అన్నిటికంటే ముందు శ్రీశ్రీ కవి

మహాకవి శ్రీశ్రీ ఒక హిపోక్రిటా? అని బొందలపాటిగారి బ్లాగులో ఆసక్తికరమైన వ్యాసం రాశారు. నేనిప్పుడు చెప్పబోతున్నది ఆ వ్యాసం మీద విమర్శ కాదు. ఆ వ్యాసం చదవగా నాకు కలిగిన కొన్ని ఆలోచనలు పంచుకోవాలని మాత్రమే.

తెనాలి రామకృష్ణ సినిమాలో ఒక దృశ్యంలో రామకృష్ణుడు తిమ్మరుసుతో మాట్లాడుతున్న దృశ్యం ఒకటుంది. విజయనగర సామ్రాజ్యానికి చుట్టూతా శత్రువులు పొంచివున్నారనీ సామ్రాజ్యం దినదిన గండం నూరేళ్ళ ఆయుష్షుగా బతుకుతున్నదనీ మొదటిసారి రామకృష్ణుడికి అర్ధమయింది. రామకృష్ణుడు చాలా ఆందోళన చెందుతూ ఈ శత్రువుల్ని అధిగమించే దారిలేదా అనడిగాడు. దానికి సమాధానం చెబుతూ తిమ్మరుసు - నాయనా, నువ్వు ఆవేశ పరుడవైన కవివి. రసికుల్ని రంజింపజెయ్యడమే నీ లక్ష్యం. కానీ నా లక్ష్యం వేరు - అన్నాడు.

కవి ముఖ్య లక్షణాన్ని చాలా ఒడుపుగా పట్టుకున్నారు ఈ మాటలరచయిత. కవి ఆవేశపరుడు. కవిత్వం ఆవేశం - అది భావం కావచ్చు, అర్ధం కావచ్చు, అనుభూతి కావచ్చు - ఇవన్నీ ఆవేశానికి రూపాలే. ఈ ఆవేశానికి పర్యవసానం పాఠకునిలో రససిద్ధి (పైన డయలాగులో చెప్పిన రసికుల్ని రంజింపజెయ్యడం) కవిత్వంలో ఆలోచన కూడా ఉండొచ్చు, కానీ దాని స్థానం ఆవేశానికి తరవాత రెండొ స్థానమే. మొన్ననే ఇక్కడ తెలుగుపాఠంలో తల్చుకున్న శ్లోక శకలం, సాహిత్యం ఆలోచనామృతం అని - అది వేరే విషయం, అది కవిత్వపు ఆవేశాన్ని జీర్ణించుకున్నాక పాఠకుడిలో కలిగే స్పందన, మథనం, తద్వారా ఆలోచన. అసలు సంగతేవిటంటే కవిత్వమంటే ఆవేశం, కవి ముఖ్యంగా ఆవేశపరుడు.

అన్నిటికంటే ముందు శ్రీశ్రీ కవి. శ్రీశ్రీ కవి కాకపోతే ఇంకేదీ కాడు. తద్వారా శ్రీశ్రీ ఆవేశపరుడు, ఆయన కవిత్వం ఆవేశం. ఆయనే చెప్పుకున్నాడు మహాప్రస్థానంలో (ఋక్కులు) ఉండాలోయ్ కవితావేశం, కానీవోయ్ రసనిర్దేశం. ఇది కూడా మనం ఇక్కడ మొదణ్ణించి చెప్పుకుంటూ వస్తున్న వరసలోనే ఉంది - ముందు ఆవేశం, దాని పర్యవసానంగా రససిద్ధి. మిగతా విషయాలన్నీ అనవసరం - అనవసరం కాకపోయినా కనీసం అముఖ్యం (Unimportant).

