నేను నటన జంధ్యాల గౌరీనాథశాస్త్రి

అప్పుడెప్పుడో నాగురించి నేను పువ్వు పుట్టగనే పరిమళించును అని చెప్పుకున్నా.
చాలా విషయాల్లో ఇది నిజమేకూడాను :)
కానీ నటన విషయంలో కాదు!
మన బ్లాగర్లలో చాలా మంది చిన్నప్పుడే చాలా కళలు తేరినవారున్నారు. పాఠశాల వార్షికోత్సవాలకి యేకపాత్రాభినయాలు చేసిన వారు, రేడీయో బాలానందంలో పాటలు పాడినవారు, బడులలో, కాలేజిలో, ఇతరత్రా, తమ ఆటపాటలతో అలరించినవారూ చాలా మందె వున్నారు.

కానీ నామట్టుకి నాకు యెంటెక్కుకి కాన్పూరుకెళ్ళేదాకా ఈ స్టేజి పురుగు కుట్టలేదు. కాన్పూరులోనైనా, చెట్లులేనిచోట ఆవదం చెట్టే మహావృక్షమనే సామెత మీకుగుర్తొస్తే మీతప్పేంలేదు. యేదేవైనా అక్కడున్న రెండేళ్ళూ అక్కడి తెలుగు సమితి వేదికని ఏకఛ్ఛత్రాధిపత్యంగా పరిపాలించినాక ఫిలడెల్ఫియా వచ్చిపడ్డాను.

యిక్కడొక చిన్న పిట్టకథ చెప్పుకోవాలి. ముందస్తుగా శిరాకదంబం వారందిస్తున్న ఈ దృశ్యకాన్ని తిలకించండి.
ఇది నాగయ్య నటించిన భక్త పోతన సినిమాలో ఒకదృశ్యం. కవిసార్వభౌముడు శ్రీనాథుని పాత్ర పోషించినది జంధ్యాల గౌరీనాథ శాస్త్రిగారని గొప్ప నటుడు. మా అమ్మమ్మ వేపునించి వీరితో యేదో బీరకాయపీచు చుట్టరికం కూడా ఉన్నట్టు మాఅమ్మ చెబుతుండేది. ఆయన స్వయంగా బాగా ఆస్తిపరుడు. డబ్బుకోసమని ఒకపని చెయ్యవలసిన అవసరం ఆయనకి లేదు. అందుకని, తన ప్రవృత్తి రీత్యా నాటకాలని సినిమాలని, అదీను తనకి నచ్చిన నప్పిన పాత్ర అయితేనే చేస్తూండేవారు. పెద్దమనుషులు సినిమాలో మ్యునిసిపల్ చెయిర్మన్ పాత్రని చాలా సమర్ధవంతంగా పోషించారు. నిలువెత్తు విగ్రహం, కొనదేరిన ముక్కు, తీర్చిదిద్దినట్టున్న ముఖం, పెద్దపెద్ద కళ్ళు, వొంటితీరులో ఒక సహజమైన రాజసం ఈయన సొత్తు.

మళ్ళీ అసలు కథకొద్దాం. ఫిలడెల్ఫియాలో మాకో పెద్దాయనున్నారు కోటపాటి సాంబశివరావుగారని. ఈయనకి మనతెలుగు గడ్డమీద, చింతామణి హరిశ్చంద్ర ఇత్యాది నాటకాల్లో నటించిన అనుభవముంది. పద్యాలు గుక్కతిప్పుకోకుండా పాడేవారు. ఇదిలాగుండగా, దగ్గర్లో న్యూయార్కునగరంలో తానా మహోత్సవం జరగబోతోందని వార్తలొచ్చాయి. మా వాళ్ళంతా సాంబశివరావుగార్ని .. హబ్బే మీ టేలెంటుకి మన చిన్నస్టేజి సరిపోద్సార్, తానా స్టేజిమీద చూపించాల్సిందే మీప్రతాపం అని యెగదోశారు. ఆయన పాపం నిజమే అనేసుకుని, నన్నూ, సీత అనే ఇంకో స్నేహితురాల్నీ కూడగట్టి, చింతామణి నాటకంలోని మొదటి దృశ్యం ప్రాక్టీసు చేయించారు. నాకు ఛస్తే పద్యం రాగయుక్తంగా పాడ్డం చేతగాదు. కానీ పాపం సాంబశివరావుగారు పనిగట్టుకుని నేనుండే ఎపార్టుమెంటుకొచ్చి మరీ నన్ను తోమి తోమి నాపాత్ర పాడాల్సిన ఒక్కపద్యం తర్ఫీదిచ్చారు.

