Tuesday, May 29, 2007

మృదంగ బాల చంద్రుడు

మా వూళ్ళో పావని, శ్రీకాంత్ అనే యువ దంపతులున్నారు. ఇద్దరూ గాత్ర సంగీతంలోనూ వయొలిన్ వాద్యంలోనూ ఆరి తేరిన వాళ్ళు. మా వూళ్ళో వీరిద్దరూ విడివిడిగానూ, కలివిడిగానూ కచేరీలివ్వడం మామూలే. మాతృదేశం నించి ఎవరైనా విద్వాంసులు పక్కవాద్యం తోడు లేకుండా అమెరికా పర్యటనకి వచ్చిన సందర్భాల్లో మా వూళ్ళోనే కాదు, పక్క వూళ్ళకి కూడా వీరిని పక్కవాద్యం సహాయానికి ఆహ్వానించడం పరిపాటి. స్థానికంగా చాలా మంది పిల్లలకి సంగీత విద్యాభిక్ష పెడుతున్నారు.

ఈ పుణ్య దంపతులకి సుమారు రెండేళ్ళ క్రితం ఒక బాబు పుట్టాడు. సంగీత త్రిమూర్తులలో ఒకరైన శ్యామశాస్త్రులవారి ఆశీర్వచనంగా "శ్యామకృష్ణ" అని పేరు పెట్టుకున్నారు. భలే ముద్దుగా ఉంటాడు. ఊరికే ముద్దుగా ఉంటే వాడి గురించి ఇంత టపా రాయవలసిన అవసరమేముంది - అక్కడే ఉంది అసలు కథ.

మొన్నామధ్యన పావని గారు ఈ విడియోలు చూడండి అంటూ కొన్ని యూట్యూబు లంకెలు పంపారు. చూసి నిర్ఘాంత పోయాము, నేనూ మా ఆవిడా.

ఈ మృదంగ బాలచంద్రుడి అసాధారణ ప్రతిభ మన బ్లాగస్తులతో పంచుకోవాలని వారి అనుమతితో ఈ పరిచయం రాస్తున్నాను.

విఘ్నేశా తవ చరణం భజన
గోవింద గోపాల భజన
సీతమ్మ మాయమ్మ
తెలియలేరు రామ

మొన్న మా ఇంటికి వచ్చారు అందరూ. భోజనాలయ్యాక ఇక సంగీత కార్యక్రమం మొదలైంది. వాళ్ళమ్మ పాడుతుంటే ఈయన ఆ చిన్న డోలు మీదనే మృదంగం వాయింపు. భజనలు, కీర్తనలు, వివిధ తాళాలు మారిపోతున్నా ఏ మాత్రం తొణక్కుండా చిరునవ్వులు నవ్వుకుంటూ హాయిగా వాయించుకు పోతున్నాడు. మధ్య మధ్య పెద్ద విద్వాంసుడిలాగా తల పంకించడం, పాటలో తాళం గతి మారగానే దాన్ని సరిగ్గా అనుసరించడం, పాట ముగింపుని గుర్తించి దానికి తగినట్టు ముక్తాయించడం,
చివరకి కొసమెరుపు ఝళిపించి ఉవ్వెత్తున చెయ్యి పైకి విసరడం - చూసి
ఆనందించాల్సిందే.

ఈ విన్యాసాలకే మేం మురిసిపోతుంటే పావని గారు డోలు తీసి దాచేసి (లేకపోతే వాడు వాయించడం ఆపడు), సన్నగా ఒక రాగం ఆలాపన చేసి "కన్నా, ఇదేంటో చెప్పు" అన్నారు. వెంఠనే "మోజన" అన్నాడు. వాడికింకా మాటలు కూడా సరిగ్గా రాలేదు - చాలా హల్లులు పలకవు, రాగాల పేర్లు చెప్పేస్తున్నాడు! మేము దీనికే హాశ్చర్య పడి కూర్చోగా ఆమె ఒకదాని వెంట ఒకటి చిన్న ఆలాపనలు చెయ్యడం - పది సెకన్లు కూడా పాడి ఉండరు ఒక్కొక్కటీ - చిందోల, తోడి, తుద్ద తావేడి, తాంబోజి .. ఇలా ఒక డజను రాగాల్ని తప్పులేకుండా గుర్తు పట్టాడు. పాతిక దాకా గుర్తు పట్ట గలట్ట! నిండా రెండేళ్ళు లేవు!

