Monday, February 23, 2009

కబుర్లు .. జయ్ హో!

చాలా మంది ఆశించినట్టుగానూ, కొంతమంది ఊహించినట్టుగానూ స్లండాగ్ మిలియనేర్ ఆస్కార్ల పంట పండించిఉకుంది.

ఐతే ఇందులో కొన్ని తమాషాలు లేకపోలేదు.

ఉత్తమ దర్శకుడిగా డేనీబాయిల్ మాత్రమే అవార్డు స్వీకరించాడు. కోడైరెక్టరు అని పేరు నమోదు చెయ్యబడిన లవలీన్ సింగ్ కి ఉత్తచేతులే మిగిలాయి. ఇదేమి తిరకాసు? లవలీన్ సింగ్ పని నటీనటుల్ని ఎంపిక చెయ్యడం మాత్రమే. ఆ పనిలో ఆమె చూపిన ప్రతిభకీ, అటుపైన ముంబాయిలో లొకేషన్లు సంపాయించడమూ, ఇతరత్రా వెసులుబాట్లు కలిపించడమూ .. ఈ పనులన్నిటిలో ఆమె చూపిన చొరవకి కృతజ్ఞతగా దర్శకుడూ డేనీబాయ్ల్ ఆమె పేరుని కోడైరెక్టరుగా పెట్టించాడు. అంతేగానీ ఆమె నిజంగా డైరెక్షను చెయ్యలేదు. సరే ఇదంతా ఇలా ఉండగా, యెకాడెమీ వారు డైరెక్టరు స్థానానికి ఒక్క పేరే ఉండాలి అని మెలిక పెట్టారు. సినిమా చరిత్రలో జంట దర్శకులు లేక పోలేదు. ఇటీవలే అవార్డు గెల్చుకున్న కోయెన్ సోడరులు ఉండనే ఉన్నారు. అంచేత సినిమా వారే మా టీము లిస్టు ఇది, ఫలానా లవలీన్ సింగు కోడైరెక్టరు అని చెబుతుంటే అది స్వీకరించి తదనుగుణంగా నామినేషన్లు ఉంచాల్సిన బాధ్యత యెకాడెమీది.

పండిన ఎనిమిది యెవార్డుల పంటలోనూ, రహమాన్ రెండు సంగీత యెవార్డులూ గెల్చుకోగా సౌండ్ మిక్సింగుకి మరొక భారతీయుడు రెసూల్ పూక్కుట్టి గెల్చుకున్నారు. ఇదివరలో గాంధీ సినిమాకి కాస్ట్యూములకు గాను గెల్చిన భాను అథాయా తో కలిపి ఆస్కార్లు గెలిచింది వీరు ముగ్గురే .. అభినందనలు.

ఇంత జరిగినాక ఒక్క మాట చెప్పకుండా ఉండలేక పోతున్నా. మనం చెయ్యలేని పని ఇంకోడు చేసి చూపించాడే అనుకునేప్పటికి ఎక్కడో కుడుతుంది జనాలకి. ఈ సినిమా గురించి చర్చల్లో పెద్దలూ పిన్నలూ కూడా చాలా అభిప్రాయాలు వెలిబుచ్చారు .. భారద్దేశాన్ని చులకనగా చూపించారు అన్నారు. తెల్లోడి కండ కావరం అన్నారు. బాలీవుడు వీరులైతే మేమూ మంచి సినిమాలే తీస్తున్నాం కానీ ఎవరూ పట్టించుకోవట్లేదు అని గునిశారు. మధ్యలో సత్యజిత్ రే పేరెత్తారు. బీదరికాన్ని కళ్ళు బద్దలయ్యేలా చూపిస్తేనే అవార్డులొస్తాయి అన్నారు. ఇంకా ఏంటేంటో చాలా అన్నారు. ఈ సినిమా ముఖ్య ఉద్దేశాన్ని మిస్సవుతున్నాయి ఈ అభిప్రాయాలన్నీ, నా ఉద్దేశంలో.

ఈ సినిమా బీదరికం గురించి కాదు. ముంబాయి మురికివాడల గురించి కాదు. భారద్దేశపు దౌర్భాగ్యం గురించి అసలే కాదు. ఇది వాస్తవిక సినిమా కానే కాదు. దీన జనోద్ధరణ ప్రపంచం బాగుపడాలి మెసేజి సినిమా అస్సలు కానే కాదు.

