Friday, May 28, 2010

పదాలకి అర్ధాలు

ఆనవాలు = గుర్తు. చిహ్నము అని ఎవరో చక్కటి మాట చెప్పారు. ఇది నామవాచకం. బయట పెద్ద గన్నేరు చెట్టు ఉంటుంది - అదే వాళ్ళింటికి ఆనవాలు. ఐతే దీన్ని ఎక్కువగా ఆనవాలు పట్టడం అనే క్రియా రూపంలో వాడుతున్నాము. అదికూడా మనిషిని పోల్చడం అనే అర్ధంలో. తమాషాగా, నిఘంటువులో దీని అర్ధం "అడియాలం" అని ఇచ్చారు - ఈపదాన్ని తమిళంలో ఇప్పటికీ ఉపయోగిస్తారు, ఇదే అర్ధంలో.
తెరువు = దారి. ఈ పదంకూడా తమిళంలో ఇదే అర్ధంలో ఇంకా వాడుకలో ఉంది.
కలిమి = సంపద
సమ్మర్దం = తొక్కిడిగా నున్న సమూహం. యుద్ధము అని కూడా అర్ధం ఉన్నదిట. జనసమ్మర్దం అంటే జన సమూహం.
విహ్వలం = విపరీతమైన అలజడి చెంది, తద్వారా అవయవాల నియంత్రణ లేకపోవడం .. to lose control; విహ్వలించు = to be in such a state.

Wednesday, May 26, 2010

అబ్బ .. వైసైపోతోంది

ఒక చోట బుడుగు అంటాడు, ఏదో మాట గబుక్కుని గుర్తుకి రాకపోతే .. అబ్బ వైసైపోతోంది .. అని.

ఏదన్నా ఒక కొత్త విషయం గురించి చెబితే మనవాళ్ళూ అదే మంత్రం జపిస్తూంటారు, అబ్బ వైసైపోతోంది ఇప్పుడింకా కొత్త విషయాలేం వంటపడతాయి? అని.

థియొడోర్ వాన్ కార్మన్ అని గొప్ప ఏరోనాటిక్సు పండితుడుండేవాడు. ఈయన ప్రసిద్ధిచెందిన కాళ్‌టెక్ వివిలో ఆచార్యుడుగా పని చేశారు. ఒకరోజు ఆయన వివి ప్రాంగణంలో హడావుడిగా నడిచి వెళ్తుంటే తోటి ఆచార్యులొకాయన ఎదురై, ఎక్కడికో అంత హడావుడిగా అనడిగారు. ఫలాని ఆచార్యులవారు మహచక్కగా టోపోలజీ చెబుతున్నాడు, ఆ క్లాసుకి వెళ్తున్నా అన్నారు ఈయన. మిత్రుడు ఆశ్చర్యపడి, ఏవిటీ ఈ వయసులో టోపోలజీ నేర్చుకుంటున్నావా? అనడిగారు (అప్పటికి వాన్ కార్మన్ వయసు అరవై పైనే). మరిప్పుడు కాకపోతే నేను చచ్చిపోయాక నేర్చుకోనా? అని చెప్పి హడావుడిగా క్లాసుకి వెళ్ళిపోయారు.

సరే, వాన్ కార్మన్ అంటే మహా మేధావి, ఆయన గొప్ప బుర్రకి ఎప్పటికప్పుడు ఏదో కొత్త విషయం కావాలి, అంచేత ఆయన ఈ లెక్కలోకి రాడంటారా? ఐతే మామూలు మనుషుల్ని గురించే చెప్పుకుందాం.

ఈ బ్లాగులో మా అప్ప (నాన్నగారు) గురించి చాలాసార్లే ప్రస్తావించాను. ఆయన జన్మరీత్యా తమిళులు. అదికూడా సరిహద్దు ప్రాంతం కాదు - నేటి తమిళనాడుకి నడిబొడ్డు అని చెప్పచ్చు. కాలేజి చదువయ్యేదాకా ఎప్పుడూ తమిళనాడు సరిహద్దు దాటినది కూడా లేదు. అట్లాంటిది విజయవాడలో బోటనీ లెక్చరరుగా స్థిరపడ్డారు. శాస్త్రీయంగా నేర్చుకోలేదు కానీ తెలుగు అనర్గళంగా మాట్లాడేవారు. చదివేవారు. ఆయనకి భాషలమీద ఉన్న మక్కువతో తన నలభయ్యో యేట హిందీ నేర్చుకోవాలని కోరిక కలిగింది. స్థానిక దక్షిణభారత హిందీ ప్రచారసభలో చేరి, ప్రాథమిక దగ్గర్నించీ ప్రవీణదాకా ఒకదాని తరవాత ఒకటి ఉత్తీర్ణులవుతూ వచ్చారు. ఆయనకి ఈ పని పూర్తి చెయ్యడానికి ఎనిమిదేళ్ళు పట్టింది. హిందీ కూడా అనర్గళంగా మాట్లాడేవారు. ఇంటరు విద్యార్ధులకి హిందీ ట్యూషను చెప్పేవారు. హిందీ పాఠశాల వార్షికోత్సవాలకీ వాటికీ హిందీలోనే ఉపన్యాసాలిచ్చేవారు.

సుమారు పదేళ్ళ కిందట ఒక మిత్రుని తలిదండ్రులు పిల్లల్ని చూడ్డానికి ఇక్కడికి అమెరికా వచ్చినప్పుడు పరిచయమయ్యారు. ఆయన అప్పటికి భారతీయ తంతి తపాలా వ్యవస్థలో అధికారి. వాళ్ళ పదవులు నాకు తెలియవు, కానీ మనకి తెలిసిన ఉదాహరణ చెప్పుకోవాలంటే, అదొక కంపెనీ ఐతే ఈయన వైస్ ప్రెసిడెంట్ అన్న మాట. ఈయన పై అధికారి మొత్తం భారతీయ పోస్టల్ డిపార్టుమెంటుకి అధికారి అన్న మాట. ఇంతకీ అసలు కథేంటంటే, ఆ తరవాత కొన్నాళ్ళకి చెన్నై వెళ్ళినప్పుడు, ఈ మావయ్యగారు రిటైరై చెన్నైలోనే ఉన్నారని తెలిసి వాళ్ళ ఇల్లు వెతుక్కుని వెళ్ళాను. నే వెళ్ళే సరికి గురువుగారు ముందు హాల్లో కూర్చుని వయొలిన్ మీద సంగీత సాధన చేస్తున్నారు. అరె, మనం అమెరికాలో కలిసినప్పుడు మీరు వయొలిన్ వాయిస్తారని తెలీదే అన్నాను. అవును, అప్పుడు వాయించలేదు, ఇప్పుడే నేర్చుకుంటున్నాను అన్నారు. రిటయిరై చెన్నై వచ్చాక, సరళివరుసల దగ్గర్నించీ మొదలెట్టి వయొలిన్ నేర్చుకుంటున్నారుట. నేను కలిసేప్పటికి అప్పుడే రెండేళ్లయింది. నిన్నుకోరి అని మోహనరాగ వర్ణం వాయించి వినిపించారు.

మొన్ననొక లేడీ డాక్టరుగారు కనిపించారు ఏదో మాఊరి ఫంక్షనులో, అంతకు ముందు పరిచయమే. ఏం చేస్తున్నారండి అన్నా పలకరింపుగా. రిటైరైపోయానండీ అన్నారు. అని చిన్నగా నవ్వి, మా యింటి దగ్గరే ఒక మంచి టీచరుగారు దొరికారండీ. అందుకని సంగీతం నేర్చుకుంటున్నా అన్నారు. భలే మంచి పని చేస్తున్నారు అని పైన చెప్పిన పోస్టలు మేస్టారి కథే చెప్పా. మన బ్లాగరులే ఉన్నారు చాలా మంది. కంప్యూటర్లు వారి వృత్తికాదు. జ్యోతిగారు, మాలగారు, మాలతిగారు, ఫణిబాబు గారు, రామకృష్ణరావుగారు .. కుతూహలంతో పని గట్టుకుని నేర్చుకుని, యథాశక్తి బ్లాగుతున్నారు.

