అబ్బ .. వైసైపోతోంది

ఒక చోట బుడుగు అంటాడు, ఏదో మాట గబుక్కుని గుర్తుకి రాకపోతే .. అబ్బ వైసైపోతోంది .. అని.

ఏదన్నా ఒక కొత్త విషయం గురించి చెబితే మనవాళ్ళూ అదే మంత్రం జపిస్తూంటారు, అబ్బ వైసైపోతోంది ఇప్పుడింకా కొత్త విషయాలేం వంటపడతాయి? అని.

థియొడోర్ వాన్ కార్మన్ అని గొప్ప ఏరోనాటిక్సు పండితుడుండేవాడు. ఈయన ప్రసిద్ధిచెందిన కాళ్‌టెక్ వివిలో ఆచార్యుడుగా పని చేశారు. ఒకరోజు ఆయన వివి ప్రాంగణంలో హడావుడిగా నడిచి వెళ్తుంటే తోటి ఆచార్యులొకాయన ఎదురై, ఎక్కడికో అంత హడావుడిగా అనడిగారు. ఫలాని ఆచార్యులవారు మహచక్కగా టోపోలజీ చెబుతున్నాడు, ఆ క్లాసుకి వెళ్తున్నా అన్నారు ఈయన. మిత్రుడు ఆశ్చర్యపడి, ఏవిటీ ఈ వయసులో టోపోలజీ నేర్చుకుంటున్నావా? అనడిగారు (అప్పటికి వాన్ కార్మన్ వయసు అరవై పైనే). మరిప్పుడు కాకపోతే నేను చచ్చిపోయాక నేర్చుకోనా? అని చెప్పి హడావుడిగా క్లాసుకి వెళ్ళిపోయారు.

సరే, వాన్ కార్మన్ అంటే మహా మేధావి, ఆయన గొప్ప బుర్రకి ఎప్పటికప్పుడు ఏదో కొత్త విషయం కావాలి, అంచేత ఆయన ఈ లెక్కలోకి రాడంటారా? ఐతే మామూలు మనుషుల్ని గురించే చెప్పుకుందాం.

ఈ బ్లాగులో మా అప్ప (నాన్నగారు) గురించి చాలాసార్లే ప్రస్తావించాను. ఆయన జన్మరీత్యా తమిళులు. అదికూడా సరిహద్దు ప్రాంతం కాదు - నేటి తమిళనాడుకి నడిబొడ్డు అని చెప్పచ్చు. కాలేజి చదువయ్యేదాకా ఎప్పుడూ తమిళనాడు సరిహద్దు దాటినది కూడా లేదు. అట్లాంటిది విజయవాడలో బోటనీ లెక్చరరుగా స్థిరపడ్డారు. శాస్త్రీయంగా నేర్చుకోలేదు కానీ తెలుగు అనర్గళంగా మాట్లాడేవారు. చదివేవారు. ఆయనకి భాషలమీద ఉన్న మక్కువతో తన నలభయ్యో యేట హిందీ నేర్చుకోవాలని కోరిక కలిగింది. స్థానిక దక్షిణభారత హిందీ ప్రచారసభలో చేరి, ప్రాథమిక దగ్గర్నించీ ప్రవీణదాకా ఒకదాని తరవాత ఒకటి ఉత్తీర్ణులవుతూ వచ్చారు. ఆయనకి ఈ పని పూర్తి చెయ్యడానికి ఎనిమిదేళ్ళు పట్టింది. హిందీ కూడా అనర్గళంగా మాట్లాడేవారు. ఇంటరు విద్యార్ధులకి హిందీ ట్యూషను చెప్పేవారు. హిందీ పాఠశాల వార్షికోత్సవాలకీ వాటికీ హిందీలోనే ఉపన్యాసాలిచ్చేవారు.

