ఈ వారం కబుర్లు

టైటిలు చూసి తమరు నవ్వేసుకోనక్కర్లేదు, వారం వారం కబుర్లు రాసేస్తున్నట్టు ఏదో పేద్ద పోజు అనుకుంటూ. సంకల్పం అదే. ఏదో మీరూ తథాస్తూ అంటే .. ఏమో ఎవరు చూడొచ్చారు, నిజంగానే ఈ కబుర్లు వారం వారం చెప్పగలనేమో.

రాత్రి పది దాటింది. కూర్చుని ఈ టపా రాస్తుంటే నేపథ్యంలో ఆర్. వేదవల్లి గారు సావేరి రాగాలాపన చేస్తున్నారు. చాలా బావుంది. ఆహ్లాదంగా ఉంది.

ఆదివారం పొద్దున్నే ఇంటో ఉన్న చిన్నా పెద్దా గడియారలన్నిటిలో టైం మార్చుకోవడం .. ఇదో ప్రహసనం ఈ ప్రవాస జీవితంలో .. సంవత్సరానికి రెండు సార్లు. పర్య్వసానం ఏంటయ్యా అంటే.. ఆదివారం ఒక గంట ఎక్కువ సేపు పడుకోవచ్చు.

ఈమాట జాలపత్రిక కొత్త సంచిక విడుదలైంది. ఈ సంచికతో ఈమాట పదో పుట్టిన రోజు జరుపుకుంటోంది. ఆ సందర్భంగా ఈ సంచిక ప్రత్యేక సంచిక అనే చెప్పుకోవాలి. వ్యవస్థాపక ముఖ్య సంపాదకులు శ్రీ కేవీయెస్ రామారావుగారు ఆ జ్ఞాపకాలు కొన్ని నెమరు వేసుకుంటున్నారు. ఈ సందర్భంగా కొన్ని అరుదైన పాత ఆలిండియా రేడియో కార్యక్రమాల ఆడియోని శబ్దతరంగాల శీర్షిక కింద అందిస్తున్నాము. ఇది పాఠక శ్రోతలు మెచ్చుతారని మా ఆశ. అన్నట్టు గత సంచికలో జెజ్జాల కృష్ణమోహన రావుగారు వాడుక భాషలో పద్యాల గురించి మంచి వ్యాసం రాశారు. మన బ్లాగర్లలో పద్య రచన పై ఇష్టం ఉన్నవారు ఈ వ్యాసాన్నొకసారి చదవాలి. గిరి, రానారె, రాకేశ్వర వాడుక భాషలో కొన్ని మంచి పద్యాలు రాశారు. వారీ వ్యాసంపై తమ తమ పద్యాల లంకెలతో వ్యాఖ్యానిస్తే బాగుంటుందని నా అభిప్రాయం. తెలుగు బ్లాగర్ల పద్య సామర్ధ్యం ఈమాట పాఠకులకి కూడా తెలియ వస్తుంది.

ఈ సోమవారం, కార్తీక మాసంలో మొదటి సోమవారం. నవంబరు నెల్లోని నాలుగు సోమవారాలూ కార్తీక సోమవారాలే. కార్తీక మాసమే శివునికి ప్రీతికరమని మన సంప్రదాయం. సోమవారాలు మరీనూ. చాతనైతే, నోటికొస్తే, నమకచమక పారాయణ చెయ్యండి. లేదంటే, చిత్తం శివుడి మీద ఉంచి "ఓం నమశ్శివాయ" అనుకోండి.

అమెరికాలో సార్వత్రిక ఎన్నికలు రేపే. అమెరికను అధ్యక్ష ఎన్నికల చరిత్రలో ఇప్పటి వరకూ అతి సుదీర్ఘమైన ప్రచార సన్నివేశం ముగియవస్తోంది. ప్రచారాలు ముమ్మరంగా ఉన్న సమయంలో ఆయా బలాల్ని సమీక్షిస్తూ టపా రాయాలని భావించి కూడా, ఎప్పటికప్పుడు వాయిదా వేస్తూ వచ్చాను. తీరా అది ముగిసే పోయే తరుణం రానే వచ్చింది. All good things come to an end అని ఆంగ్ల సామెత. బరాక్ ఒబామా విజయం సాధిస్తారని ఆకాంక్షిస్తున్నాను. అందగాడు, తెలివైనవాడు, మంచి వక్త, దేనికీ తొణకని వాడు ఐన వ్యక్తి అధ్యక్షుడైతే ఇక మన పెనిసిళ్ళకి ఏం పనుంటుంది, ఎవర్ని వెక్కిరించగలం అని ఒక కార్టూనిస్టు మొన్న రేడియోలో వాపోతున్నాడు. అతనికి ఇంకో కార్టూనిస్టు ధైర్యం చెప్పాడు .. "ఏం పర్లేదు, అందుకోసమే ఉపాధ్యక్షుడున్నాడు!" :)

