Monday, November 30, 2009

పుస్తకావిష్కరణ సభకి ఆహ్వానం

పుస్తకావిష్కరణ సభకి ఆహ్వానం

ఏవిటి విషయం: నా కథల మొదటి సంపుటిని ఆవిష్కరిస్తున్నాం

ఎక్కడ: కృష్ణాజిల్లా స్వాతంత్ర్య సమరయోధుల సంఘ భవనం, బందరు లాకులు (బస్టాండు దగ్గరే),విజయవాడ

ఎప్పుడు: డిసెంబరు 6 ఆదివారం సాయంత్రం 5 గంటలకి

ఇంకా ఏవన్నా వివరాలు కావాలంటే విజయవాడ నవోదయ వారిని అడగొచ్చు.
ఫోను: 866-257-3500
ఈమెయిలు: vjw_booklink AT yahoo.co.in

Monday, November 16, 2009

కబుర్లు - నవంబరు 16

వెనక్కి తిరిగి చూసుకుంటే ఈ వారంవారం కబుర్లు మొదలెట్టి ఏడాదైపోయింది. 52 కాదుగానీ ముప్ఫై రెండో ముప్ఫైమూడో లెక్కకొచ్చినాయి ఈ యేడాదిలోనూ .. సుమారు అరవై శాతం .. పర్లేదు.

మొన్న టెక్సస్ ఫోర్ట్ హుడ్‌లో జరిగిన ఘాతుక చర్య తరవాత మరోసారి బుర్ర స్తంభించింది. ఒకటి రెండేళ్ళకోసారి ఇలాంటి ఘాతుకాలు జరిగి జరిగి బుర్ర మొత్తం, ఇక స్పందన అనేది మిగలకుండా, శాశ్వతంగా స్తంభించిన స్థితిలో ఉండిపోయేలా .. పదేళ్ళ కిందట కోలంబైన్ .. మొన్నటికి మొన్న వర్జీనియా టెక్, ఇప్పుడిది, మధ్యమధ్య చిన్నా చితకా సంఘటనలు. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడల్లా మీడియా తైతక్కలు చిరాకు పుట్టిస్తున్నాయి. విర్జీనియా సంఘటన జరిగినప్పుడు వాళ్ళ కథనం .. కాల్పులు జరిపినతను కొరియెన్ సంతతికి చెందిన అమెరికను. అలాగే ఈ ఫోర్ట్ హుడ్ సంఘటనలో వారి కథనం .. ముస్లిము అయిన అమెరికను. అతను ముస్లిము అవడం వల్ల ఈ పని చేశాడా, లేక మతి స్థిమితం లేక చేశాడా? పైగా అతను వర్జీన్యాటెక్ లో చదివాట్ట .. ఇదిగో పులంటే అదిగో తోక అన్నట్టుగా ఉంటుందిక ఆ కథనం.

ఏదేమైనా, ప్రస్తుత అమెరికను సమాజం ఒక సంక్లిష్టమైన సంక్షోభం దిశగా పరిగెత్తుతున్నది. ప్రతీ విషయాన్నీ ఏకీలుకాకీలుగా విడగొట్టి పరిశీలించే పరిశీలకులకీ, వారి సలహాల మీద ఆధార పడే పాలకులకీ, ఈ సంఘ్టనలు భద్రతా సమస్యలుగాను, దేశ ప్రజల్ని పట్టి పిండుతున్న ఆర్ధిక సమస్య కేవలం వాలువీధి సమస్యలాగాను కనబడుతుంటే అది చూపు మందగించిన హ్రస్వదృష్టి తప్ప మరోటి కాదు. రక్తమజ్జలో పట్టి దేహమంతా వ్యాపిస్తున్న చీడని గుర్తించుకోలేక అక్కడో పట్టీ, ఇక్కడో కట్టూ వేసుకుంటూ వైద్యం చెయ్య చూస్తున్నారు.

మిషిగన్ రాష్ట్రంలో స్థానిక ఆర్ధిక పరిస్థితి మహాఘోరంగా పరిణమించింది. ఆహారం, రాబోయే చలికాలాన్ని తట్టుకునేందుకు వెచ్చదనం వంటి కనీసావసరాల కోసం ప్రజలు ఎప్పటికంటే పెద్దసంఖ్యలో ప్రభుత్వ సహాయంకోసం ఎదురుచూశ్తున్న పరిస్థితుల్లో, బడ్జెటు బేలెన్సు చెయ్యాలనీ, కొత్తపన్నులు వెయ్యకూడదనీ, ఇంకేదో పిండాకూడనీ ఇరు రాజకీయ పక్షాలూ బిర్రబిగుసుకుని కూర్చుని, ఉన్న పరిస్థితిని ఇంకా అధ్వాన్నం చేస్తున్నాయి. ఈసారి ఎన్నికల్లో అసలు మూడో ప్రత్యామ్నాయం ఒకటుండాలి, లండీ వెధవల్లారా, మీ ఇద్దర్నీ ఎన్నుకోము, అసలు ఒక నాలుగేళ్ళ పాటు రాష్ట్రానికి గవర్నరూ, అసెంబ్లీ రెండూ లేకుండా వుంటే అందరికీ సుఖంగా ఉంటుంది, మీ అందర్నీ (ఈ రాష్టరంలో ఉద్యోగాలు కోల్పోయిన లక్షలాది ప్రజల్లాగే) మీమీ ఉద్యోగాల్నించి తొలగిస్తున్నాం. పోండి, పోయి అనెంప్లాయ్‌మెంటు ఆఫీసులో నమోదు చేసుకోండి అని ఇంటికి పంపించాలి వెధవల్ని.