అంచేత చాన్నాళ్ళుగా మీకేదైనా నేర్చుకోవాలని కుతూహల పడుతూన్నట్లైతే .. శుభస్యశీఘ్రం .. అర్జంటుగా మొదలెట్టెయ్యండి. వయసుదేముంది, దానిదారిన అది పైబడుతూనే ఉంటుంది. మనపని మనం చూసుకుందాం.

Tuesday, May 25, 2010

తెలుగు పాఠం - మే 25

పదహారణాల ఆంధ్రుల కథ
ఈ కథ గురించి నేను ఒట్టేసి చెప్పలేను కానీ నాకు తెలిసింది (విన్నదీ, చదివిందీ) ఇది. బ్రిటీషు కాలంలో ఆంధ్ర దేశం నిజాము రాజ్యంగానూ, సర్కారు రాజ్యంగానూ రెండుభాగాలుగా ఉండగా నిజాము రాజ్యంలో నిజాము రూపాయలు చలామణిలో ఉండేవి. మామూలు (బ్రిటీషు సర్కారు) రూపాయికి పదహారు అణాలు అని లెక్క. కానీ నిజాము రూపాయికి కొంత తక్కువ విలువ ఉండేది - పన్నెండు అణాలో, పధ్నాలుగు అణాలో. అందుకని ఎవరైనా రూపాయిల్లో చెల్లింపు చేసినప్పుడు అది పదహారణాల రూపాయేనా అని విచారించేవారు. మెల్లగా అది తెలుగుతనానికి సర్వనామంగా తయారైంది. అమెరికాలో As American as the apple pie అంటారు.

గతవారంలో చర్చకి వచ్చిన మరికొన్ని ఆసక్తికరమైన పదాలు.
ఆజానుబాహుడు. ఈ పదాన్ని గురించి అక్కడే మంచి చర్చ జరిగింది. జాను అంటే మోకాలు సంస్కృతంలో. ఆజానుబాహుడు అంటే మోకాలుదాకా ఉండే చేతులు గలవాడు. శ్రీరాముని విశేషణాల్లో ఒకటి. తీర్చిదిద్దిన బలమైన దేహం కల పురుషుడు అనే అర్ధంలో ఇప్పుడు విరివిగా వాడుతుంటాము.

పరదార. ఇదీ సంస్కృతమే. దార అంటే భార్య. పరదార అంటే మరొకని భార్య. నిజదార అంటే తనభార్య. నిజదార సుతోదర పోషణార్ధమై అన్నాడు పోతన భాగవత నాంది పద్యంలో. దార సుతులు ధన ధాన్యములుండిన, సారెకు జపతప సంపద గల్గిన, శాంతము లేక సౌఖ్యము లేదు అన్నారు త్యాగరాజస్వామి.

గతవారపు పదాలు
పరవళ్ళు. ఈ పదాన్ని సర్వసాధారణంగా పరవళ్ళు తొక్కడం అనే రూపంలోనే వాడుతారు. అంటే అలలాగా పైకి ఎగసి కిందికి దుమకడం. ఇది యుద్ధంలో పనిచేసే గుర్రాలకి ఇచ్చే శిక్షణలో ఒక భాగం. చిన్ని కోడెదూడలుకూడా సహజంగానే ఇటువంటి గంతు వెయ్యడం చూస్తుంటాం. ఇటువంటి పైకి-కిందికి దుమికే అలలతో ఉధృతంగా ప్రవాహం ఉన్నప్పుడు గోదావరి పరవళ్ళు తొక్కుతోంది అంటారు. యవ్వనపు పొంగుకి, అణుచుకోలేని మానసిక ఉద్వేగానికి కూడా ఈ వాడుక సముచితం.
పొదుగు. దీని అర్ధాలు చాలామందే పట్టుకున్నారు. నామవాచకంగా ఆవు గేదె వంటి పాలిచ్చే జంతువుల స్తనభాగం. క్రియావాచకంగా రెండర్ధాలు; పక్షులు గుడ్లని పొదగడం (గుడ్లమీద కూర్చుని వెచ్చగా ఉంచుతుంది పిల్లలు బయటికి వచ్చేవరకూ - ఆ సమయంలో ఆ పక్షి తిండి తినదు, గుడ్ల పట్ల చాలా బాధ్యతగా ఉంటుంది), నగలో మణులు పొదగడం.
అనువు (అనవు). దీనికి నిఘంటువు లెస్స, యోగ్యము, అనుకూలము అని అర్ధం చెబుతోంది. ఆంగ్లంలో Appropriate, suitable అనుకోవచ్చు. సామెతని విద్యార్ధులందరూ బానే గుర్తు చేసుకున్నారు.
వేకువ. తెల్లవారు జాము. అరుణోదయ కాలం. బహుశా వేగుచుక్క (తెల్లవారు జామున కనబడే నక్షత్రం - ఇది నిజానికి శుక్రగ్రహం) కి ఏమన్నా సంబంధం ఉన్నదేమో. అదలా ఉండగా అసలు తెల్లవారు జాము, అరుణోదయ కాలం అనే వాడుకల కథ కూడా చాలా ఆసక్తికరం. ఇవెలా వచ్చాయో తెలుసునా ఎవరికైనా?
మేలము. పరిహాసం. జోక్ చెయ్యడం. దీన్ని సర్వసాధారణంగా మేలమాడుట అనే రూపంలో వాడుతుంటాము. మేళము అంటే అనేక వాయిద్యాలు కలిసిన సంగీతకారుల గుంపు. మేళవింపు అంటే కలయిక. అట్లావచ్చింది ఈ వాయిద్యాల మేళవింపుతో ఏర్పడిన మేళం. సన్నాయి మేళం స్థానే పాశ్చాత్య వాయిద్యాల గుంపయిన "బేండు" చేరడంతో అది "బేండు మేళం" అయింది.

ఈ పదాలకి అర్ధాలు చెప్పండి, జాలంలో, నిఘంటువులో వెతక్కుండా ..
మన మిత్రులు అడిగినవాటినే కొన్నిటిని ఇక్కడ పెడుతున్నా, మిగతావారికి ఏమైనా తెలుస్తుందేమోనని.

ఆనవాలు
తెరువు
కలిమి
సమ్మర్దం
విహ్వలం

Monday, May 24, 2010

రెండు దుఃఖాలు

వేటూరి మరణం

మంగుళూరు విమాన దుర్ఘటన

నా ప్రగాఢ సంతాపం!

Thursday, May 20, 2010

డబ్బు టు ది పవరాఫ్ డబ్బు

కథ, కథనం ఇవన్నీ పక్కన పెట్టినా, తన నవలలకి నామకరణం చెయ్యాడంలో యండమూరి మొనగాడని ఒప్పుకోవాలి. ఆయన సృజించిన టైటిల్సన్నిటిలో ఈ టైటిలు నాకు చాలా ఇష్టం. ఆధునిక జీవితంలో డబ్బుకున్న ప్రాముఖ్యతని చాలా ఒడుపుగా పట్టుకున్నారిందులో.

మనిషి జీవితంలో డబ్బుకున్న ప్రాముఖ్యత కొత్తదేం కాదు. ధనమూలమిదం జగత్ అని సంస్కృతంలోనూ కాసుకి లోకం దాసోహం అని తెలుగులోనూ సామెతలున్నై. సామెతలంటే ఏంటి? అవి క్లుప్తంగా క్రోడికరించిన సామూహిక అనుభవాలు.