అవును మరి .. ఉగ్గుపాలతో నేర్చుకోవడం కాదు, అమ్మ బొజ్జలో ఉన్నప్పుడే రక్తంలో సంగీతాన్ని నింపుకుని పుట్టాడు మా శ్యామ - ఆశ్చర్యమేముంది?

ఈ పిల్ల పిడుగు దినదిన ప్రవర్ధమానంగా ఎదిగి, సంగీతసాగరాన్ని అవుపోసన పట్టి సాక్షాత్తూ ఆ శ్యామశాస్త్రులంత వాడు కావాలని ఆశీర్వదిస్తూ .. ఆ తల్లిదండ్రుల్ని అభినందిస్తూ .. ఇప్పటికి శలవు.

Sunday, May 27, 2007

మనిషై పుట్టినందుకు ..

రావణుడి గురించి ఒక పిట్టకథ చదివాను ఎప్పుడో చిన్నప్పుడు. ఎక్కడ చదివానో ఇప్పుడు గుర్తులేదు - ఇది పురాణాల్లోది కాదనుకుంటా, సమకాలీన కథా రచయిత ఎవరైనా రాసి ఉండొచ్చు.

రామబాణంతో హతమైపోయినాక రావణుడు (పోనీ రావణుడి ఆత్మ) ఎక్కడికో రిటైరయ్యి విశ్రాంతిగా కూర్చున్నా డనుకుందాం. ఒక పత్రికావిలేఖరి వచ్చి, "రావణుడు గారూ, మీ ఫైల్యూర్ స్టోరీ చెప్పండీ" అనడిగా డనుకుందాం. ఇహ రావణుడు చెప్పుకొస్తాడు, తన జీవితంలో సాధించాలని అనుకున్న ఎన్నో పనులు కనీస ప్రయత్నం కూడా చెయ్యకుండా ఎలా మిగిలిపోయినయ్యో - లంకనించి కైలాసానికి సునాయాసంగా వెళ్ళే రహదారి నిర్మించడం, లంక చుట్టూ ఉన్న లవణ సముద్రాన్ని పాల సముద్రంగా మార్చెయ్యడం, ఎన్నో ఘనకార్యాలు సాధించిన రాక్షస ప్రముఖుల చరిత్రలతో పురాణాల్ని తిరగ రాయించడం - ఇలా ఒక పెద్ద లిస్టు చెప్పుకొస్తాడు. వీటిల్లో ఏ మహత్కార్యాన్ని సాధించడానికీ అతను ఒక చిన్న ప్రయత్నం కూడా చెయ్యలేదు - ఆ, రేపణ్ణించీ మొదలెడదాంలే అని వాయిదా వేశాడు. ఆ రేపు ఎప్పటికీ రానే లేదు. ఈ లోపల జీవితం ముగిసే పోయింది.

"శరీర మాద్యం ఖలు ధర్మ సాధనం" అని ఆర్యోక్తి. "మానవ తనువు దుర్లభ మనుచునెంచి పరమానంద మొంద"మని బోధించారు త్యాగరాజస్వామి. "మనిషై పుట్టినవాడు కారాదు మట్టిబొమ్మ" అని ఉద్బోధించాడు సినీకవి.
పదిమందికి ఉపయోగ పడేట్టు మనం చెయ్యదల్చుకున్న ఏ పనైనా ధర్మ సాధనమే! ఊరికే పరమానంద మొంది కూర్చుంటే సరిపోదు, దాన్ని సద్వినియోగం చెయ్యాలి. నేనూ, నా కుటుంబం అనే స్వార్ధ పరిధిని దాటి ఒక్క అడుగన్నా బయటికి వెయ్యాలి. ఊరికే మట్టిబొమ్మలా పెట్టిన చోటే కూర్చుంటే ఎవరికి ప్రయోజనం .. "కలుగ నేటికి, తల్లుల కడుపు చేటు!"

