రుచుల తారతమ్యం

నేనెవరినన్నా ఇన్సల్టు చెయ్యాలంటే వాళ్ళ టేస్టుని యెద్దేవాచేస్తానని సెలవిచ్చాడు మా రాకేస్వరుడు ఈ మధ్యనే ఏదో బ్లాగులో కామెంటుతూ. యేమి సత్యాన్ని ఆవిష్కరించినావయా, నువ్వు రాకు! అనుకున్నాను.

మీరే చూడండి. యెవర్నన్నా కెలకాలన్నా, కోపం తెప్పించాలన్నా ఇంతకన్నా మంచిమార్గం మరోటి లేదు. తన ఫేవరెట్ హీరోనో, బాగా నచ్చిన పాటనో యెవరన్నా వెక్కిరిస్తే లావాలా ఉప్పొంగుతుంది కోపం మనిషికి, తనని యెలాంటి దుర్భాషలాడినా రానిది.

ఈ టేష్టు, రుచి, అభిరుచి అనేవున్నాయి చూశారూ, మహా ఇబ్బంది వీటితో. ఒహపక్కన విపులాచ పృథ్వీ, లోకో భిన్న రుచిః అని సంస్కృతంలోనూ, మరొపక్కన డిగుస్టిబస్ నానెస్ట్ డిస్పుటాండం అని లాటినులోనూ నొక్కి వక్కాణించారు గదా. దీన్నే అచ్చ తెలుగులో పుర్రెకో బుద్ధీ, జిహ్వకోరుచీ అని అనువదించి మరీ చెప్పారాయె, మనలాంటి మందమతులకి అర్ధం కాదేమోనని. ఐనా సరే, మనం హేప్పీగా బీపీ పెంచేస్కుని రెచ్చిపోతుంటాం, వాళ్ళ టేష్టంతేలే అని చేతులు దులుపుకుని పోవాల్సిన చోటకూడా.

ఒకరు యిప్పటికింకా నావయసు నిండా పదహారే అని మురుసుకుంటే మరొకరు ఓంకారనాదాను సంధానమౌగానమే అని పరవశులవుతుంటారు. ఒకరు మధుబాబు షాడో అడుగుల్లో అడుగులేస్తుంటే మరొకరు రావిశాస్త్రి వియత్నాం విమలతో భేటీ అవుతుంటారు. ఒకరికి డిస్కో మరొకరికి భామాకలాపం, ఒకరికి రాంగోపాల వర్మ మరొకరికి సత్యజిత్ రే, ఒకరికి విశ్వనాథ మరొకరికి శ్రీశ్రీ .. వీరిని చూసి వారు నొసలు చిట్లించడం, వారిని చూసి వీరు జాలిపడ్డం. ఒకరెక్కువా? మరొకరు తక్కువా? రుచుల్లో ఎక్కువ తక్కువలా? తర తమ భేదాలా? ముమైత్ ఖాన్ ఐటం పాట చూసి పదహారేళ్ళ కుర్రాడు పొందే ఆనందం, వాడి తాత కచేరీలో నేదునూరి గారు పాడుతున్న త్యాగరాజకృతి వింటు పొందే ఆనందం కంటే ఏవిధంగా భిన్నం? ఏవరిదెక్కువ స్థాయి ఆనందమో తూకమేసి చెప్పగలవారెవ్వరు?

పోనీ ఒకేకళారూపాన్ని ఆస్వాదించడంలోనూ .. ఒకచోట భాగవత కథాగానం జరుగుతోంది. యెవరో మంచి గొంతున్న పౌరాణికులు శ్రావ్యంగా రాగయుక్తంగా చదువుతున్నారు పోతన పద్యాల్ని. "మందార మకరంద మాధుర్యమున దేలు మధుపమ్ము వోవునే మదనములకు". ఓ బామ్మగారు ఆ గాత్ర మాధుర్యానికే పరవశురాలవుతున్నది. ఒక తాతగారు అందులోని భక్తిభావానికి పులకితులవుతున్నారు. ఒక యువకుడు పద్యంలోని శబ్దాలంకారాలకి సమ్మోహితుడవుతున్నాడు. ఒక పండితుడు రసాస్వాదనలో మైమరిచాడు. ఒక యోగి అందులోని మార్మిక తత్త్వజ్ఞానానికి దాసోహమంటున్నాడు. ఇందులో ఎవరిది హెచ్చు స్థాయి ఆనందం? రాగతాళాలు యేమీ తెలియకపోయినా, బాలమురళీ గొంతు వినబడితేనే పరవశించిపోయే వారున్నారు. ఆలాపన వినగానే రాగాన్ని పోల్చుకుని, ఆహా వోహో అని ఆనందించే వారున్నారు, అంటకంటే విశేషమేమీ వారికి అంతుపట్టక పోయినా. వారి చెవులకి బాలమురళి పాడినా నేదునూరి పాడినా మోహన రాగమంటే మోహన రాగమే. అలాక్కాదు, రాగాన్ని విశదీకరించడంలో, గాయకుడు ఎలాంటి గమకాలు వాడాడు, ఏ ప్రయోగం బాగా ఫలించింది, ఏ ప్రయోగం కొత్తగా ఉంది, అని తెలిసి అనుభవించే శ్రోత ఉన్నాడు. ముగ్గురూ అదే సంగీతాన్ని అనుభవించి ఆనందిస్తున్నారు. మరి ఆ స్థాయిలో తేడాలేదూ?

