ఖవ్వాలీ భక్తి సంగీతం

ఏ సమయంలో ఈ వింత సంగీతం నాకు పరిచయమైందో ఇప్పుడు సరిగ్గా చెప్పలేను. బహుశా ఆర్యీసీలో చదివే రోజుల్లో తొలి పరిచయం అయ్యుండొచ్చు. ఆర్యీసీ వెనక ఆ ప్రాంతాల్లో చాలా ప్రసిద్ధికెక్కిన కాజీపేట దర్గా ఉంది. డిశెంబరు ప్రాంతంలో ఆ దర్గా ఉర్స్ ఉత్సవం జరుగుతుంది. మూడు రోజులు, పగలూ రాత్రీ ఆ ప్రాంతమంతా మేల్కొని భక్త్యావేశంతో ఉర్రూతలూగేది. పేరుపొందిన ఖవ్వాల్ గాయక బృందాలు పోటాపోటీగా పాడేవి రాత్రి బాగా పొద్దుపోయేదాకా. అఫ్కోర్సు, ఆ కాలంలో మా ధ్యాస మబ్బు తెరల్ని చీల్చుకుని వచ్చే వెన్నెల చూపుల మీద ఎక్కువగా ఉండేదనుకోండి, అది వేరే విషయం.

అమెరికా వచ్చాక 1995-96 ప్రాంతంలో డెడ్ మేన్ వాకింగ్ అనే ఒక విచిత్రమైన సినిమా చూశాను. అందులో కొన్ని సన్నివేశాల్లో నేపథ్య సంగీతంలో వినిపించే ఒక గాయకుని పాట భారతీయ ఛాయ కలదిగా అనిపించింది. అది పాడింది నుస్రత్ ఫతే అలీఖాన్ అనీ, అతను పేరు మోసిన ఖవ్వాలీ గాయకుడనీ తెలిసింది. అవకాశం దొరికినప్పుడల్లా అతన్ని గురించీ, ఈ సంగీతం గురించీ తెలుసుకోడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నా.

ఏనార్బరులో మిషిగన్ విశ్వవిద్యాలయ సంగీత కళాశాల వారి సంగీత భాండాగారంలో ఎన్నో గొప్ప సంగీతాలు విని తరించే భాగ్యం కలిగింది. అక్కడే మొదటిసారి నుస్రత్ పాడిన పూర్తి ఖవ్వాలీల రికార్డులు బాగా విన్నాను. ఇలాగే వెతుకుతుంటే సాబ్రీ సోదరుల గాత్రం పరిచయమైంది. అక్కణ్ణించీ .. ఆ సోదరుల గొంతులో ఉన్న ఏదో సమ్మోహనాస్త్రం నన్ను కట్టి పడేసింది. ఎలా సంపాయించానో ఇప్పుడు గుర్తు లేదు గానీ మొత్తానికి వాళ్ళు పాడిన ఖవ్వాలీల రెండు కేసెట్లు కూడా సంపాదించాను. అందులో షాబాజ్ కలందర్ అనే పాట నాకు మరీ ఇష్టం. నా దగ్గర ఉన్న కేసెట్లో బాగా విపులంగా సుమారు పదిహేను నిమిషాల పాటు పాడారు ఈ పాట. నాకు ఆ పాట విన్నప్పుడల్లా మనసు తెలియని ఉత్సాహంతో పరవశిస్తుంది. ఉన్నపళాన లేచి తాండవం చెయ్యాలనిపిస్తుంది.

ఒక విధంగా ఈ సూఫీ సంగీతపు పరమార్ధం అదే కూడా. టర్కీ ప్రాంతాల్లో whirling dervishes, ఇంకా తూర్పు ప్రాంతాల్లో ఢమాల్ అనే ఒక భక్తి పారవశ్యం (మన భాషలో చెప్పాలంటే పూనకం), ఈ నృత్యం లాంటి కదలిక ద్వారా దైవికాంశకి దగ్గరవుతున్న అనుభూతి!

