కబుర్లు - మే 10

పోయినవారం అతి పెద్దవార్త ఇంగ్లాండులో ఎన్నికలు. అమెరికాలో లాగానే వీళ్ళకీ రెండే ప్రధాన పార్టీలు, పేరుకి లిస్టులమీద ఇతర పార్టీలు ఉన్నా. ఇరాకు యుద్ధం దగ్గర్నించీ ప్రభుత్వంలో ఉన్న లేబర్ పార్టీ ఒకదానితరవాత ఒకటిగా ఎన్నో ఎదురు దెబ్బల్ని తట్టుకుంటూ వచ్చింది. ఎలాగైనా ప్రభుత్వ పగ్గాలు చేజిక్కించుకోవాలని అపోజిషన్ కన్సర్వేటివ్ పార్టీ కూడా సర్వశక్తులూ కూడగట్టుకుని సంఘటితమయింది ఈ ఎన్నికలో. అయ్యా, తీరా జరిగిందేవిటీ అంటే .. ఎవరికీ పూర్తి మెజారిటీ రాలేదు. లేబరు కొంతవరకూ తన స్థిరస్థానాన్ని కోల్పోయిన మాట నిజం. అదే కొద్దిపాటి స్థానాన్ని టోరీలు గెలుచుకున్న మాట నిజం. కానీ పూర్తి మెజారిటీ రాలేదు. ఇండొనీషియా, భారత్ వంటి ప్రజాస్వామ్యాల్లో ఇప్పటికే ఒకటి రెండు దశాబ్దాలుగా జరుగుత్న్న రాజకీయ పరిణామం ఇప్పుడు బాగా స్థిరపడిన ప్రజాస్వామ్యాలైన పాశ్చాత్య దేశాలకు కూడా పాకుతున్నట్లున్నది. గడిచిన పదేళ్ళలోనూ ఇటలీ జెర్మనీ వంటి దేశాల సార్వత్రిక ఎన్నికల్లో ఈ ఒక్క పార్టీకి మెజారిటీ రాకపోవడం, సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పడ్డం చూస్తూ వస్తున్నాము. ప్రపంచ వ్యాప్తంగా ప్రజాస్వామ్యాల్లో ఇది గమనించాల్సిన పరిణామం అని నాకు అనిపిస్తోంది. ఈ పరిణామం ద్వారా రెండు విషయాలు నాకు స్పష్టమవుతున్నాయి. ఒకటి - పౌరులు ఏ ఒక్క సైద్ధాంతిక ప్రాతిపదికకో అమ్ముడుపోయి దానికే పట్టం కట్టేందుకు సిద్ధంగా లేరు. రెండు - తమ ప్రతినిధులు సిద్ధాంతాల నినాదాల్లో కూరుకుని పోయి కూర్చోవడం కాకుండా తమ రాజకీయ ప్రత్యర్ధులతో కలిసికట్టుగా పనిచెయ్యడం మొదలుపెట్టి ప్రజాసంక్షేమాన్ని సాధించాలనేది ఓటరు మహాశయుల ఆశయం. ఎటొచ్చీ బ్రిటీషు ఎంపీలకి కోలిషన్ రాజకీయాలు కొత్త .. తప్పేదేముంది, తినగ తినగ వేము తియ్యనుండు!
మూలిగే నక్కమీద తాటికాయ పడిన చందంగా .. ఇంగ్లాండులో పర్యటిస్తున్న నైజీరియా దేశపు ఎంపీ ఒకాయన ఈ ఎన్నికల హడావుడినంతా పరికించి చూసి .. బ్రిటీషు ఎన్నికల వ్యవస్థలో మోసం జరగడానికి చాలా అవకాశాలున్నాయని శెలవిచ్చాట్ట!

ఐస్‌లాండు అగ్నిపర్వతాలు మళ్ళీ పొగలుగక్కుతున్నాయి. మళ్ళీ ఎక్కడో భూకంపం. అమెరికా గల్ఫ్ ఆఫ్ మెక్సికో తీరంలో అంటువ్యాధిలా వ్యాపిస్తున్న చమురు. ఎన్ని కోట్ల జీవనభృతులు అస్తవ్యస్తం? ప్రకృతి శక్తులు కినుక వహించినప్పుడు మానవ శక్తికాని, ప్రభుత్వాలుకాని నిజంగా ఏమీ చెయ్యలేవు, చేష్టలుడిగి చూస్తుండిపోవడం తప్ప - చైనాలో వరసగా వచ్చిన రెండు భూకంపాలు, అమెరికా దక్షిణతీరంలో న్యూ ఆర్లీన్స్ నగరాన్ని వరసగా ముంచెత్తిన హరికేను తుపానులు .. ఏం చేశాం? ఇప్పటికింకా ఆ విధ్వంసపు పర్యవసానాల్నించి తవ్వుకుని బయటపడే ప్రయత్నాల్లోనే ఉన్నాం. అందుకే అనేది ప్రకృతిని కొంచెం గౌరవంగా చూడమని.

రెండువారాల క్రితం మొదలు పెట్టిన War of the End of the World నవల ఇంకా సాగుతోంది. చివరికొచ్చేటప్పటికి నా ఓపికని పరీక్షిస్తోంది. ఇటీవలి కాలంలో అంత లావుపాటి నవల చదివే ప్రయత్నం చెయ్యలేదు.

అమెరికాలో ఉండే భారతీయులకి ఇండియా వెళ్ళొస్తామని ఇక్కడి స్నేహితులతో మాటవరసకి చెప్పాలన్నా భయం - ఎందుకో ఈ లగేజి రాంబాబుల కథ చదివితే తెలుస్తుంది.

సమకాలీన సమస్యల మీద ఈ సామాన్యుడు చెప్పే వ్యాఖ్యానాలు ఆసక్తికరంగా ఉంటున్నై. మీరూ ఓ లుక్కెయ్యండి.

Comments

@ రిషి .. క్షమించాలి, అలవాట్లో పొరబాటుగా మీరు అమెరికా అనేసుకున్నాను.
"బ్రిటీషు ఎన్నికల వ్యవస్థలో మోసం జరగడానికి చాలా అవకాశాలున్నాయని శెలవిచ్చాట్ట!" అంతగా పరికించలేదు కాని నిజమేనేమో, ఎన్నికల రోజు ఎలాగైనా లేబర్లను గెలిపించాలని మా స్నేహితుడొకడు వాళ్లింట్లో వాళ్ళు ఓట్లు వేయడానికి అందుబాటులో లేరని అందరి ఓట్లు వేసొచ్చాడు.
మీరిక్కడ లేరు కాబట్టి ఒక విషయం మీ దృష్టికి రాలేదు కాని, చాలా మందికి(దేశీలకి) కన్సర్వేటివులు అధికారంలోకి ఇష్ట్లం లేదు. అక్రమ వలసదారులపై కొరడా ఝులిపించాలడం, వలసలను తగ్గించడం వారి నినాదాల్లో కొన్ని. ముసల్మానులు ఈపాటికే భయపడడం మొదలుపెట్టారు.
మీ గుర్తింపు పొందినందుకు చాలా ఆనందంగా వుంది. ధన్యవాదాలు సార్.