నేను వేస్తున్న పాత్ర బిల్వమంగళుడి స్నేహితుడైన ఒక శ్రోత్రియ బ్రాహ్మణుడి వేషం (పాత్ర పేరు నాకిప్పుడు గుర్తులేదు). ఒకరోజు ఎందుకైనా మంచిదని పాత్రకి తగిన వేషం అంతా తయారుచేసుకుని అద్దంలో చూసుకుంటే మీసాల్తోనూ, తలకట్టు (క్రాపింగు)తోనూ ఆ రూపం ఆషాడభూతిలా ఉందిగానీ శ్రోత్రియ బ్రాహ్మణుడిలా లేదనిపించింది. అందుకని ప్రదర్శనకి మీసం తీసెయ్యడానికి నిశ్చయించాను. తలకి బోడిగుండులా కనబడే రబ్బరు తొడుగు సంపాయించి దానికి గోష్పాదమంత పిలకతోసహా తయారుగా ఉంచాను.

తీరా మా ప్రదర్శన శుభదినం రానే వచ్చింది. ఆ మహోత్సవాల్లో ఆఖరి రోజు. మా ప్రదర్శన ముఖ్యవేదిక మీద, సాయంత్రం ఎనిమిదింటికి .. అంటే ప్రైం టైమన్న మాట. మా సాంబశివరావుగారి ఉత్సాహానికి హద్దులేకుండా ఉంది. మేము సభాస్థలిని చేరుకుని, ఒక పచ్చగది (గ్రీన్రూము) వెతుక్కుని వేషధారణ మొదలు పెట్టాము. ఈ మహోత్సవాలకి ఇండియానించి దిగుమతయ్యి, తమగోడు ఎవరికీ పట్టక, కారిడార్లలో కాలుగాలిన పిల్లుల్లా తిరుగుతున్న ఒకబృందం మమ్మల్ని గమనించి, ఇక్కడేదో నాటకం తయారీ జరుగుతోందే అంటూ వచ్చి పలకరించారు. చింతామణి వేస్తున్ణామని తెలిసి మా సాంబశివరావుగారి ధైర్యాన్ని మెచ్చుకున్నారు. అంతే మా సాంబశివరావుగారు గాల్లో ఎగురుతున్నారు. వారిలో ఇద్దరు నా వేషధారణలో చాలా సాయం చేశారు. నా వేషం పూర్తయ్యాక వారిలో ఒక పెద్దాయన నన్ను కిందినించి పైదాకా తేరిపార చూసి, మీరు చాలా నాటకాలు వేశారా అనడిగారు. అబ్బే లేదండీ, నిజంగా నాటకం అంటూ వెయ్యడం ఇదే మొదలు అన్నాను. అలాగా, వేషం మాత్రం బ్రహ్మాండంగా కుదిరింది, పోతన సినిమాలో శ్రీనాథుడిలా ఉన్నారు అని ప్రశంసించారు. నేనూ మా సాంబశివరావుగారితో చేరి గాల్లో ఎగురుతున్నాను.

మా ప్రదర్శనకి టైమయిందని వేదిక వెనక్కి చేరుకున్నాం. మా ముందు జరుగుతున్న ప్రోగ్రాము యెంతకీ అవదు, వేచి వేచి, చూచి చూచి, కాళ్ళు పీకుతున్నాయి అనుకొనేంతలో స్టేజిమేనేజరొచ్చి, చింతామణి వాళ్ళెవరండీ అని కేకపెట్టాడు. మేమే అన్నాం. మీరే నెక్స్టు అన్నాడు. తెలుసు అన్నాం. మీ ప్రోగ్రామెంతసేపు అన్నాడు మాకేసి అనుమానంగా చూస్తూ. సాంబశివరావుగారు ఆల్రెడీ బిల్వమంగళుడిలో పరకాయ ప్రవేశం చేసేశారు - ఇలాంటి తుఛ్ఛమైన సంభాషణలు పట్టించుకునే స్థితిలో లేరు. ఆయన చెవుల్లో అప్పటికే ప్రేక్షకులు కొట్టే వన్స్ మోర్లు గింగురు మంటున్నాయి. అందుకని నేనే బాధ్యత తీసుకుని, ఆ యెంతసేపండీ, పదిహేన్నిమిషాలు అన్నా. ఐదునిమిషాల్లో ముగించండి అని చెప్పి ఆయన హడావుడిగా వెళ్ళిపోయాడు.

