ఎందుకు భయమేస్తోందంటే ..

ముందుగా నా తరపున ఒక గమనిక .. మనసులో ఎన్నెన్నో ఆలోచనలూ ఆందోళనలూ రేగుతున్నాయి. మామూలు టపాలకి లాగా వ్యాఖ్యలకి స్పందించే స్థితిలో లేను. లాజికల్ గా చర్చించే స్థితిలో అసలే లేను. ఆలోచనల సుడిగుండాల్ని ఇక్కడ అక్షరబద్ధం చెయ్యడమే .. అలాగైనా ఈ వత్తిడి ఏమన్నా తగ్గుతుందేమోనని ..

ఇటీవల జరిగిన దాడులకన్నా ఈ దాడి ఎందుకు భీతి గొలుపుతున్నదంటే ..

1. దాడి చేసిన వాళ్ళు (వీళ్ళని తీవ్రవాదులు అనడం కూడా నాకు ఇష్టం లేకుండా ఉన్నది) ఎక్కడో బాంబులు పెట్టి ఊరుకోవడం కాకుండా యుద్ధ సన్నద్ధులై ప్రత్యక్షంగా దాడికి దిగడం.

2. జాగ్రత్తగా ఎంపిక చేసిన టార్గెట్లు.

3. అనేక టార్గెట్ల మీద ఒకే సారి జరిగిన దాడి.

4. హోటళ్ళలో జరిగిన డాడులలో అతిథుల్ని బందీలను చెయ్యడం

5. బ్రిటీషు అమెరికను పౌరులను ప్రత్యేకముగా TAర్గెట్ చెయ్యడం

6. ఈ దాడిని ఇంత పటిష్ఠంగా జెరిపేందుకు వెనకాల జరిగి ఉన్న వ్యూహం, ప్రణాళిక మరియు శిక్షణ.

ఇవ్వన్నీ దాడి చేసిన వాళ్ళ వేపు నుండి.

మిగిలిన భయాందోళన కారణాలు ప్రభుత్వ యంత్రాంగపు వైఫల్యానికి సంబంధించినవి.
భారతదేశం వంటి దేశంలో ముంబాయి వంటి నగరంలో జనసమ్మర్దమైన ప్రదేశాల్ని ఒక సురక్షితమైన కోట లాగా రక్షించడం ఎవరికీ సాధ్యమయ్యే పని కాదు. దాడి జరుగుతుంటేనూ, జరిగిన తరవాతా ఏమి చేశారన్నది కాదు ముఖ్యం. అటువంటి క్విక్ రెస్పాన్స్ లో మన వాళ్ళు బాగానే ఆరితేరినట్టున్నారు. అసలు కీలకం, పటిష్ఠమైన గూఢచారి నిఘా వ్యవస్థ సహకారంతో ఇటువంటి సంఘటనలు ప్రణాళిక దశలో ఉండగానే తుంచి వెయ్యడం. ఈ పనిలో మన రక్షణ వ్యవస్థ దారుణంగా విఫలమైనదని అనుకోక తప్పదు. ఒక పక్కన వివిధ దళాల, విభాగాల మధ్య సరైన పరస్పర సహకారం లేకపోవడం. ఇంకో పక్క, దొరికిన సమాచారాన్ని సరిగ్గా ఉపయోగించుకోలేక పోవడం. మూడోది, ఈ రెండూ సవ్యంగా జరిగి నివేదికలు తయారైనా, అవి పరిపాలనా మరియు రాజకీయ బురదలో కూరుకుపోయి ఏమీ ఫలితం లేకపోవడం.

దాడులు జరిగినాక జరిపిన వాళ్ళని పట్టుకోవడం, అప్పుడు ఇన్వెస్టిగేషన్లు జరపడం, ముద్దాయిల్ని పట్టుకోవడం, వాళ్ళ మీద కేసులు పెట్టడం, విచారణ జరిపి శిక్షలు వేయించడం .. ఈ తతంగమంతా సవ్యంగా జరిగినా, చివరికి పెద్దగా ఒరిగేదేం ఉండదు. అసలు ముందు దాడులు జరక్కుండా చూడాలి.

ముందసలు వివిధ ప్రభుత్వాలు (స్థానిక, రాష్ట్ర, కేంద్ర) ఈ భద్రత విషయం అదేదో పరమ రహస్యం అన్న వెధవ పోజు మానేసి, అసలేం జరుగ్తోందో దేశ ప్రజలకి చెప్పాలి. ముసుగులో గుద్దులాట వల్లనే లోపాలు, కవరప్పులు, ఒకరినొకరు నిందించుకోడాలు, అందరూ కలిసి విదేశి హస్తాన్ని నిందించడాలు. ఆ ముసుగు తీసేస్తేగానీ ఇవేవీ తేట తెల్లం కావు.