తెలుగు బ్లాగ్లోకంలో రెండు మంచి విషయాలు జరిగాయి. మామూలుగా బ్లాగరులు శతటపోత్సవం జరుపుకోడం చూస్తుంటాం. మమ సుజాతగారు ఒక టపాకి వంద వ్యాఖ్యలు రాశి పోయించి తన వాసి చూపించుకున్నారు. క్రికెట్టు రికార్డుల్ని పట్టించుకో నక్కర్లేదు గానీ, ఇది నిజంగా గర్వించదగిన రికార్డు. సుజాత గారికి అభినందనలు. రెండోది, నలమోతు శ్రీధర్ రాసిన తెలుగు బ్లాగు మొదలెట్టడం ఎలా అనే వ్యాసాన్ని ఈనాడు దినపత్రిక సిరి శీర్షికలో ప్రముఖంగా ప్రచురించింది. ఈ వ్యాసం వల్ల కొత్త బ్లాగరులెవరన్నా పుట్టుకొస్తారేమో .. వేచి చూడవలసిందే. అన్నట్టు ఈ బుల్లి బ్లాగు ఇవ్వాళ్ళే నా కంట బడింది. ఈ యువబ్లాగరి సార్ధక నామధేయురాలు అవుతుందని ఆశిద్దాం.

గతవారంలో ఒక ఘనకార్యం సాధించాను. ఈ లోకంలో ఈ జన్మ ఎత్తాక ఇంకో సంవత్సరం గడిపేశాను విజయవంతంగా. చాలా కాలంగా పుట్టినరోజులు జరుపుకునే అలవాటు పోయింది. నా పుట్టిన రోజు ఫలానా అని కుటుంబ సభ్యులకీ, దీర్ఘకాల మిత్రుల కొద్దిమందికీ తప్ప ఎవరికీ పెద్దగా తెలియదు కూడా. అలాంటిది, ఎప్పుడో యాదృఛ్ఛిక సంభాషణలో చెప్పినదాన్ని గుర్తు పెట్టుకుని బ్లాగు మిత్రులు చాలా హడావుడి చేసేశారు. మొదట ఆ టపా చూడంగానే .. ఓరి దేవుడా అనుకున్నాను. ఐనా మిత్రుల ఆదరాభిమానాల జల్లులో తడిసిపోయాను. మిగతా రోజుల్లాగే గడిచింది ఆ రోజు కూడా దినచర్య ప్రకారం. కానీ మీరందరూ కలిసి పొంగించిన అభినందనల వెల్లువ నిజంగా ఆ రోజుకి ఒక ప్రత్యేకతని కలిగించింది. ఏం చెప్పలేను. వినమ్రంగా శిరసు వంచి అందుకోవడం తప్ప. శ్రమతీసుకుని ఏనిమేషన్ విడియో తీర్చి దిద్దిన జీవీ, ప్రసాదు గారలకి, చక్కటి మాటల టపా రాసిన శ్రీధర్ కి, వెనక ఉండి చక్రం తిప్పిన స్పెషల్ ఫ్రెండుకి .. thank you guys .. you made me feel special.

రొటీన్ కి భిన్నంగా ఒక రోజుని ప్రత్యేకంగా జరుపుకోవాలి అనుకోవడంలో తప్పేం లేదు. అదే .. ప్రతి రోజూ .. ప్రతి క్షణమూ అద్భుతమయితే? ఆ స్థితికి చేరుకోవాలి!

Comments

"ఈ రోజు

నా మిగిలిన జీవితానికి

మొదటి రోజు కాదు

ఇలాంటి రోజులు

నా జీవితం నిండా ఉన్నాయి"


ఎవరో కవి, గుర్తు లేదు .

