చారిత్రక నిర్ణయం

అమెరికా సంయుక్త రాష్ట్రాలకి 44 వ అధ్యక్షునిగా బరాక్ ఒబామా ఎన్నికయ్యారు. అమెరికా పౌరులు నిర్ద్వంద్వంగా, ఎక్కడ సందేహానికి తావు లేకుండా తమ అభిప్రాయాన్ని నమోదు చేసి ఈ చారిత్రక నిర్ణయం తీసుకున్నారు. కచ్చితంగా ఇది చారిత్రక సమయం. అమెరికాలో జాతి సంబంధ స్పర్ధలు, దాని చరిత్ర తెలిసిన వారెవరికైనా ఈ ఎన్నిక యొక్క చారిత్రాత్మకత అర్ధమవుతుంది. కేవలం 40 ఏళ్ళ క్రితం, ఆఫ్రికను అమెరికన్లు కొన్ని మౌలిక హక్కుల కోసం ఉద్యమాలు మొదలు పెట్టారు. తరవాత్తరవాత జెస్సీ జాక్సన్ వంటి కొందరు నాయకులు అధ్యక్ష పదవికి పోటీ చేసినా ప్రైమరీలలోనే వెనక బడిపోతూ వచ్చారు. ఈ నేపథ్యంలో, ఇప్పటికీ ఒక వ్యక్తి వొంటి రంగు నలుపవడం వల్ల అతని తెలివి శక్తి సామర్ధ్యాల్ని తక్కువ అంచనా వేసే నేపథ్యంలో .. ఈ దేశ ప్రజలు బరాక్ ఒబామా ని అధ్యక్ష పదవికి నిస్సంశయంగా ఎన్నుకోవడం .. నిజంగా చారిత్రాత్మక పరిణామమే.

ఇంకో కోణం నించి కూడా ఇది ఒక ఆసక్తి కరమైన ఎన్నిక. ఇదివరకటి నల్లజాతి నాయకులు, కేవలం ఆ జాతికే నాయకులుగా నిలిచారు. ఒక సారి రాజకీయాల్లోకి ప్రవేశించినాక, ఒక కాంగ్రెస్ స్థానానికో, మేయర్ పదవికో పోటీ చేస్తే, ఆ నియోజకవర్గ ప్రజలందరికీ ప్రాతినిధ్యం వహించాలి ఆ యెన్నికైన వ్యక్తి. అంతే గానీ, నేను నల్లవాణ్ణి కాబట్టి నల్ల వాళ్ళ బాగోగులే చూస్తాను అంటే కుదరదు. అనేక ఇతర పదవుల్లో, సెనేటు ప్రాతినిధ్యం, రాష్ట్ర గవర్నరు పదవుల వరకూ నల్ల జాతీయులు ఈ విధమైన విజయాలు సాధించ గలిగారు కానీ దేశాధ్యక్ష పదవి కోసం పోటీలో ఇంత వరకూ ఇటువంటి విజయం సాధించలేదు. రాష్ట్ర స్థాయి వరకూ, తమ తమ రాష్ట్ర ప్రజల్ని - "నేను మీ అందరి అభ్యర్ధిని" - అని ఒప్పించ గలిగారు గానీ దేశ స్థాయిలో ఆ పని చెయ్యలేక పోయారు. అధ్యక్ష పదవి పోటీ చేసిన ఆఫ్రికను అమెరికన్లు ఆ జాతి ప్రతినిధులుగానే మిగిలిపోయారు గానీ "నేను నలుపు, తెలుపు, పసుపు .. అన్ని జాతుల ప్రతినిధిని .. నేను అమెరికా ప్రతినిధిని" అనే ప్రాభవాన్ని ప్రదర్శించలేక పోయారెవరూనూ. ఆ పని ఒబామా విజయవంతంగా చెయ్యగలిగారు. ఈ విజయంలో ఆయన ద్విజాతి (Bi-racial) నేపథ్యం ప్రముఖ పాత్ర వహించిందేమోనని నాకనిపిస్తోంది.

