Thursday, November 27, 2008

ఎందుకు భయమేస్తోందంటే ..

ముందుగా నా తరపున ఒక గమనిక .. మనసులో ఎన్నెన్నో ఆలోచనలూ ఆందోళనలూ రేగుతున్నాయి. మామూలు టపాలకి లాగా వ్యాఖ్యలకి స్పందించే స్థితిలో లేను. లాజికల్ గా చర్చించే స్థితిలో అసలే లేను. ఆలోచనల సుడిగుండాల్ని ఇక్కడ అక్షరబద్ధం చెయ్యడమే .. అలాగైనా ఈ వత్తిడి ఏమన్నా తగ్గుతుందేమోనని ..

ఇటీవల జరిగిన దాడులకన్నా ఈ దాడి ఎందుకు భీతి గొలుపుతున్నదంటే ..

1. దాడి చేసిన వాళ్ళు (వీళ్ళని తీవ్రవాదులు అనడం కూడా నాకు ఇష్టం లేకుండా ఉన్నది) ఎక్కడో బాంబులు పెట్టి ఊరుకోవడం కాకుండా యుద్ధ సన్నద్ధులై ప్రత్యక్షంగా దాడికి దిగడం.

2. జాగ్రత్తగా ఎంపిక చేసిన టార్గెట్లు.

3. అనేక టార్గెట్ల మీద ఒకే సారి జరిగిన దాడి.

4. హోటళ్ళలో జరిగిన డాడులలో అతిథుల్ని బందీలను చెయ్యడం

5. బ్రిటీషు అమెరికను పౌరులను ప్రత్యేకముగా TAర్గెట్ చెయ్యడం

6. ఈ దాడిని ఇంత పటిష్ఠంగా జెరిపేందుకు వెనకాల జరిగి ఉన్న వ్యూహం, ప్రణాళిక మరియు శిక్షణ.

ఇవ్వన్నీ దాడి చేసిన వాళ్ళ వేపు నుండి.

మిగిలిన భయాందోళన కారణాలు ప్రభుత్వ యంత్రాంగపు వైఫల్యానికి సంబంధించినవి.
భారతదేశం వంటి దేశంలో ముంబాయి వంటి నగరంలో జనసమ్మర్దమైన ప్రదేశాల్ని ఒక సురక్షితమైన కోట లాగా రక్షించడం ఎవరికీ సాధ్యమయ్యే పని కాదు. దాడి జరుగుతుంటేనూ, జరిగిన తరవాతా ఏమి చేశారన్నది కాదు ముఖ్యం. అటువంటి క్విక్ రెస్పాన్స్ లో మన వాళ్ళు బాగానే ఆరితేరినట్టున్నారు. అసలు కీలకం, పటిష్ఠమైన గూఢచారి నిఘా వ్యవస్థ సహకారంతో ఇటువంటి సంఘటనలు ప్రణాళిక దశలో ఉండగానే తుంచి వెయ్యడం. ఈ పనిలో మన రక్షణ వ్యవస్థ దారుణంగా విఫలమైనదని అనుకోక తప్పదు. ఒక పక్కన వివిధ దళాల, విభాగాల మధ్య సరైన పరస్పర సహకారం లేకపోవడం. ఇంకో పక్క, దొరికిన సమాచారాన్ని సరిగ్గా ఉపయోగించుకోలేక పోవడం. మూడోది, ఈ రెండూ సవ్యంగా జరిగి నివేదికలు తయారైనా, అవి పరిపాలనా మరియు రాజకీయ బురదలో కూరుకుపోయి ఏమీ ఫలితం లేకపోవడం.

దాడులు జరిగినాక జరిపిన వాళ్ళని పట్టుకోవడం, అప్పుడు ఇన్వెస్టిగేషన్లు జరపడం, ముద్దాయిల్ని పట్టుకోవడం, వాళ్ళ మీద కేసులు పెట్టడం, విచారణ జరిపి శిక్షలు వేయించడం .. ఈ తతంగమంతా సవ్యంగా జరిగినా, చివరికి పెద్దగా ఒరిగేదేం ఉండదు. అసలు ముందు దాడులు జరక్కుండా చూడాలి.

ముందసలు వివిధ ప్రభుత్వాలు (స్థానిక, రాష్ట్ర, కేంద్ర) ఈ భద్రత విషయం అదేదో పరమ రహస్యం అన్న వెధవ పోజు మానేసి, అసలేం జరుగ్తోందో దేశ ప్రజలకి చెప్పాలి. ముసుగులో గుద్దులాట వల్లనే లోపాలు, కవరప్పులు, ఒకరినొకరు నిందించుకోడాలు, అందరూ కలిసి విదేశి హస్తాన్ని నిందించడాలు. ఆ ముసుగు తీసేస్తేగానీ ఇవేవీ తేట తెల్లం కావు.

బాధ్యత కల పౌరులుగా మనం మన ఎన్నుకున్న ప్రభుత్వాన్నించీ, పరిపాలన యంత్రాంగం నించీ ఇటువంటి బాధ్యతని డిమాండ్ చెయ్యాలి.

ఈ తీవ్రవాదపు దాడులు ఇప్పుడేదో కొత్తగా సరిహద్దు దాటుకుని వచ్చినవి కాదు, మనలోనే ఇవి చెడ్డ సూక్ష్మక్రిముల్లాగా పుట్టి పెరుగుతోందని గ్రహించుకోవాలి. దానికి మూలాలేవిటో అన్వేషించుకోవాలి. అందులో మనందరి బాధ్యతా ఉంది.

Wednesday, November 26, 2008

మనం ఎప్పటికి నేర్చుకుంటాం

రేపు అమెరికాలో థేంక్స్ గివింగ్ అనే పండగ. నేను నాకు లభించిన ఏయే వరాలకి ధన్యుడనయ్యానని అనుకుంటున్నానో రాద్దామని ఊహించుకుంటూ నవతరంగంలో అడుగు పెడితే అక్కడ ముంబాయి మారణ కాండలో మృతులకి ఆత్మశాంతి అని టపా. నిర్ఘాంతపోయి వరసగా బీబీసీ, యెన్‌పీఆర్ లు గాలించా.

