కథనెలా చదవాలి?

కౌముది జాల పత్రిక ఫిబ్రవరి సంచికలో గోపీచంద్ కథ ధర్మవడ్డీ ప్రచురించారు.

ఒక కథ గురించి కూలంకషంగా మాట్లాడుకోడానికి మనకిది సదవకాశం.

మీ ఆలోచనలకి కొంచెం చురుకు పుట్టించడానికి నా తరపునించి కొన్ని ప్రశ్నలు.

ఈ కథ చెప్పింది (narrator) ఎవరు? రచయితకీ కథకుడికీ తేడా తెలుసుకోవాలంటే ముందోసారి ఈ టపా చదవండి.
దీనికి కొసరు ప్రశ్న: మీ దృష్టిలో ఈ కథలో కథకుడూ రచయితా ఒకరేనా?
ఈ కథ చెప్పడానికి వాడిన టెక్నిక్ కీ, "ఫలాని ఊళ్ళో సూరయ్య అనే షావుకారుండేవాడు. అతనికి ఇలా ఇలా జరిగింది" అని తిన్నగా చెప్పే టెక్నిక్‌కీ తేడా ఏంటి?
తిన్నగా చెప్పకుండా కథ చెప్పడానికి రచయిత ఉపయోగించిన టెక్నిక్ వల్ల అదనంగా సాధించిన ప్రయోజన మేవన్నా ఉందా?

కథ మొదట్లో సూరయ్య ప్రవేశించగానే అతన్ని గురించి మీకేమనిపించింది?
కథ జరుగుతున్న కొద్దీ ఆ అభిప్రాయం మారుతూ వచ్చిందా? ఎన్నిసార్లు మారింది, ఎలా మారింది?

సూరయ్య పాత్రలో గమనించాల్సిన విషయాలేవిటి? ముఖ్య లక్షణాలేవిటి?
సూరయ్య జీవితంలో ఓడిపోయాడా? అతను ఓడిపోవడానికి తానే ఎంత కారణం? చంద్రయ్య ఎంత కారణం? సమాజం ఎంత కారణం?

కథలో బావి దగ్గర జరిగే క్లైమాక్సు అవసరమా? ఆ క్లైమాక్సు లేకుండా ఉండి ఉంటే కథ ఎలాగుండేది? క్లైమాక్సు ద్వారా రచయిత ఎటువంటి అదనమైన ప్రయోజనం సాధించారు?

ఈ కథ ద్వారా రచయిత మనకి ఏం చెప్ప దలుచుకున్నారు? సూరయ్య లాగా ఉండొద్దనా? సమాజం కౄరమైనదనా? సూరయ్యలాంటీ వాళ్ళని చూసి జాలి పడమనా? కేవలం పాఠకులకి ఒక దుఃఖానుభూతి మిగల్చడమా? ఇవేవీ కాక మరేమన్నానా?

చివరిగా - మీ దృష్టిలో ఇది మంచి కథా? కాదా?

మీ అభిప్రాయాలు ఇక్కడ వ్యాఖ్యలుగా గానీ మీ మీ బ్లాగుల్లో టపాలుగా గానీ రాయండి.

Comments

Anil Dasari said…
>> "కథ మొదట్లో సూరయ్య ప్రవేశించగానే అతన్ని గురించి మీకేమనిపించింది?"

ఏమీ అనిపించలేదు. Too early to feel anything - at least, for me :-)

>> "కథ జరుగుతున్న కొద్దీ ఆ అభిప్రాయం మారుతూ వచ్చిందా? ఎన్నిసార్లు మారింది, ఎలా మారింది?"

రెండో పేజీలో ఒకేసారి మారి, అక్కడే స్థిరంగా నిలబడిపోయింది. అప్పుడే వెలిగింది, సూరయ్యో పిచ్చివాడయ్యుంటాడని. ఆ వెంటనే అర్ధమైపోయింది - అతనలా ఎందుకు తయారయ్యుంటాడనేదీ. ఆ తర్వాత మిగతా కథపై ఆసక్తి పోయింది.

>> "తిన్నగా చెప్పకుండా కథ చెప్పడానికి రచయిత ఉపయోగించిన టెక్నిక్ వల్ల అదనంగా సాధించిన ప్రయోజన మేవన్నా ఉందా?"

