కబుర్లు - ఫిబ్రవరి 16

ముందుగా .. దీనికి ముందు టపాకి వ్యాఖ్యలు ప్రచురించను అని ప్రకటించినందుకు బహుశా ఒక బుల్లి వివరణ అవసరం అనిపించింది. అక్కడ అసలు విషయం అందరికీ తెలియచెప్పడం ముఖ్యం కానీ దాని గురించి ఒక చర్చ లేవదియ్యడం ముఖ్యం కాదు. ఈ కూస్తదానికి నేనిక్కడ సెటింగ్స్ మార్చి, ఇదేంటి కొత్తపాళీ బ్లాగులో కామెంటడానికి దారిలేదేమని జనాలు ఆశ్చర్యపడి .. ఇదంతా ఎందుకొచ్చిందని అలా చెప్పాను. పాఠకులు సహృదయతతో అర్ధం చేసుకున్నారని ఆశిస్తాను.

ఆదివారం కాఫీషాపులో వాలువీధిపత్రిక చూస్తే దాని ముఖ పత్రమ్మీద వందలాది చైనీయులు ఉద్యోగాలకోసం గుమిగూడిన దృశ్యం ప్రచురితమై ఉంది. కింద సంబంధిత వార్త .. మిలియన్ల కొద్దీ చైనీయులు ఉద్యోగాలకోసం వెతుక్కుంటున్నారట. భారత దేశంలో పరిస్థితి ఎలాగుందో మరి నాకు తెలీదు. ఇప్పటికైనా రాష్ట్ర జాతీయ స్థాయిల్లో మన మంత్రులు మేల్కొని దేశాన్నీ జాతినీ పరిపుష్ఠం చేసే ప్రయత్నాలు మొదలు పెడతారని ఆశిద్దాము. ముఖ్యంగా యువతీ యువకుల్ని ఆంత్రప్రనర్లుగా .. అందులోనూ దేశ వాణిజ్య వ్యవస్థని పటిష్ఠం చేసే రంగాల్లో .. ఎదిగే దిశగా చర్యలు చేపట్టాలి.

తెలుగునాడి మాసపత్రిక ఫిబ్రవరి సంచికలో మన తాడిమేటి రాజారావు గారి కథ అంతర్మథనం పునఃప్రచురితమైంది. ఈ కథ ఇంతకుముందు ఈమాటలో ప్రచురితమైన సంగతి మీకు తెలిసే ఉండవచ్చు. ఈయన తియ్యతియ్యగా కారంకారంగా రేగొడియాలు వడ్డిస్తుండేవారు. చివరి వడ్డింపు డిసెంబరు 31న జరిగింది. మళ్ళీ మొదలు పెడితే బావుంటుంది. ఈ పునఃప్రచురణ ఇచ్చే స్ఫూర్తితో ఆయన రేగొడియాల వడ్డింపుకి పునరంకితమవడమే కాకుండా ఇంకా మంచి మంచి కథలు కూడా రాస్తారని ఆశిద్దాము.

ఈ కబురు కూడా నేను తెలుగునాడిలోనే చదివాను. వాళ్ళు తెలుగు ఇండియాటుడే సౌజన్యంతో ప్రచురించారు .. మహానటి సావిత్రి గురించి ఒక చక్కటి పుస్తకం మార్కెట్లోకి వచ్చిందిట. పుస్తకం పేరు మహానటి సావిత్రి వెండితెర సామ్రాజ్ఞి. రాసినది గార్లపాటి పల్లవి. విచిత్రంగా ఈమె పత్రికా విలేకరి కానీ సినిమాకి సంబంధమున్న మనిషికానీ కాదు. కేవలం సావిత్రి మీద అభిమానంతో ఈ రచన చేపట్టి విజయవంతంగా పూర్తి చేశారట. నిజంగా అభినందించాల్సిందే! సావిత్రి సినీజీవిత నిజజీవిత విశేషాల్ని ఆసక్తిగా చదివింపచేసే శైలిలో రాయడమే కాకుండా అనేక ఛాయాచిత్రాలను, ఆనాటి పత్రికా ప్రకటనలు, రిపోర్టులను సైతం యథాతథంగా ఈ పుస్తకంలో అందిస్తున్నారు. తెలుగు చలనచిత్ర చరిత్ర మీద ఆసక్తి గలవారికీ, సావిత్రి అభిమానులకూ ఈ పుస్తకం తప్పనిసరి అంటున్నారు ఆ సమీక్ష రాసిన రెంటాల జయదేవ గారు. వెల 20 రూపాయలు. ప్రతులకు పల్లవి, హెచ్ 96, మధురానగర్, హైదరాబాద్ వద్ద సంప్రదించవచ్చు.

