కబుర్లు - నవం 24

శుక్రవారం ఈ కబుర్లు రాయడానికి కూర్చోగా నేపథ్యంలో నేదునూరి వారు పాడుతున్నారు. నా రాతని మర్చిపోయి ఒక గంటన్నర సేపు వారి గాన వార్ధిలో మునిగి తేలాను. పనిలో పనిగా రసప్లావితుణ్ణయ్యాను. కచేరీ చివర్లో "వైదేహీ సహితం" అని మొదలయ్యే విరుత్తం పాడారు. కర్ణాటకసంగీతంలో ఇదొక విచిత్రమైన అంశం. విరుత్తం అనేది వృత్తము అనే ఛందో పదానికి అపభ్రంశ రూపం అనుకుంటా. ఒక నాలుగు పాదాల పద్యాన్ని, ఒక్కొక్క పాదమూ ఒక్కొక్క రాగంలో విడమరిచి పాడటం దీని ప్రధాన లక్షణం. సాధారణంగా సంస్కృత శ్లోకాలు పాడతారు. కొందరు తమిళ గాయకులు తమిళ పద్యాల్నీ, తెలుగు గాయకులు తెలుగు పద్యాల్నీ పాడ్డం కూడ ఉంది. సాధారణంగా కచేరీ చివరి భాగంలో పాడతారు. ఇక్కడ నేదునూరి వారు పాడిన విరుత్తం శ్రీరాముని అనుచర గణ వర్ణన. కేదరగౌళతో ఎత్తుకుని, సెలయేరులా వయ్యారాలు పోయే మోహనంతో చిందులు తొక్కి, కరుణ రసాత్మకమైన శహనని హత్తుకుని మంగళప్రదమైన సురటితో ముగిసింది.

అలా గడిచి పోయిన శుక్రవారం తరవాత మళ్ళీ ఇదిగో, ఇప్పుడు ఆదివారం సాయంత్రానికి దీని మీద కూర్చునే తీరుబాటు దొరికింది. సంగీతం జోలికి పోకుండా శ్రద్ధగా రాయడనికి కూర్చున్నాను. ఈ వారం చెప్పాల్సిన కబుర్లు పెద్దగా లేవు కానీ నా దృష్టికి వచ్చిన కొన్ని మంచి విషయాలు మీ అందరితో పంచుకోవాలి.

ఒక వేసవి సాయంత్రం, సూర్యాస్తమయం తరవాత, మరువం మల్లెపూలు కలిపి కట్టిన కదంబమాల వాసన చూస్తే ఎలా వుంటుందీ? అట్లాంటి అనుభూతి కలిగించే కథ ఒకటి చదివానీమధ్యన. మీ దృష్ట్లో పడిందో లేదో. మధ్యలో నా బిల్డప్పు ఎందుకు గానీ, డైరెక్టుగా కథ చదివెయ్యండి.

ఈ కాలప్పిల్లలు మల్లాది రామకృష్ణశాస్త్రిగారి పేరైనా విన్నారో లేదో? ఈయన అనేక భాషల్లో పండితుడు, బహుముఖప్రజ్ఞాశాలి. తెలుగు వారికి ముఖ్యంగా సినిమా పాటల రచయితగా ఎక్కువ పరిచయం. సినిమా కబుర్ల సైటు నవతరంగంలో సుబ్బారావుగారు మల్లాదివారిని భక్తితో స్మరిస్తున్నారు. వెళ్ళి పరిచయం చేసుకోండి. పనిలోపని, అప్పుడెప్పుడో నేను మల్లాది వారి స్మారక సంచిక పుస్తకాన్నొకదాన్ని సమీక్షించాను, దాన్నీ ఒక లుక్కెయ్యండి.

తాడేపల్లి గారు తన సాహిత్యం బ్లాగుని మూసేస్తున్నామని ప్రకటించారు. ఆ బ్లాగులో వారు కొన్నాళ్ళు సంస్కృతంలో ప్రాథమిక పాఠాలు చెప్పారు కొన్నాళ్ళు. ఆసక్తి ఉన్నవారు త్వరగా ఆ పుటల్ని దర్శించి ఆ సమాచారాన్ని దాచుకోమని హెచ్చరిక.