ఉత్తమ పురుషంలో కథ చెప్పటం వల్ల ప్రయోజనాలు చాలా ఉంటాయి. మీకు తెలీకడిగారనుకోను ;-) కానీ గోపీచంద్ ఆ పని అంత సవ్యంగా చేసినట్లు నాకనిపించలేదు. 'ఈ మాటకి సూరయ్య సంతోషం పైకి కనపడనీయకుండా' అనటమేంటి? అతను సంతోషం దాచుకుంటున్నాడో లేదో కథకుడికి ఎలా తెలుసు? 'నేను' కథ చెప్పేటప్పుడు అతను గమనించిన విషయాలు చెప్పగలుగుతాడే తప్ప అవతలివారి మదిలో దూరి వాళ్ల భావాలు పట్టుకుని మరీ ఎలా చెప్పగలుగుతాడు? ఈ కథకుడు సూరయ్యే అనుకోవాలా? అది చాలా కృతకంగా ఉంది.
చిన్నపిల్లల కథని పెద్దవాళ్ళ కోసం మార్చి వ్రాసే ప్రయత్నంలా అనిపించిందీ కథ. కాకపోతే పిల్లల కథల్లో లోభికి కష్టాలు "విథి" వశాత్తూనో, "దేవుడి" వల్లనో వస్తాయి. ఇక్కడ "సమాజం" వల్ల వచ్చాయి. చిన్నపిల్లల కథలో లోభి మీద జాలి కలిగించాల్సిన అవసరం లేదు. ఇక్కడ అది అదనంగా అవసరమై, దానికోసం సినిమా కష్టాలు సృష్టించాల్సి వచ్చింది. అతనిచ్చిన సంచీలో రాళ్ళున్నాయని తెలియగానే అతని కథ బోధపడింది. కాని ఇంకా ఏమైనా ఉంటుందేమో అన్న ఉద్దేశంతో చివరిదాకా చదివాను.

ఈ కథలో కథకుడు నా ఉద్దేశంలో రచయిత స్నేహితుడు. రచయిత పాఠకునిలా శ్రోత అయ్యాడు. ఒక కథలా కాక నిజంగా జరిగిన ఒక సంఘటనని చెపుతున్న అనుభూతిని తెప్పించడం కోసం (ఇది పెద్దవాళ్ళకి కాబట్టి) ఇలా చేసినట్టుంది. 'ఈ మాటకి సూరయ్య సంతోషం పైకి కనపడనీయకుండా' గురించి అబ్రకదబ్రాగారికి వచ్చిన అనుమానమే నాకూ వచ్చింది. లోపల సంతోషంగా ఉన్నా బయటకి కనిపించని ప్రయత్నం సూరయ్య హావభావాలలో అతనికి కనిపించి ఉండవచ్చునని సరిపెట్టుకున్నాను.

"సూరయ్య పాత్రలో గమనించాల్సిన విషయాలేవిటి? ముఖ్య లక్షణాలేవిటి? సూరయ్య జీవితంలో ఓడిపోయాడా? అతను ఓడిపోవడానికి తానే ఎంత కారణం? చంద్రయ్య ఎంత కారణం? సమాజం ఎంత కారణం?"

ఈ కథలో సూరయ్య, చంద్రయ్య, సమాజమూ అందరూ మూసలే. చిన్నపిల్లల కథల్లో ఉండే ఈ లక్షణం ఈ కథ అధిగమించ లేకపోయింది. అంచేత మీరడిగిన ప్రశ్నల గురించి చర్చించి పెద్ద ప్రయోజనం లేదనుకుంటున్నాను.

"కథలో బావి దగ్గర జరిగే క్లైమాక్సు అవసరమా? ఆ క్లైమాక్సు లేకుండా ఉండి ఉంటే కథ ఎలాగుండేది? క్లైమాక్సు ద్వారా రచయిత ఎటువంటి అదనమైన ప్రయోజనం సాధించారు?"

పిచ్చిపట్టినా కూడా అతనికి వదలని డబ్బుపిచ్చి, ఆ డబ్బు రాళ్ళ రూపంలో కూడా అతన్ని మళ్ళీ ఎలా ముంచేసిందో సింబాలిగ్గా చెప్పడానికే ఆ ముగింపు ఉన్నట్టు అనిపించింఇది. కాస్త సెంటిమెంటు పెంచడానికి కూడా ఉపయోగపడుతుందేమో.