మరి ఏంటయ్యా ఈ సినిమా? జమాల్ అనే ఒక గొప్ప ఆశా జీవి కథ ఈ సినిమా. విధి ఎన్ని సార్లు తనని పల్టీ కొట్టించినా, ఆ పల్టీలోని శక్తినే పూంజుకుని నింగికెగబాకే తారాజువ్వ కథ ఈ సినిమా. ఇదేదీ నిజ జీవితంలో జరగదు. వాస్తవికంగా లేదు. ఇదొక ఫేంటసీ సినిమా. అందుకే చాలా మంచి సినిమా. గొప్ప సినిమా కాక పోవచ్చు .. మంచి సినిమా.

అవునూ, ముంబాయి మురికి వాడల్లో, మూడూ నాలుగు క్లాసు పిల్లకాయలకి త్రీ మస్కిటీర్స్ కథ ఏ బళ్ళొ చెబుతారు?

Sunday, February 15, 2009

కబుర్లు - ఫిబ్రవరి 16

ముందుగా .. దీనికి ముందు టపాకి వ్యాఖ్యలు ప్రచురించను అని ప్రకటించినందుకు బహుశా ఒక బుల్లి వివరణ అవసరం అనిపించింది. అక్కడ అసలు విషయం అందరికీ తెలియచెప్పడం ముఖ్యం కానీ దాని గురించి ఒక చర్చ లేవదియ్యడం ముఖ్యం కాదు. ఈ కూస్తదానికి నేనిక్కడ సెటింగ్స్ మార్చి, ఇదేంటి కొత్తపాళీ బ్లాగులో కామెంటడానికి దారిలేదేమని జనాలు ఆశ్చర్యపడి .. ఇదంతా ఎందుకొచ్చిందని అలా చెప్పాను. పాఠకులు సహృదయతతో అర్ధం చేసుకున్నారని ఆశిస్తాను.

ఆదివారం కాఫీషాపులో వాలువీధిపత్రిక చూస్తే దాని ముఖ పత్రమ్మీద వందలాది చైనీయులు ఉద్యోగాలకోసం గుమిగూడిన దృశ్యం ప్రచురితమై ఉంది. కింద సంబంధిత వార్త .. మిలియన్ల కొద్దీ చైనీయులు ఉద్యోగాలకోసం వెతుక్కుంటున్నారట. భారత దేశంలో పరిస్థితి ఎలాగుందో మరి నాకు తెలీదు. ఇప్పటికైనా రాష్ట్ర జాతీయ స్థాయిల్లో మన మంత్రులు మేల్కొని దేశాన్నీ జాతినీ పరిపుష్ఠం చేసే ప్రయత్నాలు మొదలు పెడతారని ఆశిద్దాము. ముఖ్యంగా యువతీ యువకుల్ని ఆంత్రప్రనర్లుగా .. అందులోనూ దేశ వాణిజ్య వ్యవస్థని పటిష్ఠం చేసే రంగాల్లో .. ఎదిగే దిశగా చర్యలు చేపట్టాలి.

తెలుగునాడి మాసపత్రిక ఫిబ్రవరి సంచికలో మన తాడిమేటి రాజారావు గారి కథ అంతర్మథనం పునఃప్రచురితమైంది. ఈ కథ ఇంతకుముందు ఈమాటలో ప్రచురితమైన సంగతి మీకు తెలిసే ఉండవచ్చు. ఈయన తియ్యతియ్యగా కారంకారంగా రేగొడియాలు వడ్డిస్తుండేవారు. చివరి వడ్డింపు డిసెంబరు 31న జరిగింది. మళ్ళీ మొదలు పెడితే బావుంటుంది. ఈ పునఃప్రచురణ ఇచ్చే స్ఫూర్తితో ఆయన రేగొడియాల వడ్డింపుకి పునరంకితమవడమే కాకుండా ఇంకా మంచి మంచి కథలు కూడా రాస్తారని ఆశిద్దాము.