వచ్చే సోమవారం మహాశివరాత్రి. ఐతే ఏంటంట? ఏం లేదు, ఊర్నే చెబుతున్నా, దగ్గర్లో ఏదన్నా శివాలయాన్ని వెతుక్కుంటారేమోనని!

Comments

అన్ని వార్తలకు ధన్యవాదాలు. చివరి మాటకు కృతజ్ఞతలు. మా నాన్నగారి పుట్టిరోజది. 23 కన్నా సోమవారం అన్నది బాగా గుర్తుంటుదిక్కడ. కాలండెర్ చూడటం తక్కువ - Mon aerobics, Tue .... Fri violin ఇలా కొండగుర్తుల జీవితానికి అలవాటు పడ్డాక :(
మురళి said…
మన మంత్రులు మేల్కొని దేశాన్నీ, జాతినీ పరిపుష్ఠం చేయగలిగే స్థితిలో ఉన్నారని మీరు భావిస్తున్నారా? వాళ్ల పనుల్లో వాళ్లు చాలా బిజీ అండి.. అసలే ఎన్నికలు వస్తున్నాయి కదా..
మహానటి సావిత్రి మీద పల్లవి గారు రాసిన ఆ పుస్తకాన్ని నేను చదివాను. మీరన్నట్టు ఎన్నో అమూల్యమైన చిత్రాలున్నాయి అందులొ. ఎవరికీ తెలియకుండా రహస్యం గా తిరుపతిలో పెళ్ళి చేసుకున్నాక జెమినీ గణేషన్ తో సావిత్రి దిగిన ఫోటో, ఆనాటి తెలుగు తారలందరూ పిక్నిక్ కి వెళ్ళినప్పటి ఫోటో, ఒకటా రెండా .. అలా చాలా.. పుస్తకం కూడా ఆసక్తి కరంగా ఉండి చివరికంటా చదివిస్తుంది. సాధారణ జీవితకధలకు భిన్నంగా ఒక నవలలా, పాత్రలన్నీ మాట్లాడుకుంటున్నట్ట్లు రాయబడిందీ పుస్తకం..
సావిత్రి మరణానికి సంబంధించిన ఫోటోలను మాత్రం నేను చూడలేకపోయాను..పుస్తకాన్ని చేతిలోకి తీసుకున్నప్పుడు ఎంత వద్దనుకున్నా ఆ చివరి పేజీలు చూసేవాడిని.. చివరికి ఆ పేజీలను చింపి వేరేచోటపెట్టాను I never want to see those photos again.

పుస్తకం వెల Rs.200 ఒక సున్నా మిస్సయిందనుకుంటాను..
naku ento oka nela late ga vastundi telugu naadi. monna monney january di vacchindi (monna vacchindi february da... kadu kadu january dey).
మర్చేపోయాను , మహాశివరాత్రి ని గుర్తు చేసినందుకు ధన్యవాదాలు. పండగలు చేసుకోవటం తరువాత, పండగ అని తెలుసుకోవటమే పెద్ద పని అయిపోయింది..
ఉష .. నిజంగా? సేంపించ్ :) మా నాన్నగారి పుట్టినరోజు కూడాను!

మురళి .. వాళ్ళు చెయ్యట్లేదని మనం ఊరుకుంటే యెలా?

ఉమాశంకర్ .. నిజమే ఒక సున్నా మిస్సయింది. పుస్తకం వెల రూ. 200. మీ దగ్గర గుడి లేకపోతే మా వూరొచ్చెయ్యండి. చాలా బాగా చేస్తారు.

చేతన .. చాల్రోజులతరవాత కనిపించారని సంతోషంతో మీ వ్యాఖ్య తెంగ్లీషులోనే ప్రచురిస్తున్నా. ఇక మీదట దయచేసి తెలుగులో రాయండి. :)
Not there said…
సావిత్రి గారి గురించి వ్రాసిన పుస్తకాన్ని పదిమందికీ పరిచయం చేసి మంచి పనిచేసారు. గతించిన కథనమే ఐనా ఆమె జీవితం ఒక గుణపాఠం, ఒక విషాదకావ్యం. మీ అభిరుచికి కంగ్రాట్స్.
Anonymous said…
తెంగ్లీషులో వ్రాస్తే వ్యాఖ్యలు స్వీకరించనని నియమం పెట్టుకున్నారా? అన్నట్లు గుర్తుపట్టారా? నేనే మీనాక్షిని. కృతఙ్ఞతలు. మీరు మీనాక్షిని పరిచయం చేసినందుకూ,మరియూ మీనాక్షికి చాలా బ్లాగులు పరిచయం చేస్తున్నందుకు. కబుర్లు బాగుంటున్నాయి--ముఖ్యముగా "ఓ లుక్కెయ్యండి" అంటూ లింక్ చేసిన బ్లాగులు బాగుంటున్నాయి. సెలవు.