సున్నితహృదయులకి సూరయ్య పాత్రమీద జాలి కలుగుతుందేమో కాని కఠినహృదయుణ్ణైన నాకు అలాంటిదేమీ కలగలేదు :-) దీనికన్నా చిన్నపిల్లల కథ చిన్నపిల్ల కథలా చెప్పుకుంటేనే బాగుంటుందనిపించింది.
నేను ఈ కధ కౌముది వారు ప్రచురించినపుడు చదివాను .... మంచికధా చెడ్డకధా అని ఆలోచించలేదు గానీయండి - చదివి మంచిపనే చేశాను అని అనిపించింది.
నేను మొదటి సారి చదినప్పుడు ఇది రెండు తరాల ముందు కధ అనుకొని చదివాను. అప్పుడు చిన్నపిల్లల కథ అనీ అనిపించలేదు.
కానీ ఇక్కడ అబ్రకదబ్ర మరియు కామేశ్వర రావు గార్ల వ్యాఖ్యలు చూసిన తరువాత...

మీ దృష్టిలో ఈ కథలో కథకుడూ రచయితా ఒకరేనా?
అవును.
[మీ పాత టపాలోనూ .. మాలతిగారి వరుసటపాలలోనూ ఈ చర్చ చదివి కాస్త లాభం పొందుదామని చూశ కనీయండి, అన్నప్రాసన రోజే అవకాయలా అనిపించింది.
ఐతే ఈ ప్రశ్న కి ఎందుకు ఇంత ప్రాధాన్యత అన్నది నాకు అర్ధం కాని ప్రశ్న...
"నాపక్కింటి సుబ్బారావు చిన ఉద్యోగస్తుడు , మృదు స్వభావి కానీ పాపం బార్యాబాధితుడు, మొన్న సెలవరోజు మధ్యాన్నం భోజనాంతరం ఓ కునుకు తీద్దామని, హాయిగా గాలి వస్తుందని పెరటి వైపు తలుపు తీసీ, చాప పరచి మేను వాల్చీ వాల్చగానే .. వారి బావి పళ్ళెం వద్ద నుంచి మాటలు వినపడసాగాయి"
అని చెబితే రచయితా కధకుడూ వేరయినట్టేనా? సొంత అక్కసు ని సుబ్బారావు అనే తడిక మీదకు నెట్టి వెళ్లగక్కవచ్చు కదా? లేదు పాపం పక్కింటి సుబ్బారావును బయట పడవేయటమెందుకూ .. అసలే కధల కింద .. ఇప్పుడు మన సెల్ ఫొన్ నంబర్లు కూడ వేస్తున్నారురాబాబూ ... ఎవడు ఫోన్ చేసి ఏమి అడిగితే ఏమి చెప్పాల్సి వస్తుందో, ఎందుకొచ్చినలేనిపోని గొడవ అని ఇదే సుబ్బారావు కధని...
" నా అక్క కూతురూ, నా భార్యా అని చెప్పటం కాదు గానీ, గిరిజ చాలా మంచిది. కాక పోతే కాస్త ముక్కు మీద కోపం, తోడు ఒక పట్టాన ఎవరి మాటా వినని పంతం".. అంటూ మొదలు పెడితే ... రచయితే ...భా.భా. ఐపోతాడా?...

