షేర్ ఆటొ కథ - కమామిషు

ఈ టపా తొలి ముద్రణలో ఒక పొరపాటు జరిగింది. ఒక కథని మరిచాను. ఇప్పుడు సవరించాను.
మొత్తం పది కథలు వొచ్చాయి. మనలోమాట రమణి, ఒనమాలు లలిత, దైవానిక శ్రీకాంత్, మయూఖ లలితాస్రవంతి తమ బ్లాగుల్లో ప్రచురించారు. నా మదిలో .. ప్రవీణ్ గార్లపాటి, గడ్డి పూలు సుజాతా పాత్రో, సౌమ్య రైట్స్ సౌమ్య, రాజారావు తాడిమేటి, నివేదన రమ్య, జ్యోతి వలబోజు నాకు మెయిల్లో పంపారు. ఇందులో ఈమాట మేనెల సంచికలో రాజారావు, రమ్య గార్ల కథలు వచ్చాయి.

అన్ని కథల్లోనూ కొన్ని కొన్ని కామన్ లక్షణాలు లేకపోలేదు. చాలా కథల్లో ఆ చిన్నపిల్ల చేసే ఏదో పిల్ల చేష్టకి తల్లి "ఉరిమి" చూడ్డాన్ని చిత్రించారు. హీరో మహేష్ బాబు ప్రసక్తి కూడ బాగా తరచుగానే వినబడింది. పాత్రల వర్ణనలు ఇంచుమించుగా అందరూ ఒకేలా చేశారు - అఫ్కోర్సు, కథకి ఇచ్చిన ఇతివృత్తం అదే కావటం వల్ల కావచ్చు అనుకోండి. కామన్ గా ఉన్న లక్షణాలు ఇంతవరకే.

నాకు మహా సంబరం కలిగేట్టు అందరూ తలో దారీ తొక్కారు పాత్రల మన్సతత్వ చిత్రణలోనూ, కథని నడిపించటంలోనూ.

ABCDEFG - రమణి
ముగ్గురు హీరోయిన్లూ, ఆటో ఛేజ్, పాఠకుల్ని ఉత్కంఠతో ఉర్రూతలూపే సస్పెన్సు, చివరాఖరికి మనసుల్ని ద్రవీభవింపజేసే కరుణ రసాత్మకమైన ముగింపుతో రమణి గారు ఒక మంచి తెలుగు సినిమాకి కావల్సిన సరంజామాని సిద్ధం చేశారు తన కథలో. సినిమా కథ అంటే ఏమీ చులకన కానక్కర్లేదు. పాఠక ప్రేక్షకుల్ని రంజింప జెయ్యటానికి ఎంతో సృజనశక్తి కావాలి. ఐతే, తనే ఫస్టు ప్రచురించాలి అనే తొందరో మరేవిటో గానీ మరీ హడావుడిగా జరిగిపోయింది కథనం. రక్తి కట్టించడనికి అవసరమైన హంగులన్నీ కహలోనే ఉన్నాయి. ఇంకాస్త ఓపిక పట్టి, శ్రద్ధ తీసుకుని పాత్రల్నీ, సంఘటనల్నీ మలిచి ఉంటే ఈ కథ జనరంజకమయ్యేది అనడంలో సందేహం లేదు. హీరో ఒక్కడికి తప్పించి ఆటోలోని మిగతా ప్రయాణీకులకి చెప్పుకోదగ్గ పాత్ర యేదీ లేదు. కాగా వీరొక్కరే ఇతివృత్తంలో లేని పాప, పాప తల్లి, కిడ్నాప్ గేంగ్ ని ప్రవేశ పెట్టి ఆసక్తికరమైన మలుపునిచ్చారు.

