Friday, May 30, 2008

అక్షర ఈగ కుట్టింది

టైటిల్లోని రాక్షస సమాసాన్ని మన్నించండి.

ఆనందమో, విభ్రాంతో, చిన్నపాటి గర్వమో, కొద్దిపాటి విషాదమో తెలియని అయోమయ స్థితిలో ఉన్నాను.
సంగతేంటంటే .. ఇప్పుడే స్పెల్లింగ్ బీ (spelling bee) చూసి వస్తున్నా.

వీళ్ళసలు పిల్లలా, పిడుగులా .. డిక్షనరీలని నమిలి మింగి జీర్ణించేసుకున్న అక్షర రాక్షసులా.

నేను చూడ్డం మొదలు పెట్టేప్పటికి ఫైనల్సులో పదో ఆవృతం జరుగుతోంది. సుమారు పన్నెండు మంది పిల్లలు ఉన్నారు. అందులో కనీసం ఐదుగురు భారతీయ సంతతి వారు (సామియా నవాజ్ పాకిస్తానీ కుటుంబం నించి ఐనా కావచ్చు). దానికే నేను వింత పడుతుండగా .. ఇక మాటలు పలికే ప్రొఫెసరు గారు ఒక్కొక్క మాటా పలకడమూ, ఈ పిల్లకాయలు కాస్త పస్తాయించి, ఇంకొన్ని ప్రశ్నలడిగి, అటూ ఇటూ చూసి, .. ఇంతా చేసి ఏమాత్రం తడబాటు లేకుండా ఆ మాటకి స్పెల్లింగు చెప్పెయ్యడం చూసి విభ్రాంతిలోనే పడిపోయా. నేను చూడ్డం మొదలెట్టిన తరవాత ఒకటి రెండు రౌండ్లు పృఛ్ఛకుడు మాటని పలగ్గానే నేను కళ్ళు మూసుకుని నేనూ ఒక స్పెల్లింగు చెప్పా .. నేను చెప్పిన వాటిల్లో సగానికి సగం తప్పు :-)

అక్కణ్ణించి నేను ప్రయత్నించడం మానేసి, ఈ పిల్ల అక్షర రాక్షసుల ప్రతిభని చూస్తూ, విస్మయం చెందుతూ ఉండిపోయా.

ఎక్కడా కనీ వినీ ఎరగని మారుమూల పదాలకి స్పెల్లింగులు చెప్పడం .. అదలా ఉంచితే .. తమ కుటుంబ సభ్యుల ఎదుట, తదితర అతిథులు, పృఛ్ఛకులు, న్యాయ నిర్నేతల ఎదుట, ముఖ్యంగా తమ ముఖంలో ప్రతి కవళికనీ పట్టుకుని దేశవ్యాప్తంగా ప్రసారం చేసే కెమెరాల ఎదుట నిలబడి, అంతటి వత్తిడిలోనూ ఏ మాత్రం తొణక్కుండా, తాము విజయం సాధించినప్పుడు అతిగా ఉప్పొంగి పోకుండా ఈ పనెండు పధ్నాలుగేళ్ళ పిల్లలు సంయమనంతో వ్యవహరించిన తీరు చూస్తే ఆశ్చర్యంతో ముక్కున వేలేసుకున్నా! ఏదన్నా ఒక మాటకి తప్పు చెప్పడం (ఒక్కోసారి కేవలం ఒక్క అక్షరం తేడా) వల్ల వైదొలగి పోయిన పిల్లలు కూడా ... సహజంగా కోంత నిరుత్సాహ ప్రదర్శన ఉంటుంది, కానీ కంట నీరైనా కనబడనియ్యకుండా పెద్దతరహాగా వ్యవహరించిన తీరు నిజంగా నన్ను విస్మయ పరిచింది. ఇంకో తమాషా, ఈ సారి పోటీలో మొదటి 12 స్థానాలు ఆక్రమించిన పిల్లల్లో ఎక్కువ శాతం ఆంగ్లం మాతృ భాష కాని తలిదండ్రులకి పుట్టినవారు!

చిట్టచివరి రౌండ్ కి మిగిలిన ముగ్గురిలో ఇద్దరు భారతీయ అబ్బాయిలు, ఒక తెల్ల అమ్మాయి. కేలిఫోర్నియా నివాసి, టియా థామస్ .. ప్రతీ ఆవృతంలోనూ .. కొద్దిగా ఆలోచించినా, చాలామట్టుకూ వెనువెంటనే సరైనా జవాబు చెప్పేసి చిలకలా చిరునవ్వు చిందిస్తూ ఉంది. చివర్లో ఆమె తప్పు చెప్పిన మాటేవిటో నాకిప్పుడు గుర్తు లేదు.

మా వూరి (నిజ్జంగా!) బుల్లాడు, సిద్ధార్థ చంద్ .. బొద్దుగా ముద్దుగా ఉన్నాడు .. porsopopeia అన్న మాటలో i మిస్సై, ఛాంపియన్ అయే ఛాన్సు కోల్పోయాడు పాపం. రెండో స్థానం లో నిలిచాడు.

పసుప్పచ్చ టీషర్టు వేసుకుని .. మొదటి రౌండ్లలో యమా సీరియస్సుగా మొహం పెట్టుకున్న ఈ ఇండియానా నివాసి, సమీర్ మిశ్రా .. రౌండ్లు గడుస్తున్న కొద్దీ .. కొద్ది కొద్దిగా ఆత్మవిశ్వాసం కనబరుస్తూ, చిరునవ్వులు రువ్వుతూ, ఆఖరి రౌండ్లో guerdon కి స్పెల్లింగ్ సరిగ్గా చెప్పి ట్రోఫీ గెల్చుకున్నాడు.

నా దృష్టిలో మాత్రం .. ఈ పిల్లలందరూ విజేతలే!
విజేతలకి అభినందనలు.

బత్తీ బంద్ దండోరా - 1

గత రెండు వారాలుగా నా బ్లాగుల్లో బొత్తాల బొత్తిలో
దీపాలు ఆర్పండి
అని ఒక నల్ల బొత్తాన్ని చూసే ఉంటారు. దాని మీద క్లిక్కారో లేదో .. అది మిమ్మల్ని
చీకటిలో .. చీకటితో
అనే బత్తీబంద్ బ్లాగుస్థానుకి చేరుస్థుంది.

వచ్చే నెల 15 వ తేదీ హైదరాబాదు బత్తీ బంద్!మీ కేలండర్లో నమోదు చేసుకోండి.
మీ ఇరుగు పొరుగు వారికీ, కాలనీ లేదా అపార్ట్మెంట్ వాసులకీ తెలియ చెయ్యండి.
మీ బంధు మిత్రులందరికీ చెప్పండి. వేరే రాష్ట్రాల్లో ఉన్న వారికి కూడా!
మీరు వ్యక్తిగతంగానో, కుటుంబంతో కలిసో ఆ గంట సేపూ ఏం చెయ్యబోతున్నారో ముందుగానే ప్రణాళిక వేసుకోండి.
మీకు కనక బ్లాగుంటే (ఏ భాషలో అయినా సరే) దీన్ని గురించి ఒక పోస్టు రాయండి.