ఈ కబురు కూడా నేను తెలుగునాడిలోనే చదివాను. వాళ్ళు తెలుగు ఇండియాటుడే సౌజన్యంతో ప్రచురించారు .. మహానటి సావిత్రి గురించి ఒక చక్కటి పుస్తకం మార్కెట్లోకి వచ్చిందిట. పుస్తకం పేరు మహానటి సావిత్రి వెండితెర సామ్రాజ్ఞి. రాసినది గార్లపాటి పల్లవి. విచిత్రంగా ఈమె పత్రికా విలేకరి కానీ సినిమాకి సంబంధమున్న మనిషికానీ కాదు. కేవలం సావిత్రి మీద అభిమానంతో ఈ రచన చేపట్టి విజయవంతంగా పూర్తి చేశారట. నిజంగా అభినందించాల్సిందే! సావిత్రి సినీజీవిత నిజజీవిత విశేషాల్ని ఆసక్తిగా చదివింపచేసే శైలిలో రాయడమే కాకుండా అనేక ఛాయాచిత్రాలను, ఆనాటి పత్రికా ప్రకటనలు, రిపోర్టులను సైతం యథాతథంగా ఈ పుస్తకంలో అందిస్తున్నారు. తెలుగు చలనచిత్ర చరిత్ర మీద ఆసక్తి గలవారికీ, సావిత్రి అభిమానులకూ ఈ పుస్తకం తప్పనిసరి అంటున్నారు ఆ సమీక్ష రాసిన రెంటాల జయదేవ గారు. వెల 20 రూపాయలు. ప్రతులకు పల్లవి, హెచ్ 96, మధురానగర్, హైదరాబాద్ వద్ద సంప్రదించవచ్చు.

వచ్చే సోమవారం మహాశివరాత్రి. ఐతే ఏంటంట? ఏం లేదు, ఊర్నే చెబుతున్నా, దగ్గర్లో ఏదన్నా శివాలయాన్ని వెతుక్కుంటారేమోనని!

Friday, February 13, 2009

ID theft in blogs

Some new items came to my notice since I published this post this morning. So, I am republishing this post with some significant additions. Please read carefully.
***

This has come to my notice just now. There was at least one comment that appeared on "Newjings" blog yesterday under my ID which was not written by me.
Take a look here.
It has the appearance of being written by me.
If you click on the ID, it will take you to my profile page.
And note the deliberately insulting tone of the comment.

It looks like the work of the original miscreants or some minor offshoots to deliberately and systematically vilify my name.
However, I am confident that they will not succeed.
So, mud on their face(s)!
As our northern brothers say on their lorries,
"bure nazar wale .. teraa munh kaalaa!!"

Let this be a caution to all bloggers .. please keep monitoring the comments feeds to make sure that you are not targets of such scams.
***
Please take a look at these two screen shots.

The first one is Blogger default. It allows many choices for commenting. For someone with a criminal bent of mind, it is not difficult to impersonate an existing blogger, if a blog has open comments setting like this.

The second one allows only "authenticated" comments. That means that the commenting person must have an ID and password and enter them to be able to comment. The entered ID may be a pseudonym but it prevents someone else from easily assuming your identity.

Comment moderation allows yet another level of security for the blogger from filtering out unwanted comments from appearing in his/her blog.

If you are a blogger, please spend some time to understand at least these basics of blog security.

An informed blogger is a happy blogger.
If you find hateful or harsh or otherwise incendiary comments in your blog, please take a moment to consider before you react.
Most important of all .. don't be scared by all this .. keep blogging!
***
I take this opportunity to make the following announcement:
1. From now on, I will comment only on blogs that require some authentication. If your blog allows anonymous comments, you can rest assured I will not comment in it.

2. If any one receives a private e-mail claiming to be from కొత్తపాళీ .. please note this - my email shows my original name in English script. It does not show కొత్తపాళీ in Telugu script.

3. Just for this one post, I am not going to publish any comments. Thank you.
***

స్థితప్రజ్ఞత

2009 సంవత్సరంలో మనం చాలా ఒద్దికగా ఉండాలి. అంతకంటేనూ ముఖ్యంగా మన అంతశ్శక్తిని నిక్షేపించుకోవాలి.

శక్తిని నిక్షేపించుకోవడమ్మీద కొన్ని ఆలోచనలు ఇవి.

క్రమశిక్షణతో కూడిన ఒక వైరాగ్యాన్ని పెంపొందించుకో గలిగితే తదనుగుణంగా మన అంతశ్శక్తిని నిక్షేపించుకుని, దాచుకుని, అంతిమంగా కీలకమైన లక్ష్యసాధనకి వినియోగించుకోవచ్చు.

ఇటువంటి వైరాగ్యం తెచ్చే మెలకువే లేకపోతే, రోజువారీ పనుల్లోనే లీనమై పోయే ప్రమాదం ఉంది. ఈ లీనమవడం మన అంతశ్శక్తిని బయటికి లాగి చిన్న చిన్న సాధారణ విషయాల మీద ఖర్చు చేసేస్తుంటుంది.