శ్రీశ్రీ కమ్యూనిస్టు భావజాలంతో తనను తాను ఏకీభవించుకోవడంతోనూ, కొన్ని విప్లవపోరాటాలకీ, వామపక్ష ఉద్యమాలకీ బహిరంగవేదికల్లో తన మద్దతునీ సానుభూతినీ ప్రకటించడంతో కవిత్వంతో సంబంధంలేని అనేక అంశాలు శ్రీశ్రీ జీవితంలో ప్రవేశించాయి, దానికి సంబంధించిన చర్చలో గందరగోళం సృష్టిస్తున్నాయి. ఇటువంటి (కవిత్వానికి సంబంధంలేని) చర్చల్లో - "సాహిత్యంలో నిబద్ధత", "నిబద్ధుడైన కవి" - ఇలాంటివే మరికొన్ని ముద్రలూ నినాదాలూ వినిపిస్తూ వస్తున్నాయి. నిబద్ధు డవటం అంటే (దేనికో ఒకదానికి, లేదా కొన్నిటికి) కట్టుబడి ఉండడం. కట్టుబడి ఉండడం అంటేనే బంధనం, స్వేఛ్ఛకి విరుద్ధం - తద్వారా సృజనకీ, ఆవేశానికీ - తద్వారా కవిత్వానికీ విరుద్ధం. ఎవరైనా సృజనాత్మక కళాకారుడు నేను పలాని దానికి నిబద్ధుణ్ణి అని చెప్పున్నాడంటే ఆయనలోని సృజనకి (ఆవేశానికీ, కవిత్వానికీ) పిండాలు పెట్టేసుకోవచ్చు. నిబద్ధులైన వాళ్ళూ, హిపోక్రట్లు కానివాళ్ళూ కోట్లకొద్దీ ఉన్నారు లోకంలో జనాభా - భూభారం పెంచడానికి తప్ప ఎందుకూ పనిక్రానివాళ్ళు. శ్రీశ్రీమాత్రం ఒక్కడే.

అవునూ, ఇంత కరశోష (నెనర్లు మధురవాణి గారూ!) పడినాక నాకో డౌటొచ్చింది - శ్రోతల మనసుల్ని పరవళ్ళు తొక్కించే సిరివెన్నెల సీతారామశాస్త్రిగారి ఉద్బోధనాత్మక గేయాల్ని గురించి మొన్ననే చెప్పుకున్నాం కదా - ఆయన పాటలు చాలావాటిని నెమెరేసుకున్నాము కూడానూ - ఎవరూ ఆయన్ని అడగరేం నువ్వు నిబద్ధుడివేనా అని? ఆయన బోధించిన జీవిత సూత్రాలన్నీ ఆయన జీవితంలో పాటిస్తున్నారో లేదో చూసొచ్చారా ఎవరైనా? ఎందుకు శ్రీశ్రీకి మాత్రమే ఈ ప్రశ్న? ఎందుకంటే శ్రీశ్రీ తన జీవితాన్ని గురించి (ఆశలూ, భయాలూ, అలవాట్లూ, బలహీనతలూ) ఏదీ దాచుకోలేదు. ఒక్క వాక్యంలో చెప్పాలంటే -

He wore, not only his heart, but his entire life on his sleeve!



నా వుద్దేశం సిరివెన్నెలనో ఇంకో కవినో రచయితనో ఎత్తిచూపాలని కాదు, శ్రీశ్రీకి వత్తాసు పలకాలనీ కాదు. కవి విషయంలో, కవిత్వం విషయంలో నిబద్ధత చర్చ అనవసరం, అసంబద్ధం అని చెప్పడం మాత్రమే.

అన్నిటికంటే ముందు శ్రీశ్రీ కవి. శ్రీశ్రీ కవి కాకపోతే ఇంకేదీ కాడు.
ఇహ మిగతా చర్చ అంతా అనవసరం!