నా విన్నపాన్ని మన్నించి (అదే లేండి, నా పోరు పడలేక) పలువురు బ్లాగ్ప్రముఖులు ఈ విషయమై టపాలు రాశారు. కొన్ని వినోద భరితమైనవి. కొన్ని విశ్లేషణాత్మకమైనవి. మరి కొన్ని ఆలోచన రగిలిస్తే ఇంకొన్ని కర్తవ్యం గుర్తు చేసి కార్యోన్ముఖుల్ని చేస్తున్నాయి.
ఓ లుక్కెయ్యండి. ఆ పైన కొంచెం దీన్ని గురించి ఆలోచించండి. కనీసం ఇంకొక్కరితో దీన్ని గురించి మాట్లాడండి.

ఇప్పటివరకూ ప్రచురితమైనవి.

జ్యోతి గారి సరూపక్క ముచ్చట్లు
మనలోమాట రమణి గారి చీకటిలో వెన్నెల వెలుగులు
పర్ణశాల మహేశ్ గారు ఉవాచ
తెలుగు తూలిక మాలతి గారి ఎన్నెం కత
నాగమురళి గారి శంఖారావం
సాహితీయానం బొల్లోజు బాబా గారి చిక్కని కవిత
వాగ్విలాసం రాఘవ గారి మండిపాటు
తప్పటడుగుల గిరి గారి విశ్లేషణ
జోరుగా హుషారుగా శ్రీకాంత్ గారి ఆత్మ పరిశీలన
వికటకవి శ్రీనివాస్ గారి ప్రశ్నలు
రానారె గారి సణుగుడు
సంగతులూ సందర్భాల శ్రీరాం గారు
మానసవీణ నిషిగంధ గారి నేను సైతం

త్వరలో .. తాడేపల్లి లలితా బాల సుబ్రహ్మణ్యం గారు, సరూపక్క చెల్లెలు యెన్నెల, కొల్లూరి సోమ శంకర్ గారు, ఇంకా ...

ఖవ్వాలీ భక్తి సంగీతం

ఏ సమయంలో ఈ వింత సంగీతం నాకు పరిచయమైందో ఇప్పుడు సరిగ్గా చెప్పలేను. బహుశా ఆర్యీసీలో చదివే రోజుల్లో తొలి పరిచయం అయ్యుండొచ్చు. ఆర్యీసీ వెనక ఆ ప్రాంతాల్లో చాలా ప్రసిద్ధికెక్కిన కాజీపేట దర్గా ఉంది. డిశెంబరు ప్రాంతంలో ఆ దర్గా ఉర్స్ ఉత్సవం జరుగుతుంది. మూడు రోజులు, పగలూ రాత్రీ ఆ ప్రాంతమంతా మేల్కొని భక్త్యావేశంతో ఉర్రూతలూగేది. పేరుపొందిన ఖవ్వాల్ గాయక బృందాలు పోటాపోటీగా పాడేవి రాత్రి బాగా పొద్దుపోయేదాకా. అఫ్కోర్సు, ఆ కాలంలో మా ధ్యాస మబ్బు తెరల్ని చీల్చుకుని వచ్చే వెన్నెల చూపుల మీద ఎక్కువగా ఉండేదనుకోండి, అది వేరే విషయం.

అమెరికా వచ్చాక 1995-96 ప్రాంతంలో డెడ్ మేన్ వాకింగ్ అనే ఒక విచిత్రమైన సినిమా చూశాను. అందులో కొన్ని సన్నివేశాల్లో నేపథ్య సంగీతంలో వినిపించే ఒక గాయకుని పాట భారతీయ ఛాయ కలదిగా అనిపించింది. అది పాడింది నుస్రత్ ఫతే అలీఖాన్ అనీ, అతను పేరు మోసిన ఖవ్వాలీ గాయకుడనీ తెలిసింది. అవకాశం దొరికినప్పుడల్లా అతన్ని గురించీ, ఈ సంగీతం గురించీ తెలుసుకోడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నా.

ఏనార్బరులో మిషిగన్ విశ్వవిద్యాలయ సంగీత కళాశాల వారి సంగీత భాండాగారంలో ఎన్నో గొప్ప సంగీతాలు విని తరించే భాగ్యం కలిగింది. అక్కడే మొదటిసారి నుస్రత్ పాడిన పూర్తి ఖవ్వాలీల రికార్డులు బాగా విన్నాను. ఇలాగే వెతుకుతుంటే సాబ్రీ సోదరుల గాత్రం పరిచయమైంది. అక్కణ్ణించీ .. ఆ సోదరుల గొంతులో ఉన్న ఏదో సమ్మోహనాస్త్రం నన్ను కట్టి పడేసింది. ఎలా సంపాయించానో ఇప్పుడు గుర్తు లేదు గానీ మొత్తానికి వాళ్ళు పాడిన ఖవ్వాలీల రెండు కేసెట్లు కూడా సంపాదించాను. అందులో షాబాజ్ కలందర్ అనే పాట నాకు మరీ ఇష్టం. నా దగ్గర ఉన్న కేసెట్లో బాగా విపులంగా సుమారు పదిహేను నిమిషాల పాటు పాడారు ఈ పాట. నాకు ఆ పాట విన్నప్పుడల్లా మనసు తెలియని ఉత్సాహంతో పరవశిస్తుంది. ఉన్నపళాన లేచి తాండవం చెయ్యాలనిపిస్తుంది.

ఒక విధంగా ఈ సూఫీ సంగీతపు పరమార్ధం అదే కూడా. టర్కీ ప్రాంతాల్లో whirling dervishes, ఇంకా తూర్పు ప్రాంతాల్లో ఢమాల్ అనే ఒక భక్తి పారవశ్యం (మన భాషలో చెప్పాలంటే పూనకం), ఈ నృత్యం లాంటి కదలిక ద్వారా దైవికాంశకి దగ్గరవుతున్న అనుభూతి!

యూట్యూబ్ పుణ్యమా అని సాబ్రీ సోదరుల అనేక ప్రత్యక్ష ప్రదర్శనల విడియో చూసే అదృష్టం కలిగింది. వీటిని నిన్ననే గమనించాను. మీరూ రుచి చూడండి. నచ్చితే ఆనందించండి.

షాబాజ్ కలందర్

పియా ఘర్ ఆయా

ఆ రెండో పాటలో విడియోలో కనిపించే ఆంగ్ల తర్జుమా మీద ప్రత్యేక దృష్టి పెట్టండి. ఆ కవిత్వం లోని మధుర భక్తి భావం అద్భుతం అనిపించింది నాకైతే. ఆ భావం వారి గానంలో ప్రాణం పోసుకుని సజీవ ప్రకంపనలతో మన మనసుల్లోకి ప్రవహిస్తుంది.

షాబాజ్ కలందర్ గురించి వికీ వ్యాసం.

Sunday, May 25, 2008

భలే మంచి రోజు

రేపు అమెరికాలో ఒక ప్రత్యేకమైన రోజు. మెమోరియల్ డే అంటారు. జ్ఞాపకాల రోజు .. గుర్తు చేసుకునే రోజు.