తెలుగుకి ప్రాచీన హోదా వచ్చింది, బానే ఉంది గానీ అసలు ఈ భాష బతికి ఉంటుందా ఆ ఫలాన్ని ఆస్వాదించేందుకు? అనడుగుతున్నారు చదువరి గారు. ప్రశ్న అడిగి ఊరుకోవడం కాదు, తెలుగు మనుగడకి ఆచరణీయమైన కార్యక్రమాలు ఏమి చేపట్టవచ్చునో ఆలోచించ మంటున్నారు. ఇక్కడకొచ్చి మళ్ళీ, అసలు తెలుగెందుకు, ఇంగ్లీషా తెలుగా అంటూ చర్విత చర్వణం చర్చలు మొదలెట్టకండి. తెలుగు మనుగడకి, వ్యాప్తికి కార్యాచరణ రూపంగా మీకేమన్నా ఆలోచనలుంటే తీసుకు రండి.

ఈ వారం చేసిన ఇంకో ఘనకార్యం ఎట్టకేలకు హేప్పీడేస్ చిత్రరాజాన్ని చూసి తరించాను. మనసే జారె పాట బావుంది. థీం సాంగ్ గా వచ్చిన పాట కూడా బావుంది. మొత్తమ్మీద సినిమా చాలా బోరు కొట్టింది. దీన్లో అబ్బాయిలా అమ్మాయిలా మధ్య సంబంధాలమీద నాక్కొన్ని మౌలికమైన ప్రశ్నలున్నై, కానీ ఇప్పుడింక పడుకోక పోతే రేపు సోంవారం పనికి లేటవుతుంది. ఆ కబుర్లు ఇంకోసరి ..

Comments

Vedasree said…
అమూల్యమైన సమాచారాల్ని అందించినందుకు కొత్త పాళీ గారికి నా ధన్యవాదాలు .కుతంత్రం కధ ,మల్లాది రామకృష్ణ శాస్త్రి గారిని గూర్చి ,బ్లాక్ అండ్ వైట్ పుస్తకం ,సాహిత్యం బ్లాగు, తెలుగు మనుగడకి ఆచరణీయమైన కార్యక్రమాలు అన్నీ అసక్తిగా చదివాను. మాటలకందని అనుభూతిని అందించారు .
Unknown said…
కొత్తపాళీ గారు, మీ వారం వారం కబుర్లు కాన్సెప్ట్ చాలా బాగుంది. సమయాభావం వల్ల ఓవర్ లుక్ అయిన మంచి పోస్టులను మీ కబుర్ల ద్వారా చూసే అవకాశం కలుగుతోంది. ధన్యవాదాలు.
Anonymous said…
"ఒక వేసవి సాయంత్రం, సూర్యాస్తమయం తరవాత, మరువం మల్లెపూలు".... ఎక్కెడికో తీసుకెళ్ళిపోయారు.కాకపోతే నేపథ్యంలో రెహమాన్!
బాగున్నాయండీ కబుర్లు
teresa said…
This comment has been removed by a blog administrator.
manipravalam said…
కొత్తపాళీ గారూ,

"వైదేహీ సహితం" వరుత్తం కోసం వెతికాను.కనబడలేదు.మీరు ఎక్కడ విన్నారు?నేదునూరి
ఆల్బం లో ఐతే ఏ ఆల్బమో చెప్తారా ?మా మామయ్యగారు ఈ శ్లోకాన్ని నా చిన్నప్పుడు పదేపదే పాడుకుంటూ ఉండేవారు.ఎన్నాళ్ళ తర్వాతో ఈ శ్లోకాన్ని గుర్తు చేసారు. ధన్యవాదాలు

వెన్నెల
http://manipravalam-vennela.blogspot.com/
aswin budaraju said…
నేదునూరి గారి మనమడు నాడు ఇంజినీరింగ్ లో స్నేహితుడు + నా తోటి బ్లాగరి నా యోగి వేమన బ్లాగుకి మెంబర్ కూడా, నేదునూరి కృష్ణమూర్తి గారిని నాకు పరిచయం చేసినవాడయ్యాడు.
ఈ బ్లాగులో నేదునూరి శ్రీరామ్ కొన్ని పద్యాలు కూడా రాసి సహాయం చేశాడు.
www.yogivemana.blogspot.com
@manipravalam-vennela.. ఇది వారు 1990లలో ఒకసారి అమెరికా పర్యటించినప్పుడు ఇక్కడ వారి శిష్యుడొకతను ఒక స్టూడియోలో రికార్డు చేసిన ఒక సీడీలోదిది. అందులో ముందు క్లుప్తంగా సీతమ్మ మాయమ్మ, తరవాత విపులంగా చక్కని రాజ మార్గము, ఆ తరవాత చివరిగా ఈ విరుత్తం పాడారు. ఈ సీడీ ప్రైవేటుగా మాత్రమే అమ్మారు. ఎక్కడా షాపుల్లో అమ్మలేదు అనుకుంటా.
@aswin - అలాగా .. సంతోషం.