వెనక్కి తిరిగి చూసేప్పటికి స్టేజిమీద తెర తీసి వుంది. స్టేజి మధ్యలో కుర్చీల్లో సాంబశివరావుగారూ, సీతా కూర్చుని ఉన్నారు. సాంబశివరావుగారు మొదటి పద్యం అందుకున్నారు. నేను పక్కన వింగ్స్ లో నుంచుని చూస్తున్నా. ఎవరో నా భుజం గోకారు. స్టేజి మేనేజరు. ఇంకా ఎంతసేపండీ అన్నాడు అసహనంగా. అప్పటికి సరిగ్గా ఒక్క నిమిషం అయింది మావాళ్ళు స్టేజెక్కి. ఇదింకా మొదటి పద్యమేనండీ. ఇంకా నాలుగు పద్యాలున్నాయి అన్నా. ఇంతలో మా పెద్దాయన పద్యం ముగించి రాగాలాపన చేస్తున్నారు. నాపక్కన స్టెజి మేనేజరు బద్దలవడానికి సిద్ధంగా ఉన్న అగ్నిపర్వతంలాగున్నాడు. ఎలాగైతేనేం మొదటి పద్యం, రాగాలాపనతో సహా పూర్తయింది. సీత తన డయలాగు చెప్పబోతోంది. ఇంతలో ఆడియన్సులోంచి ఎవరో తుంటరి వన్స్ మోర్ అని అరవనే అరిచాడు. మా సాంబశివరావుగారు అలా కూచున్న కుర్చీ పాళంగా ఆరంగుళాలు గాల్లోకి లేవడం స్పష్టంగా కనబడింది. ఆయన సీత డయలాగుని మధ్యలో తుంచేసి అదే పద్యం మళ్ళీ ఎత్తుకున్నారు. స్టేజిమేనేజరుకి ఇది గోరుచుట్టుమీద రోకటిపోటులాగ తగిలింది. తెరలు లాగెయ్యండి అని ఆజ్ఞ ఇచ్చాడు. నేనేదో చెయ్యాలి గబుక్కుని. పద్యం మధ్యలో తెరపడిపోతే సాంబశివరావుగారు భరించలేరు .. నాకు తగిలించిన క్లిపాన్ మైకు ఆన్ చేసుకుని గాఠిగా నా పద్యం పాడుకుంటూ ఎంటరైపోయాను. ఆ కంగారులో అపశ్రుతిలో యెత్తుకున్నానని వేరే చెప్పక్కర్లేదు. సాంబశివరావుగారు బ్రూటస్ వెన్నుపోటు తిన్న జూలియస్సీజర్లా నిర్ఘాంతపోయి నాకేసి చూస్తున్నారు. సీత అంతకు మునుపే స్పృహతప్ఫే స్థితిలో ఉంది. అదే అదనుగా స్టేజిమేనేజరు తెరలాగేశాడు.

కథ కంచికి. మేం ఫిలడెల్ఫియాకి.

తనకళకి జరిగిన అవమానాన్నించి తేరుకోడానికి సాంబశివరావుగారికి చాలా కాలం పట్టింది. కానీ నా వేషం చూసి ఆ పెద్దాయనెవరో గౌరీనాథశాస్త్రిగారి లాగున్నావని మెచ్చినందుకు నేను మాత్రం ఇప్పటికీ మురుసుకుంటూనే వుంటా!