చాలామందికి ఇది కేవలం ఇంకో సెలవురోజు. కొంతమందికి పొడుగు వారాంతపు రోజు .. ఎప్పుడూ మే నెల చివరి సోమవారం నాడే జరుపుకుంటారు. కొద్దిమందికి కాలి జోళ్ళ దగ్గిర్నించీ మోటరు కార్ల దాకా సకల వస్తువులూ "సేల్" లో దొరికే రోజు.

అసలు విషయం .. అమెరికా కోసం యుద్ధంలో ప్రాణాలర్పించిన సైనికులని గుర్తు చేసుకోవటానికి నిర్దేశించిన రోజిది.

ఎన్ని యుద్ధాలు .. మొదట స్వాతంత్ర్య సమరం .. అటుపైన సివిల్ వార్ .. మొదటి ప్రపంచ యుద్ధం .. రెండో ప్రపంచ యుద్ధం .. కొరియన్ వార్ .. వియెత్నాం వార్ .. ఆపరేషన్ డెజెర్ట్ స్టార్మ్ .. 2003 లో ఇరాక్ ఆక్రమణ .. ఇంకా రగులుతున్న రావణ కాష్టం ..

పోయినోళ్ళందరూ మంచోళ్ళు .. వాళ్ళనేమీ అంటవు. మిగిలి ఉన్న వారికే .. జ్ఞాపకాలైనా .. కోరికలైనా. యుద్ధ భూమి మీద బుల్లెట్ గాయం తగిలి .. బాంబర్ విమానం కూలిపోయి .. యుద్ధ నౌకని సబ్మరిన్ ముంచేసి .. మృత్యువుదేముంది, చిటికేసి పిలిస్తే .. ఒక్కోసారి పిలవకుండానే వస్తుంది. ఆ పోయినవాడు ధైర్యసాహసాల్తో పోరాడుతూ పోయాడని సర్ది చెప్పుకుంటాం .. మన ఆత్మ తృప్తికోసం.

ఒక మనిషిలో ఎంతో మెచ్చుకోవలసిన, ఆరాధించదగిన గుణాలు .. ధైర్యం, సాహసం .. ఇంత గొప్ప గుణాలూ, మానవ చరిత్రకే కళంకం తెచ్చే యుద్ధమనే అతి జుగుప్సాకరమైన ప్రక్రియలోనే గుర్తింపుకి రావడం .. మానవులుగా మనందరం నిజంగా సిగ్గుతో తలదించుకోవలసిన విషయం కాదూ? ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వ కారణం ..

ఈ జ్ఞాపకాల రోజున ఒక ప్రతిజ్ఞ చేద్దాం. రేపు, ఎల్లుండి, పదేళ్ళ తరవాత .. సైనికులై అకాల మృత్యువు వాత పడకుండా .. మన పిల్లల్ని బతికించుకుందాం. యుద్ధం అవసరం లేకుండా చేద్దాం. అది సాధించిన రోజు .. అదీ నిజంగా గుర్తుంచుకో దగిన రోజు. భలే మంచి రోజు.
***
ఈ టపాకి ప్రేరణ ఈ రోజు CBSలో సీనియర్ జర్నలిస్ట్ ఏండీ రూనీ వ్యాఖ్య.

Saturday, May 10, 2008

ప్రోత్సాహం

ఏదో DRDO ప్రయోగశాలలో పనిచేసే ఒక యువ పరిశోధకురాలు ఏదో కొంచెం పనికొచ్చే డిస్కవరీ ఏదన్నా చేశారనుకోండి. అకస్మాత్తుగా అబ్దుల్ కలాం గారి దగ్గిర్నించి ఫోనొస్తే ఎలా ఉంటుంది?

ఏదో సినిమాలో ఏదో చిన్న పాత్రలో .. తనకున్న పరిధి బహు కొద్దే అయినా .. తన ప్రతిభ కనబరుస్తూ ఒక నటి అద్భుతంగా నటించింది అనుకోంది. అథాట్టున చిరంజీవి గారి దగ్గర్నించి ఆమెకి ఫోనొస్తే ఎలా ఉంటుంది?

కానీ మీకూ తెలుసు, నాకూ తెలుసు, నిజ జీవితంలో ఇవి జరిగేవి కావని.

ఒక ఫీల్డులో ఆయన ఒక దిగ్గజం .. అదే ఫీల్డులో ఆమె ఇంకా తప్పటడుగులు వేస్తున్న చిన్నారి. ఐనా ఆమెలో ప్రతిభ గుర్తించి, ఆమెని వెదికి పట్టుకుని, ఫోన్ చేసి మాట్లాడి, అది చాలక, తానే పని గట్టుకుని వారింటికి వెళ్ళి ఆమెని ప్రోత్సహించిన వైనం .. నాకైతే చదువుతుంటే గొంతు చిక్కబట్టింది.

కారా మాష్టారూ, మీ పెద్ద మనసుకి వినమ్రంగా టోపీలు తీసేశాం!

మనం అబ్దుల్ కలాములూ, చిరంజీవులూ, కారా మేష్టార్లూ కానక్కర్లేదు మన తోటి వారిలో ప్రతిభని గుర్తించి ప్రోత్సహించడానికి!!

Syriana

2005 లో విడుదలైన ఈ సినిమా చాలా గొప్ప రాజకీయ చిత్రం అని వినీ వినీ చాన్నాళ్ళుగా చూద్దామనుకుంటూ ఉన్నాను. థియెటర్లలో చూడ్డం కుదర్లేదు. డిస్కులో విడుదల అయిన తరవాత ఒకసారి అద్దెకి తెచ్చాను గానీ చూడ్డం కుదరకుండానే తిరిగి ఇచ్చేశాను. మొత్తానికి నిన్న చూడ్డం కుదిరింది. చూసిన దగ్గిర్నించీ లోపల ఏదో తెలియని అశాంతి. తమాషా ఏంటంటే సినిమా నాకు పూర్తిగా అర్ధం కూడా కాలేదు.

సినిమాలో ఒక ముఖ్య పాత్ర పోషించిన జార్జ్ క్లూనీ, మంచి నటుడిగానే కాక అనేక ప్రపంచ రాజకీయోద్యమాల పట్ల సానుభూతి పరునిగా పేరు పొందినవాడు. ముఖ్యంగా ఇటీవల సూడాన్ లో దారుణ మారణ హోమం జెరుగుతున్న డార్ఫుర్ ప్రాంతం గురించి అమెరికాలోనూ, ప్రపంచ వ్యాప్తంగానూ అవగాహన పెంపొందించడానికి కృషి చేస్తున్న వ్యక్తి. ఇంకొక ప్రధాన పాత్ర పోషించిన మాట్ డేమన్ ఆ రోజుల్లో నేను బాగా అభిమానించిన నటుడు. పైగా ఈ సినిమా తీసింది స్టీఫెన్ గగన్ అనే దర్శకుడు. ఇతడు ఇదివరలో అమెరికాలో మాదక ద్రవ్యాల పంపిణీ గురించి తీసిన సినిమా ట్రాఫిక్ నాకు చాలా నచ్చిన సినిమాల్లో ఒకటి. ఈ అన్ని కారణాల వల్లా ఈ సినిమా చూడలనే కోరిక చాలా బలంగా ఏర్పడింది నాలో.

