Syriana

2005 లో విడుదలైన ఈ సినిమా చాలా గొప్ప రాజకీయ చిత్రం అని వినీ వినీ చాన్నాళ్ళుగా చూద్దామనుకుంటూ ఉన్నాను. థియెటర్లలో చూడ్డం కుదర్లేదు. డిస్కులో విడుదల అయిన తరవాత ఒకసారి అద్దెకి తెచ్చాను గానీ చూడ్డం కుదరకుండానే తిరిగి ఇచ్చేశాను. మొత్తానికి నిన్న చూడ్డం కుదిరింది. చూసిన దగ్గిర్నించీ లోపల ఏదో తెలియని అశాంతి. తమాషా ఏంటంటే సినిమా నాకు పూర్తిగా అర్ధం కూడా కాలేదు.

సినిమాలో ఒక ముఖ్య పాత్ర పోషించిన జార్జ్ క్లూనీ, మంచి నటుడిగానే కాక అనేక ప్రపంచ రాజకీయోద్యమాల పట్ల సానుభూతి పరునిగా పేరు పొందినవాడు. ముఖ్యంగా ఇటీవల సూడాన్ లో దారుణ మారణ హోమం జెరుగుతున్న డార్ఫుర్ ప్రాంతం గురించి అమెరికాలోనూ, ప్రపంచ వ్యాప్తంగానూ అవగాహన పెంపొందించడానికి కృషి చేస్తున్న వ్యక్తి. ఇంకొక ప్రధాన పాత్ర పోషించిన మాట్ డేమన్ ఆ రోజుల్లో నేను బాగా అభిమానించిన నటుడు. పైగా ఈ సినిమా తీసింది స్టీఫెన్ గగన్ అనే దర్శకుడు. ఇతడు ఇదివరలో అమెరికాలో మాదక ద్రవ్యాల పంపిణీ గురించి తీసిన సినిమా ట్రాఫిక్ నాకు చాలా నచ్చిన సినిమాల్లో ఒకటి. ఈ అన్ని కారణాల వల్లా ఈ సినిమా చూడలనే కోరిక చాలా బలంగా ఏర్పడింది నాలో.

చాలా ఓపిగ్గా వొళ్ళు దగ్గిర పెట్టుకుని, ఒక్క డయలాగు, ఒక్క ఫ్రేము మిస్సవకుండా చాలా జాగ్రత్తగా చూశాను అక్కడికీ. ఐనా నాకు అర్ధం కాలేదు. మొత్తానికి చాలా కాంప్లికేటెడ్ కథని చాలా క్లుప్తంగా చెప్పటానికి ప్రయత్నించి దర్శకుడు పప్పులో కాలేశాడేమో అనుకోక తప్పలేదు. దీన్నొక 10 - 12 ఎపిసోడ్ల టీవీ సినిమాగా మలచి ఉంటే అప్పుడేవన్నా ప్రయోజనం ఉండేదేమో. సిస్టీన్ ఛాపెల్ పై కప్పు మీద చిత్రించాల్సిన చిత్రాన్ని జేబు రుమాలు మీద చిత్రిస్తానంటే కుదరదు కదా!