సుమారు పదేళ్ళ కిందట ఒక మిత్రుని తలిదండ్రులు పిల్లల్ని చూడ్డానికి ఇక్కడికి అమెరికా వచ్చినప్పుడు పరిచయమయ్యారు. ఆయన అప్పటికి భారతీయ తంతి తపాలా వ్యవస్థలో అధికారి. వాళ్ళ పదవులు నాకు తెలియవు, కానీ మనకి తెలిసిన ఉదాహరణ చెప్పుకోవాలంటే, అదొక కంపెనీ ఐతే ఈయన వైస్ ప్రెసిడెంట్ అన్న మాట. ఈయన పై అధికారి మొత్తం భారతీయ పోస్టల్ డిపార్టుమెంటుకి అధికారి అన్న మాట. ఇంతకీ అసలు కథేంటంటే, ఆ తరవాత కొన్నాళ్ళకి చెన్నై వెళ్ళినప్పుడు, ఈ మావయ్యగారు రిటైరై చెన్నైలోనే ఉన్నారని తెలిసి వాళ్ళ ఇల్లు వెతుక్కుని వెళ్ళాను. నే వెళ్ళే సరికి గురువుగారు ముందు హాల్లో కూర్చుని వయొలిన్ మీద సంగీత సాధన చేస్తున్నారు. అరె, మనం అమెరికాలో కలిసినప్పుడు మీరు వయొలిన్ వాయిస్తారని తెలీదే అన్నాను. అవును, అప్పుడు వాయించలేదు, ఇప్పుడే నేర్చుకుంటున్నాను అన్నారు. రిటయిరై చెన్నై వచ్చాక, సరళివరుసల దగ్గర్నించీ మొదలెట్టి వయొలిన్ నేర్చుకుంటున్నారుట. నేను కలిసేప్పటికి అప్పుడే రెండేళ్లయింది. నిన్నుకోరి అని మోహనరాగ వర్ణం వాయించి వినిపించారు.

మొన్ననొక లేడీ డాక్టరుగారు కనిపించారు ఏదో మాఊరి ఫంక్షనులో, అంతకు ముందు పరిచయమే. ఏం చేస్తున్నారండి అన్నా పలకరింపుగా. రిటైరైపోయానండీ అన్నారు. అని చిన్నగా నవ్వి, మా యింటి దగ్గరే ఒక మంచి టీచరుగారు దొరికారండీ. అందుకని సంగీతం నేర్చుకుంటున్నా అన్నారు. భలే మంచి పని చేస్తున్నారు అని పైన చెప్పిన పోస్టలు మేస్టారి కథే చెప్పా. మన బ్లాగరులే ఉన్నారు చాలా మంది. కంప్యూటర్లు వారి వృత్తికాదు. జ్యోతిగారు, మాలగారు, మాలతిగారు, ఫణిబాబు గారు, రామకృష్ణరావుగారు .. కుతూహలంతో పని గట్టుకుని నేర్చుకుని, యథాశక్తి బ్లాగుతున్నారు.

అంచేత చాన్నాళ్ళుగా మీకేదైనా నేర్చుకోవాలని కుతూహల పడుతూన్నట్లైతే .. శుభస్యశీఘ్రం .. అర్జంటుగా మొదలెట్టెయ్యండి. వయసుదేముంది, దానిదారిన అది పైబడుతూనే ఉంటుంది. మనపని మనం చూసుకుందాం.

Comments

రవి said…
బాగా చెప్పారు. బ్లాగరుల ప్రస్తావన ముదావహం.చెప్పుకుంటే సిగ్గేసే వ్యవహారం కానీ, నా బ్లాగులో ఆప్షన్స్ ఏవిటో, దాన్ని ఎలా తీర్చిదిద్దాలో నాకసలు తెలీదు. నా బ్లాగును తీర్చిదిద్దింది జ్యోతి గారు. నా బ్లాగే కాదు అందాలు చిందే అనేక బ్లాగులకు ఆమె రూపకర్త. ఇది ఆశ్చర్యం, ముచ్చట గొలిపే నిజం.

