కబుర్లు - ఫిబ్రవరి 2

స్లం డాగ్ మిలియనీర్ విజయాన్నించి విజయానికి ఎగబాకుతోంది. మూడు వర్గాల్లో బంగారు గోళాల్ని గెల్చుకుని ఇప్పుడు ఎకాడెమీ ఎవార్డుల నామినేషన్లలో (9) కూడా సంచలనం సృష్టించింది. ఐతే తమాషాగా ఈ 9 నామినేషన్లలో భారతీయులు ఇద్దరే .. సంగీతానికీ పాటలకీ రహమాన్‌తో పాటు, సౌండ్ మిక్సింగ్ కి రసూల్ పూకుట్టి నమోదయ్యారు. నా అభిమాన రేడియో ఎన్పీఆర్ లో, నా అభిమాన కార్యక్రమం ఆల్ థింగ్స్ కన్సిడర్డ్ లో శనివారం (జనవరి 31) రహమాన్‌తో సంభాషణ ప్రసారం చేశారు. చాలా మృదువుగా హాయిగా మాట్లాడాడు. ఒక సినిమాకి సంగీతం సమకూర్చడం ఎలా ఉంటుంది, చాలా హడావుడిగా కంగారుగా ఉంటుందా అన్న ప్రశ్నకి .. నేను సంగీతం చేసేప్పుడు ఇంట్లో పిల్లలకి వండి పెట్టుకునే అమ్మలా ఆలోచిస్తాను. వండి వడ్డించి, వాళ్ళు దాన్ని ఆనందంగా ఆస్వాదిస్తుంటే అమ్మ ఎలా తృప్తి పొందుతుందో, నేను కూడా అలాంటి అనుభూతి కోసం చూస్తాను .. అని చెప్పిన రహమాన్ సమాధానం నాకు నచ్చింది. ఇక్కడ థియెటర్లో సినిమా చూసినప్పుడు నేపథ్య సంగీతం నాకు అస్సలు నచ్చలేదనుకోండి, అది వేరే సంగతి. ఈ సంభాషణ చివర్లో సితార్ ప్రముఖంగా వినిపించే ఒక బిట్ ప్రసారం చేశారు. నాకు సాధారణంగా ఫ్యూజన్ సంగీతం అంటే ఏమాత్రం గౌరవం లేదు, కానీ ఈ బిట్ లో సితార్ తో ఒక రాక్ గిటార్ లాంటీ ధ్వని సృష్టించడం అద్భుతం అనిపించింది.

ఇదిలా ఉండగా ఈ సినిమా గురించిన అభిప్రాయాల కాంట్రవర్సీ ఇంకాస్త దుమారం రేపుతోంది. సినిమాలో భారద్దేశాన్ని చాలా ఛండాలంగా చూపించారు, లేదా కొన్ని దృశ్యాలు జుగుప్సాకరంగానూ, భారతీయుల్ని కించపరిచేలాగానూ ఉన్నాయి .. ఇత్యాది వాదనలు ఎక్కువ వినిపిస్తున్నాయి. కౌముది జాల పత్రికలో ప్రముఖ రచయిత, నటులు గొల్లపూడి మారుతీ రావుగారు దరిద్ర కళ అన్న పేరుతో కాలం కూడా రాసేశారు, సినిమా చూడకుండానే! నాకైతే ఒక పక్కన నవ్వూ ఒక పక్కన చిరాకూ వస్తున్నై, దేన్ని గురించి ఈ గోలంతా అని. ఈ విషయం ఇలా కబుర్లలో వొదిగేది కాదు, దీన్ని గురించి విపులంగా వేరే బ్లాగుతా.

నిన్న రాత్రి సూపర్ బౌల్ మొత్తానికి గొప్ప ఉత్కంఠని సృష్టించింది. అమెరికను ఫుట్బాల్ ప్రొఫెషనల్ ఆట ఎంత వ్యూహాత్మకంగా తయారైంది అంటే అంతా చక్కగా కోరియోగ్రాఫ్ చేసిన నాట్య ప్రదర్శన చూసినట్టు ఉంటోంది తప్ప, ఏ నిమిషాణికి ఏం జరుగుతుందో అన్న ఉత్కంఠ బొత్తిగా ఉండట్లేదు. ఆ దృష్ట్యా నిన్న రాత్రి ఆట అద్భుతం అనే చెప్పుకోవచ్చు. మూడొంతులు ఆటని పిట్స్‌బర్గ్ స్టీలర్లు డామినేట్ చేసినా, అరిజోనా కార్డినల్స్ తమ పట్టుదలతో ఎదురుకుని పిట్స్బర్గ్ వారి 20 పాయింట్లని అధిగమించి 23 కి చేరుకున్నారు. ఆట ముగియడానికి ఒక నిమిషంకంటే తక్కువ సమయం మిగిలి ఉండగా, అతి వత్తిడి నిండిన పరిస్థితుల్లో హోంస్ అనే ఆటగాడు బంతిని పట్టుకుని స్టీలర్స్ కి విజయం సాధించి పెట్టాడు. పనిలో పనిగా MVP అవార్డు గెల్చుకున్నాడు. సూపర్ బౌల్ ప్రసార సమయంలో వ్యాపార ప్రకటనల్ని 200 పైచిలుకు మిలియన్ల డాలర్లకి విక్రయించారని భోగట్టా. చాలా కంపెనీలు ఈ సందర్భంగా తమ కొత్త ప్రకటనలు విడుదల చేస్తాయి. నేను చూసినంతలో ప్రకటనలేవీ, హబ్బ, భలే తీశారే అనిపించేటట్టు లేవు.

