కబుర్లు .. జయ్ హో!

చాలా మంది ఆశించినట్టుగానూ, కొంతమంది ఊహించినట్టుగానూ స్లండాగ్ మిలియనేర్ ఆస్కార్ల పంట పండించిఉకుంది.

ఐతే ఇందులో కొన్ని తమాషాలు లేకపోలేదు.

ఉత్తమ దర్శకుడిగా డేనీబాయిల్ మాత్రమే అవార్డు స్వీకరించాడు. కోడైరెక్టరు అని పేరు నమోదు చెయ్యబడిన లవలీన్ సింగ్ కి ఉత్తచేతులే మిగిలాయి. ఇదేమి తిరకాసు? లవలీన్ సింగ్ పని నటీనటుల్ని ఎంపిక చెయ్యడం మాత్రమే. ఆ పనిలో ఆమె చూపిన ప్రతిభకీ, అటుపైన ముంబాయిలో లొకేషన్లు సంపాయించడమూ, ఇతరత్రా వెసులుబాట్లు కలిపించడమూ .. ఈ పనులన్నిటిలో ఆమె చూపిన చొరవకి కృతజ్ఞతగా దర్శకుడూ డేనీబాయ్ల్ ఆమె పేరుని కోడైరెక్టరుగా పెట్టించాడు. అంతేగానీ ఆమె నిజంగా డైరెక్షను చెయ్యలేదు. సరే ఇదంతా ఇలా ఉండగా, యెకాడెమీ వారు డైరెక్టరు స్థానానికి ఒక్క పేరే ఉండాలి అని మెలిక పెట్టారు. సినిమా చరిత్రలో జంట దర్శకులు లేక పోలేదు. ఇటీవలే అవార్డు గెల్చుకున్న కోయెన్ సోడరులు ఉండనే ఉన్నారు. అంచేత సినిమా వారే మా టీము లిస్టు ఇది, ఫలానా లవలీన్ సింగు కోడైరెక్టరు అని చెబుతుంటే అది స్వీకరించి తదనుగుణంగా నామినేషన్లు ఉంచాల్సిన బాధ్యత యెకాడెమీది.

పండిన ఎనిమిది యెవార్డుల పంటలోనూ, రహమాన్ రెండు సంగీత యెవార్డులూ గెల్చుకోగా సౌండ్ మిక్సింగుకి మరొక భారతీయుడు రెసూల్ పూక్కుట్టి గెల్చుకున్నారు. ఇదివరలో గాంధీ సినిమాకి కాస్ట్యూములకు గాను గెల్చిన భాను అథాయా తో కలిపి ఆస్కార్లు గెలిచింది వీరు ముగ్గురే .. అభినందనలు.

ఇంత జరిగినాక ఒక్క మాట చెప్పకుండా ఉండలేక పోతున్నా. మనం చెయ్యలేని పని ఇంకోడు చేసి చూపించాడే అనుకునేప్పటికి ఎక్కడో కుడుతుంది జనాలకి. ఈ సినిమా గురించి చర్చల్లో పెద్దలూ పిన్నలూ కూడా చాలా అభిప్రాయాలు వెలిబుచ్చారు .. భారద్దేశాన్ని చులకనగా చూపించారు అన్నారు. తెల్లోడి కండ కావరం అన్నారు. బాలీవుడు వీరులైతే మేమూ మంచి సినిమాలే తీస్తున్నాం కానీ ఎవరూ పట్టించుకోవట్లేదు అని గునిశారు. మధ్యలో సత్యజిత్ రే పేరెత్తారు. బీదరికాన్ని కళ్ళు బద్దలయ్యేలా చూపిస్తేనే అవార్డులొస్తాయి అన్నారు. ఇంకా ఏంటేంటో చాలా అన్నారు. ఈ సినిమా ముఖ్య ఉద్దేశాన్ని మిస్సవుతున్నాయి ఈ అభిప్రాయాలన్నీ, నా ఉద్దేశంలో.

ఈ సినిమా బీదరికం గురించి కాదు. ముంబాయి మురికివాడల గురించి కాదు. భారద్దేశపు దౌర్భాగ్యం గురించి అసలే కాదు. ఇది వాస్తవిక సినిమా కానే కాదు. దీన జనోద్ధరణ ప్రపంచం బాగుపడాలి మెసేజి సినిమా అస్సలు కానే కాదు.