చాలా ఓపిగ్గా వొళ్ళు దగ్గిర పెట్టుకుని, ఒక్క డయలాగు, ఒక్క ఫ్రేము మిస్సవకుండా చాలా జాగ్రత్తగా చూశాను అక్కడికీ. ఐనా నాకు అర్ధం కాలేదు. మొత్తానికి చాలా కాంప్లికేటెడ్ కథని చాలా క్లుప్తంగా చెప్పటానికి ప్రయత్నించి దర్శకుడు పప్పులో కాలేశాడేమో అనుకోక తప్పలేదు. దీన్నొక 10 - 12 ఎపిసోడ్ల టీవీ సినిమాగా మలచి ఉంటే అప్పుడేవన్నా ప్రయోజనం ఉండేదేమో. సిస్టీన్ ఛాపెల్ పై కప్పు మీద చిత్రించాల్సిన చిత్రాన్ని జేబు రుమాలు మీద చిత్రిస్తానంటే కుదరదు కదా!

అసలు ముందు సినిమా పేరే అర్ధం కాలేదు, సినిమా గురించిన వికీ పేజి చదివేవరకూ. ట్రాఫిక్ సినిమాలోనే తెలుస్తుంది ఈ దర్శకునికి అనేక సమాంతర కథల పాయల్ని పేనడం అంటే ఆసక్తి అని. ఐతే ట్రాఫిక్ లో కుదిరినట్టు ఇక్కడ కుదర్లేదు. పైపెచ్చు సినిమా నిడివి వంటి అంశాలని దృష్టిలో పెట్టుకుని మొత్తమ్మీద అవసరానికి మించి కత్తిరింపులు వేశారేమో ననిపించింది. మొత్తానికి చమురు రాజకీయాలు మన జీవితాల్ని ఎలా శాసిస్తున్నాయో చెప్పడం ఈ సినిమా ముఖ్యోద్దేశం అనిపించింది. ప్రస్తుతం అమెరికా నలుమూలలా పెట్రోలు బంకుల్లో గేలను పెట్రోలు మూడు డాలర్ల ముప్పావలాకి తక్కువ లేదు. ఈ వేసవిలో నాలుగు డాలర్లు దాటుతుందని అందరు పండితులూ ఘోషిస్తున్నారు. (గేలను ఒక డాలరు కంటే తక్కువకి అమ్మడం నాకు పరిచయమే!) చమురు కంపెనీలు కనీ వినీ ఎరుగని లాభాల్ని ప్రకటిసున్నాయి గత రెండేళ్ళుగా. ఒక పక్కన ప్రజలు "హబ్బా, ఏవిటీ ధరలు!" అని అల్లలాడుతూనే .. మరో పక్క తమ డ్రైవింగ్ అలవాట్లని ఏమాత్రం మార్చుకున్నట్టు కనబట్టల్లేదు. ఏమాత్రం హృదయం ఉన్న వారైనా, ప్రపంచాన్ని గురించి, భవిష్యత్తుని గురించీ ఏమాత్రం ఆలోచించే వారైనా ఈ సినిమా చూశాక ఇదివరికటిలా పెట్రోలు దాహం పుచ్చుకుంటారు అనుకోను.

కథలో వేర్వేరు పాయలు ఇవి.
రాబర్ట్ బార్న్స్ (క్లూనీ) CIA ఏజెంటు ఇరాన్ లో ఆయుధాల స్మగ్లర్లని గుర్తించి మట్టుబెడుతూ ఉంటాడు. ఈ పనిలో ఒక మిసైల్ అతని కళ్ళ ముందునించే మాయం అవుతుంది.
బ్రయన్ వుడ్మేన్ (డేమన్) గెనీవాలో ఒక ఎనెర్జీ కంసల్టింగ్ కంపెనీలో ఎగ్జెక్యూటివ్. ఒక అరబిక్ ఎమిరేట్ కి వారసుడైన రాకుమారునికి ఆంతరంగిక సలహాదారుడౌతాడు కొన్ని యాదృఛ్ఛిక సాంఘటనల వలన.
ఆ రాకుమారుని దేశం కొత్త చమురు పరిశోధనలకి కాంట్రాక్టు చైనీయ కంపెనీకి ఇస్తుంది, అమెరికను కంపెనీని కాదని. ఆ మార్పిడిలో అమెరికను కంపెనీ యాజమాన్యం కింద పనిచేస్తున్న పలువురు పాకిస్తానీ యువకులు ఉద్యోగం కోల్పోతారు.
కాంట్రాక్తు కోల్పోయిన అమెరికను కంపెనీ, తమ స్థానం నిలబెట్టుకోడానికి ఇంకొక అమెరికన్ చమురు కంపినీతో కలుస్తుంది.
ఈ కంపెనీల కళ్యాణం అమెరికను ప్రభుత్వపు జస్టిస్ డిపార్టుమెంటుకి ఇష్టం ఉండదు. ఇందులో ఏమి గూడుపుఠాణీ ఉందోనని అన్వేషించడానికి ఒక కుర్రలాయరుని నియమిస్తారు.
ఈ కుర్రలాయరు తన గురువునే ఆ న్యాయసంస్థానపు కత్తికి యెరవేసి కంపెనీల కళ్యాణం నిర్విఘ్నంగా జరిగేట్టు చూస్తాడు. ఒకటిగా అవతరించిన ఈ మహా కంపెనీ, చైనాకి కాంట్రాక్టునిచ్చి తన దేశాన్ని ఏదీ ఉద్ధరించాలని చూసే రాకుమారుణ్ణి అమెరికను ప్రభుత్వ సహాయంతో) హత్య చేయించి, అతని తమ్ముణ్ణి గద్దె ఎక్కించి, తిరిగి తమ చమురు హక్కులు సంపాయించింది.
ముందు ఉద్యోగం పోగొట్టుకున్న పాకిస్తానీ యువకులు మనుగడ కోసం ముస్లిము మదరసాలో చేరి ప్రభావితులై, ఆత్మార్పణ దాడిలో, మొదటి సీనులో రాబర్ట్ బార్న్స్ నించి దొంగిలించ బడిన అమెరికను మిసైల్ తోనే ఈ పెద్ద చమురు కంపెనీ టాంకరు పైన దాడి చేశారు.

నాకు అర్ధమైనంతలో సినిమాలో కీలకమైన సందేశం ఇదే! నల్ల కుర్రలాయరుకి ప్రబోధం చేశే తోటి ఉద్యోగి, తన మాటల్లో .. ఫ్రీమార్కెట్ ప్రబోధకుడూ, నోబెల్ గ్రహీత మిల్టన్ ఫ్రీడ్మన్ పేరుని నంజుకోడం గొప్ప చిత్రణ అనిపించింది నాకు.