బ్లాగుల్లోనే ఓ రచయిత భార్యాభర్తల అన్యోన్య(శూన్య)త గురించి రాస్తే... కొందరు ముక్కున వేలేసుకొని .. ఎంతైనా అనుభవైకవేద్యం అన్నారు. ఆయన మెల్లగా వచ్చి నేనింకా బ్రహ్మచారినే ...( ఇవే వాక్యాలు కాదు. ఇవే భావాలు) అన్నారు. కాబట్టి - కధను బట్టి రచయితా కధకుడు ఒకరేనా కాదా అని ఒక అభిప్రాయానికి రాలేము నా సొంత అభిప్రాయాము. వచ్చినా ( నాకు తెలిసినంత వరకు) ఒరిగేది ఏమీ ఉండదు.
కొత్తపాళీ గారి తుపాకి కధలో "కొడుకు" పాత్ర ను చూశి - నాకు తెలిసి వారికి ఒక కుమార్తె - అని మాలతి గారు అన్నారు - మాలతి గారికి ఎలానో తెలిసినది సరే .. ఈ కధ చదివే ఎంత మంది పఠయితలకు తెలుస్తుంది? ఎంతమంది విమర్శకులకు తెలుస్తుంది? ఎన్ని కధల బట్టుకొని - రచయిత కధకుడు ఒకరేనా -వేరా అని శోధించటం మొదలు పెడతారు?..
కధ చెప్పిన విధానం /పలికించిన విధానం బాగున్నంత వరకు రచయిత కధకుడు ఒకరేనే, ఇద్దరేనా .. అన్నది పట్టించుకోవలసిన విషయం కాదని నా అనుకోలు.]
{మరి అలా ఐతే అవునూ అని ఎలా చెప్పావ్ అని అడగకండి}
ఈ కథ చెప్పడానికి వాడిన టెక్నిక్ కీ, "ఫలాని ఊళ్ళో సూరయ్య అనే షావుకారుండేవాడు. అతనికి ఇలా ఇలా జరిగింది" అని తిన్నగా చెప్పే టెక్నిక్‌కీ తేడా ఏంటి?
మా ఊళ్లోనో - పలానా ఊళ్లోనో అని కాకుండా -- నేను ఒకసారి ఓ ఊరు వెల్తే అని అనటం నేను చెబుతున్నది - మీరు ఎప్పుడూ చేసే - మీ/మా ఊళ్లో కూడా ఉన్నటువంటి షావుకారు /పిచ్చివాడు కాదు .. ఓ విలక్షమైన షావుకారు /పిచ్చివాడు గురించి నేను చెబుతున్నాను అని ఊరించిటం, లేదూ - పఠయిత దృష్టిని నిల్పి ఉంచే ప్రయత్నం. [ ఒక చిన్నపిల్లల కధకి చిన్న పిల్లడి సమాధానం లా ఉంది]
తిన్నగా చెప్పకుండా కథ చెప్పడానికి రచయిత ఉపయోగించిన టెక్నిక్ వల్ల అదనంగా సాధించిన ప్రయోజన మేవన్నా ఉందా?
ఉంది. సూరయ్య పాత్రపై - అతను అలాఅవటానికి గల కారణం పై - తన అభిప్రాయలను చదువరుల పైన రుద్దడం, తద్వారా .. వారికి ఆలోచించే పని తప్పించటం.. తద్వారా తన గాటన కధని చదివించడం. [మిత్రుడు మొదలు పెట్టిన విధానం చూడండి
పాపం ఏం చెప్పను ? ఒకప్పుడు ఈ ఊళ్లోకల్లా షావుకారు......
తరువాతి ప్రశ్నకు సమాధానం గా "ఈ గతికి రావటానికి అతని తండ్రే కారణం" ]

కథ మొదట్లో సూరయ్య ప్రవేశించగానే అతన్ని గురించి మీకేమనిపించింది?
కథ జరుగుతున్న కొద్దీ ఆ అభిప్రాయం మారుతూ వచ్చిందా? ఎన్నిసార్లు మారింది, ఎలా మారింది?

ప్రవేశించినప్పుడు ఒక అభిప్రాయం, రాళ్లను చూసినప్పుడూ ఒక అభిప్రాయం.. ఐతే "నన్ను చేత్తో వారించి వాకిలి వైపు చూపించాడు" మంచి మెలిక - అక్కడ సూరయ్యను పంపివేసి ఇద్దరు స్నేహితులకి మధ్య సంభాషణ పెడితే బిగి సగానికి తగ్గేది.
'ఈ మాటకి సూరయ్య సంతోషం పైకి కనపడనీయకుండా' ఈ వాడుక నాకు సబబుగానే అనిపించింది ...
కథలో బావి దగ్గర జరిగే క్లైమాక్సు అవసరమా? ఆ క్లైమాక్సు లేకుండా ఉండి ఉంటే కథ ఎలాగుండేది? క్లైమాక్సు ద్వారా రచయిత ఎటువంటి అదనమైన ప్రయోజనం సాధించారు?
అవసరమే. కధ అంటు మొదలుపెట్టిన తరువాతా.. ముగింపో తార్కిక ముగింపో (Corporate భాష లో logical Conclusion) పలకాలి కదా. ఇక్కడ ముగింపే కధకుడికి సుఖం.