మొన్న స్నేహితులొకరు ఆసక్తికరమైన ప్రతిపాదన చేశారు - బ్లాగుల్లో నాస్టాల్జియా, హాస్యం, ఇలాంటి టైంపాస్, ఫీల్‌గుడ్ టాపిక్కులకి వచ్చిన స్పందన, ఏదైనా సీరియస్ విషయం కూలంకషంగా చర్చించడానికి ప్రయత్నించే టపాలకి అస్సలు రాదు అని. నాకు బ్లాగులంటే ఉన్న ఇష్టంతో యధావిధిగా నేను బ్లాగుల తరపున వాదించబోయాను. కానీ కొంచెం నింపాదిగా ఆలోచిస్తే వారు చెప్పింది నిజమే అనిపించింది. తరచూ రాస్తుండే వందలాది బ్లాగర్లలో, ఏమాత్రమైనా సీరియస్ అని చెప్పుకోగల బ్లాగులు పదో పన్నెండో ఉన్నాయి. వాటిలోకూడా, రాజకీయం, లేదా సమకాలీన విషయాల మీద రాసే బ్లాగుల్లో హాస్యం, వ్యంగ్యం ఫలించినంతగా విశ్లేషణ ఆలోచన కనబడవు. ఏదన్నా విషయాన్ని గురించి ఎవరన్నా కొంచెం లోతైన ఆలోచన చెయ్యబూనుకున్నా, అత్యవసరంగా అప్పటికి ఆ టాపిక్కు గొప్ప కాంట్రవస్రీ అయి కూర్చుంటుంది. దానికి వచ్చే వ్యాఖ్యలు, వాదోపవాదాలు, అతిత్వరగా ఎకసెక్కాల్లోకి, ఎత్తిపొడుపుల్లోకి, ఆఖరికి మూతి విరుపుల్లోకి దిగజారిపోతాయి. వుట్టినా కబుర్లు చెప్పుకుందాం అని కాకుండా, ఏమన్నా కాస్త విషయం మాట్లాడదాం, చర్చిద్దాం అని బ్లాగుల్లోకి వచ్చేవారికి ఏం ఉత్సాహం మిగుల్తుంది ఇలాంటి పరిస్థితుల్లో? ఆలోచించాల్సిన విషయమే.

మొన్న జరిగిన స్టార్నైట్లో సినీకవి జొన్నవిత్తుల రామలింగేశ్వర్రావుగారు తెలుగువాణ్ణుద్దేశించి మాతృభాషని పట్టించుకోనాయనా అని దండకం రూపంలో ఉద్బోధించారు. అద్భుతంగా ఉంది. నాకు పాడ్డం చేతగాదు గానీ దీని అచ్చుప్రతి సంపాయించి భట్టి వేసే ప్రయత్నం చేస్తాను. దీని ప్రతి ఎవరికన్నా అందుబాటులో ఉంటే దయచేసి నాకో మాట చెప్పండి. మావూరి బ్లాగరి, బహుముఖ ప్రజ్ఞాశాలి జేప్స్ ఒకటిరెండేళ్ల కిందట రూపొందించిన ఈ లఘుచిత్రం మొన్ననే నా దృష్టికి వచ్చింది. మీరూ ఓ లుక్కెయ్యండి.

Friday, November 13, 2009

సరికొత్త సర్వే .. మీ అమూల్యాభిప్రాయం తెలుపండి
తమిళ నటుడు నాజర్ కొత్తపాళీకి ఏమవుతాడు?
అ) అన్న
ఆ) తమ్ముడు
ఇ) రెండువేళ్ళు విడిచిన మేనత్త మరిది భార్య తోటికోడలి అత్తగారికి అన్నయ్య
ఈ) ఏమీకాడు
ఉ) ఈ టపా రాసిన వాళ్ళకి పన్లేదు, ఈ సర్వేలో పాల్గొంటున్న వాళ్ళకి అంతకన్నా పన్లేదు.

మీ సమాధానాన్ని టైప్ చేసి, నాజర్ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి కొపా అని టైప్ చేసి 2045 కి ఎస్సెమ్మెస్ చెయ్యండి.

షరతులు:
అమూల్యాభిప్రాయాలు మాత్రమే పంపవలెను. ఉత్తుత్తి అభిప్రాయాలు స్వీకరించబడవు.
పై ఫొటోల్లో ఎవరెవరో తెలియని వారు ఈ సర్వేలో పాల్గొనేందుకు అనర్హులు.

