డబ్బు టు ది పవరాఫ్ డబ్బు

కథ, కథనం ఇవన్నీ పక్కన పెట్టినా, తన నవలలకి నామకరణం చెయ్యాడంలో యండమూరి మొనగాడని ఒప్పుకోవాలి. ఆయన సృజించిన టైటిల్సన్నిటిలో ఈ టైటిలు నాకు చాలా ఇష్టం. ఆధునిక జీవితంలో డబ్బుకున్న ప్రాముఖ్యతని చాలా ఒడుపుగా పట్టుకున్నారిందులో.

మనిషి జీవితంలో డబ్బుకున్న ప్రాముఖ్యత కొత్తదేం కాదు. ధనమూలమిదం జగత్ అని సంస్కృతంలోనూ కాసుకి లోకం దాసోహం అని తెలుగులోనూ సామెతలున్నై. సామెతలంటే ఏంటి? అవి క్లుప్తంగా క్రోడికరించిన సామూహిక అనుభవాలు.

పంచతంత్రంలోని మిత్రలాభంలో ఒక ఎలిక ఉంది. వాడిపేరు హిరణ్యగర్భుడు అనుకుంటా, స్పష్టంగా గుర్తు లేదు. ఈ ఎలిక ఒక సందర్భంలో తన పాతకథ చెబుతాడు. వీడు ఒక సంపన్న గృహస్తు ఇంట్లో కలుగు చేసుకుని, ఆ యింటి గాదెల్లోనించి ధాన్యం, పప్పుదినుసులూ, ఇంకా చిల్లరమల్లర వస్తువులన్నీ తన కలుగులోకి తరలిస్తూ, తన కుటుంబాన్ని బంధు మిత్ర సమేతంగా వృద్ధి చేసుకుని దర్జాగా ఉంటూ ఉన్నాడు. ఈ ఎలిక బాధ పడలేక గృహస్తు వడ్డెవాళ్ళని రప్పించి వాడి కలుగుని కనిపెట్టి తవ్వించేసి ఎలిక పోగు చేసిన ధాన్యసామగ్రినంతా కొల్లగొట్టించాడు. ఎలిక ఎట్లాగో కొసప్రాణాలతో చావుతప్పి కన్ను లొట్టబోయి బయటపడ్డాడు. కొన్నాళ్ళయినాక ఈ ఎలిక బక్కచిక్కి, నీరసంగా అలా వెళుతుంటే ఆ గృహస్తు తన మిత్రునితో కబుర్లాడుతూ ఎలికని చూపించి ఇలా అన్నాడు - చూశావా? కేవలం ఒక్క వారం క్రితం, ఈ ఎలిక ఎంత దర్జాగా, ఈ ఇల్లంతా తనదే అన్నట్టు తిరుగుతుండేవాడు. నేను వాణ్ణి చంపలేదు. వాడు పేరబెట్టుకున్న ధనాన్ని కొల్లగొట్టించాను. ఇప్పుడు చూడు వీడు ఎలా బక్కచిక్కి జీవఛ్ఛవంలా ఉన్నాడో - అని.

ఈ కథలోని ఎలికకీ ఆధునిక మానవుడికీ అట్టే తేడా లేదు.

ఐతే, ఎంత డబ్బు కావాలి? సుఖపడడానికి తగినంత. సుఖమంటే ఏవిటి? ఎవరు నిర్వచిస్తారు? డబ్బు ఆనందాన్ని సంతృప్తినీ కొనలేకపోవచ్చు, కానీ కుటుంబాన్ని పోషించాలి గద! ఈ పేరడాక్స్ ఎట్లా పుట్టుకొచ్చిందో మరి నాకు తెలియదు గానీ, భారతీయ మధ్యతరగతిలో డబ్బుని చిల్లిగవ్వలా పరిగణించే మనస్తత్వం ఒకటి చాన్నాళ్ళుగా ప్రబలి ఉంది. డబ్బుని తృణీకరించడం చాలా గొప్పగుణంగా పరిగణించ బడుతూ వచ్చింది. కొన్నేళ్ళుగా, కొత్త కొత్త రుచులు, నోరూరించేవి, ఆశలు రేపేవి అందుబాటులోకి వచ్చేసరికి ఇప్పుడు ఆ మనస్తత్వం ఒక్క పిల్లిమొగ్గ వేసి డబ్బు ఆకలి జనాల్ని దహించేస్తోంది.