ఇంతలో బయటికి వెళ్ళాల్సి వచ్చింది. NPR లో All Things Considered వింటూ వెళ్తున్నా, ఇంకా ఏమన్నా కొత్త సమాచారం చెబుతారేమోనని. ఇదివరలో బెంగళూరు అహ్మదాబాదులలో చిన్న సైజు పేలుళ్ళు జరిగినప్పుడు ఇక్కడ వచ్చిన కవరేజి చాలా తక్కువే. బహుశా ఈసారి ముంబాయి కావడం వల్లనూ, దాడులు జరిగింది ఎక్కువగా విదేశీ యాత్రికులు విడిసే పెద్ద హోటళ్ళమీద కావడం వల్లనూ కావచ్చు, సుమారు ఐదు నిమిషాల కథనం వినిపించారు. ఇంతకు ముందు వెబ్ లో తెలియక ఇప్పుడు తెలిసిన కొత్త వార్త - ఒబెరాయ్ హోటల్లో ఇద్దరు ముగ్గురు బందిపోట్లు సుమారు వంద మంది దాకా వ్యక్తుల్ని బందీ చేసి ఉంచారని. పోలీసు నించి కానీ, రాష్ట్ర, కేంద్ర హోం శాఖల నించి కానీ అధికారకంగా ఏమీ ప్రకటన వినబడక పోవడం గమనార్హం.

ఈ వార్తలు వినడమే బహు ఆందోళన కరంగా ఉండగా, పుండు మీద కారం చల్లినట్టు ఇక్కడ అమెరికాలో ఉంటున్న దక్షిణాసియా సెక్యూరిటీ స్పెషలిస్టు ఒకాయనతో చిన్న ఇంటర్వ్యూ చేశారు. ఈ మధ్య ఇటువంటి దాడులు అనేక భారతీయ నగరాల్లో జరిగినట్టున్నాయి గదా, భారత ప్రభుత్వమూ, రక్షణదళాలూ ఏమి చేస్తున్నట్టు అని రేడియో ఆమె అడిగిన ప్రశ్నకి అతను ఏమాత్రం మొహమాటం లేకుండా, ఇదివరకే భారతీయ గూఢచారి వ్యవస్థలు ప్రభుత్వానికి ఇటువంటి దాడులు జరుగుతాయని నివేదికలు ఇచ్చాయని చెబుతూనే, వివిధ రక్షణ దళాల వేగు వ్యవస్థ పరమ దరిద్రపు స్థితిలో ఉందనీ, దేశంలో ఎన్నో ఏళ్ళుగా రగులుతున్న అశాంతి చర్యల నేపథ్యంలో ఇటువంటి చైతన్య రాహిత్యం చాలా విచారించాల్సినదీ అని చెప్పాడు. అంతే కాక ఇప్పుడూ ముంబాయిలో జరిగిన దాడి వ్యూహం చూస్తే దీని వెనక ఉన్న శక్తులు కొత్త తెగువనీ, కొత్త లక్ష్యాన్నీ రూపొందించుకున్నట్టుగా కనిపిస్తున్నదని కూడా చెప్పాడు.

నాకైతే అది విచారించాల్సినదిగా కాదు .. మిగుల భయ పెట్టేదిగా ఉన్నది. ఎందుకీ మంత్రులు? ఎందుకీ మంత్రాంగం? ఏమి చేస్తున్నాయి ఇంటా బయటా పని చెయ్యాల్సిన గూఢచారి వ్యవస్థలు? ఏ మన్ను తిని పడుకున్నాయి. మొన్నటికి మొన్న హైదరాబాదులో లుంబినీ పార్కు, కోఠీ పేలుళ్ళు. నిన్ననే బెంగళూరు అహ్మదాబాదుల్లో వరస పేలుళ్ళు. ఇవన్నీ ఇంకేదో పెద్ద ముంపుకి ముందు పిల్ల అలలు అని చెప్పకనే చెబుతున్నట్టు. ఇవ్వాళ్ళ పెను ఉప్పెన రానే వచ్చింది. ఏదీ మనకి రక్షణ కల్పించాల్సిన చెలియలి కట్ట?

Monday, November 24, 2008

కబుర్లు - నవం 24

శుక్రవారం ఈ కబుర్లు రాయడానికి కూర్చోగా నేపథ్యంలో నేదునూరి వారు పాడుతున్నారు. నా రాతని మర్చిపోయి ఒక గంటన్నర సేపు వారి గాన వార్ధిలో మునిగి తేలాను. పనిలో పనిగా రసప్లావితుణ్ణయ్యాను. కచేరీ చివర్లో "వైదేహీ సహితం" అని మొదలయ్యే విరుత్తం పాడారు. కర్ణాటకసంగీతంలో ఇదొక విచిత్రమైన అంశం. విరుత్తం అనేది వృత్తము అనే ఛందో పదానికి అపభ్రంశ రూపం అనుకుంటా. ఒక నాలుగు పాదాల పద్యాన్ని, ఒక్కొక్క పాదమూ ఒక్కొక్క రాగంలో విడమరిచి పాడటం దీని ప్రధాన లక్షణం. సాధారణంగా సంస్కృత శ్లోకాలు పాడతారు. కొందరు తమిళ గాయకులు తమిళ పద్యాల్నీ, తెలుగు గాయకులు తెలుగు పద్యాల్నీ పాడ్డం కూడ ఉంది. సాధారణంగా కచేరీ చివరి భాగంలో పాడతారు. ఇక్కడ నేదునూరి వారు పాడిన విరుత్తం శ్రీరాముని అనుచర గణ వర్ణన. కేదరగౌళతో ఎత్తుకుని, సెలయేరులా వయ్యారాలు పోయే మోహనంతో చిందులు తొక్కి, కరుణ రసాత్మకమైన శహనని హత్తుకుని మంగళప్రదమైన సురటితో ముగిసింది.

అలా గడిచి పోయిన శుక్రవారం తరవాత మళ్ళీ ఇదిగో, ఇప్పుడు ఆదివారం సాయంత్రానికి దీని మీద కూర్చునే తీరుబాటు దొరికింది. సంగీతం జోలికి పోకుండా శ్రద్ధగా రాయడనికి కూర్చున్నాను. ఈ వారం చెప్పాల్సిన కబుర్లు పెద్దగా లేవు కానీ నా దృష్టికి వచ్చిన కొన్ని మంచి విషయాలు మీ అందరితో పంచుకోవాలి.