భవదీయుడు
ఊకదంపుడు
Anonymous said…
అయ్యా కొత్తపాళీ గారు ! మీకు ఏం అన్యాయం చేశాం సార్! ఇలాంటి ప్రశ్నలు వేసి అలాంటి కధలు చదివించి, ఎందుకు సార్ మాతో అడుకుంటారు:). అంతా స్వామి లీల.
మీ ప్రశ్నలకు జవాబు చెప్పేటంత జ్నానం లేదు కానీ , కధ బాలేదని మాత్రం చెప్పగలను.
నేను చదివే అతి కొద్ది బ్లాగుల్లో ఇష్టంగా చదివే బ్లాగు ఇదొక్కటే! దీన్ని నా నుంచి దూరం చెయ్యొద్దని అతి భయంకరంగా వేడుకుంటున్నాను .:)
నా సమాధానాలతో త్వరలో మళ్ళి వస్తా.
రవి said…
కథలు చదవడం నాకసలు రాదు. (మీరిచ్చిన అసైన్మెంట్ పూర్తీ చేసి, ఆ తర్వాత పై సమాధానాలు చదివిన తర్వాత ఆ నిజం మరింత బలపడింది) అందుకనేమో ఏవేవో కథల సంకలనాలు అనేకం ఇంట్లో ఉన్నా, ఒక్కటీ పూర్తీ చేయలేకపోయానింతవరకూ.

కథ చెప్పే విధానాన్ని బట్టి చూస్తే, ఈ కథ, ఠాగూర్ కాబూలీవాలా కథను గుర్తు తెప్పించింది.

>>తిన్నగా చెప్పకుండా కథ చెప్పడానికి రచయిత ఉపయోగించిన టెక్నిక్ వల్ల అదనంగా సాధించిన ప్రయోజన మేవన్నా >>ఉందా?

ఉందనిపించింది నాకు. తిన్నగా అయితే కథ "చెప్పడం" మాత్రమే అవుతుంది. ఈ పద్ధతిలో రచయిత కథ చెప్పడం మాత్రమే కాక, తన కథలోని పాత్రలను కూడా పరిచయం చేస్తున్నాడు. He is just not telling the story, but communicating (the emotions of his friends). ఈ సంవిధానంలో disadvantage ఏమంటే, పాత్రల స్వభావాలు, సంఘటనలు సాధ్యమైనంత సహజంగా ఉంటేనే రక్తికట్టే అవకాశం ఉంది (కాబూలీవాలా లో లాగా). అలా కాకపోతే తేలిపోవచ్చు.

పైన వ్యాఖ్యల్లో అబ్రకదబ్ర, కామేశ్వర్రావు గార్లు పాఠకుడిగా ఉంటమే కాక, విశ్లేషకుడిగా కూడా అవతారమెత్తారు. అది నాకు చేతకాలేదు. నాకు కథ చదువుతున్నంతసేపూ సూరయ్యతో పాటూ తిరుగుతున్నట్లే అనిపించింది.(ఇది నా లోపమో, రచయిత గొప్పతనమో నాకు తెలియదు)

కథలో నాకు నచ్చని విషయాలు .

సూరయ్య కూతురు, భార్యల ఆత్మహత్య. ఇది అనవసరం. సూరయ్య మీద సింపతీ కలిగించదల్చుకుంటే అది ఇలా ఉధృతంగా (magnify చేసి) చెప్పవలసిన అవసరం లేదు. సింబాలిక్ గానో, చెప్పీ చెప్పకుండానో చెప్పవచ్చు. గొల్లపూడి వారు అప్పుడెప్పుడో slum dog millionaire ను విశ్లేషిస్తూ సత్యజిత్ రే ఉదాహరణ ఒకటి చెప్పారు.సరిగ్గా అదే నేను చెప్పాలనుకున్నది. తేనెలో చీమ అన్న శ్రీరమణ కథ ఇంకో ఉదాహరణ.ఆ కథలో శీనయ్య మీద సానుభూతి కలిగించడానికి ఆయన ఇతరులను ముప్పుతిప్పలు పెట్టలేదు.

క్లైమాక్సు కూడా బావోలేదు. సూరయ్యనేమీ చేయకుండా అలా వదిలేసి ఉండవచ్చు.

రచయిత చెప్పదల్చుకుంది, "వడ్డీ" గురించని నా అభిప్రాయం. ఏదైనా చెడు తలపెడితే, దానికి అసలు, వడ్డీ తో సహా చెల్లించవలసి వస్తుందని ఓ అంతర్లీన నీతి ని చెప్పినట్టు అనుమానం. కామేష్ చెప్పినట్టు చిన్నపిల్లల కథను పెద్దవాళ్ళ కోసం టైలర్ చేసినట్టు ఉంది.
http://gollapudimaruthirao.blogspot.in/2012/02/gopichand-story-dharmavaddi.html

ఈ లంకె ఇక్కడ ఉంచటం సముచితమనిపించిందండీ