Comments

Anonymous said…
హీరోల అభిమానుల గురించి కూడా చెప్పండి.
ఇప్పుడు తక్కువకాని మా టైములో NTR అభిమానులు, కృష్ణ అభిమానులు కొట్టుకోవడానికి కూడా రడీ అయ్యేవారు.
అది కాక రికార్డుల గోల ఒకటి.
రమణ said…
ఒక్కొక్కరికి ఒక్కొక్క అభిరుచి. తమకు ఇష్టమైన వాళ్ళను తూలనాడితే తమ అభిప్రాయాలను గౌరవించటంలేదనే అనిపిస్తుంది కాబోలు.ఇందులో మళ్ళీ అతి ఆరాధన వలన కూడా చేటే. పక్కవారి ఇష్టాలను అర్ధం చేసుకొనే సహృదయత లేనప్పుడే ఇటువంటివి జరుగుతాయి. కనీసం నిర్లిప్తంగా చూడటం కోసమైనా ఎవరైనా నిరంతర ప్రయత్నం చేయవలసిందే.
kiranmayi said…
మాస్టారు,
మంచి analysis చేసారు. "మన" అనుకున్న దాన్ని(అది ఏదైనా సరే) ఎవరైనా ఏదైనా అంటే వొళ్ళు మండి పోతుంది. నాకైతే మా ఊరిలో transportation system ని ఎవరైనా కించపరిచినా బలే చికాకేసేసి వాళ్ళతో యుద్ధానికి దిగుతాను అక్కడికేదో నేనే mayor ని అయినట్టు. నా మాట మటుక్కు చెప్పుకుంటే పాటలో lyrics కంటే సంగీతానికి, "beat" కి ప్రాధన్యతిస్తాను. అందుకే కొంత మంది కి నచ్చని "అసభ్య" పాటలని నేను పాడుతుంటే నా స్నేహితులందరూ తిడతారు నన్ను.
అభిరుచి మనిషికొక రీతి. అభిమానం అదొక తీరు. ఇక అనుభూతి ఆ రెండిటి సమన్వయం. కొలమానం, స్థాయి ఆయా వ్యక్తుల నిర్వచనాలు. పోల్చటానికి తగనివీ రుచుల తారతమ్యాలు.
మురళి said…
మంచి విషయం.. అర్ధంతరంగా ఆపేసినట్టు అనిపించింది.. ఎదుటి వాళ్ళ అభిరుచిని గౌరవించడం ప్రాక్టీసు చెయ్యాల్సిందే అందరూ.. ఇక అనుభూతి అంటే.. ఒక చెరువు ఉంటుంది.. అక్కడికి బిందె తో వెళ్ళిన వాళ్లకి బిందెడు నీళ్ళు.. చెంబుతో వెళ్ళిన వాళ్లకి చెంబుడు నీళ్ళు.. చెరువు అంతకన్నా ఎక్కువ ఇవ్వననదు.. కానీ మోసే శక్తి అందరికీ ఒకేలా ఉండదు కదండీ...
మురళి, అర్ధాంతరంగా ఆపెయ్యడమేమి లేదు. ఈ విషయమ్మీద అడ్డదిడ్డంగా నా మనసులో రేగిన ఆలోచనలవి అంతే. అందుకని వాటికి ఒక కంక్లూజన్ అంటూ ఏర్పడలేదు.
Anonymous said…
మంచి విశ్లేషణ!బాగుంది.
Vasu said…
నేను కూడా ఇంకా ఏదో ఉంటుంది అనుకుంటూంటే ఆగిపోయినట్టనిపించినది.
మనం మొన్న సినిమా రుచుల గురించి మాట్లాడుకున్న సందర్భం గుర్తొచ్చింది.
Unknown said…
అద్గదీ బా చెప్పేరు. నచ్చింది టపా.

