చదవాలి?

కౌముది జాల పత్రిక ఫిబ్రవరి సంచికలో గోపీచంద్ కథ ధర్మవడ్డీ ప్రచురించారు.

ఒక కథ గురించి కూలంకషంగా మాట్లాడుకోడానికి మనకిది సదవకాశం.

మీ ఆలోచనలకి కొంచెం చురుకు పుట్టించడానికి నా తరపునించి కొన్ని ప్రశ్నలు.

ఈ కథ చెప్పింది (narrator) ఎవరు? రచయితకీ కథకుడికీ తేడా తెలుసుకోవాలంటే ముందోసారి ఈ టపా చదవండి.
దీనికి కొసరు ప్రశ్న: మీ దృష్టిలో ఈ కథలో కథకుడూ రచయితా ఒకరేనా?
ఈ కథ చెప్పడానికి వాడిన టెక్నిక్ కీ, "ఫలాని ఊళ్ళో సూరయ్య అనే షావుకారుండేవాడు. అతనికి ఇలా ఇలా జరిగింది" అని తిన్నగా చెప్పే టెక్నిక్‌కీ తేడా ఏంటి?
తిన్నగా చెప్పకుండా కథ చెప్పడానికి రచయిత ఉపయోగించిన టెక్నిక్ వల్ల అదనంగా సాధించిన ప్రయోజన మేవన్నా ఉందా?

కథ మొదట్లో సూరయ్య ప్రవేశించగానే అతన్ని గురించి మీకేమనిపించింది?
కథ జరుగుతున్న కొద్దీ ఆ అభిప్రాయం మారుతూ వచ్చిందా? ఎన్నిసార్లు మారింది, ఎలా మారింది?

సూరయ్య పాత్రలో గమనించాల్సిన విషయాలేవిటి? ముఖ్య లక్షణాలేవిటి?
సూరయ్య జీవితంలో ఓడిపోయాడా? అతను ఓడిపోవడానికి తానే ఎంత కారణం? చంద్రయ్య ఎంత కారణం? సమాజం ఎంత కారణం?

కథలో బావి దగ్గర జరిగే క్లైమాక్సు అవసరమా? ఆ క్లైమాక్సు లేకుండా ఉండి ఉంటే కథ ఎలాగుండేది? క్లైమాక్సు ద్వారా రచయిత ఎటువంటి అదనమైన ప్రయోజనం సాధించారు?

ఈ కథ ద్వారా రచయిత మనకి ఏం చెప్ప దలుచుకున్నారు? సూరయ్య లాగా ఉండొద్దనా? సమాజం కౄరమైనదనా? సూరయ్యలాంటీ వాళ్ళని చూసి జాలి పడమనా? కేవలం పాఠకులకి ఒక దుఃఖానుభూతి మిగల్చడమా? ఇవేవీ కాక మరేమన్నానా?

చివరిగా - మీ దృష్టిలో ఇది మంచి కథా? కాదా?

మీ అభిప్రాయాలు ఇక్కడ వ్యాఖ్యలుగా గానీ మీ మీ బ్లాగుల్లో టపాలుగా గానీ రాయండి.

Tuesday, February 16, 2010

పోలీసు గూండాయిజం

ఇన్నాళ్ళకి మీడియాకి అనుభవమైంది పోలీసు రాజ్యం ఎలా ఉంటుందో.

ఇందిరాగాంధీ దేశం మీద కప్పిన అత్యవసర పరిస్థితి అనే నల్ల గొంగళీ తొలగినాక పోలీసు భూతం మాంత్రికుడి సీసాలోకి వెళ్ళిపోయినట్టే భ్రమ కల్పించింది ఇన్నాళ్ళూ. ముఖ్యంగా మన రాష్ట్రంలో గత పదేళ్ళలో ఎక్కడా సామాన్య మానవుల్ని భయపెట్టకుండా, సదా మీ సేవలో అంటూ, మీడియా వాళ్లతో మంచిగా ఉంటూ. కానీ భూతం భూతమే మాయ సీసాలో ఉన్నా, మందు సీసాలో ఉన్నా. చంద్రబాబు మీద అలిపిరిలో దాడి జరిగిన దరిమిల నల్లమల అడవుల్లో చెంచుల మీద జరిగిన పోలీసు అత్యాచారాలు ఎవరికి పట్టినాయి? బాక్సైటు గనుల నెదిరించినందుకు విశాఖ గిరిజనులు తిన్న చావుదెబ్బలు ఎవరికి పట్టినాయి? అనేక జలయజ్ఞాల్లో ముంపులకి గురై నిరావాసులై సమిధలై పోయిన వారి గొడవలు ఎవరికి పట్టినాయి.
60 లలో తెలంగాణ కావాలని అరిచినందుకు ఆనాడు తెలంగాణ వాసులు బాగానే రుచి చూశారు పోలీసు దెబ్బల్ని.
70 లలో విశాలాంధ్ర కావాలని అరిచినందుకు ఆనాడు విజయవాడ వాసులు బాగానే రుచి చూశారు పోలీసు దెబ్బల్ని.