మరి ఏంటయ్యా ఈ సినిమా? జమాల్ అనే ఒక గొప్ప ఆశా జీవి కథ ఈ సినిమా. విధి ఎన్ని సార్లు తనని పల్టీ కొట్టించినా, ఆ పల్టీలోని శక్తినే పూంజుకుని నింగికెగబాకే తారాజువ్వ కథ ఈ సినిమా. ఇదేదీ నిజ జీవితంలో జరగదు. వాస్తవికంగా లేదు. ఇదొక ఫేంటసీ సినిమా. అందుకే చాలా మంచి సినిమా. గొప్ప సినిమా కాక పోవచ్చు .. మంచి సినిమా.

అవునూ, ముంబాయి మురికి వాడల్లో, మూడూ నాలుగు క్లాసు పిల్లకాయలకి త్రీ మస్కిటీర్స్ కథ ఏ బళ్ళొ చెబుతారు?

Comments

అవునూ, ముంబాయి మురికి వాడల్లో, మూడూ నాలుగు క్లాసు పిల్లకాయలకి త్రీ మస్కిటీర్స్ కథ ఏ బళ్ళొ చెబుతారు? భలే ప్రశ్న ఆడిగారు. :-)

నిజమే జమాల్ ఆశావహ దృక్పధం సినిమా కి ముఖ్యాంశమే కానీ దాన్ని ఎంత మంది గుర్తించారు అనేది ప్రశ్నార్ధకమేనండీ. చూసిన ఒకరిద్దరు అమెరికన్స్ నాతో అమితాబ్ ఆటోగ్రాఫ్ సీన్ గురించో ఇరుకు వీధుల గురించో మురికి నీళ్ళ గురించో మాట్లాడిన వాళ్ళే !!
Anil Dasari said…
సత్యజిత్ రే కి కూడా ఒక ఆస్కారొచ్చింది - జీవిత కాల సేవలకి గానూ. ఆయనతో కలిపి నలుగురు.
కొత్తపాళిగారు, మీరు చెప్పిందే రైటు మీకే నా ఓటు
అబ్రకదబ్ర .. మరిచాను. గుర్తు చేసినందుకు ధన్యవాదాలు.
ఉత్తమ పాట వర్గంలో రెహమాన్ తో పాటూ గుల్జార్ కు కూడా అవార్డిచ్చారని మనవి. దీనితో కలిపి నాలుగు.
నా మనసులో ఉన్న ఉత్సుకత ని అణచుకోలేక ఇది రాస్తున్నాను:

ఒకవేళ "స్లం డాగ్" ని డానీ కాకుండా పూర్తిగా 100% భారతీయుల చేత నిర్మించబడి ఉంటే, ఆస్కార్ గడప తొక్కి ఉండేదా? I am a movie freak and i liked SDM very much. Still this thought was lingering in my thoughts throughout the awards night....
మీ అంతట మీరు చేసిన అనాలసిస్ లో కూడా కొన్ని తమాషాలు వున్నాయి గమనించారా ?

"చాలా మంది ఆశించినట్టుగానూ, కొంతమంది ఊహించినట్టుగానూ స్లండాగ్ మిలియనేర్ ఆస్కార్ల పంట పండించిఉకుంది."
ఇంతకి మీరు ఏమి ఆశించారో చెప్పలేదు

"ఇదొక ఫేంటసీ సినిమా---
అవునూ, ముంబాయి మురికి వాడల్లో, మూడూ నాలుగు క్లాసు పిల్లకాయలకి త్రీ మస్కిటీర్స్ కథ ఏ బళ్ళొ చెబుతారు?"

ఫేంటసీ సినిమా అంటున్నారు కదా ..... ఎక్కడైనా చెప్పవచ్చు ఏదైనా చెప్పవచ్చు

మీరు తప్పులు బలే కనిపెడతారండి .... ఎన్నో గొప్ప సినిమాలకి అవార్డు లు రాకుండా ఈ సినిమా కి ఎందుకు వచ్చి అనే కోణం లో ఆలోచించండి ..... ఇంకా చాల గొప్ప తప్పులు కనబడతాయి
ఉమాశంకర్ .. బహుశా వచ్చి ఉండేది కాదనే అనుకుంటున్నాను. మొత్తం టీం సంగతి అలా ఉంచండి. ఎలిజబెత్ సినిమా దర్శకునిగా శేఖర్ కపూర్ నామినేట్ కూడా కాలేదు.

