కబుర్లు - నవంబరు 2

మిత్రులందరికీ మరోసారి మనస్పూర్తిగా ధన్యవాదాలు.

కాలం గడిచిపోతోందోయ్ అని గుర్తించుకునేందుకూ, హెచ్చరించేందుకూ ఎన్నెన్ని సూచికలో! న్యూయియర్లు, పుట్టిన్రోజులు, వార్షికోత్సవాలు .. అమెరికాలో అయితే, వసంతంలో గడియారాన్ని ముందుకు తొయ్యడం, శిశిరంలో వెనక్కి లాగడం .. ఇదో తతంగం. ఈ సంవత్సరం మొన్నమొన్ననే మొదలయినట్లుంది, ఇంకా చెక్కుల మీద 2009 అని రాయడం పూర్తిగా అలవాటయినట్టే లేదు, అంతలోనే సంవత్సరం అయ్యేపోవస్తోంది. కాలేజిలో నా సహాధ్యాయి మిత్రుడొకడు మొన్న కాల్చేసి చెప్పాడు, మా బేచి స్నాతకులయ్యి వచ్చేయేడు రజతోత్సవంట. కాలం అలా పరిగెత్తుతూనే వుంటుంది. మన చేతిలో వున్నది ఈ క్షణమే దాని విలువ నెరిగి సద్వినియోగ పరుచుకోవడమే మనం చెయ్యగలిగిందల్లా. అందుకనే దీన్ని ఆంగ్లంలో ప్రెజెంట్ అన్నారు .. అది బహుమతే .. నిజంగా!!

అసలు బయటి ప్రపంచంలో ఏం జరుగుతోందో పట్టించుకునే తీరికలేనంత పని వత్తిడి. ఎప్పుడన్నా రెణ్ణిమిషాలు తీరిక దొరికితే నా అభిమాన బ్లాగుల్లో ఓ లుక్కేసి చదివింది నచ్చితే ఓ రెండు వాక్యాలు గిలకడం. యాహూన్యూసులో కూడా వార్తలు చదివేందుకు కుదరట్లేదు అంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో గమనించగలరు. ఏతన్మధ్య, గత వారాంతంలో రెండు అద్భుతమైన కార్యక్రమాలు జరిగినై. ముందుగా శనివారం ఇక్కడ స్థానిక డిట్రాయిట్ తెలుగు సమితివారి దీపావళి వేడుకల్లో నరకాసురవధ నాటిక ప్రదర్శించాము. ఈ కార్యక్రమం మా వూళ్ళో పేరెన్నిక గన్న నాట్యాచార్యులు శ్రీమతి సాంధ్యశ్రీ ఆత్మకూరిగారి పర్యవేక్షణలో జరిగింది. అందులో నేను నరకాసురుడి పాత్ర ధరించాను. సంధ్యగారి వంటి మంచి సృజనాత్మక దృష్టికలిగిన సమర్ధులతో పని చెయ్యడం ఒక అదృష్టమైతే, కొన్ని పదులగంటలు టీనేజర్లైన పిల్లల సాంగత్యంలో గడుపుతూ వారి ఉత్సాహాన్ని ఆస్మాసిస్ ద్వారా వంటపట్టించుకోవడం కూడా చాలా సరదా అయిన అనుభవం. పిల్లలందరూ చాలా బాగా చేశారు .. ముఖ్యంగా సత్యభామగా చిరంజీవి అర్చిత అద్భుతంగా నటించింది. అన్నట్టు మన కాలాస్త్రి శ్రీ కూడా సూత్రధారునిగా తనవంతు పాత్ర సమర్ధవంతంగా పోషించారు.