మీడియా అతిరథ మహారథులారా .. మీరూ రుచిచూడండి మరి. ఎందుకంటే, ఈ పోలీసు రాజ్యంలో మీరూ పౌరులే. మీకూ సమాన హక్కులున్నాయి సామాన్యపౌరులతో సమానంగా ..

భూతాన్ని సీసాలోకి పంపి బిరడా పెట్టెయ్యగల మంత్రికుడి కోసం చూస్తున్నా!
*** *** ***
ఫిబ్రవరి 16 ఆంధ్రజ్యోతి దినపత్రిక నించి:
"క్యాసెట్ ఇచ్చేందుకు వెళ్తుండగా...:
అప్పటిదాకా జరిగిన దాడులు, ప్రతిదాడులను 'బి' హాస్టల్ ప్రాంతంలో ఉన్న 'ఏబీఎన్ ఆంధ్రజ్యోతి' ప్రతినిధి నర్సింగరావు కవర్ చేశారు. రికార్డు చేసిన క్యాసెట్‌ను ఉస్మానియా వర్సిటీ పోలీస్‌స్టేషన్ పక్కనే ఉన్న చానల్ లైవ్ వాహనంలోని సిబ్బందికి ఇచ్చేందుకు బైక్‌పై బయలుదేరారు. అంతలో ఆఫీస్ నుంచి ఫోన్ రావడంతో ఆర్ట్స్ కాలేజీ సమీపంలో బైక్‌ను పక్కకు ఆపి మాట్లాడుతున్నారు.
ఆ సమయంలో ఇరువైపుల నుంచి రాళ్లు వర్షంలా వచ్చి పడుతుండటంతో ముందుకు కదలబోయారు. అంతలోనే గ్రేహౌండ్స్ కానిస్టేబుళ్లు కొందరు వెనక నుంచి వచ్చి నర్సింగ్ రావును చుట్టుముట్టారు. వచ్చీ రావడంతోనే ఓ కానిస్టేబుల్ లాఠీతో తలపై బలంగా కొట్టాడు. దీంతో నర్సింగ్‌రావు నేలపై పడిపోయారు.

తాను మీడియా ప్రతినిధినంటూ గుర్తింపు కార్డును, చేతిలో ఉన్న 'ఏబీఎన్ ఆంధ్రజ్యోతి' లోగోను చూపిస్తున్నా గ్రేహౌండ్స్ పోలీసులు పట్టించుకోలేదు. బైక్ మీద నుంచి రోడ్డుపై పడేసి బూటు కాళ్లతో విచక్షణారహితంగా తన్నారు. లాఠీలతో చితకబాదారు.

లోగోను నేలపై పడేసి తొక్కారు. ఈ దాడిలో నర్సింగ్‌రావు తల పగిలిపోయింది. వీపు మొత్తం వాతలుతేలాయి. తీవ్ర గాయాలతో పడిపోయిన నర్సింగ్‌రావును పోలీసులు బలవంతంగా లేపారు. విద్యార్థుల వైపు నుంచి వస్తున్న రాళ్ల నుంచి కాచుకునేందుకు నర్సింగ్‌రావును అడ్డుపెట్టుకున్నారు.

'మీరు రాళ్లు రువ్వితే తగిలేది ఇతనికే' అంటూ... నర్సింగ్‌రావును లాఠీలతో కొడుతూ ముందుకు వెళ్లారు. కొన్ని నిమిషాలపాటు ఈ హింస కొనసాగింది. ఇది చూసి చూసి సహనం నశించిన విద్యార్థులు... సుమారు 200 మంది ఒక్కసారిగా గ్రేహౌండ్స్ పోలీసులపైకి దూసుకొచ్చారు. దీంతో గ్రేహౌండ్స్ సిబ్బంది నర్సింగ్‌రావును వదిలిపెట్టి వెనక్కి పరుగులు తీశారు. నర్సింగ్‌రావును విద్యార్థులే ఆస్పత్రికి తరలించారు."

Sunday, February 14, 2010

ఆంధ్రజ్యోతిలో నా పుస్తకం సమీక్ష

Thank you, Venu Srikanth, for the JPG!

Monday, February 8, 2010

Rangutaddaala Kitikee - Telugu short stories


I am happy to announce that my Telugu short story collection - Rangutaddaala Kitikee is now available in the US.

Please use the Paypal or Google Checkout options in the side bar of this blog to purchase your copy.

కీలక పదాలు: రంగుటద్దాల కిటికీ, అమెరికా తెలుగు కథలు, తెలుగు కథానికలు, కథల సంపుటి, కథా సంకలనం, ఎస్. నారాయణస్వామి కథలు, Telugu stories, America Telugu stories, Telugu story book

Saturday, February 6, 2010

ఈనాడు సండే స్పెషల్లో నా కథలపుస్తకం పరిచయం

నా కథల సంపుటి రంగుటద్దాల కిటికీకి వేణు గారు రాసిన పరిచయం ఇక్కడ.
నెనర్లు, వేణుగారూ.