పంచతంత్రంలోని మిత్రలాభంలో ఒక ఎలిక ఉంది. వాడిపేరు హిరణ్యగర్భుడు అనుకుంటా, స్పష్టంగా గుర్తు లేదు. ఈ ఎలిక ఒక సందర్భంలో తన పాతకథ చెబుతాడు. వీడు ఒక సంపన్న గృహస్తు ఇంట్లో కలుగు చేసుకుని, ఆ యింటి గాదెల్లోనించి ధాన్యం, పప్పుదినుసులూ, ఇంకా చిల్లరమల్లర వస్తువులన్నీ తన కలుగులోకి తరలిస్తూ, తన కుటుంబాన్ని బంధు మిత్ర సమేతంగా వృద్ధి చేసుకుని దర్జాగా ఉంటూ ఉన్నాడు. ఈ ఎలిక బాధ పడలేక గృహస్తు వడ్డెవాళ్ళని రప్పించి వాడి కలుగుని కనిపెట్టి తవ్వించేసి ఎలిక పోగు చేసిన ధాన్యసామగ్రినంతా కొల్లగొట్టించాడు. ఎలిక ఎట్లాగో కొసప్రాణాలతో చావుతప్పి కన్ను లొట్టబోయి బయటపడ్డాడు. కొన్నాళ్ళయినాక ఈ ఎలిక బక్కచిక్కి, నీరసంగా అలా వెళుతుంటే ఆ గృహస్తు తన మిత్రునితో కబుర్లాడుతూ ఎలికని చూపించి ఇలా అన్నాడు - చూశావా? కేవలం ఒక్క వారం క్రితం, ఈ ఎలిక ఎంత దర్జాగా, ఈ ఇల్లంతా తనదే అన్నట్టు తిరుగుతుండేవాడు. నేను వాణ్ణి చంపలేదు. వాడు పేరబెట్టుకున్న ధనాన్ని కొల్లగొట్టించాను. ఇప్పుడు చూడు వీడు ఎలా బక్కచిక్కి జీవఛ్ఛవంలా ఉన్నాడో - అని.

ఈ కథలోని ఎలికకీ ఆధునిక మానవుడికీ అట్టే తేడా లేదు.

ఐతే, ఎంత డబ్బు కావాలి? సుఖపడడానికి తగినంత. సుఖమంటే ఏవిటి? ఎవరు నిర్వచిస్తారు? డబ్బు ఆనందాన్ని సంతృప్తినీ కొనలేకపోవచ్చు, కానీ కుటుంబాన్ని పోషించాలి గద! ఈ పేరడాక్స్ ఎట్లా పుట్టుకొచ్చిందో మరి నాకు తెలియదు గానీ, భారతీయ మధ్యతరగతిలో డబ్బుని చిల్లిగవ్వలా పరిగణించే మనస్తత్వం ఒకటి చాన్నాళ్ళుగా ప్రబలి ఉంది. డబ్బుని తృణీకరించడం చాలా గొప్పగుణంగా పరిగణించ బడుతూ వచ్చింది. కొన్నేళ్ళుగా, కొత్త కొత్త రుచులు, నోరూరించేవి, ఆశలు రేపేవి అందుబాటులోకి వచ్చేసరికి ఇప్పుడు ఆ మనస్తత్వం ఒక్క పిల్లిమొగ్గ వేసి డబ్బు ఆకలి జనాల్ని దహించేస్తోంది.

ఇలా ఉండాల్సిన పని లేదు. డబ్బు మనల్ని నడిపించనక్కర్లేదు, మనమూ డబ్బుని శాసించనక్కర్లేదు. డబ్బుతో శాంతియుత సహజీవనం చెయ్యొచ్చు. డబ్బుతో మనకేం కావాలో ముందు తెలిస్తే, అంటే ముందు మనల్ని మనం అర్ధం చేసుకుంటే .. ఇది సాధ్యమే!

Tuesday, May 18, 2010

తెలుగుపాఠం - మే 18

పుట్టి మునిగినట్టు ఏవిటా హడావుడి అని కోప్పడుతుండేది మా అమ్మ. చిన్నప్పుడు నాకు అన్నిటికీ ఆత్రమే. అమ్మ మాటల్లో ఆ వాడుకని అంతగా పట్టించుకోలేదు గాని తరవాత్తరవాత చదువుతున్న పుస్తకాల్లో కూడా ఈ వాడుక కనబడుతూ ఉండేసరికి దీని సంగతి కొంచెం ఆలోచించాను. పుట్టి అంటే పుట్టిన తరువాత (మనుజుడై పుట్టి టైపులో), మునిగినట్టు అంటే మునక వేసి అని అర్ధం చెప్పుకున్నాను. కానీ అన్వయం సరిగ్గా కుదర్లేదు. పుట్టంగానే మునక వెయ్యడం ఏవిటి? మనమేవి చేపపిల్లలం కానీ కనీసం కప్ప పిల్లలం కానీ కాదే, పుట్టంగానే మునక వేసేందుకు? ఈ ముంక వెయ్యడానికి ఆత్రానికీ సంబంధం ఏవిటబ్బా? ఈ ఆలోచన ఎప్పటికీ తెగేది కాదు. ఓహో, ఇది కూడా నాకు ఎప్పటికీ అర్ధంకాని మిస్టరీల్లో మిగిలిపోవాల్సిందే అనుకుంటూ వచ్చా. మొన్న మల్లాది రామకృష్ణశాస్త్రిగారి కథలు చదువుతుంటే అందులో ఒక పాత్రతో అనిపిస్తారు శాస్త్రిగారు - ఏదో వాడి పుట్టి అంతా మునిగిపోయినట్టు హడవుడిగా .. ఆహా! పుట్టి అంటే పుటకలకి సంబంధించిన విషయం కాదు - ఇది వేరే యవ్వారం.

పుట్టి అని ధాన్యపు కొలత ఒకటుంది. సుమారు వెయ్యి శేర్లు. ఏటికేతామెత్తి యెయి పుట్లు పండించి అని పాట వుంది. పుట్టెడు అంటే చాలా అనే అర్ధం దీన్నించే వచ్చింది, మనం పోయిన వారం చెప్పుకున్న బోలెడు, బొచ్చెడు లాగానే. ఆమె పుట్టెడు దుఃఖంలో ఉంది అంటారు. అలాగ, ఈ పుట్టి మునగడం అంటే ఏదన్నా ధాన్యపు గాదె మునిగిందా, వెయ్యి శేర్ల ధాన్యం మునిగే నీరు (వానో వరదో) వచ్చిందంటే కంగారే మరి. బహుశా ఇదేనేమో అనుకుంటూ నిఘంటువు తెరిచాను. బ్రౌణ్యములో పైన చెప్పిన ధాన్యపు కొలత అర్ధంతో పాటు ఈ అర్ధం కూడా చెప్పారు.
"A wicker boat woven of cane and covered with leather. వాని పుట్టి ముణిగినది his raft is sunk, i.e., he is shipwrecked or ruined."
అదన్న మాట పుట్టి మునిగిన విశేషం!