Thursday, November 12, 2009

రుచుల తారతమ్యం

నేనెవరినన్నా ఇన్సల్టు చెయ్యాలంటే వాళ్ళ టేస్టుని యెద్దేవాచేస్తానని సెలవిచ్చాడు మా రాకేస్వరుడు ఈ మధ్యనే ఏదో బ్లాగులో కామెంటుతూ. యేమి సత్యాన్ని ఆవిష్కరించినావయా, నువ్వు రాకు! అనుకున్నాను.

మీరే చూడండి. యెవర్నన్నా కెలకాలన్నా, కోపం తెప్పించాలన్నా ఇంతకన్నా మంచిమార్గం మరోటి లేదు. తన ఫేవరెట్ హీరోనో, బాగా నచ్చిన పాటనో యెవరన్నా వెక్కిరిస్తే లావాలా ఉప్పొంగుతుంది కోపం మనిషికి, తనని యెలాంటి దుర్భాషలాడినా రానిది.

ఈ టేష్టు, రుచి, అభిరుచి అనేవున్నాయి చూశారూ, మహా ఇబ్బంది వీటితో. ఒహపక్కన విపులాచ పృథ్వీ, లోకో భిన్న రుచిః అని సంస్కృతంలోనూ, మరొపక్కన డిగుస్టిబస్ నానెస్ట్ డిస్పుటాండం అని లాటినులోనూ నొక్కి వక్కాణించారు గదా. దీన్నే అచ్చ తెలుగులో పుర్రెకో బుద్ధీ, జిహ్వకోరుచీ అని అనువదించి మరీ చెప్పారాయె, మనలాంటి మందమతులకి అర్ధం కాదేమోనని. ఐనా సరే, మనం హేప్పీగా బీపీ పెంచేస్కుని రెచ్చిపోతుంటాం, వాళ్ళ టేష్టంతేలే అని చేతులు దులుపుకుని పోవాల్సిన చోటకూడా.

ఒకరు యిప్పటికింకా నావయసు నిండా పదహారే అని మురుసుకుంటే మరొకరు ఓంకారనాదాను సంధానమౌగానమే అని పరవశులవుతుంటారు. ఒకరు మధుబాబు షాడో అడుగుల్లో అడుగులేస్తుంటే మరొకరు రావిశాస్త్రి వియత్నాం విమలతో భేటీ అవుతుంటారు. ఒకరికి డిస్కో మరొకరికి భామాకలాపం, ఒకరికి రాంగోపాల వర్మ మరొకరికి సత్యజిత్ రే, ఒకరికి విశ్వనాథ మరొకరికి శ్రీశ్రీ .. వీరిని చూసి వారు నొసలు చిట్లించడం, వారిని చూసి వీరు జాలిపడ్డం. ఒకరెక్కువా? మరొకరు తక్కువా? రుచుల్లో ఎక్కువ తక్కువలా? తర తమ భేదాలా? ముమైత్ ఖాన్ ఐటం పాట చూసి పదహారేళ్ళ కుర్రాడు పొందే ఆనందం, వాడి తాత కచేరీలో నేదునూరి గారు పాడుతున్న త్యాగరాజకృతి వింటు పొందే ఆనందం కంటే ఏవిధంగా భిన్నం? ఏవరిదెక్కువ స్థాయి ఆనందమో తూకమేసి చెప్పగలవారెవ్వరు?

పోనీ ఒకేకళారూపాన్ని ఆస్వాదించడంలోనూ .. ఒకచోట భాగవత కథాగానం జరుగుతోంది. యెవరో మంచి గొంతున్న పౌరాణికులు శ్రావ్యంగా రాగయుక్తంగా చదువుతున్నారు పోతన పద్యాల్ని. "మందార మకరంద మాధుర్యమున దేలు మధుపమ్ము వోవునే మదనములకు". ఓ బామ్మగారు ఆ గాత్ర మాధుర్యానికే పరవశురాలవుతున్నది. ఒక తాతగారు అందులోని భక్తిభావానికి పులకితులవుతున్నారు. ఒక యువకుడు పద్యంలోని శబ్దాలంకారాలకి సమ్మోహితుడవుతున్నాడు. ఒక పండితుడు రసాస్వాదనలో మైమరిచాడు. ఒక యోగి అందులోని మార్మిక తత్త్వజ్ఞానానికి దాసోహమంటున్నాడు. ఇందులో ఎవరిది హెచ్చు స్థాయి ఆనందం? రాగతాళాలు యేమీ తెలియకపోయినా, బాలమురళీ గొంతు వినబడితేనే పరవశించిపోయే వారున్నారు. ఆలాపన వినగానే రాగాన్ని పోల్చుకుని, ఆహా వోహో అని ఆనందించే వారున్నారు, అంటకంటే విశేషమేమీ వారికి అంతుపట్టక పోయినా. వారి చెవులకి బాలమురళి పాడినా నేదునూరి పాడినా మోహన రాగమంటే మోహన రాగమే. అలాక్కాదు, రాగాన్ని విశదీకరించడంలో, గాయకుడు ఎలాంటి గమకాలు వాడాడు, ఏ ప్రయోగం బాగా ఫలించింది, ఏ ప్రయోగం కొత్తగా ఉంది, అని తెలిసి అనుభవించే శ్రోత ఉన్నాడు. ముగ్గురూ అదే సంగీతాన్ని అనుభవించి ఆనందిస్తున్నారు. మరి ఆ స్థాయిలో తేడాలేదూ?

