National Day of Prayer

నిన్న సాయంత్రం ఒక అద్భుతమైన కార్యక్రమంలో పాలుపంచుకుని వచ్చాను. ఆ ఉత్తేజం మసకేయక ముందే మీ అందరితో పంచుకోవాలని ఇలా..

అమెరికాలో నేషనల్ డే ఆఫ్ ప్రేయర్ అని జరుపుతూ ఉంటారు, మేనెలలో మొదటి గురువారం నాడు. దీని చరిత్ర, పుట్టుపూర్వోత్తరాలని వికీ పేజిలో చదవొచ్చు.

నిన్న నే వెళ్ళిన సమావేశం ప్రత్యేకత అర్ధం కావాలి అంటే ఇక్కడ స్థానికంగా దీని చరిత్ర కొంచెం చెప్పాలి.

నేనుండే బుల్లి ఊరికి పక్కనే ట్రాయ్ అని పెద్ద ఊరుంది. డెట్రాయిట్ నగర పరిసర ప్రాంతాల్లో పెద్దది, అనేక పెద్దా చిన్నా కంపెనీలకి నెలవు. సగటు ఆదాయం, విద్యా స్థితి, పాఠశాలల పురోగతి మొదలైన విషయాల్లో దేశం మొత్తమ్మీద ముందంజగానే ఉంటుంది ఈ వూరు. జాతి మత పరంగా కూడా గొప్ప వైవిధ్యం ఉంది ట్రాయ్ జనాభాలో. భారతీయ సంతతి వారూ, హిందువులూ అధిక శాతంలోనే ఉన్నారిక్కడ. డెట్రాయిట్ ప్రాంతంలో తొలిసారిగా మొదలైన హిందూ దేవాలయం కూడా ఇక్కడే ఉంది.

ట్రాయ్ నగర పౌరులు కొందరు కలిసి చాలా ఏళ్ళుగానే ఈ నేషనల్ డే ఆఫ్ ప్రేయర్ ని నిర్వహిస్తూ ఉన్నారు. ఈ ప్రార్ధన సమావేశము ట్రాయ్ నగరపాలక సంస్థ భవన సముదాయం మధ్యలో ఉన్న ప్రాంగణంలో జరిపేవారు. దీన్ని నిర్వహించడానికి ఒక కమిటీ గట్రా ఉన్నారు - వీల్లు నగరపాలనలో సభ్యులు కానీ, అధికారులు కానీ కాదు - మనలాంటి సాధారణ పౌరులే. 2005 సంవత్సరపు సమావేశానికి ఏర్పాట్లు జరుగుతున్న సమయంలో ఒక భారతీయ హిందూ వనిత ఆ కమిటీ మీటింగుకి వెళ్ళి, వాళ్ళు చేస్తున్న పనికి ముచ్చట పడి, ఆ ప్రార్ధన సమావేశంలో నేను కూడా ఒక హిందూ ప్రార్ధన శ్లోకం చెబుతాను అన్నారు. అప్పుడా కమిటీ సభ్యులు చాలా మర్యాదగా ఆమెని మందలించి ఇచ్చట క్రిస్టియను ప్రార్ధనలు మాత్రమే జరుపవలెను అని నచ్చ చెప్పారు. ఆమె తెల్లబోయి ఇదేమి అన్యాయం అని నగరపాలికను అడిగింది. వాళ్ళు మాకేమీ సంబంధం లేదు, ఊరికినే మా ప్రాంగణంలో జరుపుకోటానికి అనుమతిస్తున్నాం అన్నారు. ఈమె మళ్ళీ ఆ కమిటీ మీటుంగుకి వెళ్ళి ఈ ప్రార్ధన క్రిస్టియనులకి ప్రత్యేకం కాదు. ప్రార్ధన చెయ్యదలుచుకున్న అమెరికనులందరూ పాల్గొనవచ్చు. ఇద్ఫి నా హక్కు - అంది. దాంతో వాళ్లకి తిక్క రేగి అసలు ప్రార్ధన లేదు, సమావేశం లేదు, కేన్సిల్! అన్నారు.

ఈమె ఏమీ తక్కువది కాదు, వీరనారీమణి. చుట్టుపక్కల వివిధ మతాచార్యులని సంప్రదించింది. ఏం చెయ్యగలం అని పెదవి విరిచారు. ఏమన్నా చెయ్యాలి అని చేతులు కలిపారు. ఎలా చెయ్యాలి అని తలలు పట్టుకున్నారు. చివరికి ఎట్లాగైనా చెయ్యాల్సిందే అని నడుం బిగించారు. దాని ఫలితమే 2005 మేలో ట్రాయ్ లో తొలిసారిగా జరిగిన సర్వ మత ప్రార్ధనా సమావేశం.