Comments

మీకుజరిగిన సంఘటనే నాకూఎదురైంది. కాకపోతే నాటకంలో కాదు. ఒకపేపరు సమర్పించేందుకు వెళ్తే అక్కడా నాముందోడు అరగంట తినేశాడు. ఎంకిపెళ్లి-సుబ్బిచావు.
మురళి said…
బాగుంది తొలి ప్రదర్శన... ముఖ్యంగా మీ ఎంట్రీ. :):)
ramya said…
చలం కథ 'నాటకం' గుర్తొచ్చింది :)
Sanath Sripathi said…
భలే సరదా పంచారు. :-)
సనత్
భావన said…
:-) :-)వన్స్ మోర్ :-) :-)
ఈ మధ్యే బ్లాగు రాయటం మొదలు పెట్టాము. నేను(విజయ) అక్క(భారతి) కలిసి. చదివి మీ అభిప్రాయం తెలిపినందుకు ధన్యవాదాలు. మీ బ్లాగ్ గురించి రాయటనికి చాల ఉంది. ఇక్కడ స్పేస్ మాత్రం తక్కువుంది.
బావుందండీ..అపశ్రుతయితేనేం,గురుదక్షిణ వెంటనే అలా చెల్లించారన్నమాట..
SRRao said…
కొత్తపాళీ గారూ !
నాటక ప్రదర్శనానుభవాన్ని కళ్ళకు కట్టినట్లు వర్ణించారు. చాలా బాగుంది. నటన అనేది ఒక అనుభూతి. అనుభవం. దాన్ని తాళ్ళు కట్టి లాగితే రసాభాసే ! ఇలాంటి అనుభవాలు నాటక రంగంలో అప్పుడప్పుడు కనబడుతుంటాయి. కాంట్రాక్టు నాటకాల రోజుల్లో పద్యం తొందరగా పూర్తి చేస్తే కాంట్రాక్టర్లు ఒప్పుకునేవారుకాదట. మీకు రివర్స్ అన్నమాట. ఏమైనా మీలో గౌరీనాథ శాస్త్రి గారు సాక్షాత్కరించినట్లు ఒక్కొక్కసారి మన రూపం మనల్ని కాపాడేస్తుంది. దీనికి సంబంధించి నా అనుభవం ఒక టపా రాస్తాను. అభినందనలు.
gaddeswarup said…
ఇది చూడగానే గుర్తొచ్చి భారగో నూటపదహారు (116) మళ్ళీ చూశా. అందులో గుణసుందరి కథలో గౌరీనాథ శాస్త్రి గారి బొమ్మ (శివుడిగా) ఉంది. కాని పేరు గౌరిపతి శాస్త్రి అని రాసారు.
హహ్హహ్హా... భలే ఉందండీ మీ నాటక ప్రహసనం! జానేభీదోయారో సినిమా గుర్తుకొచ్చింది.
స్వరూప్ గారు, గుణసుందరి కథలో గౌరీనాథశాస్త్రిగారున్నారా? గమనించలేదే
మీరు చెప్తుంటే సీను మొత్తం కళ్లముందు ఉన్నట్టు ఉంది. ఇంతకీ సాంబశివరావుగారు మీకిచ్చిన బహుమానమేంటో??:)
జయ said…
బాగుందండి మీ నాటకం. నేనూ చిన్నప్పుడు ఒక నాటకంలో వేశాను. మా అక్కా వాళ్ళందరూ డ్రామా వేసారు. నేనూ వేస్తానని గోల చేస్తే నాకు చెలికత్తె వేషం ఇచ్చారు. రాణీ గారు పిలిచినప్పుడల్ల వొచ్చి చేతులు కట్టుకోని నుంచోవాలన్నమాట. 'చిత్తం మహారాణీ' అనే ఒక డైలాగ్ మాత్రం నాకుంటుంది. అంతే... మా అత్తయ్య కూతురు 'నాట్యకత్తె '. తనకు లాగే నాకూ మంచి చీర కట్టాలని గొడవ చేస్తే చీర బాగానే కట్టారు కాని, నేను మాత్రం చెలికత్తెనే...
:))) భలే ఉంది.. మీ ఎంట్రీ మాత్రం సూపర్!
gaddeswarup said…
Seems to be correct:
http://www.imdb.com/name/nm0310181/
Vasu said…
నాటకం ముందు జరిగిన తంతు అంతా సినిమా లా చూపించారు. భలే బావుంది. ఐతే మీరు గౌరీ నాథ శాస్త్రి గారిలా ఉండేవారన్నమాట అప్పట్లో .
:D

వన్స్ మోర్!!!
హ హ మీ ఎంట్రీ అదిరింది :-)
Unknown said…
అది తొంభయ్యవ దశకంలో ఎన్‌టీవోడు వచ్చినప్పటి తానాయేనా? అప్పాజోస్యుల వారు వేయిస్తున్న నాటికలోకూడా మధ్యలో తెర దించేశారు, అలాగే, ఎస్పీ బాలు గారికి పదకొండు దాటిన తరువాత గానీ స్టేజీ ఇవ్వలేదు, ఆయన చేత చివాట్లు తిన్న తరువాత ఒక గంట వారి ప్రోగ్రామ్‌ని పొడిగించారు?
Lalitha said…
మొదటిసారిగా మీ బ్లాగ్ చదువుతున్నానండీ! మీఉ స్టేజ్ మీదికి వెళ్లేముందు మీ ఆలోచన చాలా మంచిగా అనిపించింది :)

నేనేదో చెయ్యాలి గబుక్కుని. పద్యం మధ్యలో తెరపడిపోతే సాంబశివరావుగారు భరించలేరు .. నాకు తగిలించిన క్లిపాన్ మైకు ఆన్ చేసుకుని గాఠిగా నా పద్యం పాడుకుంటూ ఎంటరైపోయాను.

~లలిత