Tuesday, November 10, 2009

నేను నటన జంధ్యాల గౌరీనాథశాస్త్రి

అప్పుడెప్పుడో నాగురించి నేను పువ్వు పుట్టగనే పరిమళించును అని చెప్పుకున్నా.
చాలా విషయాల్లో ఇది నిజమేకూడాను :)
కానీ నటన విషయంలో కాదు!
మన బ్లాగర్లలో చాలా మంది చిన్నప్పుడే చాలా కళలు తేరినవారున్నారు. పాఠశాల వార్షికోత్సవాలకి యేకపాత్రాభినయాలు చేసిన వారు, రేడీయో బాలానందంలో పాటలు పాడినవారు, బడులలో, కాలేజిలో, ఇతరత్రా, తమ ఆటపాటలతో అలరించినవారూ చాలా మందె వున్నారు.

కానీ నామట్టుకి నాకు యెంటెక్కుకి కాన్పూరుకెళ్ళేదాకా ఈ స్టేజి పురుగు కుట్టలేదు. కాన్పూరులోనైనా, చెట్లులేనిచోట ఆవదం చెట్టే మహావృక్షమనే సామెత మీకుగుర్తొస్తే మీతప్పేంలేదు. యేదేవైనా అక్కడున్న రెండేళ్ళూ అక్కడి తెలుగు సమితి వేదికని ఏకఛ్ఛత్రాధిపత్యంగా పరిపాలించినాక ఫిలడెల్ఫియా వచ్చిపడ్డాను.

యిక్కడొక చిన్న పిట్టకథ చెప్పుకోవాలి. ముందస్తుగా శిరాకదంబం వారందిస్తున్న ఈ దృశ్యకాన్ని తిలకించండి.
ఇది నాగయ్య నటించిన భక్త పోతన సినిమాలో ఒకదృశ్యం. కవిసార్వభౌముడు శ్రీనాథుని పాత్ర పోషించినది జంధ్యాల గౌరీనాథ శాస్త్రిగారని గొప్ప నటుడు. మా అమ్మమ్మ వేపునించి వీరితో యేదో బీరకాయపీచు చుట్టరికం కూడా ఉన్నట్టు మాఅమ్మ చెబుతుండేది. ఆయన స్వయంగా బాగా ఆస్తిపరుడు. డబ్బుకోసమని ఒకపని చెయ్యవలసిన అవసరం ఆయనకి లేదు. అందుకని, తన ప్రవృత్తి రీత్యా నాటకాలని సినిమాలని, అదీను తనకి నచ్చిన నప్పిన పాత్ర అయితేనే చేస్తూండేవారు. పెద్దమనుషులు సినిమాలో మ్యునిసిపల్ చెయిర్మన్ పాత్రని చాలా సమర్ధవంతంగా పోషించారు. నిలువెత్తు విగ్రహం, కొనదేరిన ముక్కు, తీర్చిదిద్దినట్టున్న ముఖం, పెద్దపెద్ద కళ్ళు, వొంటితీరులో ఒక సహజమైన రాజసం ఈయన సొత్తు.

మళ్ళీ అసలు కథకొద్దాం. ఫిలడెల్ఫియాలో మాకో పెద్దాయనున్నారు కోటపాటి సాంబశివరావుగారని. ఈయనకి మనతెలుగు గడ్డమీద, చింతామణి హరిశ్చంద్ర ఇత్యాది నాటకాల్లో నటించిన అనుభవముంది. పద్యాలు గుక్కతిప్పుకోకుండా పాడేవారు. ఇదిలాగుండగా, దగ్గర్లో న్యూయార్కునగరంలో తానా మహోత్సవం జరగబోతోందని వార్తలొచ్చాయి. మా వాళ్ళంతా సాంబశివరావుగార్ని .. హబ్బే మీ టేలెంటుకి మన చిన్నస్టేజి సరిపోద్సార్, తానా స్టేజిమీద చూపించాల్సిందే మీప్రతాపం అని యెగదోశారు. ఆయన పాపం నిజమే అనేసుకుని, నన్నూ, సీత అనే ఇంకో స్నేహితురాల్నీ కూడగట్టి, చింతామణి నాటకంలోని మొదటి దృశ్యం ప్రాక్టీసు చేయించారు. నాకు ఛస్తే పద్యం రాగయుక్తంగా పాడ్డం చేతగాదు. కానీ పాపం సాంబశివరావుగారు పనిగట్టుకుని నేనుండే ఎపార్టుమెంటుకొచ్చి మరీ నన్ను తోమి తోమి నాపాత్ర పాడాల్సిన ఒక్కపద్యం తర్ఫీదిచ్చారు.