ఒక వేసవి సాయంత్రం, సూర్యాస్తమయం తరవాత, మరువం మల్లెపూలు కలిపి కట్టిన కదంబమాల వాసన చూస్తే ఎలా వుంటుందీ? అట్లాంటి అనుభూతి కలిగించే కథ ఒకటి చదివానీమధ్యన. మీ దృష్ట్లో పడిందో లేదో. మధ్యలో నా బిల్డప్పు ఎందుకు గానీ, డైరెక్టుగా కథ చదివెయ్యండి.

ఈ కాలప్పిల్లలు మల్లాది రామకృష్ణశాస్త్రిగారి పేరైనా విన్నారో లేదో? ఈయన అనేక భాషల్లో పండితుడు, బహుముఖప్రజ్ఞాశాలి. తెలుగు వారికి ముఖ్యంగా సినిమా పాటల రచయితగా ఎక్కువ పరిచయం. సినిమా కబుర్ల సైటు నవతరంగంలో సుబ్బారావుగారు మల్లాదివారిని భక్తితో స్మరిస్తున్నారు. వెళ్ళి పరిచయం చేసుకోండి. పనిలోపని, అప్పుడెప్పుడో నేను మల్లాది వారి స్మారక సంచిక పుస్తకాన్నొకదాన్ని సమీక్షించాను, దాన్నీ ఒక లుక్కెయ్యండి.

తాడేపల్లి గారు తన సాహిత్యం బ్లాగుని మూసేస్తున్నామని ప్రకటించారు. ఆ బ్లాగులో వారు కొన్నాళ్ళు సంస్కృతంలో ప్రాథమిక పాఠాలు చెప్పారు కొన్నాళ్ళు. ఆసక్తి ఉన్నవారు త్వరగా ఆ పుటల్ని దర్శించి ఆ సమాచారాన్ని దాచుకోమని హెచ్చరిక.

తెలుగుకి ప్రాచీన హోదా వచ్చింది, బానే ఉంది గానీ అసలు ఈ భాష బతికి ఉంటుందా ఆ ఫలాన్ని ఆస్వాదించేందుకు? అనడుగుతున్నారు చదువరి గారు. ప్రశ్న అడిగి ఊరుకోవడం కాదు, తెలుగు మనుగడకి ఆచరణీయమైన కార్యక్రమాలు ఏమి చేపట్టవచ్చునో ఆలోచించ మంటున్నారు. ఇక్కడకొచ్చి మళ్ళీ, అసలు తెలుగెందుకు, ఇంగ్లీషా తెలుగా అంటూ చర్విత చర్వణం చర్చలు మొదలెట్టకండి. తెలుగు మనుగడకి, వ్యాప్తికి కార్యాచరణ రూపంగా మీకేమన్నా ఆలోచనలుంటే తీసుకు రండి.

ఈ వారం చేసిన ఇంకో ఘనకార్యం ఎట్టకేలకు హేప్పీడేస్ చిత్రరాజాన్ని చూసి తరించాను. మనసే జారె పాట బావుంది. థీం సాంగ్ గా వచ్చిన పాట కూడా బావుంది. మొత్తమ్మీద సినిమా చాలా బోరు కొట్టింది. దీన్లో అబ్బాయిలా అమ్మాయిలా మధ్య సంబంధాలమీద నాక్కొన్ని మౌలికమైన ప్రశ్నలున్నై, కానీ ఇప్పుడింక పడుకోక పోతే రేపు సోంవారం పనికి లేటవుతుంది. ఆ కబుర్లు ఇంకోసరి ..

Thursday, November 20, 2008

సైకిలు దొంగ

సినిమా కళలో వాస్తవికత గురించి ఇదివరలో సెవెన్ సమురాయ్ సినిమా మీద రాసిన వ్యాస పరంపరలో కొంచెం చెప్పే ప్రయత్నం చేశాను. ముఖ్యంగా అర్ధం చేసుకో వలసింది, వాస్తవికత అంటే .. సినిమాలో చూపించిన విషయాలు నిజప్రపంచంలో జరిగే అవకాశం ఉందా లేదా, కథ నమ్మేట్టుగా ఉందా, అని కాదు. కళలో వాస్తవికత అనేది ఒక దృక్పథం. కథలోని సంఘటనలని, పాత్రలని చూడ్డంలో ప్రేక్షకుల దృష్టిని నిర్దేశించే ఒక దృక్పథం. అటువంటి వాస్తవిక దృక్పథానికి ఈ సినిమా పరాకాష్ఠ...

1948లో నిర్మితమైన ఈ ఇటాలియన్ సినిమా ప్రపంచమంతటా సినీ అభిమానుల, విమర్శకుల నీరాజనాలు అందుకుంది. పూర్తి వ్యాసం నవతరంగంలో.

Monday, November 17, 2008

కబుర్లు .. నవం 17

పోయిన వారం అమెరికా వార్తల్లో పెద్ద సంచలనం .. అమెరికను ఆర్ధిక మంత్రి హెన్రీ పాల్సను గారు వాలువీధి బేంకుల్ని సంరక్షించడానికి కాంగ్రెస్సునించి ముక్కుపిండి వసూలు చేసిన 700 బిలియన్ల డాలర్లనీ, మొదట చెప్పిన పనికి కాకుండా వేరే పనికి వినియోగిస్తామని ప్రకటించడం. దాంతో అప్పుడప్పుడే కాస్త తమాయించుకుంటున్న స్టాకుల విపణి ఒక్క ఉదుటున పంచెలో చీమ దూరినట్టు పైకీ కిందకీ గంతులెయ్యడం మొదలెట్టింది. అసలుకి తమాషా ఏంటంటే, సుమారు మూడు వారాల క్రితం సదరు మంత్రిగారు కాంగ్రెస్సు కమెటీల ముందు .. ఇప్పటికిప్పుడు ఈ బేంకుల వెలలేని (ఇది నా వ్యంగ్యం లేండి) ఎస్సెట్లని అర్జంటుగా మనం కొనెయ్యకపోతే మిన్ను విరిగి మీద పడిపోతుందని .. ఏ వొట్టు కావాలంటే ఆ వొట్టు వేసేశాడు. పిల్లికి ఎలక సాక్ష్యం లాగా మిత్రుడు బెర్నంకీతో వంత పాడించాడు. ఇప్పుడు, తీరా కాంగ్రెస్సు ఆ సొమ్ము సేంక్షను చేశాక, దాన్ని ఎలా వినియోగించాలి అని పథకాలు రూపొందించాల్సి వచ్చేప్పటికి అమాత్యులు మనసు మార్చుకున్నారు. ఇప్పుడు సరిగ్గా కాంగ్రెస్సోళ్ళు, తూచ్ అని అరిస్తే?

