కబుర్లు .. నవం 17

పోయిన వారం అమెరికా వార్తల్లో పెద్ద సంచలనం .. అమెరికను ఆర్ధిక మంత్రి హెన్రీ పాల్సను గారు వాలువీధి బేంకుల్ని సంరక్షించడానికి కాంగ్రెస్సునించి ముక్కుపిండి వసూలు చేసిన 700 బిలియన్ల డాలర్లనీ, మొదట చెప్పిన పనికి కాకుండా వేరే పనికి వినియోగిస్తామని ప్రకటించడం. దాంతో అప్పుడప్పుడే కాస్త తమాయించుకుంటున్న స్టాకుల విపణి ఒక్క ఉదుటున పంచెలో చీమ దూరినట్టు పైకీ కిందకీ గంతులెయ్యడం మొదలెట్టింది. అసలుకి తమాషా ఏంటంటే, సుమారు మూడు వారాల క్రితం సదరు మంత్రిగారు కాంగ్రెస్సు కమెటీల ముందు .. ఇప్పటికిప్పుడు ఈ బేంకుల వెలలేని (ఇది నా వ్యంగ్యం లేండి) ఎస్సెట్లని అర్జంటుగా మనం కొనెయ్యకపోతే మిన్ను విరిగి మీద పడిపోతుందని .. ఏ వొట్టు కావాలంటే ఆ వొట్టు వేసేశాడు. పిల్లికి ఎలక సాక్ష్యం లాగా మిత్రుడు బెర్నంకీతో వంత పాడించాడు. ఇప్పుడు, తీరా కాంగ్రెస్సు ఆ సొమ్ము సేంక్షను చేశాక, దాన్ని ఎలా వినియోగించాలి అని పథకాలు రూపొందించాల్సి వచ్చేప్పటికి అమాత్యులు మనసు మార్చుకున్నారు. ఇప్పుడు సరిగ్గా కాంగ్రెస్సోళ్ళు, తూచ్ అని అరిస్తే?

ఈ వారం వార్తల్లో ఇంకో విశేషం .. ప్రపంచంలో అతి పెద్దకంపెనీల్లో ఒకటి అయిన జెనెరల్ మోటర్సు రేపో మాపో 11వ అధ్యాయపు దరఖాస్తు దాఖలు చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయని. వాలువీధిలో కంపెనీ విలువ కేవలమూ రెండు బిలియన్ల డాలర్లు మాత్రమే. భలే మంచి చౌక బేరము! కానీ ఎవడు కొంటాడు? బండ్లు ఓడలవును, ఓడలు బండ్లవును అనడానికి ఇంతకంటే మంచి ఉదాహరణ ఉన్నదా? మనకి (నాకు?) తెలిసిన డెట్రాయిట్ రూపు రేఖలు మారిపోతాయి కాబోలు.

అన్నట్టు ఇవ్వాళ్ళ మొదటి మంచు పడిందోచ్. మీకోసం ఒక రెండు బొమ్మలు కూడ తీశా.
ఏంటో, ఈ ఏడాది ఆకురాలు కాలం మరీ క్లుప్తంగా ముగిసి పోయింది. అఫ్కోర్సు, సెప్టెంబరు చివరి దాకా వెచ్చవెచ్చగా ఉన్నందుకు సంతోషమే ననుకోండి. కానీ ఆకులు రంగులు తిరగడం మొదలెట్టాక గట్టిగా రెండు వారాలన్నా నిలవకుండ, ఒకదాని తరవాతొకటి చలిని మోసుకొచ్చే గాలివానలొచ్చేసి ఆకుల్ని రాల్చేశాయి. ఇంకేవుంది, ఇవ్వాళ్ళ మంచు కూడ పడింది కాబట్టి, ఇహ వింటర్ గేటు దాకా వచ్చేసినట్టే.
గత ఏడాది ఆకురాలు కాలం.