చాలా కలచివేసే కథ, చాలా ఆలోచింప చేసే కథ అనడంలో ఏమీ సందేహం లేదు. మన పురాణాల్లో లాగానే వీడే చెడ్డోడు, వీడే మంచోడు అని చెప్పడానికి లేదు .. అంతటా పరుచుకున్న గ్రే రంగు ఛాయలే, అంతటా నీడలే. ఏ ఏక్టరు ఎలా చేశారో అంచనా వెయ్యడం గూడా కష్టమే. తారలైన క్లూనీ, డేమన్ అలా ఉండగా ఒకనాటి రొమాంటిక్ హీరో క్రిస్టొఫర్ ప్లమర్ (సౌండ్ ఆఫ్ మ్యూజిక్) ఇందులో ఒక గుంటనక్క లాంటి పాత్రలో, అమెరికన్ బ్యూటీలో గేఫోబిక్ కర్నల్ గా నటించిన క్రిస్ కూపర్ స్వలాభం కోసం సోంత తల్లినైనా అమ్మెయ్యడానికి సంకోచించని చమురు కంపెనీ అధినేతగానూ, సూడానీస్ తండ్రికీ బ్రిటీష్ తల్లికీ పుట్టిన నటుడు అలెక్జాండర్ సిద్దిగ్ రాకుమారుడు నసీర్ గానూ మనల్ని ఆకట్టుకుంటారు. అంత శ్రద్ధగా చూసినా సినిమా అర్ధం కానట్టుగా మిగిలి పోవడం ఒక పక్కన చిరాకు తెప్పిస్తుంటే .. ఇంకో పక్కన ఇంకో ఆలోచన వచ్చింది. ఈ సినిమా చూస్తే ప్రేక్షకులకి మిగిలే కంఫ్యూషను కూడా ఒక మెటఫర్ యేమోనని!

Tuesday, May 6, 2008

షేర్ ఆటొ కథ - కమామిషు

ఈ టపా తొలి ముద్రణలో ఒక పొరపాటు జరిగింది. ఒక కథని మరిచాను. ఇప్పుడు సవరించాను.
మొత్తం పది కథలు వొచ్చాయి. మనలోమాట రమణి, ఒనమాలు లలిత, దైవానిక శ్రీకాంత్, మయూఖ లలితాస్రవంతి తమ బ్లాగుల్లో ప్రచురించారు. నా మదిలో .. ప్రవీణ్ గార్లపాటి, గడ్డి పూలు సుజాతా పాత్రో, సౌమ్య రైట్స్ సౌమ్య, రాజారావు తాడిమేటి, నివేదన రమ్య, జ్యోతి వలబోజు నాకు మెయిల్లో పంపారు. ఇందులో ఈమాట మేనెల సంచికలో రాజారావు, రమ్య గార్ల కథలు వచ్చాయి.

అన్ని కథల్లోనూ కొన్ని కొన్ని కామన్ లక్షణాలు లేకపోలేదు. చాలా కథల్లో ఆ చిన్నపిల్ల చేసే ఏదో పిల్ల చేష్టకి తల్లి "ఉరిమి" చూడ్డాన్ని చిత్రించారు. హీరో మహేష్ బాబు ప్రసక్తి కూడ బాగా తరచుగానే వినబడింది. పాత్రల వర్ణనలు ఇంచుమించుగా అందరూ ఒకేలా చేశారు - అఫ్కోర్సు, కథకి ఇచ్చిన ఇతివృత్తం అదే కావటం వల్ల కావచ్చు అనుకోండి. కామన్ గా ఉన్న లక్షణాలు ఇంతవరకే.

నాకు మహా సంబరం కలిగేట్టు అందరూ తలో దారీ తొక్కారు పాత్రల మన్సతత్వ చిత్రణలోనూ, కథని నడిపించటంలోనూ.

ABCDEFG - రమణి
ముగ్గురు హీరోయిన్లూ, ఆటో ఛేజ్, పాఠకుల్ని ఉత్కంఠతో ఉర్రూతలూపే సస్పెన్సు, చివరాఖరికి మనసుల్ని ద్రవీభవింపజేసే కరుణ రసాత్మకమైన ముగింపుతో రమణి గారు ఒక మంచి తెలుగు సినిమాకి కావల్సిన సరంజామాని సిద్ధం చేశారు తన కథలో. సినిమా కథ అంటే ఏమీ చులకన కానక్కర్లేదు. పాఠక ప్రేక్షకుల్ని రంజింప జెయ్యటానికి ఎంతో సృజనశక్తి కావాలి. ఐతే, తనే ఫస్టు ప్రచురించాలి అనే తొందరో మరేవిటో గానీ మరీ హడావుడిగా జరిగిపోయింది కథనం. రక్తి కట్టించడనికి అవసరమైన హంగులన్నీ కహలోనే ఉన్నాయి. ఇంకాస్త ఓపిక పట్టి, శ్రద్ధ తీసుకుని పాత్రల్నీ, సంఘటనల్నీ మలిచి ఉంటే ఈ కథ జనరంజకమయ్యేది అనడంలో సందేహం లేదు. హీరో ఒక్కడికి తప్పించి ఆటోలోని మిగతా ప్రయాణీకులకి చెప్పుకోదగ్గ పాత్ర యేదీ లేదు. కాగా వీరొక్కరే ఇతివృత్తంలో లేని పాప, పాప తల్లి, కిడ్నాప్ గేంగ్ ని ప్రవేశ పెట్టి ఆసక్తికరమైన మలుపునిచ్చారు.

ఇబ్బంది - లలిత
ఎక్కడా అపశృతి దొర్లనివ్వకుండా ఆద్యంతమూ ఒక చిలిపి ఆహ్లాద కరమైన వాతావరణంలో కథ నడిపించారు లలిత. సాధారణంగా తమ కొంటె చేష్టలతో ఆడపిల్లల్ని అల్లరి చేసే కాలేజి కుర్రాడే ఒక వింత పరిస్థితిలో చిక్కుకుని తానే ఇబ్బందిగా ఫీలయినట్టు ముచ్చటైన మలుపు తిప్పి ముగించారు. ఈ నాటి సాంఘిక వాతావరణానికి తగినట్టు సెల్ ఫోన్‌లో రింగ్ టోన్ ని కథకి కీలకంగా ఉపయోగించుకోవటం కూడ బావుంది. ఐతే ఈ కథ కూడా ఒక స్కెచ్ లాగా మిగిలిపోయింది, తగినంత డీటెయిల్ నింపే ప్రయత్నం చెయ్యక పోవడంతో. షేర్ ఆటోలోని మిగతా ప్రయాణీకులందరూ అప్పుడూ అప్పుడూ ఓ మాట అనడంతో వాళ్ళ పనై పోయింది. కాలేజ్ స్టూడెంటు ప్రవర్తన వల్ల ఆటోలోని పడుచు పిల్ల ఇబ్బంది పడ్డ సూచన ఏదీ లేదు కథలో. ముందు తానే మిగతా వారిని ఇబ్బంది పెట్టి, చివరకి తన సెల్ ఫోన్ వల్ల తనే ఇబంది పడ్డట్టు, అవసరమైన సిచ్యువేషనల్ డీటెయిల్ చిత్రిస్తూ చెప్పి ఉంటే కథ ఇంకా రక్తి కట్టి ఉండేది.
జీవన తరంగాలు - శ్రీకాంత్ (దైవానిక)
ఫేంటసీ సాహిత్యాన్ని బాగా ఇష్టపడే నూతన బ్లాగరి శ్రీకాంత్ ఈ కథతో చెయ్యి తడి చేసుకున్నారు. ఉదాత్తమైన సంఘటనలనీ, మానవ హృదయంలోని లోతుల్ని ఆవిష్కరించ ప్రయత్నించారు కానీ పాత్ర చిత్రణకి అవసరమైన నేపథ్యం కొరవడి, కథలో జరిగిన సంఘటనలు తెచ్చి పెట్టుకున్నట్టుగా మిగిలాయి. మొదటినించీ ప్రథమ పురుషలో సాగుతున్న కథనంలో ఉన్నట్టుండి "అనుకుంటా" అంటూ రెండు చోట్ల యువకుడైన మయూర్ తరపున వకాల్తా పుచ్చుకుంటాడు కతకుడు. రైలు పెట్టెలో ఎక్కి కూర్చున్న హీరో మనసులో ఆలోచనలుగా మొదలైన కథ, తిరిగి మళ్ళీ హీరో దగ్గిరికి చేరకుండానే ముగిసిపోయింది. అస్పష్టత ఉండటమే నేరం కాదు గానీ, తిన్ననైన కథనంలో కోరి అస్పష్టతని తెచ్చుకున్నప్పుడు దానికేవన్నా నిర్దిష్టమైన ప్రయోజనం ఉన్నప్పుడే అది రాణిస్తుంది.