ఈ వారం వార్తల్లో ఇంకో విశేషం .. ప్రపంచంలో అతి పెద్దకంపెనీల్లో ఒకటి అయిన జెనెరల్ మోటర్సు రేపో మాపో 11వ అధ్యాయపు దరఖాస్తు దాఖలు చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయని. వాలువీధిలో కంపెనీ విలువ కేవలమూ రెండు బిలియన్ల డాలర్లు మాత్రమే. భలే మంచి చౌక బేరము! కానీ ఎవడు కొంటాడు? బండ్లు ఓడలవును, ఓడలు బండ్లవును అనడానికి ఇంతకంటే మంచి ఉదాహరణ ఉన్నదా? మనకి (నాకు?) తెలిసిన డెట్రాయిట్ రూపు రేఖలు మారిపోతాయి కాబోలు.

అన్నట్టు ఇవ్వాళ్ళ మొదటి మంచు పడిందోచ్. మీకోసం ఒక రెండు బొమ్మలు కూడ తీశా.
ఏంటో, ఈ ఏడాది ఆకురాలు కాలం మరీ క్లుప్తంగా ముగిసి పోయింది. అఫ్కోర్సు, సెప్టెంబరు చివరి దాకా వెచ్చవెచ్చగా ఉన్నందుకు సంతోషమే ననుకోండి. కానీ ఆకులు రంగులు తిరగడం మొదలెట్టాక గట్టిగా రెండు వారాలన్నా నిలవకుండ, ఒకదాని తరవాతొకటి చలిని మోసుకొచ్చే గాలివానలొచ్చేసి ఆకుల్ని రాల్చేశాయి. ఇంకేవుంది, ఇవ్వాళ్ళ మంచు కూడ పడింది కాబట్టి, ఇహ వింటర్ గేటు దాకా వచ్చేసినట్టే.
గత ఏడాది ఆకురాలు కాలం.

పోయిన ఆదివారం మా సాహితీ సమితిలో ప్రత్యేక సమావేశం జరిగింది. ఇటీవలే తెలుగు విశ్వవిద్యాలయ (తెవివి) ఉపాధ్యక్షులుగా పదవీ విరమణ చేసిన ఆచార్య ఆవుల మంజులత గారు ముఖ్య అతిథిగా వచ్చారు. తెలుగు భాష ప్రాచీనత, అంతర్జాతీయంగా తెలుగు విద్యాబోధన ఇత్యాది విషయాల మీద చాలా విషయాలు ముచ్చటించారు. ఈ మధ్య కేంద్ర ప్రభుత్వం తెలుక్కి మెచ్చి కప్పిన ప్రాచీనత శాలువా, నిజంగా పండిత శాలువా లాంటిదే నన్నారు (పోలిక మాత్రం నాది, ఆమె చెప్పింది కాదు). వాళ్ళు ఇస్తామని చెప్పిన ఏడాదికి నూరు కోట్లు నిజంగా రావూ పెట్టవూ (తమిళానికి ప్రకటించిన తరువాత ఇంతవరకూ భాషా సేవకి ఈ స్కీముకింద విడుదల అయిన నిధులు మూడు నాలుగు కోట్లకి మించవని చెప్పారు), కానీ జాతీయ అంతర్జాతీయ వేదికలమీద భాష చర్చకి వచ్చినప్పుడు మాది క్లాసికల్ భాషయ్యా అని మనం గర్వంగా చెప్పుకోవచ్చును. తద్వారా, భాషా శాస్త్రం, భాష చరిత్ర, సాహిత్యాల మీద మరింత విస్తృత పరిశోధనలు జరగడానికి ఎక్కువ అవకాశాలు ఏర్పడతాయని చెప్పారు. తెలుగు భాష, జాతి ప్రాచీనతల గురించి ఇటీవల జరుగుతున్న కొన్ని పరిశోధనల గురించి చూచాయగా చెప్పారు.

ఇవన్నీ ఇలా ఉండగా, ఈమె తెవివి ఉపాధ్యక్షులుగా ఉండగా సాధించిన గొప్ప విజయం తెవివిలో విదేశాలకు చెందిన విద్యార్ధులు వచ్చి ఒక ఏడాది గడిపి, తెలుగు భాషా సంస్కృతుల్ని అధ్యయనం చేసే కార్యక్రమానికి రూప కల్పన చేసి, రాష్ట్రప్రభుత్వ అనుమతి పొంది అమలు చేశారు. ఇప్పటికి ఏడాదికి పది మంది చొప్పున రెండు తడవలు ఈ కార్యక్రమం విజయవంతంగా నడిచిందని చెప్పారు. ప్రవాసాంధ్రుల పిల్లల కోసం ఇటువంటివే రెండు వారాలో, లేక నెలరోజులో నడిచే క్లుప్తమైన బోధన కార్యక్రమాలని రూపొందించవచ్చని కూడా చెప్పారు. ఇంతలో, సభ్యుల వ్యాఖ్యలతో చర్చ .. అమెరికాంధ్రుల సంగతి వదిలి పెట్టండి, ఆంధ్రాంధ్రులే ఇప్పుడు తెలుగు చదవటల్లేదు కదా .. అన్న దారి పట్టింది.