రావణుడు అసాధారణ శక్తిమంతుడే (అఫ్కోర్సు, మానవుడు కూడా కాదనుకోండి). మనందరమూ అంత శక్తిమంతులం కాకపోవచ్చు. ఏదో కథలో కొకు రాస్తాడు - సాధారణ వ్యక్తులకే అసాధారణంగా ప్రవర్తించడం చాతనవుతుందని. ఏవో కొన్ని శక్తియుక్తులైనా మనదగ్గిర ఉన్నాయి కద! పొద్దున లేచిన దగ్గిర్నించీ రాత్రి పడుకునే వరకూ (కొండొకచో రాత్రి నిద్రలో కూడా) మీకు ఎన్ని గొప్ప ఆలోచనలు వస్తుంటై? ఎప్పుడన్నా లెక్కపెట్టి చూశారా? ఒక ఆలోచన వచ్చి వెళ్ళిపోయిన తరవాత మళ్ళీ ఎప్పుడన్నా దాన్ని గుర్తు చేసుకున్నారా? ఒక చిన్న జేబు పుస్తకం దగ్గిర పెట్టుకుని ఇలాంటి ఆలోచనలు వచ్చినప్పుడల్లా పుస్తకంలో రాసుకోండి. ఇలా ఒక్క వారం చేసి చూడండి. ఆ లిస్టులోంచి కనీసం ఒక్క పనైనా మీరు సాధించగలరని నేను పందెం కాస్తాను.

చెయ్యాల్సింది ఈ పనే - ఎందుకంటే అది మీకిష్టమైన, మీకు తృప్తినిచ్చే పని కాబట్టి.
చెయ్యాల్సిన వ్యక్తి మీరే - ఎందుకంటే ఇంకెవరూ చెయ్యరు కాబట్టి.
చెయ్యాల్సిన సమయం - ఇప్పుడే!

Thursday, May 17, 2007

మా యింటి పండు

ఇవ్వాళ్ళ వంట అదుర్సే అదుర్స్!
ఒక్క stir fry కూర చేసిందండీ .. దాని రుచి మామూలు మాటల్లో చెప్పనలవి గాదు ..
ఆశువుగా ఆట వెలదిలో తప్ప. ఆరగించండి .. ఐ మీన్ ఆలకించండి.

ఆ. కూరగాయ ముక్క కూరిమి పర్ఫెక్టు (perfect)
రోస్టు తోఫు (roast tofu) కలియ టేస్టు ఫెస్టు (taste fest)
కోడిగుడ్డు వేయ గూర్మె టచ్చాయెనే (gourmet touch!)
బుజ్జి పండు వంట భువిని ఫస్టు!

పెళ్ళి కావలసిన, కొత్తగా పెళ్ళి అయిన కుర్రవాళ్ళకి (పెళ్ళయి చాన్నాళ్ళయినా ఈ పాఠం నేర్చుకోని కుర్రవాళ్ళకి కూడా) ఇదొక చిన్న పాఠం - జీవితంలో సుఖపడాలంటే ఇల్లాలి వంటని మెచ్చుకోండి.

Friday, May 11, 2007

ప్రాచీన భారతీయ విజ్ఞానం

వేదవిజ్ఞానం గురించి ఈ మధ్య మన బ్లాగుల్లో వాదనలూ , ప్రతివాదనలూ , ఆ రెంటినీ సమన్వయ పరిచే ప్రయత్నాలూ మాంఛి వాడిగా వేడిగా జరిగాయి.

ఈ చర్చల్లో అంతర్లీనంగా "ప్రాచీన భారత దేశంలో విజ్ఞానం కొందరికే పరిమితమైంది" అనే నిర్ధారణ నాకు కనిపించింది. అలా జరిగిందనడానికి చాలా తార్కాణాలు ఉన్నాయి కూడా. ఈ ఆలోచనలు నా బుర్రలో సజీవంగా మెదులుతుండగానే అంతర్జాలంలో ఏదో తీగ లాగితే డొంకంతా కదిలి చివరకి ఈమాటలో ఆచార్య వేమూరి వేంకటేశ్వరరావుగారు రాసిన వ్యాసంలో తేలాను. ఆ వ్యాసం గణితంలో సంఖ్యల గురించి. కానీ వ్యాసం మధ్యలో "వచనాన్ని కంఠస్తం చెయ్యడం కంటే పద్యాన్ని కంఠస్తం చెయ్యడం తేలిక" అన్న వేమూరి మేష్టారి ప్రవచనం నన్ను ఆకట్టుకుంది.