శుభారంభం - సుజాత
కథా సందర్భానికీ పాత్రలకీ తగిన నేపథ్యాన్ని చక్కగా వర్ణించారు. ఎండ తీవ్రతని చెబుతూ ఆటోలో ఆ పేద కుటుంబం తమ గోనె సంచీ అంతా వెదికి నీళ్ళ బాటిల్ని పట్టుకుని, సేదతీరే దృశ్యాన్న్ కళ్ళకు కట్టినట్టు వర్ణించారు. ఆ పడుచు పిల్లని యువకుడు మొదట్లో చూసే చూపులోనూ, చివరికి ఆటో దిగిపోయాక చూసే చూపులోనూ ఉండే తేడాతో అతని వ్యక్తిత్వంలో కలిగిన మార్పుని హృద్యంగా పట్టుకున్నారు. భాష వాడుకలో చాలా జాగ్రత్త వహించాలి. చాలా చోట్ల అవసరానికి మించిన గంభీరమైన పదబంధాల్ని ఉపయోగించారు. కథకి తగిన ముగింపు. కొద్దిగా చిత్రిక పడితే ఇంకా మెరిసేదేమో అనుకోకుండా ఉండలేక పోతున్నాను.

మానవత్వం - జ్యోతి వలబోజు
కథకి కావలసిన వాతావరణ నేపథ్యాన్నీ, పాత్రల నేపథ్యాన్నీ పట్టించుకుని కథలో ప్రకటించే ప్రయత్నం బాగా చేశారు. కథలో ఏం చెప్పాలి అనీ, ఎలా చెప్పాలి అనీ బాగా ఆలోచించినట్టు కనిపిస్తోంది. తొలి కథ మీద మంచి పరిణతి కనిపిస్తోంది. తమ తమ బాధల్లో ఆలోచనల్లో మునిగి ఉన్న వివిధ పాత్రలు ఇంకొకరికి ప్రాణాపాయం మీదికి వచ్చిందనంగానే తమ చింతల్ని మరిచి పోయి ఆ మనిషికి ప్రాణం పొయ్యడనికి మూందంఅ వేసినట్లు చూపెట్టడం మంచి మానవతకి గుర్తు. ఐతే ముగింపు నీతి కథల ముగింపులాగా ఉంది. మరి కాస్త ప్రయత్నిస్తే వాస్తవికత నిండిన కథలు రాయగలరు.

ప్రవీణ్ కథనం
వైవిధ్య భరితమైన టపాల్ని అలవోకగా వెలయిస్తూ ఇటీవల బ్లాగు పుస్తక నిర్మాణంతో సంకలనకర్తగా అవతరించిన ప్రవీణ్ దీనితో కథా రచయితగా రంగ ప్రవేశం చేసి ఇంకో వీరతాడు మెడకెత్తుకున్నారు. జేజేలు. అభినందించదగిన ప్రయత్నం. నిజజీవిత నాటకానికి దగ్గరగా ఉంది మీ కథా గమనం. కానీ ప్రవీణ్, ఈ కథ చదివాకా .. మీరెప్పుడూ షేర్ ఆటో ఎక్కలేదని మాత్రం చెప్పగలను :-)

సౌమ్య కథనం
మామూలుగానే సౌమ్య కథల్లో హఠాత్తుగా జనాలకి జ్ఞానోదయమయ్యే లాంటి సంఘటనలు ఉండవు. ఈ కథలో కూడా జన జీవన్ స్రవంతిలోని ఒక పాయని ప్రత్యక్షం చేశారు. కాకపోతే, కథ జరిగినంత సేపూ ఏదో జరుగుతుందేమోనని పాఠకుల్లో రేగే ఉత్కంఠకి ఓదార్పు దొరక్క పోవడంతో నీరసం వస్తుంది.

శ్రమయేవ జయతే - లలితా స్రవంతి
విలక్షణమైన ఆలోచన చేసి, ఆటోనే కథలో ఒక పాత్రని చేసి, ఆత్మ కథలాగా చెప్పించడం మంచి ప్రయోగం. ఆటోకి మనసుంటుందా, అది మాట్లాడుతుందా .. అంటే? ఉండకూడదని మాత్రం ఏముంది? కథ అన్నాక అది ఒక సృజనాత్మక ప్రక్రియ కదా! లేనిది ఉన్నట్టు చూపడం కూడా అందులో భాగమే. చదువు మానసిక వికాసానికే గానీ కేవలం జీవనోపాధికోసం కాదనీ, జీవనోపాధికి నిజాయితీ గల ఏ వృత్తి అయినా గౌరవ ప్రదమేననే మంచి సందేశాన్ని, ఆర్ద్రంగా చెప్పారు.

అంతర్మథనం - రాజారావు
పూర్తిగా యువకుడి పాత్ర దృష్టిలో, అతని మనోభావాల చిత్రణగా సాగిన కథనం. ఇంచుమించు చైతన్య స్రవంతిలాగా ఎక్కడా బిగి సడలకుండా నడిపించారు. యువకుణ్ణే కాక మిగిలిన పాత్రలకి కూడా తగినంత ప్రాముఖ్యత కల్పిస్తూ, వారి వారి వేష భాషల్ని చక్కగా చిత్రించారు. చివర్లో జరిగే మలుపుతో, ఓ.హెన్రీ కథల్లాగా, మానవత్వమే మనలో మెరిసే మరుగు పడని రత్నం అని చాటి చెపుతూ కథ ముగించారు.