గతవారపు పదాలు


గోము: నిఘంటువులు ఈ పదానికి సౌకుమార్యము, శ్రమమెరుగనితనము నిర్వచనాలు ఇచ్చాయి. కానీ వాడుకలో "గోముగా" అనే వాడుకనే ఎక్కువగా చూస్తుంటాము. దీన్ని గారాబంగా, ముద్దుముద్దుగా అనే అర్ధంలో, సాధారణంగా యవ్వనవతి, వయ్యారి అయిన స్త్రీ విషయంలో వాడుతారు. సత్యభామ శ్రీకృష్ణుణ్ణి గోముగా అడిగింది తనని కూడా యుద్ధానికి తీసుకెళ్ళమని. ఈ వాడుక మీద ఒక మంచి చమత్కారమైన పద్యం పొద్దులో ఇక్కడ చూడవచ్చు.
నీటు: శృంగారపరమైన, అందమైన. కేవలం అందం కాదు, ఆ అందం చూస్తే శృంగార భావనలు రేకెత్తాలన్న మాట. నీటుకాడు, నీటుకత్తె అంటే ఇటువంటి లక్షణం కలిగిన పురుషుడు స్త్రీ. ఇటువంటిదే ఇంకో పదం గోటు, అంటే వయ్యారం, కులుకు అని. మాయాబజారులో కౌరవులు విడిదిచేసినాక మాయాశశిరేఖ విడిదికి వచ్చి దూరాన్నించి లక్ష్మణకుమారుణ్ణి చూడగా ఆమెతో - ఆ నీటూ గోటూ మా బావేనా? - అనిపించాడు ఆ మాటల మాంత్రికుడు మహానుభావుడు పింగళి. యమగోల సినిమాపాటలో రాటుదేలిపోయావు నీటుగాడ అనే వేటూరి వాక్యం అందరికీ పరిచితమే.
తాట: చర్మమే, కానీ మనుషులది కాదు, చెట్లది. దీన్నే బెరడు అని కూడా అంటారు.
వేల్పు: వేలుపు, దేవుడు లేక దేవత. ఇలవేల్పు అంటే ఆ కుటుంబం అభిమానంగా ఆరాధించుకునే దైవం. మ్రొక్కిన వరమీని వేల్పుని (మరికొన్ని పనికిరాని వాటితోపాటుగా) గ్రక్కున విడవాలని సుమతీశతకం బోధిస్తుంది.
వెన్ను: వీపు. వీపుకి ఆధారంగా ఉండేది కాబట్టి వెన్నెముక అయింది. వెన్ను విరుచుకోవడం అంటే వీపు వెనక్కి ఛాతీ ముందుకి వచ్చేట్టుగా చేసే చర్య, ఆత్మవిశ్వాసానికీ ధైర్యానికీ సూచన. ఇంద్రుడికి వజ్రాయుధం కోసం తన వెన్నెముకని దానం చేసిన ఋషి ఎవరో చెప్పగలరా?
వరి, చెరకు వంటి మొక్కలకి వచ్చే కంకిని (కాండం కాదు) కూడా వెన్ను అంటారు. చెరకు తుద వెన్ను పుట్టిన చెరకున తీపెల్ల చెరచునని సుమతీవాక్యం. జెఱకు వెన్నుపుట్టి చెరపదా తీపెల్ల అని వేమన వాక్యం.
విష్ణువు కి వికృతి వెన్నుడు అని వాడుక. వేనామాల వెన్నుడా నిన్ను వినుతించనెంత వాడ అని అన్నమయ్య పదం.

ఈ కింది పదాలకి అర్ధాలు చెప్పండి - నిఘంటువుల్లో వెతక్కుండా!
పరవళ్ళు
పొదుగు
అనువు (అనవు)
వేకువ
మేలము

Monday, May 17, 2010

కబుర్లు - మే 17

ఏజాతి చరిత్ర చూసినా అని రాశాడు శ్రీశ్రీ. ఏ ప్రభుత్వ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం అని రాసుకోవాలి. థాయ్‌లాండులో తన ప్రజలమీదనే దమనకాండ సాగిస్తున్నది ఆ "ప్రజా"ప్రభుత్వం. పూర్వకాలంలో రాజులు, నిరంకుశులు, నియంతలు నరహంతలు అనుకున్నాం. ఆధునిక యుగంలో తమ స్వంత ప్రభుత్వాల చేతిలో అసువులుబాసిన పౌరులెందరో. పాలిటిక్స్, గవర్నమెంట్ అనే మాటలకి రాజకీయం, ప్రభుత్వం అని ఫ్యూడలు మాటలు ఎలాగొచ్చాయో! మాటలదేముందిలే బుద్ధులూ అవేగదా.

అమెరికా దక్షిణ తీరం మొత్తానికీ బీపీకంపెనీ చమురుతో తలంటితే ఇప్పుడు అమెరికా ప్రభుత్వం బీపీ కంపెనీకే తలంటేందుకు చూస్తోంది అదే చమురుతో. ఏ ఒక్క ప్రమాద సంఘటనకైనా ఆ కంపెనీ లయబిలిటీ 75 మిలియన్ల డాలర్లట! నమ్మగలరా? ప్రస్తుతం ఆ చమురు వ్యాప్తిని నిరోధించడానికి సముద్రం మీద జరుగుతున్న పనులకే రోజుకి ఒక్న్ని పదుల మిలియన్ల ఖర్చవుతోంది. కొద్దివారాల క్రితమే తీరప్రాంతాల్లో చమురు పరిశోధనలకి కొత్త అనుమతులిస్తాము అని ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో, ఇప్పుడు ఈ ప్రమాదం జరగడంతో, అసలు ఈ దేశంలో ఈ చమురు మీద ఆధారపడ్డం ఏ స్థితిలో ఉంది, దీని పట్ల దేశవ్యాప్తంగా మన వైఖరి ఏవిటి అని ఆత్మావలోకనం చేసుకోవలసిన పరిస్థితి. ఇట్లాంటప్పుడే అమెరికను మీడియాలోని బోలుతనం మహా అసహనం కలగేజేస్తుంది నాకు. బీపీ అధినేతలు ఏమంటున్నారు, దానికి ప్రతిగా ప్రభుత్వం ఎట్లాంటి దండన చర్యలు చేపడుతుంది - ఇలాంటి పైపై విషయాలు తప్ప అవసరమైన అంతర్మధనం జరుగుతున్న జాడ లేదు.

పెరూవియన్ నవలాకారుడు మారియో వర్గాస్ లోసా రాసిన The War of the End of the World పూర్తి చేశాను. సుమారు 600 పేజీల నవలని మూడొంతులు వేగంగానే చదివేశాను కానీ చివరి నాలుగోవొంతుని ముగించడానికి కష్టపడాల్సి వచ్చింది. బ్రెజిల్ దేశంలో బాహియా అనే రాష్ట్రంలో 1896 - 1899 మధ్యలో జరుగుతంది కథ. ఇది టూకీగా చెప్పుకునే వ్యవహారం కాదు, చెప్పడమంటూ మొదలెడితే చాలా విపులంగానే చెప్పుకోవాలి. చూద్దాం, ఈ వారంలో రాసేందుకు వీలవుతుందేమో. అయినా ఒక పెరూవియన్ మనిషి ఎక్కడో బ్రెజిల్లోని ఒక మారుమూల రాష్ట్రాన్ని కథా స్థలంగా తీసుకుని అంత పట్టుతో రాయడం నాకు దిగ్భ్రమ కలిగించింది.

చుక్కల్లో చంద్రుడు, వినైతాండి వరువాయా అనే చిత్రరాజాల్ని చూశాను. చుక్కల్లో చంద్రుడులో అక్కినేని నాగేశ్వర్రావు గారి నటన అద్భుతం. నటనాజీవితం మొదలెట్టిన ఇన్నాళ్ళకి పరిణతి చెందిన నటన ఏమిటో ఆయనకి అనుభవంలో కొచ్చినట్టుంది మొత్తానికి. ఆయనే ఈ మధ్య ఏదో ప్రోగ్రాములోనో ఇంటర్వ్యూలోనో చెప్పుకున్నారు, నటన అంటే డయలాగులు వొప్పచెప్పడం కాదు అని తెలుసుకునేప్పటికి నటజీవితం అయిపోయింది అని. ఇదే సినిమాలో ఛార్మి కూడా, తన పాత్ర చిన్నదే అయినా, చాలా బాగా చేసింది అనిపించింది. ఇక రెండో సినిమా, వినైతాండీ వరువాయా నాకు విపరీతంగా నచ్చేసింది. ఈ సినిమాలో గొప్ప రివలేషన్ త్రిష. ఎంత బాగా చేసిందో. ఆ అమ్మాయి మాతృభాష తమిళం అన్నట్టు గుర్తు. అందుకని డయలాగులు తనే చెప్పుకుందేమో ననుకున్నా. కానీ ఎవరో డబ్బింగ్ చెప్పారు అని ఇప్పుడే నవతరంగంలో చదివా. ఛార్మిని గురించి, త్రిషాని గురించీ ఈ బ్లాగులో ఇదివరకు కొంచెం కృరమైన వ్యాఖ్యలు చేసి ఉన్నాను నేను. ఆ వ్యాఖ్యల్ని నిర్ద్వంద్వంగా ఉపసంహరించుకుంటున్నాను. ఆ అమ్మాయిలు టేలెంటున్నవాళ్ళే. మన దర్శక తేభ్యాలు దాన్ని ఉపయోగించుకోలేకపోతే మన ఖర్మం. దానికి ఆ అమ్మాయిల్ని తప్పు పట్టటం ఎందుకు?