అసలు ముందు సినిమా పేరే అర్ధం కాలేదు, సినిమా గురించిన వికీ పేజి చదివేవరకూ. ట్రాఫిక్ సినిమాలోనే తెలుస్తుంది ఈ దర్శకునికి అనేక సమాంతర కథల పాయల్ని పేనడం అంటే ఆసక్తి అని. ఐతే ట్రాఫిక్ లో కుదిరినట్టు ఇక్కడ కుదర్లేదు. పైపెచ్చు సినిమా నిడివి వంటి అంశాలని దృష్టిలో పెట్టుకుని మొత్తమ్మీద అవసరానికి మించి కత్తిరింపులు వేశారేమో ననిపించింది. మొత్తానికి చమురు రాజకీయాలు మన జీవితాల్ని ఎలా శాసిస్తున్నాయో చెప్పడం ఈ సినిమా ముఖ్యోద్దేశం అనిపించింది. ప్రస్తుతం అమెరికా నలుమూలలా పెట్రోలు బంకుల్లో గేలను పెట్రోలు మూడు డాలర్ల ముప్పావలాకి తక్కువ లేదు. ఈ వేసవిలో నాలుగు డాలర్లు దాటుతుందని అందరు పండితులూ ఘోషిస్తున్నారు. (గేలను ఒక డాలరు కంటే తక్కువకి అమ్మడం నాకు పరిచయమే!) చమురు కంపెనీలు కనీ వినీ ఎరుగని లాభాల్ని ప్రకటిసున్నాయి గత రెండేళ్ళుగా. ఒక పక్కన ప్రజలు "హబ్బా, ఏవిటీ ధరలు!" అని అల్లలాడుతూనే .. మరో పక్క తమ డ్రైవింగ్ అలవాట్లని ఏమాత్రం మార్చుకున్నట్టు కనబట్టల్లేదు. ఏమాత్రం హృదయం ఉన్న వారైనా, ప్రపంచాన్ని గురించి, భవిష్యత్తుని గురించీ ఏమాత్రం ఆలోచించే వారైనా ఈ సినిమా చూశాక ఇదివరికటిలా పెట్రోలు దాహం పుచ్చుకుంటారు అనుకోను.

కథలో వేర్వేరు పాయలు ఇవి.
రాబర్ట్ బార్న్స్ (క్లూనీ) CIA ఏజెంటు ఇరాన్ లో ఆయుధాల స్మగ్లర్లని గుర్తించి మట్టుబెడుతూ ఉంటాడు. ఈ పనిలో ఒక మిసైల్ అతని కళ్ళ ముందునించే మాయం అవుతుంది.
బ్రయన్ వుడ్మేన్ (డేమన్) గెనీవాలో ఒక ఎనెర్జీ కంసల్టింగ్ కంపెనీలో ఎగ్జెక్యూటివ్. ఒక అరబిక్ ఎమిరేట్ కి వారసుడైన రాకుమారునికి ఆంతరంగిక సలహాదారుడౌతాడు కొన్ని యాదృఛ్ఛిక సాంఘటనల వలన.
ఆ రాకుమారుని దేశం కొత్త చమురు పరిశోధనలకి కాంట్రాక్టు చైనీయ కంపెనీకి ఇస్తుంది, అమెరికను కంపెనీని కాదని. ఆ మార్పిడిలో అమెరికను కంపెనీ యాజమాన్యం కింద పనిచేస్తున్న పలువురు పాకిస్తానీ యువకులు ఉద్యోగం కోల్పోతారు.
కాంట్రాక్తు కోల్పోయిన అమెరికను కంపెనీ, తమ స్థానం నిలబెట్టుకోడానికి ఇంకొక అమెరికన్ చమురు కంపినీతో కలుస్తుంది.
ఈ కంపెనీల కళ్యాణం అమెరికను ప్రభుత్వపు జస్టిస్ డిపార్టుమెంటుకి ఇష్టం ఉండదు. ఇందులో ఏమి గూడుపుఠాణీ ఉందోనని అన్వేషించడానికి ఒక కుర్రలాయరుని నియమిస్తారు.
ఈ కుర్రలాయరు తన గురువునే ఆ న్యాయసంస్థానపు కత్తికి యెరవేసి కంపెనీల కళ్యాణం నిర్విఘ్నంగా జరిగేట్టు చూస్తాడు. ఒకటిగా అవతరించిన ఈ మహా కంపెనీ, చైనాకి కాంట్రాక్టునిచ్చి తన దేశాన్ని ఏదీ ఉద్ధరించాలని చూసే రాకుమారుణ్ణి అమెరికను ప్రభుత్వ సహాయంతో) హత్య చేయించి, అతని తమ్ముణ్ణి గద్దె ఎక్కించి, తిరిగి తమ చమురు హక్కులు సంపాయించింది.
ముందు ఉద్యోగం పోగొట్టుకున్న పాకిస్తానీ యువకులు మనుగడ కోసం ముస్లిము మదరసాలో చేరి ప్రభావితులై, ఆత్మార్పణ దాడిలో, మొదటి సీనులో రాబర్ట్ బార్న్స్ నించి దొంగిలించ బడిన అమెరికను మిసైల్ తోనే ఈ పెద్ద చమురు కంపెనీ టాంకరు పైన దాడి చేశారు.