వైరాగ్యం అంటే నిరాసక్తి కాదు, విషయాల్ని అసలు పట్టించుకోక పోవడం కాదు. అదొక క్రమశిక్షణతో అలవరచుకునే ఆలోచనా పద్ధతి. ఏ విషయాన్నైనా తగిన శ్రద్ధతో, తేటైన దృష్టితో గమనించడం. ఇది గనక అలవాటు చేసుకోగలిగితే ఎదురయ్యే పరిస్థితుల్నిగురించి ఎప్పటికంటే బలమైన లోతైన అవగాహనని మనకి కలిగిస్తుందిది.

వర్తమాన సమాజంలోమనలి అనుక్షణం చుట్టుముట్టే యాంత్రిక సమాచారపు వ్రదని తట్టుకోవడానికీ, దాని దుష్పరిణామాల్ని సమర్ధవంతంగా ఎదుర్కోవడానికీ ఈ పద్ధతి బాగా ఉపయోగిస్తుందని నా నమ్మకం.

ముక్తాయింపుగా .. మన అంతశ్శక్తినీ ఆత్మశక్తినీ నీరు గార్చేసి, మనల్ని ముంచేసి, భయభ్రాంతుల్నిచేసేందుకు మాత్రమే తయారయ్యే పరిస్థితుల్లోకి సంపూర్ణంగా లాగబడకుండా మనం అప్రమత్తంగా ఉండాలి. ఇవి విషవలయు, మనల్ని దారి తప్పించే పొగమంచు తెరలు.

మొత్తానికి 2009 మార్పుకి దారితీసే సంవత్సరం. అనివార్యమైన తలనొప్పులు ఉంటూనే ఉంటాయి. అవలా ఉండగా, సరికొత్త యవ్వనోదయానికి, ఏకీభావనకు అనుకూలమైన అవకాశాలు కూడా లభ్యమవుతాయి.
*** *** ***

గతవారంలో ఒక ప్రియ మిత్రుడు చూపించాడు ఈ సందేశాన్ని ఒక ఆంగ్ల బ్లాగులో. అది నా మనోభావాలకి అతి దగ్గరగా ఉండటమే కాక ఈ కొత్త సంవత్సరములో ఇంతవరకూ నాకెదురైన అనుభవాలకి సరిపోయినట్టుగా కూడా అనిపించింది. మీ అందరితోనూ పంచుకోవాలనిపించింది.
ఆంగ్ల మూలం ఇక్కడ.

Monday, February 9, 2009

కబుర్లు - ఫిబ్రవరి 9

మొన్నెప్పుడో రాత్రి పొద్దుపోయేదాకా చదువుతూ కూరుచున్నాను. ఇంట్లో అందరూ ఎప్పుడో నిద్రపోయారు. ఇక నేనూ పడుకుందామని లైటు తీసేసేప్పటికి కిటికీ తెరల్లోంచి తెల్లని కాంతి దోబూచులోడుతోంది. కిటికీ దగ్గరకెళ్ళి పరదాల్ని ఒత్తిగించి బయటికి చూశాను. వెన్నెల పిండారబోసినట్టుంది అంటే ఏవిటో మొదటి సారి అనుభవమైంది. .. రెండు వారాల క్రితం వరస్సగా రోజూ మంచు కురిసి బాగా ఒక అడుగు మందాన పేరుకు పోయింది. అప్పణ్ణించీ రోజువారీ గరిష్ఠ ఉష్ణోగ్రత నీటి ఘనీభవన స్థానాన్ని దాటి పైకి రానే లేదు, మొన్నటి దాకా. ఆ రోజే .. సిగ్గు పడుతూ పడుతూనే ముప్ఫయ్యైదు దాటింది. మంచు కరుగుతోంది. కనుచూపు మేర నేలంతా అలా కరుగుతూ కరుగుతూ మైమరచిన తెల్లటి మంచు. పైన మబ్బు లేని ఆకాశంలోంచి వెన్నెల వరద .. ఆ నింగి కురిసే తెలుపు ఎక్కడ అంతమవుతోందో, ఈ నేల పరుచుకున్న తెలుపు ఎక్కడ మొదలవుతోందో అర్ధం కాని ఆద్యంతరహిత స్థితి.