ఒబామా తండ్రి కెన్యా దేశస్తుడు. తల్లి హవాయికి చెందిన శ్వేత వనిత. ఆయన యుక్త వయసు దాకా మాతామహుల ఇంట్లో పెరిగాడు. (యాదృఛ్ఛికంగా, ఆయన మాతామహి ఎన్నికల రోజుకి రెండు రోజుల ముందు మరణించారు.) అతని బాల్యం పై తాతయ్య, అమ్మమ్మల ప్రభావం తీవ్రంగా ఉంది. ఐతే, కనీసం కళాశాలకి వెళ్ళినప్పటినుంచీ తన ఆఫ్రికన్ అమెరికన్ అస్తిత్వపు ప్రభావం కూడా బలంగా పని చెయ్యడం మొదలైంది. అటుపైన హార్వర్డు న్యాయ కళాశాలలో, పిమ్మట షికాగో నగరంలో చేపట్టిన వృత్తి కార్యక్రమాలలో ఈ సమన్వయ దృష్టి పదునెక్కింది.

ఇలా రెండు విభిన్న సంస్కృతుల మూలాలు ఉన్న ప్రతి వ్యక్తీ ఇంత బలమైన వ్యక్తిత్వంతో ఎదుగుతారని మనం నిర్ధారించలేము. ఇప్పటిదాకా కొన్ని లక్షల మంది ఇటువంటి సంతతి వారు వచ్చి ఉండొచ్చు కానీ ఒక బరాక్ మాత్రం ఇప్పుడే వచ్చాడు. ఐతే, ఇలా వందల ఏళ్ళ తరబడి వేర్పడి ఒకరినొకరు అపనమ్మకంతో (కొంత ద్వేషంతో) చూసుకుంటున్న జాతుల మధ్య ఏదైనా ఒక ప్రయోజనకరమైన ప్రతిపాదనలు చెయ్యాలన్నా, సుహృద్భావపు విత్తనం నాటాలన్నా, అది బరాక్ లాంటి బైరేషియల్ మనుషులకే చెల్లుతుంది అని నాకు బలంగా అనిపిస్తోంది.

ఇదే లెక్కన భారత దేశంలో పెచ్చు మీరుతున్న భాష, ప్రాంత, కుల, మత విభేదాలని అధిగమించి ఒక బలమైన జాతీయతా పతాకాన్ని నేయాలంటే కూడా మనకి బరాక్ లాంటి (రెండు మూలాలు ఉన్న) "నేత"గాళ్ళు అవసరమని కూడా నాకు బలంగా అనిపిస్తోంది.

Comments

లేదండీ...లేదు..లేదు..లేదు...మనకు రెండు మూలాలు ఉన్నా నేతగాళ్లు అవసరం లేదు...బాహుమూలాలు వాసన చూసే వాళ్లు చాలు...

వాసనలు, నేతలు, మూతులు అలా పక్కన పెడితే, మన వ్యవస్థ ఈ తెల్లతోలు జాతిభేద దరిద్రానికి భిన్నమయిన కుల వ్యవస్థ. మీరు అనవచ్చు, ఇక్కడి నల్లవారు మన బడుగువర్గాలు, మాల మాదిగలతో సమానం అని...కానీ హస్తి మశకాంతరం (తేడా) ఉన్నది.. మనకు జాతి - కుల పరంగా ఒబామకు సరిసమానమయిన కె.ఆర్.నారాయణన్ తదితరులు రాష్ట్రపతులుగా పని చేసారు, కలాం వంటి ఇతర మతాల వాళ్లు రాష్ట్రపతిగా పనిచేసారు...కలాం ఉన్నప్పుడు జరిగిన అభివృద్ధి, కనీసం వైజ్ఞానిక పరంగా, ఎంతో ఉన్నతమయితే..కె.ఆర్ నారాయణన్ ఉన్నప్పుడు జరిగిన అభివృద్ధి ఏ పరంగానయినా హళ్లికి హళ్లి, సున్నకు సున్నా...దానికి మన నాయక "నేతన్న"లు వడికిన దిక్కుమాలిన నూలు. ఆ నూలే ఉరితాడై ఆడిస్తుంది...నూలు సరిగ్గా వడికినా, దాన్ని వాడుకునే విధానంలో ఉన్నది తేడా....ఇంకా చాలా రాయాలని ఉన్నది కానీ...తీరిగ్గా తరువాత...ఇంతే సంగతులు చిత్తగించవలెను....
Bolloju Baba said…
వంశీ గారి అభిప్రాయాలు తన వ్యక్తిగతమైనవిగా చెప్పిఉంటే కొంత హుందాగా ఉండేదని అనిపిస్తుంది.
బొల్లోజుబాబా
"ఇదే లెక్కన భారత దేశంలో పెచ్చు మీరుతున్న భాష, ప్రాంత, కుల, మత విభేదాలని అధిగమించి ఒక బలమైన జాతీయతా పతాకాన్ని నేయాలంటే కూడా మనకి బరాక్ లాంటి (రెండు మూలాలు ఉన్న) "నేత"గాళ్ళు అవసరమని కూడా నాకు బలంగా అనిపిస్తోంది"


