ద్వితీయ విఘ్నం లేకుండా

వ్రాయడమా, రాయడమా? బ్లాగ్లోకంలోకి ఒక కొత్త బాటసారి వచ్చినప్పుడల్లా ఈ వివాదం సరికొత్తగా తలెత్తడం గమనిస్తున్నాను ఈ మధ్య. ఎదుటివారికీ చెప్పేటందుకె నీతులు ఉన్నాయి అని మంచి చురకే వేశాడు ఆత్రేయ .. అదీనూ ఒక తాగుబోతు మాటల్లో. నేను దాన్ని కొద్దిగా సవరిస్తా. ఎదుటివారికి సలహా ఇవ్వడం, ఎదుటివారి తప్పులు (మనం తప్పులు అనుకున్నవి) దిద్దడం అంటే మనకి ఉత్సుకత ఎక్కువ. ఎక్కళ్ళేని ఉత్సాహమూ వచ్చేస్తుంది. రాయలవారి ఆస్థానానికి ప్రెగ్గడ నరసరాజని ఒకడొచ్చాట్ట .. ఏవిటయ్యా ఆయన గొప్పతనం అంటే .. ఎంత గొప్ప కవి చెప్పిన పద్యంలోనైనా తప్పులు చూపిస్తాట్ట! బహు గొప్ప ప్రజ్ఞే. ఇలాగే పెద్దన, తిమ్మన ఇత్యాది మహాకవుల పద్యాల్ని చెరిగి తూర్పారబోశాడు ఈ మహానుభావుడు. నిండు సభలో మహారాజు ముందు ఎంత తలవంపులు? రామకృష్ణుడికి ఇదంతా చూస్తూ కడుపు రగిలిపోతోంది. రాయలవారే చాలా మర్యాదగా .. తప్పుల్లేకుండా పద్యం చెప్పడం ఎలాగో మరి, తమరే అటువంటి పద్యం ఒకటి చెప్పి మా కళ్ళు తెరిపించండీ, విజయపత్రిక పట్టుకు పోండీ అన్నార్ట. అతగాడికి నోరు పెగిల్తేనా? ఇహ అప్పుడు నోరు విప్పాడు రామకృష్ణుడు ..
"తెలియని వన్ని తప్పులని దిట్టతనాన సభాంతరమ్మునన్
పలుకగ రాదు రోరి పలుమార్లు నీ పిశాచపు పాడె గట్ట .."
అని ఇంకాసిని రసవత్తరమైన తిట్లు కూడా తిట్టి ..
"భావ్య మెరుంగవు, పెద్దలైన వారల నిరసింతువా! ప్రెగడ రాన్నరసా! విరసా! తుసా భుసా!" అని చీదరించి పారేశాడు.
బ్లాగ్గుంపు కానీ, బ్లాగు గానీ సభే. ఎంతలేసి వారలుంటారు. ఎన్నెన్నో విషయాలు తెలిసిన వారు, అనుభవజ్ఞులూ, ఆలోచనా పరులూ ఉంటారు. వారికి తెలియదని అనుకోరాదు. కొంత సహనం ఉండాలి, మరి కొంత వినయమూ ఉండాలి పదుగురిలో వ్యవహరించేటప్పుడు.

ఇదంటే, ఇటీవల పర్ణశాల బ్లాగులో జరిగిన వ్యక్తిగత దాడుల వ్యాఖ్యలు గుర్తుకొచ్చాయి. ఇటువంటి పోరంబోకు ప్రవర్తనకి తెలుగు బ్లాగుల్లో స్థానం ఉండకూడదు. నాకు తెలిసి ఆ బ్లాగుకర్త మహేష్ తన బ్లాగులోగానీ ఇతర బ్లాగుల్లో గానీ ఎవర్నీ వ్యక్తిగత వ్యాఖ్యలు చెయ్యడం గానీ దూషించడం కానీ చెయ్యలేదు. జనాంతికంగా నమ్మే నమ్మకాలకి విరుద్ధంగా అతను కొన్ని అభిప్రాయాలు, భావాలు వెలిబుచ్చినంత మాత్రాన ఇటువంటి చవక వ్యాఖ్యలు చెయ్యడం అసభ్యమే కాదు, నీచం కూడా. సత్తా ఉంటే అతని వాదనని ఖండించొచ్చు, మీ వాదన చెప్పొచ్చు, లేకపోతే మీ దారిన మీరు వెళ్ళొచ్చు. వ్యక్తిగత దాడులు మాత్రం నిషిద్ధం.

ఇక్కడ కొత్త బ్లాగరులందరికీ ఒక గమనిక. చాలా మంది వ్యాఖ్యలకి మాడరేషన్ పెట్టుకున్నారు. అంచేత బ్లాగరి అనుమతిస్తేనే ఆ వ్యాఖ్యలు వెలుగు చూసేది. అంచేత, ఒకవేళ ఎవరికైనా అశ్లీలమైనవీ, వ్యక్తిగతమైనవీ, వేధింపు వ్యాఖ్యలు వస్తే ఆ విషయం బయటికి తెలిసే అవకాశం లేదు. ఒకవేళ బ్లాగరులెవరికైనా ఇటువంటి ఇబ్బందులు ఎదురైతే దయచేసి వెంటనే బ్లాగు గుంపు దృష్టికి తీసుకురండి. అనుభవజ్ఞులైన బ్లాగర్లు ఏదైనా ఉపాయం సూచించ గలరు.

మీలో చాలా మంది జురాసిక్ పార్కు సినిమా చూసే ఉంటారు. దానికి ఆధారమైన నవల రాసిన అమెరికన్ రచయిత, మైకెల్ క్రిక్టన్ నవంబరు 4 న మరణించారని తెలిసి విచారించాను. ఈయన మొదట వైద్యుడు. వైద్యం, బయాలజీ ఆధారంగా కొన్ని సైన్సు ఫిక్షను నవలలు రాశాడు. అవి బాగా పాపులర్ అయ్యేప్పటికి పూర్తిగా నవలా రచనకే అంకితమయ్యాడు. అంతే కాక సైన్సుకి సంబంధించిన అనేక ఉద్యమాల్లో ప్రముఖ పాత్ర వహించాడు. గొప్ప గొప్ప పత్రికల్లో వ్యాసాలు రాశాడు వైవిధ్యమైన విషయాలపై. ఈయన నవలల్లో రచనాశైలి నాకు అంతగా నచ్చక నేను ఈయన పుస్తకాలు రెండే చదివాను. కానీ ఆయన సృజనాత్మక ఊహా శక్తిని మాత్రం మెచ్చుకోకుండా ఉండలేం. టీవీలో రెండు మూడు సార్లు చూశాను. సుమారు ఆరున్నర అడుగుల పొడుగు ఆజాను బాహుడు, స్ఫురద్రూపి, మాట్లాడే ప్రతిమాటా ఎంతో తెలివితో ఆలోచనతో నిండి ఉంటుంది. కేవలం 66 ఏళ్ళ వయసులో కేన్సరు మహమ్మారి బారినపడి మరణించడం నిజంగా బాధాకరం.