యూట్యూబ్ పుణ్యమా అని సాబ్రీ సోదరుల అనేక ప్రత్యక్ష ప్రదర్శనల విడియో చూసే అదృష్టం కలిగింది. వీటిని నిన్ననే గమనించాను. మీరూ రుచి చూడండి. నచ్చితే ఆనందించండి.

షాబాజ్ కలందర్

పియా ఘర్ ఆయా

ఆ రెండో పాటలో విడియోలో కనిపించే ఆంగ్ల తర్జుమా మీద ప్రత్యేక దృష్టి పెట్టండి. ఆ కవిత్వం లోని మధుర భక్తి భావం అద్భుతం అనిపించింది నాకైతే. ఆ భావం వారి గానంలో ప్రాణం పోసుకుని సజీవ ప్రకంపనలతో మన మనసుల్లోకి ప్రవహిస్తుంది.

షాబాజ్ కలందర్ గురించి వికీ వ్యాసం.

Comments

హమ్మ్... సాబ్రీ సోదరులు ఎందుకో నాకు నుస్రత్ ఫతే ఆలీ ఖాన్ పాడిన ఇవే ఖవ్వాలీల కంటే గొప్పగా పాడినట్లు అనిపించలా. నుస్రత్ పాడిన ఈ రెండూ నా ప్లేయర్లో ఉన్నాయి. మీరు ఇవే నుస్రత్ గొంతులో విన్నారా?
Dr. నరహరి said…
నాకూ నస్రత్ గారంటే చాల ఇష్టం...నాకు కర్ణాటక సంగీతం, సూఫీ సంగీతాలు చాలా ఇష్టం...నా దగ్గర నస్రత్ గారి అన్ని రికార్డులు (బహుశా అన్నీ అనుకుంటా) ఉన్నాయి...నా అభిమాన గాయకులు సుబ్బలక్ష్మి, బాల మురళి, నస్రత్ , ఉస్తాద్ సుల్తాన్ ఖాన్ మీకు ఏవైనా కావాలంటే చెప్పండి
@వికటకవి .. మీ అభిరుచిని కాదనను. నుస్రత్ పాడినవి, నా దగ్గర లేవు గానీ, అనేక రికార్డింగుల్లో విన్నాను. నాకు సబ్రీ సోదరుల పాటే నచ్చింది (యూట్యూబులో ఉన్నది కాదు, నా దగ్గర కేసెట్లో ఉన్నది). అందుకే కొన్నాను. :-)
@నరహరి గారూ .. మీ పరిచయం చాలా సంతోషం. మనం విడిగా మాట్లాడుకుందాం.
అసలు ఖవ్వాలీ, సూఫీ సంగీత ధ్వనులని నా చిన్నప్పుడు ‘ఉర్స్’ అని జరిగే ముస్లింల ఉత్సవాలలో పీలేరు (చిత్తూరు జిల్లాలో) ఉండగా విన్నాను.కొత్తగా ఉండి మంచి ఊపుగా అనిపించేవి. అదీగాక వాళ్ళు ఒక జట్టుగా ఒకరి తరువాత ఒకరు అందిపుచ్చుకుని పాడే తీరు అద్భుతంగా అనిపించేది.ఈ మధ్యకాలంలో అసలు ఈ ‘ఉర్స్’ లు జరగడమే లేదనుకుంటా.

ఇక నుస్రహ్ ఫతే అలీఖాన్,అబీదా పర్వీన్ పాటలు నేనూ విని "అబ్బా ఇలాక్కూడా పాడొచ్చా" అనుకున్న సందర్భాలు కోకొల్లలు. సాబ్రీ సోదరుల్ని పరిచయం చేసినందుకు ధన్యవాదాలు.

ఏ.ఆర్. రెహమాన్ కూడా ఈ శైలిలో చేసిన పాటలు నాకు చాలా ఇష్టం. ఈ మధ్య వచ్చిన జోధా-అక్బర్ లో ‘ఖ్వాజా..మేరే..ఖ్వాజా’ఒక గొప్ప ప్రయత్నం అనిపిస్తుంది.

www.parnashaala.blogspot.com