తెల్లవాళ్ళు మన దేశానికి రాకముందు, ముస్లిం రాజులు దండెత్తక ముందు కూడా మన దేశం లో పలు జాతుల వారు, కులాల వారూ, భాషల వారూ ఎట్టి సమస్యా లేకుండా కలిసి మెలిసి జీవించేవారు కదా, మరి ఇప్పుడు ఇన్ని సమస్యల్య్, విద్వేషాలూ, వివాదాలూ ఎందుకంటారు?
Anil Dasari said…
@భస్మాసుర

కొత్తపాళీగారు మనదేశంలో నేడున్న కొన్ని సమస్యలకి తనకి తోచిన పరిష్కారం చెప్పారు. అది అంత పనికొచ్చేది కాదని మీకనిపిస్తే వంశీలా మీ అభిప్రాయం చెబితే బాగుండేది. అంతేకానీ సమస్యకి మూలాలు వెదుకుతూ కూర్చుంటే ప్రయోజనమేంటి? మీకు హిట్ సినిమా టికెట్లు దొరక్కపోయినా అలనాటి ఆంగ్లేయులో, మొగలాయీలో కారణమనేట్లున్నారు :-)
కొత్తపాళీ గారు,

చిన్న చిన్న విభేదాలని పక్కన పెడితే అమెరికా లో ముఖ్యం గా రెండు జాతులు, నల్ల వారు, తెల్లవారు. అదేమనకి, తమిళులు,కన్నడిగలు,తెలుగు, హిందీ మాట్లాడే వారు, మరాఠీ లు, బిహారీలు ఇంకా ఎన్నో. వీళ్ళందరి మధ్య సయోధ్య సాధించి నేత గా ఒక్కడు ఎదగడం అనేది కలలో మాట. అసలు మనం నేతల్ని ఎన్నుకొనే విధానమే లోపభూఇష్టం. చిన్న చిన్న పార్టీలు కలసి కూటమి గా ఏర్పడే సందర్భంలో కూడా వాళ్ళ అవకాశవాదమే ప్ర్రాతిపదిక గా ఉంటుందే తప్పితే, జనాభిప్రాయం కాదు. పివి ప్రధానమంత్రి గా ఉన్నప్పుడు, ఆయన రాష్త్ర రాజకీయాలని వదిలి ఎన్నో దశాబ్దాలైనా ఉత్తరాది వాళ్ళకి ఆయన ఇంకా దక్షణాది వాడే.

కొసమెరుపేమింటంటే నెను నిన్న విన్న ఒక రేడియో టాక్ షో లొ కొంత మంది తెళ్ళవాళ్ళు ఒబామా పూర్తిగా నల్లవాడు కాదు అని వాదించారు. ఆ టాక్ షో హోస్ట్ దాన్ని ఖండించాడనుకోండి. They still can't digest a black guy ruling this country. ఇలాంటి కొద్దిమందిని మినహాయిస్తే మెజారిటీ అమెరికన్లు ఒబామా ని నల్లవాడిగానే చూస్తున్నారు అందుకే అది చారిత్రాత్మక ఎన్నిక అయింది.
Sujata said…
మీకు తెలుసా ? అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ఒక రోజు ముందుగా మాయావతి - 'ఒబామా మాజిక్' ను ఇండియాలో సృష్టించగలరేమో అని - ప్రధాన వార్తా పత్రికల్లో వ్యాసాలు వచ్చాయి. ఒబామా కీ - మాయావతి కీ సామ్యం ఏమిటంటే - ఇద్దరూ వెనుకబడిన సామాజిక వర్గానికి చెందినవారు. పైగా 'దళిత ' అనే పదానికి భారత దేశంలో చాలా విలువ ఉంది. ఒక 'దళిత ' రాష్ట్రపతి + ఒక 'దళిత' ప్రధన మంత్రి అనే ప్రమాణాలు సృష్టించడం ఇంకా ఉంది.

