
పొద్దులో కల్హార కాంచిన
వేసవి కలల్ని చూసినప్పుడు ఆశ పడ్డాను, మాక్కూడా ఆ వెచ్చదనంలో చిన్న వాటా దక్కుతుందేమోనని. తెల్లారి లేచి చూస్తే ప్రకృతి తెల్ల దుప్పటీ కప్పుకుంది నా ఆశ నిరాశ చేస్తూ.
అదీ సంగతి నెలరోజుల క్రితం!

రాత్రికి రాత్రి పిల్లగాలి తెచ్చిన ఏదో రహస్య సమాచారం అందుకుని పొద్దు పొడిచేప్పటికల్లా మొక్కలూ పొదలూ చెట్లూ మొగ్గ తొడిగాయి. సుదీర్ఘ శిశిరపు భల్లూకప్పట్టులో మోళ్ళుగా బతుకులీడిచిన చెట్లన్నీ ఆ పట్టు విదిలించుకుని గర్వంగా తలలెత్తి పచ్చటి పట్టు చొక్కాలు తొడుక్కున్నాయి. ఈ హడావుడంతా చూసి మా సూర్యుడికీ వేడి పుట్టింది.
కాల గమనం అతి విచిత్రం కదా!

గడియారంలో క్షణాల ముల్లు కదలికే కాదు, సంజె పొద్దులో పడమటి సముద్రంలోకి ఇంకుతున్న సూర్యుడి చలనం, వేసవి రాత్రి గాలికూడా ఊపిరి బిగబట్టినప్పుడు
నిర్మలాకాశంలో నక్షత్ర గమనం, రోజు రోజుకీ పెరుగుతూ తరుగుతూ పదారు కళలు ప్రదర్శించే చంద్రుడి విన్యాసం .. చూసే దృష్టి ఉండాలి గాని మన కళ్ళముందే ఈ విశ్వం భరతనాట్యం ప్రదర్శిస్తూ ఉంటుంది విచిత్ర తాళ గతులతో.

రానున్న వెచ్చదనపు సూచన గాలిలో కొద్దిగా సోకగానే - చిగురులు వేసే తీరిక లేదు, ఆకులు అల్లలార్చే అవకాశం లేదు - అవన్నీ తరవాత - ఈ వసంతం క్షణికం - ఈ దినం, ఈ ఘడియ, ఈ క్షణమే నిజం - సృష్టి వలయం ముందుకి తిరగాలి, పునరుత్పత్తి జరగాలి - అందుకే ముందు మొగ్గ తొడగాలి, పువ్వు పూయాలి.

నవవధువు మనసులో పొడచూపిన మధురోహలాగా తలెత్తిన మొగ్గ - క్షణ క్షణ ప్రవర్ధమానమవుతూ - రంగులు సంతరించుకుంటూ - సువాసనలు అలదుకుంటూ - తేనెలు నింపుకుంటూ - వైకుంఠ ద్వారాల్లాగా ఒక్కొక్క రేకునే విచ్చుకుంటూ - అస్పష్టమైన ఆ కదలికలో కోటి వీణల ప్రకంపనలు - వినే గుండె ఉండాలి గాని, ఇదే జీవన నాదం, ఇదే సృష్టి గానం, ఇదే సజీవ సంగీతం.