పండు వెన్నెలకి, పుచ్చపువ్వు లాంటి వెన్నెలకి శరదృతువు, అందులోనూ కార్తీకమాసం పెట్టింది పేరు. మాఘ చంద్రుడు ఇంత దయకురిపిస్తాడని గమనించ లేదెప్పుడూ. మిషిగన్ లో ఈ నెలలో ఆకాశం మేఘావృతం కాకుండా ఉండడం చాలా అరుదు. ఇవ్వాళ్ళ (సోమవారం) మాఘ పౌర్ణమి.

అన్నమాచార్య సంకీర్తనల్ని అభిమానించి ఆస్వాదించే చాలా మందికి రాళ్ళపల్లి అనంతకృష్ణ శర్మ గారి గురించి తెలిసే ఉంటుంది. వేదవేదాంగాలు, అనేక భాషలు క్షుణ్ణంగా నేర్చిన మహా పండితుడు. గాత్రంలోనూ వయిలిన్ లోనూ నిధి, స్వయంగా వాగ్గేయ కారుడు. అన్నమాచార్య ప్రాజెక్టు తొలి డైరెక్టరుగా మరుగున పడిన అనేక అన్నమయ్య సంకీర్తనల సాహిత్యాన్ని పరిష్కరించి స్వరపరిచి మనకందించారు. అటుపైన బాలమురళి, నూకల, నేదునూరి, వోలేటి వంటి సమర్ధవంతులైన సంగీతజ్ఞులని రావించి తన పర్యవేక్షణలో కొన్ని వందల సంకీర్తనలకి స్వరరచన చేయించారు. వారి మనుమడు శ్రీ నందనందన్ తాతగారి స్మృత్యర్ధం వారి జీవిత విశేషాలతో, కొన్ని ఫొటోలతో సహా ఈ గూడు నిర్మించారు. వారికి హార్దిక అభినందనలు, మరియు ధన్యవాదాలు. త్వరలో కొన్ని శ్రవ్య మాలికలు కూడా అలంకరిస్తారని ఆశిద్దాము.

ఐఐటీలు నిజంగా అత్యుత్తమస్థాయిని అందుకుంటున్నాయా అని కొంతకాలం క్రితం ఈ బ్లాగులో చర్చించాము. ఇదే ప్రశ్నని ఒక ఐఐటీలో ఆచార్యులుగా పనిచేస్తున్న మా అన్నయ్యని అడిగాను. ఆయన ఇచ్చిన సమాధానం ఇది:
సాంకేతిక పరిశోధన ఫలితాల దృష్ట్యా చూస్తే ఐఐటీలనించి వచ్చినది పేరొందిన అంతర్జాతీయ విశ్వవిద్యాలయాలలో జరిగిన ప్రగతితో ఏ మాత్రం సరితూగదు. గత 10 - 20 ఏళ్ళల్లో అనేక ఐటీ, ఇతర కొత్త సాంకేతికాల కంపెనీలు అమెరికాలోనూ భారద్దేశంలోనూ ఆకాశానికి దూసుకుపోతున్న తరుణంలో పాత్రికేయులు ఈ కంపెనీల వ్యవహారాల్ని నిశిత దృష్టితో చూడగా, చాలా కంపెనీల వ్యవస్థాపకులు ఐఐటీ స్నాతకులై ఉండడం తెలియవచింది. దాంతో మీడియాలో ఐఐటీలని గురించిన మోత బాగా మోగింది.
ఐఐటీల వల్ల రెండు ఘనకార్యాలు నెరవేరుతున్నాయి. ఒకటి .. ప్రవేశ పరీక్షలకి ఒక ఒరవడి ఉంది. లెక్కలు, విశ్లేషణ ప్రక్రియల్లో బాగా పరిణతి చెందిన విద్యార్ధులు మాత్రమే JEE, GATE పరీక్షల్లో విజయం సాధించి ప్రవేశించ గలరు. ఇది మొదటి మెట్టు. అలా ప్రవేశం సాధించిన విద్యార్ధులకి ఆ విశ్లేషణా శక్తిని మరింత పదును పెట్టుకునే బోధన కార్యక్రమాన్ని ఐఐటీలు సమర్ధవంతంగా నిర్వహిస్తున్నాయి. ఈ రెండిటి వల్లా, ఐఐటీలు ఇచ్చే ఉన్నత స్థాయి సాంకేతిక విద్య ఈ దేశంలో ఏ కళాశాలా విశ్వవిద్యాలయం ఇవ్వలేదని నేను ఖచ్చితంగా చెప్పగలను. ఐతే, ఐఐటిల సామర్ధ్యం అంత వరకే. ఈ సంస్థల్లోని ఆచార్యులు చాలా మంది రీసెర్చి పరిశోధన గురించి శ్రమ పడినా, గత యాభయ్యేళ్ళలోనూ ఈ సంస్థల నించి గొప్ప సంకేతిక డిస్కవరీలు ఏమీ రాలేదు. రీసెర్చే పరమావధి అయిన BARC, ISRO ఇత్యాది ప్రభుత్వ సంస్థలు, ఏదో పడుతూ లేస్తూనే ఇంతకంటే మంచి ఫలితాల్ని సాధించ గలిగాయి.