ఇబ్బంది - లలిత
ఎక్కడా అపశృతి దొర్లనివ్వకుండా ఆద్యంతమూ ఒక చిలిపి ఆహ్లాద కరమైన వాతావరణంలో కథ నడిపించారు లలిత. సాధారణంగా తమ కొంటె చేష్టలతో ఆడపిల్లల్ని అల్లరి చేసే కాలేజి కుర్రాడే ఒక వింత పరిస్థితిలో చిక్కుకుని తానే ఇబ్బందిగా ఫీలయినట్టు ముచ్చటైన మలుపు తిప్పి ముగించారు. ఈ నాటి సాంఘిక వాతావరణానికి తగినట్టు సెల్ ఫోన్‌లో రింగ్ టోన్ ని కథకి కీలకంగా ఉపయోగించుకోవటం కూడ బావుంది. ఐతే ఈ కథ కూడా ఒక స్కెచ్ లాగా మిగిలిపోయింది, తగినంత డీటెయిల్ నింపే ప్రయత్నం చెయ్యక పోవడంతో. షేర్ ఆటోలోని మిగతా ప్రయాణీకులందరూ అప్పుడూ అప్పుడూ ఓ మాట అనడంతో వాళ్ళ పనై పోయింది. కాలేజ్ స్టూడెంటు ప్రవర్తన వల్ల ఆటోలోని పడుచు పిల్ల ఇబ్బంది పడ్డ సూచన ఏదీ లేదు కథలో. ముందు తానే మిగతా వారిని ఇబ్బంది పెట్టి, చివరకి తన సెల్ ఫోన్ వల్ల తనే ఇబంది పడ్డట్టు, అవసరమైన సిచ్యువేషనల్ డీటెయిల్ చిత్రిస్తూ చెప్పి ఉంటే కథ ఇంకా రక్తి కట్టి ఉండేది.
జీవన తరంగాలు - శ్రీకాంత్ (దైవానిక)
ఫేంటసీ సాహిత్యాన్ని బాగా ఇష్టపడే నూతన బ్లాగరి శ్రీకాంత్ ఈ కథతో చెయ్యి తడి చేసుకున్నారు. ఉదాత్తమైన సంఘటనలనీ, మానవ హృదయంలోని లోతుల్ని ఆవిష్కరించ ప్రయత్నించారు కానీ పాత్ర చిత్రణకి అవసరమైన నేపథ్యం కొరవడి, కథలో జరిగిన సంఘటనలు తెచ్చి పెట్టుకున్నట్టుగా మిగిలాయి. మొదటినించీ ప్రథమ పురుషలో సాగుతున్న కథనంలో ఉన్నట్టుండి "అనుకుంటా" అంటూ రెండు చోట్ల యువకుడైన మయూర్ తరపున వకాల్తా పుచ్చుకుంటాడు కతకుడు. రైలు పెట్టెలో ఎక్కి కూర్చున్న హీరో మనసులో ఆలోచనలుగా మొదలైన కథ, తిరిగి మళ్ళీ హీరో దగ్గిరికి చేరకుండానే ముగిసిపోయింది. అస్పష్టత ఉండటమే నేరం కాదు గానీ, తిన్ననైన కథనంలో కోరి అస్పష్టతని తెచ్చుకున్నప్పుడు దానికేవన్నా నిర్దిష్టమైన ప్రయోజనం ఉన్నప్పుడే అది రాణిస్తుంది.

శుభారంభం - సుజాత
కథా సందర్భానికీ పాత్రలకీ తగిన నేపథ్యాన్ని చక్కగా వర్ణించారు. ఎండ తీవ్రతని చెబుతూ ఆటోలో ఆ పేద కుటుంబం తమ గోనె సంచీ అంతా వెదికి నీళ్ళ బాటిల్ని పట్టుకుని, సేదతీరే దృశ్యాన్న్ కళ్ళకు కట్టినట్టు వర్ణించారు. ఆ పడుచు పిల్లని యువకుడు మొదట్లో చూసే చూపులోనూ, చివరికి ఆటో దిగిపోయాక చూసే చూపులోనూ ఉండే తేడాతో అతని వ్యక్తిత్వంలో కలిగిన మార్పుని హృద్యంగా పట్టుకున్నారు. భాష వాడుకలో చాలా జాగ్రత్త వహించాలి. చాలా చోట్ల అవసరానికి మించిన గంభీరమైన పదబంధాల్ని ఉపయోగించారు. కథకి తగిన ముగింపు. కొద్దిగా చిత్రిక పడితే ఇంకా మెరిసేదేమో అనుకోకుండా ఉండలేక పోతున్నాను.