రొబాటిక్స్ కంపెనీలో పనిచేసే నేను ఈ మాట అనడం కొంచెం విడ్డురంగానే ఉంటుంది గానీ ప్రపంచం రాను రానూ యాంత్రికం ఐపోతోంది. టెలీఫోన్లలో ఆటోమేటిక్ మెసేజిలు చాలా మందికి అనుభవమే. ఇటీవల సూపర్ మార్కెట్లలో చెకౌట్ కౌంటర్లలో కూడా ఈ యాంత్రిక స్వరంతో మాట్లాడే ఆమేటిక్ కేషియర్ మెషిన్లు వస్తున్నై. అమెరికాలో సబర్బన్ రైళ్ళు నడిచే ప్రదేశాల్లో నివాసముండేవారికి రైల్లో ఎనౌన్సుమెంట్లు చేసే మెషీన్ వాయిస్ చిరపరిచితమై ఉండాలి. తన సుదీర్ఘ జీవితాన్ని మనుషుల గొంతులకి అంకితం చేసిన స్టడ్స్ టెర్కెల్ .. మనిషి గొంతు వేపుకి చెవి తిప్పమంటున్నాడు. మనసు పెట్టి వినమంటున్నాడు. ఈ కథ విని నాకైతే చెవుల్లో అర్ధశేరు నవటాకు అమృతం పోసినట్లైంది. మీకేమనిపించింది?

వ్యసనం ..తలలు బోడులైన తలపులు బోడులా? రిటైరైనంత మాత్రాన కోరికలుడిగిపోతాయా? రిటైరైన విశ్వనాథంకి అణగని ఈ వ్యసనం ఏవిటో శ్యాం సోమయాజుల గారు రాసిన భాగ్యలక్ష్మిలో చదవండి.


ఈ మధ్యనే జల్లెడ ద్వారా మధురవాణి అనే బ్లాగు చూశాను. సుమతీ శతకం పద్యాల దగ్గర్నించీ లేటెస్ట్ తెలుగు సినిమా పాటల వరకూ అనేక విషయాల్ని తనదైన శైలిలో వ్యాఖ్యానిస్తూ ఆసక్తికరంగా నడుపుతున్నారు. మీరూ ఓ లుక్కెయ్యండి.

Comments

బ్లాగులలోని కామెంట్ల విషయంలో మీతో నేను పూర్తిగా ఏకీభవిస్తాను.అలా అని కామెంట్లకు మోడరేషన్ పెట్టు కోకుండా వచ్చిన కామెంట్లన్నింటినీ అలా ఉదయం నుండీ సాయంత్రం వరకు ఉంచిన బ్లాగరు బాధ్యత కలిగి ఉన్నట్టా ?, లేనట్టా ?

పూర్వపు అనుభవం పనిచేయదా?

రాసేవరకు కర్త ,ఆ తరువాత సాక్షి ?

అస్పష్టత అల్లరికే దారి తీస్తుంది .
Bolloju Baba said…
థాంకులు
బొల్లోజు బాబా
ఈవారం కబుర్లు కూడా క్రిస్పీగా బావున్నాయి :) తెనాలి వారి పద్యం మాత్రం సూపర్..
ఇంతకీ 'నవటాకూ అంటే ఎంత?
visalakshi said…
కొత్తపాళిగారు ద్వితీయ విఘ్నం లేకుండా చాలా బాగా రాసారు. ఒక చిన్న సందేహం చిన్నప్పుడు చదువుకున్నాను ,రాయల వారి ఆస్థానంలో అల్లసాని పెద్దన ,నంది తిమ్మన ,ఎర్రా ప్రగడ అని ముగ్గురు మహా కవులుండేవారు తెలియక అడుగుతున్నాను .ఈ ప్రగ్గడ నరసరాజు వేరే నా .పేర్లు కలిసినందుకు సందేహం వచ్చింది. కిందటి వారం రాసింది కూడా చదివాను. కొత్త విషయాలు తెలుసుకోవడం వారం, వారం వార్తల ద్వారా ఆనందంగా ఉంది.
@శ్రీకాంత్‌ .. అడగాల్సిన ప్రశ్నలే. బ్లాగరే వాఇకి తనకు సరిపడే సమాధానం చెపుకోవాలని నా అభిప్రాయం.
బాబా, నిషి .. ధన్యవాదాలు. న్వటాకు అంటే నాకూ ఇదమిత్ధంగా తెలీదు :(
@వేద .. ఆంధ్ర సాహిత్య చరిత్రని అతలాకుతలం చేస్తున్నారు! :) ఎర్రాప్రెగ్గడ భారతం రాసిన త్రిమూర్తుల్లో ఒకడు. రాయల ఆస్థాన కవి కాదు. నేణు చెప్పిన ప్రెగ్గడ నరసరాజు కూడా రాయల ఆస్థానంలో ఉన్నవాడు కాదు, విజిట్ కి వచ్చాడు.
Anonymous said…
కామెంట్ల విషయంలో కొంచం మనం జాగ్రత్త వహించాలి అన్న సంగతి కొంచం తీవ్రంగానే ఆలోచించాలి.
This comment has been removed by a blog administrator.
visalakshi said…
క్షమించాలి తప్పులో కాలేసాను. నన్నయ,తిక్కన, ఎర్రాప్రగడ భారతం రాసిన త్రిమూర్తులు. మరి పెద్దన ,తిమ్మన వారితో మూడో కవి ఎవరో గుర్తులేదు.పేరు చూడగానే తికమక పడ్డాను .అన్యధా భావించకండి.
Purnima said…
మీరు విఘ్నం లేకుండా రాసినా, నేను చాలా విఘ్నాలను అధిగమించి ఈ టపా పూర్తి చేశాను.

బాగున్నాయి కబుర్లు! :-)
Aruna said…
Opening చూసి మీరు కత్తి గారికి హితబోధ చేస్తున్నారేమో, ఇకనుండైనా బ్లాగుల్లో హింసాత్మక, విశ్రుంఖల రాతలు తగ్గుతై అనుకున్నను. అన్నీ తెలిసిన పెద్దవారిగా మీ పై నాకు సదా గౌరవం. కాని మీ పెద్దరికాన్ని ఇలా బ్లాగ్లోకం లో అలజడి స్రుష్టిచేవారిని వెనకేసుకు రావడానికి వినియోగిస్తారని అనుకోలేదు.

