రావణుడి గురించి ఒక పిట్టకథ చదివాను ఎప్పుడో చిన్నప్పుడు. ఎక్కడ చదివానో ఇప్పుడు గుర్తులేదు - ఇది పురాణాల్లోది కాదనుకుంటా, సమకాలీన కథా రచయిత ఎవరైనా రాసి ఉండొచ్చు.
రామబాణంతో హతమైపోయినాక రావణుడు (పోనీ రావణుడి ఆత్మ) ఎక్కడికో రిటైరయ్యి విశ్రాంతిగా కూర్చున్నా డనుకుందాం. ఒక పత్రికావిలేఖరి వచ్చి, "రావణుడు గారూ, మీ ఫైల్యూర్ స్టోరీ చెప్పండీ" అనడిగా డనుకుందాం. ఇహ రావణుడు చెప్పుకొస్తాడు, తన జీవితంలో సాధించాలని అనుకున్న ఎన్నో పనులు కనీస ప్రయత్నం కూడా చెయ్యకుండా ఎలా మిగిలిపోయినయ్యో - లంకనించి కైలాసానికి సునాయాసంగా వెళ్ళే రహదారి నిర్మించడం, లంక చుట్టూ ఉన్న లవణ సముద్రాన్ని పాల సముద్రంగా మార్చెయ్యడం, ఎన్నో ఘనకార్యాలు సాధించిన రాక్షస ప్రముఖుల చరిత్రలతో పురాణాల్ని తిరగ రాయించడం - ఇలా ఒక పెద్ద లిస్టు చెప్పుకొస్తాడు. వీటిల్లో ఏ మహత్కార్యాన్ని సాధించడానికీ అతను ఒక చిన్న ప్రయత్నం కూడా చెయ్యలేదు - ఆ, రేపణ్ణించీ మొదలెడదాంలే అని వాయిదా వేశాడు. ఆ రేపు ఎప్పటికీ రానే లేదు. ఈ లోపల జీవితం ముగిసే పోయింది.
"శరీర మాద్యం ఖలు ధర్మ సాధనం" అని ఆర్యోక్తి. "మానవ తనువు దుర్లభ మనుచునెంచి పరమానంద మొంద"మని బోధించారు త్యాగరాజస్వామి. "మనిషై పుట్టినవాడు కారాదు మట్టిబొమ్మ" అని ఉద్బోధించాడు సినీకవి.
పదిమందికి ఉపయోగ పడేట్టు మనం చెయ్యదల్చుకున్న ఏ పనైనా ధర్మ సాధనమే! ఊరికే పరమానంద మొంది కూర్చుంటే సరిపోదు, దాన్ని సద్వినియోగం చెయ్యాలి. నేనూ, నా కుటుంబం అనే స్వార్ధ పరిధిని దాటి ఒక్క అడుగన్నా బయటికి వెయ్యాలి. ఊరికే మట్టిబొమ్మలా పెట్టిన చోటే కూర్చుంటే ఎవరికి ప్రయోజనం .. "కలుగ నేటికి, తల్లుల కడుపు చేటు!"
రావణుడు అసాధారణ శక్తిమంతుడే (అఫ్కోర్సు, మానవుడు కూడా కాదనుకోండి). మనందరమూ అంత శక్తిమంతులం కాకపోవచ్చు. ఏదో కథలో కొకు రాస్తాడు - సాధారణ వ్యక్తులకే అసాధారణంగా ప్రవర్తించడం చాతనవుతుందని. ఏవో కొన్ని శక్తియుక్తులైనా మనదగ్గిర ఉన్నాయి కద! పొద్దున లేచిన దగ్గిర్నించీ రాత్రి పడుకునే వరకూ (కొండొకచో రాత్రి నిద్రలో కూడా) మీకు ఎన్ని గొప్ప ఆలోచనలు వస్తుంటై? ఎప్పుడన్నా లెక్కపెట్టి చూశారా? ఒక ఆలోచన వచ్చి వెళ్ళిపోయిన తరవాత మళ్ళీ ఎప్పుడన్నా దాన్ని గుర్తు చేసుకున్నారా? ఒక చిన్న జేబు పుస్తకం దగ్గిర పెట్టుకుని ఇలాంటి ఆలోచనలు వచ్చినప్పుడల్లా పుస్తకంలో రాసుకోండి. ఇలా ఒక్క వారం చేసి చూడండి. ఆ లిస్టులోంచి కనీసం ఒక్క పనైనా మీరు సాధించగలరని నేను పందెం కాస్తాను.
చెయ్యాల్సింది ఈ పనే - ఎందుకంటే అది మీకిష్టమైన, మీకు తృప్తినిచ్చే పని కాబట్టి.
చెయ్యాల్సిన వ్యక్తి మీరే - ఎందుకంటే ఇంకెవరూ చెయ్యరు కాబట్టి.
చెయ్యాల్సిన సమయం - ఇప్పుడే!
చెయ్యాల్సిన వ్యక్తి మీరే - ఎందుకంటే ఇంకెవరూ చెయ్యరు కాబట్టి.
చెయ్యాల్సిన సమయం - ఇప్పుడే!
Comments
ధన్యవాదాలు.
చేసిన పనులు: బ్లాగులు చదవడం, కామెంట్లు రాయడం, అయితే గియితే బ్లాగ్యుద్దాలు చేయడం.
చేస్తున్న పనులు: బ్లాగులు చదవడం, కామెంట్లు రాయడం, అయితే గియితే బ్లాగ్యుద్దాలు చేయడం.
చేయాల్సిన పనులు: బ్లాగులు చదవడం, కామెంట్లు రాయడం, అయితే గియితే బ్లాగ్యుద్దాలు చేయడం.
--ప్రసాద్
http://blog.charasala.com
అన్నట్టు ఆయన నాకు ఇంకా కొన్ని నేర్పారు, మరికొన్ని నేర్పాలని ప్రయత్నించారు.