కుల మతాలకు అతీతంగా, బాగా చదువుకున్న, వివేచన ఉన్న రాజకీయ 'నాయకులు ' మనకూ ఉన్నారు. కానీ మనమే దానికి తగినట్టు ఎదగలేదు. భారత దేశానికి ముందు ఉన్న చాలెంజెస్ - అతి ఘోరమైన జనాభా విస్ఫోటన - దీని కారణంగా బీదరికం, అవిద్య ! పైగా సామాజికంగా కులం, మతం లాంటి పాతుకుపోయిన విషయాలు !


మనకి తప్పకుండా మంచి నాయకత్వం కావాలి. కానీ శశి థరూర్ చెప్పినట్టు - ఉదాహరణ కు - మనకి ఇందిరా గాంధీ ప్రధాని కావాలని ఉందనుకోండి - తప్పకుండా, ఆవిడ పార్టీ కి చెందిన అభ్యర్ధినే, తను గూండా అయినా, దొంగ వెధవ అని తెలిసినా.. మన నియోజక వర్గానికి నాయకుడిగా (ప్రతినిధి గా) ఎన్నుకుంటాం. ఇలా - బోల్డంత మంది గూండాలు - ఆవిడ ని గెలిపించాలనుకునే వాళ్ళు, ఎన్నుకోవడం వల్ల ఎన్నుకోబడతారు. ఈ మధ్యనే సోమ్నాథ్ చటర్జీ కూడా మన దేశ ప్రజలకు తమ ప్రతినిధుల పని తీరు నచ్చకపోతె Re-call చేసే సౌలభ్యం ఉండాలని సూచించారు.

పని లో పని గా ఇంకో కొసరు కధ కూడా చెప్తాను - ఒబామా, క్లింటన్ ల మధ్య జరిగిన పోరు (లాంటిది) లో క్లింటన్ ని ఓడించేందుకు ఒబామా కి మన 'హనుమాన్ ' సాయం చేసాడని ఇక్కడ తెగ చెప్పుకున్నారు. అపుడే, 'హనుమాన్ ' ను పోలిన దేవుడి బొమ్మ ని ఒబామా ఎప్పుడూ పట్టుకుని తిరిగుతారనీ, అందుకే ఒబామానే గెలుస్తారనీ (అధ్యక్షుడి గా) - అపుడే టెలివిజన్ లో చెప్పేసారు. ఇంతకీ మీకీ సంగతి తెలుసా ? (జై హనుమాన్). :D
మనదేశంలో ఎమర్జన్సీ తరువాత,మండల్ కమిషన్ తరువాతా కొందరు బహుమూలాలున్న నేతలు తెరపైకొచ్చారు.వైవిధ్యమైన నేపధ్యం,ఆలోచనాశైలి,విభిన్నకుల/వర్గాల ప్రాతినిధ్యం లాంటివి వీరిసొత్తు.

వీరికి pan Indian appeal లేకపోయినా,వివిధ వర్గాలను కలుపుకునిపోయే నేర్పు స్థానికంగా ఉండేది. కానీ,ఒకసారి ప్రధానస్రవంతి రాజకీయాలలోకి వచ్చాక వారుకూడా అలాగే తయారయ్యారు.

మళ్ళీ భారతదేశం ఒక సంక్షోభంలో పడితేగానీ,అటుప్రజలూ ఇటు నాయకులూ తమ స్థబ్ధతనుంచీ ఉలిక్కిపడిలేచి అలాంటి నాయకుడ్ని వెతకరు.

మనది ప్రెసిడెన్షియల్ ఫామ్ ఆఫ్ గవర్నమెంట్ కాదుగాబట్టి, వంశీ గారి వ్యాఖ్య నాకు కొంత గందరగోళాన్ని మిగిల్చింది.
ఇప్పటిదాకా భారతదేశాన్ని పాలించింది బైరేషియల్, మైనారిటీ వ్యక్తులే అనుకుంటా కదా!! నెహ్రూ ముత్తాతలు ముస్లింలన్న వివాదం ఉండనే ఉంది. ఇందిర (స్త్రీ) రాజీవ్ (కాశ్మీరీ బ్రాహ్మణ/పార్శీ), సోనియా (ఇటాలియన్), రాహుల్ (ఇటాలియన్ ఇండియన్). ఈ బైరేషియల్ తర్కం సరిగా పొసగలేదు.
ఒబామా ఎన్నిక చారిత్రాత్మకమే..కనీసం ఇప్పుడన్నా డిస్క్రిమినేష్ డిస్క్రిమినేష్ అని సగణటం ఆపుతారని ఆశిద్దాం (అత్యాశేనేమో).
భారతదేశానికి ఒబామాలకన్నా, ఓటర్ల రాజకీయ పరిణితి ముఖ్యమని నా అభిప్రాయం.
శరత్ said…
ఒబామా అమెరికా అధ్యక్షుడిగానే కాకుండా ప్రపంచ అధ్యక్షుడిగా (ప్రపంచాన్నంతటినీ ప్రభావితం చేసే వ్యక్తిగా అలా అన్నాను) చక్కటి పేరు తెచ్చుకుంటాడని ఆశిద్దాం.
అబ్రకదబ్ర గారు,