మానవత్వం - జ్యోతి వలబోజు
కథకి కావలసిన వాతావరణ నేపథ్యాన్నీ, పాత్రల నేపథ్యాన్నీ పట్టించుకుని కథలో ప్రకటించే ప్రయత్నం బాగా చేశారు. కథలో ఏం చెప్పాలి అనీ, ఎలా చెప్పాలి అనీ బాగా ఆలోచించినట్టు కనిపిస్తోంది. తొలి కథ మీద మంచి పరిణతి కనిపిస్తోంది. తమ తమ బాధల్లో ఆలోచనల్లో మునిగి ఉన్న వివిధ పాత్రలు ఇంకొకరికి ప్రాణాపాయం మీదికి వచ్చిందనంగానే తమ చింతల్ని మరిచి పోయి ఆ మనిషికి ప్రాణం పొయ్యడనికి మూందంఅ వేసినట్లు చూపెట్టడం మంచి మానవతకి గుర్తు. ఐతే ముగింపు నీతి కథల ముగింపులాగా ఉంది. మరి కాస్త ప్రయత్నిస్తే వాస్తవికత నిండిన కథలు రాయగలరు.

ప్రవీణ్ కథనం
వైవిధ్య భరితమైన టపాల్ని అలవోకగా వెలయిస్తూ ఇటీవల బ్లాగు పుస్తక నిర్మాణంతో సంకలనకర్తగా అవతరించిన ప్రవీణ్ దీనితో కథా రచయితగా రంగ ప్రవేశం చేసి ఇంకో వీరతాడు మెడకెత్తుకున్నారు. జేజేలు. అభినందించదగిన ప్రయత్నం. నిజజీవిత నాటకానికి దగ్గరగా ఉంది మీ కథా గమనం. కానీ ప్రవీణ్, ఈ కథ చదివాకా .. మీరెప్పుడూ షేర్ ఆటో ఎక్కలేదని మాత్రం చెప్పగలను :-)

సౌమ్య కథనం
మామూలుగానే సౌమ్య కథల్లో హఠాత్తుగా జనాలకి జ్ఞానోదయమయ్యే లాంటి సంఘటనలు ఉండవు. ఈ కథలో కూడా జన జీవన్ స్రవంతిలోని ఒక పాయని ప్రత్యక్షం చేశారు. కాకపోతే, కథ జరిగినంత సేపూ ఏదో జరుగుతుందేమోనని పాఠకుల్లో రేగే ఉత్కంఠకి ఓదార్పు దొరక్క పోవడంతో నీరసం వస్తుంది.

శ్రమయేవ జయతే - లలితా స్రవంతి
విలక్షణమైన ఆలోచన చేసి, ఆటోనే కథలో ఒక పాత్రని చేసి, ఆత్మ కథలాగా చెప్పించడం మంచి ప్రయోగం. ఆటోకి మనసుంటుందా, అది మాట్లాడుతుందా .. అంటే? ఉండకూడదని మాత్రం ఏముంది? కథ అన్నాక అది ఒక సృజనాత్మక ప్రక్రియ కదా! లేనిది ఉన్నట్టు చూపడం కూడా అందులో భాగమే. చదువు మానసిక వికాసానికే గానీ కేవలం జీవనోపాధికోసం కాదనీ, జీవనోపాధికి నిజాయితీ గల ఏ వృత్తి అయినా గౌరవ ప్రదమేననే మంచి సందేశాన్ని, ఆర్ద్రంగా చెప్పారు.