ఇప్పుడే అందిన తాజా వార్త. కౌముది జాలపత్రిక వారు కథానికల పోటీ ప్రకటించారు. మన బ్లాగర్లలో కథకులందరూ తమతమ కీబోర్డులకు పని చెప్పవలసింది. వివరాలివిగో.

ఈ వారం కబుర్లు ఇక్కడ ఆపుతాను. వచ్చే వారం కలుసుకుందాం మళ్ళీ .. ఈ లోపల ఇంకో టపా రాసే ఉద్రేకం కలక్క పోతే .. :)

Wednesday, November 12, 2008

చారిత్రక నిర్ణయం

అమెరికా సంయుక్త రాష్ట్రాలకి 44 వ అధ్యక్షునిగా బరాక్ ఒబామా ఎన్నికయ్యారు. అమెరికా పౌరులు నిర్ద్వంద్వంగా, ఎక్కడ సందేహానికి తావు లేకుండా తమ అభిప్రాయాన్ని నమోదు చేసి ఈ చారిత్రక నిర్ణయం తీసుకున్నారు. కచ్చితంగా ఇది చారిత్రక సమయం. అమెరికాలో జాతి సంబంధ స్పర్ధలు, దాని చరిత్ర తెలిసిన వారెవరికైనా ఈ ఎన్నిక యొక్క చారిత్రాత్మకత అర్ధమవుతుంది. కేవలం 40 ఏళ్ళ క్రితం, ఆఫ్రికను అమెరికన్లు కొన్ని మౌలిక హక్కుల కోసం ఉద్యమాలు మొదలు పెట్టారు. తరవాత్తరవాత జెస్సీ జాక్సన్ వంటి కొందరు నాయకులు అధ్యక్ష పదవికి పోటీ చేసినా ప్రైమరీలలోనే వెనక బడిపోతూ వచ్చారు. ఈ నేపథ్యంలో, ఇప్పటికీ ఒక వ్యక్తి వొంటి రంగు నలుపవడం వల్ల అతని తెలివి శక్తి సామర్ధ్యాల్ని తక్కువ అంచనా వేసే నేపథ్యంలో .. ఈ దేశ ప్రజలు బరాక్ ఒబామా ని అధ్యక్ష పదవికి నిస్సంశయంగా ఎన్నుకోవడం .. నిజంగా చారిత్రాత్మక పరిణామమే.

ఇంకో కోణం నించి కూడా ఇది ఒక ఆసక్తి కరమైన ఎన్నిక. ఇదివరకటి నల్లజాతి నాయకులు, కేవలం ఆ జాతికే నాయకులుగా నిలిచారు. ఒక సారి రాజకీయాల్లోకి ప్రవేశించినాక, ఒక కాంగ్రెస్ స్థానానికో, మేయర్ పదవికో పోటీ చేస్తే, ఆ నియోజకవర్గ ప్రజలందరికీ ప్రాతినిధ్యం వహించాలి ఆ యెన్నికైన వ్యక్తి. అంతే గానీ, నేను నల్లవాణ్ణి కాబట్టి నల్ల వాళ్ళ బాగోగులే చూస్తాను అంటే కుదరదు. అనేక ఇతర పదవుల్లో, సెనేటు ప్రాతినిధ్యం, రాష్ట్ర గవర్నరు పదవుల వరకూ నల్ల జాతీయులు ఈ విధమైన విజయాలు సాధించ గలిగారు కానీ దేశాధ్యక్ష పదవి కోసం పోటీలో ఇంత వరకూ ఇటువంటి విజయం సాధించలేదు. రాష్ట్ర స్థాయి వరకూ, తమ తమ రాష్ట్ర ప్రజల్ని - "నేను మీ అందరి అభ్యర్ధిని" - అని ఒప్పించ గలిగారు గానీ దేశ స్థాయిలో ఆ పని చెయ్యలేక పోయారు. అధ్యక్ష పదవి పోటీ చేసిన ఆఫ్రికను అమెరికన్లు ఆ జాతి ప్రతినిధులుగానే మిగిలిపోయారు గానీ "నేను నలుపు, తెలుపు, పసుపు .. అన్ని జాతుల ప్రతినిధిని .. నేను అమెరికా ప్రతినిధిని" అనే ప్రాభవాన్ని ప్రదర్శించలేక పోయారెవరూనూ. ఆ పని ఒబామా విజయవంతంగా చెయ్యగలిగారు. ఈ విజయంలో ఆయన ద్విజాతి (Bi-racial) నేపథ్యం ప్రముఖ పాత్ర వహించిందేమోనని నాకనిపిస్తోంది.

ఒబామా తండ్రి కెన్యా దేశస్తుడు. తల్లి హవాయికి చెందిన శ్వేత వనిత. ఆయన యుక్త వయసు దాకా మాతామహుల ఇంట్లో పెరిగాడు. (యాదృఛ్ఛికంగా, ఆయన మాతామహి ఎన్నికల రోజుకి రెండు రోజుల ముందు మరణించారు.) అతని బాల్యం పై తాతయ్య, అమ్మమ్మల ప్రభావం తీవ్రంగా ఉంది. ఐతే, కనీసం కళాశాలకి వెళ్ళినప్పటినుంచీ తన ఆఫ్రికన్ అమెరికన్ అస్తిత్వపు ప్రభావం కూడా బలంగా పని చెయ్యడం మొదలైంది. అటుపైన హార్వర్డు న్యాయ కళాశాలలో, పిమ్మట షికాగో నగరంలో చేపట్టిన వృత్తి కార్యక్రమాలలో ఈ సమన్వయ దృష్టి పదునెక్కింది.

ఇలా రెండు విభిన్న సంస్కృతుల మూలాలు ఉన్న ప్రతి వ్యక్తీ ఇంత బలమైన వ్యక్తిత్వంతో ఎదుగుతారని మనం నిర్ధారించలేము. ఇప్పటిదాకా కొన్ని లక్షల మంది ఇటువంటి సంతతి వారు వచ్చి ఉండొచ్చు కానీ ఒక బరాక్ మాత్రం ఇప్పుడే వచ్చాడు. ఐతే, ఇలా వందల ఏళ్ళ తరబడి వేర్పడి ఒకరినొకరు అపనమ్మకంతో (కొంత ద్వేషంతో) చూసుకుంటున్న జాతుల మధ్య ఏదైనా ఒక ప్రయోజనకరమైన ప్రతిపాదనలు చెయ్యాలన్నా, సుహృద్భావపు విత్తనం నాటాలన్నా, అది బరాక్ లాంటి బైరేషియల్ మనుషులకే చెల్లుతుంది అని నాకు బలంగా అనిపిస్తోంది.