ఇలా ఉండాల్సిన పని లేదు. డబ్బు మనల్ని నడిపించనక్కర్లేదు, మనమూ డబ్బుని శాసించనక్కర్లేదు. డబ్బుతో శాంతియుత సహజీవనం చెయ్యొచ్చు. డబ్బుతో మనకేం కావాలో ముందు తెలిస్తే, అంటే ముందు మనల్ని మనం అర్ధం చేసుకుంటే .. ఇది సాధ్యమే!

Comments

mmkodihalli said…
ఎలిక అనే పదం తప్పుడు వ్యవహారికం అనుకుంటాను. ఎలుక అనాలి.
Anonymous said…
ఏం చెప్పదల్చుకున్నారు? మొత్తానికి ఏదో చెప్పారు..అదేదో నా మట్టిబుర్రకి అర్థమై చావటంలేదు..:)
DG said…
>> భారతీయ మధ్యతరగతిలో డబ్బుని చిల్లిగవ్వలా పరిగణించే మనస్తత్వం ఒకటి చాన్నాళ్ళుగా ప్రబలి ఉంది.

నా ఉద్దేశ్యంలో ఇది చేతకాని తనాన్ని కప్పిపుచ్చుకునేందుకు ఆడే ఆట. ఈ మధ్య వరకు ఇండియాలో ఒకటే మిడిల్ క్లాసు ఉండేది. ఇప్పుడు అప్పర్ మిడిల్, లోయర్ మిడిల్ అని మొదలెట్టారు. సాఫ్ట్ వేర్ బూం వచ్చాక చేతులో డబ్బులు ఆడుతున్నాయి జనాలకి. ఇవి పోతే మళ్ళీ మనం అందరం పాత పాటే మొదలెడతాం. ఏది పోయినా 'ఉపనయనము నాటి విద్య ఉన్నది మనకున్.' కైండ్ ఆఫ్ సోర్ గ్రేప్స్. ఇది ఇప్పటికీ ఇండియాలో బాగా వాడుకలో ఉంది. డబ్బులు వస్తే గొప్పే, రాకపోతే మెట్ట వేదాంతం రడీగా పనికొస్తుంది. మీరే చెప్పేరు కదా ఇది బాగా మధ్య తరగతి లో ఉందీ అని. రిక్షా వాడికీ అంబానీలకి ఉండదు.
@ మురళీమోహన్ .. మాట్లాడినట్టుగా రాయడం అలవాటుతో అలా రాశాను. మీరు చెప్పింది కరక్టే.

@ sat .. సరే.

@ DG .. ఆ మనస్తత్వం ఎందుకొచ్చింది అని లోతుగా ఆలోచించలేదు గానీ అనేక కారణాలున్నాయని తోస్తోంది నాకు.
సామాన్యుడు said…
నిజమేన౦డీ చేతులు కాలాక ఆకులు పట్టుకునే మనస్త్వత్వం మనకున్నది. జేబు ని౦డుగా వు౦టే అవసరమున్న లేకున్నా విపరేత౦గా ఖర్చుపెడతారు. ఈ మధ్యకాల౦లో పెరిగిన ద్రవ్య వినిమయం పల్లెటూర్లలో కూడా అవసరానికి మి౦చి వృధా ఖర్చు చేస్తున్నారు. ఇది ఎ విపత్కర పరిస్థితికి దారితేస్తు౦దో అనుకు౦టూ వు౦డే వాడిని. బాగా గుర్తుచేశారు. ధన్యవాదాలు.
భావన said…
నాకు ఆ నవల గుర్తు లేదు కాని మీ నిర్వచనం దాని మీద DJ గారి కామెంట్ కొంచం ఆశ్చర్యం కలిగించింది. మరి మీకు తెలిసిన మధ్య తరగతి వాళ్ళు డబ్బు చిల్లి గవ్వలా ఎందుకు అనుకుంటారో తెలియదు నేను మధ్యతరగతే నేను పెరిగిన సమాజం మధ్య తరగతే. మరి ఎవ్వరం డబ్బు ను చిల్లిగవ్వ లా చూడలేదే, మన శక్తి మనం గమనించుకుని మన తాహతు కు తగ్గట్లు శాంతం గా సంతోషం గా చాలా మందే వుండే వారు. వున్నదానిలోనే ఎంతో కొంత పొదుపు కూడా చేసేవాళ్ళు. దానికి DJ గారు చాతకానితనమన్నారు. అందరు అంబానిలైతే అంబానిల దగ్గర వస్తువులు ఎవరు కొనుక్కుంటారు అది ఒక దివాళా కోరు ఆలోచనేనా ఐతే?
రవి said…
మిత్రలాభం ఎలుక పేరు హిరణ్యకుడు. హిరణ్యకుడు నివసించిన ఇంటి ధనవంతుడి పేరు చూడాకర్ణుడు. వాడి మిత్రుడు వీణాకర్ణుడు. (నిన్నే వావిళ్ళ రామస్వామి వారి చిన్నయసూరి - నీతిచంద్రిక ఏంటిక్ పుస్తకాల షాపులో దొరికితే కొని చదువుతున్నాను లెండి.)