ఆ వీర నారీమణి శ్రీమతి కుప్పా పద్మ, నాకు ఆర్యీసీలో సహాధ్యాయి, ఈ దేశంలో ఆత్మీయురాలు కావటం నాకెంతో గర్వంగా ఉంది. పైగా నా తోటి తెలుగు సాహిత్య పిపాసి, శ్రీ తాడేపల్లి సుధాకర్ గారి సతీమణి.

నేనూ వెళ్ళాను ఆ తొలి సమావేశానికి. అద్భుతంగా జరిగింది. ఆ సమావేశంలో పాల్గొన్నాక నాకే తెలియని ఒక వింత ఆనందంతో నిండిపోయాను ఆ పూట. సర్వమత సమానత్వమూ, విశ్వమానవ సౌభ్రాతృత్వమూ అంటే ఏవిటో తొలిసారిగా ప్రత్యక్షంగా అనుభవంలోకి వచ్చి కళ్ల నీళ్ళు తిరిగాయి. అప్పణ్ణించీ ప్రతి యేడు వెళ్తూనే ఉన్నా. ప్రతిసారీ ఆ అనుభవం ద్విగుణీకృత బలంతో మనసు నింపుతూనే ఉంది. 2005 లో, ఆ వేడిలో మొదటి సమావేశం నిర్వహించిన కార్యకర్తలు హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నారే గానీ, వారెవ్వరికీ ఇది పెరిగి పెద్దదవుతుందని కానీ, ఇదొక సాంప్రదాయంగా మారుతుందని గానీ అనుకోలేదు వాళ్ళు. కానీ మూడేళ్ళ తరువాత, ఇది నాలుగోసారి, ఆ ఉత్సాహం కానీ, ఆ భ్రాతృ భావం కానీ, వెల్లువెత్తే ఆ సుహృద్భావం గానీ ఏమాత్రం తగ్గలేదు సరి కదా, కొత్త బలం పుంజుకుంటూ ఎదుగుతోంది. ఆ చిన్ని మొక్క వేళ్ళూనుతోంది. త్వరలోనే పదిమందికీ నీడనిచ్చే వటవృక్షం అవుతుందనే నా ఆశ.

నిన్నటి సమావేశం ట్రాయ్ యూదు మత ప్రార్ధనా మందిరం "షీర్ టిక్వః"లో రాబ్బై ఆర్నీ స్లూటల్బెర్గ్ గారి నిర్వహణలో జరిగింది. ఆర్నీ గారు తన మధురమైన గొంతుతో (ఆయన మాట్లాడినా నాకు పాటలానే ఉంటుంది!) రెవరెండ్ మార్టిన్ నియ్మోల్లర్ గారి ప్రఖ్యాతమైన పద్యం First they came .. వినిపించారు. తెలుగులో నా స్వేఛ్ఛానువాదం ..

వాళ్ళు మొదట కమ్యూనిస్టుల కోసం వచ్చినప్పుడు నేను కాదనలేదు - నేను కమ్యూనిస్టుని కాను గనక.
వాళ్ళు తరవాత సోషలిస్టుల కోసం వచ్చినప్పుడూ నేను వొద్దనలేదు - నేను సోషలిస్టుని కాను గనక.
వాళ్ళు పిమ్మట శ్రామిక నాయకుల కోసం వచ్చినప్పుడు నేను నోరు మెదపలేదు - నేను శ్రామిక నాయకుణ్ణి కాను గనక.
వాళ్ళు ఆపైన యూదుల కోసం వచ్చినప్పుడు నేను అభ్యంతర పెట్టలేదు - నేను యూదుణ్ణి కాను గనక.
వాళ్లు ఆఖరికి నా కోసమే వచ్చారు - కానీ అప్పటికి ఎవరూ మిగల్లేదు గొంతెత్తి అరిచేందుకు.

యూదు, ముస్లిము, సిక్కు, హిందూ, ప్రెస్బిటీరియన్ క్రిస్టియన్ మతాలనించి ప్రార్ధనలు చేశారు. హిందువుల తరపున ఒక పది మంది చిన్నారులు, శ్రీ కంచి పరమాచార్యులు రచించిన సంస్కృత కృతి "మైత్రీం భజత" ని ముద్దుగా ఆలపించారు. కార్యక్రమం చివర్లో అందరూ కలిసి ఏక కంఠంగా మార్టిన్ లూథర్ కింగ్ గారి వియ్ షల్ ఓవర్కం పాటని పలుభాషల్లో గానం చెయ్యడం గొప్ప అనుభవం. ఇందులో హిందీ కూడా ఉంది, ఎవరన్నా ఈ పాటని ఆ బాణీకి తగినట్టు తెలుగు చేస్తే వచ్చే సంవత్సరం తెలుగు సమావేశంలో తెలుగులో కూడా పాడొచ్చు.