ఇదే లెక్కన భారత దేశంలో పెచ్చు మీరుతున్న భాష, ప్రాంత, కుల, మత విభేదాలని అధిగమించి ఒక బలమైన జాతీయతా పతాకాన్ని నేయాలంటే కూడా మనకి బరాక్ లాంటి (రెండు మూలాలు ఉన్న) "నేత"గాళ్ళు అవసరమని కూడా నాకు బలంగా అనిపిస్తోంది.

Monday, November 10, 2008

ద్వితీయ విఘ్నం లేకుండా

వ్రాయడమా, రాయడమా? బ్లాగ్లోకంలోకి ఒక కొత్త బాటసారి వచ్చినప్పుడల్లా ఈ వివాదం సరికొత్తగా తలెత్తడం గమనిస్తున్నాను ఈ మధ్య. ఎదుటివారికీ చెప్పేటందుకె నీతులు ఉన్నాయి అని మంచి చురకే వేశాడు ఆత్రేయ .. అదీనూ ఒక తాగుబోతు మాటల్లో. నేను దాన్ని కొద్దిగా సవరిస్తా. ఎదుటివారికి సలహా ఇవ్వడం, ఎదుటివారి తప్పులు (మనం తప్పులు అనుకున్నవి) దిద్దడం అంటే మనకి ఉత్సుకత ఎక్కువ. ఎక్కళ్ళేని ఉత్సాహమూ వచ్చేస్తుంది. రాయలవారి ఆస్థానానికి ప్రెగ్గడ నరసరాజని ఒకడొచ్చాట్ట .. ఏవిటయ్యా ఆయన గొప్పతనం అంటే .. ఎంత గొప్ప కవి చెప్పిన పద్యంలోనైనా తప్పులు చూపిస్తాట్ట! బహు గొప్ప ప్రజ్ఞే. ఇలాగే పెద్దన, తిమ్మన ఇత్యాది మహాకవుల పద్యాల్ని చెరిగి తూర్పారబోశాడు ఈ మహానుభావుడు. నిండు సభలో మహారాజు ముందు ఎంత తలవంపులు? రామకృష్ణుడికి ఇదంతా చూస్తూ కడుపు రగిలిపోతోంది. రాయలవారే చాలా మర్యాదగా .. తప్పుల్లేకుండా పద్యం చెప్పడం ఎలాగో మరి, తమరే అటువంటి పద్యం ఒకటి చెప్పి మా కళ్ళు తెరిపించండీ, విజయపత్రిక పట్టుకు పోండీ అన్నార్ట. అతగాడికి నోరు పెగిల్తేనా? ఇహ అప్పుడు నోరు విప్పాడు రామకృష్ణుడు ..
"తెలియని వన్ని తప్పులని దిట్టతనాన సభాంతరమ్మునన్
పలుకగ రాదు రోరి పలుమార్లు నీ పిశాచపు పాడె గట్ట .."
అని ఇంకాసిని రసవత్తరమైన తిట్లు కూడా తిట్టి ..
"భావ్య మెరుంగవు, పెద్దలైన వారల నిరసింతువా! ప్రెగడ రాన్నరసా! విరసా! తుసా భుసా!" అని చీదరించి పారేశాడు.
బ్లాగ్గుంపు కానీ, బ్లాగు గానీ సభే. ఎంతలేసి వారలుంటారు. ఎన్నెన్నో విషయాలు తెలిసిన వారు, అనుభవజ్ఞులూ, ఆలోచనా పరులూ ఉంటారు. వారికి తెలియదని అనుకోరాదు. కొంత సహనం ఉండాలి, మరి కొంత వినయమూ ఉండాలి పదుగురిలో వ్యవహరించేటప్పుడు.

ఇదంటే, ఇటీవల పర్ణశాల బ్లాగులో జరిగిన వ్యక్తిగత దాడుల వ్యాఖ్యలు గుర్తుకొచ్చాయి. ఇటువంటి పోరంబోకు ప్రవర్తనకి తెలుగు బ్లాగుల్లో స్థానం ఉండకూడదు. నాకు తెలిసి ఆ బ్లాగుకర్త మహేష్ తన బ్లాగులోగానీ ఇతర బ్లాగుల్లో గానీ ఎవర్నీ వ్యక్తిగత వ్యాఖ్యలు చెయ్యడం గానీ దూషించడం కానీ చెయ్యలేదు. జనాంతికంగా నమ్మే నమ్మకాలకి విరుద్ధంగా అతను కొన్ని అభిప్రాయాలు, భావాలు వెలిబుచ్చినంత మాత్రాన ఇటువంటి చవక వ్యాఖ్యలు చెయ్యడం అసభ్యమే కాదు, నీచం కూడా. సత్తా ఉంటే అతని వాదనని ఖండించొచ్చు, మీ వాదన చెప్పొచ్చు, లేకపోతే మీ దారిన మీరు వెళ్ళొచ్చు. వ్యక్తిగత దాడులు మాత్రం నిషిద్ధం.

ఇక్కడ కొత్త బ్లాగరులందరికీ ఒక గమనిక. చాలా మంది వ్యాఖ్యలకి మాడరేషన్ పెట్టుకున్నారు. అంచేత బ్లాగరి అనుమతిస్తేనే ఆ వ్యాఖ్యలు వెలుగు చూసేది. అంచేత, ఒకవేళ ఎవరికైనా అశ్లీలమైనవీ, వ్యక్తిగతమైనవీ, వేధింపు వ్యాఖ్యలు వస్తే ఆ విషయం బయటికి తెలిసే అవకాశం లేదు. ఒకవేళ బ్లాగరులెవరికైనా ఇటువంటి ఇబ్బందులు ఎదురైతే దయచేసి వెంటనే బ్లాగు గుంపు దృష్టికి తీసుకురండి. అనుభవజ్ఞులైన బ్లాగర్లు ఏదైనా ఉపాయం సూచించ గలరు.