నేను వేస్తున్న పాత్ర బిల్వమంగళుడి స్నేహితుడైన ఒక శ్రోత్రియ బ్రాహ్మణుడి వేషం (పాత్ర పేరు నాకిప్పుడు గుర్తులేదు). ఒకరోజు ఎందుకైనా మంచిదని పాత్రకి తగిన వేషం అంతా తయారుచేసుకుని అద్దంలో చూసుకుంటే మీసాల్తోనూ, తలకట్టు (క్రాపింగు)తోనూ ఆ రూపం ఆషాడభూతిలా ఉందిగానీ శ్రోత్రియ బ్రాహ్మణుడిలా లేదనిపించింది. అందుకని ప్రదర్శనకి మీసం తీసెయ్యడానికి నిశ్చయించాను. తలకి బోడిగుండులా కనబడే రబ్బరు తొడుగు సంపాయించి దానికి గోష్పాదమంత పిలకతోసహా తయారుగా ఉంచాను.

తీరా మా ప్రదర్శన శుభదినం రానే వచ్చింది. ఆ మహోత్సవాల్లో ఆఖరి రోజు. మా ప్రదర్శన ముఖ్యవేదిక మీద, సాయంత్రం ఎనిమిదింటికి .. అంటే ప్రైం టైమన్న మాట. మా సాంబశివరావుగారి ఉత్సాహానికి హద్దులేకుండా ఉంది. మేము సభాస్థలిని చేరుకుని, ఒక పచ్చగది (గ్రీన్రూము) వెతుక్కుని వేషధారణ మొదలు పెట్టాము. ఈ మహోత్సవాలకి ఇండియానించి దిగుమతయ్యి, తమగోడు ఎవరికీ పట్టక, కారిడార్లలో కాలుగాలిన పిల్లుల్లా తిరుగుతున్న ఒకబృందం మమ్మల్ని గమనించి, ఇక్కడేదో నాటకం తయారీ జరుగుతోందే అంటూ వచ్చి పలకరించారు. చింతామణి వేస్తున్ణామని తెలిసి మా సాంబశివరావుగారి ధైర్యాన్ని మెచ్చుకున్నారు. అంతే మా సాంబశివరావుగారు గాల్లో ఎగురుతున్నారు. వారిలో ఇద్దరు నా వేషధారణలో చాలా సాయం చేశారు. నా వేషం పూర్తయ్యాక వారిలో ఒక పెద్దాయన నన్ను కిందినించి పైదాకా తేరిపార చూసి, మీరు చాలా నాటకాలు వేశారా అనడిగారు. అబ్బే లేదండీ, నిజంగా నాటకం అంటూ వెయ్యడం ఇదే మొదలు అన్నాను. అలాగా, వేషం మాత్రం బ్రహ్మాండంగా కుదిరింది, పోతన సినిమాలో శ్రీనాథుడిలా ఉన్నారు అని ప్రశంసించారు. నేనూ మా సాంబశివరావుగారితో చేరి గాల్లో ఎగురుతున్నాను.

మా ప్రదర్శనకి టైమయిందని వేదిక వెనక్కి చేరుకున్నాం. మా ముందు జరుగుతున్న ప్రోగ్రాము యెంతకీ అవదు, వేచి వేచి, చూచి చూచి, కాళ్ళు పీకుతున్నాయి అనుకొనేంతలో స్టేజిమేనేజరొచ్చి, చింతామణి వాళ్ళెవరండీ అని కేకపెట్టాడు. మేమే అన్నాం. మీరే నెక్స్టు అన్నాడు. తెలుసు అన్నాం. మీ ప్రోగ్రామెంతసేపు అన్నాడు మాకేసి అనుమానంగా చూస్తూ. సాంబశివరావుగారు ఆల్రెడీ బిల్వమంగళుడిలో పరకాయ ప్రవేశం చేసేశారు - ఇలాంటి తుఛ్ఛమైన సంభాషణలు పట్టించుకునే స్థితిలో లేరు. ఆయన చెవుల్లో అప్పటికే ప్రేక్షకులు కొట్టే వన్స్ మోర్లు గింగురు మంటున్నాయి. అందుకని నేనే బాధ్యత తీసుకుని, ఆ యెంతసేపండీ, పదిహేన్నిమిషాలు అన్నా. ఐదునిమిషాల్లో ముగించండి అని చెప్పి ఆయన హడావుడిగా వెళ్ళిపోయాడు.