ఈ టపాకు కలిపితే బాగుంటుందనిపించింది
Purnima said…
నేను టపా శీర్షక చూడగానే నవ్వేశాను, ఇప్పుడేం చేయ్యాలి? :-)

బాగున్నాయి ఈ కబుర్లు! "మండే" ని తిట్టుకుంటూ మొదలెట్టినా, ఇలాంటి సాయంకాలపు కబుర్లుంటే భలే బాగుగా ఉంటుంది. ఈ మాటలో కొన్ని పాత వ్యాసాలు కూడా పరిచయం చేస్తే నాలాంటి కొత్తవారికి ఉపయోగంగా ఉంటుంది కదా!

వచ్చేవారం కబుర్లు కోసం ఎదురుచూస్తూ,
పూర్ణిమ
రిషి said…
రొటీన్ కి భిన్నంగా :) ...బాగుంది సార్ మీ టపా.
aswin budaraju said…
>>ఈ సోమవారం,తో మొదలయ్యే పేర భలే రాశారు. నాకు భలే నచ్చిందండీ,
దేవన said…
గురువు గారు,
ఇలాగే, మీరు పుట్టిన రోజు జరుపుకోవాలి మళ్ళి మళ్ళి !!!! -:)
టపా టైటిల్ చూసి నిజంగానే మీరు వారం వారం కబుర్లు రాస్తున్నారేమో, నేను రెగ్యులర్ గా రాకపోవడం వల్ల ఇంకెన్ని కబుర్లు మిస్ అయ్యానో అనేసుకున్నాను :-)
ఏ టైపు టపా రాసినా మీ ఇస్టయిలే వేరు.. చాలా బావున్నాయి కబుర్లన్నీ.. ఇన్ని రోజులు నేనేం మిస్ అయ్యానో చెప్పాయి!
అన్నిటికీ లింక్స్ ఇచ్చారు కానీ మీ పుట్టినరోజు విశేషాలకి ఇవ్వలేదు.. కాస్త అవి కూడా ఇవ్వరూ.. ముందస్తు ధన్యవాదాలు.
చాలా బాగా వ్రాసారండీ చదివినంత సేపు నేను కూడా మనసులో వేదవల్లి గారి సావేరి రాగాలాపన విన్నట్లు చాలా ఆహ్లాదం గా ఫీల్ అయ్యాను... పుట్టిన రోజు లింక్ కూడా ఇవ్వండీ. (రజనీ స్టైల్లో...) లేట్ గా అయినా లేటెస్ట్ గా మీకు పుట్టిన రోజు శుభాకాంక్షలు....
మేధ said…
టైటిల్ చూడగానే డౌట్ వచ్చేసింది.. ఏంటా ముందు వారం ఇలాంటివేమి చూడలేదే అని.. మొదటి లైన్ చదివి నవ్వొచేసింది.. :)
బావున్నాయి మీ ఈ వారం కబుర్లు...
మొత్తానికి, మీతో టపా రాయించకుండానే, ఒబామా అధ్యక్షులైపోతున్నారన్నమాట!
కొందరు మిత్రులు కామెంటడానికి కుదరట్లేదు అని చెప్తే అప్పుడు నా దృష్టీకొచ్చింది. బ్లాగరు వాడి వ్యాఖ్యల పెట్టెకి ఏదో జబ్బు చేసినట్టుంది. అందుకని వ్యాఖ్యల్ని పాత కాలపు వ్యాఖ్యల పేజీకి మళ్ళించాను. ఇక మీదట బాగానే పని చెయ్యాలి మరి.
Ramani Rao said…
మీ ప్రవాస జీవిత ప్రహసనంలో గడియారాంలో టైం మార్పు బాగుంది. (ఆదివారం ఓ గంట తక్కువ పెడ్తారా? గంట ఎక్కువసేపు పడుకోడానికి).
'కార్తీకమాసం' ప్రవాసంలో ఓ కబురయినందుకు భలే ఆనందంగా ఉంది.
సుజాత గారికి అభినందనలు. తెలుగు బ్లాగులోకంలో 100 వ్యాఖ్యలు తెచ్చుకోడం సాధ్యమే సుమా! అనే ఓ సులువైన పద్దతిని తెలియజేసారు.
మీ పుట్టినరోజు: మళ్ళీ మళ్ళీ రావాలి ఈరోజు, మీరలా మీరు కోరుకొన్నట్లుగా ప్రతి రోజు, ప్రతి క్షణం జీవితం ఆనందమయం చేసుకొని, ఆ అనుభూతిని ఆస్వాదించాలని మనఃసూర్తిగా కోరుకొంటున్నాను.
@ మేధా: పోయిన వారం కూడా కొత్తపాళీ గారు ఇలా కాసిని కబుర్లు చెప్పారు .
సుజాత said…
కొత్తపాళి గారు,
ధన్యవాదాలు!