" నాకు తెలిసి ఆ బ్లాగుకర్త మహేష్ తన బ్లాగులోగానీ ఇతర బ్లాగుల్లో గానీ ఎవర్నీ వ్యక్తిగత వ్యాఖ్యలు చెయ్యడం గానీ దూషించడం కానీ చెయ్యలేదు. "


మీ ఈ వ్యాఖ్య కి నా సమాధానం, శ్రీమాన్ కత్తి గారు నా వ్యాఖ్యానానికి ఇచ్చిన స్పందన లో కనిపిస్తుంది.
"పెళ్ళిలోకూడా లైంగికసాధికారత, తమశరీరంపైన తమ హక్కులేని మహిళల గురించి మీకు తెలీదా? "

ఇది ఒక్కసారిగా చూస్తే అసలే చర్చల వాడిలో వేడిలో కాలిపోతున్న జనాలకి పెద్ద అభ్యంతరంగా అనిపించదు. ఎందుకంటే శ్రీ శ్రీ కత్తి గారు ఇంతకంటే భయంకరం గా రాతలు రాస్తారు కాబట్టి. ఒక్క విషయం చెప్పండి. సదరు మహిళల లైంగికాధికారత చర్చలో పాల్గొన్న మహిళలు ఎంతమంది. అంటే ఇలాంటి చర్చల్లో పాల్గొనడానికె వెనకాడేంత అభ్యంతరకర చర్చలు ఇవి, స్త్రీలకి మాత్రం. అందునా ఇది public place. ఇలాంటీ చోట, ధైర్యం చేసి పాల్గొని ఒక సూచన చేసిన నన్ను పట్టుకొని "మీకు తెలియదా" అనడం డబాయించడం అవుతుంది. మరి "మీకు తెలియదా" అనే పదం నా ఎరుకలో డబాయింపే. కొత్తగా అనూహ్యమైన భాషాపరమైన మార్పులు జరిగి మొన్ననే ఇది గౌరవప్రద ప్రయోగం అయ్యిందేమో నాకు తెలీదు. ఇకపోతే మహిళకకు సాధికారత లేకపోవడం మీకు తెలియదా అని అడగడం లో, మహేష్ గారి వుద్దేశం ఎమై వుంటుంది. నాకు తెలుసు అనా? లేక నాకు తెలియదు అంటే వీరి తదుపరి సమాధానం ఏంటో. ఇవే విషయాల్ని వారికి వ్యాఖ్య రాస్తే అది వెలుగు లోకి రాలేదు.

Irony ఏంటి అంటే, మహిళల అభిప్రాయాల్ని పరిగణన లోకి తీసుకోని వ్యక్తి, మహిళల కోసం పాటుపడుతున్నా అంటూ సిధ్ధాంత రాధ్ధాంతాలు చెయ్యడం. తీర ఒక మహిళ ద్వారా వ్యాఖ్య వస్తే దానిని చీల్చి చెండాడటం. అక్కడ జరిగిన చర్చలో లోపాల్ని ఎత్తి చూపడం నా వుద్దేశం కాదు కాబట్టి, ఇక్కడితో ఆగుతున్నా.


అసభ్య వ్యాఖ్యాతల ని నియంత్రించే చర్యలను initiate చేస్తున్నందుకు, తగు హెచ్చరికలు జారీ చేసినందుకు బ్లాగులోకం మీకు సర్వదా ఋణపడి వుంటుంది.


అసభ్య, అశ్లీల వ్యాఖ్యలు కూడదు అని చెప్పాలి అనిపిస్తే అదే ముక్క సూటి గా చెప్పచ్చు కదా. అందరిని మాటకి మాట అన్న అతన్ని, "నాకు తెలిసి ఆ బ్లాగుకర్త మహేష్ తన బ్లాగులోగానీ ఇతర బ్లాగుల్లో గానీ ఎవర్నీ వ్యక్తిగత వ్యాఖ్యలు చెయ్యడం గానీ దూషించడం కానీ చెయ్యలేదు." అంటూ వెనక వేసుకు వచ్చిన మీ తీరు నన్ను ఆశ్చర్యపరిచింది. లైంగిక సాధికారత, free society లాంటి పదాలతో అసలు సిధ్ధాంతాలని తెలివిగా విచ్చలవిడితనాన్ని ప్రోత్సహించడం కోసం వాడుకొంటున్న అతని రాతల్ని మీరు ఒక అభిప్రాయంగా మాత్రమే తీస్కోవడం చూసి, మీ సహనశక్తి నన్ను అబ్బురపరిచింది.

Anyway, Thank you Sir.
Shiva Bandaru said…
వ్యక్తిగత దూషణలను నేను వ్యతిరేకిస్తాను . ఎవరు ఎవ్వరిమీద చేసినా సరె .
@శ్రీకాంత్: ప్రస్తావన నాదేకాబట్టి సమాధానం చెప్పడానికొచ్చాను. నన్ను ధూషిస్తూ రాసినా ఆ వ్యాఖ్యల్ని ట్రోఫీల్లాగా పొద్దున్నుంచీ సాయంత్రంవరకూ పెట్టుకోవాల్ని నేను కోరుకోలేదు.

మొదటగా అంతటి దిగజారుడు ధూషణల్ని చేసే నాగరికులు ఈ బ్లాగులోకంలో ఉంటారని నేను అనుకోలేదు. ఒకవేళ పూర్వానుభవం కొంత నేర్పినా, బ్లాగు రాయడంతోపాటూ నేను ఉద్యోగంకూడా చేస్తాను. ఆ సమయంలో బ్లాగులు అదేపనిగా చూసి, వాటిని మోడరేట్ చెయ్యడమో లేక వ్యాఖ్యల్ని డిలీట్ చెయ్యటమో కుదరని పని.

కొందరు స్నేహితులు వ్యాఖ్యల్ని చూసి mail పంపేవరకూ మొదటి వ్యాఖ్యని మినహా మిగతా ధూషణల సంగతి నాకు తెలీదు.

టపా రాసిన తరువాత సాక్షిగా,విషయంపై చర్చకు బాధ్యుడిగా నేనుండటానికి ఎప్పుడూ ప్రయత్నించాను. కానీ,వ్యక్తిగత దాడులూ ధూషణలూ సహించే అవసరం,అగత్యం నాకు ఏమాత్రం లేవు. అదీ నా బ్లాగులో.