మీలో చాలా మంది జురాసిక్ పార్కు సినిమా చూసే ఉంటారు. దానికి ఆధారమైన నవల రాసిన అమెరికన్ రచయిత, మైకెల్ క్రిక్టన్ నవంబరు 4 న మరణించారని తెలిసి విచారించాను. ఈయన మొదట వైద్యుడు. వైద్యం, బయాలజీ ఆధారంగా కొన్ని సైన్సు ఫిక్షను నవలలు రాశాడు. అవి బాగా పాపులర్ అయ్యేప్పటికి పూర్తిగా నవలా రచనకే అంకితమయ్యాడు. అంతే కాక సైన్సుకి సంబంధించిన అనేక ఉద్యమాల్లో ప్రముఖ పాత్ర వహించాడు. గొప్ప గొప్ప పత్రికల్లో వ్యాసాలు రాశాడు వైవిధ్యమైన విషయాలపై. ఈయన నవలల్లో రచనాశైలి నాకు అంతగా నచ్చక నేను ఈయన పుస్తకాలు రెండే చదివాను. కానీ ఆయన సృజనాత్మక ఊహా శక్తిని మాత్రం మెచ్చుకోకుండా ఉండలేం. టీవీలో రెండు మూడు సార్లు చూశాను. సుమారు ఆరున్నర అడుగుల పొడుగు ఆజాను బాహుడు, స్ఫురద్రూపి, మాట్లాడే ప్రతిమాటా ఎంతో తెలివితో ఆలోచనతో నిండి ఉంటుంది. కేవలం 66 ఏళ్ళ వయసులో కేన్సరు మహమ్మారి బారినపడి మరణించడం నిజంగా బాధాకరం.

రొబాటిక్స్ కంపెనీలో పనిచేసే నేను ఈ మాట అనడం కొంచెం విడ్డురంగానే ఉంటుంది గానీ ప్రపంచం రాను రానూ యాంత్రికం ఐపోతోంది. టెలీఫోన్లలో ఆటోమేటిక్ మెసేజిలు చాలా మందికి అనుభవమే. ఇటీవల సూపర్ మార్కెట్లలో చెకౌట్ కౌంటర్లలో కూడా ఈ యాంత్రిక స్వరంతో మాట్లాడే ఆమేటిక్ కేషియర్ మెషిన్లు వస్తున్నై. అమెరికాలో సబర్బన్ రైళ్ళు నడిచే ప్రదేశాల్లో నివాసముండేవారికి రైల్లో ఎనౌన్సుమెంట్లు చేసే మెషీన్ వాయిస్ చిరపరిచితమై ఉండాలి. తన సుదీర్ఘ జీవితాన్ని మనుషుల గొంతులకి అంకితం చేసిన స్టడ్స్ టెర్కెల్ .. మనిషి గొంతు వేపుకి చెవి తిప్పమంటున్నాడు. మనసు పెట్టి వినమంటున్నాడు. ఈ కథ విని నాకైతే చెవుల్లో అర్ధశేరు నవటాకు అమృతం పోసినట్లైంది. మీకేమనిపించింది?

వ్యసనం ..తలలు బోడులైన తలపులు బోడులా? రిటైరైనంత మాత్రాన కోరికలుడిగిపోతాయా? రిటైరైన విశ్వనాథంకి అణగని ఈ వ్యసనం ఏవిటో శ్యాం సోమయాజుల గారు రాసిన భాగ్యలక్ష్మిలో చదవండి.


ఈ మధ్యనే జల్లెడ ద్వారా మధురవాణి అనే బ్లాగు చూశాను. సుమతీ శతకం పద్యాల దగ్గర్నించీ లేటెస్ట్ తెలుగు సినిమా పాటల వరకూ అనేక విషయాల్ని తనదైన శైలిలో వ్యాఖ్యానిస్తూ ఆసక్తికరంగా నడుపుతున్నారు. మీరూ ఓ లుక్కెయ్యండి.

Monday, November 3, 2008

ఈ వారం కబుర్లు

టైటిలు చూసి తమరు నవ్వేసుకోనక్కర్లేదు, వారం వారం కబుర్లు రాసేస్తున్నట్టు ఏదో పేద్ద పోజు అనుకుంటూ. సంకల్పం అదే. ఏదో మీరూ తథాస్తూ అంటే .. ఏమో ఎవరు చూడొచ్చారు, నిజంగానే ఈ కబుర్లు వారం వారం చెప్పగలనేమో.

రాత్రి పది దాటింది. కూర్చుని ఈ టపా రాస్తుంటే నేపథ్యంలో ఆర్. వేదవల్లి గారు సావేరి రాగాలాపన చేస్తున్నారు. చాలా బావుంది. ఆహ్లాదంగా ఉంది.

ఆదివారం పొద్దున్నే ఇంటో ఉన్న చిన్నా పెద్దా గడియారలన్నిటిలో టైం మార్చుకోవడం .. ఇదో ప్రహసనం ఈ ప్రవాస జీవితంలో .. సంవత్సరానికి రెండు సార్లు. పర్య్వసానం ఏంటయ్యా అంటే.. ఆదివారం ఒక గంట ఎక్కువ సేపు పడుకోవచ్చు.

ఈమాట జాలపత్రిక కొత్త సంచిక విడుదలైంది. ఈ సంచికతో ఈమాట పదో పుట్టిన రోజు జరుపుకుంటోంది. ఆ సందర్భంగా ఈ సంచిక ప్రత్యేక సంచిక అనే చెప్పుకోవాలి. వ్యవస్థాపక ముఖ్య సంపాదకులు శ్రీ కేవీయెస్ రామారావుగారు ఆ జ్ఞాపకాలు కొన్ని నెమరు వేసుకుంటున్నారు. ఈ సందర్భంగా కొన్ని అరుదైన పాత ఆలిండియా రేడియో కార్యక్రమాల ఆడియోని శబ్దతరంగాల శీర్షిక కింద అందిస్తున్నాము. ఇది పాఠక శ్రోతలు మెచ్చుతారని మా ఆశ. అన్నట్టు గత సంచికలో జెజ్జాల కృష్ణమోహన రావుగారు వాడుక భాషలో పద్యాల గురించి మంచి వ్యాసం రాశారు. మన బ్లాగర్లలో పద్య రచన పై ఇష్టం ఉన్నవారు ఈ వ్యాసాన్నొకసారి చదవాలి. గిరి, రానారె, రాకేశ్వర వాడుక భాషలో కొన్ని మంచి పద్యాలు రాశారు. వారీ వ్యాసంపై తమ తమ పద్యాల లంకెలతో వ్యాఖ్యానిస్తే బాగుంటుందని నా అభిప్రాయం. తెలుగు బ్లాగర్ల పద్య సామర్ధ్యం ఈమాట పాఠకులకి కూడా తెలియ వస్తుంది.