శ్రీధర్ .. మీ వ్యాఖ్య కూడా తమాషాగా ఉంది :)
1. నేను ఏమీ ఆశించలేదు, ఊహించలేదు.
2. ఫేంటసీ సినిమాలో ఏదైనా చెప్పచ్చు .. వొప్పుకుంటాను.
3. నేను తప్పులు పట్టడం అన్న దృష్టితో అనలేదు. మీరు ప్రస్తావించిన దృక్కోణం నించి కనబడే తప్పుల్ని గురించి మీరు ఇంకా విపులంగా రాస్తే బాగుంటుంది. ఈ సినిమా గురించి మీ బ్లాగు చదివాను, కానీ అది మారుతీరావుగారి వ్యాఖ్య గురించి ఎక్కువగానూ సినిమాని గురించి తక్కువగానూ మాట్లాడింది.
asha said…
ఆస్కార్లు గొప్పవని కాదు. కానీ, ఏంటో చాలా
ఆనందం కలిగింది.
Anil Dasari said…
@ఉమాశంకర్:

>> "ఒకవేళ "స్లం డాగ్" ని డానీ కాకుండా పూర్తిగా 100% భారతీయుల చేత నిర్మించబడి ఉంటే, ఆస్కార్ గడప తొక్కి ఉండేదా?"

గడప తొక్కే ఆస్కారం ఉండొచ్చు. అయితే అది 'నిర్మాత' అనేదానికి మీ నిర్వచనం ఏమిటనేదాన్ని బట్టి ఉంటుంది. ఏ యూనివర్సల్, కొలంబియా, మిరామాక్స్, వార్నర్, ఫాక్స్ లాంటి హాలీవుడ్ సంస్థలో దాన్ని నిర్మించినట్లైతే .. దర్శకుడు, ఇతర సాంకేతికగణం ఎవరనేదానితో సంబంధం లేకుండా అకాడెమీ అవార్డు కోసం ఆ సంస్థలేలాబీయింగ్ నడుపుతాయి.(వస్తువెంత గొప్పదైనా ప్రచారం తప్పదు కదా. కాబట్టి లాబీయింగ్ తప్పనే వాదనొద్దు. నామినేషన్ల వరకే ఇది ఉపయోగ పడుతుంది, అవార్డుల ప్రకటన విషయంలో కాదు) ప్రముఖ అవార్డుల వల్ల వచ్చే వ్యాపారం, స్టుడియోలకి పెరిగే ప్రతిష్ట వాళ్లకి ముఖ్యం. దానికి దర్శకుడు భారతీయుడా, బ్రిటిషరా, అమెరికనా అన్నది ముఖ్యం కాదు (కావాలంటే, ఆంగ్ లీ వంటి సాదా సీదా చైనీస్ దర్శకుడి 'క్రౌచింగ్ టైగర్ - హిడెన్ డ్రాగన్', 'బ్రోక్ బ్యాక్ మౌంటెన్' వంటి సినిమాలకి ఆయా సంస్థలు చేసిన ప్రచార హంగామా గుర్తు చేసుకోండి)

భారతీయ పరిభాషలో 'నిర్మాత' అనేదానికి మీరు అర్ధం తీసుకుంటే అప్పుడు కధ మరోలా ఉంటుంది. అప్పుడు అది హాలీవుడ్ సినిమా కింద లెక్కలోకి రాదు కాబట్టి, భీకరమైన పోటీ తట్టుకుని ఉత్తమ విదేశీ చిత్రం విభాగంలో మాత్రమే పోటీ పడే అవకాశముంటుంది.
Anonymous said…
>>మరి ఏంటయ్యా ఈ సినిమా? జమాల్ అనే ఒక గొప్ప ఆశా జీవి కథ ఈ సినిమా. విధి ఎన్ని సార్లు తనని పల్టీ కొట్టించినా, ఆ పల్టీలోని శక్తినే పూంజుకుని నింగికెగబాకే తారాజువ్వ కథ ఈ సినిమా. ఇదేదీ నిజ జీవితంలో జరగదు. వాస్తవికంగా లేదు. ఇదొక ఫేంటసీ సినిమా. అందుకే చాలా మంచి సినిమా.