వెనక్కి తిరిగి చూసేప్పటికి స్టేజిమీద తెర తీసి వుంది. స్టేజి మధ్యలో కుర్చీల్లో సాంబశివరావుగారూ, సీతా కూర్చుని ఉన్నారు. సాంబశివరావుగారు మొదటి పద్యం అందుకున్నారు. నేను పక్కన వింగ్స్ లో నుంచుని చూస్తున్నా. ఎవరో నా భుజం గోకారు. స్టేజి మేనేజరు. ఇంకా ఎంతసేపండీ అన్నాడు అసహనంగా. అప్పటికి సరిగ్గా ఒక్క నిమిషం అయింది మావాళ్ళు స్టేజెక్కి. ఇదింకా మొదటి పద్యమేనండీ. ఇంకా నాలుగు పద్యాలున్నాయి అన్నా. ఇంతలో మా పెద్దాయన పద్యం ముగించి రాగాలాపన చేస్తున్నారు. నాపక్కన స్టెజి మేనేజరు బద్దలవడానికి సిద్ధంగా ఉన్న అగ్నిపర్వతంలాగున్నాడు. ఎలాగైతేనేం మొదటి పద్యం, రాగాలాపనతో సహా పూర్తయింది. సీత తన డయలాగు చెప్పబోతోంది. ఇంతలో ఆడియన్సులోంచి ఎవరో తుంటరి వన్స్ మోర్ అని అరవనే అరిచాడు. మా సాంబశివరావుగారు అలా కూచున్న కుర్చీ పాళంగా ఆరంగుళాలు గాల్లోకి లేవడం స్పష్టంగా కనబడింది. ఆయన సీత డయలాగుని మధ్యలో తుంచేసి అదే పద్యం మళ్ళీ ఎత్తుకున్నారు. స్టేజిమేనేజరుకి ఇది గోరుచుట్టుమీద రోకటిపోటులాగ తగిలింది. తెరలు లాగెయ్యండి అని ఆజ్ఞ ఇచ్చాడు. నేనేదో చెయ్యాలి గబుక్కుని. పద్యం మధ్యలో తెరపడిపోతే సాంబశివరావుగారు భరించలేరు .. నాకు తగిలించిన క్లిపాన్ మైకు ఆన్ చేసుకుని గాఠిగా నా పద్యం పాడుకుంటూ ఎంటరైపోయాను. ఆ కంగారులో అపశ్రుతిలో యెత్తుకున్నానని వేరే చెప్పక్కర్లేదు. సాంబశివరావుగారు బ్రూటస్ వెన్నుపోటు తిన్న జూలియస్సీజర్లా నిర్ఘాంతపోయి నాకేసి చూస్తున్నారు. సీత అంతకు మునుపే స్పృహతప్ఫే స్థితిలో ఉంది. అదే అదనుగా స్టేజిమేనేజరు తెరలాగేశాడు.

కథ కంచికి. మేం ఫిలడెల్ఫియాకి.

తనకళకి జరిగిన అవమానాన్నించి తేరుకోడానికి సాంబశివరావుగారికి చాలా కాలం పట్టింది. కానీ నా వేషం చూసి ఆ పెద్దాయనెవరో గౌరీనాథశాస్త్రిగారి లాగున్నావని మెచ్చినందుకు నేను మాత్రం ఇప్పటికీ మురుసుకుంటూనే వుంటా!

Monday, November 9, 2009

కబుర్లు నవంబరు 9

హమ్మయ్య. హౌస్సభ్యులు ముక్కీ మూలిగీ మొత్తానికొక ఆరోగ్య వ్యవస్థ బిల్లుని గెలిపించారు. అనుకున్నట్టుగానే రిపబ్లికన్లందరూ (ఒకరు తప్ప) దీనికి వోటెయ్యలేదు, కొంతమంది డెమోక్రాట్లుకూడా. సుమారుగా యాభయ్యేళ్ళుగా జరుగుతున్న ఈ వ్యవస్థా ఉద్ధరణ ప్రయత్నంలో చేసిన తొలి యత్నంతోనే సంపూర్ణ విజయం సాధిస్తామని అనుకోవలసిన పనిలేదు. ఎందుకంటే ఏ సూత్రాల పరిణామాలు నిజంగా ఎలా తయారవుతాయో కూచున్న చోటునుండి వీళ్ళెవరూ పసిగట్టలేరు. సరైనదిశగా ఒక అడుగైనా వెయ్యడం ముందు ముఖ్యం. ఆ అడుగు నిన్న పడింది. అందుకు సంతోషం. ఇక సెనేటుతో బేరసారాలు యెలా జరుగుతాయో చూడాలి.

ఒబామా అధ్యక్ష పదవికి యెన్నికయ్యి ఏడాదయింది గతవారంలో, తాను పదవి పగ్గాలు చేబట్టింది జనవరిలో అయినా. పైగా మొన్న మంగళారం రాష్ట్ర గవర్నర్ల పదవులకి జరిగిన రెండు ఎన్నికల్లో రిపబ్లికన్లు గెలవడంతో ఒబామా హవా తగ్గిపోయిందనీ, అతని యెజెండాని ప్రజలు వ్యతిరేకిస్తున్నారనీ ప్రచారం మొదలైపోయింది. ఒబామా అతన ప్రచారంలో చేసిన వాగ్దానాల మీద అతను ఈ యేడాదిలో సాధించి చూపించినది యిప్పటికి తక్కువే అయినా, అన్నిరకాల అభిప్రాయ సేకరణలోనూ దేశవ్యాప్తంగా ప్రజాభిప్రాయం అతనికి అనుకూలంగానే ఉంది. కానీ ఈ సహనం ఇంకా యెక్కువసేపుండకపోవచ్చు. ముఖ్యంగా దేశ ఆర్ధిక పరిస్థితి విషయంలో. కంపెనీల బేలెన్సు షీట్లు బాగుపడుతున్నాయి, వాలువీధి నావరించుకున్న గాఢాంధకారం కరిగిపోతున్న సూచనలు కనిపిస్తున్నాయి కానీ ఉద్యోగాల పరిస్థితి మాత్రం ఎక్కడా మెరుగుపడిన సూచనలు లేవు. పైపెచ్చు, దేశావ్యాప్తంగా నిరుద్యోగపు శాతం పది దాటింది (అంటే 15 మిలియన్లకి మించిన అమెరికన్లు). సామాన్యులు అల్లాడుతున్నారు, ప్రభుత్వం ఆర్ధికోద్ధరణ దిశగా చేపట్టిన పనులు అదృశ్యమవుతున్న ఉద్యోగాల్ని నిలిపి ఉంచేదుకుగానీ, కొత్త ఉద్యోగాల్ని పుట్టించేందుకు గానీ ఉపయోగపడిన దాఖలాలు లేవు. ఏతన్మధ్య ప్రభుత్వపు బిలియన్లతో ఊపిరి తిప్పుకున్న బేంకులు మంచి లాభాల్ని ప్రకటిస్తున్నాయి. త్వరలో ఉద్యోగ పరిస్థితి మారకపోతే పౌరుల సహనం ఎక్కువకాలం నిలిచి ఉండదు.