బాధ్యత కల పౌరులుగా మనం మన ఎన్నుకున్న ప్రభుత్వాన్నించీ, పరిపాలన యంత్రాంగం నించీ ఇటువంటి బాధ్యతని డిమాండ్ చెయ్యాలి.

ఈ తీవ్రవాదపు దాడులు ఇప్పుడేదో కొత్తగా సరిహద్దు దాటుకుని వచ్చినవి కాదు, మనలోనే ఇవి చెడ్డ సూక్ష్మక్రిముల్లాగా పుట్టి పెరుగుతోందని గ్రహించుకోవాలి. దానికి మూలాలేవిటో అన్వేషించుకోవాలి. అందులో మనందరి బాధ్యతా ఉంది.

Comments

Anil Dasari said…
1993, 2006, ఇప్పుడు .. బొంబాయికి అలవాటైపోయాయివి. ఇతర నగరాలకీ అలవాటవుతున్నాయి. భద్రత సంగతి నాయకులకి ఏం పట్టింది? ప్రధాన మంత్రి యధావిధిగా 'తీవ్రంగా ఖండిస్తారు', ఇంటి మంత్రి గంటకో సఫారీ సూట్ మారుస్తూ టివిల్లో పోజులిస్తారు. రెండ్రోజుల తర్వాత అంతా మామూలే, మరోటి ఇలాంటిది జరిగేదాకా.
KumarN said…
గూఢచారి విభాగం లో పటిష్టత మనకు మొదటి నుంచీ లేదండీ!!

కాని, మీరనుకున్నట్లుగానే నేను ముంబాయి పోలీసులు, స్కాట్ లాండ్ వాళ్ళకి ఏమీ తీసిపోరని అనుకునేవాణ్ణి. ఇంకా చాలా ముంబైకర్స్ కూడా అలాగే అనుకునే వాళ్ళు. But, I doubt it now.

నాకు నిన్నట్నుంచీ అస్సలు ఎంతకీ అర్ధం కాని ప్రశ్నలేంటంటే,

1. హోటల్స్ కి సెక్యూరిటీ బానే ఉంటుంది మామూలుగా. ఏదో ఒక్కరు, ఒక్క గన్ అంటే అర్ధం చేసుకొవచ్చు. అన్ని మారణాయుధాలని ఎలా తీసుకెళ్ళారు లోపలికి?

2. యే టి ఎస్ చీఫ్ ఎలా చనిపోతారు ఈ దాడుల్లో? అలాంటి వాళ్ళు ఫ్రంట్ లైన్స్ లో ఉండరు కదా మామూలుగా?

ఇంకా ఇలాంటివే చాలా..

అసలు ఇలాంటి సమస్యలని ఎలాండీ టాకిల్ చేసేది?

ఒక వాదమేమో, Extreme tough measures పనికి రావు, అవి అవతలి వాళ్ళని ఇంకా tough చేయడం తప్ప (వైరస్, కాన్సర్ లాగా), అందుకని we have to win the hearts and minds of people అంటుంది.

ఇంకో వాదమేమో, ఇలా ఎన్నాళ్ళు..ఇంకా ఎన్నని ఇస్తాం ఈ ఇస్లామిక్ కమ్యూనిటీకి(స్పెషల్ ప్రివిలేజెస్), ఎంతకని సర్దుకుపోతాం వాళ్ళతో(ఇస్లామిక్ extremism తో).Decency works with only decent people..They are leaving us NO WAY, but to take the fight right back to them అని అంటుంది.

ఇలా క్కాకుండా రెండింటికీ మధ్యే మార్గంగా చేస్తే బావుంటుందన్నది, తర్కం.

కాని చేస్తూనే ఉన్నాం కదా అల్లాగ, గత ఇరవై, ముప్పై సంవత్సరాలుగా..ఏవీ ఫలితాలు? ఇంకా క్షీణించడం తప్పితే?