అంతర్మథనం - రాజారావు
పూర్తిగా యువకుడి పాత్ర దృష్టిలో, అతని మనోభావాల చిత్రణగా సాగిన కథనం. ఇంచుమించు చైతన్య స్రవంతిలాగా ఎక్కడా బిగి సడలకుండా నడిపించారు. యువకుణ్ణే కాక మిగిలిన పాత్రలకి కూడా తగినంత ప్రాముఖ్యత కల్పిస్తూ, వారి వారి వేష భాషల్ని చక్కగా చిత్రించారు. చివర్లో జరిగే మలుపుతో, ఓ.హెన్రీ కథల్లాగా, మానవత్వమే మనలో మెరిసే మరుగు పడని రత్నం అని చాటి చెపుతూ కథ ముగించారు.

అటో - ఇటో - రమ్య
ఈ కథ చదువుతుంటే పకడైన స్క్రీన్ ప్లేతో ప్రతిభ గల దర్శకుడు తీసిన ఒక లఘు చిత్రం చూసిన అనుభూతి కలిగింది నాకు. రచయిత్రి దృష్టి లాంగ్ షాట్ తో మొదలై, మీడియం కి వచ్చి, అప్పుడప్పుడూ ఆయా పాత్రల మీద క్లోజప్ గా ఫోకస్ చేస్తూ .. మనల్ని ఆ ఆటో వెంబడే పరుగులు తీయించారు. ఆటోలో ఉన్న ఆరుగురు వ్యక్తులే కాక, రాజేంద్రనగర్ నించీ మెహిదీపట్నం చేరే దాకా మధ్యలో తగిలే అనేక సెంటర్లు కూడా కథలో భాగం పంచుకుని సజీవమై నిలిచాయి. ప్రతి ఒక్క సన్నివేశంలోనూ పాత్రల మనోభావాలని సందర్భోచితంగా పట్టుకోడానికి రచయిత్రి చూపిన శ్రద్ధ కనిపిస్తుంది. ముగింపు సంఘటన ఆశ నిరాశల మధ్య పెండ్యులంలా ఊగుతూ, నిజమింతే కదా అని ఆశ్చర్యంతో ముక్కున వేలేయిస్తుంది.

ఈ సారి కూడా విజేత రమ్య గారే.
రాజారావు, లలితాస్రవంతి గార్ల కథలు కూడా నాకు బాగా నచ్చాయి. అంచేత వారిద్దరికీ కూడా ఈ సారికి ప్రోత్సాహక బహుమతి ఇవ్వాలనుకుంటున్నాను.

విజేతలకి అభినందనలు. ఈ పాత టపాలో నాకు బాగా నచ్చిన నాలుగు పుస్తకాలకి లింకులు ఉన్నాయి. అవి చూసి ఒకటి యెంచుకుని మీ యెంపికని నాకు మెయిల్లో తెలియబరిస్తే, ఆ పుస్తకం మీకు అందే ఏర్పాటు చేస్తాను.

ఉత్సాహంతో ముందుకొచ్చి పాల్గొన్న వారందరికీ పేరు పేరునా నా ధన్యవాదాలు. ఈ తడవ తొలిసారి రచయితలైన రాజారావు, ప్రవీణ్, శ్రీకాంత్, సుజాత గారలకి ప్రత్యేక అభినందనలు.