ఈ వాక్యంతో మొదలై సాగిన రెండు పేరాల్లో వేమూరి మేష్టారు ప్రతిపాదించిన ఆలోచనలు ప్రాచీన భారతీయ విజ్ఞానం గురించి ఆసక్తి ఉన్న మనవాళ్ళందరికీ పనికొస్తాయి అనిపించింది.

ఈ సందర్భంగా వేమూరి మేష్టారి గురించి రెండు పరిచయ వాక్యాలు చెప్పటం అసందర్భం కాదనుకుంటా. కేలిఫోర్నియా విశ్వవిద్యాలయం - డేవిస్ ప్రాంగణంలో వీరు కంప్యూటర్ శాస్త్ర విభాగంలో ఆచార్యులు. విజ్ఞాన శాస్త్ర విషయాలని తెలుగులో అందరికీ అర్ధమయ్యేట్టు రాయాలి ఆనే తపనతో విజ్ఞాన, జీవ, వైద్య శాస్త్ర విషయాలని విశదపరుస్తూ అనేక వ్యాసాలూ, కథలూ రాశారు. ఈమాట పత్రికలోనే వీరి రచనలు చాలా ఉన్నయ్యి. ఆంగ్ల-తెలుగు పారిభాషిక పదకోశాన్ని సంకలించారు. ఇది సాహితి.ఆర్గ్ లో లభ్యం. మాతృదేశంలో అభివృద్ధి, పర్యావరణ సంరక్షణ ధ్యేయాలుగా ఒక స్వఛ్ఛంద సంస్థని స్థాపించి నిర్వహిస్తున్నారు. ఇటీవల బెర్కిలీ విశ్వవిద్యాలయంలో తెలుగు బోధన ఏర్పాటు చెయ్యటంలో కీలకపాత్ర వహించారు.

అన్నిటికీ మించి నిరాడంబరులు, మృదుభాషి, సహృదయులు, సరసులు.

Thursday, May 10, 2007

కొందరు అమెరికన్లు

మైకెల్ ఛాంగ్ అతి పిన్న వయసులో టెన్నిస్ గ్రాండ్ స్లాం విజయం సాధించినప్పుడు అతని తాయివాన్ మూలాల గురించి మీరు అరిచి చెప్పారా?

ఇంద్రా నూయి పెప్సికొ అధినేతగా ఎంపికైనప్పుడు ఆమె భారతీయతని మీరు ఎలుగెత్తి చాటారా?

ఈ దేశం కోసం ఆయుధం పట్టి టేమీ డక్వర్త్ ఇరాక్ యుద్ధంలో తన రెండు కాళ్ళూ పోగొట్టుకున్న రోజున ఆమె థాయ్‌లాండ్లో పుట్టిపెరిగిందన్న విషయం మీకు గుర్తుచ్చిందా?

హైన్స్ వార్డ్ 2005 లో సూపర్ బౌల్ MVP అయినప్పుడూ, గ్రేస్ ఎనాటమీ టీవీ షోకి 2006లో సాండ్రా ఓ గోల్డెన్ గ్లోబ్ అవార్డు గెల్చుకున్నప్పుడూ, లిండ సూ పార్క్ 2002 లో తను రాసిన "ది సింగిల్ షార్డ్" అనే పిల్లల పుస్తకానికి న్యూబెరీ అవార్డు పొందినప్పుడూ -- వారి కొరియన్ వారసత్వం మీకు కనబళ్ళేదా?

కనబళ్ళేదు .. కనబడదు - ఎందుకంటే .. వాళ్ళు అమెరికన్లు .