విషయంలోనో లేక టపాల్లోనో అసృష్టత లేని దెవరికి? ఒక్క టపా చూపించండి, కూర్చుని వెతికితే ప్రతిదాంట్లోనూ కొన్ని వందల రంధ్రాలు కనిపిస్తాయి.

బ్లాగంటే,నేను రాసుకునే నా అభిప్రాయాలు.అవి public domain లో ఉన్నాయి కాబట్టి, కొన్ని హద్దులకి లొబడి రాయాలి అంతే! ఇంతవరకూ నేను రాసిన ఏ టపా "చట్టవిరుద్ధం" కాదు.వ్యక్తిధూషణకు పాల్పడలేదు. నాపై దాడి జరిగినప్పుడుకూడా మాటలు మీరలేదు.

ఇంతకన్నా బాధ్యతగా ఎలా వ్యవహరించాలో చెబితే వాటిని ఆచరించగలను.
Anil Dasari said…
బాగా చెప్పారు.
teresa said…
@అరుణ - కొత్తపాళీ గారు కత్తి గార్ని వెనకో ,పక్కనో వేసుకొచ్చినట్లు నాకనిపించలేదు గానీ మీరు ఆయన తన పెద్దరికాన్ని దుర్వినియోగం చేస్తున్నట్లు ఆరొపించడం అసలు సబబుగా కనిపించడంలేదు. మీ వ్యక్తిగత బయాస్‌ ప్రక్కనుంచి మరోసారి ఈ టపా చదివి చూడండి.
teresa said…
నవటాకు అంటే పావుశేరులో సగం అని కనుక్కున్నాను :)
@అరుణ: "మీకుతెలీదా" అనడం దబాయించడం కాదు. Pubic domain లో వున్న knowledge మీకు తెలియనిది కాదు అన్న భావనతో మాత్రమే. పైగా, అమాట అన్న వెంఠనే నేనే మరో వాక్యంలో "నిజానికి family and social pressure కు లోనై తమ శరీరాలపై అధికారాన్ని కోల్పొతున్న మహిళలు కోకొల్లలు. Reproductive rights and sexual liberation యొక్క నేపధ్యమే అది" అని ఆ ప్రశ్నకు సమాధానం చెప్పాను.

అంటే, ఇక్కడ ‘నేను చెబుతున్న పాయింట్ మీకు తెలియనిది కాదు’ అన్న ఉద్దేశంతో "మీకు తెలీదా?" అని ప్రశ్నించడం జరిగిందేగానీ. దబాయించడానికి కాదు.

చర్చల్లో ఆడవారికొక న్యాయం మగవారికొక న్యాయం వుండదు.మీ వ్యాఖ్యనిబట్టే నా సమాధానం వుంటుంది.

మీ అభిప్రాయాల్ని పరిగణలోకి తీసుకోలేదని ఎలా అనుకున్నారు?

"ఎంతదాకో ఎందుకు మీ ఇంట్లో ఆడవారి దగ్గర ఇలాంటి చర్చ పెట్టండి. వారి అంగీకారం ఎంతవరకు వుంటూందో చూడండి. వారు మేధావులు కాదు కాబట్టి, వారిని చర్చల్లో దింపను అనుకుంటే, మీకొక మాట. భావాలు అందరివి ఒకేలా వుంటాయి." అని మీరు నా వ్యక్తిగత జీవితంలోకి ప్రవేశించినా, మర్యాదా పూర్వకంగానే "నేనొక మేధావినన్న అహం లేక అపోహా రెండూ నాకు లేవు. కాబట్టి,నేను ఈ విషయాలు మా ఇంట్లో చర్చించనని మీరు అనుకోనవసరం లేదు. My wife is more qualified to discuss these things, as she is a clinical psychologist herself." అని సమాధానం ఇచ్చాను.

అంతేతప్ప, మీకు నా కుటుంబం గురించి మాట్లాడే హక్కులేదని వాదించానా? I am trying to be as accommodating as possible.ఇక మీఉద్దేశమే offense తీసుకోవడమైతే ఎవరూ ఏమీ చెయ్యలేరు.

చివరిగా ఒకమాట,మీరు "శ్రీమాన్ కత్తిగారు" అంటూ ఈ వ్యాఖ్యలో పొయిన వ్యంగ్యానికీ పోయారు. అలాగే, నా వ్యాఖ్యను వక్రీకరిస్తూ నాకు స్త్రీలపట్ల గౌరవంలేని వ్యక్తిగా లేక నేను చర్చించే విషయాలపట్ల నిబద్ధతలేని వ్యక్తిగా చిత్రించడానికి ప్రయత్నించారు.పైపెచ్చు "లైంగిక సాధికారత, free society లాంటి పదాలతో అసలు సిధ్ధాంతాలని తెలివిగా విచ్చలవిడితనాన్ని ప్రోత్సహించడం" చేస్తున్నానని అపవాదు వేసారు. ఇన్ని అభాంఢాలు వేస్తూ మీ వ్యాఖ్యలకి నేను ‘మీరు కేవలం మహిళ గనక మర్యాదా పుర్వకంగా సమాధానం ఇవ్వాలని’ ఆశిస్తారు.

ఇక్కడ స్త్రీత్వాన్ని advantage గా తీసుకునే ఉద్దేశం ఎవరికుందో తేటతెల్లమైపోతుంది. స్త్రీకైనా వారి వ్యక్తిత్వాన్నిబట్టి, ఆలోచనల్నిబట్టి నేను గౌరవిస్తానేతప్ప, కేవలం స్త్రీకాబట్టి నిర్హేతుకమైన వాదన చేస్తే అంగీకరించను.You command respect in my blog,if you have a point to put forth. Not because you are a women.Please don't expect such chivalry from me.
Ramani Rao said…
కొత్తపాళీ గారికి: మీ వారం వారం కబుర్లు ఇలా నిర్విఝ్నంగా, నిర్విరామంగా కొనసాగలని మనస్పూర్తిగా పూర్తిగా కోరుకొంటూ..