సానియమ్మ (సోనియమ్మ కాదు) మొత్తానికి ఒక కప్పు గెల్చింది. అభినందనలు. యూకీ భంబ్రీ అనే పిల్లగాడు పిల్లల పోటీలో గెలిచాడుట. మనోళ్ళు పిల్లల పోటీల్లో సూపర్ డూపరుగా ఆడేసి పెద్దోళ్ళయిన తరవాత చతికిల పడిపోతుంటారెందుకో. ఈ పిలగాడైనా అలాక్కాకుండా మరిన్ని గొప్ప విజయాలు సాధిస్తాడని ఆశీద్దాం.

తెలుగు బ్లాగ్లోకంలో మరో మీనాక్షి ప్రత్యక్షమైంది. ఈమె ఇరుగుపొరుగుల గురించి ముచ్చట్లే కాదు, ఇంకా చాలా విషయాలు చెబుతుంది. శ్రీపాద కథల్లో స్త్రీపాత్రల్ని పరామర్శ చేస్తుంది. కూని రాగాలు తీస్తుంటుంది. అప్పుడప్పుడూ హిమకుసుమాల్ని పూయిస్తుంటుంది. మీరూ ఓ లుక్కెయ్యండి.

Comments

శ్రీ said…
గొల్లపూడి గారు కొడుక్కి నచ్చలేదని ఇతను చూడకుండానే సినిమాని తిట్టడం నాకూ నచ్చలేదు.

సూపర్ బౌల్ ఉద్వేగంగా జరిగింది. ఈసారి వ్యాపార ప్రకటనలు ఎక్కువ లేకపోవడం నాకు నిరాశని కలిగించింది --).

మహేశ్ భూపతి, సానియా జంట చిచ్చరపిడుగులాగా ఆడారు. సానియా ఆట కుడా కొంచెం మెరుగయినట్టు కనిపిస్తుంది. కొత్త పిలకాయ్ కూడా మహేశ్ కంపెనీకి కాంట్రాక్ట్ రాసాస్తే అందరూ ఒకే బస్సులో వెళ్ళచ్చు.
ఈ చలిలో మీ కబుర్లు వేడి వేడిగా చాలా బావున్నాయి..

రహమాన్ ఇంటర్వ్యూ వెంటనే వినేశాను :-) కాసేపు బాక్ గ్రౌండ్ లో 'చిన్న చిన్న ఆశ (తమిళ్)' ప్లే చేయడం బావుంది

ఇక, నిన్న సూపర్ బౌల్ లో అంత మంచి కమర్షియల్స్ లేకపోయినా గేమ్ మాత్రం సూపర్!! గేమ్ next Day సెలవు ఇవ్వడం ఎప్పుడు మొదలుపెడతారో!?
గురువు గారూ..
మీ కబుర్లు బావున్నాయి.
Thanks for the rahman interview.
రహమాన్ ఇంటర్వ్యూ లంకిచ్చినందుకు ధన్యవాదాలు, ఇక సూపర్ బౌల్ చివరి ౩ నిమిషాలు ఏముందిలే అని కట్టేసా, ఉదయం స్కోర్ చూస్తే నాకు మతిపోయింది. మొత్తానికి మంచి గేమ్.
Ramani Rao said…
మీ కబుర్లు చాలా బావున్నాయి..
మీ కబుర్లు బాగున్నాయి...
సినిమా చూడకుండా గొల్లపూడి గారు రాసిన వ్యాసం (చేసిన విమర్శ) నాకు కూడా నచ్చలేదు...
నా బ్లాగు విసిట్ చేసినందుకు ధన్యవాదాలు.
అవునండీ... అవి నా వర్క్స్ఏ ... an amateur's works... మీకు నచ్చినందుకు సంతోషం!