అటో - ఇటో - రమ్య
ఈ కథ చదువుతుంటే పకడైన స్క్రీన్ ప్లేతో ప్రతిభ గల దర్శకుడు తీసిన ఒక లఘు చిత్రం చూసిన అనుభూతి కలిగింది నాకు. రచయిత్రి దృష్టి లాంగ్ షాట్ తో మొదలై, మీడియం కి వచ్చి, అప్పుడప్పుడూ ఆయా పాత్రల మీద క్లోజప్ గా ఫోకస్ చేస్తూ .. మనల్ని ఆ ఆటో వెంబడే పరుగులు తీయించారు. ఆటోలో ఉన్న ఆరుగురు వ్యక్తులే కాక, రాజేంద్రనగర్ నించీ మెహిదీపట్నం చేరే దాకా మధ్యలో తగిలే అనేక సెంటర్లు కూడా కథలో భాగం పంచుకుని సజీవమై నిలిచాయి. ప్రతి ఒక్క సన్నివేశంలోనూ పాత్రల మనోభావాలని సందర్భోచితంగా పట్టుకోడానికి రచయిత్రి చూపిన శ్రద్ధ కనిపిస్తుంది. ముగింపు సంఘటన ఆశ నిరాశల మధ్య పెండ్యులంలా ఊగుతూ, నిజమింతే కదా అని ఆశ్చర్యంతో ముక్కున వేలేయిస్తుంది.

ఈ సారి కూడా విజేత రమ్య గారే.
రాజారావు, లలితాస్రవంతి గార్ల కథలు కూడా నాకు బాగా నచ్చాయి. అంచేత వారిద్దరికీ కూడా ఈ సారికి ప్రోత్సాహక బహుమతి ఇవ్వాలనుకుంటున్నాను.

విజేతలకి అభినందనలు. ఈ పాత టపాలో నాకు బాగా నచ్చిన నాలుగు పుస్తకాలకి లింకులు ఉన్నాయి. అవి చూసి ఒకటి యెంచుకుని మీ యెంపికని నాకు మెయిల్లో తెలియబరిస్తే, ఆ పుస్తకం మీకు అందే ఏర్పాటు చేస్తాను.

ఉత్సాహంతో ముందుకొచ్చి పాల్గొన్న వారందరికీ పేరు పేరునా నా ధన్యవాదాలు. ఈ తడవ తొలిసారి రచయితలైన రాజారావు, ప్రవీణ్, శ్రీకాంత్, సుజాత గారలకి ప్రత్యేక అభినందనలు.

ఇక్కడ ఒక విచిత్ర వ్యక్తిని (పునః) పరిచయం చేస్తాను. మొదట ఇచ్చిన ఇతివృత్తం తెల్లకాయితం మీద ఒక కథ పరిశీలనకి వచ్చింది. చదివి, రాసినాయనతో, కథ బానే ఉంది గానీ ఇందులో తెల్ల కాయితం ఎక్కడా పెద్దగా కనబట్టల్లేదే అన్నా. "జరుగుతున్నది కబడ్డీ పోటీ కాగా, కుస్తీ బాగా సాధనచేసి వచ్చాడట ఒకడు. బరిలో దిగడం ఆలస్యం ఔట్ అయిపోయాడు. అలా నా కథ కూడా మెడ పట్టి బయటకు నెట్టబడింది. మన సచివాలయం ఎదురుగా ఆర్భాటంగా పైకెగసిన ఫ్లైఓవరును తలపింపజేసే నా కథను సమయం చూసుకొని సక్రమంగా సరయిన చోట దించాలి." అని తనమీద తనే జోక్ చేసుకో గలిగిన నిండు వ్యక్తిత్వం అతనిది. తెల్ల కాయితం పోతే పోయింది కానీ ఈ కథలో మంచి పస ఉండే సూచనలున్నాయి, ఇలాగే ప్రొసీడవమని చెప్పిన నా మాట మన్నించి, అబ్బే ఇది చాలదు, ఇంకా రాయాలి, ఇంకా చిత్రిక పట్టాలి, ఇంకా మెరుగు పెట్టాలి అన్న నా సాధింపులు భరించి మొత్తానికి ఒక చక్కటి కథని వెలయించాడు, మన వీరబల్లె వీరుడు, భట్టుపల్లె భట్టుమూర్తి. "పేరు గలవాడేను మనిషోయ్" ఈమాట మే సంచికలో ప్రచురితమైంది.

కొత్త కథా ఇతివృత్తం త్వరలో ప్రకటిస్తాను.

Sunday, May 4, 2008

National Day of Prayer

నిన్న సాయంత్రం ఒక అద్భుతమైన కార్యక్రమంలో పాలుపంచుకుని వచ్చాను. ఆ ఉత్తేజం మసకేయక ముందే మీ అందరితో పంచుకోవాలని ఇలా..

అమెరికాలో నేషనల్ డే ఆఫ్ ప్రేయర్ అని జరుపుతూ ఉంటారు, మేనెలలో మొదటి గురువారం నాడు. దీని చరిత్ర, పుట్టుపూర్వోత్తరాలని వికీ పేజిలో చదవొచ్చు.

నిన్న నే వెళ్ళిన సమావేశం ప్రత్యేకత అర్ధం కావాలి అంటే ఇక్కడ స్థానికంగా దీని చరిత్ర కొంచెం చెప్పాలి.

నేనుండే బుల్లి ఊరికి పక్కనే ట్రాయ్ అని పెద్ద ఊరుంది. డెట్రాయిట్ నగర పరిసర ప్రాంతాల్లో పెద్దది, అనేక పెద్దా చిన్నా కంపెనీలకి నెలవు. సగటు ఆదాయం, విద్యా స్థితి, పాఠశాలల పురోగతి మొదలైన విషయాల్లో దేశం మొత్తమ్మీద ముందంజగానే ఉంటుంది ఈ వూరు. జాతి మత పరంగా కూడా గొప్ప వైవిధ్యం ఉంది ట్రాయ్ జనాభాలో. భారతీయ సంతతి వారూ, హిందువులూ అధిక శాతంలోనే ఉన్నారిక్కడ. డెట్రాయిట్ ప్రాంతంలో తొలిసారిగా మొదలైన హిందూ దేవాలయం కూడా ఇక్కడే ఉంది.