కొత్తపాళీ గారి 'పరిష్కారం' పనికి రాదు అనే అర్థం వచ్చేలా రాసానా? మీరు పొరబడ్డట్టున్నారు. మీరు గానీ, నేను గాని, కొత్త పాళీ గారు గానీ బ్లాగులు రాసి సమస్యలని పరిష్కరించగలమా? అది అంత సులువు కాదు. నాకు తెలిసినంతవరకు అది భావ వ్యక్తీకరణ. వారి భావాలు వెలిబుచ్చారు, చదివాను కాబట్టి ఇలా కుడా అలోచించి చూడండి అని వ్యఖ్యానించాను. ఆ వ్యాఖ్యల్లో వ్యంగ్యం లేదు.

నేను ఇతరుల బ్లాగుల్లో రాసే వ్యాఖ్యలు చదివి ఉండటం వల్ల ఏర్పడిన అభిప్రాయం కాబోలు. ఏం చేస్తాం!? ఖండిస్తాం!!

గమనిక: నేను హిట్ సినిమాలు చూడను :)
బ్లాగుల్లో గానీ వ్యాఖ్యలుగా గానీ మనం రాసుకునేవి చాలా మట్టుకూ మన భావాలూ అభిప్రాయాలే, అలాగని పనిగట్టుకుని చెప్పుకున్నా చెప్పుకోక పోయినా. ఎక్కడో చారిత్రక వాస్తవాలూ, గణాంకాలూ లాంటివి అరుదుగా కనిపిస్తుంటాయి గానీ.
వంసీ గారు, మీరు ఎటో వెళ్ళిపోయారు.
భస్మాసుర, ఈ సమస్యలన్నీ ఎలావచ్చాయో నాకూ తెలియదు. ముస్లిము, ఐరోపీయ ఆక్రమణలకి ముందు భరత ఖండంలో జనులు ఏ పోట్లాటలు లేకుండా ఉన్నారని కూడా నేను నమ్మను, కానీ అదీ ఈ టపాలో ప్రతిపాదించిన దానికి అప్రస్తుతమే. నిజానికి నేను ప్రతిపాదించినది ఇప్పుడున్న సమస్యలకి ఒక పరిష్కారం అనికూడా నేను అనుకోవట్లేదు. కానీ అటువంటి నేతలు చాలా మంది వస్తే, పరిస్థితి చాలా మెరుగువతుందని అనిపిస్తోంది.
అబ్రకదబ్ర, కాస్త ఆవేశంలో రాసినట్టున్నారు ఈ వ్యాఖ్య. :) సమస్య మూలాలు తెలియాలి గదా, ఒక సమస్యని పరిష్కరించాలంటే!
ఉమాశంకర్, మీ వ్యాఖ్య నేను ఆలోచించినదానికి దగ్గరగా వచ్చింది. అన్ని రకాలుగా మనం మనల్ని విభజించేసుకుని కొట్టేసుకుంటున్నాము కాబట్టే మనకి ఇటువంటి నేతల అవసరం ఇంకా ఎక్కువ అని నా అభిప్రాయం. ఒకటి గమనించండి. ఏ ప్రజాస్వామ్య దేశంలోనూ లోపం లేని ఎన్నికల పద్ధతి లేదు. అంతెందుకు, ఘనత వహించిన అమెరికాలో గత రెండు అధ్యక్ష ఎన్నికలనీ హైజాకు చేశారని నమ్మేవారు లక్షల సంఖ్యలో ఉన్నారు, తెలుసునా. ఒబామా పూర్తిగా నల్లజాతి వ్యక్తి కాదు అనేదే ఈ టపాకిం ప్రేరణ.
sujata, మీ వ్యాఖ్య కొంచెం గజిబిజిగా ఉంది. మీరేం చెప్పదల్చుకున్నారో నాకు సరిగా అర్ధం కాలేదు. దళితులు, మైనార్టీ వర్గాల నేతలు అగ్ర పదవుల్లో ఉండడం గురించి కాదు నేను మాట్లాడుతున్నది. ఇక, ఒబామా హనుమఛ్ఛక్తితో విజయం సాధించారనేది జగద్విదితము కదా (ఇది జోకు మాత్రమే!). ఈ విషయాన్ని మేము ఎన్నికలకి ముందే కనిపెట్టాము! పొద్దులో ఇటీవల ప్రచురించిన భువన విజయదశమి రెండో భాగంలో జెండాపై కపిరాజు పద్యం చూడండి. అందుకే అన్నారు, రవి కాంచనిచో కవి కాంచునే గదా అని :)
మహేష్ , అలా ప్రాముఖ్యంలోకి వచ్చిన నేతలెవరు? నాకు ఎవరూ గుర్తు రావట్లేదు.
వైజాసత్య, నెహ్రూ ముత్తాతల సంగతి నాకు తెలియదు గానీ నెహ్రూ నాయకుడిగా, ప్రధానమంత్రిగా దేశానికి మంచే చేశాడు అనుకుంటున్నా. కనీసం చీలికలైతే చెయ్యలేదు. అలాగే రాజీవ్ కూడా. రాహుల్ నేపథ్యం గణనలోకి రాదు, తల్లి పాశ్చాత్యురాలు కాబట్టి. ఒబామా అధ్యక్షుడైనంత మాత్రాన నల్లవారి పట్ల ఉన్న డిస్క్రిమినేషం తొలిగి పోదు. భారతీయ ఓటర్లకి రాజకీయ పరిణతి ఉంది. సరైన నాయకులే లేరు.
శరత్, అదే నా ఆశ కూడా. కనీసం వచ్చే నాలుగేళ్ల పాటు, ఏడాది కోసారైనా చక్కటి ఉపన్యాసాలు వినొచ్చు!
భస్మాసుర, నేనేం అనుకోలేదండి. కానీ హిట్ తెలుగు సినిమాలు చూడక మీరు చాలా మిస్సవుతున్నారు!
కొత్తపాళీ గారూ,