ఇలా అనుకుంటే ప్రతి తెలుగు సినిమా మంచి సినిమానే....:p
చాలెంజ్ నుంచి మొన్న మొన్న వచ్చిన చత్రపతి వరకు దాదాపు అన్నీ ఇదే కోవలోవే ఏమో కదా... Not that i am trying to compare these movies with slumdog.. I am trying to compare with the theme you are attributing to slumdog...
తెలుగు సినిమాల్లో ఒక్క హీరో కారక్టర్ని చూపించండి ఆశావాది కాకుండా?
ప్రతి తెలుగు సినిమా "నింగికెగబాకే తారాజువ్వ కథే" కదా....:D
కాదంటారా??
@athmakatha .. మంచి పాయింట్ లేవనెత్తారు. :-)
అదే కామన్ థీం నించి తీరా సినిమాని ఎలా తీశారు అన్నదాని దగ్గరే టాలీ-బాలీవుడ్ సినిమాలకీ స్లండాగ్ కీ ఉన్న వ్యత్యాసం కనిపిస్తుంది. టాలీవుడ్ సినిమాల్లో ఏడిటింగ్ అంటే వివిధ సీన్లనిటినీ క మాలగా గుచ్చడం మాత్రమే. స్లండాగ్ వంటి సినిమాల్లో ఏడిటింగ్ తనంత తాను ఒక కళగా కనీస్తుంది.
@అబ్రకదబ్ర .. ఆంగ్ లీని పట్టుకుని సాదాసీదా దర్శకుడూ అంటారా? హన్నా!
Anil Dasari said…
ఏం చేద్దాం మరి. హల్క్ (మొన్నటిది కాదు, అంతకు ముందుది .. ఎరిక్ బానా, జెన్నిఫర్ కాన్నెలీలది) చూశాక ఆంగ్ లీ సత్తాపై అనుమానమొచ్చేసింది. ఆ తర్వాత అతన్నించి చెప్పుకోదగ్గ సినిమాలూ ఏవీ రాలేదాయె.
@అబ్రకదబ్ర:

అకాడెమీ వాళ్ళు "సినిమా" అనేదాన్ని పక్కన పెట్టి వేరేఅంశాల ప్రాతిపదిక మీద, ఉన్నవాటిల్లో మంచి సినిమా ని ఎన్నుకుంటున్నట్లు లేదూ? అస్కార్ విధి విధానాలే అవైనప్పుడు మనమేం చేయలేమనుకోండి.. ఎటొచ్చీ ఇప్పటివరకూ సత్తా ఉన్నవాటికే అవార్డునిస్తున్నారు కాబట్టి కొంతలో కొంత నయం..

సరే వీళ్ళలో వీళ్ళకి కూడా బానే అన్యాయం చేసేసుకుంటూన్నారు , "షాషంక్ రెడెమ్షన్", దర్శకుడు Martin Scorsese (చివరికి సాధించాడనుకోండి), ఆల్ఫ్రెడ్ హిచ్ కాక్ కొన్ని ఉదాహరణలు..అవార్డులన్నాక ఇవి తప్పవు.

ఆస్కార్ కి దీటుగా, మన ఆసియా దేశాల వాళ్ళు ఏదైనా అవార్డు పెడితే బాగుణ్ణు.

ఆంగ్ లీ? I don't think so.బ్రోక్ బ్యాక్ మౌంటైన్ నాకు నచ్చిన సినిమా.
Anil Dasari said…
ఉమా శంకర్ గారు,

చిన్న సవరణ. షాషాంక్ రిడెంప్షన్ దర్శకుడు ఫ్రాంక్ డరబాంట్.