Friday, February 5, 2010

మూర్తీభవించిన వ్యక్తిత్వ బలం

కొందరుంటారు, తమ ఉనికితో ప్రపంచమ్మీద చెరగని ముద్ర వేసేస్తారు. ఎలాంటి ముద్ర అంటే, అటుపైన ప్రపంచ చరిత్రని .. వారికి ముందు - వారికి తర్వాత అని తలుచుకునేంతగా .. ఒక బుద్ధుడు, ఒక ఏసు, ఒక గాంధీ.

కొందరుంటారు. వీళ్ళు ప్రపంచమ్మీద ముద్రలు వెయ్యక పోవచ్చు కానీ వారి పరిధిలోకి వచ్చిన తోటి మనుషులెవ్వరూ, వారిని ఒక్కసారి మాత్రమే కలిసినా, సులభంగా మర్చిపోలేరు.
అలాంటి వ్యక్తిత్వ బలశాలి మా మామగారు శ్రీ ఎం వీ సుబ్బారావుగారు.

క్రమశిక్షణ, సమయపాలన, ఇచ్చినమాట నిలబెట్టుకోవడం, జ్ఞాన సముపార్జన, ఆత్మవిశ్వాసం, హేతువాదదృక్పథం .. ఆయన అణువణువులో నిండివున్న సుగుణాలు. వాటినే కడదాకా ఆచరించారు. వృత్తికి వృక్షశాస్త్రాధ్యాపకులైనా వారి జ్ఞానతృష్ణ ఇటు సాంప్రదాయ తెలుగు సాహిత్యంనించీ అటు సమకాలీన అంతర్జాతీయ రాజకీయాలవరకూ ఆపోసన పట్టించింది. పద్యాల్ని అలవోకగా ఉదహరించేవారు. భాషా సంకరాన్ని అస్సలు సహించేవారు కాదు. అమెరికాలో ఉన్న కాలంలో స్థానిక అమెరికను దినపత్రిక ఒకదానికి ఉత్తరం రాస్తూ, పనిలో పనిగా ఆ పత్రికా విలేకరి రాసిన అపభ్రంశపు ఇంగ్లీషుని విమర్శించారు. తన భౌతికకాయాన్ని వైద్యవిద్యాలయానికి దానం చెయ్యడం ఆయన హేతువాదదృష్టికి పరాకాష్ట.

వీటన్నిటికంటే ఆయనలో ఉన్న గొప్ప లక్షణం .. ఆయన జీవితాన్ని ప్రేమించారు. అనుభవించి ఆస్వాదించి ఆనందించారు. ఏనాడూ ఎందొకొచ్చిన బతుకురా ఇదీ అనుకోలేదు. అంతా సవ్యంగా ఉన్నప్పుడు ఎంత కులాసాగా ఉన్నారో, మెడలు వంచే కష్టాలు మీదపడినప్పుడూ అంతే స్థైర్యంతో ఉన్నారు. కొత్తని ఎప్పుడూ ఆహ్వానించారు. సుమారు పదేళ్ళ కిందట కంప్యూటర్ కొనుక్కుని, తనకు తానే ఇంటర్నెట్ వాడకం నేర్చుకున్నారు. విజయవాడ పుస్తకోత్సవంలో తెలుగుబ్లాగర్లని కలుసుకుని అటుపై బ్లాగులు తరచుగా చదువుతూండేవారు. తానూ రాయాలని ఉత్సాహపడ్డారు కానీ కంప్యూటరు ముందు ఎక్కువసేపు కూర్చునే ఓపికపోయిందని ఆ ఆలోచన విరమించుకున్నారు. గత డిసెంబరులో వారి చేతుల మీదుగా నా కథల తొలి సంపుటం ఆవిష్కృతమవడం నాకు మరిచిపోలేని అనుభవం.

భారతీయ సైన్యంలో మేజర్,
ఏలూరు సి ఆర్ ఆర్ కళాశాలలో వృక్షశాస్త్ర శాఖాధిపతి,
హాస్టలు వార్డెన్,
ఎన్ సీ సీ కమాండర్,
ఎందరికో మాస్టారు,
ఆదర్శప్రాయుడైన అగ్రజుడు,
ప్రేమగా చూసుకున్న భర్త,
క్రమశిక్షణతో పెంచిన తండ్రి,
గౌరవాస్పదులైన మామగారు,
ముద్దు చేసే తాత.మాస్టారూ! మీరెప్పుడూ మా మనసుల్లోనే ఉంటారు. మీ వ్యక్తిత్వబలం మా చేతలకు చైతన్యమిస్తూనే ఉంటుంది.