పోలీసు గూండాయిజం

ఇన్నాళ్ళకి మీడియాకి అనుభవమైంది పోలీసు రాజ్యం ఎలా ఉంటుందో.

ఇందిరాగాంధీ దేశం మీద కప్పిన అత్యవసర పరిస్థితి అనే నల్ల గొంగళీ తొలగినాక పోలీసు భూతం మాంత్రికుడి సీసాలోకి వెళ్ళిపోయినట్టే భ్రమ కల్పించింది ఇన్నాళ్ళూ. ముఖ్యంగా మన రాష్ట్రంలో గత పదేళ్ళలో ఎక్కడా సామాన్య మానవుల్ని భయపెట్టకుండా, సదా మీ సేవలో అంటూ, మీడియా వాళ్లతో మంచిగా ఉంటూ. కానీ భూతం భూతమే మాయ సీసాలో ఉన్నా, మందు సీసాలో ఉన్నా. చంద్రబాబు మీద అలిపిరిలో దాడి జరిగిన దరిమిల నల్లమల అడవుల్లో చెంచుల మీద జరిగిన పోలీసు అత్యాచారాలు ఎవరికి పట్టినాయి? బాక్సైటు గనుల నెదిరించినందుకు విశాఖ గిరిజనులు తిన్న చావుదెబ్బలు ఎవరికి పట్టినాయి? అనేక జలయజ్ఞాల్లో ముంపులకి గురై నిరావాసులై సమిధలై పోయిన వారి గొడవలు ఎవరికి పట్టినాయి.
60 లలో తెలంగాణ కావాలని అరిచినందుకు ఆనాడు తెలంగాణ వాసులు బాగానే రుచి చూశారు పోలీసు దెబ్బల్ని.
70 లలో విశాలాంధ్ర కావాలని అరిచినందుకు ఆనాడు విజయవాడ వాసులు బాగానే రుచి చూశారు పోలీసు దెబ్బల్ని.

మీడియా అతిరథ మహారథులారా .. మీరూ రుచిచూడండి మరి. ఎందుకంటే, ఈ పోలీసు రాజ్యంలో మీరూ పౌరులే. మీకూ సమాన హక్కులున్నాయి సామాన్యపౌరులతో సమానంగా ..

భూతాన్ని సీసాలోకి పంపి బిరడా పెట్టెయ్యగల మంత్రికుడి కోసం చూస్తున్నా!
*** *** ***
ఫిబ్రవరి 16 ఆంధ్రజ్యోతి దినపత్రిక నించి:
"క్యాసెట్ ఇచ్చేందుకు వెళ్తుండగా...:
అప్పటిదాకా జరిగిన దాడులు, ప్రతిదాడులను 'బి' హాస్టల్ ప్రాంతంలో ఉన్న 'ఏబీఎన్ ఆంధ్రజ్యోతి' ప్రతినిధి నర్సింగరావు కవర్ చేశారు. రికార్డు చేసిన క్యాసెట్‌ను ఉస్మానియా వర్సిటీ పోలీస్‌స్టేషన్ పక్కనే ఉన్న చానల్ లైవ్ వాహనంలోని సిబ్బందికి ఇచ్చేందుకు బైక్‌పై బయలుదేరారు. అంతలో ఆఫీస్ నుంచి ఫోన్ రావడంతో ఆర్ట్స్ కాలేజీ సమీపంలో బైక్‌ను పక్కకు ఆపి మాట్లాడుతున్నారు.
ఆ సమయంలో ఇరువైపుల నుంచి రాళ్లు వర్షంలా వచ్చి పడుతుండటంతో ముందుకు కదలబోయారు. అంతలోనే గ్రేహౌండ్స్ కానిస్టేబుళ్లు కొందరు వెనక నుంచి వచ్చి నర్సింగ్ రావును చుట్టుముట్టారు. వచ్చీ రావడంతోనే ఓ కానిస్టేబుల్ లాఠీతో తలపై బలంగా కొట్టాడు. దీంతో నర్సింగ్‌రావు నేలపై పడిపోయారు.

తాను మీడియా ప్రతినిధినంటూ గుర్తింపు కార్డును, చేతిలో ఉన్న 'ఏబీఎన్ ఆంధ్రజ్యోతి' లోగోను చూపిస్తున్నా గ్రేహౌండ్స్ పోలీసులు పట్టించుకోలేదు. బైక్ మీద నుంచి రోడ్డుపై పడేసి బూటు కాళ్లతో విచక్షణారహితంగా తన్నారు. లాఠీలతో చితకబాదారు.