రమణి,
మీ వ్యాఖ్యలో వ్యంగ్యం ఉందేమో నాకు అర్థం కాలేదు. "సులువైన పద్ధతి" అంటే ఏమిటో అసలే అర్థం కాలేదు. నేను ముందే స్వయంవరాలు ప్రకటించి రాయలేదు ఆ బ్లాగు. నాకెదురైన అనుభవాలను నలుగురితో పంచుకున్నాను. దానికి ప్రజల ప్రతిస్పందన అలా ఉంది. నా లాంటి జూనియర్ బ్లాగరు సులువైన పద్ధతులకే వంద కామెంట్లు(సవరణ..106) రాల్తే, మీ లాంటి సీనియర్లు 'క్లిష్ట పద్ధతులతో ' ఒక పోస్టు రాస్తే కనీసం 107 కామెంట్లు రాలవూ? ప్రయత్నించి చూడండి!
Bolloju Baba said…
బాగుంది
బ్లాగు ప్రాచుర్యానికి వ్యాఖ్యలు కొలబద్ద కావేమో ! ఎక్కువమంది ఒక టపా మీద వ్యాఖ్య రాస్తున్నారంటే అంతమంది యొక్క వ్యక్తిగత జీవితాల్ని ఇన్వాల్వు చేసే పేరాలు ఒకటో రెండో అందులో ఉండి ఉంటాయి. అలాంటివి లేనప్పుడు ఎంత ప్రచురమైన బ్లాగుకైనా వ్యాఖ్యలు ఆట్టే రావు.
చాలా వైవిద్యంగా వుందండి.మరిన్ని కబుర్లు కోసం ఎదురుచూస్తూ..


మీ శ్రీసత్య...
సుజాత said…
తాడేపల్లి గారు,
నేను చెప్పేదీ అదే! బ్లాగు ప్రాచుర్యానికి వ్యాఖ్యలు కొలబద్దలు కానే కావు. పిల్లల చదువుల కోసం వేలు దాటి లక్షలు ఖర్చు పెట్టే స్థితిలో నేటి తల్లి దండ్రులున్నారు. నేను నా సంగతి చెప్పగానే అందరూ "అవునంటూ" తమ అనుభవాలను పంచుకున్నారు. నా టపా అంశం అలాంటిదని నేను ఎక్కువ అసంఖ్యాక వ్యాఖ్యలు వస్తున్నపుడే చెప్పాను.

అద్భుతమైన పోస్టులు గా నేను భావించిన(నా బ్లాగులో కాదు) కొన్ని టపాలకు పదిహేను కామెంట్లు మించలేదు.
Ramani Rao said…
వ్యాఖ్యల విషయంలో తాడేపల్లిగారితో నేను ఏకీభవిస్తున్నాను.

సుజాత గారు: నా మాటలని మీరు వ్యంగ్యంగా పరిగణిచడం నాకు చాలా బాధగా ఉంది. నేనన్నది టపాలు రాయడానికి తీసుకొన్న అంశాలని బేరీజు చేసుకొని అన్నమాట "సులభమైన పద్దతి". సీనియరు, జూనియర్ మాటలు బ్లాగులకి వర్తించదేమో! ఇక్కడ శైలి అన్నదే ప్రధానాంశం. స్వయం వరాలైనా, రాజకీయలైనా నలుగురూ నవ్వుకోడానికి రాసాను తప్పితే, 100 వ్యాఖ్యలొస్తాయా? 107 వ్యాఖ్యలొస్తాయా? ఈ విషయంలో నేను జూనియర్నా? సీనియర్నా అని ఆలోచించుకొని మటుకు రాయలేదు ఇక ముందు రాయను కూడా. క్షమించండి!! మీరు నేను రాసిన మాటని వేరే దృక్పధంతో ఆలోచిస్తే నేనేమి చెయ్యలేను. మీకు వచ్చిన 100 కామెంట్లు(సవరణ ...106 కామెంట్లకి) మనఃపూర్తిగా అభినందిస్తున్నాను.
శ్రీ said…
మీ బ్లాగు కబుర్లు బాగుంటున్నాయి కొత్తపాళీ గారు. నేను కుడా ఈ వారంలో పుట్టినరోజు జరుపుకున్నాను!
వ్యాఖ్యలు బ్లాగు ప్రాచుర్యానికి ఖచ్చితమైన కొలమానాలు కాకపోయినా, టపా ప్రాచుర్యానికి మాత్రం కొలమానాలేకదా!