ఇదయినాక, మరునాడు, ఆదివారంనాడు, మా వూరి నిలయవిద్వాంసులతో ఒక కర్నాటక సంగీత కచేరీ నిర్వహించాము కొందరు మిత్రులం కలిసి. కొంతకాలంగా మా వూళ్ళో అస్సలు కచేరీలనేవి జరక్కపోవడం ఒకటీ, అదికాక, వూళ్ళో ఎంతో ప్రతిభావంతులైన కళాకారులు ఉండి కూడా, వారి ప్రతిభకి సరైన వేదిక దొరక్కపోవడం ఒకటీ గమనించి, కొందరు మిత్రులం కలిసి ఈ కచేరీ ఏర్పాటు చేశాం. రెండు భాగాల కచేరీ. ముందుగా శశిధర్ గారి వీణావాదనం, మృదంగం మీద జయసింగం, ఒక గంటన్నరసేపు. భైరవి అటతాళ వర్ణంతో మొదలెట్టి , రాగాల ఎంపికలో చక్కటి వైవిధ్యం కనబరుస్తూ, పూర్వికళ్యాణిలో మీనాక్షిని సాక్షాత్కరించి, శంకరాభరణంలో ఎదుట నిలచితే నీ సొమ్మేమి పోవునని రాముణ్ణి నిలదీసి, ధనశ్రీ తిల్లానాతో ముగించారు. తదుపరి మల్లాజోస్యుల దంపతులు (శ్రీకాంత్, పావని) వయొలిన్ ద్వయం, రాజశేఖర్ ఆత్మకూరిగారి మృదంగవాద్య సహకారంతో. శ్రీరాగవర్ణంతో మొదలై లాల్గూడివారి కానడ తిల్లానాతో ముగిసిన వీరికచేరీలో శ్రీరంజని రాగం తానం పల్లవి తలమానికంగా నిలిచింది. వందమందికి పైగా శ్రోతలు హాజరవడం నాకు చాలా ఆనందం కలిగించింది.

వారాంతపు రెండ్రోజులూ ఇంత చక్కటి అనుభూతుల్ని మూటగట్టుకున్నాక, సోమవారంనాడు పనిలో తగిలిన ఎడాపెడా వాయింపులతో బుర్ర వాచిపోయి సాయంత్రానికల్లా ఒక విధమైన నిర్వేదం వచ్చేసింది .. ఆనందం కానీ తృప్తికానీ ఇంత క్షణికమా, ఇంత అశాశ్వతమా అని చాలా ఆశ్చర్యపోయాను. అఫ్కోర్సు, అది విధి నిర్వహణ కాబట్టి, ఎన్ని వాయింపులు తగిల్నా తట్టుకుని నిలబడ్డం, అదొక అనుభవంకింద జమ వేసుకుని ముందుకి సాగిపోవడం తప్ప వేరే గత్యంతరం లేదు కాబట్టి మళ్ళీ మర్నాటికల్లా నిలదొక్కుకున్నా ననుకోండి. అసలు, మాట వరసకి చెబుతున్నా, జీవితంలో ఈ వొడిదుడుకులు ఇలా ఎలా పక్కపక్కనే వస్తాయో అని.

ఆకులు రాలే పోయాయి వారాంతంలో వచ్చిన గాలివానకి. కానీ అక్టోబరు నెలంతా గొప్ప రంగుల్తో అలరించింది ప్రకృతి. ఎటుచూసినా రంగులు, రంగులు .. గుట్టలు గుట్టలుగా రాశులు రాశులుగా రంగులు. రెండేళ్ళ క్రితం ఈ ఆకురాలు కాలపు అనుభవాన్ని రాసుకున్న వైనం ఇక్కడ.

Comments

జయ said…
మీకేమండి. వారంతాలు బాగానే అనుభవిస్తున్నారు కాబాట్టి, సోమవారాల బాధ వొదిలేసి మళ్ళీ వారాంతాల కోసం ఎదురుచూడచ్చు. చక్కటి నాటిక, మీ నరకసురుని ఫొటో బాగుంది. కర్ణాటక సంగీత కచేరీ చదువుతుంటేనే వీనుల విందుగా ఉంది. విడియో పెడితే మీ వారంతపు ఆనందాన్ని మేము కూడా అనుభవించే వాళ్ళం కదా. "ఆకురాలు కాలం" కూడా చాలా బాగుంది.
Anonymous said…
Because of your interest in Namaka chamaka wanted to show this.
see this link...

http://www.koumudi.net/Monthly/2009/november/index.html

look in vyAsa koumudi. This guy wrote about namaka chamaka in that artcile.
"మొన్న కాల్చేసి చెప్పాడు" - ఇది చదివి ఒక్క క్షణం ఉలిక్కిపడ్డానండీ! :-)