ఇంతకు ముందోసారి కబుర్లలో సంగీత కళానిధి నేదునూరి కృష్ణమూర్తి గారు గానం చేసిన ఒక రాగమాలిక శ్లోకం సంగతి ప్రస్తావించాను. మొత్తానికి దాన్ని తెరకెక్కించే పని పూర్తి చేశాను. విని ఆనందించండి!
Get this widget | Track details | eSnips Social DNA

Thursday, February 5, 2009

చిగిర్చే చెట్టు

కొంతకాలంగా తెలుగు బ్లాగ్లోకంలో జరిగుతున్న రెండు పరిణామాల గురించి నా మాటగా చెప్పే ప్రయత్నం ఇది.

మొదటి విషయం .. నా మీద జరుగుతున్న దాడి.
రకరకాల రూపాల్లో జరుగుతున్న ఈ దాడి వల్ల నాకు చీమకుట్టినట్టైనా లేదనే చెప్పాలని ఉంది, కానీ అది నిజం కాదు. నాకు చాలానే బాధ కలిగింది. ఎందుకంటే, నేనూ చీమూ నెత్తురూ, సిగ్గూ శరమూ ఉన్న మనిషినే. పోనీ సమాధానం చెబుదామంటే, రాసినవారు నా బ్లాగులో రాయలేదు. ఎక్కడో రాసినవైనా, నేనేదో నాకు అర్హతలేని గౌరవం పొందేస్తున్నాను అన్న ఒక గుడ్డి కడుపు మంట ఆక్రోశం తప్ప ఆ రాతల్లో చర్చించేందుకూ, సమాధానం ఇచ్చేందుకూ సరుకేమీ లేదు. ఎందుకొచ్చిన వెధవ పీడ, నేను కూడా బ్లాగు మూసేస్తాను, నేను మూసేసినంత మాత్రాన బ్లాగ్లోకానికి వచ్చిన నష్టం ఏమీ లేదు అని కూడా ఆలోచించాను.

నేను కొన్ని నిర్దిష్టమైన ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని బ్లాగు మొదలు పెట్టాను. అవి నెరవేరుతున్నాయి. నాకెంతో తృప్తినీ ఇస్తున్నాయి. ఎవరో కడుపుమండిన వాళ్ళ కోసం నేను బ్లాగు మూసేసే ప్రసక్తే లేదు. నా ప్రస్థానం కొనసాగుతూనే ఉంటుంది.

చిగిర్చే చెట్టుకి ఎగిరే పిట్ట ఆదర్శం. పత్రాల్ని విదిల్చి పైకెగరాలని ప్రయత్నం.
కదలక మెదలక కప్పులు మూసుకుని నిద్రపోయే క్షుద్రగృహాలకు అతీతంగా ఎదుగుతుంది.
అందుకనే శీతాకాలం ఎత్తివచ్చినా భీతి చెందదు చెట్టు.
వీపులపై మ్యాపులతో పత్రాలన్నీ నిశ్శబ్దంగా ధాత్రికి దిగివచ్చి సామాన్యమైన మట్టితో సారూప్యం పొంది మ్యాపుల్లోని రహస్య మార్గాల గుండా చేరుకుని వృక్షశిఖరాన్ని;
చలిమూకని చావుదెబ్బ తీస్తాయి.
.. అని రాశారు కవి ఇస్మాయిల్ చిగిర్చే చెట్టు అనే కవితలో.