ఇక్కడ ఒక విచిత్ర వ్యక్తిని (పునః) పరిచయం చేస్తాను. మొదట ఇచ్చిన ఇతివృత్తం తెల్లకాయితం మీద ఒక కథ పరిశీలనకి వచ్చింది. చదివి, రాసినాయనతో, కథ బానే ఉంది గానీ ఇందులో తెల్ల కాయితం ఎక్కడా పెద్దగా కనబట్టల్లేదే అన్నా. "జరుగుతున్నది కబడ్డీ పోటీ కాగా, కుస్తీ బాగా సాధనచేసి వచ్చాడట ఒకడు. బరిలో దిగడం ఆలస్యం ఔట్ అయిపోయాడు. అలా నా కథ కూడా మెడ పట్టి బయటకు నెట్టబడింది. మన సచివాలయం ఎదురుగా ఆర్భాటంగా పైకెగసిన ఫ్లైఓవరును తలపింపజేసే నా కథను సమయం చూసుకొని సక్రమంగా సరయిన చోట దించాలి." అని తనమీద తనే జోక్ చేసుకో గలిగిన నిండు వ్యక్తిత్వం అతనిది. తెల్ల కాయితం పోతే పోయింది కానీ ఈ కథలో మంచి పస ఉండే సూచనలున్నాయి, ఇలాగే ప్రొసీడవమని చెప్పిన నా మాట మన్నించి, అబ్బే ఇది చాలదు, ఇంకా రాయాలి, ఇంకా చిత్రిక పట్టాలి, ఇంకా మెరుగు పెట్టాలి అన్న నా సాధింపులు భరించి మొత్తానికి ఒక చక్కటి కథని వెలయించాడు, మన వీరబల్లె వీరుడు, భట్టుపల్లె భట్టుమూర్తి. "పేరు గలవాడేను మనిషోయ్" ఈమాట మే సంచికలో ప్రచురితమైంది.

కొత్త కథా ఇతివృత్తం త్వరలో ప్రకటిస్తాను.

Comments

Naga Pochiraju said…
నేను రాసిన దానికి మొదటి సారి బహుమతి రావడం చాలా ఆనందం గా ఉంది,అదీ కొత్తపాళి గారి నుంచీ.
నాకు ఏమి రాయాలో కూడా తెలియడం లేదు ఈ సంధర్భం లో
ఆ పుస్తకల గురించి నాకు ఏమీ తెలియదు
మీరు ఏది పంపినా ఆనందమే ,కానీ ఏ బహుమతీ మీ చేత బాగుంది అనిపించుకోవడానికి మించింది మాత్రం కాదు

ధన్యురాలిని
KK said…
ఈ కార్యక్రమం ఇంత ఆహ్లాదకరం గా మరియు పోటా పోటీగా జరుగుతూ ఉండటం చాలా బాగుంది. రచయిత/రచయిత్రులందరికీ అభినందనలు.


కొత్తపాళీ గారు! మేము గూగులోళ్ళం కాకపోయినా ఏదో వర్డ్ ప్రెస్ వాళ్ళం అన్నా. మాకు కామెంట్ ఇచ్చే సౌలభ్యం తీసివేయటం దారుణం. దీని వెనుక ఏదైనా కధా కమామీషు ఉండే ఉంటుంది.
నువ్వుశెట్టి సోదరులారా,
ఆలా జరిగిందా? నేను ఏవో సెటింగ్స్ సవరిస్తూ ఓపెన్ ఐడీ అని ఉన్నది కనా, ఇదేంటో చూద్దామని అలా మార్చాను. అది జనాల్ని ఎక్స్‌క్లూడ్ చేస్తుందనుకోలేదు. ఇప్పుడు మళ్ళీ యథాతథం.
మీ మంచి మాటలకు కృతజ్ఞతలు.
భారతదేశాన కారామాస్టారు.
బ్లాగుదేశాన నారామాస్టారు.
కథా'యజ్ఞం' జరుగుతోంది మొత్తానికి.
ఆజ్యం పోస్తున్న యువకథకులందరికీ హృదయపూర్వక అభినందనలు.