నరకాసురుడుగా భలే ఉన్నారు! (బాగా సూటయ్యారు :-) చిన్నప్పుడు ఏకపాత్రాభినయాలు చెయ్యడమే కాని పెద్దయ్యాక ఎప్పుడూ వీలుపడలేదు :-( మళ్ళీ వెయ్యాలన్న ఉత్సాహం కలుగుతోంది.
మీరు వేసింది పద్యనాటకమా? వీడియో క్లిప్పింగులేమైనా ఉంటే వీలైతే పెట్టండి.
@జయ .. అంతేనంటారా? :)
@కామేశ్వర్రావు .. నాటికలో అన్ని రకాల ప్రక్రియలూ ఉపయోగించేశామండీ. భాగవతం పద్యాలూ (సమద పుష్పంధయ ..), అదేదో రిలీజవని సినిమాలోని పాటలూ, డయలాగులూ, స్పెషలెఫెక్ట్సూ .. విడియో సంగతి చూస్తాను.
cbrao said…
బాగున్నాయి మీ ఆటా పాట ఇంకా మాటలు. డిట్రాయిట్ లో మీ జీవితం ఇలాగే పాటలా సాగాలని కోరుకుంటా.
మళ్ళీ ఇంకో అరబస్తా ఉప్పు తెప్పించాలా!!

నరకాసురుడిగా మీ వేషధారణ చాలా చాలా బావుంది.. ఇంక ప్రదర్శన ఎంత బాగా జరిగి ఉంటుందో ఊహించుకుంటూనే మనసు నిండిపోతోంది..

వెంటనే ఫోటోని ఇంకాస్త పెద్దది చేసి, ఆ వీడియో ఏదో త్వరగా తయారయ్యేట్లు చూడండి :-)
మేధ said…
>>ఆనందం కానీ తృప్తికానీ ఇంత క్షణికమా, ఇంత అశాశ్వతమా అని చాలా ఆశ్చర్యపోయాను.
hmm.. True...
అబ్బ వారాంతాన్ని ఎంత చక్కగా ఎంజాయ్ చేసారండీ... ఒక వారం రుద్రాభిషేకాలు, ఒక వారం సంగీత కచేరీలు, ఇంకొక వారం కళా పోషణ. ఇంతకన్నా ఏమి కావాలండీ. మీకు సోమవరామొక్క రోజే తల వాచింది, మాకిక్కడ సోమవారం నుండి శుక్రవారం వరకూ ఒకరకం తోముడూ, శని ఆది వారాల్లో స్పెషల్ తోముడు. అన్నట్టు నరకాసురుడిగా భలేగుంది మీ గెటప్పు :)
రావుగారు .. ధన్యవాదాలు
నిషిగంధ .. మరే :)
మేధ .. నిజం
లక్ష్మి .. రెండు విషయాలు. తోముడూ వాయింపుడూ శుక్రవారం దాకా సాగింది కానీ, అంతకంటే దాన్ని పట్టించుకోవడం అనవసరమని అక్కడితో ఆపుచేశాను. మరీ అంత అసూయ పడిపోకండీ. ఇక్కడ మా జీవితాలూ అలాగే వుంటాయి చాలా మట్టుకి. ఏదో ఇలాంటి అనుభవాలు అలా అలా అరుదుగా ..
గెటప్ సూపర్, NTR/SVR లని మరిపిస్తున్నారు. మీ ప్రదర్శనతో తెలుగువాళ్ళంతా మరల ఇండియాలో వున్నట్లు ఫీలయి వుంటారు. అదృష్టవంతులు వారూ మీరూ...
మురళి said…
ఎప్పటిలాగే కబుర్లు చాలా బాగున్నాయండీ.. బాధ లేకపొతే సంతోషం విలువ తెలీదు కదా మనకి.. అందుకోసం అప్పుడప్పుడూ తల వాచిపోడాలు తప్పవేమో.. సత్యభామ ఎవరో తెలుసుకోవాలన్న కుతూహలం కలిగింది, నరకాసురిడిగా మీ గెటప్ చూడగానే :) :)
కుమార్ .. మరీ అంతొద్దు సార్ :)
మురళి .. సత్యభామగా చేసింది అర్చిత అనే 11వతరగతి విద్యార్ధి. తొలి రిహార్సలులో మా మధ్య వాగ్వాదం జరిగే సందర్భంలో, అటెటో చూస్తున్న నేను ఒక్కసారి ఆమె వేపుకి తిరిగి హుంకరించేసరికి ఉలిక్కిపడింది పాపం. నేనేదో గొప్ప నటుణ్ణని కాదు గాని, ఎంతైనా తను చిన్నపిల్లకదా, నా భీకరాకారానికి ముందు తేలిపోకూడదని సంధ్యగారు ఆమెకి ప్రత్యేకమైన శ్రద్ధతో తర్ఫీదిచ్చారు. చాలా బాగా చేసింది.
భావన said…
కొత్త పాళి గారు, బావున్నాయి అండి కబుర్లు.
బావున్నాయి నాటకం ఫొటో లు.. బొబ్బిలి పులి సినిమా షూటింగ్ అప్పుడూ లాస్ట్ కోర్ట్ సీన్ లో శ్రీదేవి కి జ్వరం అట. ఏదో ప్రశ్న అడిగితే ఎంటోడు ఒక సారి హూంకరించాడు అట.. శ్రీదేవి బేర్ మంది అట , అది గుర్తు వచ్చింది మీరు ఆ అమ్మాయి ని వులిక్కి పడేలా చేసేరు అంటే.
సంగీత కార్యక్రమం బాగుంది అండి ఏమిటో ఈ మధ్య న మా వూళ్ళో ఏమి సంగీత సభ లు జరగటం లేదు. ప్చ్..
కబుర్లు బాగున్నాయండీ.. అంతబిజీ లోనూ కళాపోషణ కి లోటు రానివ్వకపోవడం నిజంగా అభినందనీయం. నరకాసుర గెటప్ కి భలే సూట్ అయ్యారు. NTR/SVR కాదు గానీ నాకెందుకో మిమ్మల్ని చూస్తే నాజర్ గుర్తొస్తాడు :-)
నరకాసురవధ లో మీ ఆహార్యం బాగా నప్పింది. తీరు చూస్తే నటన కూడా బాగా చేసినట్టే అనిపిస్తోంది. ఏమైనా ఇన్ని వైరుధ్యాల మధ్య రోజులు గడపడం బలే బాగుంటుంది కదండీ....
వేణు .. అందుకు ఆశ్చర్యమెందుకు, నాజర్ మా అన్నయ్యే!