వంగూరి ఫౌండేషన్ వారి ఉగాది రచనా పోటీల ఫలితాలు వెలువడినాయి. మన బ్లాగర్లు మంచి విజయాలు సాధించారు.
ఉత్తమ కథకి అబ్రకదబ్ర నగదు బహుమతి, తొలి కథకి వాసు ముళ్ళపూడి ప్రశంసాపత్రం, ఉత్తమ కవితకి నచకి, ప్రసాద్ సామంతపూడి ప్రశంసాపత్రాలు పొందారు. అందరికీ సభాముఖంగా మరోసారి అభినందనలు.

కథారచయిత, కవి, మంచికంటి వేంకటేశ్వరరెడ్డి సరికొత్తగా బ్లాగు మొదలు పెట్టారు. మీరూ ఓ లుక్కెయ్యండి.

Thursday, May 13, 2010

అన్నిటికంటే ముందు శ్రీశ్రీ కవి

మహాకవి శ్రీశ్రీ ఒక హిపోక్రిటా? అని బొందలపాటిగారి బ్లాగులో ఆసక్తికరమైన వ్యాసం రాశారు. నేనిప్పుడు చెప్పబోతున్నది ఆ వ్యాసం మీద విమర్శ కాదు. ఆ వ్యాసం చదవగా నాకు కలిగిన కొన్ని ఆలోచనలు పంచుకోవాలని మాత్రమే.

తెనాలి రామకృష్ణ సినిమాలో ఒక దృశ్యంలో రామకృష్ణుడు తిమ్మరుసుతో మాట్లాడుతున్న దృశ్యం ఒకటుంది. విజయనగర సామ్రాజ్యానికి చుట్టూతా శత్రువులు పొంచివున్నారనీ సామ్రాజ్యం దినదిన గండం నూరేళ్ళ ఆయుష్షుగా బతుకుతున్నదనీ మొదటిసారి రామకృష్ణుడికి అర్ధమయింది. రామకృష్ణుడు చాలా ఆందోళన చెందుతూ ఈ శత్రువుల్ని అధిగమించే దారిలేదా అనడిగాడు. దానికి సమాధానం చెబుతూ తిమ్మరుసు - నాయనా, నువ్వు ఆవేశ పరుడవైన కవివి. రసికుల్ని రంజింపజెయ్యడమే నీ లక్ష్యం. కానీ నా లక్ష్యం వేరు - అన్నాడు.

కవి ముఖ్య లక్షణాన్ని చాలా ఒడుపుగా పట్టుకున్నారు ఈ మాటలరచయిత. కవి ఆవేశపరుడు. కవిత్వం ఆవేశం - అది భావం కావచ్చు, అర్ధం కావచ్చు, అనుభూతి కావచ్చు - ఇవన్నీ ఆవేశానికి రూపాలే. ఈ ఆవేశానికి పర్యవసానం పాఠకునిలో రససిద్ధి (పైన డయలాగులో చెప్పిన రసికుల్ని రంజింపజెయ్యడం) కవిత్వంలో ఆలోచన కూడా ఉండొచ్చు, కానీ దాని స్థానం ఆవేశానికి తరవాత రెండొ స్థానమే. మొన్ననే ఇక్కడ తెలుగుపాఠంలో తల్చుకున్న శ్లోక శకలం, సాహిత్యం ఆలోచనామృతం అని - అది వేరే విషయం, అది కవిత్వపు ఆవేశాన్ని జీర్ణించుకున్నాక పాఠకుడిలో కలిగే స్పందన, మథనం, తద్వారా ఆలోచన. అసలు సంగతేవిటంటే కవిత్వమంటే ఆవేశం, కవి ముఖ్యంగా ఆవేశపరుడు.

అన్నిటికంటే ముందు శ్రీశ్రీ కవి. శ్రీశ్రీ కవి కాకపోతే ఇంకేదీ కాడు. తద్వారా శ్రీశ్రీ ఆవేశపరుడు, ఆయన కవిత్వం ఆవేశం. ఆయనే చెప్పుకున్నాడు మహాప్రస్థానంలో (ఋక్కులు) ఉండాలోయ్ కవితావేశం, కానీవోయ్ రసనిర్దేశం. ఇది కూడా మనం ఇక్కడ మొదణ్ణించి చెప్పుకుంటూ వస్తున్న వరసలోనే ఉంది - ముందు ఆవేశం, దాని పర్యవసానంగా రససిద్ధి. మిగతా విషయాలన్నీ అనవసరం - అనవసరం కాకపోయినా కనీసం అముఖ్యం (Unimportant).

శ్రీశ్రీ కమ్యూనిస్టు భావజాలంతో తనను తాను ఏకీభవించుకోవడంతోనూ, కొన్ని విప్లవపోరాటాలకీ, వామపక్ష ఉద్యమాలకీ బహిరంగవేదికల్లో తన మద్దతునీ సానుభూతినీ ప్రకటించడంతో కవిత్వంతో సంబంధంలేని అనేక అంశాలు శ్రీశ్రీ జీవితంలో ప్రవేశించాయి, దానికి సంబంధించిన చర్చలో గందరగోళం సృష్టిస్తున్నాయి. ఇటువంటి (కవిత్వానికి సంబంధంలేని) చర్చల్లో - "సాహిత్యంలో నిబద్ధత", "నిబద్ధుడైన కవి" - ఇలాంటివే మరికొన్ని ముద్రలూ నినాదాలూ వినిపిస్తూ వస్తున్నాయి. నిబద్ధు డవటం అంటే (దేనికో ఒకదానికి, లేదా కొన్నిటికి) కట్టుబడి ఉండడం. కట్టుబడి ఉండడం అంటేనే బంధనం, స్వేఛ్ఛకి విరుద్ధం - తద్వారా సృజనకీ, ఆవేశానికీ - తద్వారా కవిత్వానికీ విరుద్ధం. ఎవరైనా సృజనాత్మక కళాకారుడు నేను పలాని దానికి నిబద్ధుణ్ణి అని చెప్పున్నాడంటే ఆయనలోని సృజనకి (ఆవేశానికీ, కవిత్వానికీ) పిండాలు పెట్టేసుకోవచ్చు. నిబద్ధులైన వాళ్ళూ, హిపోక్రట్లు కానివాళ్ళూ కోట్లకొద్దీ ఉన్నారు లోకంలో జనాభా - భూభారం పెంచడానికి తప్ప ఎందుకూ పనిక్రానివాళ్ళు. శ్రీశ్రీమాత్రం ఒక్కడే.

అవునూ, ఇంత కరశోష (నెనర్లు మధురవాణి గారూ!) పడినాక నాకో డౌటొచ్చింది - శ్రోతల మనసుల్ని పరవళ్ళు తొక్కించే సిరివెన్నెల సీతారామశాస్త్రిగారి ఉద్బోధనాత్మక గేయాల్ని గురించి మొన్ననే చెప్పుకున్నాం కదా - ఆయన పాటలు చాలావాటిని నెమెరేసుకున్నాము కూడానూ - ఎవరూ ఆయన్ని అడగరేం నువ్వు నిబద్ధుడివేనా అని? ఆయన బోధించిన జీవిత సూత్రాలన్నీ ఆయన జీవితంలో పాటిస్తున్నారో లేదో చూసొచ్చారా ఎవరైనా? ఎందుకు శ్రీశ్రీకి మాత్రమే ఈ ప్రశ్న? ఎందుకంటే శ్రీశ్రీ తన జీవితాన్ని గురించి (ఆశలూ, భయాలూ, అలవాట్లూ, బలహీనతలూ) ఏదీ దాచుకోలేదు. ఒక్క వాక్యంలో చెప్పాలంటే -

He wore, not only his heart, but his entire life on his sleeve!నా వుద్దేశం సిరివెన్నెలనో ఇంకో కవినో రచయితనో ఎత్తిచూపాలని కాదు, శ్రీశ్రీకి వత్తాసు పలకాలనీ కాదు. కవి విషయంలో, కవిత్వం విషయంలో నిబద్ధత చర్చ అనవసరం, అసంబద్ధం అని చెప్పడం మాత్రమే.