లోగోను నేలపై పడేసి తొక్కారు. ఈ దాడిలో నర్సింగ్‌రావు తల పగిలిపోయింది. వీపు మొత్తం వాతలుతేలాయి. తీవ్ర గాయాలతో పడిపోయిన నర్సింగ్‌రావును పోలీసులు బలవంతంగా లేపారు. విద్యార్థుల వైపు నుంచి వస్తున్న రాళ్ల నుంచి కాచుకునేందుకు నర్సింగ్‌రావును అడ్డుపెట్టుకున్నారు.

'మీరు రాళ్లు రువ్వితే తగిలేది ఇతనికే' అంటూ... నర్సింగ్‌రావును లాఠీలతో కొడుతూ ముందుకు వెళ్లారు. కొన్ని నిమిషాలపాటు ఈ హింస కొనసాగింది. ఇది చూసి చూసి సహనం నశించిన విద్యార్థులు... సుమారు 200 మంది ఒక్కసారిగా గ్రేహౌండ్స్ పోలీసులపైకి దూసుకొచ్చారు. దీంతో గ్రేహౌండ్స్ సిబ్బంది నర్సింగ్‌రావును వదిలిపెట్టి వెనక్కి పరుగులు తీశారు. నర్సింగ్‌రావును విద్యార్థులే ఆస్పత్రికి తరలించారు."

Comments

saamaanyudu said…
మీ నుండి ఇంత ధర్మాగ్రహాన్ని ఇటీవల చూడలేదు. ధన్యవాదాలు.

ఇక్కడ న్యాయదేవతకు వందనం పేరుతొ రాసాను. చూడగలరు:http://saamaanyudu.wordpress.com/2010/02/16/%E0%B0%A8%E0%B1%8D%E0%B0%AF%E0%B0%BE%E0%B0%AF%E0%B0%A6%E0%B1%87%E0%B0%B5%E0%B0%A4%E0%B0%95%E0%B1%81-%E0%B0%B5%E0%B0%82%E0%B0%A6%E0%B0%A8%E0%B0%82/
ఆగ్రహం కాదండీ ఆక్రోశం. కానీ తమాషా తెలుసా, రేపటికల్లా మీడియా కూడా ఈ సంఘటనని మరిచిపోతుంది. పోలీసు భూతం మళ్ళీ సీసాలోకి వెళ్ళిప్పోతుంది. ఇంకోసారి బయటికొచ్చేదాకా ..
అంటే అన్నారంటారు. తంతే తన్నారంటారు. అరిస్తే అరిచారంటారు. పోలీసోళ్ళలో అరాచకత్వాన్ని పెంచిందీ, పోషించిందీ ఈ మీడియాలోని ప్రజలూ, ఈ మీడియామాయపొరలకు వంతగా సామాన్యులైన మనమూ.

మాది వాస్తేకానీ వాపు వాపు కాదు అన్నట్టు, ప్రత్యక్షానుభవమంత స్వర్గం ఇంకోటి లేదు. పిచ్చి కుదరాలంటే రోకలి చుట్టాలిగా. ఆ రోకళ్ళు బోల్డు భూతం దగ్గర. పట్టించుకుంటే అన్నీ పట్టించుకోవాలి మీరు చెప్పినట్టు. ఐతే చిన్నా చితక జర్నలిష్టులని వదిలేసి, పెద్దచేపల్ని కుమ్మేసి ఉంటే బహుబాగుండేది. భూతాన్ని బంధించాలంటేనో, స్వారీ చెయ్యాలంటేనో శార్దూలమెక్కి కార్తికేయుడు రావాల్సిందే. ఎప్పటికొస్తాడో ఆ మూర్తిమంతుడు.!!

మీరు రేపటికి మర్చిపోతారంటున్నారు, నేను ఈపాటికే మర్చిపోయుండకపోతే ఆశ్చర్యపోతానంటున్నాను.

ఇంకో పార్శ్వంలో ఐతే చిన్నభూతాల బాధలూ అర్ధం చేసుకోవాలి. అందరూ వాళ్ళ మీద పడిపోటమే తప్ప, చిన్న భూతాల రోజువారీబాధలూ, ఆక్రోశాలూ ఎవడికి పట్టాయి? ముందస్తుగా పెద్ద చేపల్ని కుమ్మినట్టుగానే గణనాయకులకీ త్రిశూల తైల మర్దనం చేయిస్తే అన్నీ సర్దుకుంటాయి.

మార్పు అన్నిట్లోనూ అనివార్యమే. ఎంత తొందరగా వస్తే అంత మంచిది. అయ్యా అదీ సంగతి.
Vasu said…
ఏది ఏమయినా జర్నలిస్ట్ ని చితక బాదడం దారుణం, అమానుషం, అరాచకం.
You are showing only one side of the coin.

Police people are also human beings and they get sandwiched between the govt. and the people.

If they don't act and if something happens, you just blame the police again.

It is easy to throw some stones at but very difficult to be at/in the line of fire ;)

Just couldn't resist but you don't have to publish this :-)