పోయిన ఆదివారం మా సాహితీ సమితిలో ప్రత్యేక సమావేశం జరిగింది. ఇటీవలే తెలుగు విశ్వవిద్యాలయ (తెవివి) ఉపాధ్యక్షులుగా పదవీ విరమణ చేసిన ఆచార్య ఆవుల మంజులత గారు ముఖ్య అతిథిగా వచ్చారు. తెలుగు భాష ప్రాచీనత, అంతర్జాతీయంగా తెలుగు విద్యాబోధన ఇత్యాది విషయాల మీద చాలా విషయాలు ముచ్చటించారు. ఈ మధ్య కేంద్ర ప్రభుత్వం తెలుక్కి మెచ్చి కప్పిన ప్రాచీనత శాలువా, నిజంగా పండిత శాలువా లాంటిదే నన్నారు (పోలిక మాత్రం నాది, ఆమె చెప్పింది కాదు). వాళ్ళు ఇస్తామని చెప్పిన ఏడాదికి నూరు కోట్లు నిజంగా రావూ పెట్టవూ (తమిళానికి ప్రకటించిన తరువాత ఇంతవరకూ భాషా సేవకి ఈ స్కీముకింద విడుదల అయిన నిధులు మూడు నాలుగు కోట్లకి మించవని చెప్పారు), కానీ జాతీయ అంతర్జాతీయ వేదికలమీద భాష చర్చకి వచ్చినప్పుడు మాది క్లాసికల్ భాషయ్యా అని మనం గర్వంగా చెప్పుకోవచ్చును. తద్వారా, భాషా శాస్త్రం, భాష చరిత్ర, సాహిత్యాల మీద మరింత విస్తృత పరిశోధనలు జరగడానికి ఎక్కువ అవకాశాలు ఏర్పడతాయని చెప్పారు. తెలుగు భాష, జాతి ప్రాచీనతల గురించి ఇటీవల జరుగుతున్న కొన్ని పరిశోధనల గురించి చూచాయగా చెప్పారు.

ఇవన్నీ ఇలా ఉండగా, ఈమె తెవివి ఉపాధ్యక్షులుగా ఉండగా సాధించిన గొప్ప విజయం తెవివిలో విదేశాలకు చెందిన విద్యార్ధులు వచ్చి ఒక ఏడాది గడిపి, తెలుగు భాషా సంస్కృతుల్ని అధ్యయనం చేసే కార్యక్రమానికి రూప కల్పన చేసి, రాష్ట్రప్రభుత్వ అనుమతి పొంది అమలు చేశారు. ఇప్పటికి ఏడాదికి పది మంది చొప్పున రెండు తడవలు ఈ కార్యక్రమం విజయవంతంగా నడిచిందని చెప్పారు. ప్రవాసాంధ్రుల పిల్లల కోసం ఇటువంటివే రెండు వారాలో, లేక నెలరోజులో నడిచే క్లుప్తమైన బోధన కార్యక్రమాలని రూపొందించవచ్చని కూడా చెప్పారు. ఇంతలో, సభ్యుల వ్యాఖ్యలతో చర్చ .. అమెరికాంధ్రుల సంగతి వదిలి పెట్టండి, ఆంధ్రాంధ్రులే ఇప్పుడు తెలుగు చదవటల్లేదు కదా .. అన్న దారి పట్టింది.

ఇప్పుడే అందిన తాజా వార్త. కౌముది జాలపత్రిక వారు కథానికల పోటీ ప్రకటించారు. మన బ్లాగర్లలో కథకులందరూ తమతమ కీబోర్డులకు పని చెప్పవలసింది. వివరాలివిగో.

ఈ వారం కబుర్లు ఇక్కడ ఆపుతాను. వచ్చే వారం కలుసుకుందాం మళ్ళీ .. ఈ లోపల ఇంకో టపా రాసే ఉద్రేకం కలక్క పోతే .. :)

Comments

Purnima said…
కబుర్లన్నీ చదివేశానోచ్! :-)
KumarN said…
" పంచెలో చీమ దూరినట్టు పైకీ కిందకీ గంతులెయ్యడం "...

Pali gaaru, you had me there :-))
Almost literally ROF.

Yeah, I hope they know what they are doing...No signs yet that it is working.
వాలువీధి :)

పంచెలో చీమ దూరినట్టు :) :) :)
మిత్రుడు బెర్నంకీతో ????
11వ అధ్యాయపు దరఖాస్తు ???
హ హ బాగున్నాయండీ కబుర్లు....
మిస్సమ్మ లో నాగేశ్వర్రావ్ గారి శృతి లో ..."మీకు మీరే...." సాంగ్ వేసుకున్నా....
ఉదయం ట్రైన్ లో చదువుతూ చీమ దగ్గర గట్టిగా పైకే నవ్వేసా... చాలా కరెక్ట్ గా పోల్చారు. :-)
"వాలు వీధి" - చక్కగా కుదిరింది!
బాగున్నాయండీ కబుర్లు.... మంచి కలక్షేపం ఐంది.
అయ్..మంచు బాగుంది. మాకెప్పుడు ప్రాప్తమో..ఇలాంటివి చూసినప్పుడు మనసు మిడ్వెస్ట్ కెళ్ళిపోతుంది :-(
వాలువీధి ;-)
మీ కబుర్లు బాగా ఇంట్రెస్టింగ్ గా వున్నాయి..
Bolloju Baba said…
మంచు ఫొటోలు చాలా బాగున్నాయి.
కబుర్లు ఇంటరెస్టింగా ఉన్నాయి.