హిట్ సినిమాల వ్యాఖ్య మిమ్మల్ని ఉద్దేశించి కాదు, అబ్రకదబ్ర ని :)
Anil Dasari said…
@భస్మాసుర:

'మూలాలు తెలీకుండా పరిష్కారాలు ఎలా చూపిస్తాం' అని మీరు నాకు రిటార్టిస్తారనుకున్నా కానీ ఆ ఛాన్సు కొత్తపాళీకి ఇచ్చేశారు :-)

నిజమే, ఇతర చోట్ల మీ వ్యాఖ్యలని చూడటం వల్ల ఏర్పడ్డ దురభిప్రాయమే. మార్చుకోటానికి ప్రయత్నిస్తా.

@కొత్తపాళీ:

ఆవేశమా పాడా. భస్మాసురుడిని ఆవేశపరుద్దామని ప్రయత్నించా కానీ నా ప్లాన్ ఫెయిలయింది. మరీ ఇంత మెతక అసురుడేంటో!
మొత్తానికి నేను ఎక్కడికి వెళ్తున్నానో మాష్టారు పట్టేసారు అన్నమాట...:)..:)..:)...
ఎమర్జన్సీ సమయంలో జయప్రకాష్ నారాయణ్,మొరార్జీ దేసాయ్,చరణ్ సింగ్,జీవత్ రామ్ కృపలాని, వాజ్ పేయి వంటి కన్విక్షన్ గల (రాజకీయ)నాయకులు వచ్చారు.

మండల్ కమిషన్ నేపధ్యంలో లాలుప్రసాద్ యాదవ్,రామ్ విలాస్ పాశ్వాన్,నితీష్ కుమార్, మాయావతి, ములాయం సింగ్ యాదవ్ లు వచ్చారు.ఈ భిన్నత్వాన్ని కలిగిన నాయకులుకూడా ప్రధానస్రవంతిలో తమ అస్థిత్వాల్నీ,ఆదర్శాల్నీ కోల్పోయి దేశరాజకీయాల ముఖాన మరింత నలుపు పూసారేగానీ, నిగారింపుని తీసుకురాలేదు.