అతని ఒంటరి తనాన్ని దుర్భరం చేసింది, అతని పైత్యానికి దోహదం చేసింది, అతని మనోవికారాల్ని వెర్రి తలలు వేయించింది, ఆఖరికి అతని చేతిలో అతి సులువుగా మారణాయుధాలుంచిందీ - అమెరికను సమాజమే. అవును.
సెయంగ్ హ్యూయి చో కూడా అమెరికనే.
ఎటొచ్చీ అది ఒప్పుకోవటానికి నిలువెత్తు నిజాయితీ, గుప్పెడు గుండె ధైర్యమూ కావాలి.

Tuesday, May 8, 2007

జీవన సంగీతం

పొద్దులో కల్హార కాంచిన వేసవి కలల్ని చూసినప్పుడు ఆశ పడ్డాను, మాక్కూడా ఆ వెచ్చదనంలో చిన్న వాటా దక్కుతుందేమోనని. తెల్లారి లేచి చూస్తే ప్రకృతి తెల్ల దుప్పటీ కప్పుకుంది నా ఆశ నిరాశ చేస్తూ.
అదీ సంగతి నెలరోజుల క్రితం!రాత్రికి రాత్రి పిల్లగాలి తెచ్చిన ఏదో రహస్య సమాచారం అందుకుని పొద్దు పొడిచేప్పటికల్లా మొక్కలూ పొదలూ చెట్లూ మొగ్గ తొడిగాయి. సుదీర్ఘ శిశిరపు భల్లూకప్పట్టులో మోళ్ళుగా బతుకులీడిచిన చెట్లన్నీ ఆ పట్టు విదిలించుకుని గర్వంగా తలలెత్తి పచ్చటి పట్టు చొక్కాలు తొడుక్కున్నాయి. ఈ హడావుడంతా చూసి మా సూర్యుడికీ వేడి పుట్టింది.

కాల గమనం అతి విచిత్రం కదా!
గడియారంలో క్షణాల ముల్లు కదలికే కాదు, సంజె పొద్దులో పడమటి సముద్రంలోకి ఇంకుతున్న సూర్యుడి చలనం, వేసవి రాత్రి గాలికూడా ఊపిరి బిగబట్టినప్పుడు
నిర్మలాకాశంలో నక్షత్ర గమనం, రోజు రోజుకీ పెరుగుతూ తరుగుతూ పదారు కళలు ప్రదర్శించే చంద్రుడి విన్యాసం .. చూసే దృష్టి ఉండాలి గాని మన కళ్ళముందే ఈ విశ్వం భరతనాట్యం ప్రదర్శిస్తూ ఉంటుంది విచిత్ర తాళ గతులతో.


రానున్న వెచ్చదనపు సూచన గాలిలో కొద్దిగా సోకగానే - చిగురులు వేసే తీరిక లేదు, ఆకులు అల్లలార్చే అవకాశం లేదు - అవన్నీ తరవాత - ఈ వసంతం క్షణికం - ఈ దినం, ఈ ఘడియ, ఈ క్షణమే నిజం - సృష్టి వలయం ముందుకి తిరగాలి, పునరుత్పత్తి జరగాలి - అందుకే ముందు మొగ్గ తొడగాలి, పువ్వు పూయాలి.నవవధువు మనసులో పొడచూపిన మధురోహలాగా తలెత్తిన మొగ్గ - క్షణ క్షణ ప్రవర్ధమానమవుతూ - రంగులు సంతరించుకుంటూ - సువాసనలు అలదుకుంటూ - తేనెలు నింపుకుంటూ - వైకుంఠ ద్వారాల్లాగా ఒక్కొక్క రేకునే విచ్చుకుంటూ - అస్పష్టమైన ఆ కదలికలో కోటి వీణల ప్రకంపనలు - వినే గుండె ఉండాలి గాని, ఇదే జీవన నాదం, ఇదే సృష్టి గానం, ఇదే సజీవ సంగీతం.

ఛెర్రీ, ఏపిల్, పీచ్, పియర్, డాగ్వుడ్, మాగ్నోలియా - వృక్షాలన్నీ ముస్తాబై అళికులాన్ని స్వాగతిస్తున్నాయి.

మా వూరికి ఆమని వచ్చింది.

Monday, May 7, 2007

మే గడి బాధితులకి ఓదార్పు