Comments

Naga said…
అద్భుతం మాస్టారూ. ఇంకా ట్రాయ్‌ని మరువలేకున్నాం!

రేపు ట్రాయ్ తెలుగు అసోసియేషన్ వారి ప్రోగ్రాం ఉంది. (http://www.troytelugu.org/)

మన యూనికోడు బాపు ఫాంటుతో పెద్ద బ్యానరు తయారు చేసారంట. వెళ్తే ఎలా ఉందో చెప్పగలరు.
Ramani Rao said…
చాలా బాగుంది కొత్తపాళీ గారు! అలా ట్రాయి నగరంలో జరిగిన సర్వమత ప్రార్ధనలు, రెవరెండ్ మార్టిన్ గారి పద్యానికి మీ అనువాదం చదువుతుంటే రోమాలు నిక్కబొడుచుకొన్నాయి నాకు చాలా నచ్చింది ఆ పద్యం. మాతృ దేశానికి దూరంగా వున్నా అప్పుడప్పుడు ఇలాంటి సమావేశాలు, ప్రార్ధనలు కాస్త ఊరట కలిగిస్తాయి.
బావుంది. వి షల్ పాటని తెలుగులో కూడా ఎక్కడో విన్నాననుకుంటా..ఆహా మదిలో విశ్వాసం ఓహో మదిలో విశ్వాసం అని సాగుతుంది
కొత్తపాళీ గారు,చాలా మంచి విషయం చెప్పారు.వెయ్యి మైళ్ళ ప్రయాణం కూడా ఒక చిన్న అడుగుతో మొదలవుతుంది.ఈ చిన్న అడుగు భవిష్యత్తులో ట్రాయ్ దాటి ప్రపంచమంతా విస్తరించవచ్చు.
సుజాత said…
చాలా బాగుంది కొత్త పాళీ గారు,
మీ అనువాదం చివరి లైను చదువుతుంటే, తెలియని భావోద్వేగం కలిగింది. ఈ కార్యక్రమానికి ఇంకా ప్రచారం కావాలి. ముఖ్యంగా పిల్లల్లో చిన్నపటి నుంచి మతం పట్ల సరైన అవగాహన ఏర్పడ్డానికి ఇలాంటి సర్వ మత ప్రార్థనలు చాలా దోహదం చేస్తాయి. శ్రీమతి పద్మ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను.
Bolloju Baba said…
కొత్తపాళి గారికి
ఎక్కడో అమెరికాలో జరిగిన విషయాన్ని కళ్లకు కట్టినట్లు చూపించారు. కొత్తవిషయాలు తెలుసుకున్నాను.

సత్యగారన్నట్లు, వి షల్ పద్యాన్ని ఎక్కడో విన్నట్లుంది. తెలుసుంటే ఎవరైనా చెప్పగలరా? ప్లీజ్

బొల్లోజు బాబా
http://sahitheeyanam.blogspot.com/
బాబా గారూ,
వియ్ షల్ పాట ఇలా సాగుతుంది.

We shall overcome
We shall overcome
We shall overcome Someday
Deep in my heart
I do believe
We shall overcome Someday!

దీన్ని హిందీలో
హోంగే కాంయాబ్
హోంగే కామ్యాబ్
హం హోంగే కామ్యాబ్ ఏక్ దిన్
మన్ మె హై విశ్వాస్
పూరా హై విశ్వాస్
హం హోంగే కామ్యాబ్ ఏక్ దిన్!
ఇది నాకు తెలిసి జానేభీదొ యారో సినిమాలో ఉపయోగించారు.

ఈ పాట అమెరికన్ సివిల్ రైట్స్ ఉద్యమంలో ప్రధాన పాత్ర వహించిందని తెలియడం వలన ఇది కింగుగారి సృష్టి అనుకున్నాను. ఇంకా చాలా పాతదిట. పాత దగ్గర ఇచ్చిన వికీ లింకులో దీన్ చరిత్ర అంతా ఉంది. వివిధ భారతీయ భాషల్లో ఈ పాట నేపథ్యం కూడా ఆ పేజిలో వివరించారు.
Bolloju Baba said…
థాంక్యూ బాస్
బొల్లోజు బాబా