శ్రీలలిత .. నిజం
cartheek said…
కొత్తపాళీ గారు నమస్కారలండి
గెటప్ చాల బాగుందండి ... మీ బ్ల్లాగు కూడా చాల బాగుందండి .....

మీ టాలెంట్ చూస్తుంటే నేను మీ అంతటి వాణ్ణి ఎప్పుదుతనా అనిపిస్తుంది..
అన్నట్టు నాజర్ గారు మీ అన్నయా ?
sunita said…
ఓ---చాలా లేటుగా చూసినట్టున్నాను. కబుర్లు బాగున్నాయి. నరకాసురిడిగా మీ గెటప్ బాగుంది. వీడియో పెట్టండి చూస్తాము.
wow interesting !! ఆయన ఓ అద్భుతమైన నటుడిగా మాత్రమే తెలుసు కానీ వ్యక్తిగతమైన వివరాలు పెద్దగా తెలియవు. తను తమిళియన్ అనుకుంటున్నాను. ఇంతకీ "నడ్డిమీఛ్చంపేస్తాను" అనే అన్నయ్య వీరేనా :-)
వేణూ .. అమ్మో మీకన్నీ భలే గుర్తుంటయ్యే. ఇలాంటి పాఠకులుంటే, చిన్న చిన్న అబద్ధాలు కూడా తప్పించుకోలేవు! అవునూ, మా అన్నయ్య నడ్డిమీఛ్ఛంపేస్తాను అన్నాడని మీకు గుర్తుంది గదా, మరి నా తమిళ మూలాలు గుర్తులేవా? :)
నాజర్ నిజంగా మా అన్నయ్యో కాదో మీ ఊహకే వొదిలేస్తున్నా!
హ హ అదేంలేదు గురువుగారు బుడుగు అభిమానిగా ఇదొక్కటి అలా గుర్తుండిపోయింది అంతే.. మీ బ్లాగ్ ఒక సంవత్సరకాలంగా మాత్రమే ఫాలో అవుతున్నాను తమిళ మూలాల గురించి చదివినట్లు గుర్తులేదు. సరేసరే నేను అన్నీ మర్చిపోతున్నాను మీరిక ఆలోచించకుండా స్వేచ్చగా రాసేసుకోండి మరి ;-)