ఏమనుకోనంటే, ఎగతాళి కిందకు తీసుకోకపోతే ఇది జనాల్లోకి వదిలి చూడండి. నిజంగానే నాకు ఏ దురుద్దేశమూ లేదు. వెటకారంగా అంటున్నదీ లేదు. మాట నమ్మితే ప్రచురించి వివిధ రుచులతో ఎవరి ఆనందాలు వారికి పంచండి.

డిట్రాయిటు నగర నివాసా
నాట్యమందు నటరాజా
నాటకమందు గౌరీనాథా
వ్రాయుటయందు తాపీరావా
శబాసునౌ భళాముండా
ధియోయోనః ప్రచోదయాత్

ఇదేంటిది ? మొదటి నాలుగు పదాల్లో ఆయన సంగతి, విశేషాలు తేలినాయి. మరి ఐదో దాన్లో శాబాసునౌ భళాముండా ఏమిటి ?

పంజాబీ "ముండా" వోయి.

మరి చివరి ప్రచోదయాత్ ఏమిటి ? అదా - అది పాఠకుల నోరు మాళిగలో దాగి వున్న రుచులకే వదిలెయ్యటం జరిగింది. పట్టుకోవటం కష్టమూ కాదు. :)

జలసూత్రం విక్రమార్క శాస్త్రి
పుర్రెకో బుద్ధి నిజమే.సమయానికి ఈ సంగతి గుర్తురాకపోవడమే చాలా పుర్రెలకు పుట్టని బుద్ధి. అందరి పుర్రెలూ తమ పుర్రెల్లాగే పనిచేస్తుంటాయని భావిస్తూ అలా చెయ్యని పుర్రెలు తారసపడితే నిరసించడమే పుర్రెల భిన్నత్వంలో ఏకత్వం. ఓం నమఃశివాయ! :)
రవి said…
పిడకల వేట (అమంగళం ప్రతిహతమగు గాక) లాంటి టపాలో ఇంకో పిడకల వేట. ఏమనుకోకండి.

"ఆ అంగ రాజు గురించి విని, చూచిన తర్వాత, "ఇక పద" అని చెలికత్తెనాదేశించింది రాకుమారి. ఎందుకంటే, లోకం భిన్న రుచులను కోరుతుంది కాబట్టి"

"అథాంగ రాజామవతీర్య చక్షుః
యాహీతి తన్యామవదత్ కుమారీ
నాసౌ న కామ్యౌ నచ వేద సమ్యక్
ద్రష్టుం న సా భిన్న రుచిర్హి లోకః"

(రఘు వంశం, ౬ వ సర్గ)
ఈ భిన్న రుచుల గురించి నేను కూడా తరచూ ఆలోచిస్తుంటాను. మీరు రాసిన విషయానికి కొంచెం దూరమే అయినా, కాస్త సంబంధం వున్న విషయమని అనిపించడంతో రాస్తున్నాను.

జిహ్వకో రుచి, పుర్రెకో బుద్ధి సరే... మరి ఒక జిహ్వకే పలు రుచులు, ఒక పుర్రెకే పలు బుద్ధుల సంగతేంటి? అంటే, మన రుచులు కూడా మారుతుంటాయి కదా.