ఇహ పోతే, నా సమస్య వైసు కాదు. బద్ధకం. దీనికి విరుగుడు ఏమిటో తెలిస్తే టపాయించండి.
నిత్య విద్యాయార్థులన్నమాట, నేనూ నిత్య విద్యార్థిగా ఉండడమే ఇష్టం.
hmmm నా గురించి చెప్పాలంటే పేద్ద... టపా ఐపోతుంది. .. మీరు జ్ఞానప్రసూనగారిని మర్చిపోయారు. బ్లాగులు రాయడమే కాక,ఈ మధ్యే పెయింటింగ్ నేర్చుకుని, కనపడ్డ చిత్రమల్లా వేసేస్తున్నారు. అదీ ఆయిల్ పెయింటింగ్..
SRRao said…
కొత్తపాళీ గారూ !
వయసుతో పనేముంది..మనసులోనే అంతా వుంది. మనిషికి వయసుగానీ జ్ఞానానికి వయసేమిటి, కులం, మతం, ప్రాంతం ఏమిటి ? బాగుంది మీ టపా !
కొత్తపాళి గారు ,
నాకెక్కడ వయసై పోతోందండి బాబూ :))
ధన్యవాదాలండి .
శ్రీ said…
బాగా చెప్పారు. జీవితంలో అన్ని కోరికలకి టిక్కులు పెట్టుకుంటే ఇంకేముంది! నాకూ ఈ మధ్య కొత్త కోరిక పుట్టింది, తీరింది. త్వరలోనే దీని మీద బ్లాగుతాను.
@ రవి .. బద్ధకం .. రోలొచ్చి మద్దెలతో మొరబెట్టుకుందనీ ..

@ గణేష్ .. నెనర్లు

@ కన్న .. yes - keeps the mind sharp.

@ జ్యోతి .. జ్ఞానప్రసూన గారి సంగతి మరిచిపోయా ఈ మధ్య బ్లాగుల్లో కనబడక. She certainly is an inspiration to all of us.
@ రావుగారు .. నిజం.

@ మాలగారు .. నిజ్జవేనండీ .. పొరబాటైపోయింది. ఏవండోయ్ అందరూ చెవులుతెరుచుకుని వినండి - అరిచి మరీ గట్టిగా చెబుతున్నా - ఈ టపాలో ఉదహరించిన వాళ్ళందరూ యంగండైనమిక్కులే, వైసైపోయినవాళ్ళు కాదోచ్!

@ శ్రీ .. look forward to it.
This comment has been removed by the author.
Anonymous said…
ఈ టపా నాకు వర్తించదు.
కానీ నా మిత్రుడొకడు మీ టపా నా భుజాల మీదుగా చదువుతూ , చెంప నిమురుకుంటూ...ఇలా అన్నాడు
"మామూలుగా చెప్పినట్టుగానే ఉంది కానీ ఎక్కడో చెళ్ళుమంది."
ఆ విధంగా మీబ్లాగుకు ఇంకొకడు తయారయ్యాడు అంటే ఆ పాపం నాది కాదు అని మనవి చేసుకుంటున్నా...:)
మీ టపాతో మా తాతగారిని గుర్తుచేసారు! ఆయన రిటైరైన కొత్తల్లోనే కంప్యూటర్లు కొత్తగా వచ్చాయి ఇండియాలోకి. అప్పటికింకా మైక్రోప్రాసెసర్లే కాని పీసీలు లేవు. అతని స్నేహితుడొకరు అలాంటి కంప్యూటరొకటి బహూకరించారు. దాన్ని ఆపరేట్ చెయ్యడమే కాకుండా, బేసిక్ (అప్పట్లోని కంప్యూటర్ భాష!) నేర్చుకొని దాన్లో ప్రొగ్రాములు రాసే వారు. అలా అలా pay role తయారీకి ఒక పెద్ద ప్రొగ్రాము రాసి ఆ ప్రొగ్రాముతో సహా ఆ కంప్యూటర్ని తను పనిచేసిన మహారాజా కాలేజీకి బహూకరించారు. తర్వాత మరికాస్త పెద్ద కంప్యూటరు కొన్నారు. ఇది రంగుల కంప్యూటర్. కొన్ని గ్రాఫిక్స్ కూడా ఉన్నాయి. అందులో ప్రొగ్రాములకి బేసిక్ సరిపోలేదు. ఆ కంప్యూటర్ machine languageని నేర్చుకొని అందులో చాలా ఆటల ప్రొగ్రాములు రాసారు. ఓపిగ్గా hexa-decimal భాషలో ఆ ప్రొగ్రాములు కాగితమ్మీద రాయడం. నేను వాటిని డిక్టేట్ చేస్తే కంప్యూటర్లోకి ఎక్కించడం, నాకు భలే తమాషాగా ఉండేది (అప్పటికి నేను ఏడో క్లాసో ఎనిమిదో క్లాసో)!
ఇలా చెప్తూ పోతే పెద్ద గ్రంథమే అవుతుంది! బహుశా ఒక్క క్షణం కూడా బద్ధకంగా, ఖాళీగా గడిపేవారు కాదు. ఏదో ఆటో, పాటో, పనో, ఆలోచనో ఉండాల్సిందే!