అన్నిటికంటే ముందు శ్రీశ్రీ కవి. శ్రీశ్రీ కవి కాకపోతే ఇంకేదీ కాడు.
ఇహ మిగతా చర్చ అంతా అనవసరం!

Tuesday, May 11, 2010

తెలుగు పాఠం - మే 11

పాఠంలోకి వెళ్ళేముందు ఆంధ్రభారతి వారికి జేజేలు చెబుదాము.

ఆంధ్రభారతి ఇప్పటికే కొన్నేళ్ళుగా జాలంలో సాంప్రదాయ తెలుగు సాహిత్యానికి గొప్ప నిధిగా భాసిల్లుతోంది. నారాయణతీర్ధుల కృష్ణలీలా తరంగిణి, అనేక త్యాగరాజకృతులు, కొన్ని ప్రబంధాలు సంపూర్ణంగాను, కొన్ని సెలెక్షన్సుగాను, సులభంగా లభ్యం కాని ఆధునిక కావ్యాలు ఇవన్నీ సేకరించి, ఎంతో శ్రద్ధతో తెలుగు టైప్ సెట్ చేసి (నేను చూసినంతలో ఎక్కడా అచ్చుతప్పు కనబ్ళ్ళేదు) మనకి అందుబాటులోకి తెచ్చారు. ఇదంతా పాత కథే. దీనికే మనం వారికెంతో ఋణపడి ఉన్నాం.

ఇప్పుడు జేజేలు చెబుతున్నది అందుక్కాదు. వీరు సరికొత్తగా జాలనిఘంటువుని వెలువరించారు. ఇవ్వాళ్ళే దీన్ని ఓ పట్టుపట్టాను. అద్భుతంగా ఉంది. DSAL వాళ్ళ జాలనిఘంటువుకంటే కనీసం మూడు మెట్లు పైనుంది. శేషతల్పశాయిగారు, అద్భుతంసార్! సవినయంగా టోపీలు తీసేశ్శాం!!

మరీ ప్రతీపాఠంలోనూ తప్పులెంచితే భక్తులకి బోరెక్కుతుందని ఈ సారి నేనే ఒక వాడుకని పరిచయం చేస్తున్నా. ఇదీ పాతవాడుకే, కానీ ఈ మధ్య అంతగా కనిపించడం లేదు. మొన్న చేరాగారి పాత వ్యాసం ఏదో చదువుతూంటే కళ్ళకి తగిలింది, వేంటనే పట్టేశాను ఈ వారం తెలుగుపాఠానికి. ఈ వారం వాడుక -

కరతలామలకం.

హమ్మ్ హమ్మ్. నిజం చెప్పాలంటే ఇది సంస్కృతం అనుకోండి, ఐనా తెలుగు వచనంలోనూ, రెఠొరిక్ లోనూ చాలా విరివిగా వాడుతుంటాము. కరతలం అంటే అరచెయ్యి. ఆమలకం అంటే ఉసిరికాయ. కరతలామలకం అంటే అరచేతిలో ఉన్న ఉసిరికాయలాంటిది. ఒక వ్యక్తికి ఏదైనా ఒకవిద్య చాలా సులభంగా అలవడింది, పిలిస్తే పలుకుతుంది అనే అర్ధంలో ఈ పదబంధాన్ని వాడుతాము. బాలమురళీకృష్ణగారికి చిన్నవయసులోనే కర్నాటకసంగీతం కరతలామలకమైంది. సచిన్ టెండుల్కర్‌కి ఎటువంటి బౌలింగ్‌ని ఎలా ఎదుర్కోవాలి అనేది కరతలామలకం. దీన్నే, శంకరాచార్యుల భజగోవిందశ్లోకాలని పరిచయంచేస్తూ చక్రవర్తి రాజగాపాలాచారిగారు .. Sri Adi Sankara who drank the ocean of jnaana as easily as one sips water from the palm of one's hand .. అంటారు. కానీ మన వాడుకలో అది ఉసిరికాయ అయింది. ఉసిరికాయే ఎండుకయింది? ఆచార్యులవారన్నట్టు నీటిగుక్క ఎందుకు కాలేదు? పోనీ ఘనపదార్ధమే కావాలంటే ఓ మావిడిపండో, జాంపండో ఎందుక్కాలేదు? అలోచించండి.

గతవారపు పదాలు


ధారాళం = అడ్డులేకుండా .. పంపులో నీళ్ళు ధారాళంగా వస్తున్నాయి. రమేషు తమిళం ధారళంగా మాట్లాడుతాడు.
చూడామణి = చూడము అంటే నడినెత్తిన ఉండే జుట్టు. ఆ నడినెత్తిన జుట్టులో ధరించే ఆభరణం చూడామణి. సుందరకాండలో రాములవారు హనుమంతునికి తన ఆనవాలుగా తన ముద్రిక (ఉంగరం) ని ఇచ్చి పంపితే తిరుగుటపాలో సీతామ్మవారు తన చూడామణిని ఇచ్చి పంపుతుంది. చంద్రుణ్ణి శిరోభూషణంగా ధరించిన శివుణ్ణి చంద్రచూడుడు అంటాము. ఏదైనా సమూహంలో అతి శ్రేష్ఠమైన వస్తువు, లేదా వ్యక్తి అని సూచించేందుకు కూడా చూడామణి (దీని పర్యాయపదాలు కూడా) అంటాము .. "గోపస్త్రీ పరివేష్ఠితో విజయతే గోపాల చూడామణీ."
చమురు = నూనె. ఇది బహుశా మాండలికమేమో. ఆధునిక పత్రికల పరిభాషలో పెట్రోలియమ్ని సూచించడానికి వాడుతున్నారు.
బోలెడు = బోలె అన్నా బొచ్చె అన్నా ఒకటే .. ఒక పాత్ర. అది కూడా పెద్ద పాత్ర ఏమీ కాదు, ఒక మాదిరి పరిమాణమున్న పాత్ర. మరి బోలెడు బొచ్చెడు అంటే చాలా అనే అర్ధం ఎలా వచ్చిందో. నాకు బోలెడు పాటలొచ్చు. మా అమ్మాయికి బోలెడు ధైర్యం, వాళ్ళమ్మని కూడా ఎదిరించి మాట్లాడుతుంది!
మిసిమి = మెరుపు, కాంతి

ఈ కింది పదాలకి అర్ధాలు చెప్పండి .. అతి సులభం అన్నీ రెండక్షరాల పదాలే .. నిఘంటువులు వెతక్కుండా!
గోము
నీటు
తాట
వేల్పు
వెన్ను