ట్రాయ్ నగర పౌరులు కొందరు కలిసి చాలా ఏళ్ళుగానే ఈ నేషనల్ డే ఆఫ్ ప్రేయర్ ని నిర్వహిస్తూ ఉన్నారు. ఈ ప్రార్ధన సమావేశము ట్రాయ్ నగరపాలక సంస్థ భవన సముదాయం మధ్యలో ఉన్న ప్రాంగణంలో జరిపేవారు. దీన్ని నిర్వహించడానికి ఒక కమిటీ గట్రా ఉన్నారు - వీల్లు నగరపాలనలో సభ్యులు కానీ, అధికారులు కానీ కాదు - మనలాంటి సాధారణ పౌరులే. 2005 సంవత్సరపు సమావేశానికి ఏర్పాట్లు జరుగుతున్న సమయంలో ఒక భారతీయ హిందూ వనిత ఆ కమిటీ మీటింగుకి వెళ్ళి, వాళ్ళు చేస్తున్న పనికి ముచ్చట పడి, ఆ ప్రార్ధన సమావేశంలో నేను కూడా ఒక హిందూ ప్రార్ధన శ్లోకం చెబుతాను అన్నారు. అప్పుడా కమిటీ సభ్యులు చాలా మర్యాదగా ఆమెని మందలించి ఇచ్చట క్రిస్టియను ప్రార్ధనలు మాత్రమే జరుపవలెను అని నచ్చ చెప్పారు. ఆమె తెల్లబోయి ఇదేమి అన్యాయం అని నగరపాలికను అడిగింది. వాళ్ళు మాకేమీ సంబంధం లేదు, ఊరికినే మా ప్రాంగణంలో జరుపుకోటానికి అనుమతిస్తున్నాం అన్నారు. ఈమె మళ్ళీ ఆ కమిటీ మీటుంగుకి వెళ్ళి ఈ ప్రార్ధన క్రిస్టియనులకి ప్రత్యేకం కాదు. ప్రార్ధన చెయ్యదలుచుకున్న అమెరికనులందరూ పాల్గొనవచ్చు. ఇద్ఫి నా హక్కు - అంది. దాంతో వాళ్లకి తిక్క రేగి అసలు ప్రార్ధన లేదు, సమావేశం లేదు, కేన్సిల్! అన్నారు.

ఈమె ఏమీ తక్కువది కాదు, వీరనారీమణి. చుట్టుపక్కల వివిధ మతాచార్యులని సంప్రదించింది. ఏం చెయ్యగలం అని పెదవి విరిచారు. ఏమన్నా చెయ్యాలి అని చేతులు కలిపారు. ఎలా చెయ్యాలి అని తలలు పట్టుకున్నారు. చివరికి ఎట్లాగైనా చెయ్యాల్సిందే అని నడుం బిగించారు. దాని ఫలితమే 2005 మేలో ట్రాయ్ లో తొలిసారిగా జరిగిన సర్వ మత ప్రార్ధనా సమావేశం.

ఆ వీర నారీమణి శ్రీమతి కుప్పా పద్మ, నాకు ఆర్యీసీలో సహాధ్యాయి, ఈ దేశంలో ఆత్మీయురాలు కావటం నాకెంతో గర్వంగా ఉంది. పైగా నా తోటి తెలుగు సాహిత్య పిపాసి, శ్రీ తాడేపల్లి సుధాకర్ గారి సతీమణి.

నేనూ వెళ్ళాను ఆ తొలి సమావేశానికి. అద్భుతంగా జరిగింది. ఆ సమావేశంలో పాల్గొన్నాక నాకే తెలియని ఒక వింత ఆనందంతో నిండిపోయాను ఆ పూట. సర్వమత సమానత్వమూ, విశ్వమానవ సౌభ్రాతృత్వమూ అంటే ఏవిటో తొలిసారిగా ప్రత్యక్షంగా అనుభవంలోకి వచ్చి కళ్ల నీళ్ళు తిరిగాయి. అప్పణ్ణించీ ప్రతి యేడు వెళ్తూనే ఉన్నా. ప్రతిసారీ ఆ అనుభవం ద్విగుణీకృత బలంతో మనసు నింపుతూనే ఉంది. 2005 లో, ఆ వేడిలో మొదటి సమావేశం నిర్వహించిన కార్యకర్తలు హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నారే గానీ, వారెవ్వరికీ ఇది పెరిగి పెద్దదవుతుందని కానీ, ఇదొక సాంప్రదాయంగా మారుతుందని గానీ అనుకోలేదు వాళ్ళు. కానీ మూడేళ్ళ తరువాత, ఇది నాలుగోసారి, ఆ ఉత్సాహం కానీ, ఆ భ్రాతృ భావం కానీ, వెల్లువెత్తే ఆ సుహృద్భావం గానీ ఏమాత్రం తగ్గలేదు సరి కదా, కొత్త బలం పుంజుకుంటూ ఎదుగుతోంది. ఆ చిన్ని మొక్క వేళ్ళూనుతోంది. త్వరలోనే పదిమందికీ నీడనిచ్చే వటవృక్షం అవుతుందనే నా ఆశ.

నిన్నటి సమావేశం ట్రాయ్ యూదు మత ప్రార్ధనా మందిరం "షీర్ టిక్వః"లో రాబ్బై ఆర్నీ స్లూటల్బెర్గ్ గారి నిర్వహణలో జరిగింది. ఆర్నీ గారు తన మధురమైన గొంతుతో (ఆయన మాట్లాడినా నాకు పాటలానే ఉంటుంది!) రెవరెండ్ మార్టిన్ నియ్మోల్లర్ గారి ప్రఖ్యాతమైన పద్యం First they came .. వినిపించారు. తెలుగులో నా స్వేఛ్ఛానువాదం ..

వాళ్ళు మొదట కమ్యూనిస్టుల కోసం వచ్చినప్పుడు నేను కాదనలేదు - నేను కమ్యూనిస్టుని కాను గనక.
వాళ్ళు తరవాత సోషలిస్టుల కోసం వచ్చినప్పుడూ నేను వొద్దనలేదు - నేను సోషలిస్టుని కాను గనక.
వాళ్ళు పిమ్మట శ్రామిక నాయకుల కోసం వచ్చినప్పుడు నేను నోరు మెదపలేదు - నేను శ్రామిక నాయకుణ్ణి కాను గనక.
వాళ్ళు ఆపైన యూదుల కోసం వచ్చినప్పుడు నేను అభ్యంతర పెట్టలేదు - నేను యూదుణ్ణి కాను గనక.
వాళ్లు ఆఖరికి నా కోసమే వచ్చారు - కానీ అప్పటికి ఎవరూ మిగల్లేదు గొంతెత్తి అరిచేందుకు.

యూదు, ముస్లిము, సిక్కు, హిందూ, ప్రెస్బిటీరియన్ క్రిస్టియన్ మతాలనించి ప్రార్ధనలు చేశారు. హిందువుల తరపున ఒక పది మంది చిన్నారులు, శ్రీ కంచి పరమాచార్యులు రచించిన సంస్కృత కృతి "మైత్రీం భజత" ని ముద్దుగా ఆలపించారు. కార్యక్రమం చివర్లో అందరూ కలిసి ఏక కంఠంగా మార్టిన్ లూథర్ కింగ్ గారి వియ్ షల్ ఓవర్కం పాటని పలుభాషల్లో గానం చెయ్యడం గొప్ప అనుభవం. ఇందులో హిందీ కూడా ఉంది, ఎవరన్నా ఈ పాటని ఆ బాణీకి తగినట్టు తెలుగు చేస్తే వచ్చే సంవత్సరం తెలుగు సమావేశంలో తెలుగులో కూడా పాడొచ్చు.

Thursday, May 1, 2008

నా కథ

న్యూజెర్సీ తెలుగు లలితకళాసమితి వారి తెలుగు పత్రిక తెలుగుజ్యోతి రజతోత్సవ ప్రత్యేక సంచికలో.