@ అరుణ గారు: క్షమించండి నేను కలగజేసుకొంటున్నందుకు, నాకు తెలిసిందేదొ మీ వ్యాఖ్యకి స్పందనగా చెప్పాలనిపించింది.
మీరు కార్లోనో, కాలినడకనో బయటకి వెళ్ళినప్పుడు మార్గమధ్యలో ఎక్కడన్నా ఎవరికో ప్రమాదం లాంటిది సంభవించినప్పుడు, మీరు ఆలోచించేది ఏమిటి? గాయపడ్డ ఆ వ్యక్తి మంచివాడా, చెడ్డవాడా, అతని స్టేటస్, అతని మిత్రులు, శతృవులు గుర్తొస్తారా? లేక, మనం కార్లోనో, కాలినడకనో, వెళ్తున్నాము ప్రమాదమన్నది మన స్టేటస్ కి తగినది కాదు అని ఆలోచిస్తామా? అసలీ ఆలోచనలేవి మనకు రావు. అప్రయత్నంగా మన నోటినుండి వచ్చేమాట ఒక్కటే "అయ్యో పాపం ", మనకి తెలియకుండానే వచ్చేమాట అది, ఎందుకంటారు.. అవతలపక్క గాయపడింది "సాటి మనిషి" అన్న ఒకే ఒక్క కారణం. అతను మన చుట్టము కాదు, పక్కము కాదు మరి ఎవరో ముక్కు మొహం తెలియని వ్యక్తి గురించి మనకి తెలియకుండానే మనం మన ఫీలింగ్ ని బయటపెట్టాము.

అలాగే "సాటి బ్లాగరు" తనకు తెలియకుండానే, అనామక, అసభ్య వ్యాఖ్యలకి గురై నప్పుడు అతని ఇంతకు ముందు ఏమి రాసారు, అతనికి ఎంతమంది శత్రువులు ఉన్నారు ఇవన్నీ ఆలోచిస్తామా? లేక సాటి బ్లాగరు పడ్డ బాధని గుర్తించి, విజ్ఞత పాటించి, సదరు బ్లాగర్ని, మిగతావాళ్ళని జాగ్రత్తగా ఉండమని మంచి చెబుతామా? అక్కడ మహేష్ గారనే కాదు, ఆ స్థానంలో ఎవరున్నా, కొ.పా గారైనా ఇంకొకరైనా ఇలాంటి సలహానే ఇస్తారు , మహేష్ గారి స్థానంలో మీరున్నా, నేనున్నా ఇలాంటి సలహాలే అందుకొంటాము. లేదు అవసరం లేదు దీనికి స్పందన వద్దు. అన్నీ వినేసి, చదివేసి ఊరుకొందాము అనుకొంటే అసలు బ్లాగులు వాటికి వ్యాఖ్యలు, ఎలాంటి స్పందనలు కూడా అవసరం లేదు. ఇంట్లో వీటికి ప్రత్యామ్నాయంగా డైరీలు, నోట్ పుస్తకాలు ఉన్నాయి.

పరిమితులేమన్నా అతిక్రమిస్తే క్షమించండి. ఒకరి పెద్దరికాన్ని ప్రశ్నిచే హక్కు మనకి లేదు.
మహేష్ కుమార్ గారు,
వివాదాస్పదమైన అంశాలమీద టపాలు (అందులో సత్యాసత్యాలు పక్కనపెతే)రాసినపుడు, జనం ఆవేశ కావేశాలకు లోనయ్యే వ్యాఖ్యలు రాసే అవకాశం ఉందనిపించినపుడు మీరు కామెంట్ మోడరేషన్ పెట్టడంలో మీకు ఇబ్బందేమిటి చెప్పండి? మీరు ఉద్యోగం కూడా చేస్తూనే, రోజుకొక టపా రాస్తున్నారు. కొండొకచో రెండు కూడా! టపా రాయడమంటే కామెంట్ రాయడమంత తేలిక కాదు. బ్లాగు రాయడమన్న మీ అభిరుచికి మీరు ఇంత టైము కేటాయిస్తున్నపుడు, మీకొచ్చిన కామెంట్లు చూడ్డానికి మరికొంత సమయం కేటాయించుకుని అసభ్యతకు తావు లేని కామెంట్స్ ప్రచురించడానికి మీకున్న అభ్యంతరమేమిటి?
కబుర్లు బాగున్నాయి కొత్త పాళీ గారు... క్రిక్టన్ గారి మరణం నన్ను చాలా విచారానికి గురిచేసింది.... శైలి ఏమో కాని నాకు ఇతని నవలలు చాలా informative గా ఆసక్తికరం గా అనిపిస్తాయి. సైన్సు ఫిక్షన్ రాసినా... చాలా రీసెర్చ్ చేసి అది నిజం గా జరగవచ్చేమో అన్నంత వాస్తవికం గా రాస్తారు... Airframe లాంటి నవలల్లో విమానాల గురించి ఎన్నో తెలియని కొత్త విషయాలని సాధరణ పాఠకుడి దరికి చేరుస్తారు. తను కేన్సర్ తో మరణించడం బాధా కరం.
Aruna said…
@teresa.
వ్యాసాన్ని నేను personal bias తో చూడలేదు Madam. Anyway thank you for your kind suggestion. [:)] Btw, కొత్తపాళీ గారి మీద నేను ఆరోపణలు వేశాను అనిపిస్తే వారే నాకు సమాధనం ఇచ్చుకోగలరు లెండి. [:)]

@కత్తి
మీకు మాటకి మాట అనడం తప్ప అభిప్రాయాలకి గౌరవం ఇవ్వడం, అభిప్రాయపు లోతుల్ని స్ప్రుశించగలగడం తెలియదు. ఇలాంటి మనిషి ని వెనకవేసుకు వచ్చిన తీరు నాకు నచ్చక నేను ఇక్కడ వ్యాఖ్య రాయడం జరిగింది. నాకు ఎందుకు నచ్చలేదో నా వ్యక్తిగత అభిప్రాయాలు నేను చెప్పాను. మీ నుండి గౌరవం ఆశించాల్సిన అవసరం నాకు లేదు. . Btw, I dont know the meaning of big words like chivalry. [:)] నేను మీ అంత గొప్పగ ఆంగ్లం సదూకోలేదు లెండి. [:)] Moreover, మీ వ్యక్తిగత జీవితాన్ని నేను చర్చ లోక్ లాగలేదు. మీరు నా వ్యాఖ్య -ve గా తీస్కుని వుంటే వ్యాఖ్య ని అనుమంతిచకపోయి వుండాల్సింది. నా మాటలకి అర్ధాన్ని వక్రీకరించడానికి అనుమతించారా.. లేదు అంటే, అప్పుడు ఏమి అనిపించని వ్యాఖ్య ఇప్పుడు అంత వక్రం గా కనిపిస్తోందా. నువ్విలా.. నేను ఇలా ..అంటూ మీ గురుంచి, నా గురుంచి explanations కోసం నేను ఇక్కడ కామెంటలేదు. నా అభిప్రాయం ఇక్కడ చెప్పాను. సోదాహరణల తో వివరించాను. నా అభిప్రాయం సరి ఐనది గ అనిపిస్తే కొత్తపాళీ గారు వ్యాసం లో మార్పులు చేసి వుండేవారు. చెయ్యలేదు కాబట్టి. ఇక్కడ నా అభిప్రాయం సరి ఐనది గా వారికి తోచి వుండక పోవచ్చు అనిపిస్తోంది. There ends the matter. I am not interested in arguing with you.
@కొత్తపాళీ
మీమీద ఆరోపణలు చేసే వుద్దేశం నాకు లేదు అండి. ఈ పాటికి ఆ విషయం మీరు గ్రహించే వుంటారు. [:)]
Dear Mahesh,

What I mean by " aspastatha "

Jumping into different levels of ideas/subjects in a single post
and diluting the focal point of
the selected topic.

this might be caused by great urge to syncronise your acquired knowledge at different levels .