Sunday, May 9, 2010

కబుర్లు - మే 10

పోయినవారం అతి పెద్దవార్త ఇంగ్లాండులో ఎన్నికలు. అమెరికాలో లాగానే వీళ్ళకీ రెండే ప్రధాన పార్టీలు, పేరుకి లిస్టులమీద ఇతర పార్టీలు ఉన్నా. ఇరాకు యుద్ధం దగ్గర్నించీ ప్రభుత్వంలో ఉన్న లేబర్ పార్టీ ఒకదానితరవాత ఒకటిగా ఎన్నో ఎదురు దెబ్బల్ని తట్టుకుంటూ వచ్చింది. ఎలాగైనా ప్రభుత్వ పగ్గాలు చేజిక్కించుకోవాలని అపోజిషన్ కన్సర్వేటివ్ పార్టీ కూడా సర్వశక్తులూ కూడగట్టుకుని సంఘటితమయింది ఈ ఎన్నికలో. అయ్యా, తీరా జరిగిందేవిటీ అంటే .. ఎవరికీ పూర్తి మెజారిటీ రాలేదు. లేబరు కొంతవరకూ తన స్థిరస్థానాన్ని కోల్పోయిన మాట నిజం. అదే కొద్దిపాటి స్థానాన్ని టోరీలు గెలుచుకున్న మాట నిజం. కానీ పూర్తి మెజారిటీ రాలేదు. ఇండొనీషియా, భారత్ వంటి ప్రజాస్వామ్యాల్లో ఇప్పటికే ఒకటి రెండు దశాబ్దాలుగా జరుగుత్న్న రాజకీయ పరిణామం ఇప్పుడు బాగా స్థిరపడిన ప్రజాస్వామ్యాలైన పాశ్చాత్య దేశాలకు కూడా పాకుతున్నట్లున్నది. గడిచిన పదేళ్ళలోనూ ఇటలీ జెర్మనీ వంటి దేశాల సార్వత్రిక ఎన్నికల్లో ఈ ఒక్క పార్టీకి మెజారిటీ రాకపోవడం, సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పడ్డం చూస్తూ వస్తున్నాము. ప్రపంచ వ్యాప్తంగా ప్రజాస్వామ్యాల్లో ఇది గమనించాల్సిన పరిణామం అని నాకు అనిపిస్తోంది. ఈ పరిణామం ద్వారా రెండు విషయాలు నాకు స్పష్టమవుతున్నాయి. ఒకటి - పౌరులు ఏ ఒక్క సైద్ధాంతిక ప్రాతిపదికకో అమ్ముడుపోయి దానికే పట్టం కట్టేందుకు సిద్ధంగా లేరు. రెండు - తమ ప్రతినిధులు సిద్ధాంతాల నినాదాల్లో కూరుకుని పోయి కూర్చోవడం కాకుండా తమ రాజకీయ ప్రత్యర్ధులతో కలిసికట్టుగా పనిచెయ్యడం మొదలుపెట్టి ప్రజాసంక్షేమాన్ని సాధించాలనేది ఓటరు మహాశయుల ఆశయం. ఎటొచ్చీ బ్రిటీషు ఎంపీలకి కోలిషన్ రాజకీయాలు కొత్త .. తప్పేదేముంది, తినగ తినగ వేము తియ్యనుండు!
మూలిగే నక్కమీద తాటికాయ పడిన చందంగా .. ఇంగ్లాండులో పర్యటిస్తున్న నైజీరియా దేశపు ఎంపీ ఒకాయన ఈ ఎన్నికల హడావుడినంతా పరికించి చూసి .. బ్రిటీషు ఎన్నికల వ్యవస్థలో మోసం జరగడానికి చాలా అవకాశాలున్నాయని శెలవిచ్చాట్ట!

ఐస్‌లాండు అగ్నిపర్వతాలు మళ్ళీ పొగలుగక్కుతున్నాయి. మళ్ళీ ఎక్కడో భూకంపం. అమెరికా గల్ఫ్ ఆఫ్ మెక్సికో తీరంలో అంటువ్యాధిలా వ్యాపిస్తున్న చమురు. ఎన్ని కోట్ల జీవనభృతులు అస్తవ్యస్తం? ప్రకృతి శక్తులు కినుక వహించినప్పుడు మానవ శక్తికాని, ప్రభుత్వాలుకాని నిజంగా ఏమీ చెయ్యలేవు, చేష్టలుడిగి చూస్తుండిపోవడం తప్ప - చైనాలో వరసగా వచ్చిన రెండు భూకంపాలు, అమెరికా దక్షిణతీరంలో న్యూ ఆర్లీన్స్ నగరాన్ని వరసగా ముంచెత్తిన హరికేను తుపానులు .. ఏం చేశాం? ఇప్పటికింకా ఆ విధ్వంసపు పర్యవసానాల్నించి తవ్వుకుని బయటపడే ప్రయత్నాల్లోనే ఉన్నాం. అందుకే అనేది ప్రకృతిని కొంచెం గౌరవంగా చూడమని.

రెండువారాల క్రితం మొదలు పెట్టిన War of the End of the World నవల ఇంకా సాగుతోంది. చివరికొచ్చేటప్పటికి నా ఓపికని పరీక్షిస్తోంది. ఇటీవలి కాలంలో అంత లావుపాటి నవల చదివే ప్రయత్నం చెయ్యలేదు.

అమెరికాలో ఉండే భారతీయులకి ఇండియా వెళ్ళొస్తామని ఇక్కడి స్నేహితులతో మాటవరసకి చెప్పాలన్నా భయం - ఎందుకో ఈ లగేజి రాంబాబుల కథ చదివితే తెలుస్తుంది.

సమకాలీన సమస్యల మీద ఈ సామాన్యుడు చెప్పే వ్యాఖ్యానాలు ఆసక్తికరంగా ఉంటున్నై. మీరూ ఓ లుక్కెయ్యండి.

Thursday, May 6, 2010

అమెరికా తెలుగు బ్లాగర్లకి ..

భయపడకండి, నేను మళ్ళీ మీ రక్తపోటు పెంచే, మిమ్మల్ని కంగారు పెట్టే సందేశం ఏవీ ఇవ్వబోవట్లేదు.

కొంతకాలంగా నా ఆలోచనల్లో సుళ్ళు తిరుగుతున్న ఒక బుల్లి సమస్యని మీ ముందు పెట్టి మీ అభిప్రాయం ఏంటొ కనుక్కుందామని ఈ ప్రయత్నం.

మిమ్మల్ని మీరు ఎలా చూసుకుంటారు? - టిపికల్ దేశీ - అస్సలు దేశీ కాదు - కొన్నిట్లో అవును, కొన్నిట్లో కాదు.
ఏయే పద్ధతులు, ఆచారాల్ని బట్టి ఈ నిర్ధారణకి వచ్చారు?

సాధ్యమైనంత వివరంగా చెప్పండి.

ఎక్కడ మొదలెట్టాలో తెలియక పోతే ఇలా చూడ్డం మొదలెట్టొచ్చు:

కొన్ని టిపికల్ దేశీ లక్షణాలు .. నేను పొందు పరిచినవి కావు, కొందరు మిత్రులు ప్రవచించినవి
గ్రోసరీ షాపింగ్ ఖర్చులో కనీసం సగమైనా ఇండియన్ గ్రోసరీ
సేటిలైట్ టీవీలో ఇండియన్ ఛానెళ్ళు
సూది నించీ టీవీదాకా ఏది కొనాలన్నా జైహో వాల్మార్ట్

ఇది కొంచెం వ్యక్తిపరంగా సున్నితమైన విషయం కావచ్చు. మీ పేరు చెప్పడం ఇష్టం లేకపోతే అనామకంగానైనా చెప్పొచ్చు.

Wednesday, May 5, 2010

తెలుగు సినిమాల్లో బోధనాత్మక గీతాలు

మొన్న మూడు ప్రభంజనాలు టపాకి వ్యాఖ్యలు రాస్తూ పలువురు మిత్రులు సీతారామశాస్త్రిగారి ప్రబోధనాత్మక పాటలు చాలావాటిని ఉదహరించారు, అవి తమకి ఉత్తేజం కలిగించాయి అంటూ. చూడగా ఈ పాటలు రెండురకాలుగా ఉన్నట్టు అనిపించాయి. ఒక రకం వ్యక్తిని మాత్రమే సంబోధించేవి. దేశాన్నీ, సమాజాన్నీ సంబోధించేవి రెండో రకం. ఈ రెండురకాలూ మన తెలుగు సినిమాల్లో కొత్తకాదు. తెలుగుటాకీల తొలినాళ్ళనుండీ అభ్యుదయభావాలు కలిగినవాళ్ళు, కొత్త సమాజాన్ని కాంక్షించిన వాళ్ళు, ఆదర్శాల్ని విప్లవభావాల్ని శ్వాసించి జీవించిన వాళ్ళు అయిన దర్శకులు, కవులు, రచయితలు సినీరంగాన్ని ప్రభావితం చేశారు. సినిమాలో కథా సందర్భం ఏదైనా, వ్యాపార వొత్తిళ్ళు ఎన్నున్నా ఈ మహానుభావుల ఆశయాలు సినిమాల్లో చోటు చేసుకుంటూనే ఉండేవి, ముఖ్యంగా పాటల రూపంలో.