వారిని ఎంత ఆదర్శంగా తీసుకోవాలనుకున్నా నాకు చేతకావడం లేదు! :-(
"మామూలుగా చెప్పినట్టుగానే ఉంది కానీ ఎక్కడో చెళ్ళుమంది." నా కైతే వాత కూడా తేలింది. :(
ఇలా పాతరేసిన పాత ప్రాజెక్టులను - తిరిగి మొదలెట్టాలనే
"శ్రీకారమ్మును జుట్టగా మరలనే శేషాధికోత్కృష్టమౌ ఆకాంక్షాతతికిన్" అంటూ ఉగాది నాడు పాడుకున్నాను...
కొంత మంది యువకులు పుట్టుకతో వృద్ధులు అని శ్రీ శ్రీ నేను పుట్టకముందే రాశాడు గానీయండి... ముందు చూపుతో రాశాడు.
మీ సంగతేమో గాని నేనైతే ఎప్పుడూ ఎదోహటి నేర్చేసుకుంటూ ఉంటాను. అదేమిటో చిన్నప్పటి నుండి అలా అలవాటై పోయింది.
ఈ విషయం మీద టపాయించి ఆ జ్ఞానాన్ని మీకు కూడా ప్రసాదిస్తాను లెండి.
antaryagam said…
అవునండీ, కొత్త విషయం నేర్చుకోవటానికి వయసు తో సంబంధం లేదు.త్రుష్ణ తప్ప, అది ఎంత లోతు గా ఉంటే మన ప్రయత్నం అంత గాఢం గా ఉంటుంది.

నేను పంతొమ్మిది సంవత్సరాల వయసులో బ్యాంక్ లొ ఆఫీసర్ గా చేరి, ఇరవై మూడు సంవత్సరాలు పని చేసి, వీఆరెస్ తీసుకుని, మేము స్వంతం గా నడుపుతున్న నిర్మాణ కంపెనీ వ్యవహారాలు చూస్తూ, ఏదో తెలియని ఆసక్తి తో ఇప్పుడు తెలుగు ఎమ్మే (దూర విద్య ద్వార) చదువుదామని నిర్ణయించుకున్నాను.
అదొక థ్రిల్ల్(పూర్తి చెయ్యగలిగితే).

కానీ ఆ దేశాలకి మన దేశానికి, దైనందిన జీవన సరళి లో ఉన్న మార్పుల వలన, మన కాలాన్ని ఇంకెవరో ఆక్రమించుకోవటాన్ని ఆపలేము. మనకి సామాజిక లాంచనాలు ఎక్కువ, అదొక్కటే తియ్యనైన నివారించలేని సమస్య.

ఇంక, సంగీతం నేర్చుకోవటం, సాధన చెయ్యటం అనేది అందరికి కూడా హ్రుద్యమైన,మధురమైన కాలక్షేపం.
సంగీతం కొంత కాలం స్కూల్ లొ నేర్చుకుని వదిలెశాను. ఇప్పుదు మళ్ళీ మనసు దాని మీదికి వెళుతున్నది, అందుకని ప్రాధమికం గా ఊరిలొ జరిగే అన్ని సంగీత కార్యక్రమాలకి క్రమం తప్పకుండా వెళుతూ ఉంటాను. అలా మెల్లిగా దానిలొ ప్రవేసించవచ్చు, అని సంకల్పం.చూద్దాము ఎంత వరకు ముందుకు వెళ్ళగలనో.