This is my eye, your /others view may differ
@అరుణ .. మీకు నా మీద ఉన్న ఆదరాభిమానాలకి సంతోషం. ఈ సంఘటన వలన అవి సన్నగిల్లుతాయి అంటే .. నేను చెప్పగలిగిందేమీ లేదు. So be it. "I may disagree with what you have to say, but I shall defend to the death your right to say it." అనే సూక్తిని నేను ఎప్పుడూ నమ్మాను. నేను నమ్మిందే ఇక్కడ రాశాను. అందులో ద్వంద్వ వైఖరి కానీ, నాంచుడు కానీ లేదు, ఉండబోదు. దానికి మీ స్పందన, ప్రతి స్పందనలు చూశాక ఇంకేమీ చెప్పబుద్ధి కావడం లేదు. చెప్పడానికి ప్రయత్నించినా, అది చర్విత చర్వణమవుతుంది.
@వేణూశ్రీ .. మీరూ సై ఫై అభిమానులా? సంతోషం. మరి కొంతమందిమి ఉన్నాము ఈ బాపతు. చదివిన పుస్తకాలు, చూసిన సినిమాల ముచ్చట్లు మీ బ్లాగులో పంచుకోండి వీలైతే.
Anonymous said…
మహేష్ బ్లాగులో రాసిన చెత్త కామెంట్లని ఖండిస్తూనే ఒక మాట చెప్పదలచుకున్నాను. మహేష్ రాసినదాన్లోంచి లాజికల్గా కంక్లూజన్స్ లాగితే, అవి ఆ అనామక వ్యాఖ్యాత చెప్పిన ‘చెత్త మాటలు’ గానే పరిణమిస్తాయి. ఆ అనామకుడు ‘Disproportionate Force' ఉపయోగించడం వల్ల అసలు సంగతి మరుగున పడి, ‘వ్యక్తిమీద దాడి’ మాత్రమే పైకొస్తోంది. అవే ఉపన్యాసాలు ముఖాముఖి ఇచ్చి చూడండి. వినేవాళ్ళ మనసుల్లోనో, ధైర్యంగల వాళ్ళ మాటల్లోనో అవే కామెంట్లు రాకపోతే - అప్పుడు చెప్పండి. ఇలాంటి చెత్త మాట్లాడేటప్పుడు, అలాంటి చెత్తే మొహం మీద పడుతుందని గ్రహించకుండా, ఇప్పుడు బేల మాటలు మాట్లాడ్డం చూస్తే నవ్వొస్తోంది.
Anonymous said…
అరుణ, నేను తెలుగు బ్లాగులు రెగ్యులర్ గా చదువుతాను. మీ వ్యాఖ్యల పదును చూస్తేనే తెలుస్తోంది మీరెంత సదూకున్నారో! మిమ్మల్ని కించపరుస్తూ మాట్లాడారని సదరు బ్లాగర్ మీద అభియోగం చేస్తూ మీరు చేస్తున్నదేమిటి? "మీ అంత ఆంగ్లం నేను సదూకోలేదులెండి" అనడం వెటకరించడం కాక మరేమిటో?

"మీకు తెలీదా?" అంటే వ్యక్తిగత దుషణ అవుతుందని మీరంటున్నారంటే మీరేం సదూకున్నారో నిజంగానే అర్థం కావట్లేదు. మీకు తెలీదా అంటే మీకు తెలుసో తెలీదో చెప్పాలి. రెండూ కాకుండా ఇలా రాద్ధాంతం చెయ్యడం ఏమిటో?

"కొత్తపాళీ గారి మీద నిందలు వేశానని అనుకుంటే వారే సమాధానం ఇచ్చుకోగలరు లెండి"...మీ నిర్లక్ష్య ధోరణికి ఈ వాక్యమొక్కటి చాలు. మీకు సమాధానాలు ఇచ్చుకోడానికే అందరూ ఫ్రీగా కూచుంటారని అనుకుంటున్నారా?
Aruna said…
@కొత్తపాళీ
మీమీద నాకుండే good impression నా భావనల వరకే పరిమితం. వాటికి మీరు విలువ ఇవ్వాలని ఇప్పటివరకు ఆశించలేదు. మీరు విలువ ఇచ్చినట్లైతే ధన్యురాలిని. ఇప్పటికే పదే పదే నేను ఏ వుద్దేశం తో వ్యాఖ్య రాశానో చెప్పాను. మీ బ్లాగుల ద్వారా మీరు నాకు పరిచయం కానీ, నేను మీకు పరిచయం లేను అని మరచాను.

@రమణి
ప్రశ్న తో నే జీవితం మొదలు అవుతుంది అని నేను నమ్ముతానండి.
@సుజాత: ఇప్పుడు నా బ్లాగులో కామెంట్ మోడరేషన్ ఉంది. అంతేకాక,అనామకవ్యాఖ్యలు ఎలాంటివి వచ్చినా నిర్ధ్వందంగా reject చెయ్యడానికి నిర్ణయించుకున్నాను. ఇప్పుడు నిజంగా నాబ్లాగుకి నేనే సుమన్.

@శ్రీకాంత్: మీవివరణకి ధన్యవాదాలు. నేనొక టపా రాయడం మొదలెట్టాక its takes its own shape.ఇంతకుముందెప్పుడో చదివిందీ,నేను నేర్చుకున్నది, ప్రస్తుతం నాకు రెఫెరెన్స్ గా ఉన్నవీ అన్నీ ఒకటిగా మారి టపా తయారవుతుంది.

Because I know my stream of consciousness and its sources,I have no ambiguity in what I write.కాకపోతే, ప్రతిసారీ వీలైనంత organized గా రాయడానికే ప్రయత్నిస్తాను.