ఆ చిగిర్చే చెట్టు నా బ్లాగు!
*** *** ***

ఇహ రెండొ విషయం .. స్త్రీ బ్లాగర్లని దారుణమైన అతి జుగుప్సాకరమైన మాటలతో దూషిస్తూ రాసిన, రాస్తున్న రాతలు .. అవి ఇప్పటిదాకా మీ కంట పడకుండా ఉంటే మీరు అదృష్టవంతులే.

ఆ రాతలు రాస్తున్న వారికీ, ఆ రాసేవారిని ఎగదోస్తున్న వారికీ రెండు మాటలు.

1. నలుగురు బ్లాగర్లని భయపెట్టి వాళ్ళ బ్లాగులు మూయించేశామని మీరు సంబరపడిపోనక్కర్లేదు. కొత్త బ్లాగర్లు వస్తూనే ఉంటారు, సరికొత్తగా రాస్తూనే ఉంటారు. మీరిక్కడ కాస్త ఆశుద్ధం చల్లినంత మాత్రాన బ్లాగ్లోకం మూతబడిందీ లేదు, మీరు సాధించింది అంతకంటే ఏమీ లేదు.

2. ఇంటర్నెట్ లో మారు పేరు పెట్టుకునో, అజ్ఞాతంగానో రాసినంత మాత్రాన మీ ఉనికి అంత అదృశ్యంగా ఏమీ లేదు. మీరెవరో తెలుసుకోవడం అంత కష్టమూ కాదు.
*** *** ***
మిగతా బ్లాగర్లకీ, బ్లాగులు చదివే వారికీ ...

I would like to remind you of Rev. Martin Niemöller's poem .. "First they came .."

First they came for the communists, and I did not speak out--
because I was not a communist;
Then they came for the socialists, and I did not speak out--
because I was not a socialist;
Then they came for the trade unionists, and I did not speak out--
because I was not a trade unionist;
Then they came for the Jews, and I did not speak out--
because I was not a Jew;
Then they came for me--
and there was no one left to speak out for me.

ఆలోచించండి!

Monday, February 2, 2009

కబుర్లు - ఫిబ్రవరి 2

స్లం డాగ్ మిలియనీర్ విజయాన్నించి విజయానికి ఎగబాకుతోంది. మూడు వర్గాల్లో బంగారు గోళాల్ని గెల్చుకుని ఇప్పుడు ఎకాడెమీ ఎవార్డుల నామినేషన్లలో (9) కూడా సంచలనం సృష్టించింది. ఐతే తమాషాగా ఈ 9 నామినేషన్లలో భారతీయులు ఇద్దరే .. సంగీతానికీ పాటలకీ రహమాన్‌తో పాటు, సౌండ్ మిక్సింగ్ కి రసూల్ పూకుట్టి నమోదయ్యారు. నా అభిమాన రేడియో ఎన్పీఆర్ లో, నా అభిమాన కార్యక్రమం ఆల్ థింగ్స్ కన్సిడర్డ్ లో శనివారం (జనవరి 31) రహమాన్‌తో సంభాషణ ప్రసారం చేశారు. చాలా మృదువుగా హాయిగా మాట్లాడాడు. ఒక సినిమాకి సంగీతం సమకూర్చడం ఎలా ఉంటుంది, చాలా హడావుడిగా కంగారుగా ఉంటుందా అన్న ప్రశ్నకి .. నేను సంగీతం చేసేప్పుడు ఇంట్లో పిల్లలకి వండి పెట్టుకునే అమ్మలా ఆలోచిస్తాను. వండి వడ్డించి, వాళ్ళు దాన్ని ఆనందంగా ఆస్వాదిస్తుంటే అమ్మ ఎలా తృప్తి పొందుతుందో, నేను కూడా అలాంటి అనుభూతి కోసం చూస్తాను .. అని చెప్పిన రహమాన్ సమాధానం నాకు నచ్చింది. ఇక్కడ థియెటర్లో సినిమా చూసినప్పుడు నేపథ్య సంగీతం నాకు అస్సలు నచ్చలేదనుకోండి, అది వేరే సంగతి. ఈ సంభాషణ చివర్లో సితార్ ప్రముఖంగా వినిపించే ఒక బిట్ ప్రసారం చేశారు. నాకు సాధారణంగా ఫ్యూజన్ సంగీతం అంటే ఏమాత్రం గౌరవం లేదు, కానీ ఈ బిట్ లో సితార్ తో ఒక రాక్ గిటార్ లాంటీ ధ్వని సృష్టించడం అద్భుతం అనిపించింది.