Comments

మోహన said…
:) నిజమే. దొరికే వరకూ అందరూ దొరలే... దొరక్కపోయినా, 'నేను దొంగనని' చెప్పిన వాడి నిజాయితీని ఎంత మంది హర్షించగలరు??! నిజాయితీ ఉన్నవాడు ఎప్పుడూ అందరికీ అలుసే.
Hima bindu said…
బాగా చెప్పారండి
మనకిప్పటికీ నాటకమనగానే గురజాడ,కవిత్వమనగానే శ్రీశ్రీ ప్రస్తావన వస్తూనే ఉంటుంది. వీళ్ళిద్దరూ అంతగా ఎంతోమందిని ప్రభావితం చేసారు.
* * *
శ్రీశ్రీ రచనలపై,ఎందరో పరిశోధనలు చేసారు. శ్రీశ్రీ రచనలను బాగా అర్ధం చేసుకోవటానికి అవి ఉపయోగపడుతూనే ఉన్నాయి. శ్రీశ్రీ విమర్శకులు వాటిని కూడా ఒకసారి తిరగేస్తే బావుంటుంది.
bondalapati said…
చాలా చక్కగా వ్యక్తీకరించారండీ! ధన్యవాదాలు!
మనిషి నమ్మిన సిధ్ధాంతం ప్రకారం అతని వ్యక్తిత్వం ఏర్పడదనుకొంటా.మనం నమ్మిన సిధ్ధాంతం మన అంతరాత్మ లో భాగమైన తరువాత,మన వ్యక్తిత్వాన్ని సిధ్ధాంతానికి అనుగుణం గా చేసుకొనటానికి కొంత ప్రయత్నం జరుగుతుంది. కానీ ఇందులో ఎవ్వరూ పూర్తి గా సఫలీకృతులు కాలేరు.
మీరు చెప్పినట్లు ఒకే ఒక శ్రీ శ్రీ.
Anonymous said…
Aside these things, does anyone know who "bestowed" the "mahaa kavi" title on Sri Sri?
గురూ గారూ,
Interesting analysis! నా బ్లాగులో ఎప్పుడో చదివిన అంత చిన్న పదం గుర్తు పెట్టుకోడమే కాకుండా, ఫలానా పోస్ట్ అని గుర్తుంచుకుని మరీ ప్రస్తావించారా! చాలా ఆశ్చర్యంగానూ, ఆనందంగానూ కూడా ఉంది.
మీకు బోలెడన్ని ధన్యవాదాలు :-)
వ్యాఖ్యానించిన మిత్రులందరికీ నెనర్లు.

శ్రీశ్రీ వచన రచనగురించి కె.శ్రీనివాస్ గారి వ్యాసం ఇప్పుడే నాకంటబడింది.
Anonymous said…
మంచి విశ్లేషణ. సింపుల్ గా చెప్పినా బాగా డెప్త్ ఉంది.బాగుంది.
మీకు తీరిక ఉంటే He wore...అనే వాక్యాన్ని తెలుగులో వివరించాగలరా...నాకు పెద్దగా ఇంగ్లీషు రాదు. ధన్యవాదాలు
sat గారు, ధన్యవాదాలు.
He wore his heart on his sleeve అని ఆంగ్ల నుడికారం. తన మనోభావాల్ని, ఆశయాల్ని దాచకుండా బహిరంగంగా, బట్టబయలుగా ఆ మనిషి ప్రకటిస్తున్నాడు అనే అర్ధంలో వాడతారు. శ్రీశ్రీ తన ఆసయాల్నే కాదు, తన జోవితాన్ని కూడా అంతే బట్టబయలుగా ప్రకటించాడు అని చెప్ప ప్రయత్నించాను ఆ వాక్యంలో.
Anonymous said…
నిజమే. అందుకే నాలాంటి బూర్జూవాలకు, క్యాపిటలిస్టులకు కూడా శ్రీ శ్రీ అంటే అభిమానం.

-మురళి
gaddeswarup said…
OFF TOPIC
Kottapali garu and others,
My Yahoo mail account is compromised. Please ignore any meassages from there.
Swarup (gadde anandaswarup)
శ్రీశ్రీ కవిగానే మిగిలిపోతే యిన్ని హృదయాలకు దగ్గరయ్యేవాడు కాదు. తాను చెప్పినదానికి దగ్గరగా జరిగి చూసి మద్దతునిచ్చి స్ఫూర్తి రగిలించినవాడు. కనుకే మహాకవికంటే ప్రజాకవిగానే గుర్తుంచుకోవడం ఆయనకు నివాళి.