మొన్నకూడా సీబీ రావుగారడిగేంతవరకూ reproductive rights మీద WHO guidelines అందరికీ తెలిసుంటాయనే అపోహలోనే ఉన్నాను. అదే అపోహతో టపా రాసానుకూడా.

కొందరు నా టపాలు కనీసం పూర్తిగా చదవకుండా,కేవలం నేను ఇంతకుముందు ప్రతిపాదించిన అభిప్రాయాలనీడలో కొన్ని key words కనబడగానే conclusions లోకివచ్చి విరుచుకుపడిన సందర్భాలే ఎక్కువ.అందుకే రాసినటపాకి వాళ్ళడిగే ప్రశ్నలకీ పొంతనుండదు.

నేను మెకాలే మినిట్స్ గురించి రాస్తే, బ్రిటిష్ పాలనమొత్తం ఎందుకు రాయలేదంటారు.నేను reproductive and sexual right గురించి మాట్లాడితే,విచ్చలవిడితనాన్నో లేక వ్యభిచారాన్నో ప్రోత్సహిస్తున్నానంటారు. వీరికి sex కీ sexuality కి కూడా తేడాతెలీదు. Should my ambiguity to be blamed for their ignorance?
Aruna said…
@కొత్తపాళీ
Yup one thing I forgot to explain you Sir.
ఈ ఒక్క సంఘటన ద్వారా నేను మీ పట్ల నాకు వున్న గౌరవం తగ్గించుకోలేదు. సదభిప్రాయల్ని మార్చుకోలేదు. రెండు సంవత్సరాలుగా నాకు తెల్సిన కొత్తపాళీ గారి దగ్గర, నాకు తెల్సిన వాళ్ళ దగ్గర నాకు వున్న చనువు తో మాట్లాడినట్లే, మీ బ్లాగులోను వ్యాఖ్యానం రాసాను. కాని ఇదే సందర్భం లో ఒక చిన్న విషయం మరిచాను. సచిన్ టెండుల్కర్ నాకు తెల్సు గాని, అతనికి నేను తెలియదు అని. సచిన్ ఇంటికి నేను వెళ్ళినప్పుడు నేను పాటించాల్సిన బాహ్య మర్యాదలు చాలా వుంటాయి అని.
కొత్తపాళీ గారు,

చర్చ ఎక్కడో మొదలై ఎక్కడికో వెళ్ళిపోయింది.
క్రైటన్ మరణ వార్త మీరు వ్రాసేవరకు నాకు తెలియలేదు. చాలా విచారించాను. ఆయన రచనలు నాకు బాగా నచ్చుతాయి. మీకెందుకు నచ్చలేదో! నా ఉద్దేశంలో అసిమోవ్ తరువాత scifi వ్రాసిన రచయితలలో క్రైటన్ దే అగ్ర తాంబూలం. రెండుమూడు ఉత్తరాలు కూడా వ్రాశాను ఆయనకు. "స్టేట్ ఆఫ్ ఫియర్ " చదివిన తరువాత, దాని అనుబంధ రచనలు చదివాక గ్లోబల్ వార్మింగ్ గురించి నా దృక్పథం లో చాలా మార్పు వచ్చింది.

ఐతే మీరూ సైఫై అభిమానులన్న మాట!
Nagaraju Pappu said…
వారం వారం కబుర్ల ఆలోచన చాలా బావుంది. మీరు చెప్తున్న కబుర్లు భలే రంజుగా ఉన్నాయి - ఈ శీర్షిక ఇలాగే నిర్విఘ్నంగా కొనసాగిస్తారని ఆశిస్తాను.

ప్రెగ్గడ నరసరాజు సన్నివేశం తెనాలి రామకృష్ణ సినిమాలో ఉంది కదా. మీరుదాహరించిన పద్యం ఏయెన్నార్ హూంకరిస్తూ ఓ టైపులో అభినయిస్తాడు. రాయలు శాంతించు రామకృష్ణా, వారు మన అతిథులు, అతిథులని సత్కరించి పంపడం మర్యాద, వారిని అవమానించరాదంటాడు కదా..

ఇప్పుడు ఆ సంప్రదాయం సుమారుగా సమిసిపోయినట్టుంది. Impatience and intolerance have become the seal and signature of this age. అసహనం, ఓర్వలేనితనం ఇప్పుడు అందరిలోనూ, అన్నిచోట్లా ఉన్నాయి. ఇప్పటి ప్రపంచంలో ఏ వ్యక్తీ దీనికి మినహాయింపు కాదేమో. The degree may vary, the expression may vary - అంతే. ఇంటా, బయటా, ఉద్యోగాలలో, రెస్టారెంట్లలో, రైల్వేస్టేషన్లలో, సిటీ బస్సులలో, ట్రాఫిక్ జంక్షన్ల దగ్గరా - అన్ని చోట్లా అసహనమే విలయ తాండవం చేస్తోంది. దీనికి బ్లాగులు మినహాయింపు కావాలంటే ఎలా అవుతాయి?

ఒక్కటి మాత్రం నిజం - The internet is not for the faint hearted. అనుభవం మీదనో, అనుభవజ్ఞులైన వారి సలహాలు పాటించో ఇక్కడ ఎలా మసలుకోవాలనేది ఎవరికి వారు నేర్చుకోవాల్సిందే. ఇక్కడ నియంత్రణ సాధ్యం కాదు కాబట్టి - సొంత బ్లాగులో టపాలుకాని, ఇతరుల బ్లాగులలో వ్యాఖ్యలు గాని ఏం రాస్తాం, ఎలా రాస్తాం అని ఎవరికి వారునిర్ణయించుకోవాల్సిందే. ఎవరైనా ఎంతవారైనా ఏదో కొంత ప్రశంసలు కొన్ని అవమానాలు ఇక్కడ పొందక తప్పదు. The net seems to be the ultimate level playing field.

"వ్యక్తిగత దాడులు నిషిద్ధం" అని మీరన్నప్పటికీ వాటిని ఆపగలిగే మార్గాలేవి లేవు కదా? ఒకవేళ వ్యాఖ్యలలో వ్యక్తిగత విమర్శలు ఉండరాదని శాశించాలంటే, దానికి ముందుగా బ్లాగులలో టపాలు ఎలా ఉండాలి అనే శాశనమూ అవసరమవుతుందేమో కదా? ఈ రెండూ ప్రస్తుతానికైతే సాధ్యమయ్యేవి కాదు. The net provided us a true democratic platform - but, if we don't deserve it, it will not remain as such. అంజుమణ్ణీ రామదాస్ లాటివాడెవడో జాలానికి కూడా ఓ హెల్త్ మినిస్టర్ గా తయారవుతాడు. విచ్చలివిడితనం పెచ్చుపెరిగిపోతే నియంత్రణ అవసరమవుతుంది - నియంతృత్వమూ ప్రబలుతుంది. అంతవరకూ రాదనే ఆశిద్దాం. అంతకుమించి చేయగలిగిందేవుంది?

