మూర్తీభవించిన వ్యక్తిత్వ బలం

కొందరుంటారు, తమ ఉనికితో ప్రపంచమ్మీద చెరగని ముద్ర వేసేస్తారు. ఎలాంటి ముద్ర అంటే, అటుపైన ప్రపంచ చరిత్రని .. వారికి ముందు - వారికి తర్వాత అని తలుచుకునేంతగా .. ఒక బుద్ధుడు, ఒక ఏసు, ఒక గాంధీ.

కొందరుంటారు. వీళ్ళు ప్రపంచమ్మీద ముద్రలు వెయ్యక పోవచ్చు కానీ వారి పరిధిలోకి వచ్చిన తోటి మనుషులెవ్వరూ, వారిని ఒక్కసారి మాత్రమే కలిసినా, సులభంగా మర్చిపోలేరు.
అలాంటి వ్యక్తిత్వ బలశాలి మా మామగారు శ్రీ ఎం వీ సుబ్బారావుగారు.

క్రమశిక్షణ, సమయపాలన, ఇచ్చినమాట నిలబెట్టుకోవడం, జ్ఞాన సముపార్జన, ఆత్మవిశ్వాసం, హేతువాదదృక్పథం .. ఆయన అణువణువులో నిండివున్న సుగుణాలు. వాటినే కడదాకా ఆచరించారు. వృత్తికి వృక్షశాస్త్రాధ్యాపకులైనా వారి జ్ఞానతృష్ణ ఇటు సాంప్రదాయ తెలుగు సాహిత్యంనించీ అటు సమకాలీన అంతర్జాతీయ రాజకీయాలవరకూ ఆపోసన పట్టించింది. పద్యాల్ని అలవోకగా ఉదహరించేవారు. భాషా సంకరాన్ని అస్సలు సహించేవారు కాదు. అమెరికాలో ఉన్న కాలంలో స్థానిక అమెరికను దినపత్రిక ఒకదానికి ఉత్తరం రాస్తూ, పనిలో పనిగా ఆ పత్రికా విలేకరి రాసిన అపభ్రంశపు ఇంగ్లీషుని విమర్శించారు. తన భౌతికకాయాన్ని వైద్యవిద్యాలయానికి దానం చెయ్యడం ఆయన హేతువాదదృష్టికి పరాకాష్ట.

వీటన్నిటికంటే ఆయనలో ఉన్న గొప్ప లక్షణం .. ఆయన జీవితాన్ని ప్రేమించారు. అనుభవించి ఆస్వాదించి ఆనందించారు. ఏనాడూ ఎందొకొచ్చిన బతుకురా ఇదీ అనుకోలేదు. అంతా సవ్యంగా ఉన్నప్పుడు ఎంత కులాసాగా ఉన్నారో, మెడలు వంచే కష్టాలు మీదపడినప్పుడూ అంతే స్థైర్యంతో ఉన్నారు. కొత్తని ఎప్పుడూ ఆహ్వానించారు. సుమారు పదేళ్ళ కిందట కంప్యూటర్ కొనుక్కుని, తనకు తానే ఇంటర్నెట్ వాడకం నేర్చుకున్నారు. విజయవాడ పుస్తకోత్సవంలో తెలుగుబ్లాగర్లని కలుసుకుని అటుపై బ్లాగులు తరచుగా చదువుతూండేవారు. తానూ రాయాలని ఉత్సాహపడ్డారు కానీ కంప్యూటరు ముందు ఎక్కువసేపు కూర్చునే ఓపికపోయిందని ఆ ఆలోచన విరమించుకున్నారు. గత డిసెంబరులో వారి చేతుల మీదుగా నా కథల తొలి సంపుటం ఆవిష్కృతమవడం నాకు మరిచిపోలేని అనుభవం.

భారతీయ సైన్యంలో మేజర్,
ఏలూరు సి ఆర్ ఆర్ కళాశాలలో వృక్షశాస్త్ర శాఖాధిపతి,
హాస్టలు వార్డెన్,
ఎన్ సీ సీ కమాండర్,
ఎందరికో మాస్టారు,
ఆదర్శప్రాయుడైన అగ్రజుడు,
ప్రేమగా చూసుకున్న భర్త,
క్రమశిక్షణతో పెంచిన తండ్రి,
గౌరవాస్పదులైన మామగారు,
ముద్దు చేసే తాత.