ఇదిలా ఉండగా ఈ సినిమా గురించిన అభిప్రాయాల కాంట్రవర్సీ ఇంకాస్త దుమారం రేపుతోంది. సినిమాలో భారద్దేశాన్ని చాలా ఛండాలంగా చూపించారు, లేదా కొన్ని దృశ్యాలు జుగుప్సాకరంగానూ, భారతీయుల్ని కించపరిచేలాగానూ ఉన్నాయి .. ఇత్యాది వాదనలు ఎక్కువ వినిపిస్తున్నాయి. కౌముది జాల పత్రికలో ప్రముఖ రచయిత, నటులు గొల్లపూడి మారుతీ రావుగారు దరిద్ర కళ అన్న పేరుతో కాలం కూడా రాసేశారు, సినిమా చూడకుండానే! నాకైతే ఒక పక్కన నవ్వూ ఒక పక్కన చిరాకూ వస్తున్నై, దేన్ని గురించి ఈ గోలంతా అని. ఈ విషయం ఇలా కబుర్లలో వొదిగేది కాదు, దీన్ని గురించి విపులంగా వేరే బ్లాగుతా.

నిన్న రాత్రి సూపర్ బౌల్ మొత్తానికి గొప్ప ఉత్కంఠని సృష్టించింది. అమెరికను ఫుట్బాల్ ప్రొఫెషనల్ ఆట ఎంత వ్యూహాత్మకంగా తయారైంది అంటే అంతా చక్కగా కోరియోగ్రాఫ్ చేసిన నాట్య ప్రదర్శన చూసినట్టు ఉంటోంది తప్ప, ఏ నిమిషాణికి ఏం జరుగుతుందో అన్న ఉత్కంఠ బొత్తిగా ఉండట్లేదు. ఆ దృష్ట్యా నిన్న రాత్రి ఆట అద్భుతం అనే చెప్పుకోవచ్చు. మూడొంతులు ఆటని పిట్స్‌బర్గ్ స్టీలర్లు డామినేట్ చేసినా, అరిజోనా కార్డినల్స్ తమ పట్టుదలతో ఎదురుకుని పిట్స్బర్గ్ వారి 20 పాయింట్లని అధిగమించి 23 కి చేరుకున్నారు. ఆట ముగియడానికి ఒక నిమిషంకంటే తక్కువ సమయం మిగిలి ఉండగా, అతి వత్తిడి నిండిన పరిస్థితుల్లో హోంస్ అనే ఆటగాడు బంతిని పట్టుకుని స్టీలర్స్ కి విజయం సాధించి పెట్టాడు. పనిలో పనిగా MVP అవార్డు గెల్చుకున్నాడు. సూపర్ బౌల్ ప్రసార సమయంలో వ్యాపార ప్రకటనల్ని 200 పైచిలుకు మిలియన్ల డాలర్లకి విక్రయించారని భోగట్టా. చాలా కంపెనీలు ఈ సందర్భంగా తమ కొత్త ప్రకటనలు విడుదల చేస్తాయి. నేను చూసినంతలో ప్రకటనలేవీ, హబ్బ, భలే తీశారే అనిపించేటట్టు లేవు.

సానియమ్మ (సోనియమ్మ కాదు) మొత్తానికి ఒక కప్పు గెల్చింది. అభినందనలు. యూకీ భంబ్రీ అనే పిల్లగాడు పిల్లల పోటీలో గెలిచాడుట. మనోళ్ళు పిల్లల పోటీల్లో సూపర్ డూపరుగా ఆడేసి పెద్దోళ్ళయిన తరవాత చతికిల పడిపోతుంటారెందుకో. ఈ పిలగాడైనా అలాక్కాకుండా మరిన్ని గొప్ప విజయాలు సాధిస్తాడని ఆశీద్దాం.

తెలుగు బ్లాగ్లోకంలో మరో మీనాక్షి ప్రత్యక్షమైంది. ఈమె ఇరుగుపొరుగుల గురించి ముచ్చట్లే కాదు, ఇంకా చాలా విషయాలు చెబుతుంది. శ్రీపాద కథల్లో స్త్రీపాత్రల్ని పరామర్శ చేస్తుంది. కూని రాగాలు తీస్తుంటుంది. అప్పుడప్పుడూ హిమకుసుమాల్ని పూయిస్తుంటుంది. మీరూ ఓ లుక్కెయ్యండి.