ఛెర్రీ, ఏపిల్, పీచ్, పియర్, డాగ్వుడ్, మాగ్నోలియా - వృక్షాలన్నీ ముస్తాబై అళికులాన్ని స్వాగతిస్తున్నాయి.
మా వూరికి ఆమని వచ్చింది.
Comments
nA blog lO oka kotta haiku rAsAnu vIlaite chUDanDi. december taravAta ippuDE edaina rAyaDAniki spUrti vachchinATlugA vundi mari sambaram!
మీ స్వాగతం తో వసంతం ధన్యమైంది.
ఇలా మీ కవితోదయం తో ఆరంభమవ్వడం -
ఇంత దూరంలో ఉన్న మా అందరికీ ఆహ్లాదాన్ని పంచడం - ఆహా! ఏమి చిత్రం!
నిజంగానే పొద్దులో స్వాతి వ్యాసం వచ్చిన మర్నాడు ఇక్కడ మంచు పడింది .. కచ్చతో ఆ ఫొటో తీశాను - చూడండి మా ఊళ్ళో వసంతం ఎంతబావుందోనని వ్యంగ్య టపా రాయాలని. రాయలేదు. కొద్ది రోజుల తరవాత అకస్మాత్తుగా ఒక వారం రోజులు బాగా వెచ్చబడింది వాతావరణం - ఆహా, ఇదిగో వచ్చేసింది అనుకున్నాం. చూస్తుండగానే మళ్ళీ ఉష్ణోగ్రత నలభై (ఫారెన్ హీట్) లోకి పడిపోయింది :( ఆ పైన నింపాదిగా ముసలమ్మ మెట్లెక్కుతున్నట్టు .. వచ్చింది :)) ఆ విరిబోణులన్నీ మా ఇంటి దగ్గిర, పూల జడలు విరబోసుకున్నాయి.
@ రావుగారు - మీరు నిజంగా Ann Arbor వచ్చే అవకాశం ఉందా? తప్పక తెలియచెయ్యండి.
ముఖ్యంగా "కాల గమనం అతి విచిత్రం కదా!
గడియారంలో క్షణాల ముల్లు కదలికే కాదు, సంజె పొద్దులో పడమటి సముద్రంలోకి ఇంకుతున్న సూర్యుడి చలనం, వేసవి రాత్రి గాలికూడా ఊపిరి బిగబట్టినప్పుడు
నిర్మలాకాశంలో నక్షత్ర గమనం, రోజు రోజుకీ పెరుగుతూ తరుగుతూ పదారు కళలు ప్రదర్శించే చంద్రుడి విన్యాసం", మీ ఈ మాటలు నాకు మా నాయనమ్మని గుర్తుకు తెచ్చాయి. ఆమె చుక్క గమనాన్ని పట్టి టైము చెప్పేది.
నేనింకా AP లో ఉంటారనుకున్నా..
ఏదేమైనా,
నేను శీతాకాలం చికాగోలో ఉన్నా. ఎప్రిల్ మధ్యలో అట్లాంట వచ్చా. చికాగో లో ఉన్నప్పుడు అక్కడికింకా వసంతం రాలేదు, అట్లాంట వచ్చేసరికి వసంతం తీరిపోయింది ఇక్కడ. మీ కవిత లో ఈ ఏడు మిస్సైన వసంతం అనుభవించా.
మహా పండితులు మల్లంపల్లి సోమశేఖరశర్మగారు నాకు దూరపు చుట్టాలవుతారు.
నా విషయం అలా ఉంచితే. మీ జీవన సంగీతం చాలా బవుందండోయ్. మీ సహిత్యానికి వేరే ప్రశంసలు అఖ్ఖర లేదు. ఇలా చిత్రాలు అమర్చి బ్లాగ్ రాయడం నాకు చాలా ఇష్టం.
@ రాధికా - ఆ మాట మీరు ముందే చెబితే ఇది మార్చిలోనే రాసేవాణ్ణి :-)
@ చేతన - పూల వైభవం అయ్యేపోయింది. వచ్చే ఏడు చూడాలనుకుంటే వసంత విరామం (spring break) కి మా వూరు రావచ్చు.
@రాక్.అ. - సంతోషం. నీ అద్దం పద్యం బాగుంది. ఇప్పుడే వ్యాఖ్య పెట్టాను.
నారాయణ స్వామి గారు,మీరన్నట్లు
"నవవధువు మనసులో పొడచూపిన మధురోహలాగా తలెత్తిన మొగ్గ - క్షణ క్షణ ప్రవర్ధమానమవుతూ - రంగులు సంతరించుకుంటూ - సువాసనలు అలదుకుంటూ - తేనెలు నింపుకుంటూ - వైకుంఠ ద్వారాల్లాగా ఒక్కొక్క రేకునే విచ్చుకుంటూ - అస్పష్టమైన ఆ కదలికలో కోటి వీణల ప్రకంపనలు - వినే గుండె ఉండాలి గాని, ఇదే జీవన నాదం, ఇదే సృష్టి గానం, ఇదే సజీవ సంగీతం".....
అవును. చూసి అనుభవించి పలవరించినపుడే ప్రకృతీ పులకరిస్తున్న భావన అద్భుతంగా మీ పాళీ ఒలికించింది ....అద్భుతం ...కొత్తపాళీ జి....శ్రేయోభిలాషి ...నూతక్కిరాఘవేంద్ర రావు (కనకాంబరం)