ఉదాహరణకి, పాఠ్య పుస్తకాలలో పద్యాలు చదువుకున్న తరువాత చాలా ఏళ్లకి పద్యాల వైపు నా మనసు మళ్లినప్పుడు, ఏదైనా శతకాలు కాని, ఇతర పద్యాలు కానీ చదువుతుంటే, ఉత్తి పద్యాలు మాత్రమే ఇస్తే ఎలా? కష్టమవ్వదూ, అనుకునేవాడిని. కూడబలుక్కుని ఒకట్రెండు చదివేటప్పటికి ఇహ ముందుకి సాగలేకపోయేవాడిని. అప్పుడు, చక్కగా ప్రతిపదార్థ తాత్పర్యాలతో వివరంగా వున్న పుస్తకాలు చాలా నచ్చేవి. అర్థ తాత్పర్యాలతో పాటు చదివితే బాగా అర్థమయ్యి పఠన ముందుకి సాగేది. ఇలా కొంత కాలం సాగాక, మరీ ప్రతి పద్యానికీ ప్రతిపదార్థ తాత్పర్యాలు చదువుతూ వుంటే, ఏంటో ఇబ్బందిగా వుండటం మొదలయ్యింది. అప్పుడు, పద్యానికి ఒకట్రెండు వాక్యాల్లో అర్థమో సందర్భమో తెలుపుతూ వుండే పుస్తకాలు బాగా నచ్చాయి. ఇప్పుడు కొన్ని సందర్భాలలో, ఆ కాస్త వివరణ కూడా చదివే వేగానికి ఆస్వాదనకీ అప్పుడప్పుడు అడ్డుతగులుతున్నట్టుగా అనిపిస్తాయి. అలా ఒకదాని వెంట ఒకటి పద్యాలే చదువుకుంటూ వెళితే నచ్చుతుంటాయి (ఇవి కొన్ని వాటికే అనుకోండి...)

ఇంకో విషయంలో నాకిలాంటి అనుభవముంది. మొదట్లో SPICMACAY కార్యక్రమాలలో LecDem కార్యక్రమాలయితేనే బుర్రకెక్కేవి. Concert series కార్యక్రమాలంటే, ఆ పెద్దాయన వచ్చి, ఏదో ఆయనలో ఆయన మాట్లాడుకున్నట్టు, స్టేజెక్కి ఏదో వాయించుకునో, పాడుకునో వెళిపోతున్నారనిపించేది. కాలేజీలో ఉండగా మా హయాములో ఎక్కువగా LecDem కార్యక్రమాలే వచ్చాయి. అవి జరిగినప్పుడు నాకు బానేవుండేది. కనకలింగేశ్వరరావు మాష్టరు మాత్రం, "ఈయన మరీ మాటలు ఎక్కువ పాడడం తక్కువ చేస్తున్నారు. ప్రతీది అలా అందుకుని మళ్లీ మాటల్లోకి వచ్చేస్తున్నారు" అని అసంతృప్తిగా అంటుండేవారు. ఇలా జరిగిన TN శేషగోపాలన్ గారి కార్యక్రమం నాకు బాగా గుర్తు. పోనీలే, జిహ్వకో రుచి, పుర్రెకో బుద్ది అని అనుకున్నాను. నాకు ఇలా నచ్చుతోంది, ఆయనకి ఇలా అయితే నచ్చట్లేదు అంతే.

అయితే, ఇలా కొన్ని గడిచాక, ప్రతీదానికి వివరణ ఇచ్చే కన్నా, కాస్తెక్కువసేపు ఏదయినా పాడితేనో, ప్రదర్శిస్తేనో బావుంటుందని అనిపించడం మొదలెట్టింది. అప్పుడు, ఒహో ఇదివరకు నాకు నచ్చని మాష్టారిగారి "రుచి" ఇదన్నమాట అనిపించింది. అయినా ఇప్పటికీ కచేరీలలో రాగాలాపన జరుగుతున్నప్పుడు ఊగే తలలూ, ఓహ్ ఆహ్ అనే ఆస్వాదింపులూ నాకు అర్థమవ్వని రుచులే..... కాకపోతే, అందులో కూడా తప్పక రుచివుండి వుంటుంది అని మాత్రం నా పాత అనుభవాలు నేర్పాయి నాకు. ఇక అలాంటప్పుడు మనం వాటిని హేళనచేయడమో, తక్కువచేసి మాట్లాడ్డమో ఉండనే వుండదు.
rākeśvara said…
మీరు వ్రాసిందంతా ఒట్టి తప్పులు.
నేను ఫేవరేట్ నటుడు యంటీయార్,
నా ఫేవరేట్ నటి ఐశ్వర్యారాయ్
నా ఫేవరేట్ సంగీత దర్శకుడు రెహమాన్
నా ఫేవరేట్ సంగీతం శాస్త్రీయం

ఇవే గొప్ప, మిగిలిన వన్నీ ఉత్త వేష్టు. వేఱేవి ఇష్టపడితే మీది చిల్లర టేష్టని!

-
Seriously speaking,
ఈ రోజుల్లో అడ్డమైన వాటివన్నీ అభిరుచులుగా పేర్కోని, అంతేనోయ్ మా టేష్టు ఇంతే అంటున్నారు జనం. MTV వాడు దీనిని సొమ్ము చేసుకుంటున్నాడు.