ఈ సోమవారం, కార్తీక మాసంలో మొదటి సోమవారం. నవంబరు నెల్లోని నాలుగు సోమవారాలూ కార్తీక సోమవారాలే. కార్తీక మాసమే శివునికి ప్రీతికరమని మన సంప్రదాయం. సోమవారాలు మరీనూ. చాతనైతే, నోటికొస్తే, నమకచమక పారాయణ చెయ్యండి. లేదంటే, చిత్తం శివుడి మీద ఉంచి "ఓం నమశ్శివాయ" అనుకోండి.

అమెరికాలో సార్వత్రిక ఎన్నికలు రేపే. అమెరికను అధ్యక్ష ఎన్నికల చరిత్రలో ఇప్పటి వరకూ అతి సుదీర్ఘమైన ప్రచార సన్నివేశం ముగియవస్తోంది. ప్రచారాలు ముమ్మరంగా ఉన్న సమయంలో ఆయా బలాల్ని సమీక్షిస్తూ టపా రాయాలని భావించి కూడా, ఎప్పటికప్పుడు వాయిదా వేస్తూ వచ్చాను. తీరా అది ముగిసే పోయే తరుణం రానే వచ్చింది. All good things come to an end అని ఆంగ్ల సామెత. బరాక్ ఒబామా విజయం సాధిస్తారని ఆకాంక్షిస్తున్నాను. అందగాడు, తెలివైనవాడు, మంచి వక్త, దేనికీ తొణకని వాడు ఐన వ్యక్తి అధ్యక్షుడైతే ఇక మన పెనిసిళ్ళకి ఏం పనుంటుంది, ఎవర్ని వెక్కిరించగలం అని ఒక కార్టూనిస్టు మొన్న రేడియోలో వాపోతున్నాడు. అతనికి ఇంకో కార్టూనిస్టు ధైర్యం చెప్పాడు .. "ఏం పర్లేదు, అందుకోసమే ఉపాధ్యక్షుడున్నాడు!" :)

తెలుగు బ్లాగ్లోకంలో రెండు మంచి విషయాలు జరిగాయి. మామూలుగా బ్లాగరులు శతటపోత్సవం జరుపుకోడం చూస్తుంటాం. మమ సుజాతగారు ఒక టపాకి వంద వ్యాఖ్యలు రాశి పోయించి తన వాసి చూపించుకున్నారు. క్రికెట్టు రికార్డుల్ని పట్టించుకో నక్కర్లేదు గానీ, ఇది నిజంగా గర్వించదగిన రికార్డు. సుజాత గారికి అభినందనలు. రెండోది, నలమోతు శ్రీధర్ రాసిన తెలుగు బ్లాగు మొదలెట్టడం ఎలా అనే వ్యాసాన్ని ఈనాడు దినపత్రిక సిరి శీర్షికలో ప్రముఖంగా ప్రచురించింది. ఈ వ్యాసం వల్ల కొత్త బ్లాగరులెవరన్నా పుట్టుకొస్తారేమో .. వేచి చూడవలసిందే. అన్నట్టు ఈ బుల్లి బ్లాగు ఇవ్వాళ్ళే నా కంట బడింది. ఈ యువబ్లాగరి సార్ధక నామధేయురాలు అవుతుందని ఆశిద్దాం.

గతవారంలో ఒక ఘనకార్యం సాధించాను. ఈ లోకంలో ఈ జన్మ ఎత్తాక ఇంకో సంవత్సరం గడిపేశాను విజయవంతంగా. చాలా కాలంగా పుట్టినరోజులు జరుపుకునే అలవాటు పోయింది. నా పుట్టిన రోజు ఫలానా అని కుటుంబ సభ్యులకీ, దీర్ఘకాల మిత్రుల కొద్దిమందికీ తప్ప ఎవరికీ పెద్దగా తెలియదు కూడా. అలాంటిది, ఎప్పుడో యాదృఛ్ఛిక సంభాషణలో చెప్పినదాన్ని గుర్తు పెట్టుకుని బ్లాగు మిత్రులు చాలా హడావుడి చేసేశారు. మొదట ఆ టపా చూడంగానే .. ఓరి దేవుడా అనుకున్నాను. ఐనా మిత్రుల ఆదరాభిమానాల జల్లులో తడిసిపోయాను. మిగతా రోజుల్లాగే గడిచింది ఆ రోజు కూడా దినచర్య ప్రకారం. కానీ మీరందరూ కలిసి పొంగించిన అభినందనల వెల్లువ నిజంగా ఆ రోజుకి ఒక ప్రత్యేకతని కలిగించింది. ఏం చెప్పలేను. వినమ్రంగా శిరసు వంచి అందుకోవడం తప్ప. శ్రమతీసుకుని ఏనిమేషన్ విడియో తీర్చి దిద్దిన జీవీ, ప్రసాదు గారలకి, చక్కటి మాటల టపా రాసిన శ్రీధర్ కి, వెనక ఉండి చక్రం తిప్పిన స్పెషల్ ఫ్రెండుకి .. thank you guys .. you made me feel special.

రొటీన్ కి భిన్నంగా ఒక రోజుని ప్రత్యేకంగా జరుపుకోవాలి అనుకోవడంలో తప్పేం లేదు. అదే .. ప్రతి రోజూ .. ప్రతి క్షణమూ అద్భుతమయితే? ఆ స్థితికి చేరుకోవాలి!