ఏవైనా, తెలుగు బ్లాగుల్లో అనానిమస్ వ్యాఖ్యలు చెయ్యగలిగే సౌకర్యం చాలా వరకూ దుర్వినియోగం అవుతున్నట్టుంది - చాలా బ్లాగులలో, అనామిక వ్యాఖ్యలు తుంటరిగానో, అసభ్యంగానో ఉంటున్నాయి (కొన్ని మినహాయింపులు లేకపోలేదు), దీని మూలంగా ఇక బ్లాగర్లందరూ కామెంటు మోడరేషను పెట్టుకొంటే - ఆ వెసులుబాటు కాస్త పోతుంది. మనమెవరమో ఎవరికీ తెలీదు కాబట్టి మనమేం చేసినా చెల్లుతుంది అనుకొంటే మట్టుకు పొరబాటే - ఎందుకంటే, మనమేం చేస్తున్నామో మనకి తెలుసుగా? ఓ బ్లాగ్లో, ఓ వ్యాఖ్యో రాస్తే -అది ఈ జాలంలో పెర్మనెంటుగా పడి ఉంటుంది. ఓ పదేళ్ల తర్వాత మన ఒకప్పటి ప్రవర్తన మనకే సిగ్గు చేటుగా అనిపించకుండా మొలగగలిగితే అదే ఓ పెద్ద ఎఛీవ్‌మెంట్ ఇక్కడ.

అయితే, అంతర్జాలమే ఒక వర్చువల్ ప్రపంచం కాబట్టి ఇక్కడ జరిగే యుద్ధాలు వర్చువలే, చిందే రక్తాలు వర్చువలే (కనీసం సినిమాలలోలా టమాటా కెచప్ కూడా అవసరం లేదు). అంతిమంగా ఎవరికీ ఏమంత నష్టమేమీ రాదనుకోండి. కాబట్టి, అబ్రకదబ్రగారి బ్లాగులో మీరన్నట్టు - అప్పుడప్పుడు ఇలా టీ కప్పులో తుఫానులు వస్తూ, పోతూ ఉంటాయి. బ్లాగులు ఎక్కువవుతున్న కొద్దీ ఈ తుఫాన్ల తీవ్రత, ఫ్రీక్వెన్సీ కూడా పెరుగుతూ ఉంటాయి కాబోలు.

I hope Mahesh continues to write and communicate on whatever topic he wishes to and in whichever manner he sees fit.

And, I hope that the people who want to encourage/discourage other bloggers would continue to do so in what ever manner they see fit. In a strange way, this is also necessary to keep the bloggers in check. The bloggers have to realize that they are interacting with a very large and diverse community - and that community in turn would respond and react in its own strange fashion.

And, I do hope that once in a while a sane voice like yours will raise above the filth and squalor to highlight the need for tolerance.

ఇంతకుమించి నాకు వేరే మార్గం తోచటంలేదు. లేక ఉందంటారా?

@ అరుణా: ప్రపంచంలో మనకి నచ్చింది ఒక్కటే ఉండాలంటే, నెలకో రోజు తప్పించి మనకి మనమే మిగలమేమో కదా? వేరొకరి ఆలోచనలకో, అభిప్రాయాలకో విలువలు నిర్దేశించడానికి మనకేం హక్కు, అధికారం ఉన్నాయి? విభేదించవచ్చు, పోరాడవచ్చు, కాని ఆ వ్యక్తికి సంఘంలో స్థానం ఉండకూడదంటే ఎలా?
@పప్పు నాగరాజు:Well summarized and suggested sir!కాకపోతే, ఒక సవరణ.చర్మం మందకన్నా, భావవైశాల్యం అటు నిజప్రపంచంలోనూ ఇటు వర్చ్యువల్ ప్రపంచంలోనూ ప్రశాంతతనిస్తుంది.అభీష్టానికి అనుగుణంగా బ్రతికే స్థైర్యాన్నిస్తుందనుకుంటాను.

ప్రస్తుతం intolerance, impatience పెరగడానికి ఆ భావవైశాల్యలేమి కారణమనుకుంటాను. అందుకే చర్మపుమందాన్ని పెంచుకొని చలనరహితులవడంకన్నా, భావవైశాల్యం పెంచుకుని విజ్ఞులవడం మంచిదని నా అభిప్రాయం.
Bolloju Baba said…
many of my doubts are clarified in nagaraju gaari post.

thankyou
నాగరాజు గారూ, నమస్తే. చాలా బాగా చెప్పారు.
మహేష్, తోలు మందం చేసుకోవాలన్నది చలన రహితులుగా ఉండమని కాదు, ఏ కాస్త అలజడి జరిగినా, వ్యతిరేక పవనం వీచినా, నా మనోభావాలు దెబ్బతిన్నాయో అని గగ్గోలు పెట్టకుండా ఉండమనే ఉద్దేశంలో.
Unknown said…
కబుర్లు బాగున్నాయి. క్రిక్టన్ మరణం గురించిన వార్త బాధాకరం. జురాసిక్ పార్కు, లాస్ట్ వరల్డ్ లాంటి ఊహాజనితమయిన నవలలను సాధికారికంగా మనం చదవగలిగేలా చేసిన ప్రజ్ఞ ఆయన సొంతం.

ఎక్కడ చూసినా ఈ "గోలే" బ్లాగులలో. కాస్త తెరిపిన పడితే బాగుంటుంది.

ఇక మహేశ్ గారు చెప్పిన భావ వైశాల్యం నాకు అర్థం కాలేదు. ఎవరి భావాలు వారికుంటాయి, ఎవరివి వారికి సరయినట్టనిపిస్తాయి. అలాంటప్పుడు నీ పద్ధతి మార్చుకో, వైశాల్యం పెంచుకో అప్పుడు నీ స్థాయి పెరిగి విజ్ఞుడవుతావు అని ఆయన చెప్పడం హాస్యాస్పదంగా ఉంది.
ఆయన డెఫినిషన్ లో వైశాల్యం అనుకున్నది నాకు కాకపోవచ్చు. ఆయనే భావ వైశాల్యం తగ్గించుకుని ఇతరుల ఆలోచనలకూ ఇంక్లూసీవ్ గా ఉండచ్చు కదా అని నేనంటే ? :)