ఈ సోమవారం ఈ కార్తీకమాసానికి చివరిది అనుకుంటా. (ఇది నిజం కాదు. వొచ్చే సోమవారం కూడా కార్తీక సోమవారమే. ఈ కార్తీకమాసంలో పౌర్ణమి, అమావాస్య రెండు సోమవారాల్లోనే వచ్చాయి) ఐతే ఏంటంటా? ఏంలేదు, శివపూజకు వేళాయెరా! .. అంతే!!

తెలుగుసినీ ఆకాశంలో చిరంజీవి మెగాష్టారుగా వెలుగు పుంజుకుంటున్న రోజుల్లోనే నేను ఆంధ్రదేశానికి దూరమవ్వడంతో అనేక చిత్రరాజాల్ని మిస్సయ్యాను నేను. ఈరోజు యూట్యూబు పుణ్యమాని, పూర్తి సినిమాలు కాకపోయినా అలనాటి సినిమాలనించి పాటలైనా చూస్తుంటాను అప్పుడప్పుడూ. అలా కంటబడిందీ ఈ చక్కటి ఆణిముత్యం. మన సినిమాల్లో తల్లిప్రేమని చూపించే పాటలూ ఘట్టాలూ చాలానే ఉంటాయి. కానీ తండ్రి ప్రేమని సున్నితంగా చెప్పే దృశ్యాలు చాలా అరుదుగా వుంటై. ఈ చిన్ని పాట దృశ్యాన్ని చాలా సున్నితంగా, అందంగా, మనసు చెమర్చేలా తీశారనిపించింది.

బాలగోపాల్ గారి అకాల నిష్క్రమణ సాధారణ పౌరుల జీవితాల్లో ఎటువంటి శూన్యాన్ని మిగులుస్తున్నదో స్వానుభవంగా వివరిస్తున్నారు మిత్రులు అక్కిరాజు. పేరుపొందిన మరొక రచయిత సరికొత్తగా బ్లాగు తెరిచారు. విశాఖనించి కథా రచయిత్రి మల్లీశ్వరిగారు జాజిమల్లి అంటూ తమ కబుర్లు చెబుతున్నారు. మీరూ ఓ లుక్కెయ్యండి.

Monday, November 2, 2009

కబుర్లు - నవంబరు 2

మిత్రులందరికీ మరోసారి మనస్పూర్తిగా ధన్యవాదాలు.

కాలం గడిచిపోతోందోయ్ అని గుర్తించుకునేందుకూ, హెచ్చరించేందుకూ ఎన్నెన్ని సూచికలో! న్యూయియర్లు, పుట్టిన్రోజులు, వార్షికోత్సవాలు .. అమెరికాలో అయితే, వసంతంలో గడియారాన్ని ముందుకు తొయ్యడం, శిశిరంలో వెనక్కి లాగడం .. ఇదో తతంగం. ఈ సంవత్సరం మొన్నమొన్ననే మొదలయినట్లుంది, ఇంకా చెక్కుల మీద 2009 అని రాయడం పూర్తిగా అలవాటయినట్టే లేదు, అంతలోనే సంవత్సరం అయ్యేపోవస్తోంది. కాలేజిలో నా సహాధ్యాయి మిత్రుడొకడు మొన్న కాల్చేసి చెప్పాడు, మా బేచి స్నాతకులయ్యి వచ్చేయేడు రజతోత్సవంట. కాలం అలా పరిగెత్తుతూనే వుంటుంది. మన చేతిలో వున్నది ఈ క్షణమే దాని విలువ నెరిగి సద్వినియోగ పరుచుకోవడమే మనం చెయ్యగలిగిందల్లా. అందుకనే దీన్ని ఆంగ్లంలో ప్రెజెంట్ అన్నారు .. అది బహుమతే .. నిజంగా!!