అసలిది నేను పెరిగిన భారత దేశమేనా? పొద్దున బయటకెళ్ళిపోయి, ఎక్కడెక్కడో, వూర్లో ఉన్న గ్రౌండ్స్ అన్ని బలాదూర్ గా తిరిగి, సాయంత్రం ఇంటికి వస్తే, మన పేరేంట్స్ కి సేఫ్టీ గురించి భయమేమీ ఉండేది కాదు, పిల్లాడు చెడు సావాసాలేమన్నా చేస్తాడేమో అన్న శంక తప్పితే?

మనుషులు, సంఘాలు, దేశాలు, ఇంకా తాత్సారం చేసి, ఇంటలెక్చువల్ లెవల్స్ లో చర్చించే లగ్జరీ పీరియడ్ దాటిపోయిదేమో మనకు అనిపిస్తుంది నాకయితే.

ఎంతో కొంత నష్టానికి, అమాయక ప్రజల నష్టానికి సిద్దపడి పైన చెప్పిన వాదాల్లో ఏదో ఒక వైపు నిలబడక తప్పదేమో?

అరే, కోల్డ్ వార్ ఒక్క బుల్లెట్ కూడా పేల్చకుండా గెలిచామే....కమ్యూనిజం విషాన్ని అరికట్టగలిగిన ప్రపంచం, ఈ ఇస్లామిక్ ఫండమెంటలిజం ని ఎందుకు అరికట్టలేకపోతోంది? (మనం అంటే "సకల మానవాళి" అని నా ఉద్దేశం, నా మీద ఎవరూ దాడి చేయకండి దయచేసి)

నాకయితే అస్సలు అర్ధం కావడం లేదు..అసలు వాళ్ళకి ఏమి కావాలో, వాళ్ళకయినా తెలుసా అనేది నాకనుమానంగా ఉంది!!
Sravya V said…
కుమార్ గారు

మీ బాధ నాకు అర్డం అవుతుంది.

ముంబాయి పోలీసులు, స్కాట్ లాండ్ వాళ్ళకి ఏమీ తీసిపోరని అనుకునేవాణ్ణి. ఇంకా చాలా ముంబైకర్స్ కూడా అలాగే అనుకునే వాళ్ళు. But, I doubt it now.

"ఇప్పుడు కూడ ఎమీ తీసిపొరండి ! అందుకే ఈ మాత్రమైనా ఉండగలుగుతున్నాం."

Do you think is it possible to provide the security measure to meet this kind of attacks for 365 days and 24 hours in Hotels. Upto my knowledge it is not possible in any country that to in the business places like Hotels, it will effect their business also.

ATS chief means he is not a DGP to that state he is the head to that particular wing, generally in these kind of critical situations the Head will take position to boost up the moral of his staff. That too the office like "Karkare" will never sit in A/c room and ananlyse situation when his staff fighting.

The main problem here is when the attacks are controlled or prevented they won't come into the picture with this intensity.

I think that this is not the right place and right time to discuss the other issues in your comment.
psm.lakshmi said…
మనసుని కలచివేసే సంఘటనలు ఇవి. మన దేశస్తులకు మన దేశంలోనే ట్రైనింగు ఇచ్చి మనమీదకు, మన అతిధులమీదకూ ప్రయోగిస్తున్నారనే వార్తలు కూడా వింటున్నామంటే మన రాజకీయనేతలూ, వాళ్ళని భరిస్తున్న మనం మనకి మనమే బిరుదులు ఇచ్చుకోవాలో తెలియటం లేదు. మూడో రోజు మధ్యాహ్నానికి కూడా (ఇప్పుడు సమయం 28-11-08 శుక్రవారం మధ్యాహ్నం 1-45) తాజ్ హోటల్ లో ఇంకా పైరింగు జరుగుతోంది. సమస్యకు కారణాలనేకం. అత్యాశ, స్వార్ధం, నిరుద్యోగం ఒకటేమిటి ఎన్నో, ఎన్నెన్నో. అంత బురదా ఎవరో ఒకరి నెత్తిన రుద్దకుండా, మనం లేముకదా అని నిర్లక్ష్యం వహించకుండా మన బాధ్యత ఏమిటీ అని మనం కూడా ఇప్పటికైనా ఆలోచిస్తే బాగుంటుందేమో. ఎందుకంటే ఇది మన సమాజం. మన తల్లిదండ్రులకు లేని సమస్యలు కొన్ని మనకి వున్నాయి. మన పిల్లలంటే మనకి ప్రేమ వుంది కనుక సమస్యలు లేని సమాజాన్ని కాకపోయినా సమస్యలు సృష్టించని సమాజాన్ని వాళ్ళకి అందిద్దాం.
psmlakshmi
psmlakshmi.blogspot.com