నాకు అర్ధమైనంతలో సినిమాలో కీలకమైన సందేశం ఇదే! నల్ల కుర్రలాయరుకి ప్రబోధం చేశే తోటి ఉద్యోగి, తన మాటల్లో .. ఫ్రీమార్కెట్ ప్రబోధకుడూ, నోబెల్ గ్రహీత మిల్టన్ ఫ్రీడ్మన్ పేరుని నంజుకోడం గొప్ప చిత్రణ అనిపించింది నాకు.


చాలా కలచివేసే కథ, చాలా ఆలోచింప చేసే కథ అనడంలో ఏమీ సందేహం లేదు. మన పురాణాల్లో లాగానే వీడే చెడ్డోడు, వీడే మంచోడు అని చెప్పడానికి లేదు .. అంతటా పరుచుకున్న గ్రే రంగు ఛాయలే, అంతటా నీడలే. ఏ ఏక్టరు ఎలా చేశారో అంచనా వెయ్యడం గూడా కష్టమే. తారలైన క్లూనీ, డేమన్ అలా ఉండగా ఒకనాటి రొమాంటిక్ హీరో క్రిస్టొఫర్ ప్లమర్ (సౌండ్ ఆఫ్ మ్యూజిక్) ఇందులో ఒక గుంటనక్క లాంటి పాత్రలో, అమెరికన్ బ్యూటీలో గేఫోబిక్ కర్నల్ గా నటించిన క్రిస్ కూపర్ స్వలాభం కోసం సోంత తల్లినైనా అమ్మెయ్యడానికి సంకోచించని చమురు కంపెనీ అధినేతగానూ, సూడానీస్ తండ్రికీ బ్రిటీష్ తల్లికీ పుట్టిన నటుడు అలెక్జాండర్ సిద్దిగ్ రాకుమారుడు నసీర్ గానూ మనల్ని ఆకట్టుకుంటారు. అంత శ్రద్ధగా చూసినా సినిమా అర్ధం కానట్టుగా మిగిలి పోవడం ఒక పక్కన చిరాకు తెప్పిస్తుంటే .. ఇంకో పక్కన ఇంకో ఆలోచన వచ్చింది. ఈ సినిమా చూస్తే ప్రేక్షకులకి మిగిలే కంఫ్యూషను కూడా ఒక మెటఫర్ యేమోనని!

Comments

Giri said…
ఏడాది క్రితం చూసాననుకుంటా - ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఒక్క నిముషం కూడా దృష్టి మరల్చకుండా చూస్తేనే అర్ధమయ్యే చిత్రం ఇది. రాజర్ ఎబర్ట్ ఇలాంటి చిత్రాలనే హైపర్లింక్ చిత్రాలని సంబోధించినట్టు గుర్తు..అమెరికా చమురు కోసం ఇతర దేశాల అంతర్గత వ్యవహారాలలో ఎలా కలగజేసుకుంటుందో బాగా చూపిస్తుంది, కదూ?
netizen said…
Costa-Gavras సినిమ "Z" ని చూసారా? చూడకపొటే కనీసం విన్నారా? అది చూస్తే మీరు ఇందిరా గాంధి "నగర్వాలియ" హత్య, భారతదేశంలో ఎమర్జెన్సి గుర్తోస్తాయి!
leo said…
Good Night, and Good Luck, Michael Clayton చూసాక ఈ సినిమా కూడా చూద్దామనిపించింది కానీ దొరక లేదు మాస్టారు.
ఈ సినిమా అప్పట్లో ఇంకా విడుదల కాకముందే ప్రివ్యూ కోసం పంపించిన ఒక సీడీని ఎలా పైరేట్ చేశారో గానీ, చేసి ఇంటర్నెట్ లో డౌన్ లోడ్ కి పెట్టారట. అలా డౌన్ లోడ్ చేసిన ఒక కాపీని నేను ఫ్రెండు దగ్గర నుంచి తీసుకుని చూశాను. ఇంత లోతుగా ఆలోచించి చూడలేదు కానీ, చాలా నచ్చింది అప్పట్లో.
pi said…
I loved this film. It talks a lot about oil politics. I loved traffic too & own it. As somebody mentioned, you need to watch it full concentration without even blinking.