బహుశా మన దేశఎన్నికలవ్యవస్థలోనే కొన్ని తీవ్రమైన లోపాలున్నాయనుకుంటాను. Right people can't enter in to politics and even if the enter they can't remain right.
KumarN said…
Ravi VijaSatya gaaru,
I hope so too.. At the least, the intensity of voices who scream 'discremination' would reduce.
మహేష్, మీరు కూడా నా ప్రతిపాదనని తప్పుగా అర్ధం చేసుకున్నారు. మీరు చెప్పిన నాయకులందరూ అప్పటివరకూ రాజకీయ బలం కలిగిన వర్గాలకి భిన్నమైన నేపథ్యం నించి వచ్చినవారే గాని, తామే తమ కుటుంబంలో రెండు విభిన్న వర్గాల నేపథ్యం ఉన్నవారు కాదు. నేను మాట్లాడుతున్నది, పచ్చి ఉదాహరణ చెప్పాలి అంటే, ఒక హిందూకీ ఒక ముస్లిముకీ పుట్టిన బిడ్డ, ఒక తమిళ-బీహారీ దంపతులకి పుట్టిన బిడ్డ, ఒక కమ్మ-రెడ్డి దంపతులకి పుట్టిన బిడ్డ .. ఇటువంతి వారు నేతలు కావాలి అని.
@Abrakadabra

Both of your comments, there is sarcasm uncalled for! Context free communication is content free, it doesn't entice me. So I will leave it at this, rest assured we will have enough chances to *talk* intelligibly in future

Cheers
"మెతక" అసురుడు
pi said…
Obama's election is exciting because it proves that people will not disqualify somebody because of his color of skin.
I love Obama and think that his international upbringing and international friends(One of his very good friends is Telugu) will bring good perspective to Whitehouse.

His speech on race is the most rational speech I have heard form any politician of my time.
ఈ సారి అమెరికా ఎన్నికల తంతు శ్రద్ధగా ఫాలో కాలేదు. నిజంగానే ఒబామా ఎన్నిక చారిత్రక పరిణామమే. ఒబామా వల్ల అమెరికా 'టోలరెంటు' దేశంగా మారుతుందని ప్రపంచంలో చాలా మంది విశ్వసిస్తున్నారట. అది మాత్రం నాకంత నమ్మకం లేదు. టోలరెన్సుకి ఎకనామిక్ వ్యాల్యూ ఉంటే రేపు తెల్లారేలోగానే అమెరికా టోలరెంటు అయిపోతుంది ఎంచక్కా. అదిలేనంత కాలం ఒబామా మాత్రం ఏం చెయ్యగలడు?
నిజమే, మీరన్నట్టు 60లో మొదలైన పౌరహక్కుల ఉద్యమాలు యింత తొందర్లో ఫలించడం, ఆ ఉద్యమాలలో పనిచేసినవాళ్ళకి చాలా గొప్ప అనుభూతి యిచ్చింది. దేశం మొరేల్ చాలా తక్కవగా వున్న సమయంలో 2002 ఆస్కార్లు డా.వాషింగటన్ కీ, హ.బెర్రీకి యిచ్చేసినట్టు, ఈసారి ఒబామాకి ఓట్లేసేసారు . అయితే, ఈ సంక్షోబాన్ని సరిదద్దడానికి ఒబామానే ది మాన్ అని నా నమ్మకం.
gaddeswarup said…
"ఐతే, ఇలా వందల ఏళ్ళ తరబడి వేర్పడి ఒకరినొకరు అపనమ్మకంతో (కొంత ద్వేషంతో) చూసుకుంటున్న జాతుల మధ్య ఏదైనా ఒక ప్రయోజనకరమైన ప్రతిపాదనలు చెయ్యాలన్నా, సుహృద్భావపు విత్తనం నాటాలన్నా, అది బరాక్ లాంటి బైరేషియల్ మనుషులకే చెల్లుతుంది అని నాకు బలంగా అనిపిస్తోంది."
By all indications and Obama's first book, Obama's mother was a very remarkable and courageous woman. If Obama shows even half her courage, he will be a great leader. He is undoubtedly a very able person.
Anonymous said…
దీని గుఱించి నా బ్లాగులో రాశాను. 24న చదవొచ్చు.