నా పుస్తకంలో పదిహేనవ వ్యాసం దీని గుఱించే.
హర్ష, చాల్రోజల తరవాత కనిపించావు. నువ్వు రాసిన అంశాలు కూడా నాకూ అనుభవమే.

రాకేశ్వర .. ఫేవరెట్ ఐటం సాంగుని మరచినావు.
ramya said…
సృష్టిలో ఏ ఒక్కటీ ఇంకోదానిలా ఉండదు దాని ఉద్దేశ్యమే విలక్షణత, అనన్యనత. అందుకే ఎవరికివారే విలక్షణమైన వారు, వారి భావాలు, వ్యక్తీకరణలూ కూడా.

వేలిముద్రలే ఒకరివి ఇంకొరినుండి విలక్షణమైనప్పుడు బుద్ది ఎంత విలక్షణంగా ఉంటుంది.
అసలు అందరి రుచులూ ఒక్కలా ఉండాల్సిన, వేరొకరిలా ఆలోచించాల్సిన అవసరేముంది!
అబ్బే అంత ఉదారంగా ఎవరిష్టం వాళ్ళదిలే అనేసుకోగలిగితే మనం సామాన్య మానవులం ఎలా అవుతాము? ఎక్కడిదాకానో ఎందుకు, నిన్న ధనియం కారం కూర కి పోపు వేయిస్తుంటే మా అమ్మ మొత్తం పోపంతా ఒకేసారి వేసి ముందు మిరపకాయలు బయటకి తీసెయ్యి అంది, మనం ఎవరు చెప్పినా వినని సీతమ్మ టైపు కదా, అందుకు మిరపకాయలు ముందు వేయించి తీసి తర్వాత పోపు వేయించా, రుచిలో తేడా రాదు అన్న విషయం ఇద్దరికీ తెలుసు. దాని స్టైల్ లో అది వేయించింది అని ఊరుకోవచ్చు కదా, అబ్బే పెద్ద లడాయి వేసుకుంది నాతో... ఏమిటో ఈ చెంచాడు భవసాగరాలు
లక్ష్మి .. ఈ అమ్మలంతే! :)
తృష్ణ said…
నాకు ఈ "ఇంగ్లీషు లీవ్ లెటర్స్ మైల్" ఫ్రెండ్స్ పంపించారోచ్...ఇంకా మిగిలినవి కూడా రాయాల్సింది...సూపర్...ప్ట్ట చెక్కలౌతుంది చదువుతూంటే...నేను మావారికి చదివి వినిపించి ఆ రోజు పడీ పడీ నవ్వాను..
నాకు పని ఉందో లేదో..మరి..

సరిగ్గా మీరు రాసిన ఈ విషయమే నేను చాలా సార్లు ఆలోచిస్తూ ఉంటానండీ...
మొన్న ఎవరో బ్లాగ్లో ఒక పుస్తక ప్రదర్శనలో ఏ పుస్తకం కొనాలో వాళ్ళ నాన్నగారిని అడిగితే శరత్ "శ్రీకాంత్" కన్నా గొప్ప పుస్తకం రాయలేదు ఆయన పుస్తకాలేమీ కొనకన్నారట....
"??!!"...అనుకున్నాను.
ఇంకో బ్లాగ్లో ఒక్క "నారాయణరావు" పుస్తకాన్ని చదివి బాపిరాజుగారి రచనలనఅలన్నిమ్టి మీదా ఏకైక అమూల్యాభిప్రాయాన్ని వెల్లిబుచ్చారెవరో...ఒక్క పుస్తకమ్ చదివి ఓ రచయిత రచనలన్నింటినీ ఓ మూసలోకి దూర్చేయటమ్ ఏమి సమంజసం అనుకున్నాను...
జిహ్వకో రుచి...పుర్రె కొ బుధ్ధి అని మరి ఊరికే అన్నారా...

ఎవరి దృష్టిలో వాళ్ల అభిరుచి గొప్ప....కానీ అన్నింటికీ చివర ఉన్న ఉన్నది ముఖ్యమేమో అనుకుంటూ ఉంటానండీ నేను...
ఎవరి అభిరుచి వల్ల వళ్ళకు కలిగే "వ్యక్తిగత ఆనందం". తినేది ఏ పదార్ధమైనా "కడుపు నిండటం" అల్టిమేట్ గోల్ కదా మరి...