మాస్టారూ! మీరెప్పుడూ మా మనసుల్లోనే ఉంటారు. మీ వ్యక్తిత్వబలం మా చేతలకు చైతన్యమిస్తూనే ఉంటుంది.

Comments

Kalpana Rentala said…
సుబ్బారావు గారి విశిష్ట వ్యక్తిత్వానికి వందనాలు. ఆయన ఆత్మ కు శాంతి కలగాలి.
seshachary said…
I remember him as I was a student of CRR College during 1964-1967. He was having a scar on his face and to differentiate from other lecturers named Subba Rao, he was referred to as SCAR SUBBA RAO. I have very good recollections of his teaching Botany to us. Pray may his soul rest in peace.
I am glad he has a worthy Son-in-Law
Hima bindu said…
శిరాకదంబం బ్లాగ్ లో చూసానండి విషాదవార్త .వారి ఆత్మా కి శాంతి కలగాలని ,మీరందరు ఆ దుఖం నుండి త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను .
SRRao said…
కొంతమందితో కొన్ని సంవత్సరాల పరిచయమున్నా వారి మనస్తత్వాన్ని, వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకోలేం ! కానీ మీ పుస్తక ఆవిష్కరణ సభలో ఆయనతో మాట్లాడినది కేవలం రెండు నిముషాలే అయినా ఆయనతో సుదీర్ఘ పరిచయం ఉన్న అనుభూతి కలిగింది. దానికి కారణం బహుశా మా నాన్నగారిని గుర్తుకు తేవడం కావచ్చు. ఆయన కూడా కాలేజీ లెక్చరర్ గా, ప్రిన్సిపల్ గా పనిచేసారు. మిలటరీలో పనిచెయ్యకపోయినా మిలటరీ డిసిప్లిన్ ఉండేది. కొన్ని వ్యక్తిత్వాలని సంవత్సరాలు గడచిపోయినా మర్చిపోలేం ! ఆయన ఆత్మకు శాంతి కలగాలని, మీరు, సావిత్రిగారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ......
మురళి said…
వారి స్మృతులని తలుచుకుని స్ఫూర్తి పొందడం మినహా మరేమీ చేయలేని సందర్భమిది.. వారికి ఆత్మశాంతి కలగాలని కోరుకుంటూ, మీకు నా ప్రగాఢ సానుభూతి..
తృష్ణ said…
వారి ఆత్మా కి శాంతి కలగాలని ...మీరందరు ఆ దుఖం నుండి త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను...
వీరిని కలవలేకపోయాననే చింత నాకు ఎప్పటికీ ఉంటుంది :( ఆయన ఆత్మకి శాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను..
తమ తమ బ్లాగుల్లోనూ, ఇక్కడ వ్యాఖ్యల ద్వారానూ, మాకు వ్యక్తిగతంగానూ సహానుభూతినిచ్చిన బ్లాగ్మిత్రులందరికీ సావిత్రీ నేనూ పేరు పేరునా కృతజ్ఞతలు వెల్లడించుకుంటున్నాము.

Thank you, friends!
భావన said…
ఆయన హేతువాద/మానవతా దృక్పధం సేవా నిరతి కు నివాళు లర్పిస్తూ వారి ఆత్మ కు శాంతి కలగాలని మనస్పూర్థి గా కోరుకుంటున్నాను.
రవి said…
కొత్తపాళీ గారు, మీరు సాధ్యమైనంత క్లుప్తంగా చెప్పినప్పటికీ, నాకు అర్థమవుతూంది. ఎందుకంటే, మీరు మా మామయ్యను గుర్తు చేశారు.

మీ మామయ్యకు ఆత్మశాంతి కలుగాలని ప్రార్థిస్తున్నాను.
sunita said…
మీరు, సావిత్రిగారు త్వరగా కోలుకోవాలని,ఆయన ఆత్మకి శాంతి కలగాలని కోరుకుంటున్నాను..