నారామాస్టారూ,
సాధింపులను నేను నిజంగా భరించి తొందరపడకుండా వుండివుంటే బాగుండేదని ఇప్పుడనిపిస్తోంది. ఏదేమైనా ఫ్లైఓవరును కిందికి దించినందుకు సంతోషంగావుంది. నమస్తే.
గురూజీ,కధకొక అంశం అంత వీజీ కాదు,మాలాంటి వాళ్ళకు ధైర్యమివ్వటం!ఏదీ మాక్కాస్త ధైర్యమివ్వండి,నాలాంటి వాళ్ళు ఇంకెందరు ఈ కధన రంగంలోకి దూకిస్వైరవిహారం చేస్తారో.ప్రతిసారీ కధ మొదలు పెట్టటం,మానెయ్యటం,తక్కిన కధలు అచ్చయ్యాక చూసావా నువ్వు రాయకపోవటమే మంచిదయ్యిందని ఊరడించుకోవటం ఇదీవరస.
Anonymous said…
ఈ కథల పోటీ లో పాల్గొనాలని మనసు పీకినా కథలు రాసే యోగ్యత లేదు కాబట్టి పాల్గొనలేదు. ఇప్పుడు నా నిర్ణయం సబబే అని తేలింది. కొన్ని కథలు చదివాక. (రమణి గారి కథ వగైరా). విజేతలకు అభినందనలు.
విజేతలకు అభినందనలు.
Ramani Rao said…
ముదుగా విజేతలకి అభిననదనలు. కొత్తపాళీ గారు: నెనర్లు. నేనే ముందు రాయాలనో, లేదా పబ్లిష్ చేయలనో తొందరపాటు కాదండి! ఆలోచనలు.. మళ్ళీ ఎక్కడ మర్చిపోతానో అనే ఆత్రుత, అలా డైరెక్ట్ గా బ్లాగులో రాసిన వెంటనే, పబ్లిష్ చేసేలా చేసింది. ఈ ఆత్రుత, ఆరాటం చిన్నప్పటినుండి నన్ను వెంటాడుతున్న నా బలహీనతలే. కొన్నిసార్లు వీటివల్లే విజయం, మరికొన్ని సార్లు అపజయం. మంచి సూచనలిచ్చిన మీకు ధన్యవాదములు.
కొత్తపాళిగారు,

నేను ఈ కథను పోటీకి బహుమతికి అనే ఉద్దేశ్యంతో రాయలేదండి. నా రచనలను మెరుగులు దిద్దుకుందామనే ఈ ప్రయత్నం. ఇక ముగింపు అనేది , ఒక మంచి మంత్రి ఇలా చెయకూడదా? అని అలా ఇచ్చాను. అందరు మంత్రులు ఒకేలా ఉండరు కదా. తన కొడుకును రక్షించిన వారికి ఆ మాత్రం సాయం చేయకుండ ఉంటాడా అనుకున్నా.

విజేతలకు అభినందనలు.
విజేతలకు శుభాభినందనలు.

కొత్త పాళి గారి ఒపికకు మెచ్చుకొనక తప్పదు. ఇంత మంది కథలను విమర్శనాత్మకంగా పరిశీలిస్తున్నారు.

తరువాతి కథా ఇతివృత్తానికై ఎదురు చూస్తూ....
మునుముందుగా ఈ కథాయజ్ఞాన్ని నిర్వహిస్తున్న కొత్తపాళీ గారికి అభినందనలు. ఇందులో పాల్గొన్న ఔత్సాహిక రచయితలకు, రచయిత్రులకు చప్పట్లు. విజేతలకు శుభాభినందనలు.
rākeśvara said…
ఇలా కథా వస్తువు ఇచ్చి, దాని మీద నేనంటే నేను అని వ్రాసిన వారి కథలన్నీ చదివి, విశ్లేషించిన మీ ఓపికకి జోహార్లు.
Anonymous said…
కొత్తపాళీ గారు! సెట్టింగ్ మార్చినందుకు సంతోషం. చేతులు కట్టేసినట్టున్నింది నాకు. :)