ఇక్కడ ప్రాచుర్యాని(popularity)కీ,"అద్భుత"మనుకుంటున్న(great)వాటికీ మధ్య బేరీజులెందుకు?
ఏదిఏమైనా, అంతమంది సుజాత గారి బ్లాగుచూస్తారుకాబట్టే వారిలో కొంతమందే రాసే కామెంట్ల సంఖ్యకూడా వందల్లోకి వెళ్ళింది. అందుకే వారి బ్లాగుతోపాటూ, ఈ టపాకూడా సూపర్ హిట్టే!
ఎలాగూ మొదలు పెట్టారు గనుక ద్వితీయ విఘ్నం లేకుండా మీ 'ఈ వారం కబుర్లు' కొనసాగించ ప్రార్థన.
Bolloju Baba said…
నా వోటు చంద్రమోహను గారికి.
అంతే అంతే కొనసాగించాల్సిందే.
పనుల వత్తిడయితే
కనీసం పక్ష కబుర్లయినా (ఈ పదం కరక్టేనా ద్వంధార్ధాలొస్తున్నట్లున్నాయి) పరవాలేదు.
శ్రీ .. నిజమా .. హార్దిక శుభాకాంక్షలు .. ఒక్కమాట చెప్పుంటే ఫార్టి చేసుకునే వాళ్ళం కదా? :)
చంద్రమోహన్, బాబా .. తథాస్తు అన్నారు గదా .. మీ వాగ్బలం .. పనిచేస్తుంది లేండి :)
Deepthi Muddu said…
Belated birthday wishes to u sir..
chaala rojulayyindi ituvaipu vachi..
kaburlu kooda chala bavunnayi.
keep posting.
శ్రీ said…
వచ్చే సంవత్సరం గుర్తుంచుకుని చేసుకుందాంలెండి!
kavya said…
మీ కబుర్లు చదువుతున్నంతసేపూ ఊ కొట్టాలనిపించింది.ఇప్పటికే వారం దాటింది కదా,మరి ఈవారం కబుర్లు ఎప్పుడు చెప్తారు?వెయిటింగు ఇక్కడ!అన్నట్టు మీ కబుర్లలో "బుల్లి బ్లాగు" అని లింక్ ఉంటే క్లిక్ చేశాను.ఆశ్చర్యం!అది డైరెక్టు గా నా బ్లాగు కి వెళ్ళింది.చాలా సంతోషమేసింది.మీ ఆశీర్వాదానికి నెనర్లు.మాలాంటి చిన్న పిల్లలకు మీ encouragement ఇలాగే ఉండాలని కోరుకుంటూ..
కావ్య, మీకు స్వాగతం :) ఈవారపు కొత్త కబుర్లతో పాటు, మరొక టపాకూడ వెలువరించడ మైనది.
kavya said…
thanks for ur warm welcome!!
మీ బ్లాగ్ లోనే వాకింగ్ చేస్తున్నా ఈ సాయంత్రం,ఎన్ని విశేషాలో!!
మీరు నిజ్జంగా వారం వారం కబుర్లు చెప్తారా?? లేక ఆరంభ శూరత్వమేనా?? మీ పుట్టినరోజును అంత ఘనంగా వెరైటీగా చేయించినా ఆ స్పెషల్ ఫ్రెండుని అడిగి నాకు కొన్ని అవిడియాలు చెప్పమనండి ప్లీజ్. నాకంటే ముందుగా శ్రీధర్‌తో కలిసి ఎంత బ్రహ్మాండమైన ప్లాన్ వేసారు. అన్ని లింకులు ఇచ్చి. మీ పుట్టినరోజు విశేషాల లింకు ఇవ్వరా.. ఇదిగోండి ఇక్కడ