డబ్బు ఫ్లో ఎక్కువవగానే మధ్యతరగతి హిపోక్రసీ, విపరీతమైన యావ బయటపడుతున్నాయి లెండి. డబ్బు సంపాదిస్తూ, నిరాడంబరంగా బతకాలనుకునే వారు చేతకానివారుగా, చచ్చు చవటలుగా చూడబడుతున్నారు. (ఇది స్వయంగా నా అనుభవం కూడానూ)
@ సామాన్యుడు .. నిజం

@ భావన .. Interesting. నేనక్కడ వాడిన నుడికారం సరి కాకపోవచ్చు. వాళ్ళు గొప్పలకి పోయి ఖర్చు పెట్టారని కాదు నా ఉద్దేశం. జెనెరల్‌గా ఆస్తులు సంపాదించాలనే కోరిక లేకపోవడం, ఒకవేళ ఎవరికన్నా అటువంటి కోరిక ఉంటే వాళ్ళని చులకనగా చూడ్డం .. ఇదీ నా ఉద్దేశం.

@ రవి .. నిజం
మీరు పేర్కున్న పైనవల, కాలక్షేప ప్రధానమైనదని నా భావన. ప్రజాదరణే గీటురాయిగా తీసుకున్నా, ఆంగ్లంలో వచ్చిన "రిచ్ డేడ్,పూర్ డేడ్", నవల కాదనుకోండి, ఎక్కువ మందిని ప్రభావితం చేసింది.
* * *
ఒకప్పుడు భారతదేశంలో చదువుకున్న మధ్యతరగతిలో ఎక్కువమందికి "బీదతనం" ఒక ఫేషన్. చదువుకి తగని ఉద్యోగం చేయాలంటే నామోషి. అవకాశాలు కూడా తక్కువగా ఉండేవి.
ప్రభుత్వాన్ని దోషిని చేస్తూ(ఆకలిరాజ్యం), త్యాగాల మీద త్యాగాలు చేస్తూ(అంతులేని కధ),కాలక్షేపం నవలలతో (మీరు పేర్కొన్న ప్రభంజనాలో ఒకరివి) ఉపశమనం పొందుతుండే రోజులవి.
* * *
ఇపుడు అవకాశాలు పెరిగాయి. మధ్యతరగతి జీవుల ఆలోచనలూ మారాయి. ఇపుడు చాలా మందికి, "ధనార్జన" ఒక ఫేషన్. స్టాకులు,స్థలాలు, పొలాలు, ఇంటినిండా ఎలెక్ట్రానిక్ వస్తువుల ప్రదర్శన.
* * *
కొందరు అప్పుడు,ఇప్పుడూ కూడా డబ్బు విలువ తెలుకుని, తెలివిగా మసలుకుంటూ, జీవితాల్ని ఫలవంతం చేసుకుంటున్నారని నేను అనుకుంటున్నాను.
తృష్ణ said…
ఈ టపా, వ్యాఖ్యలూ చూస్తుంటే "లక్ష్మీ నివాసం" సిన్మాలోని "ధనమేరా అన్నిటికీ మూలం
ఆ ధనము విలువ తెలుసుకునుటే మానవ ధర్మం.." పాట గుర్తు వచ్చిందండీ..
..nagarjuna.. said…
సరిగా చెప్పారు గురువుగారు.డబ్బనేది మన విలువని కొలుచుకొడానికి మనకు మనం ఏర్పరచుకున్న ఒక సాధనం. దానితో ఏ సమస్య లేదు. సమస్యల్లా ఆ విలువని పెంచుకోడానికి మనం అనుసరించే మార్గాలను,మనస్తత్వావాలని బట్టే