మార్టిన్ అద్భుత దర్శకుడే కానీ ఆయనకి అవార్డొచ్చిన సినిమా మాత్రం నాకు చెత్తలా అనిపించింది. అకాడమీ ధోరణికి విసిగిపోయి ఆయన వాళ్ల మొహానో చెత్త సినిమా కొడితే వాళ్లేమో ఈయన వదలకుండా దండయాత్ర చేస్తున్నాడని అవార్డిచ్చేసినట్లనిపించింది. ఏదేమైనా మార్టిన్ కి ఇంతకు ముందే వచ్చుండాల్సింది.
చాలా చర్చ జరిగింది .అందరూ మహామహులే .అయినా నాకు అనిపించింది చెప్తున్నా !స్లం డాగ్ అని కాకుండా స్లం బాయ్ మిలియనీర్ అని టైటిల్ పెడితే బావుండే దనిపించింది. కొన్ని సంవత్సరాలక్రితం ఒక సినిమాకి పోలీసోడి పెళ్ళాం అని టైటిల్ పెడితే పోలీసులంతా ఆబ్జక్ట్ చేసి పోలీసు భార్యగా మార్పించారు .అలాగే ఏదైనా వర్గీయులను సినిమాలో చూపించి అటువంటి టైటిల్ పెడితే ఎన్ని గొడవలు జరిగి వుండేవో ,ఎంత రాద్ధాంతం జరిగేదో .మరి స్లమ్స్ లో ఉండేవాళ్ళని కుక్కలతో పోలిస్తే ......ఆ సినిమాకు అవార్డులోస్తే ,అదే స్లమ్స్ లో మాత్రమె కాదు దేశమంతా పండగ చేసుకుంటుంది .ఏవిటో ....ఇవన్నీ ....నా మట్టిబుర్రకు అర్ధం కాదేమో .
Anonymous said…
ఆస్వాదించ దగిన చర్చ..
@అబ్రకదబ్ర
అనుకున్నా ఆ అర్ధం వస్తుందని :). అక్కడ కామా పెట్టాను చూడండి. అన్నీ విడి విడి గా చదవుకోగలరు...నేనన్నది ఆ సినిమాకి అన్యాయం జరిగిందని...
#Yes, "The Departed" is not that great at all.I feel "The Aviator" is much better movie.#
చాలా మంది స్లం డాగ్ అంటే అదేదో తిట్టు అని అనుకుంటున్నారు. ఇప్పటికి ఆ అభిప్రాయం ఉంది. స్లం డాగ్ అనే పదం ఒక ఇడియమాటిక్ expression. అంటే ఒక రకంగా మట్టిలో మాణిక్యం అని అనుకోవచ్చు. ఈ విషయం నేను ఎక్కడో చదివాను. అప్పుడు గాని నా మనసు కుదుటపడలేదు.
నిజంగా ఆ ఉద్దేశ్యం తోనే టైటిల్ పెడితే నాకూ సంతోషమే .కానీ .....ఏదేమైనా థాంక్స్ శేఖర్ గారూ !
గురువు గారూ..
'స్లం డాగ్' గురించి మీరు రాసిన వాక్యాలు నాకు బాగా నచ్చాయి. చాలా బాగా చెప్పారు.
ఇక రెహమాన్ విషయానికొస్తే.. జయహో రెహమాన్..!! రెహమాన్ సంగీతం చెవిన పడకుండా నాకు రోజే గడవదు. నాకే అవార్డు వచ్చిన ఇంత సంతోషం ఉండదేమో.. అన్నట్టు ఉంది నా పరిస్థితి ;)

@ పరిమళం గారూ,
'అండర్ డాగ్' అనే టైటిల్ పెట్టాలని.. స్లమ్స్ లో ఉండే అబ్బాయని వెరైటీ గా ఉంటుందని 'స్లం డాగ్' అని పెట్టారట.!
అసలు కలలో కూడా ఎవరూ ఊహించని వాడు పోటీ గెలిస్తే.. అలా అండర్ డాగ్ అంటారట.
ఉదాహరణకి.. 1983 లో ఇండియా క్రికెట్ వరల్డ్ కప్ గెలిసినప్పుడు అలాగే అన్నారట.
అంతగా కుక్కలు అన్నారని మనం అపార్ధం చేసుకోనవసరం లేదేమోనని నా అభిప్రాయం. కేవలం.. నా అభిప్రాయమే అనుకోండీ ;)
Anonymous said…
for any idiomatic expression, connotation is very important. Here the connotation is not as"mattiloe maanikyam" or "pankajam"... Kindly do not ignore this fact.