అప్పట్లో చాలా సాధారణంగా ఉపయోగించిన ఒక పద్ధతి - సినిమా కథకి సంబంధం లేని ఒక భిక్షగాడో, బైరాగో వీధిలొనో, రైలు పెట్టెలోనో అలా జనాంతికంగా పాడుతున్నట్టు చిత్రీకరించడం, సినిమాకి సంబంధించిన ముఖ్య పాత్ర ఎవరో అటుగా వెళ్తూ ఆ పాట వినడం. చాలా వరకు ఈ పాటలు వేదాంతం బోధిస్తున్నట్టుగా ఉండేవి - షావుకారు సినిమాలో గుడ్డితాత పాడేపాట, చరణదాసి సినిమాలో రైలు ఏక్సిడెంటు జరిగేముందు బిచ్చగాడు పాడే పాట ఇలాంటివి. పెద్దమనుషులు సినిమాలో ముఖ్య పాత్ర అయిన తిక్కశంకరయ్య (రేలంగి) పాత్రే ఇలాంటిది. నందామయా గురుడ నందామయా అని సినిమా మొదట్లోనే వచ్చే పాట మొత్తం సినిమాకి నాందీ ప్రస్తావనలాగా అప్పటికే రాజకీయాల్లో వేళ్ళూనుకున్న కుళ్ళుని కడిగి ఎండేస్తుంది. దేశోద్ధారకులు సినిమాలో పద్మనాభం ఇలాంటి పిచ్చివాడి పాత్రే పోషించి "ఆకలయ్యి అన్నమడిగితే" అనే పాట పాడతారు. ఈ పాటకూడా రాజకీయాల్లో అధికారుల్లో ప్రబలిన అవినీతికి చాకిరేవులాంటిది. 80లలో వచ్చిన అనేక సినిమాల్లో పి.యెల్. నారాయణ ఇటువంటి పాత్రలు చెయ్యడంలో తనదైన ముద్ర వేశారు.

సినిమా కథలో సందర్భం ఉన్నా లేకపోయినా ఏదో నృత్య ప్రదర్శన జరుగుతున్నట్టు చూపి, అందులో పాటలు కొన్ని కేవలమూ వినోదం కోసమే రూపొందించినా చాలా సందర్భాల్లో ప్రబోధానికి ఉపయోగించారు. సరిగంచు చీరగట్టి (సినిమా గుర్తు లేదు) అనే పాటలో పల్లె వదిలి పట్నాలకి వలసపోతే చిక్కుల్లో పడతారని, ఉందిలే మంచి కాలం ముందు ముందునా (రాముడు భీముడు) దేశం బాగుపడాలంటే అందరూ కష్టపడి పనిచెయ్యాలనీ .. ఇలా. ప్రముఖ నటి వహీదారహమాన్‌తో తెరంగేట్రం చేయించిన ఏరువాక పాట (రోజులు మారాయి) రైతు కష్టాల్ని ఈ ఆఫీసర్లూ రాజకీయులూ పట్టించుకోరు అని అప్పుడే చెప్పింది. వెలుగునీడలు సినిమాలో కళాశాల వార్షికోత్సవ సందర్భంగా విద్యార్ధుల ప్రదర్శనలో శ్రీశ్రీ రాసిన పాట పాడవోయి భారతీయుడా ఎంత ప్రసిద్ధి చెందిందంటే - తరవాత్తరవాత పంద్రాగస్టు రోజున జనరంజనిలో ఈ పాట వెయ్యకుండా ఉండేవారు కాదు. కోడలుదిద్దినకాపురం సినిమాలో ఉజ్జ్వల భారతీయ చరిత్రని తలుచుకునే నీ ధర్మం నీ సంఘం నీదేశంను మరవొద్దు పాట కూడా పులకరింపచేస్తుంది. బడిపంతులు సినిమాలో ఇంచుమించు ఇదే సన్నివేశంలో అన్నగారు పాడే భారతమాతకు జేజేలు కూడా మంచి పాట.

హీరోలే అప్పుడప్పుడూ ఆవేశపూరితులైన సందర్భాలు లేకపోలేదు. 60లలో వచ్చిన సినిమాలు చాలా వాటిలో అన్నగారు ధరించిన పాత్రలతో ఇటువంటి వ్యాఖ్యానపు పాటలు చాలా చిత్రీకరించారు. పవిత్రబంధం సినిమాలో నాగేశ్వర్రావు ఘంటసాల గొంతుతో పాడిన శ్రీశ్రీ పాట - గాంధి పుట్టిన దేశమా యిది - ఆనాటి యువత నిస్పృహకి అద్దం పడుతోందనిపిస్తుంది. అప్పటి నిరాశ ఆకలిరాజ్యం సమయానికి సాపాటు యెటూలేదు అంటూ ఆక్రోశమయింది.

వ్యక్తిని సంబోధిస్తూ జీవితంలో విలువైనవి యేమిటో తెలియ చెబుతూ ఆత్మస్థైర్యాన్ని ప్రబోధించే పాటలకీ కొదువలేదు. వెలుగునీడలు సినిమాలో శ్రీశ్రీ రాసినదే కల కానిదీ విలువైనది బ్రతుకు కన్నీటిధారలలోనే బలిచేయకు అనే పాట ఎంత నిరాశలో కుంగిపోయిన వాళ్ళనీ తట్టిలేపుతుంది. డా. చక్రవర్తి సినిమాలో మనసున మనసై మనిషికి తనదనే తోడు ఎంత అవసరమో చెబుతుంది. బాలభారతం సినిమాలో మానవుడే మహనీయుడు (మళ్ళీ శ్రీశ్రీ పాటే) మానవుడు తలుచుకుంటే సాధించలేనిది ఏదీ లేదని ఉద్బోధిస్తుంటే అడవిరాముడు సినిమాలో కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు అని కృషితోనాస్తి దుర్భిక్షం అనే ఆర్యోక్తిని నొక్కి చెబుతోంది.

ఇలా చెప్పుకుంటూ పోతే తెలుగు సినిమాల్లో ఉద్బోధించే మంచి పాటలు ఎన్నో! మీరూ గళం కలపండి!!

Tuesday, May 4, 2010

తెలుగు పాఠం - మే 4

ఆపాతమధురం అనే సమాసం తరచుగా తప్పు అర్ధంలో వాడుతున్నాము. ఈతప్పు వాడుక మనరాతల్లో ఈమధ్యన మరీ ఎక్కువగా కనిపిస్తున్నది.

ఈ పదబంధానికి మూలం సంగీత సాహిత్యాల ప్రాశస్త్యాన్ని చెప్పేందుకు ప్రసిద్ధికెక్కిన ఈ శ్లోకశకలం అయుండొచ్చు:

ఏకమాపాతమధురం అన్యదాలోచనామృతం

సంగీతం (చెవిన) పడినంతనే తియ్యగా అనిపించేది. మిగిలినదయిన సాహిత్యం ఆలోచనతో మధించడం వల్ల అమృతాన్నిస్తుంది అని స్థూలంగా దీని భావం.

ఆపాతము అంటే పడినది. ఆపాతమధురం అంటే పడినంతనే, అంటే మనం దాన్ని విన్నంతనే ఆహ్లాదాన్ని కలిగిస్తున్నది, వేరే ఏమీ కసరత్తు చెయ్యనక్కరలేకుండా. ఈ పదబంధంలో పాత అని అక్షరాల పొందిక చూసిన శ్లేషప్రియులెవరో దీన్ని ఆ "పాత" మధురం అని ప్రయోగించారు, శ్రావ్యమైన పాత సినిమా పాటల్ని గుర్తు చేసుకునేందుకు. బహుశా ఈవాడుక పత్రికల్లో మొదలయి ఉండొచ్చు, చమత్కారభరితమైన శీర్షికల కోసం పాత్రికేయుల వెంపర్లాట తెలియనిదేముంది? ఏదేమైనా తెలుసుకోవలసిన విషయం ఏమంటే, ఆపాతమధురం అంటే పాత సినిమా పాట కాదు అని.

ఈ కింది పదాలకి అర్ధాలు చెప్పండి - జాలంలో, నిఘంటువుల్లో వెతక్కుండా!
ధారాళం
చూడామణి
చమురు
బోలెడు
మిసిమి