అసలు బయటి ప్రపంచంలో ఏం జరుగుతోందో పట్టించుకునే తీరికలేనంత పని వత్తిడి. ఎప్పుడన్నా రెణ్ణిమిషాలు తీరిక దొరికితే నా అభిమాన బ్లాగుల్లో ఓ లుక్కేసి చదివింది నచ్చితే ఓ రెండు వాక్యాలు గిలకడం. యాహూన్యూసులో కూడా వార్తలు చదివేందుకు కుదరట్లేదు అంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో గమనించగలరు. ఏతన్మధ్య, గత వారాంతంలో రెండు అద్భుతమైన కార్యక్రమాలు జరిగినై. ముందుగా శనివారం ఇక్కడ స్థానిక డిట్రాయిట్ తెలుగు సమితివారి దీపావళి వేడుకల్లో నరకాసురవధ నాటిక ప్రదర్శించాము. ఈ కార్యక్రమం మా వూళ్ళో పేరెన్నిక గన్న నాట్యాచార్యులు శ్రీమతి సాంధ్యశ్రీ ఆత్మకూరిగారి పర్యవేక్షణలో జరిగింది. అందులో నేను నరకాసురుడి పాత్ర ధరించాను. సంధ్యగారి వంటి మంచి సృజనాత్మక దృష్టికలిగిన సమర్ధులతో పని చెయ్యడం ఒక అదృష్టమైతే, కొన్ని పదులగంటలు టీనేజర్లైన పిల్లల సాంగత్యంలో గడుపుతూ వారి ఉత్సాహాన్ని ఆస్మాసిస్ ద్వారా వంటపట్టించుకోవడం కూడా చాలా సరదా అయిన అనుభవం. పిల్లలందరూ చాలా బాగా చేశారు .. ముఖ్యంగా సత్యభామగా చిరంజీవి అర్చిత అద్భుతంగా నటించింది. అన్నట్టు మన కాలాస్త్రి శ్రీ కూడా సూత్రధారునిగా తనవంతు పాత్ర సమర్ధవంతంగా పోషించారు.

ఇదయినాక, మరునాడు, ఆదివారంనాడు, మా వూరి నిలయవిద్వాంసులతో ఒక కర్నాటక సంగీత కచేరీ నిర్వహించాము కొందరు మిత్రులం కలిసి. కొంతకాలంగా మా వూళ్ళో అస్సలు కచేరీలనేవి జరక్కపోవడం ఒకటీ, అదికాక, వూళ్ళో ఎంతో ప్రతిభావంతులైన కళాకారులు ఉండి కూడా, వారి ప్రతిభకి సరైన వేదిక దొరక్కపోవడం ఒకటీ గమనించి, కొందరు మిత్రులం కలిసి ఈ కచేరీ ఏర్పాటు చేశాం. రెండు భాగాల కచేరీ. ముందుగా శశిధర్ గారి వీణావాదనం, మృదంగం మీద జయసింగం, ఒక గంటన్నరసేపు. భైరవి అటతాళ వర్ణంతో మొదలెట్టి , రాగాల ఎంపికలో చక్కటి వైవిధ్యం కనబరుస్తూ, పూర్వికళ్యాణిలో మీనాక్షిని సాక్షాత్కరించి, శంకరాభరణంలో ఎదుట నిలచితే నీ సొమ్మేమి పోవునని రాముణ్ణి నిలదీసి, ధనశ్రీ తిల్లానాతో ముగించారు. తదుపరి మల్లాజోస్యుల దంపతులు (శ్రీకాంత్, పావని) వయొలిన్ ద్వయం, రాజశేఖర్ ఆత్మకూరిగారి మృదంగవాద్య సహకారంతో. శ్రీరాగవర్ణంతో మొదలై లాల్గూడివారి కానడ తిల్లానాతో ముగిసిన వీరికచేరీలో శ్రీరంజని రాగం తానం పల్లవి తలమానికంగా నిలిచింది. వందమందికి పైగా శ్రోతలు హాజరవడం నాకు చాలా ఆనందం కలిగించింది.

వారాంతపు రెండ్రోజులూ ఇంత చక్కటి అనుభూతుల్ని మూటగట్టుకున్నాక, సోమవారంనాడు పనిలో తగిలిన ఎడాపెడా వాయింపులతో బుర్ర వాచిపోయి సాయంత్రానికల్లా ఒక విధమైన నిర్వేదం వచ్చేసింది .. ఆనందం కానీ తృప్తికానీ ఇంత క్షణికమా, ఇంత అశాశ్వతమా అని చాలా ఆశ్చర్యపోయాను. అఫ్కోర్సు, అది విధి నిర్వహణ కాబట్టి, ఎన్ని వాయింపులు తగిల్నా తట్టుకుని నిలబడ్డం, అదొక అనుభవంకింద జమ వేసుకుని ముందుకి సాగిపోవడం తప్ప వేరే గత్యంతరం లేదు కాబట్టి మళ్ళీ మర్నాటికల్లా నిలదొక్కుకున్నా ననుకోండి. అసలు, మాట వరసకి చెబుతున్నా, జీవితంలో ఈ వొడిదుడుకులు ఇలా ఎలా పక్కపక్కనే వస్తాయో అని.

ఆకులు రాలే పోయాయి వారాంతంలో వచ్చిన గాలివానకి. కానీ అక్టోబరు నెలంతా గొప్ప రంగుల్తో అలరించింది ప్రకృతి. ఎటుచూసినా రంగులు, రంగులు .. గుట్టలు గుట్టలుగా రాశులు రాశులుగా రంగులు. రెండేళ్ళ క్రితం ఈ ఆకురాలు కాలపు అనుభవాన్ని రాసుకున్న వైనం ఇక్కడ.